Monday 27 August 2012

SURAVARAM PRATHAPA REDDY THE BEACON OF TELANGANA


సురవరాన్ని ఆవాహన చేసుకుందాం!!

    వాస్తవాల్ని వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా, ఆబ్జెక్టివ్‌గా, పాజిటివ్‌గా దర్శించి, స్వీకరించే వారిని అటు వామపక్ష భావజాలం వాళ్ళుగానీ, ఇటు రైటిస్టులు గానీ తమదైన రీతిలో ముద్రలు వేసి వారి కృషికి గుర్తింపు రాకుండా చేస్తారు. అమెరికా వాడి మాదిరిగా తమతో కలిసి రాకుంటే శత్రువుతో కలిసి ఉన్నట్టే అని కూడా ప్రచారం చేస్తారు. వారి మీద బట్టకాల్చి మీదెయ్యడానికి ఏమాత్రం వెనకాడరు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల్ని గానీ, ఆ సంస్థలతో కలిసి పనిచేస్తున్న వ్యక్తులను గానీ హేతుబద్ధంగా, విచక్షణతో, విషయ పరిజ్ఞానంతో ఎవరైనా విమర్శిస్తే, అది ఎంతటి సద్విమర్శ అయినప్పటికీ అట్లా చేసిన వారి స్థాయిని దిగజారుస్తారు. వారి గౌరవానికి భంగం కలిగిస్తారు. మానకసిక క్షోభకు గురి చేస్తారు. ఈ పద్ధతి తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి తెలుగు నేల అంతటా పర్చుకుంది. ఇప్పటికీ ప్రాంతీయ అస్తిత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో ఇది పకడ్బందీగా కొనసాగుతోంది. 1940వ దశకం మధ్య నుండి ఒక వైపు కమ్యూనిస్టులు, మరో వైపు ఆర్యసమాజ్‌ వాళ్ళు, వారితో అంటకాగిన హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు, ఇంకో వైపు మజ్లిస్‌/రజాకార్లు పరస్పర విమర్శలకు దిగారు. ఈ రెండు, మూడు రకాల రాజకీయ ప్రక్రియల వల్ల గానీ, వాటి కొనసాగింపు, ఎదుగుదల మూలంగా గానీ సమాజంలో  ప్రజాస్వామిక చోటు (డెమోక్రాటిక్‌ స్పేస్‌) అంతకంతకూ కుంచించుకు పోయింది. కొన్ని కొన్ని సార్లు ఈ రాజకీయ పార్టీలు మొత్తం సమాజాన్ని శత్రు శిబిరాలుగా మార్చే ప్రయత్నం కూడా చేస్తాయి. అందులో భాగంగా రాజకీయ సంస్థలు, అందులోని వ్యక్తులు పనిగట్టుకొని విచక్షణను గాలికొదిలేసి తమ భావజాల ప్రచారానికే ప్రాధాన్యత నిస్తాయి. లెఫ్ట్‌, రైట్‌ గాకుండా ‘ప్రజాస్వామిక’మైన ఆచరణ సాధ్యమైన, అనుసరణీయమైన మరో ‘మధ్యే’మార్గముందని వీళ్లు గుర్తింప నిరాకరిస్తారు. లెఫ్ట్‌, రైట్‌ సిద్ధాంతాలు వేరయినప్పటికీ సారాంశంలో మాత్రం వీళ్లు అన్ని రంగాల్లోనూ సహజ సిద్ధంగా, న్యాయంగా ఎవరికి దక్కాల్సిన వాటాను వారికి దక్కకుండా చేస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సార్లు వీళ్లిద్దరూ కలిసి మరీ ఈ ‘సెంట్రిస్ట్‌’లపై గోడమీది పిల్లి అనే ముద్రవేస్తారు. కండ్లకు కనబడని దాడిని చేస్తారు. సెంట్రిస్ట్‌లు చెప్పే విషయానికి విలువ లేకుండా/ రాకుండా ప్రచారం చేస్తారు. ఇది కుట్రపూరితంగా, తమ ఆధిపత్యాన్ని అప్రతిహతంగా కొనసాగించుకోవడం కోసం ఎత్తుగడగా వేసే ‘ముద్ర’లు అని అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ముద్రనే ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న సురవరం ప్రతాపరెడ్డిపై కూడా వేసిండ్రు.
    ఇజాలకు సంబంధం లేకుండా మంచిని మంచి అని, చెడుని చెడు అని ‘నీర క్షీర వివేకా’న్ని ప్రదర్శించిన సురవరం ప్రతాపరెడ్డిని ఆయన జీవితకాల కృషిని ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు గుర్తింప నిరాకరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని ‘సంపాదకుడి’గా పరిమితం చేసిండ్రు. ఇంకొందరు కొంచెం కన్సెషన్‌ ఇస్తూ ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర కారుడి’గా గుర్తించారు. అయితే బహుముఖంగా, అనేక రంగాల్లో ఆయన చేసిన కృషికి న్యాయమైన గుర్తింపు దక్కలేదు. ‘హిందువుల పండుగలు’ పుస్తకాన్ని రాసిండు కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి రైటిస్టు అని లెఫ్టిస్టులు ముద్ర వేసిండ్రు. అలాగే ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడిగా జోగిపేట సభలకు ‘భాగ్యరెడ్డి వర్మ’ను ఆయన సహచర దళితుల్ని ఆహ్వానించి, అందలం ఎక్కించినందుకు సంప్రదాయవాదులు ఆయన్ని తప్పుబట్టిండ్రు. రైటిస్టు స్వామి రామానందకు దక్కిన గౌరవం కూడా ఆ యా వర్గాల నుంచి ప్రతాపరెడ్డికి దక్కలేదు. ‘‘ఉభయ వర్గాలు (కమ్యూనిస్టులు, జాతీయ వర్గం) కలువక పోవడం విచారకరమే కాని కలువక పోయినందున ఒకరిపై నొకరు ఆరోపణము చేయడం మరింత విచారకరము. ఇది నాయకులకు తగిన ఘనత కాదు’’. అని సురవరం ప్రతాపరెడ్డి అభిప్రాయ పడ్డాడు. అంటే ఇరువర్గాల వారు ఒకే ఆశయం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు పరస్పరం సహకరించుకోక పోయినా, ఘర్షణ వైఖరి ఉండకూడదనేది ప్రతాపరెడ్డి అభిప్రాయం.   బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కూడా మెజారిటీ ప్రజల శ్రేయస్సు కోసం ‘సెంట్రిస్ట్‌’ధృక్పథాన్నే ఆచరించాడు. ఈ ‘మధ్యే’మార్గ సిద్ధాంతానికి ప్రచారం కల్పించకుండా ఎవరికి వారు గిరి గీసుకొని మెజారిటీ ప్రజాభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించారు. ప్రతాపరెడ్డి ఆచరించిన, సూచించిన మార్గన్నే ఇటీవలి ఎరుకలో జయశంకర్‌ సార్‌ ఆచరించాడు. ఆయన కూడా ప్రత్యేక తెలంగాణ సాధన విషయంలో అన్ని శక్తులూ కలిసి పోరాటం చేయాలని, అలా సాధ్యం కాని పక్షంలో పరస్పర విమర్శలకు తావు లేకుండా ఉద్యమం నిర్మించాలని అభిప్రాయ పడ్డారు. అయితే అటు ప్రతాపరెడ్డి ప్రతిభకు తగిన గుర్తింపు రాకుండా అడ్డుకున్న వర్గాలే ఇటు కొత్తపల్లి జయశంకర్‌ కృషికి కూడా తగిన గుర్తింపు రాకుండా అడ్డుకున్నారు. జయశంకర్‌ బీసీ కావడం మరో అదనపు అవరోధం. ఈ అవరోధాల్ని ఇటీవలి కాలంలో తెలంగాణ అస్తిత్వ సోయితో కొంచెం కొంచెంగా అధిగమిస్తున్నారు. ప్రతాపరెడ్డి విషయంలో ఈ అవరోధం తొలగిపోలేదు. కామ్రేడ్‌లను ఒకటి రెండుసార్లు వ్యంగ్యంగా ‘కామరేడ్లు’ అని రాసినందుకు కమ్యూనిస్టులు ఆయన ప్రతిభకు సమాధి కట్టిండ్రు. బిరుదురాజు రామరాజు జానపద సాహిత్యంలో పరిశోధన చేసినా, సామల సదాశివ సంగీత, సాహిత్య రంగాల్లో కృషి చేసినా అది ప్రతాపరెడ్డి మార్గదర్శకత్వమే అన్న విషయం చరిత్రలో అంత ప్రస్ఫుటంగా రికార్డు కాలేదు. వీరిద్దరూ  20 యేండ్ల వయసులో ఉన్న కాలంలోనే వారిలోని ప్రతిభను గుర్తించి దిశా నిర్దేశం చేసిన ప్రతాపరెడ్డి దార్శనికతకు తగిన గుర్తింపు లేదు. గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణలోని నలుమూలల ఉన్న కవులు, కథకులు, రచయితలను ప్రోత్సహించాడు. వారి రచనలు అచ్చేయడం ద్వారా అటు మరుగున పడ్డ ప్రతిభను వెలుగులోకి తెచ్చాడు. అలాగే గోలకొండ పత్రిక ద్వారా, విజ్ఞానవర్ధినీ పరిషత్తు ద్వారా వారి పుస్తకాలను అచ్చువేసి వారి రచనలకు శాశ్వతత్వాన్ని కల్పించాడు. అట్లాంటి ప్రతాపరెడ్డి ఎట్లా తెలుగు వారందరికీ తెలియకుండా పోయిండో, అందరివాడిగా కాకుండా పోయిండో తెలుగు సాహితీవేత్తలు ‘ఆత్మవిమర్శ’ చేసుకోవాలి. దార్శనికుడు, ప్రతిభాశాలి అయిన ప్రతాపరెడ్డి ఒక్క సాహిత్య రంగంలోనే కాకుండా అనేక ఇతర రంగాల్లో కూడా విశేషమైన కృషి చేసిండు.ఒక వైపు ప్రతాపరెడ్డికి ఆచరణలో అన్యాయం చేస్తూనే మరోవైపు కొందరు ఈ మధ్య కాలంలో ప్రేమను నటిస్తున్నారు.  తెలంగాణవాదం బలంగా ఉండి సీమాంధ్ర సాహిత్యకారులకు తెలంగాణలో కాలుబెట్టడానికి, కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకపోవడంతో వాళ్లు ప్రతాపరెడ్డి జయంతి/తెలుగు భాష దినోత్సవాల పేరిట అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంతో కలిసి కార్యక్రమాలు తమ స్వీయ ప్రయోజనాల కోసం చేపడుతున్నారు. ఇట్లా కార్యక్రమాలు చేసేవాళ్లు తమ ప్రాంతంలో ఏ ఒక్క గ్రంథాలయానికి గానీ, విద్యాలయానికి గానీ ప్రతాపరెడ్డి పేరుని పెట్టుకోలేదు. అలాగే సీమాంధ్రల్లో ఎక్కడ కూడా ఆయన విగ్రహం ప్రతిష్టించలేదు. కడుపులో విషందాచుకొని, పెదాలపై ప్రేమ ఒలికించడం వల్ల తెలంగాణ సాహిత్యకారులకు, సంస్కృతికి, సమాజానికి ఏమాత్రం మేలు జరుగదనే విషయం గత 60 యేండ్లుగా రూఢీ అయ్యింది. ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత ‘మేధావులు’ అన్యాయం జేశారు.  కొందరు తెలంగాణ వాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వాళ్ళు తాము పదవుల్లో ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళ సేవలో తరించడమే తప్ప తెలంగాణకు న్యాయంగా చేయాల్సిన మేళ్లు కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడెమీ ‘ఆంధ్రపత్రిక’ చరిత్ర రాయించి, ‘గోలకొండ పత్రిక’ను విస్మరించడమంటేనే అందులో ఏదో మతలబున్నదని అర్థమవుతుంది. అలాగే మిగతా విషయాల్లో అటు ఆంధ్ర, తెలంగాణ అనే తేడా లేకుండా కమ్యూనిస్టులు, రైటిస్టులు అందరూ ప్రతాపరెడ్డి ప్రతిభను గుర్తించ నిరాకరించారు. వివక్షాపూరిత సీమాంధ్రులకు, స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించే కమ్యూనిస్టులకు ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ లేదు. దొందూ దొందే!
    హైదరాబాద్‌ నగరంలో కుల సంఘాల తరపున స్థాపించబడ్డ ప్రతి హాస్టల్‌ ప్రారంభానికి ప్రతాపరెడ్డి సలహాలు, సూచనలు అందాయి. అరుంధతీయ మహాసభకు గౌరవాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇంత ప్రజాస్వామికంగా, తన కాలానికి కన్నా ముందు నడిచిన, సమాజంలోని అన్ని వర్గాల వారితో కలుపుగోలుగా వ్యవహరించిన ఆయన వ్యక్తిత్వానికి పాఠ్యపుస్తకాల్లో సరైన స్థానం దొరకలేదు. సమాజంలోని అన్ని వర్గాల వారికి మంచికోసం జరిగే మార్పుల్లో న్యాయమైన వాటా దక్కాలని కోరుకున్న గొప్ప మనీషి సురవరం. అందుకోసం తాను కార్యకర్త మొదలు నాయకుడి వరకు వివిధ పాత్రలు పోషించేవాడు. ఎప్పుడూ ఏదో ఒక ఉద్యమం లేవదీస్తూ అది ఆశించిన ఫలితాలు సాధించేవరకు పోరాటం చేయడం ఆయన పంథా. మహిళాభ్యున్నతికి ఆయన చేసికృషి కూడా దాదాపు అట్లాంటిదే! ఎట్లాగైనా గోలకొండ పత్రికలో మహిళల చేత రచనలు చేయించాలనే ఉద్దేశ్యంతో ప్రతాపరెడ్డ తానే మారు పేరుతో స్త్రీలకు తమ సంస్కరణపట్ల పట్టింపు లేదని వారిని ప్రేరేపిస్తూ వ్యాసాలు అచ్చేశాడు. దీనికి ప్రతిస్పందనగా ఎల్లాప్రగడ సీతాకుమారి లాంటి వారు వ్యాసాలు రాసిండ్రు. మహిళల అభ్యున్నతికి కాన్షియస్‌గా పనిచేసిన ఆయనకు ఆ సమాజం నుంచి కూడా తగిన గుర్తింపు దక్కలేదు. వీటన్నింటికి మించి తాను చదువుకున్న అడ్వకేట్‌ వృత్తికి న్యాయం కలిగించే విధంగా పౌరహక్కుల కోసం బహుశా దేశంలోనే మొట్టమొదటి పౌరహక్కుల పుస్తకం ‘ప్రజాధికారములు’ రాసిండు. ఆయన పుస్తకం రాసేనాటికి ఇంకా ఐక్యరాజ్యసమితి కూడా హక్కుల గురించి తీర్మానం చేయలేదంటే ఆయన ముందుచూపు అర్థమవుతుంది. పౌర, మానవ హక్కుల కోసం ప్రాణాలర్పించిన నేల ఇది. హక్కుల సంఘాలు ప్రజా చైతన్యం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టాయి. అయితే ఈ సంఘాలు ఎన్నడూ పొరపాటున కూడా హక్కుల ఉద్యమానికి సంబంధించి తెలుగులో మొట్టమొదటి పుస్తకం రాసింది సురవరం ప్రతాపరెడ్డి అని ఎక్కడా పేర్కొనలేదు. అట్లాగే ఆ పుస్తకాన్ని పునర్ముద్రించడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతటి ప్రజాస్వామిక వాది, పీడిత ప్రజల పక్షపాతి, పౌరహక్కుల చైతన్యానికి  పునాదులేసిన రచయిత, కందుకూరి వీరేశలింగం కన్నా ముందే తెలంగాణలో సంఘసంస్కరణ ఉందని నిరూపించిన సంస్కరణవాది, చేయితిరిగిన చరిత్రకారుడు, కవి, ప్రజా ఉద్యమ నిర్మాత, రచయిత, కథకుడు, పరిశోధకుడు, వ్యాసకర్త, సంపాదకుడు, వక్త, హైదరాబాద్‌లో తొలి వికాస కేంద్రాల్లో ఒకటైన ‘రెడ్డి హాస్టల్‌’ నిర్వాహకుడిగా, తొలి ఆంధ్రమహాసభ ప్రథమాధ్యక్షుడిగా, ఆంద్రవిద్యాలయ స్థాపకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, అస్పృశ్యత, మద్యపానానికి వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ నిజాం ప్రభుత్వానికి  వెరవకుండా, వెన్ను చూపకుండా ప్రజాచైతన్యాన్ని ప్రోది చేసిన సురవరం ప్రతాపరెడ్డిని అటు లెఫ్టిస్టులు, ఇటు రైటిస్టులు ఏనాడు పట్టించుకోలేదు.
    ప్రతాపరెడ్డి ‘సెంట్రిస్ట్‌’గా ఎవరు తప్పుచేసినా స్పేర్‌ చేయకుండా తూర్పారా బట్టడంతో ఆయన్ని ‘ఓన్‌’ చేసుకోవడానికి లెఫ్టిస్టులు ఇష్టపడలేదు. రైటిస్టులు పట్టించుకోకుంటే వచ్చే నష్టమేమి లేదు గానీ, న్యాయం వైపు నిలబడుతారని ప్రచారంలో ఉన్న వామపక్షవాదులు పట్టించుకోక పోవడమే విషాదం. ఈ విషాదం తెలంగాణకే ప్రత్యేకం. కమ్యూనిస్టులు ఎంత అన్యాయంగా వ్యవహరించినా ఆయన మాత్రం వారి అభిప్రాయాలతో విభేదించినా వారి రచనలకు గోలకొండ పత్రికల్లో సముచిత స్థానం కల్పించాడు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి రచనలకు గోలకొండ పత్రికలో స్థానం కల్పించడమే ఇందుకు నిదర్శనం. తప్పుచేసిన వారిని ఎలా స్పేర్‌ చేయలేదో అలాగే మంచి చేసిన వారినికూడా అది ఎవ్వరైనా అదే రీతిలో కొనియాడారు.
    బ్రిటీషాంధ్రలో బ్రాహ్మణేతర ఉద్యమంలో నార్ల వెంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు లాంటి వారు అటు పత్రికా సంపాదకులుగా ఉంటూ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో బ్రాహ్మణేతర సామాజిక చైతన్య కార్యక్రమాలకు పునాది వేసింది కొత్వాల్‌ వెంకటరామారెడ్డి. ఆయన స్ఫూర్తితో దాన్ని ఉద్యమంగా కొనసాగించింది సురవరం ప్రతాపరెడ్డి. ఇందులో భాగంగానే కొత్వాల్‌ వెంకటరామారెడ్డి జీవిత చరిత్రను ప్రతాపరెడ్డి రాసిండు. కుల సంఘాలు వారు ఏర్పాటు చేసిన హాస్టల్స్‌కు గానీ, అరుంధతీయ సంఘ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం గానీ, భాగ్యరెడ్డి వర్మ లాంటి దళితులకు ఆంధ్రమహాసభలో స్థానం కల్పించడం గానీ సంఘం సీతారామయ్య యాదవ్‌, కే. రాములు లాంటి వారి రచనలకు, వారి కుల ఉద్యమాల వార్తలను గోలకొండ పత్రికల్లో అచ్చేయడం గానీ, మున్నూరు కాపు సంఘంలో కీలక పాత్ర పోషించిన బొజ్జం నర్సింలుని గోలకొండ పత్రిక మేనేజర్‌గా నియమించుకోవడం తదితర కార్యక్రమాలన్నీ ఆయన బ్రాహ్మణేతర ఉద్యమాలకు ఊపిరి పోసిన తీరుని చిత్రిక గడతాయి. నిజానికి ప్రతాపరెడ్డి తరచుగా ‘చిన్నప్పటి నుండి బ్రాహ్మణ సహవాసంతో భ్రష్టుడనైనాను’అని తన గోలకొండ దర్బారులో ఆసీనులైన మిత్ర బృందంతో అనేవాడు. ఈ మిత్ర బృందంలో బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సుజాత పత్రిక సంపాదకుడు పసుమాముల నృసింహశర్మ తదితరులుండే వారు. ఇదే విషయాన్ని ఇల్లిందల సరస్వతీదేవి రాస్తూ ‘‘పైకి గునుపే గాని మనసులో వారిపట్ల ఎనలేని గౌరవాభిమానములు రెడ్డిగారికి’’ అని తన ‘తేజోమూర్తులు’ పుస్తకంలో పేర్కొన్నారు.
    ప్రజాస్వామ్య బద్ధంగా, నిష్పాక్షికంగా పేదలు, పీడితుల పక్షాన నిలబడ్డ ప్రతాపరెడ్డికి అటు రాజకీయ రంగంలో ఎంతటి అన్యాయం జరిగిందో ఇటు సాహిత్య రంగంలో అంతకన్నా ఎక్కువ ద్రోహం/మోసం జరిగింది. బహుశా ఆయన బ్రాహ్మణేతరుడు కావడం అందుకు కారణం కావచ్చు. 1927 నుండి 1975 వరకు దాదాపు 50 యేండ్ల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ఒక్క తెలంగాణ వాడు కూడా అధ్యక్షుడు కాలేకపోయినందు వల్ల ఆ శాఖను 50 యేండ్లు ఆక్రమించి ఏలిన వాండ్లు అంతా ఆంధ్రప్రాంతం నుంచి వలసొచ్చిన బ్రాహ్మణులే అయినందువల్లా ప్రతాపరెడ్డి గురించిన పరిశోధన వారి జమానాలో జరుగలేదు.బహుశా ప్రతాపరెడ్డి బ్రాహ్మణేతరుడు కావడం మూలంగానే ఆయన ప్రతిభకు విశ్వవిద్యాలయాల్లో తగిన గుర్తింపు దక్కలేదు. ఆయన రచనలు ఆ విశ్వవిద్యాలయాల తరపున వెలుగులోకి రాలేదు. వాటిపై సరైన పరిశోధన జరుగలేదు. ఎందుకంటే 1970ల వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఉన్నత స్థానంలో పనిచేసింది తెలంగాణేతర బ్రాహ్మణులే. వారికి ఆయన పట్ల పట్టింపు లేదు. అలాగే గతంలో కాకతీయ విశ్వవిద్యాలయం పూనుకొని రాయప్రోలు సుబ్బారావు, కొడవటిగంటి కుటుంబరావు, విశ్వనాథ సత్యనారాయణల రచనల సూచీని వెలువరించాయి. అయితే ప్రతాపరెడ్డి రచనల గురించి ఏ విశ్వవిద్యాలయం పట్టించుకోలేదు. ఇంత వరకూ ఆయన ‘సమగ్ర రచనల సూచీ’ ప్రచురించలేదు. దీన్ని బట్టి బ్రాహ్మణ, తెలంగాణేతర వ్యక్తుల మీద ఉన్న సానుకూల ధృక్పథం ఇక్కడి భూమిపుత్రులపౖౖె ఉండదు అనడానకి ఇదే నిదర్శనం.
    తెలంగాణ`ఆంధ్రల మధ్యన పోలిక తీసుకువచ్చిన ప్రతి సందర్భంలో ఆంధ్రను, ఆ ప్రాంత వైతాళికులను ఉన్నత స్థానంలో నిలబెడుతూ అక్కడి మీడియా/ పత్రికలు/ ప్రచురణ సంస్థలు/ వ్యక్తులు పనిచేస్తారు. ఈ వివక్షా పూరిత ధోరణి తెలంగాణ ప్రతిభను పూర్తిస్థాయిలో ఎరుకలోకి రాకుండా తొక్కిపెట్టింది. ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు అని ప్రచారంలో ఉన్నవాళ్లు సైతం (ఒకరిద్దరు మినహా) ఆచరణలో మాత్రం తమ సీమాంధ్ర పక్షపాతాన్ని ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రాంతానికి చెందిన సామినేని ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ పేరిట ఆ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధుల కవిత్వాన్ని సంపుటిగా వెలువరించారు. ఇందులో అప్పటికే ప్రసిద్ధుడైన దళితుడు గుర్రం జాషువా కవిత చోటు చేసుకోలేదు. అంటే ఆయన దళితుల  పట్ల వివక్షతో వ్యవహరించిండు అనేదానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. ఈ వైతాళికులు పుస్తకాన్ని ‘విశాలాంధ్ర’ వారు పనిగట్టుకొని పదుల సంఖ్యలో పునర్ముద్రణ చేసిండ్రు. అదే కాలంలో హైదరాబాద్‌ నుంచి అరిగె రామస్వామి లాంటి దళితులకు,  దళితుల నుంచి కన్వర్ట్‌ అయిన క్రిస్టియన్లకు, బీసీలకు కూడా స్థానం కల్పిస్తూ సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన ‘గోలకొండ కవుల సంచిక’ తెలంగాణ కవిత్వాన్ని ఇంత వరకు అటు విశ్వ విద్యాలయాలు కానీ, ఇటు విశాలాంధ్ర ప్రచురణ సంస్థ కానీ ప్రచురించలేదు. ఇది వారి పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక వైఖరికి అద్దం పడుతుంది. ఒక విధంగా ప్రతాపరెడ్డి ‘గోలకొండ కవుల సంచిక’ ప్రచురించడానికి కూడా ఆంధ్రుల అహంకారమే కారణం.
    ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని ముడుంబై రాఘవాచార్యులు అనే విమర్శకుడు గోలకొండ పత్రిక వార్షిక సంచికలో (10, మే 1934) ఒక సాహిత్య సమీక్షలో రాసిండు. అంతేకాదు ఆంధ్రప్రాంతానికి చెందిన రాయప్రోలు సుబ్బారావు లాంటి వాళ్ళే ఇక్కడ రాణిస్తున్నారు అని కూడా అందులో పేర్కొన్నాడు. ఒక సంపాదకుడిగా ఆ వ్యాసాన్ని సంచికలో అచ్చేసి ప్రతాపరెడ్డి తన నిష్పాక్షికతను చాటుకున్నాడు. అదే సమయంలో ఒక తెలంగాణ భూమి పుత్రుడిగా స్పందించిండు. సగర్వంగా, సమున్నతంగా తెలంగాణ కీర్తిని దశదిశలా వ్యాపింప జేసేందుకు పునాదులు వేసిండు. ముడుంబై వ్యాసానికి ఘాటుగా జవాబిస్తూ ఇక్కడ కవులు పూజ్యం కాదు, పూజనీయులు అని ‘గోలకొండ కవుల సంచిక’ని వెలువరించి చెప్పిండు. ఈ సంచిక 1934 డిసెంబర్‌, 12నాడు అచ్చయ్యింది. అంటే కేవలం ఏడ్నెల్ల వ్యవధిలోనే తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి కవుల రచనల్ని తెప్పించి వాటిని ఒక్క దగ్గర చేర్చి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే సంచికను ప్రచురించాడు. అట్లాంటి ప్రతాపరెడ్డి చనిపోయి దాదాపు 60 యేండ్లు కావస్తుంది. అయినప్పటికీ ఆయన రాసిన కవిత్వం ఇంతవరకు పుస్తక రూపంలో రాలేదు. ‘ఎండిన పూలు’ పేరిట తన కవిత్వాన్ని తీసుకురావడానికి ఆయన కొంత ప్రయత్నం చేసిండు కానీ ఎందుకో సఫలీకృతుడు కాలేదు. బహుశా ఇందుకు ప్రతాపరెడ్డి ప్రజా ఉద్యమాల్లో తలమునకలుగా ఉండడం,  పత్రికా సంపాదకుడిగా క్షణం తీరిక లేకపోవడం అందుకు కారణం కావచ్చు. అలాగే ‘కవిత్వం’ పత్రికల్లో అచ్చయింది కదా, పాఠకులకు చేరుకున్నది కదా అని సంతృప్తి చెందడం కూడా కారణం కావచ్చు. ప్రతాపరెడ్డి మరణానంతరం ఆయన మీద పరిశోధన చేసిన ఇందుర్తి ప్రభాకరరావు గానీ, పుస్తకాలు రాసిన ఎల్లూరి శివారెడ్డి, ముద్దసాని రామిరెడ్డి, గోపీకృష్ణ తదితరులందరూ కవిత్వానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. కేతవరపు రామకోటి శాస్త్రి కొంత మేరకు ఆయన కవిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నించారు. కాని అది కూడా అసమగ్రమే. ఏది ఏమైనప్పటికీ కవిగా ప్రతాపరెడ్డికి దక్కాల్సిన గుర్తింపు ఈనాటికి దక్కలేదు. సంపాదకుడిగా కొందరు, చరిత్రకారుడిగా మరికొందరు ఆయన్ని గురించి రాసిండ్రు కానీ ఆయన సమగ్ర సాహిత్య మూర్తిమత్వాన్ని ఇంతవరకు ఎవ్వరూ రికార్డు చేయలేదు. గతంలో ‘సురవరం సాహితీ వైజయంతి’ ద్వారా కొంత పని జరిగింది కానీ అదీ అసమగ్రమే. సురవరం సాహిత్యం సమగ్రంగా వెలుగులోకి రావాలనే ఆశయంతో గతంలో ‘తెలంగాణ ప్రచురణలు’ తరపున ఆయన అముద్రిత ‘తెలంగాణ వ్యాసాలు’ తీసుకు రావడమయింది. ప్రస్తుత కవిత్వ పుస్తకం దానికి కొనసాగింపు. కవిగా ప్రతాపరెడ్డి ప్రతిభను అంచనా వేయడానికి, విశ్లేషించడానికి, తొలితరం తెలుగు కవుల్లో న్యాయమైన, సముచిత స్థానం ఆయనకు దక్కాలనే ఉద్దేశ్యంతో కూడా ఈ కవితల్ని ఒక్కదగ్గరికి తేవడంలో ఉంది. దాదాపు 15  యేండ్ల వెతుకులాట/ పరిశోధన ఫలితం ఈ పుస్తకం.
    అయినప్పటికీ ఇది ‘సమగ్రం’ కాదు అని నాకు తెలుసు. కృష్ణాపతిక్రలో 1918లో వచ్చాయని చెబుతున్న కవితలు నాకు అందుబాటులోకి రాలేదు. అలాగే చాలా కవితలు అసంపూర్తిగా దొరికాయి. ఇప్పుడీ పుస్తకం వెలుగులోకి రానట్లయితే భవిష్యత్తులో ఈ మాత్రం కవిత్వం కూడా అందుబాటులో లేకుండా పోతుందనే ఉద్దేశ్యంతోనే వీటి ముద్రణకు పూనుకోవడమయ్యింది. ప్రతాపరెడ్డి లేఖిని నుంచి వెలువడ్డ రెండు పద్యకావ్యాలు చంపకీ భ్రమర విషాదము, హరిశర్మోపాఖ్యానము ఆయన బతికున్న కాలంలోనే పోగొట్టుకున్నాడు. వీటి పేర్లు తప్ప వాటిలోని పద్యాలు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయాయి. 1948లో గోలకొండ పత్రికలో వెలువడ్డ ‘ఆస్తినాస్తి విచికిత్స’ అనే పద్యాలు కూడా నాకు దొరకలేదు. ఇది దేవుని అస్తిత్వానికి సంబంధించి అనుమానాస్పదముగా, చమత్కార గర్భితంగా వ్రాయబడ్డ పద్యాలు. సూతాఖ్యాయిక పద్యాలను సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా చండూరు నుంచి పంపించారు. ఆ పద్యాలు కూడా మొత్తం దొరకలేదు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదంలోని కొన్ని కవితలు ఆ యా కథాక్రమం నుంచి విడదీసి, ఉత్తమ కవితలను అనుబంధంలో చేర్చడమయింది. మద్యపానము లాంటి పద్యాలు గత 90 ఏండ్లలో మొట్టమొదటిసారిగా ఈ పుస్తకంలోనే చోటు చేసుకున్నాయి.
    లిలిలి
    అడ్డదారి, దొంగదారి, దొడ్డి దారి అది ఏదైతేనేం, ‘ఉత్తర’మో ‘దక్షిణ’ మో, కుడి, ఎడమ అది ఏ మార్గమైతేనేమి తమ స్వీయ ప్రయోజనాలు, స్వలాభమే పరమావధిగా ఊరేగుతున్న సాహిత్యకారుల కార్యాల వల్ల నిజమైన వైతాళికులకు దక్కాల్సిన గౌరవం గతంలో దక్కలేదు. వర్తమానంలోనూ ఆ పరంపర ఇంకా కొనసాగుతోంది. యూనివర్సిటీలు, అకాడెమీలు, భాషా సంఘాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ గిరిగీసుకొని ప్రజ్ఞకు తావుఇవ్వకుండా పనిచేస్తున్నాయి. నిజానికి పరిశోధనతో కూడిన రచనలు వెలువరించాల్సిన తెలుగు విశ్వవిద్యాలయం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. తెలుగునాట ఒకప్పటి సాహిత్య అకాడెమీలు చేసినంత పాటి కృషి కూడా రాష్ట్రవ్యాప్తమైన ఈ యూనివర్సిటీ చేయలేకపోతున్నదంటే దిగజారిన నేటి స్థితి తెలుస్తుంది. అకడమిక్‌ రంగంలో 99శాతం ‘మేధావులు’ ముఠాలు, కుమ్ములాటలు, పై పోస్టులకు పైరవీలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించటానికి వ్యూహాలు, ఎత్తుగడలు, పన్నాగాలు తప్ప పని మాత్రం సున్నా. ఇక ‘అధికార భాషా సంఘం’ వంధిమాగధుల సమాగమంగా మారింది. ప్రాంతీయ స్పృహ పెరిగిన తర్వాత వివిధ అంశాల పట్ల ఆసక్తితో పరిశోధకులుగా మారిన వారే ఎక్కువ సాహిత్యాన్ని, రచనలను వెలుగులోకి తెస్తున్నారు. నిజంగా ఈ పరిశోధనంతా ‘కృతజ్ఞత లేని కృషి’. అయినా కూడా సాహిత్యం, చరిత్ర, సంస్కృతి పట్ల సాహితీవేత్తల కృషి పట్ల మమకారం, అభిమానం కొత్త వెలుగుల్ని ప్రసరింపజేస్తున్నాయి. ‘మనం కూడా చరిత్రకెక్కదగిన వారమే’ అని ఘంటాపథంగా ఉద్ఘాటించి ఆంధ్రుల సాంఘిక చరిత్రను అద్భుతంగా రికార్డు చేసిన సురవరం ప్రతాపరెడ్డి గురించి ఇప్పటికే కొంత సమాచారం, సాహిత్యం వెలుగులోకి వచ్చింది. ఇలా ఎంత చరిత్ర వెలుగులోకి వచ్చినా ఏదో ఒక పార్శ్వం మిగిలిపోయే బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్రుల సాంఘిక చరిత్రను అచ్చేయాల్సిన తెలుగు విశ్వవిద్యాలయం చేతులెత్తేసింది. కేవలం తెలుగు శాఖలోనే కాదు, అటు రాజనీతి, సామాజిక, ఆర్థిక శాఖల్లో కూడా ఆయన ‘కాంట్రిబ్యూషన్‌’ గురించిన పరిశోధన జరగాల్సి ఉండిరది. ‘తెలుగు అకాడమి’ ఆంధ్రప్రాంత సాహితీవేత్తల ‘పీఠాలు’ ఏర్పాటు చేసింది గానీ ‘సురవరాన్ని’ విస్మరించింది. నిజాయితీపరులు, నిష్పాక్షికంగా వ్యవహరించే వాళ్లు లేకపోవడంతో అన్ని రంగాల్లో సీమాంధ్రులదే హవా నడిచింది. దురదృష్టవశాత్తు తెలుగు నేలంతటా పరుచుకుపోయిన సీమాంధ్ర సాహిత్యవేత్తల వలస ధృక్పథం మూలంగా తెలంగాణ మూలవాసులపై ముఖ్యంగా వైతాళికులపై వారి రచనలపై తగినంత కృషి, పరిశోధన, విశ్లేషణ, విమర్శ, ప్రచారం జరుగలేదు. దీనికి ప్రధాన కారణం మూల రచనల అలభ్యత. ఎప్పుడో 50`60 యేండ్ల క్రితం ప్రచురితమైన పుస్తకాలు నేడు సాధారణంగా అందుబాటులో ఉండవు. సీమాంధ్ర రచయతలను భుజాన మోసుకొని ప్రచారం చేసే ప్రచురణ సంస్థలు లాంటివి తెలంగాణకు లేకపోవడం కూడా మరో కారణం. ప్రభుత్వ డబ్బుతో నడిచే తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడెమీల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రచనలు చాలా అరుదుగా అచ్చవుతాయి. ఈ సంస్థలు ప్రచురించిన పుస్తకాలే ప్రామాణికమైన గ్రంథాలుగా చలామణి అవుతాయి. కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ల్లో గానీ, యూనివర్సిటీల సిలబస్‌లో, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఈ పుస్తకాలే పాఠ్యాంశాలై వెలుగుతాయి. అందువల్ల తెలంగాణ ప్రతిభకు, వైభవానికి గుర్తింపు లేకుండా పోతుంది. ఇదంతా తెలంగాణలో ప్రతిభను అణచివేయడానికి పాలకవర్గాలు, వారికి తాబేదార్లుగా వ్యవహరించే అధికారులు, వారికి సలహాలిచ్చే పక్షపాత మేధావి వర్గం వల్ల వచ్చిన సమస్య. ఈ పరిస్థితిని అధిగమించడానికి తెలంగాణ సోయితోటి వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్థలు పనిచేయాల్సి వస్తున్నది. వీరి నిరంతర కృషి వల్ల ఇటీవలి కాలంలో ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావు,  కాళోజి నారాయణరావు తదితరుల రచనలు అచ్చయ్యాయి. దానికి జోడిరపుగా అస్తిత్వ స్పృహతో ఈ ‘సురవరం కవిత్వం’ పాఠకుల ముందుకు తెస్తున్న. అంటే పాలక వర్గం పట్టించుకోకుండా పోయిన సాహిత్యాన్ని వెలుగులోకి తెస్తున్న అనే సోయితో ఈ పని చేస్తున్నాను.
    25 యేండ్ల పాటు ప్రతిరోజూ సాహిత్య సృజన చేస్తూ, పీడిత ప్రజల పక్షాన నిలిచి యుద్ధం చేసిన కలం యోధుడు ప్రతాపరెడ్డి. ఆయన గురించిన ప్రాథమిక సమాచారం కొంత అక్కడక్కడా రికార్డయి ఉంది. కానీ ఆయన ప్రతిభను, వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని, కవిత్వాన్ని, పరిశోధన ప్రతిభ, ముక్కుసూటి విమర్శ, సాహిత్య ఆధారాల ద్వారా నిర్మించిన చరిత్రను జమిలిగా ఒకదానితో ఒకటి లింక్‌ చేసి చూసినప్పుడే ఆయన గురించి ఒక ప్రాథమిక అంచనాకు రావడానికి వీలవుతుంది. సంస్థానాధీశులు, దేశ్‌ముఖ్‌ల పెట్టుబడులు, ఆర్థిక సహాయ సహకారాలతో, ప్రోత్సాహంతో ప్రారంభమైన ‘గోలకొండ పత్రిక’లో ఎక్కడా కూడా వారిని ‘స్పేర్‌’ చేయలేదు. సందర్భానుసారంగా దొరలు, భూస్వాములపై తన సంపాదకీయాలు, వ్యాసాల ద్వారా తూర్పార బట్టిండు.  సంస్థానాధీశులు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండ్యాలు, జమిందారులు, భూస్వాములు పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వారు తమ వైఖరిని మార్చుకోవాలంటూ వ్యాసాలు రాసిండు. ఇది గిట్టని వనపర్తి రాజా రామేశ్వరరాయలు పత్రిక యజమాని హోదాలో ప్రతాపరెడ్డి తన సొంత గ్రామం ఇటికాలపాడులో ఉన్న సమయంలో టెలిగ్రామ్‌ ఇస్తూ ఉన్నపళాన ఉద్యోగంలో చేరాలని హుకుం జారీ చేసిండు. దీనికి స్పందించి ప్రతాపరెడ్డి హైదరాబాద్‌ చేరుకునే లోగానే తన సహాధ్యాయి నూకల నరోత్తమరెడ్డిని రామేశ్వరరాయలు పత్రికా సంపాదకులుగా నియమించాడు.
    లిలిలి
    సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని మాత్రమే అంటే సరిపోదు. ఆయన చేపట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ నాయకుడిగా, ఆంద్రమహాసభ రూపకర్తగా, రచయితగా, నాటక కర్తగా, కవిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, పత్రికా సంపాదకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, తొలి పౌరహక్కుల రచయితగా, వివిధ దళిత, బీసీ కులసంఘాల గౌరవాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. అట్లాంటి వెన్నెముఖ ఉన్న ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి గురించి నేటి తరం తెలుగు వాళ్లకు తెలిసింది తక్కువ. తెలియాల్సిందే ఎక్కువ.
    సురవరం ప్రతాపరెడ్డి మరణించి 60 యేండ్లు గడిచాయి. అయినా నేటికీ ఆయన కవిత్వం పుస్తక రూపం దాల్చలేదంటే దానిక్కారణం ఎవరనేది తెలుగు సాహిత్యాభిమానులందరూ ప్రశ్నించుకోవాలి. కేతవరపు రామకోటి శాస్త్రి, ఇందుర్తి ప్రభాకరరావు, ఎల్లూరి శివారెడ్డి, ముద్దసాని రామిరెడ్డి, ఎన్‌.ఆర్‌. వెంకటేశం, చింతల యాదయ్య, తూర్పు మల్లారెడ్డి లాంటి వాండ్లు ‘సురవరం కవిత్వా’న్ని అంచనా వేయడానికి కొంత కృషి చేసిండ్రు. అయితే ఇందులో ఎవ్వరు కూడా ప్రతాపరెడ్డి ‘కవితాత్మ’ను పట్టుకోలేక పోయిండ్రు. అందుకు సురవరం కవిత్వం మొత్తం లభ్యం కాకపోవడం ఒక కారణమైతే ఆయన కవిత్వం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకపోవడం మరో కారణం.
    ఒక వ్యక్తి మీదగానీ, ఒక ప్రాంత సాహిత్యం మీద పూర్తి స్థాయి వివరాలు వెలుగులోకి రావాలన్నా, వారి కృషికి తగిన గుర్తింపు దక్కాలన్నా ప్రథమంగా జరగాల్సింది ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి అలభ్య రచనల గురించీ వివిధ మాధ్యమాల ద్వారా నలుగురికి తెలిసేలా చేయడం. రెండోది ఒక ప్రాంత సాహిత్యానికి న్యాయంగా దక్కాల్సిన గుర్తింపు దక్కాలంటే ముందుగా ఆ రచన అందరికీ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవాలి.
    తెలంగాణ వాళ్లకు ‘సెల్ఫ్‌ ప్రమోషన్‌’ తెలియదు. తాము రాసింది ఏదో తమ భావనను పేపర్‌పై పెట్టడమే తప్ప అది అందరికీ అందుబాటులోకి రావాలనే తహతహ ఏనాడూ ఉండేది కాదు. వట్టికోట ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావు లాంటి వారు ఈ కోవకు చెందినవారే. వారి గురించి, వారి సాహిత్యం గురించి ఇటీవలి కాలంలో పరిశోధన విస్తృతంగా జరగడం వల్ల మాత్రమే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొట్లపల్లి రామారావుపై, ఆళ్వారుస్వామిపై వచ్చిన పుస్తకాలు ఈ కోవలోనివే. అలాగే మరుగునపడ్డ కథకుడు ‘గూడూరి సీతారాం’ని ప్రయత్న పూర్వకంగా నిలబెట్టుకున్నాము.
    ఇక్కడ ప్రతాపరెడ్డి పరిస్థితి మరీ దారుణం. ఆయన బ్రతికున్న కాలంలోనే ఆయన రచనలు అగ్నికి ఆహుతి కావడం వల్ల, పిల్లలు పనికి రాని కాగీతాలని తీసి ఆడుకోవడం వల్ల ఆ రచనలు ఏనాడో పోయాయి. పోయినవి పోగా అక్షరబద్ధమైన సాహిత్యమంతా పుస్తకాలుగా వెలువడ్డాయా? అంటే అదీ లేదు. కొంతమేరకు ‘సురవరం సాహితీ వైజయంతి’ ఈ విషయంలో కృషి చేసింది. వ్యాసాలు, సంపాదకీయాలు, పీఠికలు, కథలు, నాటకాలు, హైందవ ధర్మపోలీలు పేరిట కొన్ని పుస్తకాలని అచ్చేసింది. అయితే ఇవి ఆయన రచనల్ని రేఖామాత్రంగా పరిచయం చేయడానికి పనికి వస్తాయి తప్ప సమగ్రం కాదు. గోలకొండ పత్రిక సంపాదకుడిగా 1925 నుంచి 1949 వరకు దాదాపు 25 ఏండ్లు ప్రతిరోజూ వివిధ రకాలైన రచనలు చేసిన ప్రతాపరెడ్డి సాహిత్యం ఇంకా వెలుగు చూడాల్సింది (సంపుటాలుగా) దాదాపు పదివేల పేజీలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రమహాసభల సమావేశాల సందర్భంగా చేసిన ప్రసంగాలు, ప్రవేశ పెట్టిన తీర్మానాలు, గోలకొండ పత్రికల్లోని సంపాదకీయాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆయన స్వయంగా రాసుకున్న ‘స్వవిషయ సంగ్రహం’ అనేక కొత్త విషయాల్ని తెలియచెబుతాయి. అలాగే ఎన్నో కొత్త ఆలోచనలను రేకిత్తిస్తాయి. రైతుల గురించి, మద్యపానం, సంఘోద్ధరణ,  నిజాం సంస్కరణలు మొదలగు అంశాలపై రాసిన పుస్తకాలు సంపుటాలుగా వెలువడ్డ నాడే ఆయన సమగ్ర సాహిత్యం అందుబాటులోకి వచ్చినట్లు. ఇవేవి లేకుండా ప్రతాపరెడ్డిని సాహితీవేత్తగా అంచనా వేయడం అసమంజసం, అసంభవం.
    ఇలాంటి సందర్భంలో ‘సురవరం సమగ్ర సాహిత్యాన్ని’ అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా గత 15 యేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాను. 1998లోనే సురవరం తనయుడు శ్రీ ఎస్‌.ఎన్‌.రెడ్డిని కలిసి ఇంటర్వ్యూ చేయడమైంది. అందులో భాగంగా వివిధ పత్రికల్లో సురవరం భిన్న పార్శ్వాలపై అనేక వ్యాసాలు వెలువరించడమైంది. ‘సురవరం తెలంగాణ వ్యాసాలు’ పుస్తకాన్ని మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రచురించాము. అందుకు కొనసాగింపూ, ఒక విధంగా నూతన ఆవిష్కరణ ఈ ‘సురవరం కవిత్వం’ పుస్తకం. ఇంతవరకూ ఎక్కడా పుస్తక రూపం దాల్చని, పత్రికల ప్రతుల్లోనే మగ్గిపోయిన పద్యాలు, గేయాలు, గీతాలను, కవిత్వాన్ని ఇక్కడ ఒక్క దగ్గర చేర్చడం జరిగింది. కవిగా ప్రతాపరెడ్డి ప్రజ్ఞ ఇందులో తెలుస్తూంది.
    ఇన్నేండ్ల నుంచి లేంది ఇప్పుడే ఈ పుస్తకం ఎందుకు వస్తూంది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. 80 యేండ్లుగా ముద్దుకృష్ణ సంకలనం చేసిన ఆంధ్రప్రాంత కవుల సంకలనం ‘వైతాళికులు’ని పదుల సార్లు అచ్చేసిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఇంతవరకు తెలంగాణ ప్రాంత కవుల సంచిక ‘గోలకొండ కవుల సంచిక’ను అచ్చేయలేదు. తాము తలచుకుంటే చాలు దానికి పత్రికల ద్వారా, సదస్సుల ద్వారా విపరీతమైన ప్రచారం కల్పించేందుకు విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి ప్రచురణ సంస్థలు ప్రతిసారీ అందరికన్నా ముందుంటాయి. ప్రస్తుత సందర్భంలో ప్రత్యేక తెలంగాణ అనుకూల, వ్యతిరేక పార్టీల మౌత్‌పీస్‌లుగా పనిచేస్తున్న ఈ ప్రచురణ సంస్థలు సారంలో మాత్రం తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వైతాళికులకు వందకు తొంభై శాతం వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అలాగే వివిధ సాహిత్య పత్రికలు కూడా తగినంత గుర్తింపు తెలంగాణ వైతాళికులకు, సాహిత్యానికి ఇవ్వడం లేదు. ఇది వారి జ్ఞానంలోని ఖాళీలలకు గుర్తింపు మాత్రమే. ఈ ఖాళీలను పూరించి, తెలంగాణకు సంబంధించిన జ్ఞానాన్ని పంచే ఉద్దేశ్యంతోనే ఈ ‘సురవరం కవిత్వం’ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము. ఇది ఈనాటి ప్రయత్నం కాదు. గత 15 యేండ్లుగా తెలంగాణ సాహిత్యాన్నంతటిని వెలుగులోకి తీసుకురావాలని పడుతున్న తపనలోంచి వచ్చిన పుస్తకం. 
        లిలిలి
    తెగిస్తున్న ప్రస్తుత తెలంగాణ` మాయా, మర్మం, కుట్ర, మోసం, ద్రోహం, కుతంత్రం, పన్నాగం, స్వపక్షంలో ప్రతిపక్షం అన్నింటిని పసిగడుతోంది. అనుభవంలోకి వచ్చిన అన్యాయాల్ని ఎదిరించేందుకు, నోటికాడి బుక్క దక్కకుండా చేస్తున్న ఎత్తుగడల్ని పటాపంచలు చేయడానికి ఆయుధాల్ని తమ మూలాల్లో వెతుక్కుంటోంది. సీమాంధ్ర వలసాధిపత్య అహంకారుల ‘కొడవండ్ల’ గొడ్డళ్ళ దెబ్బకు తెగిన తల్లి వేర్లతో బంధాన్ని పునఃస్సంధానం చేసుకుంటోంది. వలసాధిపత్యంలో సర్వం దోపిడీ తప్ప ఒనగూడిరది ఏమీ లేదని ఇన్నేండ్ల సమైక్య పాలనలో అర్థమయింది. ఒక్కొక్క ద్రోహం అర్థమయిన ప్రతీసారి, అనుభవంలోకి వచ్చిన ప్రతీ మోసం పరాయి పాలకులపై కసిని మరింత పెంచుతోంది. పాలకులొక్కరి మూలంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పలేం. పాలకులకు దన్నుగా, అధికారుల వివక్షాపూరిత నిర్ణయాలు, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ‘అంతా మేమే, మీదేమి లేదు’ అనే సంకేతాలిస్తూ ఇన్నేళ్లూ వెలిగిపోయిన వలసాంధ్రుల ఆధిపత్యం మనం కోల్పోయిన వైభవాన్ని సాటి చెబుతుంది.
    ఆ వైభవానికి అక్షరరూపం కల్పించడంలో భాగంగా వస్తున్న పుస్తకం ఈ ‘సురవరం కవిత్వం’. ఈ పుస్తకం తేవడానికి ప్రధాన ప్రేరకుడు, నిజానికి సహ సంపాదకుడిగా ఈ పుస్తకానికి వ్యవహరించాల్సినంత పనిచేసిన మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి తోడ్పాటు మరువలేనిది. పుస్తకం ఎంతవరకొచ్చిందని వెంటబడుతూ, పుస్తకాన్ని తొందరగా, మేలైన రీతిలో తీసుకు రావడంలో విలువైన సూచనలు, సలహాలు అందించిన మిత్రుడు ఏశాల శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు. పుస్తకం ఈ రూపంలో రావడానికి ‘అన్ని’విధాల సహకరించడమే గాకుండా, తన సహాధ్యాయి, సురవరం ప్రతాపరెడ్డి తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి గారి నుంచి కొన్ని పద్యాలను తెప్పించి ఇచ్చిన గురుతుల్యులు కె.మదుసూధన్‌ రెడ్డి గారికి వందనాలు. నేను 1989`93 మధ్యకాలంలో ఆర్ట్స్‌ కళాశాలలో చదువుతున్న కాలం నుంచీ ఆయనంటే అభిమానమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణవాదాన్ని ఆవాహన చేసుకోవడంలో ఆయన ప్రభావం గణనీయంగా ఉంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలతో ఆనాడు నడిచిన ‘తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌’లో నేను కూడా ప్రధాన పాత్ర పోషించాను. ప్రతాపరెడ్డిగారి అముద్రిత పద్యాలు ‘సూతాఖ్యాయిక’ అందించిన సురవరం విష్ణువర్ధన్‌ రెడ్డిగారికి, పుస్తక ప్రచురణకు ప్రోత్సహించిన సురవరం పుష్పలత గారికి, తెలుగు విశ్వవిద్లాయం వైస్‌ ఛాన్సలర్‌, ప్రతాపరెడ్డిగారిపై పరిశోధన చేసిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గార్లకు ధన్యవాదాలు. ఈ పుస్తకానికి ఆర్థిక వనరుల్ని సమకూర్చి పెట్టిన పెద్దలు డి.పి.రెడ్డి గార్కి హృదయ పూర్వక నమస్సులు. గతంలో మాదిరిగానే ఈ పుస్తకానికి కూడా ఆర్థికంగా చేదోడుగా నిలిచిన మిత్రుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండే. తెలంగాణ ఉద్యమంలో తలకు మించిన భారాల్ని మోస్తూ కూడా అడిగిందే తడవుగా సమయమిస్తూ, వివిధ విషయాల్ని ఎప్పటికప్పుడు చర్చకు పెట్టే ప్రజాస్వామిక వాది శ్రీధర్‌కు నమస్తే.
    ప్రతాపరెడ్డి రచనలన్నీ రావాలని కోరుకొని ఈ కవితా సంకలనం వెలువరించడానికి విలువైన సూచనలిచ్చి ప్రోత్సహించిన ఆప్తుడు, మిత్రుడు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌కి శణార్థి. ఈ పుస్తకం ఎప్పుడొస్తుందని ఎప్పటికప్పుడు నా బద్ధకాన్ని ఒదిలిస్తూ వెంటబడి పనిచేయించిన మిత్రుడు డాక్టర్‌ గంటా జలంధర్‌ రెడ్డి, జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి గార్కి, కాసుల ప్రతాపరెడ్డి గార్కి నమస్సులు.
    ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ ప్రచురణలు, తెలంగాణ హిస్టరీ సొసైటీల్లోని మిత్రులు, వేముగంటి మురళీకృష్ణలకు థాంక్స్‌. వీరందరికీ మించి నా పుస్తకాలని అపురూపంగా కాపాడడమే గాకుండా, నేను రాసిన దానికి మొదటి చదువరి, తీర్పరి నా సహచరి స్వర్ణమంజరి. ఆమె సహకారం లేకుండా నా పరిశోధన సాగడం దాదాపు అసంభవం. ఈ అసంభవాన్ని సంభవం చేసినందుకు, చేస్తున్నందుకు కృతజ్ఞతలు. తెలంగాణ భాషను, సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్న నా పిల్లలు సిరి, శివలకు ఆశీస్సులు.

10`8`2012                                                                                                                 -సంగిశెట్టి శ్రీనివాస్

 

Foreword to the suravaram poetry being launched on 31st august 2012..

No comments: