Monday 4 March 2013

Kothwal Venkata ramireddy and his contribution to the press

కోటి ఆలోచనలకు ప్రాణంపోసిన కొత్వాలు

తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి పునాది శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ స్థాపన. చదువుకున్న నలుగురు చైతన్యవంతులున్న తెలంగాణలోని ప్రతి ఊరిలోనూ 1950ల వరకూ గ్రంథాలయాల ఏర్పాటు అనేది ఒక తప్పనిసరి ప్రక్రియగా ఉండిరది. ఈ గ్రంథాలయాలే తర్వాతి కాలంలో రాజకీయ చైతన్యానికి పునాదిగా నిలిచాయి. గ్రంథాలయాలు కేవలం కూడలి కేంద్రంగా కాకుండా రోజువారి దేశీయ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు చర్చించుకునే రచ్చబండలుగా ఉండేవి. తొలి దశలో తెలంగాణాలో పుస్తక/పత్రిక ప్రచురణ తక్కువగా ఉండడంతో ఈ గ్రంథాలయాలు ఆంధ్రప్రాంతానికి చెందిన వీరేశలింగం, గురజాడ అప్పారావుతో పాటుగా కొమర్రాజు లక్ష్మణరావు తదితరుల రచనలు తెప్పించేవి. కొన్ని గ్రంథాలయాలకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఉచితంగా ఆంధ్రపత్రికను పంపించేవారు. అయితే గ్రంథాలయాలు పెరగడంతో పాటు దానికి ప్రేరణగా పత్రికల స్థాపన జరిగింది. ఇవన్నీ కలగలిసి నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం  స్థాపనకు దారి తీసింది. అది తర్వాతి కాలంలో నిజాం రాష్ట్రాంధ్ర మహాసభగా మారడం జరిగింది.
గ్రంథాలయాలు పెరగడం, దాంట్లో చదవడానికి పత్రికలు అవసరం కావడంతో 1922లో నల్లగొండ నుంచి నీలగిరి పత్రికను షబ్నవీసు వెంకటరామనరసింహారావు, తర్వాత వరంగల్‌్‌ జిల్లా ఇనుగుర్తి నుంచి ఒద్దిరాజు సోదరులు తెనుగు పత్రికను స్థాపించి నిర్వహించారు. ఇవి రెండూ తెలంగాణ ప్రజల్లో ఒకవైపు రాజకీయ చైతన్యం, మరోవైపు సాహిత్య సృజనకు ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1925లో సురవరం ప్రతాపరెడ్డి హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్‌ నిర్వాహకుడిగా హైదరాబాద్‌లో ఉండేవాడు. అప్పటికే మద్రాసులో చదువుకోవడమే గాకుండా వేదం వెంకటరాయశాస్త్రి లాంటి వారి శిష్యరికం, అక్కడి నుంచి వెలువడుతున్న ఆంధ్రపత్రిక, 1924 నుంచి భారతి పత్రిక తెలుగు సమాజంపై వేస్తున్న గాఢమైన ప్రభావాన్ని సురవరం ప్రతాపరెడ్డి చాలా దగ్గరి నుంచి చూసిండు. తాను చదువుకున్న ‘లా’ చదువు కేవలం రెడ్డి హాస్టల్‌ వార్డెన్‌కు మాత్రమే పరిమితం కావడం ప్రతాపరెడ్డికి ఇష్టం లేకుండేది. అందుకే తెలంగాణలో ప్రజా చైతన్యం కోసం, ఆత్మగౌరవం కోసం, మహారాష్ట్రీయుల, ముస్లిముల ఆధిపత్యాన్ని ఎదుర్కునేందుకు, తెలంగాణలోని తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఒక పత్రిక స్థాపన అవసరమున్నదనే విషయాన్ని తనను హైదరాబాద్‌లో ఉండేందుకు వత్తిడి తెచ్చి కృతకృత్యుడైన రాజబహద్దూర్‌ వెంకటరామారెడ్డితో చెప్పిండు. నిజానికి ప్రతాపరెడ్డికి విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వారపత్రిక నడపాలని కోరిక ఉండేది. దానికి ‘దేశబంధు’ అనే పేరు పెట్టాలని కూడా తన డైరీలో రాసుకున్నాడు.
ఒక వైపు 1922 నుంచే ‘రెడ్డిరాణి’, ‘మాతృసేవ’ తదితర ఆంధ్రప్రాంత పత్రికల్లో ప్రతాపరెడ్డి వెలువరించిన రచనలు ఆయనకు యావదాంధ్రలో మంచి పేరు తీసుకొచ్చింది. మరోవైపు రెడ్డి హాస్టల్‌ నిర్వహణ ఒక్కటే తనలోని జ్ఞానతృష్ణను తీర్చబోదని తెలుసుకున్నాడు. దీంతో పత్రికస్థాపన అంశంపై దృష్టి కేంద్రీకరించి తరచూ రెడ్డిహాస్టల్‌ అధ్యక్షులు రాజబహదూర్‌ వెంకటరామారెడ్డితో ప్రస్తావించేవాడు. దీనికి కొత్వాలు వెంకటరామారెడ్డి కూడా సూత్రప్రాయంగా అంగీకరించాడు. ఎందుకంటే తాను గతంలో లింగ్సూగూర్‌, యాద్గీర్‌, ఔరంగాబాద్‌, గుల్బర్గా తదితర ప్రదేశాల్లో పనిచేసినపుడు తన వృత్తిలో భాగంగా పత్రికలు ప్రజలపై వేసిన ప్రభావాన్ని గ్రహించాడు. అందునా అది నిజామాబాద్‌ అయినా, హైదరాబాద్‌ అయినా కార్యాలయాల్లో, కోర్టుల్లో, వివిధ అధికార భవనాల్లో కేవలం ఉర్దూ పత్రికలు కొన్ని చోట్ల ఇంగ్లీషు పత్రికలు మాత్రమే ప్రాచుర్యంలో ఉండడాన్ని కొత్వాలు గ్రహించాడు. తెలంగాణలోని తెలుగు ప్రజలకు ప్రభుత్వంలో జరుగుతున్న విషయాల్ని తెలియజెప్పడానికైనా, ప్రజలు ఏమి కోరుతున్నారో ప్రభుత్వం తెలుసుకోవడానికైనా ‘తెలుగు పత్రిక’ అవసరమున్నదనే విషయాన్ని నమ్మాడు. సురవరం ప్రతాపరెడ్డి లాంటి సమర్ధుడైన నిర్వాహకుడు లభించడంతో తాను ఆశించిందే, ఆయన కోరుకున్నడు కాబట్టి పత్రిక స్థాపన సాధ్యమయింది.
పత్రిక స్థాపించినట్లయితేనే తాను హైదరాబాద్‌లో ఉంటానని లేనట్లయితే తానిక్కడ ఉండడంవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కొత్వాలుతో సురవరం చాలా సార్లు చెప్పిండు. దీనికి కొత్వాలు వెంకటరామారెడ్డి కూడా సూత్రప్రాయంగా అంగీకరించి దానికి తగిన సమయం కోసం ఆలోచిస్తూ ఉండేవాడు. ప్రతాపరెడ్డిని హైదరాబాద్‌లో నిలిపి ఉంచినట్లయితే కేవలం రెడ్లకే గాకుండా మొత్తం తెలంగాణ సమాజవికాసానికి ఉపయోగంగా ఉంటుందని భావించి ఆ మేరకు ప్రతాపరెడ్డికి హామీ కూడా ఇచ్చాడు.
హామీ మేరకు వనపర్తి సంస్థానాధీశులు, పింగళి వెంకటరామారెడ్డి తదితర ఏడుగురి నుంచి తలా వేయి రూపాయలు సేకరించి మొత్తం ఏడువేల మూడు వందల రూపాయలు ప్రతాపరెడ్డికి అప్పజెప్పి ముద్రణాయంత్రం ఖరీదు చేసేందుకు మద్రాసుకు పంపించారు. పత్రికను ఆర్థికంగా ఆదుకున్న వారిని రాజపోషకులు, పోషకులు, అభిమానులుగా విభజించి వారిచ్చిన విరాళాల ఆధారంగా గుర్తింపునిచ్చేవారు. మద్రాసు నుంచి తీసుకొచ్చిన ముద్రణా యంత్రాన్ని మొదట రెడ్డిహాస్టల్‌ భవనంలోనే ఏర్పాటు చేయాలని భావించారు. ఈ రెడ్డిహాస్టల్‌ ఉన్న ప్రదేశం రెసిడెన్సీ కిందికి రావడంతో అక్కడి అధికారులు ప్రతాపరెడ్డిలోని తిరుగుబాటు భావజాలాన్ని సాకుగా ఎంచుకొని పత్రిక స్థాపనకు అనుమతి నిరాకరించారు.
పత్రిక స్థాపనలో కీలక వ్యక్తి కొత్వాలు వెంకటరామారెడ్డి కావడంతో అందుకు అనుమతి సునాయసంగా దొరుకుతుందని ప్రతాపరెడ్డి విశ్వసించాడు. అయితే రెసిడెన్సీ ప్రాంతంలో అంటే బ్రిటీష్‌ వారి అజమాయిషీ, అధికారం, న్యాయం, చట్టం, రక్షణ అమల్లో ఉన్న కోఠీ, ఆబిడ్స్‌, ఇసామియా బజార్‌లలో బ్రిటీష్‌ వారి పాలన సాగేది. అక్కడ పత్రికకు అనుమతి లభించడం కష్టం కావడంతో పత్రిక కార్యాలయాన్ని వేరే ప్రదేశానికి మార్చారు. అప్పుడు పత్రికను నిజాం పాలిత మురళీధర్‌బాగ్‌ (ట్రూప్‌ బజార్‌కు సమీపంలో)లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పత్రిక పేరులో ‘ఆంధ్ర’ అని ఉన్నట్లయితే అంత సునాయసంగా అనుమతి నిజామ్‌ అధికారుల నుంచి కూడా దొరకవనే గత అనుభవాలున్నాయి. దీంతో చివరికి పత్రిక పేరును ‘గోలకొండ’ గా పెట్టారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ సంబంధించినదిగా, ఆత్మగౌరవ ప్రతీకగా, హిందూ`ముస్లిం మైత్రికి చిహ్నంగా, చారిత్రక గుర్తు కావడంతో జనులందరి ఆమోదం పొందింది.
పత్రికను ఎలా తీసుకురావాలనే విషయంలో రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు తదితర ముఖ్యులు చాలాసార్లు చర్చలు కూడా చేశారు. పత్రికకు ఆర్థిక వసతి సమకూర్చడమే గాకుండా అనుమతి కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకున్న రాజబహదూర్‌ కొత్వాలు వెంకటరామారెడ్డి మే పదో తేదీనాడు (1925) నాడు పత్రిక మొదటి ప్రతి తీసుకురావాలని ప్రతాపరెడ్డికి నిర్దేశించారు. కేవలం రెండు రోజుల ముందుగా, అది తన కుమారుడు రంగారెడ్డి దౌరాకు పోతున్నందున అక్కడ పత్రికకు చందాలు, విరాళాలు సేకరించడం వీలవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి గారు అప్పట్లో అబ్కారీ మొహతమీమ్‌గా ఉండేవారు. నిజానికి ప్రతాపరెడ్డికి మొదటి నుంచీ పత్రికను వార పత్రికగా తీసుకొచ్చినట్లయితే సమగ్రంగా తీసుకురావడానికి, ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటుందని భావించాడు. అయితే అప్పటికే నీలగిరి, తెనుగుపత్రికలు వారపత్రికలుగా నడుస్తూ, ఆర్థిక ఇబ్బందులతో మూలుగుతున్నందున వాటికి పోటీగా అన్ని హంగులతో ‘గోలకొండ’ పత్రిక వచ్చినట్లయితే వాటిని మూసేయడం తప్ప మరో మార్గం ఉండదని భావించి మాడపాటి హనుమంతరావు పత్రికను ద్వైవార పత్రికగా తీసుకురావాలని కోరాడు. ఆయన కోరికమేరకు పత్రికను ద్వైవార పత్రికగా, అంతకు ముందు ఎవ్వరూ తీసుకురాని విధంగా ప్రతి సోమ, బుధవారాల్లో పత్రికను వెలువరించారు. పత్రిక కొద్ది రోజుల నడిచిన తర్వాత ఒకవైపు నిజాం ప్రభుత్వాధికారుల నోటీసులు, తనిఖీలు, మరోవైపు ఫ్యూన్‌ నుంచి సంపాదకుడి వరకు అన్నీ తానే అయి పత్రికను నిర్వహించాల్సి రావడం, మరోవైపు వకాలత్‌ కాకుండా సంపాదకుడిగా వ్యవహరించడం చిన్నాన్న రామకృష్ణారెడ్డికి నచ్చక పోవడం అన్నీ కలగలిసి పత్రికను మూసేద్దాం, నావల్ల కావడం లేదు, మా చిన్నాన్న వకాలతు పనిచేపట్టమని వత్తిడి తెస్తున్నాడని కొత్వాలుతో ప్రతాపరెడ్డి చెప్పుకున్నాడు. దానికి కొత్వాలు ఆలోచించి తనకు తెలిసిన మార్వాడీల లావాదేవీలు చూసేందుకు హైకోర్టులో సనదు ఇప్పించడమే గాకుండా నెలకు మూడువందల రూపాయల ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేశాడు. దీంతో పత్రిక సజావుగా సాగింది. పత్రికను తన సొంతబిడ్డలా సాకడమే గాకుండా తెలంగాణ ప్రజల గొంతుకై వివిధ వేదికల నుంచి వినిపించిండు.
కొత్వాలు గారి పూర్తి పూనికమేరకే గోలకొండ స్థాపితమయింది. అందులో వాటదార్లను చేర్పించడానికి వివిధ సంపన్నుల్ని తన వద్దకి పిలిపించుకొని పత్రిక ఆవశ్యకతను వారికి చెప్పి ఒప్పించాడు. పత్రికపట్ల వారికి అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ కొత్వాలుగారి మాటను తీసిపారెయ్యలేకనే చాలామంది పోషకులుగా చేరారు. ఈ ఒక్క పత్రిక స్థాపన మూలంగా తర్వాతి కాలంలో నారాయణగూడ బాలికల పాఠశాల, ఆంధ్రవిద్యాలయం, ఆంధ్రసారస్వత పరిషత్తు, విజ్ఞానవర్ధినీ పరిషత్తు, రెడ్డి బాలికల కళాశాల తదితర ప్రజాహితమైన సంస్థల స్థాపన సాధ్యమయింది. వీటన్నింటికీ ప్రధాన కారణం కొత్వాలుగారి పూనిక. తోడ్పాటు.
గోలకొండ పత్రిక ప్రారంభమైన తర్వాత తెలంగాణలోని తెలుగుప్రజల్లో నూతన ఉత్తేజం వచ్చింది. ఇది 1930లో ఆంధ్రమహాసభ మొదటి మహాసభ ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరగడానికి దోహదపడిరది. అంతేకాదు ప్రభుత్వం తరపున ఈ సభల్లో ఆయా శాఖల ప్రదర్శనల ఏర్పాటు కూడా రాజబహదూర్‌ చొరవ వల్ల ఏర్పాటయ్యాయి.
కొత్వాలుసాబ్‌ పత్రికారంగానికి చేయూతనివ్వడమంటే ప్రజాభ్యుదయానికి తోడ్పడడమే అని అర్థం చేసుకోవాలి. చాలా వరకు ఆర్థికంగా ఆదుకోవడమే గాకుండా తన పరిధిలో మాట సాయం చేసి దాదాపు అసాధ్యమైన పనుల్ని సుసాధ్యం చేశాడు. పత్రికా నిర్వహకులకు ఇతోధికంగా తోడ్పడుతూ తద్వారా సమాజాభ్యున్నతికి తనవంతు కృషి చేసిండు. గోలకొండ పత్రిక ఏర్పాటు కావడం నుంచి అది 1948లో హైదరాబాద్‌ రాష్ట్రంపై పోలీసుచర్య తర్వాత లిమిటెడ్‌ కంపెనీగా మారేవరకు రాజబహద్దూర్‌ గారి ప్రత్యక్ష తోడ్పాటు అక్షరాలకందనిది. ఏ కష్టమొచ్చినా, తాను ముందుండి ఆదుకున్నాడు. పత్రిక స్థాపన కాలంలో రెడ్డిహాస్టల్‌ విద్యార్థులే విలేకరులు, విలేఖకులై గోలకొండను నిలబెట్టారు. వారికి అన్ని విధాల రెడ్డి హాస్టల్‌ అధ్యక్షుడిగా కొత్వాల్‌ సహాయ సహకారాలందించేవాడు. పత్రికారంగానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. ఆయన పోలీసు అధికారి కావడంతో తాను చేసిన ఏ పనికీ ప్రాచుర్యత ఇచ్చేవారు కాదు. దాంతో ఆయన సేవ గురించిన సమాచారం అరకొరగా దొరుకుతోంది. గోలకొండ పత్రికను తన హృదయానికి దగ్గరగా చూసుకున్నాడు కాబట్టే పత్రిక నిర్వహణలో ప్రతాపరెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే ప్రతాపరెడ్డి దొరలు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండ్యాలు, సంస్థానాధీశుల్ని తన సంపాదకీయాల్లో, వార్తల్లో ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉండేవాడు. ఒక వైపు పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారినే విమర్శిస్తున్నా ఎవ్వరు కూడా ప్రతాపరెడ్డిని విమర్శించే లేదా తప్పుబట్టే సాహసం చేయలేదు. దానికి ప్రధాన కారణం ప్రతాపరెడ్డి గారికి కొత్వాలుగారి అండదండలు పుష్కలంగా ఉండడమే!
గోలకొండ పత్రికతో పాటు 1925`40 మధ్యకాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా వెలువడ్డ తెలుగు, ఉర్దూ పత్రికలన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొత్వాలు సాబ్‌ సహాయముండేదంటే అతిశయోక్తి కాదు. నారాయణగూడా బాలికల పాఠశాల తరపున ‘మాతృభారతి’ అనే వార్షిక పత్రికను వెలువరించేవారు. బిదురు వెంకటశేషయ్య నేతృత్వంలో వెలువడే ఈ పత్రికకు ఆర్థికంగా,హార్థికంగా కూడా కొత్వాలుసాబ్‌ తోడ్పడే వారు.
 మాతృభారతి పత్రిక ఏర్పాటు కొత్వాలుగారి ‘బ్రెయిన్‌చైల్డ్‌’ అంటే తప్పుకాదు. ఇది తెలంగాణలో తొలి స్త్రీల పత్రిక. బిదురు వెంకటశేషయ్య, చలమచర్ల రంగాచార్యులుతో పాటుగా కె.రామమూర్తి కూడా సంపాదకవర్గంలో ఉండేవారు. అలాగే మరో ముగ్గురు మహిళలు కూడా సంపాదకవర్గంలో ఉండేవారు. వాళ్ళు వి.సుందరమ్మ, కె.లక్ష్మిబాయమ్మ, కె.వెంకటరమణమ్మ. పదుల సంఖ్యలో విద్యార్థినులు పరిణతి చెందిన రచనలు ఈ సంపుటాల్లో వెలువరించారు. అందుకే భారతి లాంటి పత్రికలు వీటిని సమీక్షిస్తూ ఇవి విద్యార్థులు రాశారంటే నమ్మశక్యంగా లేదు. ఏ చేయితిరిగిన రచయితో రాశారనే విధంగా ఉన్నాయని కొనియాడిరది. అంటే పత్రికయొక్క ఉన్నతస్థాయి విలువలు అర్థం చేసుకోవచ్చు.
1928లో మాడపాటి హనుమంతరావు, వడ్లకొండ నరసింహారావులతో కలిసి నారాయణగూడ బాలికల పాఠశాలను కొత్వాలుగారు స్థాపించారు. ఈ పాఠశాల కమిటీకి ఆయనే అధ్యక్షుడిగా ఉండేవారు. తెలుగు మాధ్యమంలో బోధన చేసిన మొట్టమొదటి హైదరాబాద్‌రాష్ట్ర పాఠశాల ఇది. ఈ పాఠశాలలో బిదురు వెంకటశేషయ్య, చెలమచెర్ల రంగాచార్యులు తదితరులు ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఈ పాఠశాల విద్యార్థులు సృజనాత్మక రచనలు చేసేవిధంగా ప్రోత్సహించేందుకు గాను ‘మాతృభారతి’ అనే లిఖితపత్రికను ఏర్పాటు చేశారు. ఈ లిఖిత పత్రికను ప్రతి యేడాదికోసారి ముద్రించేవారు కూడా. ఈ పాఠశాల నుండి తర్వాతి కాలంలో ఉన్నతస్థాయి రచయిత్రులుగా ఎదిగిన వారిలో నందగిరి ఇందిరాదేవి, నేమాని భారతి రత్నాకరాంబ తదితరులు ముఖ్యులు. 1930వ దశకంలోనే కథలు, పద్యాలు, నాటికలు ఈ పాఠశాల విద్యార్థులు రాశారంటే ఈ పత్రిక వేసిన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పత్రికను వెలువరించడంలో కొత్వాలుగారిది ముఖ్య భూమిక. 1935లో వెలువడ్డ వార్షిక సంచికకు రాజబహద్దూర్‌ వెంకటరామారెడ్డి ‘తొలిపలుకు’ రాస్తూ ‘‘మాతృభారతి’ యను లిఖిత మాసపత్రిక మా పాఠశాల విద్యార్థినులలో లేఖనోత్సాహమును వృద్ధిపరచునుద్దేశముతో గత సంవత్సరమునుండి వెలువడుచున్నది. సంవత్సరాంతమున దీనియందు వ్రాయబడిన వ్యాసములను సంపుటముగా ముద్రించి ఆంధ్రమహాజనుల కందజేయవలెనని నిశ్చయింపబడెన. ఈప్రయత్నము ఫలరూపమును దాల్చుట సంతోషావహము.
బాలికలకు తమతమ మాతృభాషలో స్త్రీల కనుగుణ్యమగు ప్రత్యేకవిధానము ననుసరించి ఉన్నత విద్యను నేర్పుటకు హిందూదేశమునందవకాశములను మొట్టమొదట కల్పించగలిగినది భారతమహిళా విశ్వవిద్యాలయమే. దీని స్థాపకులగు ఆచార్య కర్వేగారు నాకు చిరకాల మిత్రులు. వీరీవిషయమున చేయుచున్న కృషి త్యాగము ఆదర్శ ప్రాయములు’’ అన్నారు. అంటే ఈ పాఠశాలను కొత్వాలుగారు ఎంతగా అభిమానించారో అర్థమవుతుంది. పాఠశాలకు స్థలం, భవనం తానే దగ్గరుండి సమకూర్చాడు. అట్లాంటిది పత్రిక కూడా ఆయన ప్రోత్సాహంతో 1940 వరకు ప్రతి యేటా ప్రచురితమయింది. దీంట్లో కేవలం తెలుగులోనే గాకుండా సంస్కృతంలో కూడా రచనలుండేవి.
ఇంగ్లీషులో వెలువడ్డ హైదరాబాద్‌ బులిటెన్‌, ఉర్దూ పత్రిక రయ్యత్‌, భాగ్యరెడ్డి వర్మ నిర్వహించిన ఆదిహిందూ, ఆదిశక్తి, భాగ్యనగర్‌ పత్రికల ప్రచురణకు కొత్వాలు వెన్నుదన్నుగా నిలిచిండు. వాటికి తనకు తెలిసిన వారి నుంచి ప్రకటనలు ఇప్పించడమే గాకుండా ప్రభుత్వం నుంచి ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకునేవాడు. వేదాల తిరువేంగళాచార్యులు వెలువరించిన ఆయుర్వేద కళ, బుక్కపట్టణం రామానుజాచార్యులు ప్రచురించిన ‘తెలంగాణ’ పత్రికలకు కూడా కొత్వాలుగారు వెన్నుదన్నుగా నిలిచారు. బిదురు వెంకటశేషయ్య (1907`1963) ‘మేధావి’ పేరిట ఆంధ్రసారస్వత పరిషత్తుకు అనుబంధంగా 1946లో ఒక పత్రికను వెలువరించాడు. ఈ పత్రికలో విజ్ఞానవర్ధినీ పరిషత్తు సభ్యులు తమ రచనలు వెలువరించేవారు. ఈ పత్రిక స్థాపనలో చాలా సంస్థల విషయంలో చేసిన విధంగానే ‘గుప్త’దానం చేసి పత్రికను నిలబెట్టాడు. వెంకటశేషయ్య గతంలో నారాయణగూడా పాఠశాలలో పనిచేయడంతో అందుకు కృతజ్ఞతగా అన్నట్టుగా కొత్వాలుగారు ఆర్థికంగా ఆదుకున్నారు.
రోజువారి పోలీసు ఉద్యోగంలో తలమునకలుగా ఉంటూ కూడా వివిధ ప్రజాహిత కార్యకలాపాల్లో కొత్వాలుగారు పాల్గొనేవారు. వీటి వివరాలు చాలా వరకు గోలకొండ పత్రికలో రికార్డయ్యాయి. నిజానికి కొత్వాలుగారి సేవ కులాలకు, మతాలకు అతీతమైనది. హైదరాబాద్‌లో మతోద్రిక్త పరిస్థితులున్నప్పుడల్లా వాటిని చాకచక్యంగా పరిష్కరించి అటు ప్రజల మన్ననలేగాకుంగా, ప్రభువుల మన్ననలందుకొని పత్రికలవారి ప్రశంసలందుకునేవారు. హైదరాబాద్‌లోని ప్రతి కులసంఘం వారు ఆయన సహాయం తీసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి కొత్వాలుగారు పత్రికారంగానికి చేసిన సేవ కంటికి ఎక్కువగా కనిపించదు. ఆయన ఏది చేసిన కర్తవ్యంగా భావించి చేసేవాడు. ప్రతిఫలమాశించేవాడు కాదు. కొత్వాలు గారు పత్రికారంగానికి ముఖ్యంగా, గోలకొండ, మాతృభారతిలకు చేసిన సేవ తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, చారిత్రక పునర్వికాసానికి పునాదులు వేశాయి. ఉన్నతమైన విలువలున్న సమాజ ఏర్పాటుకు తోడ్పాటు నందించాయి.
-సంగిశెట్టి శ్రీనివాస్‌