Thursday 23 August 2012

Suravaram Prathapareddy The icon of Telanganess

సామాజికోద్యమాలకు ఊపిరులూదిన సురవరం


        తెలుగు సమాజాన్ని చైతన్య పరచడంలో సురవరం ప్రతాపరెడ్డి (1896`1953) చేసిన కృషి అపూర్వమైనది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు ఆయన అనేక మార్గాలు ఎంచుకున్నాడు. ఉద్యమకారుడిగా, సాహితీవేత్తగా, సంపాదకుడిగా, రాజనీతిజ్ఞుడిగా తనకు వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే  కొన్ని సార్లు లేని అవకాశాలు కల్పించుకుంటూ ప్రజల పక్షాన నిలిచాడు. సమాజోద్ధరణకు నడుం బిగించాడు. అన్ని వర్గాల సమూహాలతో, నాయకులతో కలిసి ఉద్యమాల్ని నిర్మించాడు. కొన్ని సార్లు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనగా మరికొన్ని సార్లు పరోక్షంగా అండదండలందించాడు. ఎటు తిరిగీ తాను చేసే ప్రతిపనీ సమాజానికి ఉపయోగపడాలనీ, తాను నేర్చుకున్నది నలుగురికి తెలియజెయ్యాలనే తపన ఆయనలో నిరంతరం ఉండేది. వివిధ ఉద్యమాల్లో మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, మాదిరాజు రామకోటేశ్వరరావు, భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, కె.రాములు, కృష్ణస్వామి ముదిరాజ్‌, యదటి సత్యనారాయణ, శ్యామరావు, జనపాల రఘురామ్‌, చెలమచర్ల రంగాచార్యులు, గుంటుక నరసయ్య పంతులు, యల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లిందల సరస్వతీదేవి, నందగిరి ఇందిరాదేవి, రంగమ్మ ఓబుళరెడ్డి మొదలైన వారి తోడ్పాటు సురవరం ప్రతాపరెడ్డికి ఉండేది. అలాగే వారు వ్యక్తులుగా సంస్థలుగా చేపట్టే కార్యక్రమాలకు ప్రతాపరెడ్డి చేదోడు వాదోడుగా నిలిచేవాడు. 
     ఆంధ్రమహాసభ, గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, బ్రహ్మసమాజం, దివ్యజ్ఞాన సమాజం కులసంఘాల స్థాపన వాటికి అనుబంధంగా హాస్టల్స్‌ ఏర్పాటు, స్త్రీ విద్య, విద్యాలయాల స్థాపన, అఖాడాల (జిమ్‌) ఏర్పాటు, అంటరానితనం నిర్మూలనం, మధ్యపాన నిషేధము, బాల్య వివాహ నిరసనము, వితంతు వివాహాలకు అనుకూలంగా, ఘోషా పద్ధతికి వ్యతిరేకంగా  మొదలైనవన్నీ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి మార్గాలుగా ఆయన ఎంచుకున్నాడు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో తన రచనల ద్వారా సాన్నిహిత్యాన్ని ఏర్పర్చుకొని వారి జీవన విధానంలో మెరుగైన మార్పులు తీసుకురావడానికి సురవరం ప్రయత్నించాడు. సురవరం ప్రతాపరెడ్డి సహవాసం చిన్ననాటి నుండి వివిధ సామాజిక వర్గాలవారితో ఉండడం దానికి తోడుగా ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే కర్నూలు ఆతర్వాత, హైదరాబాద్‌, మద్రాసుల్లో విద్యాభ్యాసం చేయడం ఆయన్ని తోటి వారి సమస్యలి సానుభూతితో అర్థంచేసుకునేవాడిగా, పూర్ణమానవుడిగా తీర్చిదిద్దిందని చెప్పొచ్చు. ఊర్లో ఉన్నప్పుడు ముస్లిములు, మద్రాసులో బ్రాహ్మణ పండితులు, హైదరాబాద్‌లో అన్ని వర్గాల వారి ఆసరా ఆయన విశాల ప్రపంచాన్ని తనదైన కోణంలో చూడ్డానికి తోడ్పడ్డాయి. 
    యాభయ్యేడేండ్ల జీవితంలో సగానికిపైగా కాలాన్ని సమాజోద్ధరణకే ఆయన కేటాయించాడంటే అతిశయోక్తి కాదు. 1924లో రెడ్డిహాస్టల్‌ నిర్వాహకుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదలు చనిపోయే ముందు రోజు ఆత్మకూరు సంస్థానంలో ప్రజల స్థితిగతుల్ని తెలుసుకునేందుకు వెళ్ళిన నాటి వరకు ఆయన విరామం లేకుండా ఉద్యమకారుడిగా జీవించాడు. 1920వ దశకంలో తెలంగాణలో తెలుగు చదువ నేర్చిన వారి శాతం మూడ్నాలుగుకు మించి లేదు. ప్రతాపరెడ్డికి మద్రాసులో చదువుకునే కాలంలో గురువు వేదం వేంకటరాయ శాస్త్రి, వారి మిత్రులు కొమర్రాజు లక్ష్మణరావుల ప్రభావంతో   గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. దీంతో తెలంగాణలో ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలంటే విద్య ఒక్కటే పరిష్కారమార్గమని ప్రతాపరెడ్డి ప్రగాఢంగా విశ్వసించారు. అందుకు తగ్గట్టుగానే విద్యాలయాలు స్థాపించాలని ప్రయత్నాలు చేసిండు. సఫలీకృతుడయ్యిండు. హైదరాబాద్‌లోని ఎ.వి. కాలేజి అట్లా ఏర్పడిరదే. ఇలాంటి చాలా సంస్థలకు ఆయన చేదోడు వాదోడుగా నిలిచాడు. విద్యాభ్యాసం కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చేవారు. అయితే వారికి సరైన భోజన వసతి సదుపాయాలు లేకపోవడంతో విద్యాభ్యాసం సజావుగా కొనసాగేది కాదు. ఈ ఇబ్బందిని దూరంచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో అప్పటి నగర కోత్వాల్‌ వెంకటరామారెడ్డి పూనిక మేరకు ‘రెడ్డిహాస్టల్‌’ ప్రారంభమైంది. దీని నిర్వాహకుడిగా ప్రారంభం నుంచి పదేళ్ళవరకు పనిచేసిన సురవరం ఒక నూతన ఒరవడిని సృష్టించి హాస్టల్‌ నిర్వహించడమేగాకుండా, దాంట్లో ఉత్తమమైన గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసిండు. చదువుతో పాటు విద్యార్థులు శారీరకంగా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో హాస్టల్‌కు అనుబంధంగా వ్యాయామశాల కూడా ఏర్పాటు చేసిండు. ఈ హాస్టల్‌ ద్వారా గుర్తింపు పొందినవారిలో కమ్యూనిస్టు యోధుడు రావినారాయణరెడిడ ప్రముఖుడు. రెడ్డి హాస్టల్‌ ఆరంభించినది మొదలు హైదరాబాద్‌ కేంద్రంగా చాలా కులసంఘాలు తమ కులం విద్యార్థుల కోసం హాస్టల్స్‌ని ప్రారంభించాయి. పద్మశాలి, మున్నూరుకాపు, వైశ్య, గౌడ, వెలమ, పెఱిక, వీరశైవ హాస్టల్స్‌ సురవరం స్ఫూర్తితో ప్రారంభింపబడ్డవే.    
     1925 మే 10న గోలకొండ పత్రిక తన పరోక్ష సంపాదకత్వంలో ఆరంభయినది మొదలు 1948 వరకు నిరంతరాయంగా తెలుగు సమాజాన్ని చైతన్య పరిచేందుకు ఆయన వెలువరించిన రచనల్లో పది శాతం కూడా ఇప్పటికీ పుస్తక రూపంలో రాలేదు. సంపాదకుడిగా తన రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఆ క్రమంలో వచ్చిన సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపించాడు. అలాంటిదే మాల`మాదిగల సమస్య. 70ఏండ్ల క్రితమే ఆదిహిందువుల పేరిట కేవలం మాలలే అధికారం పెత్తనం చెలాయిస్తూ మాదిగల్ని అణగదొక్కడాన్ని ప్రతాపరెడ్డి తన వ్యాసాల ద్వారా నిలదీశాడు. మాదిగల హక్కుల సాధనకోసం వారికి అండగా నిలిచిండు. ఇందుకు గాను మాదిగలు తమ సంఘానికి సురవరం ప్రతాపరెడ్డిని గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నారంటే ఆయన కృషిని, సేవను మనం అంచనా వేయవచ్చు. అలాగని మాలలంటే అకారణ ద్వేషం ఉండేది కాదు. ఇక్కడొక విషయాన్ని గమనించాలి.  నిష్పాక్షికత, ప్రతిభకు ప్రోత్సాహం, గుర్తింపు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. 1934 చివర్లో 354 మంది కవుల కవిత్వంతో వెలువడ్డ ‘గోలకొండ కవుల సంచిక’లో దళితుడైన అరిగె రామస్వామితో పాటుగా  మొత్తం 66 మంది బి.సి.లు, ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలున్నారు. మరో ఎనిమిది మంది మహిళలున్నారు. అలాగే మరో 15మంది పేరు తెలియని కులాల వారు కూడా ఉన్నారు. దాదాపు వీరందర్నీ అగ్రకులజేతరులుగానే పరిగణించాలి. అంటే 354 మందిలో 81 మంది ‘దళిత, బహుజన, ముస్లిం మైనారిటీ’ కవులున్నారంటే ఆనాడు ఆయన ఎంత ప్రజాస్వామికంగా కవుల్ని ఎంపిక చేసి ప్రోత్సహించిండో అర్థమైతుంది. అయితే గోలకొండ కవుల సంచిక వెలువడ్డ కొద్ది రోజులకే  ఆంధ్రప్రాంతం నుంచి ముద్దుకృష్ణ సంపాదకత్వంలో వెలువడ్డ ‘వైతాళికులు’ కవితా సంకలనంలో అప్పటికే తెలుగు సాహిత్యంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన గుర్రం జాషువాను తప్పించిండ్రు. అంటే ప్రతాపరెడ్డి ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాడో అర్థమైతుంది. తనకు మాలలంటే గౌరవమనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా చెప్పడం జరిగింది.
    1930లో మెదక్‌ జిల్లా జోగిపేటలో సురవరం అధ్యక్షతన జరిగిన ప్రథమాంధ్ర మహాసభల్లో పాల్గొనేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాడపాటి హనుమంతరావు ద్వారా ఆదిహిందూ నాయకుడు, అంబేద్కర్‌ కన్నా ముందే భారత దేశంలో దళితోద్యమ స్ఫూర్తిని ప్రోది చేసిన భాగ్యరెడ్డి వర్మకు ఆహ్వానం అందింది. బాల్య వివాహాలకు, అంటరానితనానికి, మద్యపాన సేవనానికి వ్యతిరేకంగా భాగ్యరెడ్డి వర్మ సారథ్యంలో వివిధ బృందాలు బుర్రకథలు, పాటల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేవి. ఈ సభలో కూడా పాల్గొని చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రచారం చేసే ఉద్దేశ్యంతో భాగ్యరెడ్డి వర్మ జోగిపేటకు చేరుకున్నాడు. అయితే అంటరానివాడైన భాగ్యరెడ్డి వర్మ సభకు రావడం, వేదిక మీద ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వడం సనాతనులైన కొంతమందికి నచ్చలేదు. దీనికి సదాశివపేటకు చెందిన బచ్చు రామన్న నాయకత్వం వహించి రభస సృష్టించాడు. అయితే సభకు అధ్యక్షత వహించిన సురవరం ప్రతాపరెడ్డి ఒకవైపు, మరోవైపు సంఘ సంస్కర్త వామననాయకు సభికులను శాంతపరచి సభ మధ్యనుంచి భాగ్యరెడ్డి వర్మ వచ్చేందుకు వీలుకల్పించాడు. ఇదే భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ‘ఆదిహిందూ సేవా సమితి’ దళితుల్లో భాగమైన మాదిగల పట్ల సవతి తల్లి ప్రేమ చూపించడాన్ని సురవరం ప్రతాపరెడ్డి పూర్తిగా వ్యతిరేకించాడు. ఇందుకు మాదిగలను చైతన్యవంతుల్ని చేయడంలో ఆయన చేసిన కృషి విస్మరింపడానికి వీలులేనిది. మాలలు`మాదిగల పట్ల చూపే బేధభావాన్ని ఖండిరచడమే గాకుండా వాటిపై తీవ్రంగా స్పందించేవారు. అన్యాయం ఎవరు చేసిన నిరసించేవారు. మాల జాతివారు అరుంధతీయులతో చూపు బేధభావము పేరిట 13`1`32 గోలకొండ పత్రికలో ప్రతాపరెడ్డి ఒకవార్తను ప్రచురించాడు. ఈ వార్త ఆనాడు గొప్ప కలకలము సృష్టించింది. ఆ వార్తను చదివినట్లయితే ప్రతాపరెడ్డి న్యాయదక్షత మనకర్థమవుతుంది. ‘‘ కట్టెలమండి గ్రామములో కోండ్ర బాగన్న గృహములో 23`12`31 బుధవారము రజస్వల కార్య సందర్భమున మద్యమాంసాదుల నిషేధించి సాత్విక పదార్థములచే క్యామునకు వచ్చిన వారినందరిని సన్మానించబడెను. కార్యములో మాలవారు కూడా సమ్మితులుగా నుండి సుమారు 20 మంది మాలవారు తేనీరు త్రాగిరి. అరుంధతీయుల కార్యములో మన మాలవారు తేనీరు త్రాగినారని యిరవై మందిలో నుండి 1.జీడి రామయ్య, 2. యెఱ్ఱ పోచయ్య, 3. గొట్టిముక్కల నాగయ్య ` యీ ముగ్గురిని కుల బహిష్కారము చేసి మనిషి ఒక్కటికి 6 రూపాయల వంతున మొత్తము 18 రూపాయిల సారాయితో యీ ముగ్గురిని శుద్ధి చేసి కులములో చేర్చుకొనిరి. యిది హిందూ మహానాటి వారి కుల నిర్ణయము. మరి యీ ముగ్గురికి యింత శిక్ష యెందుకై నివ్వబడినది. యని మాల కుల నాయకుని విచారించగా కుల నాయకుని జవాబు ‘‘ అయ్యా! మీ అరుంధతీయులతో కలిసి కల్లు సారాయి త్రాగితే తప్పులేదు గాని తేనీరు త్రాగితే మా కులము పోవును` అందుకే పై ముగ్గురిని కల్లు సారాయి మాంసాదులచే శుద్ధి చేసితిమి’’ అని అనిరి. 25 సంవత్సరముల నుండి ఆదది హిందూ మహానాటి నాయకులు పనిచేయు చున్నామని పొగుడుకొనుచున్న సంగతి అందరికి తెలిసిందే. తమ జాతిలో నున్న మద్యపాన పాపపు పాకురునే దిద్దుకొనలేకా మా అరుంధతీయుల యెడ పనిచేసితిమి వారు ముందుకు రారు. అనుటకు యెట్లు సాహసించి పత్రికలలో వ్రాయుచున్నారో పాఠకులే గ్రహింప గలరు. `` ఇట్లు కట్టెలమండి అరుంధతీయులు.’’
    అరుంధతీయులిచ్చిన ఈ ప్రకటనను ప్రతాపరెడ్డి అత్యంత ప్రాధాన్యత నిచ్చి ప్రచురించడమే గాకుండా మాదిగల అభ్యున్నతి కోసం జాంబవర్ణ సేవాసమితి, అరుంధతీయ సంఘాల్ని స్థాపింప చేశాడు. అరుంధతీయ సంఘాన్ని తానే ముందుండి ఎస్‌.ఆర్‌.బాబయ్య అధ్యక్షతన రెడ్డి హాస్టల్‌ ఆవరణలో 1932లో సభను ఏర్పాటు చేసిండు. ఈ సభ హైదరాబాద్‌లోని మాదిగలందరినీ కదిలించిందంటే అతిశయోక్తి కాదు. తమ అభ్యున్నతికై తోటి దళితులైన మాలలు ఏమాత్రం సహకరించని పరిస్థితుల్లో అగ్రవర్ణాల వారి సహకారంతో అరుంధతీయులు (మాదిగలు) పోరాటం చేసిండ్రు. అరుంధతీయ సంఘానికి సురవరం ప్రతాపరెడ్డిని గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రతాపరెడ్డి గౌరవాధ్యక్ష బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వారి బాగోగులకోసం కృషి చేసిండు. హైదరాబాద్‌ అరుంధతీయ మహాసభ వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలకు విశేషమైన ప్రాచుర్యం కల్పించి ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికలో ప్రచురించేవాడు. అలాగే వారి కార్యక్రమాల రూపకల్పనలో కూడా ఆయన పాలుపంచుకునే వాడంటే అరుంధతీయుల పట్ల సురవరంకున్న ఆర్తి అర్థమవుతుంది. 22`4`1937 నాటి గోలకొండ పత్రికలో ‘‘మాల మాదుగులపై గ్రామాధికారుల నిర్దయ’’ పేరిట అరుంధతీయ మహాసభ అధ్యక్షుడు యస్‌.ఆర్‌.బాబయ్య బాధిత గ్రామాల పర్యటన వివరాల్ని ప్రచురించింది. సంఘ అధ్యక్షుడైన బాబయ్యకు తెలుగులో వ్రాయడం తెలియకపోవడంతో ఆయన ఉర్దూలో ఇచ్చే ప్రకటనలను ప్రతాపరెడ్డిగారే తర్జుమా చేసుకునేవారు.
     బాబయ్య పర్యటన వివరాలను, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ప్రతాపరెడ్డి అరుంధతీయ సంఘానికి కొండంత అండగా నిలిచాడు.       ‘హజ్‌’కు వెళ్లే ముస్లిమ్‌ యాత్రికుల ఖర్చులను నిజామ్‌ ప్రభుత్వమే భరించేది. ఈ అవకాశాలను వినియోగించుకోదలచిన కొంతమంది దళితులు హిందువుల పుణ్యక్షేత్రమైన ‘కాశీ’కి వెళ్లడానికి మాకు కూడా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ముందు డిమాండ్‌ నుంచారు. దీనికంతటికి తెరవెనుక సూత్రధారి ప్రతాపరెడ్డి. 16`4`32 నాటి గోలకొండ పత్రికలో ప్రచురించబడ్డ వార్తాంశాన్ని బట్టి చూస్తే ఆదిహిందువులు కాశీకి వెళ్ళడానికి, వారివెంట ఒక బ్రాహ్మణున్ని తీసుకెళ్ళడానికి, ప్రయాణపు ఖర్చులు, కాశీలో బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణ మొదలు మొత్తం మీద మనిషి ఒక్కరికి 75 రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకొన్నారు. ఈ కాశీయాత్రకు నేతృత్వం వహించింది సుతారపు బాబయ్య. బాబయ్యతో పాటుగా దేవనపల్లి రామచంద్రయ్య, దేవనపల్లి రాజయ్య, బందల లక్ష్మయ్య, సాగల బాలయ్య, చేగూరు లక్ష్మణదాసు, ఎర్ర బాబయ్య మొదలు 15మంది దళితులు కాశీ యాత్ర చేసొచ్చారు. అదీ ప్రభుత్వ ఖర్చుతో.
       అంతకు ముందు భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన కార్యక్రమాలకు పూర్తి అండగా నిలిచింది సురవరం. భాగ్యరెడ్డి నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు ప్రతాపరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటనలున్నాయి. భాగ్యరెడ్డి వర్మ రాసిన వ్యాసాలను గోలకొండలో ప్రాచుర్యమిచ్చి ప్రచురించారు. అలాగే గాంధీని సహితం ధిక్కరించిన దళిత నాయకుడు పీసరి వీరన్న వరంగల్‌లో చేపట్టిన సేవా కార్యకలాపాలను తన పత్రిక ద్వారా ప్రయత్న పూర్వకంగా ప్రతాపరెడ్డి వెలుగులోకి తీసుకొచ్చాడు.
   ఒకవైపు దళితోద్యమాలతో సహవాసం కొనసాగిస్తూనే మరోవైపు వివిధ కులసంఘాల వారు ఏర్పాటు చేసే సభల్లో గానీ, కార్యకలాపాల్లోగానీ ప్రతాపరెడ్డి చురుగ్గా పాలుపంచుకునేవాడు. రెడ్డి హాస్టల్‌ స్థాపించిన స్ఫూర్తితో గౌడ, మున్నూరుకాపు, వైశ్య, పద్మశాలి, వెలమ హాస్టల్లు ఆరంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన చిరాగు వీరన్న తన సొంత ఖర్చుతో గౌడ హాస్టల్‌ని ఏర్పాటు చేసిండు. చిరాగు వీరన్న గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రతాపరెడ్డి వివిధ పత్రికల్లో వ్యాసాలు కూడా వెలువరించాడు. ప్రతాపరెడ్డి సూచన మేరకు ఆంధ్రపత్రిక వారు చిరాగు వీరన్న ఫోటోను తమ ఉగాది సంచికలో ప్రముఖంగా ప్రకటించారు. గౌడ్‌లలో అవిద్యను పోగొట్టడానికి చాలా కృషి చేసిండు.
    సురవరం ప్రతాపరెడ్డి మిత్రుడు గోలకొండ పత్రిక మేనేజర్‌ అయిన బొజ్జం నర్సింలు హైదరాబాద్‌లో మున్నూరుకాపుల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు. అయితే దీని వెనుక సలహాలు, సహాయ సహకారాలు సురవరం ప్రతాపరెడ్డివి. ముదిరాజ్‌లకోసం పనిచేసిన కృష్ణస్వామి, నాయిబ్రాహ్మణుల మెరుగైన జీవనం కోసం ఉద్యమాలు చేసిన జనపాల రఘురామ్‌, పద్మశాలీయుల కోసం హాస్టల్‌ ఏర్పాటు చేసిన గుంటక నరసయ్య పంతులు, బూర్గుల రామకృష్ణయ్యలు ఇలా ప్రతి కులానికి చెందిన పెద్దలు ప్రతాపరెడ్డి అండదండలతో తమ కార్యాకలాపాలు చేపట్టేవారు.
    సికింద్రాబాద్‌ కేంద్రంగా కళావంతుల సంస్కరణ కోసం, దక్కన్‌ మానవసేవా సమితి పేరిట మహాంకాళి గుడిలో జంతుబలికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన గొప్ప సంఘసంస్కర్త సిద్ధాబత్తుని శ్యామ్‌సుందర్‌. శ్యామ్‌సుందర్‌ చేపట్టే కార్యకలాపాలకు పరోక్షంగా సురవరం మద్దతుండేది. సగర వంశస్థులు 1931లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్న ‘సగర మహాసభ’ ప్రతాపరెడ్డి కనుసన్నల్లో జరిగింది. దీనికి అవుసెట్టి మంగయ్య, యదటి పుల్లయ్య, వెన్నెల బాలయ్య, యదటి సత్యనారాయణ తదితరులు అండగా నిలిచిండ్రు.
-sangishetty srinivas

No comments: