Friday 24 August 2012

JYOTHIBA PHULE AND TELANGANA

ఫూలేతో కలిసి నడిసిన తెలంగాణ


    నేటి భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సామాజిక విప్లవకారుడు జ్యోతిరావ్‌ ఫూలె. స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం నిత్యం నినదిస్తున్న తెలంగాణ బిడ్డలు ఇయ్యాళ ఆయన్ని అడుగడుగున యాద్జేసుకుంటున్నరు. ఆయన వర్ధంతిని (నవంబర్‌, 28) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘ఆత్మగౌరవ సభ’ నిర్వహించి బహుజనులు జరుపుకుంటున్నారు. అణచబడ్డ వారి హక్కుల కోసం, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బ్రాహ్మణ, అగ్రకుల దాష్టీకానికి వ్యతిరేకంగా ఫూలె చేసిన పోరాటంలో అందరికన్నా ఎక్కువగా ఆయన వెన్నంటి నిలిచింది తెలంగాణ బిడ్డలంటే ఆశ్చర్యం కలుగక మానదు. కాని ఇది నిఖార్సయిన నిజం. ఫూలె ఉద్యమాలకు అండగా నిలిచి, వాటికి జీవం పోసింది తెలంగాణ నుంచి వలసబోయిన తెలుగువారు, బహుజనులు. ఫూలె స్థాపించిన సంస్థలన్నింటిలోకి తలమానికమైనది ‘సత్యశోధక సమాజ్‌’. ఈ సమాజ్‌ స్థాపన నాటి నుండి, ఫూలె మరణానంతరం కూడా దాని కార్యకలాపాల్లో పాల్గొన్నది, ఉద్యమాన్ని నడిపింది తెలంగాణ బహుజనులు. పద్మశాలి, మున్నూరుకాపు, వంజరి తదితర కులాలకు చెందిన నాయకులు ఈ సమాజాన్ని బొంబాయిలో అనేక అడ్డంకుల్ని అధిగమించి నడిపించారు. ముంబయిలో ఫూలే కార్యకలాపాలకు ప్రాణం పోసిందీ, ప్రచారం చేసిందీ ‘మనోళ్లే’.
    భారతదేశంలో బ్రిటీష్‌ వారిపట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో లార్డ్‌ డల్‌హౌసీ తమ పాలనలో కొన్ని మార్పులు తీసుకువచ్చాడు. దీని వల్ల వ్యాపార, వాణిజ్య, రవాణ, ప్రసార వ్యవస్థల్లో మౌళికమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబయి నుంచి థానే వరకు రైలుమార్గ నిర్మాణం ప్రారంభమైంది. అలాగే బట్టల మిల్లుల స్థాపన కూడా ఈ కాలంలోనే జరిగింది. మొదట 1853లో ముంబయి`థానేల మధ్యన రైలు ప్రారంభం అయింది. ఆ మరుసటి సంవత్సరం మొట్టమొదటి బట్టల మిల్లు కూడా ముంబయిలోనే స్థాపితమయింది.  1865 నాటికి ఈ మిల్లుల సంఖ్య 10కి పెరిగింది. ఇందులో పనిచేసే వారి సంఖ్య 6600లకు పెరిగింది. వీరిలో అధిక భాగం తెలంగాణ నుంచి వలసబోయిన పద్మశాలీలే! వీరి కన్నా ముందు ముంబాయికి భవన నిర్మాణ కార్మికులుగా వలస వచ్చిన వంజరి, మున్నూరు కాపు కులస్థులు మొదట కామాఠిపురాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కాంట్రాక్టర్లుగా ఎదిగారు. ఇప్పుడు ముంబయిలో వందేళ్ళ పైబడిన దాదాపు ప్రతి కట్టడాన్ని తెలంగాణ బిడ్డలే కట్టారంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎదిగి వచ్చిన వారే జ్యోతిరావ్‌ ఫూలెతో కలిసి నడిచారు. సమాజంలో అణచివేతకు గురైన అట్టడుగు వర్గాలకు అండగా నిలిచారు.
    బ్రాహ్మణ వర్గాల ఆధిపత్య ధోరణి వల్ల సమాజంలోని శూద్రులు, అతిశూద్రులకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించడానికి, వారిని సంఘటితం చేసి, చైతన్య పరిచే ఉద్దేశ్యంతో ‘సత్యశోధక్‌ సమాజ్‌’ని పూణెలో సెప్టెంబర్‌, 24, 1873నాడు స్థాపించారు. ఈ ప్రారంభ సమావేశానికి పూణె, ముంబయిల నుంచి దాదాపు యాభైమంది హాజరయ్యారు. ఈ సమావేశంలోనే ఫూలే ‘సత్య శోధక్‌ సమాజ్‌’ అధ్యక్షుడిగా, కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఫూలే కోశాధికారిగా ఎన్నికయినప్పటికీ దానికి ఆర్థికంగా ఆదుకున్నది, అండగా నిలిచింది మాత్రమే తెలుగువారే. ఈ ప్రారంభ సమావేశానికి ముంబయిలో భవన నిర్మాణ కాంట్రాక్టర్లుగా ప్రసిద్ధులయిన రామయ్య వెంకయ్య అయ్యవారూ, నర్సింగరావు సాహెబ్‌ వడ్నాల, జాయా ఎల్లప్పా లింగూ, వెంకూ బాలాజీ కాలేవార్‌లు తదితర తెలుగువారు హాజరయ్యారు. వీరందరూ తమ లేదా, తాత ముత్తాతల మూలాలు తెలంగాణలోనే ఉన్నాయని గర్వంగా చెప్పుకున్నారు.
    సమాజ స్థాపనకు పూర్వం నుంచే ఫూలేకు ముంబయి తెలుగువారితో మధ్య సంబంధాలున్నాయి. ఫూలే ఎప్పుడు ముంబయి వచ్చినా తాడ్‌దేవ్‌లోని తెలుగువాడు ‘నాగూ సయాజీ’ భవనంలోనే మకాం చేసేవాడు. ఇక్కడే రామయ్య అయ్యవారు, ఇతర సభ్యులు తరచూ కలుసుకునేవారు. నిజానికి ముంబయిలో ఫూలే తరపున ఉద్యమాన్ని నిర్వహించింది వలసబోయిన తెలంగాణ బహుజనులు. ‘కన్నీరు’ (రైతుల కన్నీరు) పేరుతో ఒక కరపత్రాన్ని తయారుచేసిన ఫూలే 1873లో ముంబయి వచ్చినప్పుడు సభ్యులకు వినిపించాడు. ఇందులో గ్రామాల్లోని కులకర్ణిలు, వకీళ్లు, ఉపాధ్యాయ జోషీలు రైతులను ఎన్ని రకాలుగా పీడిస్తున్నారో రుద్ధమైన కంఠంతో వినిపించారు. దీనికి  వెంటనే స్పందించిన నాగూరావ్‌ సయాజీ దాని ముద్రణకోసం డబ్బిచ్చారు. ఈ కరపత్రం ఆనాటి రైతుల దీనావస్థని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకి కట్టింది.
    తెలుగు వారు సత్యశోధక్‌ సమాజ్‌లో నిర్వహించిన కీలక భూమికను దాని కార్యదర్శి నారాయణ్‌ తుకారాం నగర్‌కర్‌ తన ద్వైవార్షిక రిపోర్టులో క్షుణ్ణంగా వివరించాడు. నిజానికి ముంబయిలో సమాజ్‌ శాఖను స్థాపించి, నడిపించాల్సిందిగా ఫూలే స్వయంగా రామయ్య అయ్యవారుకు లేఖ రాసిండు. ఆ పిలుపు మేరకు కామాటిపుర (కామ్‌Gమట్టిR మట్టి పనివారల పురం)లోని 18మంది తెలుగువారు సమాజ్‌ సభ్యత్వాన్ని స్వీకరించారు. అంతేగాకుండా సమాజ్‌ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ మరింతమందిని సభ్యులుగా చేర్పించారు. ఈ సమాజ్‌లో మొదట రామయ్య అయ్యవారూ, జాయా కారడిలింగూ, వెంకూ బాలాజీ కాలేవార్‌, జాయా నాగూ పర్‌బాజీ, నర్సింగరావు సాహెబ్‌ వడ్నాల, బాపూజీ ఈరప్ప కోర్బా, రాజూ బాబాజీ వంజరి, పోచెట్టి పోచయ్య నింగాల, ఈరప్ప మస్తాజీ పత్తీ, నరసూ నర్సప్ప నెల్ల, నాగూ సాయాజీ కాంట్రాక్టార్‌, ధర్మాజీ సరసూ, రాజన్నా సులూ, రాజన్నా సాయబు, డాక్టర్‌ గంగాజీ నర్సూ, మెనాజీ నర్సూ, వెంకూ నర్సూ, నాగూ నర్సూ, జిల్‌కర్‌ రాజన్నా మొదలైన వారు సత్యశోధక్‌ సమాజ్‌ ఉద్దేశ్యాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చిన తీరుని 1877 మార్చి 20 నాటి సమాజ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే బాలాజీ కాలేవార్‌, రామయ్య అయ్యవారు తదితరులు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం భట్‌ భిక్షుక్‌, సర్కారీ బ్రాహ్మణ ఉద్యోగస్థుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వానికి షికాయతులు, అర్జీలు చేస్తూ వచ్చిన తెలుగువారి పేర్లు మహారాష్ట్రలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నందున అక్కడి వారి ఉచ్ఛారణకు అనుగుణంగా అనేక మార్పులకు గురయ్యాయి. అందుకే తెలుగువారయినప్పటికీ వారి పేర్లలో భిన్నత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ఒకరు వెంకూ బాలాజీ. 
    వెంకూ బాలాజీ సమాజ్‌ సభ్యుడిగా చేరక పూర్వం గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా వేలాది బ్రాహ్మణులకు పక్వాన్న భోజనాలు పెట్టించి భారీగా దక్షిణాలు సమర్పించుకునేవారు. అయన సత్యశోధక సమాజ్‌ సభ్యుడిగా చేరిన తర్వాత వాటన్నింటిని రద్దు చేసి వాటి స్థానంలో సమస్త కులాల వికలాంగులకి, అంధులు, చెవిటి వారిని ఆర్థికంగా ఆదుకునేవాడు. స్త్రీల కోసం ప్రత్యేకంగా చీరెలు, దుస్తులు, పురుషులకు ధోవతులు కొత్తగా పెళ్ళయిన జంటలకు వంటసామాగ్రి, వృత్తి పనివస్తువులను ఉదారంగా దానం చేసేవాడు. కాలేవార్‌ (1820`1898) పేద వంజరి కుటుంబంలో జన్మించాడు. స్వయం కృషితో తట్టలు మోసే వాడి నుంచి కాంట్రాక్టర్‌గా ఎదిగి ముంబయిలోని అనేక చారిత్రక కట్టడాలను నిర్మించిన కాంట్రాక్టర్‌గా ప్రసిద్ధి చెందాడు. ముంబాయి నగరపాలిక భవనం, బరోడా మహారాజు ‘లక్ష్మీవిలాస్‌’ భవనం మొదలు అనేక బట్టల మిల్లులను ఈయనే నిర్మించాడు. 1880లోనే 60 లక్షల రూపాయల వ్యయంతో లక్ష్మీవిలాస్‌ భవనం నిర్మితమయింది. అంటే ఆయన ఎంత పెద్ద కాంట్రాక్టరో అర్థమవుతుంది.
    అలాగే ప్రతి దీపావళికి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి దక్షిణ చెల్లించుకునే మరో వ్యక్తి జాయ ఎల్లప్ప లింగూ. ఈయన సమాజ్‌ సభ్యత్వం తీసుకున్న తర్వాత ‘సమాజ మండలి’లోని ఎ అబ్బాయి/అమ్మాయి మెట్రిక్యులేషన్‌ పాసవుతారో వారికి బంగారు పతకంతో పాటుగా 25 రూపాయల నగదు బహుమతి ఇచ్చే ఏర్పాటు కూడా చేసిండు. ఈయన తండ్రి హైదరాబాద్‌ సంస్థానం నుంచి ముంబయికి వలస వచ్చాడు. లింగూ ముంబయిలోని పుట్టి అక్కడే ఉన్నత విద్యనభ్యసించాడు. హైదరాబాద్‌ సంస్థానంలో మెజిస్ట్రేట్‌ ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. కాని రెండేండ్ల కన్నా ఎక్కువగా అక్కడ పనిచేయలేదు. తన కిష్టమైన భవన నిర్మాణ రంగాన్ని ఏరి కోరి ఎన్నుకొని గొప్ప కాంట్రాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబాయిలోని ‘రాయల్‌ యాట్‌ బాంబే క్లబ్‌’, పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా నివసించే ‘టాటా మిషన్‌’ భవనం, ‘హోటెల్‌ వాట్సన్‌ అనెక్స్‌’ భవనాన్ని కూడా ఈయనే నిర్మించాడు. ఇప్పటికీ ఈ భవనాలు చెక్కు చెదరక డిజైన్‌కు, నిర్మాణ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.
    1874లో ‘ముంబయి నివాస మండలి’ ఆహ్వానం మేరకు ఫూలే ముంబయిలో పర్యటించారు. ఈ పర్యటనలో ఫూలే ‘సత్యశోధక సమాజ్‌’ కార్యక్రమాల్ని మరింత బలంగా ముందుకు తీసుకు పోవాల్సిన బాధ్యతను బాలూజీ కాలేవార్‌, కారాడీ లింగూలపై పెట్టారు. దాదాపు ఇదే సమయంలో వెంకయ్య అయ్యవారు కొద్ది కాలం సమాజ్‌ అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఈయన హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ముంబయికి చేరుకొని మొదట వెంకూజీ దగ్గర పనిచేసిండు. ఆ తర్వాత అన్నీ తానే అయి ముంబయిలో ప్రసిద్ధిగాంచిన గార్డెన్‌ మిల్స్‌, జనరల్‌ పోస్టాఫీసుల్ని కట్టించిండు. ఈయన సత్యశోధక్‌ సమాజ్‌ అభివృద్ధిలోనూ, ముంబయిలోని తెలుగువారి అభ్యున్నతికీ చేసిన కృషి చిరస్మరణీయమైంది.
    సత్యశోధక సమాజ్‌ స్థాపన సమయంలో పత్రికలన్నీ బ్రాహ్మణులే నడిపేవారు. శూద్రులకు, అతి శూద్రులకు తమ భావ వ్యాప్తికోసం పత్రిక అవసరమని వెంకయ్య అయ్యవారూ, కాలేవార్‌ తదితరులు కలిసి 1200 రూపాయలు వెచ్చించి ఒక ముద్రణా యంత్రాన్ని కొని ‘సత్యశోధక సమాజ్‌’ కోసం బహూకరించారు. 1874 నవంబర్‌లో ఇది జరిగింది. ‘సర్కారు శాఖలోని వ్రాహ్మణుల నుంచి శుద్రాతిశూద్రులకు ఎన్ని కష్టాలు ఎదురవుచున్నావో బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియజేయాలి’ అన్న ఆలోచనతో పత్రిక నడపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ పత్రిక నడిపే శక్తి, ఆర్థిక వనరులు సరిపోవని భావించి పత్రిక స్థాపనను ఫూలే వ్యతిరేకించాడు. అయితే కృష్ణారావు బాలేకర్‌ పట్టుదలతో పత్రికను ‘దీనబంధు’ పేరిట నడిపించారు. అయితే చివరికి ఫూలే ఊహించినట్లుగానే అది ఎక్కువకాలం మనగలగ లేదు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే పత్రికకోసం ముద్రణాయంత్రాన్ని విరాళంగా ఇవ్వగలిగారంటే వారి ఆలోచన సరళి, సత్యశోధక సమాజ్‌ ఉద్యమం పట్ల వారి అనురక్తి అర్థమవుతుంది.
    సత్యశోధక సమాజ్‌ కార్యకలాపాలతో  పాటుగా ఫూలే నడిపిన ‘పూణె సుశిక్షణ గృహం’పేరిట ఒక విద్యార్థి హాస్టల్‌ని కూడా నిర్వహించారు. దీని నిర్వహణలో కీలక భూమిక పోషించింది ఫూలే సహచరుడు కృష్ణారావు బాలేకర్‌. విద్యార్థులను కేవలం చదువులో మేటిగా తీర్చిదిద్దడమే గాకుండా సమాజం పట్ల నైతికతతో, బాధ్యతతో మెదిలే వారిగా మలచడమనేది ఈ హాస్టల్‌లో జరిగేది. హాస్టల్‌కుండే ఆర్థిక ఇబ్బందుల మూలంగా విద్యార్థుల సంఖ్య తరచూ మారుతూ ఉండేది. పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపడానికి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే ఇందుకు భిన్నంగా ముంబయిలోని కామాటిపురాలోని సంపన్న కుటుంబాల వారు తమ పిల్లల్ని పూణెలో బాలేకర్‌ హాస్టల్‌కు పంపించి విద్యాబుద్ధులు చెప్పించారు. ఇలా తెలుగువారు హాస్టల్‌ని ఆదుకున్నారు. ఆర్థికంగా కూడా అండగా నిలిచారు. అండగా నిలిచిన వారిలో కారాడి లింగూ జాయా, సేఠ్‌ రాజూ బాబాజీ తదితరులు ముఖ్యులు. ఫూలే చొరవతో ఆయన ఇంట్లోనే ఏర్పాటయిన ఈ పాఠశాలను తర్వాతి కాలంలో సావిత్రిబాయి ఫూలే నిర్వహించారు.దీని చొరవతో కామాటిపురాలో వసతిగృహం, స్కూల్‌ ప్రారంభించారు.
    కారాడి లింగూ జాయా కొడుకు ఎల్లప్ప లింగూ జాయ 1864లో మొట్టమొదటి సారిగా ‘సెకండ్‌ గ్రేడ్‌ ఆంగ్లో వర్నాక్యులర్‌ పాఠశాల’ పేరిట ఒక స్కూల్‌ని ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత విద్యాశాఖతో మాట్లాడి తెలుగు`మరాఠీ బోధనకు అవకాశం కల్పించాడు. ‘తెలుగు జ్ఞానోత్తేజక పుస్తకాలయము’, తెలుగు మహిళా మండలి అనే సంస్థల్ని కూడా స్థాపించి తెలుగువారు సమాజాభివృద్ధికి కృషి చేసిండ్రు. కేవలం తాము నివసిస్తున్న మహారాష్ట్రలోనే గాకుండా హైదరాబాద్‌లో ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు ముందున్నది తెలుగువారు.
    1908లో మూసీనదికి వరదలు వచ్చి హైదరాబాద్‌ నగరం సగం వరకూ కొట్టుకుపోయింది. ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డుమీదికి రావడంతో వారికి అండగా నిలిచింది మహారాష్ట్ర తెలుగువారు. రావుబహద్దూర్‌ ఎల్లప్ప బలరాం అధ్యక్షతన ఒక బహిరంగ సభ జరిపి అందులో వరద పీడితుల సహాయార్థం విరాళాల్ని సేకరించారు. వీటితో వంటపాత్రలు, బట్టలు, ధాన్యాన్ని సంభాజీ, డాక్టర్‌ నర్లు అనే నాయకులు ఖరీదు చేసి స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి అందజేసిండ్రు.
    ఇలా ఒక వైపు జ్యోతిరావ్‌ ఫూలేతో కలిసి పనిచేస్తూనే తమ తోటి తెలుగువారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన తెలుగువారు స్మరణకు నోచుకోలేదు. పరాయి రాష్ట్రంలో ఉన్నందున వారి సేవలకు సంబంధించిన వివరాలు అందరికీ అందుబాటులోకి రాలేదు. ఈ విషయాలపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరముంది. కానరాకుండా పోయిన మన కండ్లముందరి చరిత్రను రికార్డు చేసుకోవాల్సిన అవసరముంది. తెలుగు మహారాష్ట్రీయన్లు చేసిన ఉద్యమాలు, పోరాటాల తీరు తెన్నులు చరిత్రకెక్కాల్సిన సమయమిది.
    వీరు నిర్వహించిన ఉద్యమాల ప్రభావం తెలంగాణపై కూడా ఉండిరది. సికింద్రాబాద్‌నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన దళిత నాయకులు రాజారామ్‌భోలే, బి.ఎస్‌. వెంకట్రావులపై ఫూలే, అంబేద్కర్‌ ఉద్యమాల ప్రభావం ఉంది. అలాగే 1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి ఆ కూటమి తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలువడానికి కూడా స్ఫూర్తి ఫూలే`అంబేద్కర్‌ భావజాలం నుంచే వచ్చింది.  ఇదే స్ఫూర్తిని స్వీకరిస్తూ నేడు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతుండ్రు. దీనికి మహారాష్ట్రలో కూడా అక్కడి తెలుగువారు ధూమ్‌`ధామ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మమేకమయిండ్రు. 
                                                                                                                                        -సంగిశెట్టి శ్రీనివాస్‌
                                                                                                                        (ఫోరమ్‌ ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌)

No comments: