Friday 24 August 2012

ఆధిపత్య సంస్కృతిపై ‘దిమ్మిస’


    తెలుగు నిఘంటువుల్లో అర్థాలు మారుతున్నాయి. ధ్వంసం, విధ్వంసం అనేవి సీమాంధ్రుల పదాలుగా, కూల్చివేత, తొలగింపు పదాలు తెలంగాణవిగా స్థిరపడ్డాయి. కూల్చివేత అనేది పోరాట రూపంగా మారింది. తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవం, అస్తిత్వానికి, చరిత్ర వినిర్మాణానికి పునాదిగా మారింది. మార్చి పది నాటి మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై చోటు చేసుకున్న సంఘటనల్ని చూసే ధృక్కోణమూ మారింది. సీమాంధ్ర ‘మేధావులు’ విగ్రహాలను తొలగించిన వారిని ‘తాలిబన్లు’, ‘మర్కటాలు’, ‘కోదండలు’, ‘బాల్‌ ఠాక్రేలు’, ‘కర సేవకులు’ అని సంబోధించారు. అదే సమయంలో తెలంగాణ డిక్షనరీల్లో ‘విద్రోహ ఫలితం’, ‘విముక్తి పోరు’, ‘ధర్మాగ్రహం’, ‘కల నెరవేరింది’, ‘బద్లా’ ‘సాంస్కృతిక ఆధిపత్యంపై దాడి’ అనే పదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రజల ధర్మాగ్రహాన్ని, భాషను, భావాన్ని తెలుగు సాహిత్యంలో నిలిచి పోయే విధంగా ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఒక ప్రయత్నం చేసిది.  సీమాంధ్రుల సాంస్కృతిక ఆధిపత్యంపై తిరుగుబాటు బావుటాను ఎగరవేస్తూ ‘దిమ్మిస’ పేరిట 50 మంది కవుల సంకలనాన్ని తీసుకొచ్చింది. అలాగే అంతకు ముందు తెలంగాణ రచయితల వేదిక కలగాపులగమైన అభిప్రాయాలతో ‘విరుగుడు’ వ్యాస సంకలనాన్ని తీసుకొచ్చింది. మరోవైపు నెట్‌లో ‘మిషన్‌ తెలంగాణ’ వారు విగ్రహాల్లో ఎన్టీఆర్‌ పోలిక, స్థానం గురించి విరివిగా చర్చలోకి తీసుకొచ్చారు. ‘తెలుగు వారి ఆత్మగౌరవం’ పేరిట ‘తెలంగాణ అస్తిత్వానికి గోరీ’ కట్టిన ఎన్టీఆర్‌ని, తెలంగాణ తల్లి గుండెకాయ ‘హైదరాబాద్‌ నగరం’ నడిబొడ్లో గడ్డపారల్లాగా నిలబడ్డ ‘తెలుగు వెలుగు’లపై తెలంగాణ ప్రజల పక్షాన కవులు స్పందించారు. ఈ స్పందన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లోంచి వచ్చిందే. అస్తిత్వవాద వేదనలోంచి వచ్చిందే.
    ‘‘చారిత్రక సంఘటనకు కారణమైన చరిత్ర గురించి కాకుండా పైపైనే నిందలు వేసే వారికి ‘దిమ్మిస’ కవితా సంకలనం ఒక చెంపపెట్టు’’ అని మే పదిన ట్యాంక్‌బండ్‌పై మగ్దూం మొహియుద్దీన్‌ విగ్రహం ముందు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ప్రముఖ సినీ దర్శకుడు, కవి బి.నర్సింగరావు ఒక చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించిండు.  ‘భాష పేరుతో ఇంకా మోసం చేయాలని చూసే వారికి ఇదొక గుణపాఠం’ అని కూడా ఆయన అన్నారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని చెక్కిన ఎక్కా యాదగిరి రావు, కవులు అమ్మంగి వేణుగోపాల్‌, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, జిలుకర శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌, స్కైబాబ, శ్రీధర్‌ దేశ్‌పాండేలతో పాటు నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను. మొత్తం రెండు గంటలపాటు 70 మందికి పైగా సాహిత్యకారులు నల్లగొండ, మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి ఇందులో పాల్గొన్నారు. ఈ సంకలనం ఒక చారిత్రక సందర్బంలో వచ్చింది. సీమాంధ్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న కసికి అక్షర రూపమిచ్చారు. బలమైన కవిత్వాన్ని బరిసెలుగా విసిరారు. సీమాంధ్రుల విగ్రహాలతో, వగల ఏడుపుల ర్యాలీలతో పొక్కిలైన టాంక్‌బండ్‌ని ‘దిమ్మిస’తో చదును చేసిండ్రు.
    దళిత, బహుజన కవులు, కళాకారులు ముక్తకంఠంతో విగ్రహాల తొలగింపును స్వాగతించారు. కీర్తించారు. అయితే కూలిన విగ్రహాల్లో తమ కులం వారిని చూసుకున్న ఒకరిద్దరు తెలంగాణ వాళ్లు కూడా అయ్యో అని అంగలార్చిండ్రు. వీర తెలంగాణ వాదులుగా ముద్రపడ్డ కొందరు ముసుగులో గుద్దులాట లాగా విగ్రహాల కూల్చివేతకు మద్ధతుగా బహిరంగంగా ఎక్కడ రాయకుండా జాగ్రత్త పడ్డారు. మరి కొందరు తెలంగాణ ‘మర్యాదస్తులు’ నర్మగర్భంగా విగ్రహాల ‘విధ్వంసాన్ని’ తప్పుపట్టారు. కాని దళిత, బహుజనులు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా విగ్రహాల కూల్చివేతను ‘తెలంగాణ ప్రజా విజయం’గా ప్రకటించారు. ‘దిమ్మిస’ సంకలనంతో ఈ విషయం ప్రస్ఫుటం చేసిండ్రు. ‘‘ధ్వంసం నిర్మూలనకు సంకేతం. విధ్వంసం వినిర్మాణానికి సంకేతం. సకల విలువలను ధ్వసం చేస్తేనే కొత్త విలువల స్థాపన సాధ్యం. కాంక్రీట్‌ స్తంభాల్లా పాతుకుపోయిన విలువల మీద ఉలులెత్తిన కోస్తాంధ్ర విప్లవవాదులు, స్త్రీవాదులు, ముస్లిం వాదులూ` విలపించడం విచిత్రం’’ అని ‘సింగిడి’ అస్తిత్వ సోయితోటి నిగ్గదీసింది. అంతేగాదు ట్యాంక్‌బండ్‌పై ఉండాల్సిన వీరులు, వీర వనితలెవ్వరో లెక్కగట్టి మరీ చెప్పింది. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణానికి, వినిర్మాణ మార్గాన్ని ఎంచుకున్న కవులు తమ కలాల్ని, గడ్డపారలు జేసిండ్రు. ఆధిపత్య సంస్కృతిపై తిరుగుబాటు ప్రకటించిండ్రు. ‘దిమ్మిస’ దెబ్బేసిండ్రు.
    ‘‘నెత్తురు కనిపించని హత్యలు చేసిన జంధ్యాలు
    చుండూరు సమాధుల సృష్టికర్తలు
    కారంచేడు కడుపుకోతలు మిగిల్చిన లబ్ధప్రతిష్టులు
    చరిత్రను మాయం చేసిన వెలుగులు
    మా గుండెల మీదెందుకు మీ బండలు??? అని పసునూరి రవీందర్‌ నిలదీసిండు.
   
    ‘‘చరిత్ర పునర్‌ నిర్మాణంలో
    పూడిక తీతలు తప్పవు
    మన చరిత్ర రాసుకొనేందుకు
    చెత్త నిర్మూలన తప్పదు’’  అంటూ సింగిడి కన్వీనర్‌ జిలుకర శ్రీనివాస్‌ టాంక్‌బండ్‌పై తొలగించిన విగ్రహాల గురించి చెప్పిండు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన కవిత్వంలో ‘‘ మేం గర్విస్తున్నదీ, మీరు దు:ఖిస్తున్నదీ, ఆధిపత్యం కూలుతున్నందుకే’’ అని తేల్చి చెప్పిండు. మరో కవితలో ‘యూసుఫ్‌’ ఇలా చెప్పిండు.
    ‘‘వినిర్మాణానికి
    ఏదో ఒక మూల నుంచి కూల్చడం మొదలవ్వాల్సిందే
    గడ్డపార వెయ్యకుండా
    మొక్కెలా నాటగలం?
    పునాది తియ్యకుండా దేన్నైనా ఎలా కడతాం?
    ఎవరినీ నొప్పించకుండా
    సత్యమెలా చెబుతాం?
    అవును
    ఇవాళ కూల్చింది
    రేపటి రూపును ఆవిష్కరించడానికే
    జీవాలు కూలుతున్న ఆక్రందనే
    విగ్రహాలు కూల్చింది
    ఇంకొకటి చెప్పనా!
    మా మధ్య
    కొన్ని దుష్ట విగ్రహాలు తిరుగుతున్నాయ్‌
    వాటిని కూడా కూల్చేదాకా చూడొద్దు!’’
    ‘‘విగ్రహాల తొలగింపు అనేది ఒక చారిత్రక సంఘటన. అవసరమైన ఘటన. దీనిపై స్పందించేందుకు చాలామందికి మొహమాటం అడ్డొచ్చింది. మౌనం వహించారు. డిఫెన్స్‌ ద్వారా కాదు ఆఫెన్స్‌కు దిగాలని భావించి ‘సింగిడి’ తరపున కవితా సంకలనం తీసుకొచ్చాము. దీనికి కవుల స్పందన చాలా బాగుంది. కవిత్వం కూడా చిక్కగా, బలంగా ఉంది’’ అని సంకలనం తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన స్కైబాబ అభిప్రాయ పడ్డాడు.
    మార్చి పది, 2011 నాడు టాంక్‌బండ్‌ మీదుండడం జీవితకాలానికి సరిపడే ఒక మధురానుభూతి. అదే టాంక్‌బండ్‌పై 60 రోజులు తిరక్కుండానే విగ్రహాల కూల్చివేతకు మద్ధతుగా కవితా సంకలన ఆవిష్కరణ సభలో కూడా పాల్గొనడం ఇంకో సంతోషకరమైన విషయం. ఎంతో శ్రమ కోర్చి, ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి, విలువైన సమయాన్ని వెచ్చించి ఈ సంకలనాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన వారికి అభినందనలు. ఇదే సమయంలో ఒక విషయం చెప్పుకోవాలి. గత నెలలో మిత్రులు జూలూరి గౌరీశంకర్‌, తెలంగాణ రచయితల వేదిక తరపున ‘విగ్రహాల విధ్వంసం’పై వ్యాస సంకలనాన్ని తీసుకొచ్చాడు. అందుకు ‘థింక్‌బండ్‌’ పేరిట మంచి ముందుమాట రాసిండు. అందుకు ఆయన్ని అభినందించాల్సిందే!. అయితే ఈ వ్యాస సంకలనంలో ‘తెలుగు తాలిబన్లు’ అని తెలంగాణ ఉద్యమకారుల్ని హేళన చేసే వ్యాసాలు కూడా చోటు చేసుకోవడం విషాదం. ఇలాంటి వ్యాసాలు ఇంకా చాలా ఉన్నాయి. ‘తెలంగాణ రచయితల వేదిక’ తరపున సీమాంధ్రుల ఆధిపత్య వాయిస్‌ని ఈ పుస్తకం వినిపించింది. పెండా, బెల్లం ఒక్క దగ్గర కలిపినట్టు విగ్రహాల కూల్చివేతను సమర్ధించే, వ్యతిరేకించే వ్యాసాలన్నింటిని ఒక్కదగ్గర వేయలనుకోవడమే మూర్ఖత్వం. అదీ తెలంగాణ కోసం పనిచేస్తున్న ఒక సాహితీ సంస్థ తరపున వేయడం కచ్చితంగా తప్పే. ఈ సంస్థ ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తుందనే అనుమానమూ కలుగుతోంది.
    ఇక పోతే విగ్రహాలపై కొణతం దిలీప్‌ లాంటి మిత్రులు నడుపుతున్న ‘మిషన్‌ తెలంగాణ’ వెబ్‌ సైట్‌లో అసలు శ్రీకృష్ణదేవరాయలకు, సినిమా ఎన్టీఆర్‌ ప్రతిరూపమైన శ్రీకృష్ణదేవరాయలకు గల తేడాని ఎత్తి చూపించారు. తిమ్మిని బమ్మి చేస్తూ ఆగమేఘాల మీద ప్రతిష్టించిన విగ్రహాలు వ్యక్తిగత ఇష్టాఇష్టాలను మాత్రమే ప్రతిబింబించాయి. అంతేగానీ తెలుగు జాతి కోరికను కాదు. ఇప్పుడు ప్రభుత్వం పంతానికి పోయి మళ్లీ కూలిన విగ్రహాల స్థానంలో కొత్తవి పెట్టాలని బడ్జెట్‌ రిలీజ్‌ చేసింది. పని ప్రారంభించింది. ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించడమే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కావాలని రెచ్చగొడుతోంది. విద్యార్థి సంఘాలు ‘విగ్రహాల్ని మళ్లీ కూలగొడతాం’ అని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పంతానికి పోతోంది. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిందే!

-సంగిశెట్టి శ్రీనివాస్‌

No comments: