Wednesday 27 February 2013

First Rayala seema telugu katha


First Rayalaseema telugu katha




‘జిగర్‌’లో నింపుకున్న తెలంగాణ ‘మర్సియా’


    ‘జిగర్‌’లో నింపుకున్న

    తెలంగాణ ‘మర్సియా’

   
    ఇప్పటికీ తెలంగాణ ఉద్యమానికి ఒక సామూహిక ప్రతీక లేదు. సర్వజనామోదం పొందుంతుంది అనుకున్న ‘తెలంగాణ తల్లి’కి కూడా ఆ హోదా దక్కలేదు. అందులో మా కట్టు, బొట్టు కనబడతలేదని కొన్ని సామాజిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం జేశాయి. చిన్న రాష్ట్రాలవల్లే అభివృద్ధి సాధ్యమని చెప్పిన అంబేద్కర్‌, పీడిత, బహుజనుల హక్కుల కోసం కొట్లాడిన జ్యోతిబా పూలేను తెలంగాణ ప్రజలందరూ గౌరవిస్తున్నరు. వీళ్లను జాతీయ ఐకాన్స్‌గా తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. అయితే స్థానిక ‘ఐకాన్స్‌’ని తెలంగాణ ప్రజలు ఇంకా నిర్మించుకోలేక పోతున్నారు. సమైక్యవాదులందరికీ ‘మదరాసు’ రాజధాని కోసం సీమాంధ్రుల అత్యాశకు బలయిన ఓ షావుకారి ప్రతీక. తెలంగాణ వాసులందరికీ ఆమోదయోగ్యమైన ప్రతీకను వెతుక్కోవడం, ఎంచుకోవడం ఇప్పుడు తెలంగాణ ఉద్యమ అవసరం. ఈ దేవులాటలో అంబేద్కర్‌ కన్నా ముందు నుంచే ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ ప్రతిభను దేశం నలుమూలలా ప్రచారం చేసినప్పటికీ ‘భాగ్యరెడ్డి వర్మ’కు ‘ఐకాన్‌’ స్థాయి దక్కలేదు. ఆఖరు క్షణం వరకూ తెలంగాణ వాదిగా ఉండి ‘గులాంకి జిందగీ సే మౌత్‌ అచ్ఛీ హై’ నినదించిన కొండా వెంకటరంగారెడ్డి కూడా ఎవరికీ పట్టని బిడ్డ అయిండు. 1969 ఉద్యమంలో అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో తెలంగాణ ఆకాంక్షవైపు నిలిచి వెలిగిన సదాలక్ష్మి, ఈశ్వరీబాయిగానీ, చివరికి జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ కూడా సర్వ తెలంగాణ ఆమోద ‘ఐకాన్స్‌’గా నిలువలేక పోయారు. వీళ్ళంతా ఇటీవలి కాలానికి చెందిన వారు కావడం, వాళ్లు ఆమోదించిన రాజకీయాలు, ఉద్యమాలు అందరికీ సానుకూలంగా ఉండకపోవచ్చు. కొందరికి వ్యతిరేకంగానూ ఉండవచ్చు. దీంతో ‘ప్రతీక’లుగా వారికి సర్వజనామోదం లభించడంలేదు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ‘ఐకాన్‌’ని నిర్మించుకోడానికి చరిత్ర నుంచే స్ఫూర్తి పొందాలి. రుద్రమ దేవి రూపంలో ఆ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవచ్చు.
    రుద్రమ దేవికి మాత్రమే తెలంగాణ జాతీయ/స్థానిక ప్రతీకగా గుర్తింపు పొందే అర్హత ఉంది. సమ్మక్క, సారక్కలపై హింసకు దిగింది తర్వాతి తరం వాడయిన ప్రతాపరుద్రుడు. ఆయన కాలంలో జరిగిన అన్యాయాలకు కేవలం అదే వంశానికి చెందిన పాలకురాలు అన్న పేరిట పేరిట రుద్రమదేవికి అంటగట్టలేము. సువిశాలమైన, సుభిక్షమైన రాజ్యాన్ని ఆమె పాలించింది. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో తెలంగాణ సగౌరవంగా నిలిచేలా ఆమె పాలన సాగింది. సమాజంలోని బహుజన మెజారిటీకి ప్రాతినిధ్యం వహించింది. పురుషాధిపత్యాన్ని అధిగమించింది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న బుందేల్‌ఖండ్‌కు చెందిన రaాన్సి లక్ష్మీబాయికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. లక్ష్మీబాయితో పోలిస్తే ఎక్కువ భూభాగాన్ని ఎక్కువ మంది ప్రజల్ని అంతకన్నా ఎక్కువ జనామోదంతో పాలించిన రుద్రమదేవి గురించి జాతీయ స్థాయిలో ఎక్కడా సమాచారం రికార్డు కాలేదు. కాకతీయ ఉత్సవాల్లో సైతం ఆ విస్మరణ ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇంతజేసి తెలంగాణ మహిళల ఔన్నత్యాన్ని, గౌరవాన్ని, ప్రతిభను, ప్రజారంజక పాలన, పోరాట పటిమను చాటి చెప్పిన ఆమె గురించి జరగాల్సినంత పరిశోధన జరగలేదు. ఆమె చరిత్ర అంతగా వెలుగులోకి రాలేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ‘చందుపట్ల’ శాసనంతోనే ఆమె మరణతేదీ తెలియ వచ్చింది. ఇప్పుడు ఈ ఐదుగురు కవయిత్రులు కలిసి సంకలనం చేసిన ‘జిగర్‌’ ద్వారానైనా ఆమెకు సరైన, న్యాయమైన స్థానం దక్కాలి. వీరి ప్రచురణకు కూడా రుద్రమ ప్రచురణలు అనే పేరు పెట్టారు. ఆమె పాలించిన కాకతీయ సామ్రాజ్యంపై ఈ సంకలనంలో చాలా కవితలే ఉన్నాయి. కాకతీయుల వైభవంపై కరిమిళ్ళ లావణ్య, పొట్లపల్లి శ్రీనివాసరావు, వల్లంపట్ల నాగేశ్వరరావు తదితరులు కవితలు వెలువరించారు. ఇవన్నీ ఆనాటి కాకతీయుల పాలనను, చరిత్రను చిత్రికగట్టాయి. వీటిలో రుద్రమదేవి పాత్ర మరువలేనిది. అందుకే ‘‘ఏకశిలనెక్కి పారజూసిన కాకతీయ పౌరుషాన్ని/ శత్రువు పొలిమేరల్లో రగలిన అగ్ని కణాన్ని/ నేను రాణి రుద్రమదేవిని’’ అని కాసుల లింగారెడ్డి రుద్రమ్మ శౌర్యాన్ని కీర్తించిండు.
    నిజానికి ప్రతీకలు తరాలు, ఆలోచనలు మారుతున్న కొద్దీ మారుతూనే ఉంటాయి. ఏ తరానికి ఆ తరం ప్రతీకను నిర్మించుకుంటూనే సర్వజానామోదమైన శాశ్వత ప్రతీకల్ని ఏర్పాటు చేసుకోవాలి. తరాలకే గాదు, వర్గాలకు కూడా ప్రతీకలుంటాయి. ఆ వర్గ ప్రతీకలే మొత్తం జనావళి ప్రతీకలుగా గుర్తించలేము. తెలంగాణలాంటి సంక్లిష్టమైన, భిన్నమైన ఆలోచనల మేళవింపుతో ఏర్పడ్డ సమాజంలో ఇది మాత్రమే ‘తెలంగాణ ప్రతీక’ అని తేల్చి చెప్పడం కష్టం. ఊహా జనిత ‘తెలంగాణ తల్లి’ స్థానంలో రుద్రమను ఎంచుకోవచ్చు. చరిత్ర నుంచి స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడంలో భాగంగా పోరాట పటిమను, ఆత్మగౌరవ పతాకను ఎత్తి పట్టిన చైతన్య శిఖరం ‘రుద్రమ’ను తెలంగాణ  ప్రతీకగా ప్రచారం చేయవచ్చు. ఈ పనిని ఈ సంకలనం ద్వారా ముందుకు తీసుకెళ్ల వచ్చు. ఇది సాధ్యమే! కాకతీయుల వెయ్యేండ్ల పాలన ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ వాదులుగా ఆమెను ‘ఓన్‌’ చేసుకోవడం అంటేనే ఆమె పోరాట వారసత్వాన్ని కొనసాగించడమే!
    తెలంగాణ మట్టిలోనే పోరాట వారసత్వముంది. న్యాయం కోసం నిలదీసి, ఎదిరించే సాహసముంది. పీడకులను, దోపిడీ, దౌర్జన్యకారులను ప్రశ్నించే తత్వముంది. ప్రాణాల్ని పణంగా పెట్టి తెగించే ధైర్యముంది. అయితే ఆ దమ్మూ, ధైర్యం సమ్మక్క, సారక్కల కాలం నుంచీ ఈనాటి వరకు మృత్యు రూపంలో తెలంగాణను ముద్దాడుతోంది. వారి అకాల మరణాలు మనల్ని జాగృతం చేస్తూ మరింత పట్టుదలతో ముందుకు నడిచేందుకు దారి చూపుతున్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఎప్పుడూ మరణం వైపే  తెలంగాణ ఎందుకు నిలబడుతోంది. తెలంగాణ ఎప్పటికీ ‘వేదనా సాహిత్యా’న్ని సృజించాల్సిందేనా? ఇంగ్లీషులో దీన్ని ‘లామెంట్‌’ (ాశ్రీaఎవఅ్‌్ణ) సాహిత్యం అంటారు. హైదరాబాద్‌లో దీన్ని ‘మర్ఫియా’ అంటారు. ఈ ‘మాతం’కు అంతం లేదా? బహుశా ప్రత్యేక తెలంగాణ సాధన ఒక్కటే దీనికి తెరదించుతుందేమో! కాకతీయుల కాలం నాటి సమ్మక్క, సారక్కల పోరాటాలు కావచ్చు, సర్వాయి పాపన్న, నాగమ్మ, అక్కన్న, మాదన్న, సదాశివరెడ్డి, మియాసాహెబ్‌, పండుగ సాయన్న, రాంజీ గోండ్‌, తుర్రెబాజ్‌ఖాన్‌, నక్కలపల్లి రాముడు, బండ్లోల్ల కురుమన్న, కొమురం భీమ్‌, బందగీ, షోయెబుల్లాఖాన్‌,  సోయం గంగులు, బండి యాదగిరి, ఆర్యసమాజ్‌, సాయుధ పోరాట, పరకాల మృతులు, 1948 పోలీసుచర్య అమరులు, 1969 తెలంగాణ ఉద్యమ యోధులు, 1970 నుంచి నక్సలైట్‌ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు, బెల్లి లలిత మొదలు ఇవ్వాళిటి తెలంగాణ ఉద్యమంలో అమరులైన, ఆత్మ బలిదానాలు చేసిన, చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వీరి ప్రాణ త్యాగాలను, స్ఫూర్తిని, పోరాటాలను బాధాతప్త హృదయాలతో కీర్తిస్తూ ఎంతో సాహిత్యం వెలువడిరది. అట్లా రాసిందే ‘వేదనా సాహిత్యం’ దీన్నే ‘మర్సియా’ అనవచ్చు. ఆ కవిత్వం ఈ సంకలనంలో ప్రధానంగా చోటు చేసుకుంది. పోరాటంలో భాగంగా కాకుండా సహజమరణం పొందిన వారిని, వాళ్ల ఉద్యమాల్ని, సాధించిన ఫలితాల్ని పొగుడుతూ ‘స్మృతి’ కవిత్వం వెలువడుతుంది.
    ఈ సంకలనంలో నాగమ్మ, సర్వాయి పాపన్న, కొమురం భీమ్‌, బందగీ, సోయం గంగులు, సింగరేణి రమాకాంత్‌, బెల్లి లలిత తదితరులందరూ ఈ ‘మర్సిÛయా’లో భాగమయ్యారు. బహుశా ఇది తెలంగాణకే పరిమితమైన/ప్రత్యేకమైన సాహిత్యం కావచ్చు. మొహర్రం సందర్భంగా కూడా ఇలాంటి పాటలే పుట్టుకొస్తాయి.
    ‘‘గతంలోంచి వర్తమానానికి
    ప్రయాణించే వాడే అమరుడు
    అమరుని ధీరత్వాన్ని
    జనం మెచ్చుకోవడమే
    అతని మహోన్నత జ్ఞాపకం
    వీళ్లు అమరులనడానికి
    పండగలైన పల్లెలే ప్రభల సాక్షం
    .....
    కాలం మారినా జీవితాలు వాడినా
    బతుకులు దుర్భరంగా శుష్కించినా
    మీ ఆత్మార్పణని కథలుగా, గాథలుగా
    చెప్పుకుంటూనే ఉంటారు
    మీ అమరత్వాన్ని పీరీల జెండాలుగా
    ఎగిరేస్తూనే ఉంటారు’’ అని రక్తంతో తడిసిన జెండాలను ఎగరేసే జ్ఞాపకాలను, పల్లె ప్రజల బాధను ‘వీరుల పండుగ’ పేరిట ఉదారి నారాయణ రికార్డు చేసిండు. మొహర్రం సందర్భంగా ఆశన్న, ఊశన్నల తలుచుకొని వాళ్ల జ్ఞాపకాలను తలుసుకుంటూ, త్యాగాలకు వేదనతో, నివాళి, నీరాజనాలు అర్పిస్తూ పాడే పాటలు ‘మర్సియా’ సాహిత్యంలో భాగం. అలాంటి త్యాగధనులు తెలంగాణలో మొదటి నుంచీ ఉన్నారు. వీరి త్యాగాలకు ఈ సంకలనంలో బాసిత్‌, కొమర్రాజు రామలక్ష్మి, భండారు విజయ, జీవన్‌, బత్తుల దేవన్న, రత్నమాల, రాపోలు సత్యనారాయణ తదితరులు అక్షర రూపమిచ్చారు. కొమురం భీమ్‌ గురించి
    ‘‘..మావూళ్లో మా రాజ్యమని
    స్వావలంబ పతాక పాతిన
    జోడెన్‌ ఘాట్‌ వీరుడా కొమురం భీం!
    నూతన మానవ సారమైన యోధుడా!
    నువ్విప్పుడు వేలాది పోరుబిడ్డలై
    ఈ గడ్డమీద పునరుద్దిస్తావ్‌
    స్వావలంబ వట వృక్షమై నిలుస్తావ్‌’’ అని ఎం.ఎ. బాసిత్‌ ఆయన స్ఫూర్తిని ఆవాహన చేసుకుంటాడు.
‘ధీర వనిత నాగమ్మ’ గురించి కొమర్రాజు రామలక్ష్మి రాస్తూ ‘‘ప్రతి నాయకురాలిగా వక్రీకరించబడి/ కరీంనగర్‌ గడ్డపై సైతం/ వివక్ష నెదుర్కొన్న మన నాగమ్మ/ మరుగున పడిన వెయ్యేళ్ళ చారిత్రక విశేషం’’ అని యాద్జేసుకుంది.  అలాగే సర్వాయి పాపన్నను ‘‘తెలంగాణ ఛత్రపతివి/ అణగారిన జాతుల బానిసత్వాన్ని ప్రాలదోలిన వాడివి/ లండను మ్యూజియంలో చోటు సాధించిన వాడివి/ భూస్వాముల గుండెల్లో నిద్రించి/ పీడిత జనుల రాజ్యాధికార జండాను పాతినాడవు’’ అని భండారు విజయ కీర్తించింది. ‘‘...మగ్గం మీద తెలంగాణ జెండానేసి, ఎగురేసి/ పచ్చబొట్లను పొడిపించుకోవాలనుకున్న/ తొలిపొద్దులు ఉరిని ముద్దాడే ముందు/ ఊరుకొక్కసారన్న వచ్చిపోండి/ మీరు రాసిన ఆకలి అక్షరాలు/కడుపులో పిస్కుతున్నై/ తల్లెలోని బువ్వంతా కన్నీరైంది/ అమరజ్యోతులారా/ ఆగిపోయిన మీ పిడికిళ్ళను/ మశాల్లుగా మండిస్తాం’’ అని వనపట్ల సుబ్బయ్య ఒక హామి ఇచ్చిండు.
    ఇన్నేండ్లు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఒకటి రెండు లైన్లకే పరిమితమైన సోయం గంగులు ఇప్పుడు జీవన్‌ చేతిలో మళ్ళీ ప్రాణం పోసుకుండు. ‘‘ప్రజాపోరుకు భాష్యం చెప్పిన/ సమర సేనానిరా సోయం గంగులు/ నిరంకుశులపై విసిరిన అంకుశము/ శూరుడు సోయం గంగులు/ పోరు చరిత్రల చిరస్థాయిగా/ వెలుగును అమరుడు సోయం గంగులు’’ అని అక్షరీకరించిండు.
    ‘‘... తెలంగాణ రాష్ట్రానికి నెత్తుటి ముగ్గుబోసినావే/ మా అమ్మో బెల్లి లలిత/ తెలంగాణ రాష్ట్ర పోరు జెండా వైతివమ్మా/ మా చెల్లి బెల్లి లలిత’’ అని భువనగిరి ముద్దుబిడ్డ ఆట, పాటతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపిన బెల్లి లలితను యం.రత్నమాల మతికి తెచ్చుకుంది. బందగీ గురించి రాపోలు సత్యనారాయణ, సింగరేణి రమాకాంత్‌ గురించి బత్తుల దేవన్న, పల్లేరు వీరస్వామి (అమరధామము పరకాల)  రాసిన కవితలు కూడా ఈ కోవకు చెందినవే! ఇవి చూడ్డానికి స్మృతి కవితలుగానే కనబడవచ్చు. కాని కేవలం ఎలిజీలుగా వీటిని జమకట్టినట్లయితే వారి త్యాగానికి సరైన గుర్తింపు రాదు. ఆకస్మిక/ బలవంతపు మరణం కాకుండా సహజ సిద్ధంగా మరణించిన వారి స్మృతిలో రాసిన కవితలను ‘ఎలిజీ’లుగా పిలువొచ్చు. అయితే జీవితమంతా పీడిత ప్రజల పక్షాన నిలబడి, అలుపెరుగని పోరాటం చేస్తూ ఆధిపత్య శక్తుల/దోపిడీ, దౌర్జన్య శక్తుల చేతిలో అమరులైన వారిని ‘లామెంట్‌’ చేస్తూ వచ్చిన సాహిత్యాన్ని మొహర్రం సాహిత్యం మాదిరిగా ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరముంది. దాన్ని మనం ప్రస్తుతానికి ‘వేదనా సాహిత్యం’/‘మర్ఫియా’గా పిలువొచ్చు. ఈ సాహిత్యం కూడా తెలంగాణ నుంచే ఎక్కువగా వచ్చింది. సీమాంధ్ర ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సుబ్బారావు పాణిగ్రాహి, పంచాది నిర్మల తదితరులపై కొంత సాహిత్యం వచ్చింది. సమ్మక్క, సారక్క, అక్కన్న, మాదన్నలు మొదలు తుర్రెబాజ్‌ఖాన్‌, షోయెబుల్లాఖాన్‌, బండి యాదగిరి వరకు వివిధ చారిత్రక పోరాట యోధులపై 1920వ దశకం నుంచే తెలంగాణలో కవిత్వం వెలువడిరది. సురవరం ప్రతాపరెడ్డి సంకలించిన గోలకొండ కవుల సంచిక ఆ తర్వాత వెలుగు చూసిన స్రవంతి, ప్రత్యూష, ఉదయఘంటలు, తొలికారు లాంటి అనేక సంకలనాల్లో తొలి తరం తెలంగాణ త్యాగధనులను కీర్తిస్తూ బాధతప్త హృదయాలతో రాసిన కవిత్వం రికార్డయింది. ఈ పరంపర మళ్ళీ తెలంగాణ ప్రజల దురదృష్టవశాత్తు నేటి వరకూ ఏదో ఒకరూపంలో కొనసాగుతూనే ఉంది. రోజూ తెలంగాణలో బలవంతపు చావుల డప్పు మోగుతూనే ఉంది. చావు పరిష్కారం కాదు, పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకోవడం ఒక్కటే పరిష్కారమని చెబుతూ ఇప్పటికీ తెలంగాణలోని పది జిల్లాల నుంచి ప్రతి వారం ఏదో ఒక సంకలనం వెలువడుతూనే ఉంది. వరంగల్‌ నుంచి ఊపిరి వెలువడిరది. మహబూబ్‌నగర్‌ నుంచి భీంపల్లి శ్రీకాంత్‌ ‘అమరం’ వెలువరించాడు. వ్యక్తులుగా తమ స్వీయ సంపుటాల్లోనే గాకుండా సంకలనాల్లో కూడా తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన యాదయ్య, శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, ఇషాంత్‌ ఎలా ఎందరో అమరులపై కవిత్వం వందల మంది రాసిండ్రు. ఈ సంపుటంలో జ్వలిత ‘బందగీ మల్లోజుల సరసన నిలిచే/ శ్రీకాంతాచారి భోజ్యా రెడ్యానాయక్‌లు/ నా తల్లికై పోరే ముద్దుబిడ్డలు’’ అని నినదించింది. ఇదంతా వారి అమరత్వాన్ని కీర్తిస్తూనే బాధతో రాసిన కవిత్వం. అందుకే దీన్ని కేవలం ‘ఎలిజీ’లుగా ప్రకటించినట్లయితే అమరులకు సరైన నివాళి కాదు. ఎలిజీ స్థానంలో దాన్ని ప్రత్యేకంగా ‘వేదనా సాహిత్యం’గా పిలవాల్సిన అవసరం, ఆ దృష్టితో పరిశీలించాల్సిన అవసరముంది. ‘మర్ఫియా’తో పాటుగా ఎలిజీలు లేదా స్మృతి కవిత్వం కూడా ఇందులో ఉంది.
    ఈ సంకలనంలో కులీ కుతుబ్‌షా, ముద్దసాని రామిరెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, మఖ్దూం, చిందు ఎల్లమ్మ, పాకాల యశోదారెడ్డి, కొత్తపల్లి జయశంకర్‌, సామల సదాశివల స్మృతి కవితలుకూడా ఉన్నాయి.
    ‘‘కుమారగిరి సింగభూపాల
    కృష్ణరాయల రాసిక్య రచనా పల్లకీల మోతల్లో
    నువ్వు లేవు గానీ
    తరాజు ముల్లు నీవైపే
    తొలి ఉర్దూ రాజకవీ!
    .......
    నీ పేరులేని హుసేన్‌సాగర్‌ విగ్రహాల
    విధ్వంసం
    కర్హమేనంటే
    నువ్వేమంటవో గాని
    నీపేరు ఉచ్ఛరించని వాడికి
    ఈ నగరం మీద హక్కు లేదంటున్న!’’
    అని ఈ నగరం మీద హక్కు ఎవరికుంటుందో చెప్పకనే చెబుతూ హైదరాబాద్‌ నిర్మాత కులీ కుతుబ్‌షాని స్మరిస్తూ, కీర్తిస్తూ సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వమల్లిండు. స్మృతి కవిత్వంతో పాటు బతికున్న చుక్కా రామయ్యపై వరaల శివకుమార్‌ ‘తెలంగాణ రామానుజం’ పేరిట కవిత్వం రాసిండు.
    తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల ప్రాశస్త్యం, సంస్కృతి, చరిత్ర, వీరులు, సాహిత్యం, ప్రతిభ, యాది/నోస్టాల్జియా విశిష్టతను ఈ సంకలనం చాటి చెప్పింది. ఊరు జ్ఞాపకాలను, అందాలను తనివిదీరా తడిమి చూసుకున్న నోస్టాల్జియా విషయాల్ని మరొక చోటు చర్చించడమైంది. నోస్టాల్జియాతో పాటు ఇక్కడ తెలంగాణకు గర్వకారణమైన పండుగలు, గత వైభవం, ఆటలు, కళలు, కన్నీళ్లు అన్నీ ఇందులో అక్షరాకృతి దాల్చాయి. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లాల చారిత్రక వైశిష్ట్యతను చాటే కవిత్వం ఇందులో ఉంది. వరంగల్‌, నల్లగొండ, కరీంనగర్‌ చరిత్ర, సంస్కృతి, గత వైభవాన్ని గానం చేసే కవిత్వం అధికంగా ఉంది. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి అలాంటి వైభవ కవిత్వం రాకపోవడానికి గల కారణాల్ని కూడా అన్వేషించాల్సి ఉంది. ‘ఆకాశం ఆంధ్ర నేల తెలంగాణ’ అన్న ఖమ్మం నుంచీ, సెజ్‌లకు చేన్లు అప్పగించి బేదఖల్‌ అయిన రంగారెడ్డిల నుంచీ వెతికితే కవిత్వం దొరక్కపోదు. గుమ్మం పేరిట ఖమ్మం కవులు తమ జిల్లా అస్తిత్వాన్ని గానం చేసిండ్రు. ఇక ఇక్కడ చోటు చేసుకున్న జిల్లాల వారి సాంస్కృతిక అస్తిత్వానికి అవసరమైన చారిత్రక వారసత్వాన్ని రికార్డు చేశాయి. ‘‘కంద పద్యం కన్పించింది కురిక్యాలలో/ నన్నయ్య కన్నముందే/ జినవల్లభుడు కందం చెక్కిండు/ కన్నడ ఆదికవి పంపడు/ మన కొంపవాడే’’ అంటూ కరీంనగర్‌ ఖ్యాతిని ‘బృహత్కవిత’ పేరిట అన్నవరం దేవేందర్‌ చరిత్రలో శాశ్వతత్వాన్ని చేకూర్చాడు. ‘‘సాహిత్య ప్రేమికుడు ఎల్గందుల నారన్న/ మదిలోకొచ్చి కవితాత్మను వెలిగిస్తాడు/ మా ఊరి పరంధాములు నేసిన చీరె/ అగ్టిపెట్టెలో ఇమిడి/ ఖండాంతర ఖ్యాతిని మూటగట్టిన మురిపాలు/ కళామతల్లి కరీటాన్ని గర్వంగా ముద్దాడుతుంది...’’ అంటూ కరీంనగర్‌ వైభవాన్ని ఆడెపు లక్ష్మణ్‌ చెప్పిండు. ‘‘కాశీలో ఊపిరాడని సదాశివుడు/ మనసుపడీ ఇటకు వచ్చి ఉంటాడు/ పరిమళించే ప్రశాంతతకు/ మురిసి ముక్తేశ్వరుడై వెలసి ఉంటాడు’’ అని గోదావరి, ప్రాణహితల సంగమం కాళేశ్వరం గురించి కాళిదాసు చెప్పిండు. ‘కోటి కోటల విలువ మన కోటి లింగాలది’’ అంటూ మలయశ్రీ చెప్పిండు. ‘‘... మంజీర సెలిమె ఊట కరిగెడమడి/ సక్కెర పండ్ల తీపి సెర్కు జూడీల తోట/ పాలకంకుల సేను/ తీరొక్క పువ్వుల పూత మెతుకు సీమదే’’ అని మెదక్‌ తియ్యదనాన్ని డప్పోల్ల రమేశ్‌ తినిపించిండు. ‘‘వాసర వాసిని/ జ్ఞాన సరస్వతి ఒళ్ళో/ ఓనమాలు దిద్దుకుని/ దిన దిన ప్రవర్ధమాన మౌతొన్న/ అసమాన వతి నిర్మల’’ అంటూ నిర్మల్‌ చరిత్రను దామెర రాములు, జీవన విధ్వంసంపై తిరుగబడుతున్న ఉద్యమ కెరటానివి అని కుంతల (ఆదిలాబాద్‌) గురించి నూటెంకి రవీంద్ర రాసిండ్రు. ‘‘చార్మినార్‌ ముందు గడియారం/ పేదవాని గుండెలాగా పనిచేస్తనే వుంటది/ చార్మినార్‌ మైసమ్మ గుడిగంట/ అజాతో పాటు మోగుతూనే వుంటది’’ అని హైదరాబాద్‌ తెహజీబ్‌ని అక్షరీకరించాడు. అలాగే ‘‘రంజానూ బోనాలు చూడకపోతే/ భిన్నమతాలు కలిసి బతికే సంస్కృతికి/ ఆనవాళ్ళు దొరికేవి కాదు’’ అని ఇక్కడి జీవితాల్ని ఆశారాజు కవిత్వంగా అల్లిండు. ‘‘అందాల చిందు ఎల్లవ్వ చందం/ ధ్వనించే, గజ్జెల కంకణ ద్వయం’’ అంటూ ఇందూరు వైభవం పేరిట వి.త్రివేణి కవిత్వమల్లింది. ‘‘మాకు ఒక ఆకాశం వుంది/ మాది పాలమూరు తల/ మాది పాలమూరు ఆకాశం/ తలమీద తట్టైన ఆకాశం’’ అంటూ పాలమూరు వలసబతుకుల గోసను జనజ్వాల వినిపించిండు. జ్ఞాపకాల కొండ పేరిట నల్లగొండ బతుకు గోసను నిఖిలేశ్వర్‌, కడుపుల పెరిగె పిండానిక్కూడా ఫ్లోరైడ్‌ ఒక గండమైంది అని పి. యాదగిరి రాసిండు. 
    తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ, బోనాలకు సంబంధించిన కవిత్వముంది. తంగెడుపూల గురించి ఎన్‌.గోపీ, నుమాయిష్‌ గురించి ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ భాషపై నలిమెల భాస్కర్‌, హుస్నాబాద అంగడి గురించి నాంపల్లి సుజాత, తెలంగాణ ఎవుసం గురించి పప్పుల రాజిరెడ్డి, అజాంజాహి మిల్లు గురించి పారిపెల్లి రవీందర్‌ రాసిండ్రు. వీటన్నింటిలోనూ తెలంగాణ సంస్కృతి, కనుమరుగవుతున్న వారసత్వం, మాయమవుతున్న జ్ఞాపకాలు, జీవితాలు రికార్డయ్యాయి. వృత్తుల మీద కూడా ఇందులో మంచి కవితలున్నాయి. పత్తిపాక మోహన్‌ పద్మశాలి వెతల పాలవుతున్న పద్మశాలి బతుకులపై, వృత్తిని నమ్ముకొన్న జీవితాలపై ఏనుగు నరసింహారెడ్డి గుండెల్ని పిండే కవిత్వం రాసిండ్రు. ‘‘తెలంగాణ వస్తదని తెగించి గొంతెత్తవే/ ఆకురాలు పాలనలో ఆమనివై రాగదే/ వేపచేదు బతుకు నుంచి తీపి పాట పాడవే/చిన్ని చిన్ని చెల్లెలో చిన్నారి నా చెల్లెలా అని వరవర రావు పిలుపునిచ్చిండు. ఈ పిలుపుకు ప్రతిస్పందనగా అన్నట్టుగా ఈ సంకలనం వెలువడిరది.   
    తెలంగాణ మహిళా చైతన్యానికి, సాహితీ ప్రతిభకు, పట్టుదలకు ఈ సంకలనం అక్షరరూపం. రెండున్నర దశాబ్దాల క్రితం తనను తాను తెలుసుకుంటున్న స్త్రీ సమాజం ‘మనకు తెలియని మనచరిత్ర’ పేరిట చాకలి అయిలమ్మతో పాటు అనేకమంది సాహస నారుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చింది. అట్లాంటి పనే తెలంగాణ ధృక్కోణంతో ఈ సంకలనం కూడా చేసింది. లేకుంటే అందెశ్రీ ‘తెనుగోల్లా ఎల్లమ్మా’, కాలువ మల్లయ్య ‘తెలంగాణ‘అవ్వ’, అలిశెట్టి ప్రభాకర్‌ ‘భాగ్యలక్ష్మి’లకు ఇందులో స్థానం దక్కేది కాదు. గ్రామీణ జీవితంలో శ్రమైక సౌందర్యానికి, ఆర్థిక స్వయంప్రతిపత్తికీ, అడవికీ`ఊరుకీ వారధిగా నిలిచిన ‘బంటోల్ల ఎలమ్మ’ ఆగమౌతున్న బతుకుని అందెశ్రీ అక్షరబద్దం చేసిండు. అలాగే ‘బెటర్‌ హాఫ్‌’ భాగ్య లక్ష్మి మీద కవిత్వమల్లుతూ
    ‘‘కలగా పులగంగా కలసిపోయిన రోజుల్లో
    ఇంచుమించు ఒకే కంచంలో
    ఇంద్రధనస్సుల్ని తుంచుకుని తిన్న రోజుల్లో
    మా గుండెల్లో సమస్యలు మండని రోజుల్లో
    సిగరెట్‌ పీకలాంటి నన్ను
    సిగలో తరుముకొని
    గాజు కుప్పెల్లాంటి నా కళ్ళలోనే
    ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్ప
    తులతూగే ఐశ్వర్యమో
    తులం బంగారమో కావాలని
    ఏనాడూ ప్రాధేయ పడలేదు’’ ఆమె గొప్పదనాన్ని చెప్పిండు.
    కాలువ మల్లయ్య తెలంగాణ అవ్వను ఆమె కరుణను, ఆప్యాయతను, జేబులు కాకుండా కడుపును చూసే తీరుని తలుసుకుండు.
    ‘‘గోచీ పెట్టి కట్టిన ఎనిమిది గజాల చీర
    తలమీద శిఖరమోలె ముడిసిన శిగ
    కాళ్ళు చేతులకు వెండి కడాలు
    ముక్కుకు ముక్కెర చెవులకు గంటీలు
    కారుణ్యం నిండిన కరుణామయమైన ముఖ వర్చస్సు
    ఇంటి కొచ్చినవారి కడుపు చూసే కరుణార్ద్రత
    మాతృత్వం మూర్తీభవించిన ముఖ కవళికలు
    అభయ హస్తమిచ్చే ఆర్ద్ర హృదయం
    మాతృస్వామ్య వ్యవస్థలోని మమకారం
    ఇవన్నీ రంగరిస్తే మా అవ్వ తెలంగాణ’’ అని అవ్వని గానం చేసిండు. తెలంగాణ తల్లినీ, ఔన్నత్యాన్ని ఎంత పొగిడినా తక్కువే! అయితే సమ్మక్క, సారక్కల సాలు, సాయుధ పోరాట పటిమ ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కొరవడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ చరిత్ర, సాయుధ పోరాట మహిళా చరిత్ర ఎంతో కొంత రికార్డయినప్పటికీ ప్రత్యేకమైన తెలంగాణ మహిళా ఉద్యమాల చరిత్ర ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరముంది. తొలి తెలుగు రాజులు శాతవాహనులు తమ తల్లులపేరిటనే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అని వ్యాప్తిలో ఉండేవారు. అంతకుముందే గుణాడ్యుడి ‘బృహత్కథ’లోనే ఎందరో మాతృమూర్తుల చరిత్ర ఉంది. శాతవాహనుడి పట్టమహిషి మలయవతి, ఆ కాలం నాటి బాలశ్రీ, గౌతమి, దేవి నాగానిక, బోధిశ్రీ, రాణి వాసిష్టదేవిల గురించి క్లుప్తంగా నైనా తెలుగువారికి తెలియని స్థితి, మైలాంబ, కామసానమ్మ మేలాంబిక, సోమాంబ రాణి రుద్రమదేవిల శాసనాలు చరిత్రావశేషాలు గాకుండా విశిష్టమైన తెలంగాణ ఆనవాళ్లుగా రికార్డు చేసుకోవాల్సిన అవసరముంది.   తెలుగులో తొలిసారిగా పద్యం రాసిన గోన బుద్ధారెడ్డి కూతురు ‘కుప్పాంబిక’ గురించి ఇంకా పరిశోధనలు జరగాలి. సమ్మక్క, సారక్కలతోపాటుగా పాపన్నపేట రాణి శంకరమ్మ గురించి, మాచాల్దేవి, పురంద్రీ, బాలనాగమ్మతో పాటు ధర్మాంగధ చరిత్రలోని ధర్మపురి ‘సత్యవతి’ గురించి కూడా తెలుసుకోవాలి.
    ఈ సంకలనంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఉర్దూలో తొలి కవిత్వమల్లిన కుతుబ్‌షా గురించి రాసిండు. అయితే అదే ఉర్దూలో మొట్టమొదటి సారిగా కవిత్వం సృజించిన మహలఖాబాయి చాందా గురించి విదేశస్థులు పరిశోధనలు జరిపి అనేక కొత్వ విషయాలు. ఆమెపై పరిశోధనలు చేసిన వారి కృషిమేరకే అమెరికా ప్రభుత్వం హైదరాబాద్‌ (మౌలాలి)లోని ఆమె సమాధిని రక్షించడానికి, ఆమె ఉపయోగించిన ఎఫ్లూలోని ‘బాయి’ని చారిత్రక కట్టడంగా రక్షించడానికి ఆర్థిక సహాయం చేస్తోంది. ఇంత జరుగుతున్నా సీమాంధ్ర ప్రభుత్వం మాత్రం అది తమకు సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా చోద్యం చూస్తోంది. ఈనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతం మొత్తం ఒకప్పుడు ఆమె జాగీరు గ్రామం. అయినా ఉస్మానియాలో ఆమెపైన ఇంతవరకూ ఎలాంటి పరిశోధన జరగలేదు.
    ఆధునిక కాలంలో మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అనస్తీషియాకు సంబంధించిన విద్యను  ఇంగ్లండ్‌, జర్మనీల్లో నిజాం ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదివిన రూపాబాయి ఫర్దూంజీ, 1907 నాటికే మహబూబియా స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన జర్మనీ మహిళ, ఆమె ఆనాటి ముస్లిం, దేశ్‌ముఖ్‌ల బాలికల్ని అభ్యుదయ పథంవైపు నడిపిన తీరు, జజ్జీఖానాలో డాక్టర్లుగా పనిచేసిన ఇంగ్లండ్‌ మహిళా డాక్టర్లు వారితో పాటు పనిచేసిన తెలుగు డాక్టర్‌ వరలక్ష్మమ్మ, సరోజిని నాయుడు, ప్రిన్సెస్‌ నిలోఫర్‌, ప్రిన్సెస్‌ దుర్రెషెవార్‌, సాహితి విదుషీమణి రూప్‌ఖాన్‌పేట రత్నమాంబ దేశాయి, సామాజిక కార్యకర్త బత్తుల సుమిత్రాదేవి, అహల్యాబాయి  మల్లన్న, సదాలక్ష్మి, రంగమ్మ ఓబులరెడ్డి, పద్మజానాయుడు, సుగ్రాహుమాయున్‌ మీర్జా, కుముదినీ దేవి, రోడా మిస్త్రీ, ఈశ్వరీబాయి, హెడ్డా, నందగిరి ఇందిరాదేవి, సాయుధ పోరాటం చేసిన కోయ పాపక్క, లంబాడి లచ్చక్క, ఇట్లా కొన్ని వందల సంఖ్యలో ఆధునిక కాలంలో తెలంగాణలో మహిళాభ్యుదయానికి  కృషిచేసిన వాండ్లు ఉన్నారు. సంస్థాన పాలకుల్లో కూడా మహిళలే ఎక్కువ. తమ ప్రాంత చైతన్యంలో ఆ యా సంస్థానాధీశుల పాత్ర కూడా మరవలేనిది. కేవలం వ్యక్తులుగానే గాకుండా ఆంధ్ర యువతీ మండలీ, ఆంధ్ర సోదరీ సమాజం, ఆంధ్ర మహాసభలు`మహిళలు, కమ్యూనిస్టు ఉద్యమం`మహిళలు, వివిధ బాలికా పాఠశాలలు వాటి కార్యకలాపాలు, బతుకమ్మ పాటల్లో నక్క ఆండాళమ్మ ఇవన్నీ ఈనాటి తెలంగాణ సమాజానికి తెలియాల్సిన విషయాలు. వీటిని మహిళలే నడుంగట్టి గ్రూపులుగా ఏర్పడి ప్రణాళికబద్దంగా వెలుగులోకి తీసుకురావాలి. 60 యేండ్ల తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికీ కమ్యూనిస్టులు రాసిన విస్మరణ చరిత్రనే చదువుకోవడం వల్ల మన ప్రత్యేకత, విశిష్టత స్మరణకు నోచుకోకుండా పోయింది.
    కమ్యూనిస్టులు హైదరాబాద్‌లో సైతం ‘మోటూరు ఉదయం’ పేరిట భవంతులు నిర్మించుకుంటారు. కాని ఈ కవిత్వ సంకలనంలో కొలిపాక శోభారాని స్మరించుకున్న ‘‘ తన ఇంటిని పంటనూ కాపాడుకొనే క్రమం/ తొడగొట్టి ఎదురొడ్డి.... నిల్చింది...పాలకుర్తి అయిలమ్మ/ అణచివేత ప్రజలను అనివార్యంగా  ఉద్యమాల వైపు నడిచింది/ సంఘపోల్లను ఆదరించి అన్నంబెట్టన అన్నపపూర్ణ/ జడవక, వెరువక పట్టు పడక... కట్టుగా నిలిచింది గెలిచింది/ కంగునా కంచుగంటోలె మోగింది/ పాలకుర్తి కోడలమ్మ/ చిట్యాల అయిలమ్మ/ గురించి ఈ కమ్యూనిస్టు సంఘాలు ఎన్నడూ గుర్తుంచుకోవు. వారి పేరిట ఏ భవంతినీ నిర్మించబోరు.
    1969 ఉద్యమంలో అమరులైన మహిళలు/ బాలికలు కూడా ఉన్నారు. పోరాటం చేసిన దేవకిదేవి  లాంటి వాళ్లూ ఉన్నారు. ఈనాడు అన్ని విశ్వవిద్యాలయాల్లో ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్న విద్యార్థినులున్నారు. చివరికి ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన మహిళలు కూడా ఉన్నారు. వీరి చరిత్రను తర్వాతి తరాల వారికి అందించి మనమూ చరిత్రకు ఎక్కదగిన వారమే అని నొక్కి చెప్పాల్సిన అవసరం నేటి తరం పరిశోధకులు, బుద్ధిజీవులపై ఉన్నది.
    చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందాల్సిన అవసరముందని భావించి పాత తరం వారి రచనలు కూడా ఇందులో సంపాదకులు చేర్చారు. వాటిలో ముఖ్యంగా కాళోజి నారాయణరావు, చెరబండరాజు, దాశరథి, మఖ్దూం మొహియుద్దీన్‌, నిఖిలేశ్వర్‌, కృష్ణమూర్తి యాదవ్‌, పాకాల యశోదారెడ్డిల కవితలున్నాయి. ఇందులోని కాళోజి కవిత మినహా మిగతావన్నీ తెలంగాణ ఔన్నత్యాన్ని చాటేవే. తెలంగాణ విశిష్ట సంచికలో రజాకార్ల గురించి రాసిన కవిత కాకుండా కాళోజి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాసిన వందకు పైగా కవితల్లోంచి ఏది తీసుకున్న న్యాయంగా ఉండేది. అలాగే ఆయన తెలంగాణ విశిష్టతను ఇనుమడిస్తూ రాసిన కవితలు కూడా ఉన్నాయి. అలా గాకుండా ఎన్నో చర్చోపచర్చలకు తావివ్వడమే గాకుండా బిజేపీ లాంటి పార్టీలు రజాకార్ల పాలన వస్తుందంటూ ముస్లిములను ప్రస్తుత సందర్భంలో కూడా విమర్శిస్తూన్న కారణంగా అందుకు భిన్నమైన భావజాలంతో పనిచేస్తున్న ఈ సంపాదకులు ఆ కవితను తీసుకోకుండా ఉండాల్సింది. 1948లో కవిత రాసిన నాటికీ ఈనాటికీ ‘రజాకార్ల’ విషయంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనేక పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. ఈ వెలుగులోకి వచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకొని అటు రజాకార్ల దుర్మార్గాన్ని, అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారత ప్రభుత్వ మిలిటరీ దురాగతాలను కూడా నిలదీయాలి.
    దాశరథి, మఖ్దూంలు తెలంగాణ ఔన్నత్యాన్ని తమ కవితల్లో చాటారు. ఈ సంకలనంలో గత వైభవాన్ని, పురాస్మృతుల్ని తాజా చేసుకుంటూ రాసిన విలువైన కవిత్వం కూడా ఉంది. అందులో కృష్ణమూర్తి యాదవ్‌ ముందువరుసలో నిలబడతాడు. అందుకే బహుశా ఆయన ఇప్పుడు జీవించి లేకపోయినా ఆయన కవిత్వాన్ని తీసుకున్నారు. ‘ఊరు  పికాసో చిత్రం’ పేరిట రాసిన ఈ కవితలో ‘‘ఊరు పక్కనే / వాలిన నెలవంకలా చెరువు/ అందులో పూసిన మల్లె మొగ్గలు కొంగలు/ కొంచెము దూరాన జొన్నకర్రల చేన్లు/ జనం జండాలు పట్టుకొని నిలబడినట్లు/ మోటబావి నీళ్ళు/ బొక్కెనలో ప్రాణం పోసుకొని/ గలగల నవ్వేసి/ పొలంతల్లి ఒడిలో నిద్రపోతాయి’’ అని చెప్పిండు. ఇప్పుడు మోటబావి, బొక్కెన రెండూ కనబడకుండా పోయాయి.
    నల్లగొండ బిడ్డడు అంబటి వెంకన్న తన జిల్లా గోసను, గొప్పతనాన్ని ‘నను గన్న పల్లె’ పాటలో చెప్పిండు.         ‘‘సోగుబడ్డ కొండలు నిండ భోనగిరి వేములకొండ
    కొండమీద పేర్చిన గుండ్లు చెరువు గట్టు మూడు రాళ్ళు
    సెరికల్లో దాగిన శివుడమ్మో ఈ జడగట్టి ఎత్తుకున్నాడా
    నీలగిరి కొండలు రెండు నింగినెపుడు వంచుతునుండు
    ఆ మెడలో బంగారు హారం మెరిసేటి దేవరకొండ
    కులమత బేధం లేకుండా ఈ కూడుండే సంపద నిచ్చేనవే’’ అని నల్లగొండ జిల్లా ఔన్నత్యాన్ని గానం చేసిండు. అలాగే కేతిరెడ్డి యాకూబ్‌రెడ్డి
    ‘‘దసర పండుగ నాడు పాలపిట్టను జూసి
    జమ్మి సేతులపెట్టి వంగి దండం బెట్టి
    అలాయి బలాయి అందరమూ తీసుకొని
    మంత్రనగర మాయెనే నా పల్లె
    మనసు సింగిడేసేనే..’’ అంటూ పల్లెకు దండం బెట్టిండు. బండ సరోజన ‘‘మారుమూల నా ఊరు మనసైన నా ఊరు/ చుట్టూరా చింతచెట్టు చూడముచ్చటూన ఊరు/ ఎల్లంబావి నీళ్లతోని ఎదనింపిన నా ఊరు / కళకళలాడుతూ కనులకు విందుగూర్చు నా ఊరు’’ అంటూ, సన్నాయిల  కృష్ణవేణి ‘‘ నాపల్లె సౌరభించిన సిరిమల్లె/ఓరుగల్లు సిగలో విరిసిన ఎర్రమల్లె/ తన బిడ్డల్ని ఊతంగా ఇచ్చి / విప్లవానికి ఊపిరూదిన పెద్దతల్లి నా భట్టుపల్లి’’ అంటూ తమ ఊరి  జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు.
    తెలంగాణ మొత్తం మీద కాసుల లింగారెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి లాంటి వాండ్లు కవిత్వ మల్లిండ్రు. జిల్లాల నుంచి ఊర్ల వరకూ అన్ని ప్రాంతాల ఔన్నత్యాలపై కవులు అక్షరదీపం వెలిగించిండ్రు. నిత్యం తెలంగాణ కోసం తీరొక్క రీతిలో కొట్లాడుతుండ్రు. ఇవ్వాళ తెలంగాణ బిడ్డలు సామూహిక ఆకాంక్షను సంయమనంగా వ్యక్తం జేస్తున్నరు. తెలంగాణలోని ప్రతి పల్లెలో, ప్రతి ఇంట్లో జై తెలంగాణ నినాదం వినపడుతోంది. దాదాపు ప్రతి ఊరు నుంచి సాహిత్య సంపుటాలు/సంకలనాలు వెలువడ్డాయి. ఆ యా గ్రామాల వారిగా ఘన చరిత్రను తవ్వుకుంటున్నారు. గానం చేస్తున్నారు. ‘రింగ్‌ టోన్ల’యి వినిపిస్తున్నారు. యే ఊరి బస్సు ఎక్కినా సెల్‌ఫోన్ల నుంచి పాటలు చైతన్యాన్ని పంచిపెడుతున్నాయి. ‘ఛా..ల్‌’ అంటూ పాటకు కోట్ల మంది ‘జైకొట్టి’ కోరస్‌ అయితుండ్రు. ‘ధూం ధాం’లయి అడుతుండ్రు. వీటికి తోడు వేలరీ (ాఙaశ్రీశీబత్ణీ) పర్యటనలు పెరిగిపొయ్యాయి. అంటే యోద్ధుల ముఖ్యంగా పోరాట యోధుల స్మరిస్తూ వారు పుట్టిన ఊరును, సమాధిని, నడయాడిన ప్రదేశాన్ని దర్శించడం పెరిగి పోయింది. ఇది ప్రతి తెలంగాణ వాడిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తోంది. తెలంగాణ ప్రతి పల్లె నుంచి సాహితీ/కళాకారుడు ఉద్యమ దివిటీలై వెలుగుతుండ్రు. తెలంగాణ హృదయాంతరాల్లో గూడుగట్టుకున్న సాంస్కృతిక వైభవాన్ని, కళల్ని, కన్నీళ్ళని కైగట్టి ‘జిగర్‌’ ద్వారా పంచుతున్నరు అనిశెట్టి రజిత ఆమె సహసంపాదకులు. ఇందులో మహిళా ధృక్కోణంలో అవసరమైన తెలంగాణ ఆవిష్కరించబడిరది.
    ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రజలు చేపట్టని పోరాట రూపం లేదు. ఓపికతో, ధైర్యంతో కొసకంటూ కొట్లాడాలంటూ ఇక్కడి ప్రజలు వేల రోజుల నుంచి దీక్షలు చేస్తుండ్రు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, బుద్ధిజీవులు, కవులు, రచయితలు అందరి కృషి మూలంగా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయపార్టీలు డిసెంబర్‌ ఏడు, 2009న సమావేశమై ప్రత్యేక తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని తీర్మానించిండ్రు. ఈ తీర్మానాన్ని శిరసావహిస్తూ కేంద్ర ప్రభుత్వం తరపున అప్పటి హోంమంత్రి  చిదంబరం డిసెంబర్‌ తొమ్మిది, 2009న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. అయితే ఢల్లీిలో మాట ఇచ్చి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత కుట్రాజకీయానికి అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య తెరదీస్తూ సమైక్యవాది చంద్రబాబుతో కలిసి ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాలాడిరచారు. సీమాంధ్రల్లో కృత్రిమ అలజడిని సృష్టించారు. దీంతో కేంద్రం తమ మనసు మార్చుకొని పార్లమెంట్‌లో ఇచ్చిన మాటను మార్చుకుంది.   మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునే భారతదేశంలో కొంతమంది వ్యక్తులు కూడబలుక్కొని, అలజడి ద్వారా పార్లమెంట్‌లోని ప్రకటన మార్పించగలిగిండ్రు అంటేనే మన ప్రజాస్వామ్యంలోని డొల్లతనం బయటపడిరది.అన్ని పార్శ్వాల నుంచి ఆలోచించి తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్‌లో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అట్లాంటి నిర్ణయం కూడా అమలులోకి రాకుండా పోయింది అంటే ఇవ్వాళ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తుందా లేదా కొంతమంది వ్యక్తుల ఇష్టాఇష్టాల మేరకు పార్లమెంట్‌ నడుస్తుందా అనే అనుమానం ఈ పరిణామాలు చూస్తే సామాన్య మానవునికి కూడా సంశయం కలుగుతుంది. ఈ సంశయం నివారణ జరగాల్సిందే! తెలంగాణను ‘సమస్య’గా కాకుండా ‘పరిష్కారం’గా ఆలోచించాల్సిందే!!
    రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పి, పార్లమెంట్‌లో ప్రకటన చేసీ వెనుకడుగ వేయడంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమిజెయ్యాలి అనే కూడలిలో ఉన్నారు. ఈ రోజే (డిసెంబర్‌ 28, 2012) తెలంగాణపై మరోసారి ఢల్లీిలో అఖిలపక్షం సమావేశం కానుంది. ఇందులో ఎవరేం చెబుతారో, మరెన్ని కొత్త కుట్రలకు తొవ్వలేస్తరో తెలియదు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆశించిన ఫలితం రాకపోవడంతో యువత నక్సలిజం వైపు మళ్ళిండ్రు. ఆ కడుపుకోతను ఇప్పటికీ తెలంగాణ అనుభవిస్తూనే ఉంది. పోరాట వారసత్వం, తెగించే ధైర్యం ఉన్న తెలంగాణ ప్రజలు ‘ఎక్స్‌ట్రీమ్‌’గా ఆలోచించక ముందే ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలి. 
    తీరొక్క రీతిలో 56 యేండ్ల సంది ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడుతున్న ప్రజల ముందు ఇప్పుడు ‘తెలంగాణ దేశం’ డిమాండ్‌ చేయడం ఒక్కటే పరిష్కాం మార్గమని కందుకూరి శ్రీరాములు చెప్పిండు. ఇది లిటరల్‌గా సాధ్యం కాకపోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమోదం కూడా ఉండబోదు, సెడిషన్‌కూ దారి తీయవచ్చు. అయితే అందులో తెలంగాణ ప్రజల ఆగ్రహం, కేంద్ర ప్రభుత్వ ఊసరవెల్లి రాజకీయాల పట్ల నిగూఢంగా దాగి ఉన్న నిరసన, కమిటీలంటూ కాలయాపన చేసే తీరుపై వ్యతిరేకత వ్యక్తమైతుంది. అందుకే
    ‘‘ఇక
    అసెంబ్లీ తీర్మానాలు
    పార్లమెంటు బిల్లులు అఖ్కర్లేదు
    ఇకనుండి రాష్ట్ర ప్రభుత్వమూ
    కేంద్ర ప్రభుత్వంతో సంబంధమూ లేదు
    ఒక దేశానికి మరో దేశానికున్న
    అనుబంధమో బంధుత్వమో మొదలవుతుంది
    ఒకడు ఇచ్చేది లేదు ఒక చచ్చేది లేదు
    సపరేట్‌ రాష్ట్రం కాదు కోరుకునేది
    దేశం కావాలని కోరుకోవటమే..! కొట్లాడటమే..! అన్నీ అయిపోయి ఆఖరి అస్త్రం వాడుతున్న సందర్భమిది.  అంటే తెలంగాణ ప్రజలకు భారత రాజ్యాంగంపై, పార్లమెంటుపై, రాష్ట్రపతిపై విశ్వాసం సడలక ముందే కేంద్ర హోంమంత్రి డిసెంబర్‌ పదినాడు పార్లమెంటులో ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి తీరాలనీ ఇవ్వాళ తెలంగాణ ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తోంది. ఆ డిమాండే ఈ సంకలనంలో అక్షరరూపం దాల్చింది. తెలంగాణ ప్రజల హృదయాంతరాలను సంపాదకులు ‘జిగర్‌’ ద్వారా వినిపించారు. అందుకు వారందరికీ అభినందనలు.. మాట రాసేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు శనార్థి..

తేది: 28-12-2012                                 -సంగిశెట్టి శ్రీనివాస్‌

Tuesday 26 February 2013

తెలంగాణ చరిత్రపై వెలుగు రేఖలు

తెలంగాణ చరిత్రపై వెలుగు రేఖలు

నేటి కాలంలో పరిశోధన అనేది ‘థాంక్ లెస్’ జాబ్. అయినా తెలంగాణ అస్తిత్వ ఉద్యమ స్పృహతో ఈ పనిని సమర్థవంతంగా చేస్తున్న విమర్శక, పరిశోధకుడు సుంకిడ్డి నారాయణడ్డి. తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని ‘ముంగిలి’ పేరిట చరివూతకెక్కించిన సుంకిడ్డి ఇటీవలి రచన ‘తెలంగాణ చరిత్ర. విశ్వవిద్యాలయా లు, ప్రభుత్వ అకాడమీలు, పరిశోధక బృందాలు కలిసి, విడివిడి గా చేయాల్సిన పనిని ఈయన ఒంటిచేత్తో చేశాడు. గతంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్’ పేరిట నాలుగు భాగాల్లో స్వాతంవూత్యోద్యమ చరివూతను రికార్డు చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ చరివూతను ప్రత్యేకంగా రాసిన వారు లేరు. ఆంధ్రవూపదేశ్ చరివూతలో భాగంగా అనుబంధాలకు, ఉప శీర్షికలకు, పుట్‌నోట్స్‌కు మాత్ర మే పరిమితమైన చరివూతను ఒక్క దగ్గరకు తీసుకొచ్చి భవిష్యత్ పరిశోధకులకు దిశానిర్ధేశం చేసిన మార్గదర్శి సుంకిడ్డి నారాయణడ్డి. ఆయన వేసిన దారి భావి పరిశోధనలకు రహదారి. ఆంధ్ర మహాసభల తొలి అధ్యక్షుడిగా ఆ ఉద్యమం ఊపందుకోవడానికి అచ్చంగా సురవరం ప్రతాప్‌డ్డి కూడా ఇదేపని చేసిండు.సురవరం ప్రతాప్‌డ్డి మొదట ‘గోలకొండ కవుల’ సంచిక, తర్వాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాల్ని వెలువరించాడు. సుంకిడ్డి కూడా ‘ముంగిలి’ పేరిట గోలకొండ సంచికలో కూడా లేని వందలమంది కవుల్ని మన ముందట పెట్టిండు. అలాగే ఆంధ్రుల సాం ఘిక చరివూతలో కూడా చోటు చేసుకోలేకపోయి న వాకాటాకుల గురించి ‘తెలంగాణ చరిత్ర’ లో రికార్డు చేసిండు. నిజానికి సురవరం ప్రతాప్‌డ్డికి పత్రికా సంపాదకత్వం వల్లనైతేనేమి, ప్రతిభ వల్లనైతేమి చాలా పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు అడిగిందే తడవుగా ఆయనకు అందుబాటులో వచ్చేవి. అలాంటి సదుపాయాలు, వనరులు లేకపోయినప్పటికీ సుంకిడ్డి తన పరిశోధన ప్రతిభతో అద్భుతమైన గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందచేసిండు. అందుకే ఆధునిక సురవరం- సుంకిడ్డి.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో సైతం ఇక్కడి చారివూతకాంశాలపై సరైన పరిశోధన జరగకపోవడానికి ప్రధాన కారణం సమాచార అలభ్యత. సమాచారమే అరకొరగా ఉన్నప్పుడు దానిపైన విశ్లేషణ, విమర్శ కూడా ఆ నిష్పత్తిలోనే ఉంటుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ చరివూతను సాధికారికంగా, సమక్షిగం గా రికార్డు చేసిండు. సుంకిడ్డి లెఫ్ట్, రైట్ భావజాలంతో సంబం ధం లేకుండా ప్రతి ఒక్కరూ విస్మరించిన ‘అసఫ్‌జాహీల’ కు ఒక చాప్టర్ కేటాయించి ఆనాటి పరిణామాలను ఇందులో విశ్లేషించాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపుమీదున్న ప్రస్తుత సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం, విస్మరించడం కత్తిమీద సాము లాంటిది. ఏకావూమనాథ చరివూతలో ‘మొల్ల’ తెలంగాణ కవయివూతిగా రికార్డయ్యింది. అయితే ఈ పుస్తకం కాకతీయుల అనంతరం రెండువందల సంవత్సరాల తర్వాత రాసిండ్రు. కాబట్టి ఇందులోని విషయాలకు ఆధారాలు లేవని నిరాకరిస్తూ, ఆమెను తెలంగాణ మహిళగా పేర్కొనలేదు. అలాగే నాయకురాలు నాగమ్మది కరీంనగర్ జిల్లా అని ఇటీవల కాలంలోని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కూడా విశ్వసనీయమైన ఆధారాలు లేవు అన్న కారణంగా ఆమెను కూడా తెలంగాణ మహిళగా పేర్కొనలేదు. అంటే రాగద్వేషాలకు అతీతంగా, నీరక్షీర వివేకంతో సుంకిడ్డి ఈ పుస్తకాన్ని రాసిండనడానికి ఇంతకంటే వేరే దృష్టాంతాలు అవసరం లేదు.

శాతవాహనులు ఆంధ్ర ప్రాంతం వారు అని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఈ పుస్తకం ద్వారా తిప్పికొట్టిండు.‘నాగబు’ మొదటి తెలుగు పదంకాదు అనే విషయాన్ని ‘తెలంగా ణ చరిత్ర’ ద్వారా విస్తృత ప్రచారంలోకి తీసుకొచ్చా డు. మద్రాసు, హైదరాబాద్ ఆర్కయివ్స్‌ని విస్తృతం గా వినియోగించుకున్నప్పటికీ ఈ పుస్తకం ప్రధానంగా సెకండరీ సోర్సెస్ మీద ఆధారపడి రాసిన గ్రంథం. అయితే సుంకిడ్డి చూపించిన మార్గం లో వెళ్ళి ఒక్కొక్క చాప్టర్‌ను ఒక్కో సంచిక (గతంలో వెలువరించిన రెడ్డి, కాకతీయ, శాతవాహన సంచికల మాదిరిగా)గా వెలువరించాలి. ఇందులో ప్రస్తావనకు వచ్చిన రుద్రమదేవి, సమ్మక్క, సారమ్మ, రాణి శంకరమ్మ, సదాశివడ్డి, భాగ్యడ్డి వర్మ, షోయాబుల్లాఖాన్ తదితరుల గురిం చి ప్రత్యేక జీవిత చరివూతలు వెలువడి నట్లయితే దాంతో సమగ్ర తెలంగాణ చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఇందులో లేని దళిత హీరో జంబన్న, రూపాబాయి ఫర్దూంజీ లాంటి వారి చరివూతలు కూడా సమగ్ర చరివూతకు దోహదం చేస్తాయి.

ఇంతవరకూ ఆంధ్రవూపదేశ్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు తెలంగాణను ఒక అనుబంధ చాప్టర్‌గా మాత్రమే చదువుకున్నారు. ఇప్పుడందరికీ ఈ పుస్తకం పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరముంది. అంతేకాదు ఈ పుస్తకం చదివిన చరివూతాభిమానులందరికీ తన్ను తాను తెలుసుకుంటున్న తెలంగాణ గురించి కూడా అవగతమౌతుంది. తెలంగాణ వ్యతిరేకులు తమ జ్ఞానంలోని ఖాళీలను పూరించుకునేందుకు, తెలంగాణాభిమానులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఈ పుస్తకాన్ని చదవాలి.
-సంగిశెట్టి శ్రీనివాస్

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

komuraiah-doddiఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొమురయ్య.సామాజిక తెలంగాణ అన్నా, వీర తెలంగాణ అన్నా, బహుజన తెలంగాణ అన్నా, అందరికీ ముందుగా యాదికొచ్చేది దొడ్డి కొమురయ్య. జూలై 4 అమెరికాకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేస్తామనిప్రకటించిన డెడ్ లైన్ డేట్. వీటన్నింటికీ మించి వెటి ్టనుంచి భూస్వామ్య పీడన నుంచి విముక్తి కోసం దొడ్డి కొమురయ్య అమరుడైన రోజు జూలై 4, 1946.ఇవాళ ఆయన 65 వ వర్దంతి. భూమికోసం, భుక్తికోసం, శాంతియుతంగా సభలు సమావేశాల ద్వారా చేస్తున్న పోరాటాన్ని సాయుధ మార్గం పట్టించింది కొమురయ్య అమరత్వమే.
ఒకప్పటి నల్లగొండ జిల్లా నేటి వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకాలోని మొత్తం 60 గ్రామాల్లో విసునూరు దేశ్‌ముఖ్‌దే ఇష్టా‘ రాజ్యం’.దోపిడీ, హింసకు ఆయన గడీ కేంద్రంగా ఉండింది.

దేశ్‌ముఖ్ తల్లి జానకమ్మ కొడుకును మించిన క్రూరత్వాన్ని ప్రదర్శించేది. దేశ్‌ముఖ్ 60 గ్రామాల్లో ఒకటైన కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికేవారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో చైతన్యవంతులైన ప్రజలు ‘సంగం’గా ఏర్పడ్డారు. కడి 20 మంది సభ్యులతో గ్రామదళం ఏర్పడింది. దీంతో.. జానకమ్మ దొరసాని సంఘం నాయకులపై అక్రమ కేసులు పెట్టించింది. సంగం సభ్యులు జైలు పాలైండ్రు. అయినా పోరాటం ఆగలేదు.లేవీ ధాన్యం వసూలు కోసం దేశ్‌ముఖ్‌ల తొత్తు పోలీస్ బలగాలు కడి ఇల్లిల్లూ సోదాచేసి తిండి కో సం ప్రజలు దాచుకున్న ధ్యాన్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలే కరువుకాలం. అధికారులు బలవంతంగా ధాన్యాన్ని కొలుచుకుపోవడాన్ని ప్రజలు సహించలేకపోయారు. కడి దొరఇంట్లో గరిసెల్లో ధాన్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా,వారు ఏర్పాటు చేసిన విందారగించి పేద ప్రజల తిండిగింజలు లాక్కోవడాన్నివ్యతిరేకించారు. ప్రజలు సంఘటితమై ముందుగా దొర గడీని తనిఖీ చేయాలని తహసీల్దార్ మీద వత్తిడి చేసిండ్రు. అంతేగాకుండా అధికారులు కడి గ్రామ ప్రజల నుంచి జప్తు చేసుకున్న లేవీ ధాన్యాన్ని కూడా తిరిగి ప్రజలు పంచుకున్నరు. ఇది అవమానంగా భావించిన జానకమ్మ తమ గూండాలను విసునూరు,పాలకుర్తి ప్రాంతా లనుంచి రప్పించింది. మస్కీన్ అలీ, అబ్బాస్‌అలీ, గడ్డం నరసింహాడ్డిలాంటి గూండాల్ని ప్రజలపై దాడికి ఉసి గొల్పింది.

గూండాల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని, ప్రభుత్వం లేవీ ధాన్య సేకరణ ఆపాలనే డిమాండ్‌తో సంగం సభ్యులు గ్రామంలో ఊరేగింపు తీయాలని నిర్ణయించారు. అప్పటికప్పుడే గ్రామ ప్రజలందరూ బొడ్రాయి దగ్గరికి ‘ఆంవూధమహాసభకి జై ’ దేశ్‌ముఖ్ గుండాయిజం నశించాలనే నినాదాలిస్తూ ఊరంతా తిరుగుతూ ఊరేగింపు తీసిండ్రు. విషయం తెలిసిన కొమురయ్య తింటున్న అన్నాన్ని సగంలోనే వదిలేసి ఊరేగింపులో కలిసిండు. పెద్ద ఎత్తున ప్రజలు కదిలి రావడతో దిక్కుతోచని దేశ్‌ముఖ్ గుండాలు ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిండ్రు కాల్పుల్లో గ్రామ దళసభ్యుడైన, దొడ్డి కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య కాలుకు తుపాకి తూటా తగిలింది.మరో 20 మందికి పైగా గాయపడ్డారు. దీంతో కోపోవూదిక్తుడైన కొమురయ్య దొరల గూండాలను నిలదీసిండు. ఈ సారి గూండాలు చేసిన కాల్పుల్లో తూటాలు యువకుడైన దొడ్డి కొమురయ్య పొట్టలోంచి దూసుకు పోయినయి. ఆయన అక్కడికక్కడే చనిపోయిండు.

మంగలి కొండయ్య అనే మరో సంగ సభ్యుడికి నుదుటిపై బలమైన గాయం కాగా, ఆయన సోదరుడు నరసయ్య చేయికి గాయమైంది. అయినా ప్రజలు పారిపోకుండా బజారంతా రక్తసిక్తమైనా నినాదాలు చేస్తూ సంఘటితంగా నిలిచిండ్రు. వీరిని చెదరగొట్టడానికి విసునూరు దేశ్‌ముఖ్ కొడుకు ‘బాబుదొర’ రెండువందల మంది సాయుధులైన గుండాలను తీసుకొచ్చినప్పటికీ ప్రజల గుత్పల ధాటికి తాళలేక పరారైండ్రు.
భూమికోసం, భుక్తికోసం, వెట్టినుంచి విముక్తి కోసం జరిగిన పోరులో దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యిండు. సభలు, సమావేశాల ద్వారా, శాంతి వచనాల ద్వారా భూస్వాములు దారికి రారని ప్రజలు తెలుసుకున్నరు. ప్రభుత్వం, అధికారులు , దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లకు తొత్తులేనని అర్థం చేసుకున్నరు.ఈ చైతన్యంతోనే.. ఆంధ్రమహాసభలోని అతివాదులు కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడి సాయుధ పోరాటాన్ని నడిపిండ్రు. ఈ సాయుధ పోరాటానికి నాంది పలికింది దొడ్డి కొమురయ్య అమరత్వమే. వెనుకబడిన గొల్లకులంలో పుట్టిన కొమురయ్య మరణానంతరం ఎంతో మంది ఆయన స్ఫూర్తితో ఉద్యమంతో మమేకమైండ్రు. దోపిడీ దారుల గుండెల్లో గునపాలయ్యిండ్రు.

1946లోని దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని గొల్లకురుమలు ఊరేగింపు తీశారంటే వారి చైతన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణా సమాజానికి సాయుధ పోరాటానికి పాదులు వేసిన దొడ్డి కొమురయ్య విగ్రహం ట్యాంక్‌బండ్ మీద పెట్టాలని తెలంగాణ వాదులందరూ డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించు కోవడంలేదు. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాధించుకొని నిజమైన నివాళి అర్పిద్దాం.
-సంగిశెట్టి శ్రీనివాస్;

Bhagya reddy verma: The dalith icon

దళితోద్యమ వేగుచుక్క భాగ్యడ్డి వర్మ

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు వేసిండు. ఇదే 1913 నాటికి మాన్యసంఘంగా మారింది. అంబేద్కర్ కన్నా ముందు భారతదేశం గర్వించతగ్గ దళిత నాయకుడు. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగే సభలకు ముఖ్యఅతిథిగా హాజరై తన ఉపన్యాసాల ద్వారా దళితోద్యమ కార్యకర్తలను చైతన్య పరిచిండు. భారతదేశంతో పాటు ఆంధ్రవూపాంతంలో కూడా దళితోద్యమాలకు దారులు వేసిండు. వినూత్న రీతిలో ఆయన తీసుకొచ్చిన చెతన్యం భవిష్యత్తరాలను తీర్చిదిద్దింది. దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి, నిర్వహించాడు. భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికలకు సంపాదకత్వం వహించి అనేక రచనలు చేసిండు. 1911లో దేవదాసీ (జోగిని) నిర్మూలన సంఘాన్ని, 1912లో స్వస్తిదళ్ స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటుచేసి ప్రజాహిత కార్యక్షికమాలు చేపట్టిండు. రెడ్‌క్రాస్ సొసైటీ మాదిరిగా నడిచిన ఈ సంస్థ హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు అనా థ శవాలను తొలగించి, నగరాన్ని పరిశువూభంగా ఉంచినందుకు గాను నిజాం ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించిం ది. సేవా పతకాలను అందజేసింది.

అనేక సంస్థలు స్థాపించి ఇటు అనంతపురం నుంచి అటు అమలాపురం వర కు, లక్నో నుంచి ఔరంగాబాద్ వరకు (హైదరాబాద్, తెలంగాణ సరేసరి) ఆయన అనేక సభల్లో సభాధ్యక్షుడిగా, ముఖ్యఅతిథిగా హాజరయ్యిండు. ఆయన విజయవాడ వస్తుండని తెలియడంతో దళితులు బలవంతంగా ఎక్కడ దుర్గ గుడిలో ప్రవేశిస్తారో అన్న భయంతో పూజారులు గుడిని మూసేశారంటే ఆయన ప్రభావం అర్థమవుతుంది. అంతెందుకు ఉన్నవ లక్ష్మినారాయణ రాసిన మాలపల్లి నవలకు స్ఫూర్తి భాగ్యడ్డి వర్మ. అందులో హీరో భాగ్యడ్డి వర్మే. తాము పంచములం కాము ఈ దేశ మూలవాసులం, ఆదిహిందువులం (మతానికి సంబంధం లేదు) అని నినదించిండు. విజయవాడలో మొదట పంచమ మహాసభ అని ప్రారంభించి సాయంవూతానికి అది ఆదిహిందూ మహా జనసభగా మారేలా చేసిండు. ఈ విజయవాడ సభనే మొత్తం తెలుగునాట దళిత చెతన్యానికి పునాదులు వేసింది.

ప్రస్తుత ఆంధ్రవూపదేశ్ అంతటిలో మొట్టమొదటిసారిగా దళితుల సంఘటిత సమావేశం 1917 నవంబర్ 4,5,6 తేదీల్లో విజయవాడలో జరిగింది. ఈ సభకు ఆంధ్రవూపాంతంలోని అన్ని జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి హైదరాబాద్ నుంచి వచ్చిన భాగ్యడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. ఇందులో భాగ్యడ్డి వర్మతో పాటు హైదరాబాద్, తెలంగాణ జిల్లాలకు చెందిన దళిత కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మొదట ఈ సభను ప్రథమ ప్రాంతీయ పంచమ మహాసభ పేరిట విజయవాడ టౌన్ హాల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. సంప్రదాయ వాదుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు టౌన్‌హాల్‌లో సభను నిర్వహించడానికి అనుమతి నిరాకరించారు. దీంతో మైలవరం రాజాకు చెందిన డ్రామా హాల్‌లో సభ జరుపుకున్నారు. అయితే సాయంత్రం అయ్యే సరికి తాము పంచములం కాము ఆది హిందువులం ‘ఈదేశ మూలవాసులం అని ఉద్ఘాటిస్తూ సమావేశం పేరును ప్రథమ ఆది హిందూ మహాజన సభ పేరిట జరుపుకున్నారు. అందుకు ప్రధాన కారణం భాగ్యడ్డి వర్మ తన ప్రసంగంలో పంచములు అని ఏ శాస్త్రంలోనూ లేదు. ఆత్మన్యూనతతో కాదు మనం ఈ దేశ మూలవాసులుగా ఆత్మగౌరవంతో బతకాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు సభలో ఒక తీర్మానం కూడా చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని గౌరవిస్తూ పంచమ పదాన్ని తొలగిస్తూ 25 మార్చి 1922లో 817 జీవోను విడుదల చేసింది. ఈ సమావేశంలో ఆదిహిందువులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. దళిత విద్యార్థులకు అందరితోపాటు చదువుకునే అవకాశం కల్పించాలని, మాల, మాదిగ పల్లెల్లోనే పాఠశాలలను ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కూడా తీర్మానాలు చేశారు.

ఈ చారివూతాత్మక సభ ఏర్పాటుకు గూడూరు రామచంవూదరావు, చుండ్రు వెంకయ్య తదితరులు పూనుకున్నారు. ఈ సమావేశంలోనే పశ్చిమగోదావరి జిల్లా పిప్పరకు చెందిన మంగిపూడి వెంకటశర్మ రాసిన నిరుద్ధ భారతం పుస్తకం విడుదల చేశారు. ఈ సమావేశం తెలుగునేలపై దళితోద్యమాలపై వేసిన ప్రభావం అత్యంత ప్రభావశీలమైనది. మూడ్రోజుల పాటు ఈ సమావేశాలు జరగ్గా ఆ మూడు రోజులు విజయవాడలోని దుర్గ గుడి తలుపులు మూసి ఉంచారు. సమావేశానికి హాజరైన దళితులు దుర్గగుడిలోకి చొచ్చుకువచ్చే అవకాశం ఉందని ఏకంగా గుడినే మూసేశారు. ఈ సమావేశం వల్ల ప్రభావితుడెన ఉన్నవ లక్ష్మినారాయణ మాలపల్లి నవల రాసిండు. ఈనవల్లో హీరో భాగ్యడ్డి వర్మే. అలాగే కుసుమ ధర్మన్న (1900‘1946) కూడా మా కొద్ది నల్లదొరతనము అనే కవితా పుస్తకాన్ని 1921లో అచ్చేశాడు. విజయవాడ సభ స్ఫూర్తితో వరుసగా ఆంధ్రవూపాంతంలోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయి.

ఒక వైపు నిరంతరం సభలు సమావేశాలు అంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూనే తాను పుట్టి పెరిగిన హైదరాబాద్‌లోని దళిత బస్తీల్లో మద్యపానం వల్ల కలిగే నష్టాలను బు‘రకథలు, హరికథల ద్వారా ప్రచారం చేసేవాడు. ఈ నాటకం చూడ్డానికి వచ్చే ప్రేక్షకులకు వాటి ప్రదర్శన కన్నా ముందూ తన ఉపన్యాసాల ద్వారా వారిలో చెతన్యం తీసుకురావడానికి ప్రయత్నించేవాడు. బస్తీల్లోని ప్రజల్లో తాగుడు మాన్పించేందుకు ఆయన ఒక వినూత్న ప్రయోగాన్ని చేసి సఫలీకృతుడయ్యాడు. రోజూ ఎక్కడో ఒక దగ్గర బస్తీల్లోని కూలీలు పని చేసుకునేవారు. ఐదారు కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసే ఒక ప్రదేశానికి వెళ్ళి ప్రతి కుటుంబం రోజూ తమకు వచ్చే ఆరణాల కూలీలో ఒక అణా మాకు చందాగా ఇవ్వాలని కోరాడు. కూలీలు మొదట కొంత తటపటాయించినా భాగ్యడ్డి వర్మ వారిని ఒప్పించి తలా ఒక అణా పైసని వారి నుంచి వసూలు చేసిండు. ఇలా నెల రోజులు వరుసగా వసూలు చేసి ఆ డబ్బుతో 31వ రోజు ఒక తులం బంగారం కొని వాటితో పుస్తెలు చేయించి చిన్న సమావేశం ఏర్పాటు చేసి అందులో తాళి కట్టించేవాడు. దీంతో అణా పైసలు తక్కువ కావడంతో వారు ఆమేరకు కల్లు, సారాయి తాగడం మానేయడమే గాకుండా నెల రోజు ల తర్వాత తులం బంగారం దక్కించుకుండ్రు. ఇలాంటి కార్యక్షికమాలు భాగ్యడ్డి వర్మ హైదరాబాద్, సికింవూదాబాద్‌లోని అనేక బస్తీల్లో విజయవంతంగా నిర్వహించిండు.

దళితుల అవస్థలకు అవిద్యే ప్రధాన కారణమని భావించి విద్యారంగంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేసిండు. హైదరాబాద్‌లోని గణేశ్‌మల్ సింఘ్వీ, వామన నాయక్ లాం టి వితరణ శీలుర ప్రోత్సాహంతో తానే వివి ధ ప్రదేశా ల్లో దళిత బాల, బాలికల కోసం పాఠశాలలు నెలకొల్పిండు. ఈ దశలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు వాటిని సవ్యంగా నడిపించే షరతుమీద పాఠశాలల నిర్వహణ బాధ్యతను భాగ్యడ్డి వర్మ నిజాం ప్రభుత్వానికి అప్పజెప్పిండు. ఆ పాఠశాలలే పష్తక్వామ్ పాఠశాలలుగా ప్రసిద్ధి. భాగ్యడ్డి వర్మ ఆర్యసమాజ్, బ్రహ్మసమాజ్ అన్నింట్లో పాలు పంచుకొని అవి ఏవి దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని భావించి చివరికి బుద్ధిజం పట్ల మక్కువ చూపిండు. దాన్నే ఆచరించిండు. ప్రతి యేటా పెద్ద ఎత్తున బుద్ధ జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించేవాడు. చివరికి తన కొడుక్కు గౌతమ్ అని పేరు పెట్టుకుండు.

తెలుగునాట దళితోద్యమానికి దారులు వేసి వేగుచుక్కై వెలిగిన భాగ్యడ్డి వర్మ గురించి ఏ తరగతి పాఠ్యపుస్తకంలోనూ సమాచారం లేదు. ఆంధ్రవూపాంతంలో డజనుకు పైగా వార్షిక సభలకు అధ్యక్షుడుగా హాజరై అనేకమంది అనుచరుల్ని సంపాదించికున్నాడు. అయినప్పటికీ అటు ఆంధ్రవూపాంతంలోనూ, ఇటు హైదరాబాద్‌లోనూ ఒక్క విగ్రహమూ లేదు. వచ్చే సంవత్సరం భాగ్యడ్డి వర్మ 125వ జయంతి. ఆ సందర్భంగానెనా దళితులు, సామాజిక కార్యకర్తలు పూనుకొని ఆయనపై పోస్టల్ స్టాంప్ వచ్చే విధంగా, ట్యాంక్‌బండ్‌తో పాటు హైదరాబాద్‌లోని కూడలి ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని నిలబెట్టాలి. అంతేగాదు అందుబాటులో లేకుండాపోయిన ఆయన నడిపిన పత్రికలు భాగ్యనగర్, ఆదిహిందూలను సేకరించి వాటిల్లోని ఆయన రచనలను సంకలనాలుగా అచ్చేయించాల్సిన అవసరముంది. ఇదే ఆ మహానాయకుడికి మనమిచ్చే నివాళి.
-సంగిశెట్టి శ్రీనివాస్

Other Articles in namaste telangana daily