Friday 27 June 2014

మీడియా మాటున భేడియాలు!



తెలంగాణ ప్రజాప్రతినిధుల, వాళ్లను ఎన్నుకున్న ప్రజల గుండెల్ని కోసి కారంబెట్టి ఇప్పుడు ఉఫ్‌ ఉఫ్‌ అంటూ మంటల్ని సల్లార్పెతందుకు పక్షపాత మీడియా ‘సారీ’ చెబుతోంది. (ఉఫ్‌ ఉఫ్‌ అని ఊదుకుంటనే మంటను ఎక్కువ జేస్తుండ్రనే ప్రచారం కూడా ఉంది) హేయమైన తమ చర్యలను సమర్ధించుకోవడం కోసం వందిమాగధులైన జర్నలిస్టు, రాజకీయ నాయకుల మద్ధతు తీసుకుంటుండ్రు. ఫాసిస్టు చర్య, అప్రజాస్వామికం అంటూ తప్పుంటే చట్టప్రకారం చర్య తీసుకోండి అని నీతులు చెబుతున్నారు.

అయితే వాళ్లు తమ అప్రజస్వామికతను, వివక్షను, దురహంకారపు దాడిని తమ అవసరానుగుణంగా మరిచి పోతున్నరు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ప్రసారాలను ఆపేస్తారా? ‘ప్రజాస్వామ్య తెలంగాణ ఇదేనా?’ అంటూ ‘అక్షరాన్ని ఆయుధం’గా మార్చి కేసీఆర్‌పైకి, నవజాత శిశువు తెలంగాణపై సంధించిండ్రు. ‘మెరుగైన సమాజం’ నిర్మించే వాళ్లు ఇప్పుడు తమ తెలంగాణ ఉద్యోగుల్ని రాయబేరాలకు పంపుతున్నరు. మీడియా మాటున భేడియాలుగా (తోడేళ్ళు) ప్రవర్తిస్తుండ్రు. మీడియా ముసుగేసుకొని ఏం చేసినా, ఎట్ల చేసిన చెల్లుతుంది అనుకునే వారికి ఎమ్మెస్‌వోలు షాక్‌ ఇచ్చిండ్రు. నిజానికి ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా!

టీవి9, ఎబిఎన్‌ల ప్రసారాలు ఆపింది ఎమ్మెస్‌వోలు. కానీ ‘కొత్తపలుకు’ ఆయన మాత్రం ఎమ్మెస్‌వోలకు ఆదేశం ఇచ్చిందెవరు? ఎవరి వ్యక్తిగత విద్వేషం ఇందుకు దారి తీసింది? ఆంధ్రజ్యోతి సంస్థలపై విషం చిమ్మిన కేసీఆర్‌! అని చులుకన పలుకులు చెబుతుండు. బట్టగాల్శి మీదేసుడంటే గిదే! వ్యక్తిత్వ హననం అంటే ఇదే! రైతుల రుణమాఫీపై గందరగోళాన్ని సృష్టించి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పడమే గాకుండా ‘ఏపీ నుంచా ఏసెయ్‌ పన్ను’ అని హెడ్డింగ్‌లు పెడ్తిరి. ‘మా అక్షరం మీ ఆయుధం’ అంటివి. కానీ ఈ ఆయుధాలన్నీ తెలంగాణ బిడ్డలపైనే ఎందుకు ప్రయోగించబడుతున్నవో అర్థంగాదు. గాలి వార్తలు అచ్చేసి గాయి గాయి చేస్తూ ఇది అసమర్ధ ప్రభుత్వం అని ముద్రవేయాలని ప్రయత్నించిండ్రు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని గగ్గోలు పెట్టే ఈ మీడియా నిండు అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏంజేసుకుంటరో చేస్కోండి అన్నప్పుడు అది అప్రజాస్వామికమని అనిపించలేదు. పత్రిక పేరే ‘‘ఆంధ్ర’జ్యోతి’. తెలంగాణకు చీకటి, ఆంధ్రకు వెలుగులు పంచే ఈ పత్రిక ‘మీడియా స్వేచ్ఛ’ పేరిట తాము ఏది చెప్పినా, రాసినా ఇన్నేండ్ల మాదిరిగానే ‘తెలంగాణ రాష్ట్రం’లో కూడా చెల్లాలని మొండిగా వాదిస్తోంది. తమ ఆధిపత్యాన్ని తెలంగాణలో అప్రతిహతంగా కొనసాగించడమే గాకుండా తమ సామాజిక వర్గం వారి నేతృత్వంలో సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వాన్ని హీరోగా నిలబెట్టడం దీని ఉద్దేశ్యం. తెలంగాణతో పోల్చి ‘ఆంధ్ర ప్రభుత్వమే బేషుగ్గా పనిచేస్తోంది’ అనే ఒక అభిప్రాయాన్ని కూడగట్టడానికి ‘స్టోరీ’లు రాసింది. దీంతో పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరిని అప్రతిష్టపాల్జేసేందుకు పనిజేస్తుందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నరు. అందుకే ‘వి రిపోర్ట్‌ యూ డిసైడ్‌’ అని మీరు చెప్పినట్లుగానే నిర్ణయం తీసుకుండ్రు. ఇప్పుడు ఎమ్మెస్‌వోలకు ప్రజలు బాసటగా నిలిచిండ్రు. ఒక సామాజిక వర్గం ఆధిపత్యాన్ని కూలగొట్టేందుకు సిద్ధమయ్యిండ్రు.

‘కులం అడ్డు గోడలు కూలగొట్టండి’ అని బాకాలూదే ఈ మీడియాకూ కులముంది. ప్రాంతము కూడా ఉంది. వీటన్నింటికి అతీతంగా, నిష్పక్షపాతంగా భిన్న ప్రజాభిప్రాయాల వేదికగా నిలువాల్సిన మీడియా ఇవ్వాళ ‘కమ్మోళ్ల’ ప్రయోజనాలు కాపాడే, పెంపొందించే వాహికగా మారింది. డెల్టాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముగాసే తాబేదారుగా రూపాంతరం చెందింది. అలా కానట్లయితే ‘నేను తెలంగాణలో పుట్టిన’ ‘నన్ను ఆంధ్రోడు’ అని అంటుండ్రు అంటూ వాపోయే వేమూరి రాధాకృష్ణ ఇక్కడి ప్రజల పక్షాన ఎన్నడైనా నిలబడ్డారా? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలె. నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధితులకోసం వీళ్లు ఏ నిధులు సేకరించలేదు. కనీసం తాను పుట్టాను అని చెప్పుకుంటున్న నిజామాబాద్‌ నుంచి గల్ఫ్‌కు వలసెల్లిన వారి కోసంగానీ, అక్కడి బీడీ కార్మికుల కోసం గానీ ఏ నిధిని, ట్రస్ట్‌ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బిడ్డల కుటుంబాలను ఆదుకుందామనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఇదీ ఆయన ప్రాంతీయ నిబద్ధత. అయితే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసం నిధులు సేకరించడానికి నడుం కట్టాడు. లైవ్‌షోలు పెట్టిండు. దీని వెనుక పూర్తిగా కులం, ప్రాంతము తప్ప మరేమి లేదు. రాజధాని అనే కన్నా దీన్ని ‘క్యాపిటల్‌’ అనడమే సబబు. కేవలం పెట్టుబడిదారులకు అండగా నిలబడేందుకే ఈ ‘రాజధాని విరాళాలు’. రాజధాని కృష్ణా`గుంటూరు మధ్యలో గాకుండా రెడ్ల ప్రాబల్యం ఉండే ప్రకాశం జిల్లాలో వస్తదంటే ఈ విరాళాల ప్రచారం చేపట్టేవారే కాదు. ఈ ‘క్యాపిటల్‌’ పెట్టుబడిదారులు అంతా కమ్మ సామాజిక వర్గం వారే కావడం యాధృచ్ఛికం గాదు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో కలిపి, ఎంత లిబరల్‌గా లెక్కేసినా ‘కమ్మోళ్ల’ జనాభా ఐదు శాతం మించదు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీరి జనాభా దాదాపు 20శాతం ఉంటది. అంతేగాదు ఆ రెండు జిల్లాల్లోని సాగునీటి వసతి ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లో 80శాతం ‘కమ్మోళ్ల’ చేతుల్లోనే ఉన్నయి. వీరి ప్రయోజనం కోసమే ‘క్యాపిటల్‌’ నిర్మాణానికి ఈయన ముగ్గు పోస్తుండు. ఇంకా చెప్పాలంటే వీరికి రాయలసీమ, ఉత్తరాంధ్ర రెండూ పరాయి ప్రాంతాలే!

మీడియాకు ముఖ్యంగా తెలుగు మీడియాకు కులముంది. మీడియాలో దృశ్యం, శ్రవణం, అక్షరం మూడూ వస్తాయి. సినిమాల్లో 95శాతం కమ్మసామాజిక వర్గమే రాజ్యమేలుతోంది. నిర్మాణం గానీ, థియేటర్లు గానీ, హీరోలు, డైరెక్టర్లు అంతా వాళ్లే. ఇక తెలుగులో దాదాపు ఒక వంద ఛానళ్ళు పనిజేస్తే అందులో 90 ఛానళ్ళ యాజమాన్యం కమ్మసామాజిక వర్గం వారిదే! న్యూస్‌ ఛానళ్లలో ఇదే పరిస్థితి. ఎఫ్‌ఎం రేడియోల పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. పత్రికలు కూడా దాదాపు అన్నీ వారివే! అందుకే వారు ఆడిరది ఆటగా పాడిరది పాటగా ఇన్నాళ్లు చలామణి అయింది. అహంకారానికి, అధికారం తోడు కావడంతో కనీస మీడియా విలువలు కూడా పాటించకుండా తమకు ఎదురులేదని విర్రవీగిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో దానికి గండి పడిరది. తెలంగాణపై వీరి దాడి ఇవ్వాళ కొత్తగా షురువయ్యింది కాదు. ఎనుకటి నుంచి ఇదే తంతు. ఇక్కడ కొంత చరిత్ర చెప్పుకోవాలె!

తెలంగాణలో మొట్టమొదటి ప్రాంతేతర పత్రిక ‘తెలుగుదేశం’. హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం 1949లో సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి (1914-2010) ఈ పత్రికను ప్రారంభించారు. బాపట్లకు చెందిన ఈమె ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికయింది. కమ్మసామాజిక వర్గం వారు తెలంగాణ పత్రికారంగంలో అలా అడుగు పెట్టిండ్రు. ఆ తరువాత రాజ్యలక్ష్మితో కలిసి వల్లూరి బసవరాజు తదితరులు ఆంధ్రజనత దిన పత్రికను 1955 ఆ ప్రాంతంలో ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రాంతం నుంచి జర్నలిస్టుల రాక ముమ్మరమైంది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం ఆ ప్రభుత్వం పక్షపాత, కక్షపూరిత వైఖరి మూలంగా ‘గోలకొండ’ పత్రిక 1966లో మూతపడిరది. నలభై యేండ్లు తెలంగాణ సమాజానికి ఎనలేని సేవ చేసిన గోలకొండ పత్రికకు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వడంలోనూ, న్యూస్‌ప్రింట్‌ కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. అలాగే 1938లో స్థాపించబడ్డ ‘దక్కన్‌ క్రానికల్‌’ పత్రికను 1976లో ‘తిక్కవరపు’ కుటుంబం కొనుగోలు చేసింది.

ఈ కుటుంబం వారు దాదాపు అదే కాలంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్లుగా వుండ్రిండ్రు. దక్కన్‌ క్రానికల్‌ని తిక్కవరపు చంద్రశేఖరరెడ్డి కొనుగోలు చేసిన సమయంలోనే ఈనాడు పత్రికను రామోజీరావు విశాఖపట్నంలో ప్రారంభించారు. అది తర్వాతి కాలంలో హైదరాబాద్‌ ఎడిషన్‌ కూడా ప్రారంభించింది. అయితే కొద్ది కాలంలోనే యాజమాన్యం వైఖరికి నిరసనగా తెలంగాణ జర్నలిస్టులు పాశం యాదగిరి, రత్నమాల లాంటి వారు ఉద్యమాన్ని లేవదీసిండ్రు. ఉద్వాసనకు గురయ్యిండ్రు. తెలుగుదేశం పార్టీ అవతరణ సమయంలో ‘ఈనాడు’ దాని కరపత్రంగా పనిచేసింది. ఇదే సమయంలో దాసరి నారాయణరావు తెచ్చిన ‘ఉదయం’ పత్రిక మొదట్లో కొత్త వెలుగులు ప్రసరించినా అది కూడా నెల్లూరు రెడ్ల వశమయ్యింది. సినిమా ఇండస్ట్రీ చెన్నయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తే, అప్పటి వరకు విజయవాడ నుంచి ప్రచురితమైన పత్రికలు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చుకుంది. ఈ రెండు మాధ్యమాలు తెలుగుదేశం పార్టీ అండతో తెలంగాణపై విషం గక్కాయి.

కారంచేడు లాంటి సంఘటనలను నిజాయితిగా, నిష్పక్షపాతంగా రిపోర్టు చేసే ధైర్యాన్ని కూడా ఈ పత్రికలు ప్రదర్శించలేక పోయాయి. అంతేగాదు వీటి ఎత్తుగడలకు, కుచ్చితాలకు 85యేండ్లు నిరంతరాయంగా నడిచిన ‘ఆంధ్రపత్రిక’ కూడా మూత పడిరది. తెలంగాణకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‘సత్య’ న్యూస్‌ ఛానల్‌ పెట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆదిలోనే చిదిమేసిండ్రు. అలాగే నూకారపు సూర్యప్రకాశరావు ‘సూర్య’ పత్రిక తెచ్చే సమయంలో ఆయనపై ఈ మీడియా ఎంత దాడి చేసిందో కూడా అందరికి తెలుసు. తాము చేస్తే ప్రజాసేవ, వేరేవాళ్లు అదే పని చేస్తే ద్రోహం అన్న విధంగా ప్రచారం చేసిండ్రు. తప్పు ఎవరు చేసినా తప్పే అనే సోయి మాత్రం వీరికి లేదు. ఏమి చేసినా ఎట్లా చేసినా తమ సామాజిక వర్గమే చేయాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్న ఈ మీడియా వర్గం తమ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. అలా దిగజారుడుకు పరాకాష్ఠ ‘మడిశి పెట్టుకోవడం’, ‘తొక్కు పచ్చడి’ ‘తాగుబోతోళ్లు, ‘శిలుం మొకం’ మాటలు.

తమని తీరొక్క తీరుగా తిట్టినా మళ్ళీ అదే మీడియాకు ప్రజాస్వామ్యం ముసుగేసి కొంతమంది బానిసలు బాసటగా నిలుస్తుండ్రు. మీడియా స్వేచ్ఛ ముసుగులో వాళ్లు ఎన్ని యవ్వారాలు చేసినా అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ‘మాకరీ’ చేస్తూ అంగట్ల సరుకులాగా అమ్మాలని చూస్తున్నా వీళ్ళు ఇంకా నిజం తెలుసుకోలేక పోతుండ్రు. బహుశా తెలిసినా తమ బానిస భావజాలాన్ని వదిలించుకోలేక పోతుండ్రు కావొచ్చు. గతంలో ఆంధ్రజ్యోతి అహంభావానికి వ్యతిరేకంగా పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే గాకుండా ధర్నాకు దిగిన వారు సైతం ఇవ్వాళ తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎమ్మెస్‌వోలను దుమ్మెత్తి పోస్తుండ్రు. ఊసరవెల్లుల మాదిరిగా రంగులు మార్చే రాజకీయ నాయకులు ఈ పనిచేస్తే అది సహజమే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ జర్నలిస్టు సంఘాల నాయకులు సైతం అప్రజాస్వామికం, ఫాసిస్టు చర్య అంటూ గొంతులు చించుకుంటుండ్రు. మీడియా విలువల వలువలూడదీసే వారికి వీరు జేజేలు పలుకుతుండ్రు.

ఈ గొంతులు చించుకునే వాళ్లు ఒక్క విషయం అర్థం చేసుకోవాలె! వాళ్లకు తెలంగాణ అనేది ఒక అంగడి సరుకు కావచ్చు. కాని నాలుగు కోట్ల మంది ప్రజలకు అది ఒక ఆత్మగౌరవ నినాదం. స్వయంపాలన ఆకాంక్ష. తెలంగాణ చరిత్రను, సంస్క ృతిని, వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని పజీత పజీత చేస్తూ ఇజ్జత్‌ పుచ్చుకుంటుంటే ఇదేమని ఈ పదిహేనేండ్లల్ల ఎన్నడూ ఏ జర్నలిస్టు నాయకుడూ తప్పుపట్టలేదు. అంతెందుకు మొన్నటి సంఘటనను కూడా వాళ్లు బహిరంగంగా ఖండిరచలేదు. ‘టీ న్యూస్‌’ ఛానల్‌ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసారం కాదు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేగాదు మిగతా తెలంగాణ యాజమాన్య ఛానళ్ళని ఆంధ్రలో ఎన్నడో బ్యాన్‌ చేసిండ్రు. అయినా ఈ విషయాల గురించి జర్నలిస్టు సంఘాల నాయకులు ఎన్నడూ స్పందించలేదు. నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడ నడిబొడ్డున తగలబెడ్తుంటే ‘కోనాయి’ అన్నోడు లేడు. చంద్రబాబు ఒంటికంటి సిద్ధాంతానికి వీరి వైఖరికి పెద్దగా తేడా లేదు. మీడియా స్వేచ్ఛ ముసుగులో రెండు రాష్ట్రాల్లో తామే నాయకులుగా చలామణి కావాలనే యావ తప్ప వీరికి తెలంగాణ ఆత్మగౌరవం ప్రధానం కాదు.

ఇప్పటికే ఈటీవి`2, ఈటీవి తెలుగులో 49 శాతం వాటాను, మిగతా ఈటీవి చానళ్ళనన్నింటిని 2600ల కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్‌ సంస్థ ఇప్పుడు సిఎన్‌ఎన్‌`ఐబిఎన్‌తో సహా అనేక ఛానళ్ళను సొంతం జేసుకుంది. పెట్టుబడిదారుల కింద పనిచేయడానికి నిరాకరించి రాజ్‌దీప్‌ సర్దేశాయి, ఆయన భార్య సాగరికా ఘోష్‌ సంస్థ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంత చెడ్డా ఉత్తరాదిలో మీడియా విలువలను కొంతమేరకైనా పాటిస్తుంటే మన తెలుగువాళ్లు జర్నలిస్టు నాయకులతో సహా అందరూ యాజమాన్యాలకు గులామ్‌లుగా మారి ‘మీడియా స్వేచ్ఛ’ ముసుగులో తెలంగాణ తల్లి బొండిగె పిసికేందుకు సిద్ధమయిండ్రు.

మీడియా స్వేచ్ఛపట్ల వారికొక్కరికే పట్టింపు ఉన్నట్లుగా జర్నలిస్టులు, ఔట్‌డేటేడ్‌ రాజకీయ నాయకులు స్వీయ ప్రచారం కోసం ప్రకటనలు ఇస్తుండ్రు. ప్రజాస్వామ్యంలో ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’కు గౌరవం, స్వేచ్ఛ రెండూ దక్కాల్సిందే! అయితే తప్పు చేసిన వారికి శిక్ష లేనట్లయితే తామే రాజ్యాంగ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. చట్టం తమ సుట్టంగా సూస్తరు. ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇప్పుడు జర్నలిస్టు సంఘాల నాయకులు రోడ్డు మీదికొచ్చి నెత్తినోరు కొట్టుకోకుండా అటు ఎమ్మెస్‌వోలను, ఇటు ఛానళ్ళ యాజమాన్యాలను కూర్చుండబెట్టి ‘అంబుడ్స్‌మన్‌’ని మధ్యవర్తిగా పెట్టుకొని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అనే భరోసాను ఎమ్మెస్‌వోలకు తద్వారా తెలంగాణ ప్రజలకు కల్పించినట్లయితే సమస్య ముమ్మాటికీ పరిష్కారమయ్యే అవకాశముంది. ఇందుకు తప్పుచేసిన వాళ్లు బేషరతుగా ముందుగా క్షమాపణ చెబుతూ, అవి పునరావృతం కావు అని లిఖిత పూర్వకంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. పంతాలకు, పట్టింపులకు పోయి కేంద్రం నుంచి వత్తిడి తెప్పిద్దాం అనుకుంటే ఏకు మేకై అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని గుర్తించాలి.

Sunday 15 June 2014

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా



Updated : 6/15/2014 1:19:56 AM (namaste telangaana)

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు తాము బానిసలుగా చూపెట్టిన వాళ్లే తెలంగాణ రాష్ట్రానికి పాలకులు కావడంతో పాచికల్లు, తాగుబోతోడికి తొక్కు పచ్చడి, మడిషి పెట్టుకోవడం లాంటి మాటలతో కావురాన్ని ప్రదర్శిస్తుం డ్రు. తెలుగు సమాజంలో తెలంగాణ వాళ్లను చులకన చేయడమే గాకుండా ఏహ్యభావం కలిగే విధంగా ఈ మీడి యా ఉద్దేశ్యపూర్వకంగా ప్రవర్తిస్తుంది.

తెలంగాణ ఆరణాల కూలీ అంజయ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయితే ఆయన్ని ఒక బఫూన్‌గా ఈ మీడి యా చిత్రించింది. బుడ్డర్‌ఖాన్, జోకర్‌గా ఆయన్ని ప్రచారం చేసింది. సముద్రంల తేల్ పడ్డది అంటే తేలు ఎట్ల పడ్తది? అని వ్యంగ్యంగా ప్రచారం చేసిండ్రు. తేల్ అంటే నూనె అనే సంగతి మరిచిండ్రు. ఇదంతా ఆయన తెలంగాణ భాషలో మాట్లాడ్డం మూలంగా చేసిన పరేషాన్. దానికి కొనసాగింపే టీవీ9 బుల్లెట్ న్యూస్ పేరిట కక్కిన కాలకూట విషం.పాశికల్లు తాగెటోనికి ఫారిన్ మందు ముందల బెట్టినట్టే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కత, మొకం గడుక్కోని వచ్చిండ్రు బానే కని ప్రమాణ స్వీకారం అయితె చెయ్యుండ్రి అనంగనె కాయితం సూసుకుంట సదువుతందుకు కూడ కొందరు తడపడ్డరు. అంతేనా ఇట్ల సూసుకుంటనే సదవరానోళ్ళకు లాప్‌టాప్ ఇచ్చిండ్రట. లంగోటి కట్టుకునేటోనికి లాప్‌టాప్ ఇస్తే మడిశి ఏడనో పెట్టుకున్నట్టు మరేం జేసుకుంటరో ఏడ అమ్ముకుంటరో ఆళ్లకే తెలవాలె అంటూ పైత్యం వెళ్ళగక్కిండ్రు. కేసీఆర్ మూడుగదుల ఇళ్ళు కట్టిస్తామన్నారని అబద్ధాన్ని శఠగోపం పేరిట ప్రచారం చేయడమే గాకుండా శిలువ్‌ు మొకవ్‌ు నిలువుటద్దంలో సూసుకో అంటూ వ్యక్తిగతంగా ఆయన్ని అవమానించిండ్రు. ముఖ్యమంత్రినే ఇట్లా అంటే ఇంక సామాన్యుల సంగతెట్లుంటదో ఊహించుకోవచ్చు.

ఆంధ్ర మంత్రులే సార్వభౌమాధికారం అనే పదం నోరు తిర్గక పలుకలేదు.తెలంగాణోళ్ళు అంటే అంత అలుసయ్యిండ్రా? టీవీ9 గేళి చేసింది అచ్చంగా తెలంగాణ బహుజన శాసనసభ్యుల్నే అన్న విషయం మరువొద్దు. తెలంగాణ మాదిగోళ్ల బిడ్డ చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రమాణం స్వీకారం చేసుకుంటూ తత్తరపడ్డది.దాన్ని టీవీల సూపించుకుంట అసెంబ్లీని ఫస్టుసారి దగ్గర్నించి సూశినందుకు సంతోషపడా ల్నో, ఏడవాల్నో, ఏంజేయాల్నో తెలవక, భయపడాల్నో అర్థంగాక బిత్తర సూపులు సూసిండ్రంటూ షార్ట్‌కట్ల అసెంబ్లీకి ఎన్నికయిండ్రూ అంటూ తెలంగాణ ప్రజల్ని, ప్రజా ప్రతినిధుల్ని ఎగతాళి చేసిండ్రు. అవును మేము మొదటిసారి అసెంబ్లీకొచ్చినం.

మా రాష్ర్టంలో మా అధికారం అని సంబురపడ్డం. తప్పా? దానికి బిత్తరచూపులు చూసిండ్రని దెప్పి పొడువాల్నా? తెలంగాణ బిడ్డల్ని దెప్పి పొడిచే మీరు మీ ఛానళ్లలో, పేపర్లలో వాడే భాష, భావం పట్ల ఏమాత్రం జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల మా మనసులు గాయపడుతున్నయి. ఆరి భడవా? అని మీ మామమియాలు అలవోకగా అనేస్తారు. తెలంగాణలో భడవా అంటే తార్పుడుగాడు అని అర్థం.

మిలియన్ మార్చ్‌లో భాగంగా టాంక్‌బండ్‌పై అహంకారపూరిత ఆధిపత్యాన్ని కూలగొట్టడానికి తెలంగాణ బిడ్డలు తమవి కాని విగ్రహాలను తొలగించిండ్రు. న్యాయంగా, హక్కుగా తమ వైతాళికులకు దక్కాల్సిన స్థానాన్ని 25 ఏం డ్లుగా సీమాంధ్ర ప్రాంతం వారే కబ్జా చేసిండ్రు.

దీంతో ఉద్యమకారులు సహజ న్యాయంగా సీమాంధ్ర ప్రతీకల్ని తొలగిస్తే దాన్ని ఆంధ్రా ఆధిపత్యానికి పరాకాష్ఠగా ఇదే టీవీ9 ఛానల్ తాగుబోతులు, కల్లు తాగిన కోతులవలె, ఉన్మాదులవలె, తాలిబన్ల వలె అంటూ తెలంగాణ ఆకాంక్షపై విషంగక్కింది. తాము ఎన్ని కుట్రలు చేసి, ఎంత రెచ్చగొట్టినా 1969లో మాదిరిగా విధ్వంసం సష్టించి, ఉద్యమాన్ని చప్పున చల్లార్చాలని చూసినా వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉద్యమం ముందుకు సాగింది. అందుకే తెలంగాణ అంటే కక్షతో వ్యవహరిస్తుండ్రు.
సీమాంధ్ర పత్రికలల్లో, ఛానళ్లలో పనిచేస్తున్న తెలంగాణ వారి గొంతు నొక్కడమే గాకుండా వారిని ఉద్యోగాలనుంచి తీసేసినా మొక్కవోని ధైర్యంతో అందరూ ఉద్యమానికి అండగా నిలిచారు. నాడు అధికారపక్షం, ప్రతిపక్షం తో కలిసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ ఏర్పాటుని అడ్డుకోలేకపోవడంతో ఇప్పుడు ఆ అక్కసునం తా తెలంగాణ శాసనసభ్యులపై మీడియా వెళ్లగక్కుతోంది.

పత్రికలు సైతం తెలంగాణ పంట రుణ మాఫీలపై ప్రభు త్వం ఎలాంటి పాలసీ ప్రకటన చేయనప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ రాసిండ్రు. ఇవే పత్రికలు ఆంధ్రప్రాంతంలో అక్కడి ముఖ్యమంత్రి రుణమాఫీకి కమీటీ వేస్తే దాన్ని మెచ్చుకొని ప్రజాభిప్రాయంగా ప్రచారం చేస్తుండ్రు. ఇన్నేండ్లు తమ కనుసన్నల్లో ఇంకా చెప్పాలంటే తమ సలహాలు, ఆదేశాలతో నడిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం స్వతంత్రగా వ్యవహరిస్తుండటంతో ఈ పత్రికలు, ఛానళ్లు సహించలేకపోతున్నాయి. ఎటు తిరిగీ తెలంగాణ వారికి పరిపాలన దక్షత లేదు, వాళ్లు అసమర్థలని ఉద్దేశ్యపూర్వకంగా, వివక్షతోఈ మీడియా వ్యవహరిస్తోంది.

రాజ్యాంగంలో అందరికీ భావాల్ని వ్యక్తీకరించడానికి స్వేచ్ఛనిచ్చింది. కాని ఈ స్వేచ్ఛను సీమాంధ్ర మీడియా దుర్వినియోగం చేస్తుంది. తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని బట్టకాల్చి మీదేసే పనిజేస్తుంది. తెలుగు ప్రింట్, విజువల్ మీడియాలో 90శాతం ఒకే సామాజికవర్గం చేతిలో ఉండడం, వారి ప్రయోజనాలన్నీ ఆంధ్ర ప్రాంతంతో ముడిపడి ఉండడంతో తెలంగాణను నెగెటివ్ దక్కోణంతోనే చేస్తున్నారు. తెలంగాణ కళలు, సంస్కతి, భాష, ఆచార వ్యవహారాలు అన్నీ ఆంధ్రప్రాంతంతో పోలిస్తే కచ్చితంగా భిన్నమైనవే! ఈ భిన్నమైన సంస్కతిని కాపాడడానికి, ప్రోత్సహించడానికి ఏనాడు ఈ మీడియా ప్రయత్నించలేదు. భాష అర్థంగాక కేసీఆర్ ఏ బూషీ అంటే దాన్ని ఏబీసీడీలుగా కులపరమైన విభజనగా ప్రచారం చేసిండ్రు. మీదు మిక్కిలి 150 ఏండ్ల నుంచి హైదరాబాద్‌లో బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేపమందుపై దుష్ర్పచారం చేసిండ్రు. ఎందుకంటే తమ ప్రాంతంలో లేనిది ఏదీ వాళ్లకు గొప్ప కాదు. తమది మాత్రమే గొప్పది అనే అహంభావం నరనరాన జీర్ణించుకుపోయి ఉండడంతోనే సమస్య ఉత్పన్నమౌతుంది.

ఇది ఇవ్వాళ్టి సమస్య కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచే ఇది ప్రారంభమయింది. 1983 మార్చి10 న ఆనాటి ఈనాడు పత్రిక పెద్దల గలాబ అని శీర్షిక పెట్టింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా జరిగిన విషయాల్ని ఈ పత్రిక పై శీర్షికతో ప్రచురించడాన్ని తప్పుపడుతూ పత్రికపై, దాని అధినేత రామోజీరావుపై సభ్యులు ప్రివిలెజ్ మోషన్ ఇచ్చారు. దీనిపై సభ చైర్మన్ ఒక ప్రివిలెజ్ కమిటీని ఏర్పాటు చేసిండు. ఈ కమిటీ ఒక ఏడాది తర్వాత తమ తీర్పుని వెల్లడిస్తూ పత్రిక తప్పు చేసిందని వెల్లడించారు. తన చర్యలకు గాను రామోజీరావు సభకు హాజరై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందిగా ఇందుకు అనుగుణంగా 1984మార్చి 28 నాడు అప్పటి నగర పోలీసు కమిషనర్‌ని ఆదేశించారు. ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది.

చివరికి ఎన్టీఆర్ జోక్యం చేసుకొని రాష్ర్టపతికి లేఖ రాయడంతో విషయం సద్దుమణిగింది గలాబ అన్న పదాన్ని ఉపయోగించినందుకే ప్రివిలెజ్ మోషన్ ఇచ్చినప్పుడు మడిషి యాడ బెట్టుకుంటరో, పాశికల్లు తాగే మొకాలు శిలుం మొకవ్‌ు అంటూ సభలోని 119 మంది సభ్యుల్ని ఎగతాళి చేసిండ్రు. ప్రోటెవ్‌ు స్పీకర్ స్థానంలో ఉన్న సీనియర్ సభ్యుడు జానారెడ్డిని, కొత్తగా ఎన్నికైన సభ్యుల్ని సూపిస్తూ తమ అహంకారాన్ని ఈ చానల్ ప్రదర్శించింది. ఈ అహంకారం అణగాలంటే కచ్చితంగా ప్రివిలెజ్ మోషన్ ఇచ్చి తీరాల్సిందే! సభకు పిలిపించి శిక్షించాల్సిందే! మీడియా స్వేచ్ఛ తెరచాటున తమ అక్కసు వెళ్లగక్కే వారికీ, పక్షపాతంతో, వక్రీకరణలతో తెలంగాణను బద్‌నావ్‌ు చెయ్యాలని చూసే వారికి ఈ చర్య గుణపాఠంగా ఉండాలి. చేయకూడని అనుచిత, అవాంఛిత పనులన్నీ చేసి ఇప్పుడు తీరిగ్గా టీవీ9 యాజమాన్యం కేవలం అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కావడంపై చింతిస్తున్నాంఅని ఒక్క స్క్రోలింగ్ ఇచ్చి సరిపెట్టుకుంటామంటే కుదరదు.

కేవలం స్క్రోలింగ్ కాకుండా రవిప్రకాశ్ స్వయంగా తెలంగాణ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పడమే గాకుండా ఇలాంటి ఎపిసోడ్లు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వాలి. తమ బుల్లెట్లతో గాయపడ్డ దళిత బిడ్డ బొడిగె శోభకు క్షమాపణ చెప్పాలి. ఆమె అభిప్రాయాన్ని కూడా ప్రసారం చేయాలి. తెలంగాణ ప్రజలు, ఉస్మానియాలో విద్యార్థులు బుల్లెట్ల ప్రభుత్వాలు పోయి బ్యాలెట్ల ప్రభుత్వం వచ్చిందని పండుగ జేసుకుంటుంటే మీడియా మాత్రం తమ బుల్లెట్లను, బులిటెన్‌లను తెలంగాణపై ప్రయోగిస్తున్నారు. సహనానికీ ఒక హద్దు ఉంటది. ఆ హద్దుని చెరిపేసే విధంగా మీడియా ప్రవర్తిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు.

-సంగిశెట్టి శ్రీనివాస్

Thursday 12 June 2014

VIBRANT TELANGANA/ తెలంగాణా కేవలం ఒక “ఫుట్ నోట్” కాదు!

తెలంగాణా కేవలం ఒక “ఫుట్ నోట్” కాదు!

sangisetti- bharath bhushan photo
60 యేండ్ల ఎడతెగని పోరాట ఫలితం ‘తెలంగాణ’. వలసాంధ్ర బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కోసం తెగించి కొట్లాడిన బిడ్డలందరికీ వందనాలు. తెలంగాణను దోసుకుందెవరో? దోపిడీ చేసిందెవరో? అభివృద్ధి నిరోధకులెవరో? అహంకారంతో మెలిగిందెవరో? ఆత్మగౌరవాన్ని దెబ్బతీసెందెవరో? అందరికీ తెలిసిన విషయమే!
ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో భవిష్యత్తెలంగాణను ఎలా నిర్మించుకోవాలో? భౌగోళిక తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా  ఎలా మార్చుకుందాం  అనే అంశంపై దృష్టిని సారించాలి. ఇన్నేండ్లు, ఇన్నాళ్లు మనకు హక్కుగా దక్కాల్సిన వాటాను ఆధిపత్యవాదులు ఎలా కాజేసిండ్రో చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడది ముగిసిన అధ్యాయం. ప్రస్తుతం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలి. అందుకోసం పునాదుల నుంచి వినిర్మాణం జరగాలి. సకల ఆధిపత్యాలను ధిక్కరించే ‘తెలంగాణ’ను నిర్మించుకోవాలి. సాహిత్యంలో సైతం ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిద్దాం. కొత్త ప్రతీకలను నిర్మించుకుందాం. విస్మరణకు, వివక్షకు, వక్రీకరణకు గురైన విషయాల్ని ఇకనైనా వెలుగులోకి తెద్దాం. వాటికి చిత్రిక గడుదాం. ఈ వెలుగులో తెలంగాణ సాహిత్య/సామాజిక/సాంస్కృతిక చరిత్రను తిరగ రాద్దాం. ఇన్ని సంవత్సరాలు ఉటంకింపులకు, పాదసూచికలు, బ్రాకెట్ల మధ్యలో నిలిచిన అంశాల్ని చర్చకు పెట్టాల్సిన అవసరముంది.
ఆధిపత్యాల నిర్మూలనలో (వినిర్మాణ) తెలంగాణలోని బుద్ధిజీవులందరూ తమ వంతు కృషి చేసిండ్రు. టాంక్‌బండ్‌పై తమవి కాని విగ్రహాలను తొలగించడంలోనూ అంతే
బాధ్యతతో తెలంగాణ బిడ్డలు పాలుపంచుకుండ్రు. కోడి పందాల స్థానంలో తెలంగాణ బతుకమ్మలను ఆడినం. తెలంగాణ వంటలు వండుకున్నం, ఆటలు ఆడుకున్నం, పాటలు
పాడుకున్నం, ధూంధాంలు ఆదినం. ఇదంతా ఉద్యమంలో భాగంగా, ఎవరికి తోచిన విధంగా వారు, సీమాంధ్ర ఆధిపత్యాలను కూల్చడానికి, స్వీయ అస్తిత్వాన్ని చాటడానికి
ఉద్యమకారులు చేసిన పోరాట రూపాలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో పనిచేయడం కుదరదు. అందుకే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణవాదులు
చేసిన మంచిపనులన్నింటిని జూన్‌ రెండు నుంచి ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీలు, అకాడెమీలు, సంస్థలు,
గ్రూపులు, వ్యక్తులు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్ని చిరస్మరణీయంగా తీర్చి దిద్దాలి. చరిత్రలో నిలబెట్టాలి.
vaikuntam-16x12in
గత అరవైయేండ్లుగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ‘పద్మ’ అవార్డులన్నీ సీమాంధ్ర వందిమాగధులకే ఎక్కువగా దక్కాయి. వారు మాత్రమే సాహిత్యకారులు,
వారు మాత్రమే సకల కళా పారంగతులుగా వెలిగి పోయారు. 60 యేండ్ల పాటు తెలంగాణ బతుకుల్ని చిత్రాలుగా మలిచిన సిద్దిపేట కాపు రాజయ్య, కొండపల్లి
శేషగిరిరావు, పి.టి.రెడ్డి, ప్రపంచం గొడవను ‘నా గొడవ’గా చేసిన కాళోజి నారాయణరావు, సంగీత, సాహిత్య రంగాల్లో తెలంగాణ ప్రజ్ఞను ప్రపంచ వ్యాప్తం
జేసిన సామల సదాశివ, పాండవ కళాకారిణి తీజ్‌రీ భాయికి ఏమాత్రం తీసిపోని చిందు ఎల్లమ్మ, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ,
తెలంగాణ సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకర్‌ సార్‌, తెలంగాణ భాషకు పట్టం కట్టిన పాకాల యశోదారెడ్డి, జానపదాల్ని జ్ఞానపదులకు తెలియజెప్పిన
బిరుదురాజు రామరాజు, బహుభాషా కోవిదుడు, రాజకీయ పండితుడు పి.వి.నరసింహారావు, తెలుగు`ఉర్దూ భాషల వారధి హీరాలాల్‌ మోరియా, తెలంగాణ
ప్రతిభను, సాహిత్యాన్ని, గౌరవాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన పరిశోధకులు గడియారం రామకృష్ణశర్మ, బి.ఎన్‌.శాస్త్రి, 1969 ఉద్యమాన్ని చట్టసభల్లోనూ,
బహిరంగ సభల్లోనూ నడిపించిన ధీర వనితలు టి.ఎన్‌.సదాలక్ష్మి, ఈశ్వరీభాయి, సాయుధ పోరాటంలో సమరం జేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని
ధర్మభిక్షం, నల్లా నరసింహులు, సాయుధ పోరాట కాలం నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాలం వరకు నిరంతర ప్రతిపక్షంగా నిలిచిన బండ్రు నరసింహులు లాంటి
ఎందరో మహానుభావులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదు.
తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయిన వీరి కీర్తి, ఘనత అందరికీ తెలియలేదు. తెలంగాణ ఉద్యమ సందర్బంలో చనిపోయిన వారికే ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందంటే ఇక
అంతకుముందు చనిపోయిన వారికీ, ప్రస్తుతం బతికున్న వారికి కూడా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. భారత ప్రభుత్వం తరపున ఇచ్చే పద్మ అవార్డుల్లో ఒక్క
కాళోజి నారాయణరావుని మినహాయిస్తే మిగతా ఎవరికీ దక్కలేదు. ఇక్కడ పేర్నొన్న అందరూ ‘పద్మ’అవార్డులకు అర్హులు. రేపటి తెలంగాణలో ఇలాంటి అన్యాయం
జరక్కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడి భూమి పుత్రులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవానికి ఎక్కడా భంగం కలుగకుండా చూడాలి.
1990లకు ముందే దాటుకున్న తరానికి కూడా భవిష్యత్తులో గౌరవం దక్కాలి. తెలంగాణ సాహిత్యంలో ‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి, ఉద్యమాలకు
ఊపిరులూదిన రావి నారాయణరెడ్డి, గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసిన రాజా నాయని వెంకటరంగారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుంటక నరసయ్య పంతులు, సంగెం
లక్ష్మీభాయి, బూర్గుల రామకృష్ణారావు, కవిరాజమూర్తి, కొండా వెంకటరంగారెడ్డి, అరిగె రామస్వామి, మాసుమా బేగం, మహేంద్రనాథ్‌, మర్రి
చెన్నారెడ్డి, మల్లికార్జున్‌, జయసూర్య, మెల్కోటే, కోదాటి రాజమల్లు, సుద్దాల హనుమంతు లాంటి సాహిత్య సామాజిక రంగాల్లో పనిచేసిన వేలాది మంది
ఇవ్వాళ ‘వాళ్లెవ్వరు?’ అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. వారు చేసిన పోరాటాల గురించి కూడా నేటి తరానికి తెలియకుండా పోయింది.

తెలంగాణపై పోలీస్‌యాక్షన్‌ నాటి గురించి చెప్పుకుంటేనే ఇంత చరిత్ర ఉంది. వీరి కన్నా ముందు సామాజికోద్యమాలు నడిపిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా మత
సహనానికి చిహ్నం మహబూబ్‌ అలీఖాన్‌, బందగీ, బండి యాదగిరి, షోయెబుల్లాఖాన్‌, తుర్రెబాజ్‌ఖాన్‌, యాదగిరి,  లాంటి ఎంతో మంది తెలంగాణ ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేసిండ్రు. వ్యక్తులుగా వీరికి విగ్రహాలు, భవనాలకు పేర్లు, పార్కులు, స్టేడియాలకు పేర్లు పెట్టినంత మాత్రాన పంచాయితీ వొడువదు.  ఇన్నేండ్లుగా ప్రజా
ఉద్యమాల్లో సేవ, త్యాగం లక్ష్యంతో సర్వం అర్పించి పోరాటం చేసిన భూమిపుత్రులను ప్రతి యేటా జయంతి, వర్ధంతుల్లో స్మరించుకోవాలి. త్యాగపురుషుల జీవితాలను తెలంగాణ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి. సమ్మక్క, సారలమ్మల పోరాటం, సర్వాయి పాపన్న విజయ బావుటా, తుర్రెబాజ్‌ఖాన్‌ తిరుగుబాటు, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ, పత్రికోద్యమాలు, సాయుధ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసుచర్య, ఆంధ్రప్రదేశ్‌ పీడ, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సలైట్‌ పోరు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచిన వైనం, మలిదశ ప్రత్యేక తెలంగాణ పోరాటం, టీఆర్‌ఎస్‌ ఉద్యమం అన్నీ రేపటి చరిత్ర పుస్తకాల్లో సముచిత రీతిలో రికార్డు కావాలి.
మనం బోనం, బొట్టు, బతుకమ్మ, దసర పండుగ, హోళి, నోములు, వ్రతాలు, పీర్ల పండుగ, సాంస్కృతిక పయనం అన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో చేసుకునే
పండుగలుగా ఆదరించబడాలి. సమ్మక్క సారలమ్మ జాతరలతో పాటు, నాగోబ జాతర, మహాంకాళి, మన్నెంకొండ, కురుమూర్తి, రంగాపూర్‌ ఉర్సు, కొమురెల్లి మల్లన్న,
ఏడుపాయల దుర్గమ్మ, బడాపహాడ్‌ ఉర్సు, లింగమంతుల, సిరసనగండ్ల జాతరలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన
చర్యలు. ఇన్నేండ్లు సీమాంధ్ర ఆధిపత్యం మూలంగా స్మరణకు, గౌరవానికి నోచుకోకుండా పోయిన ఉత్సవాల్ని మనమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గత 25
యేండ్లుగా తెలంగాణ వాదులు తమ ఉద్యమాలను ఎందుకోసం  చేశారో ఆ కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి.
ఇక విశ్వవిద్యాలయాల కొస్తే సాహిత్య, సామాజిక రంగాల్లో విస్తృతమైన పరిశోదనలు జరపాలి. మన ఔన్నత్యానికి చిత్రిక గట్టాలి. 1956కు ముందు వచ్చిన
ప్రతి రచనను అచ్చులోకి తీసుకు రావాలి. అకాడెమీలు ఈ రంగంలో ప్రధాన పాత్ర వహించాలి. అముద్రితంగా ఉన్న తాళపత్రాలను సేకరించి వాటిని ప్రచురించాలి.
గతంలో ప్రచురించబడ్డప్పటికీ ఇప్పుడు అందుబాటులో లేని రచనలను పునర్ముద్రించాలి. అలనాటి తెలంగాణ సాహితీవేత్తల జీవితం, సాహిత్యం రెండిరటిపై విశేషమైన పరిశోధనలు జరిపించాలి. వీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలి. ఒక్కోకవి/రచయితకు సంబంధించిన రచనలన్నింటిని సమగ్ర సంకలనాలుగా వెలుగులోకి తేవాలి. రచయితలు, రాజకీయ నాయకులు, ప్రసిద్ధుల జీవిత చరిత్రలను/ ఆత్మకథలను కూడా అచ్చేయాలి. తెలంగాణ పెయింటర్ల జీవితాలు వారి పెయింటింగ్స్‌ రెండూ అచ్చవ్వాలి.
గుణాఢ్యుడు దగ్గరి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో పుట్టిన ప్రతి ప్రసిద్ధ వ్యక్తి సమాచారాన్ని ‘జీవిత సర్వస్వం’ రూపంలో రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇప్పటికే ఇంగ్లీషులో డిక్షనరీ ఆఫ్‌ నేషనల్‌ బయోగ్రఫీ అని ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తుల జీవిత  చరిత్రలను ప్రతి యేటా రికార్డు చేస్తున్నారు. ఆ మాదిరిలో తెలంగాణ వారి జీవిత చరిత్రలను కూడా చరిత్ర
పుటల్లోకి ఎక్కించాలి. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం వారికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో పది జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దాంతో మొత్తం జిల్లాల సంఖ్య 20 కానుంది. ఈ ఇరవై జిల్లాల గెజిటీర్లను/ జిల్లా సర్వస్వాలను కూడా ముద్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
తెలంగాణలోని వ్యక్తుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విధంగా అవార్డులను ప్రముఖ తెలంగాణ వ్యక్తుల పేరిట నెలకొల్పాలి. లలితకళలు, ఫోటోగ్రఫీ, జానపదాలు, సాహిత్యం, సాంస్కృతికం ఇలా అన్ని రంగాల్లోని ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలి. అవసరమైతే వారికి మెరుగైన శిక్షణ ఇప్పించాలి. నిజాం జమానాలో డాక్టర్‌ మల్లన్న, రూపాబాయి ఫర్దూంజీ లాంటి డాక్టర్లను విదేశాలకు పంపించి అక్కడ విద్యాభ్యాసం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డాక్టర్‌ మల్లన్న అనస్తీషీయాలో నోబుల్‌ ప్రయిజ్‌ గెలుచుకున్న జర్మన్‌ డాక్టర్‌ దగ్గర పనిచేశారు. ఆయనకు ఆ ప్రయిజ్‌లు రావడంలో ఈయన పాత్ర ప్రధానమైంది. భవిష్యత్‌లో కూడా ఈ పరంపర కొనసాగాలి. రేపటి బంగారు తెలంగాణలో ఇన్నేండ్లుగా విస్మరణకు గురైన శ్రేణులకు సరయిన గుర్తింపు దక్కాలి. వారి ప్రతిభకు ప్రోత్సాహమూ ఉండాలి.
ఎక్కడ కూడా ఆధిపత్య పోకడలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు / గౌరవం దక్కేలా ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవన్నీ వాస్తవ రూపం దాల్చాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలి.
తెలంగాణ కళలకు కాణాచి. నిన్నటి వరకు ‘ఎవరెస్టు’ అనే పేరు హైదరాబాద్‌తో సంబంధమున్న ఒక సర్వేయర్‌గానే తెలుసు. కాని ఇవ్వాళ తెలంగాణ పిల్లలు ఆ పేరిట ఉన్న శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ వ్యాప్తంగా మన్ననలందుకుంటున్నారు. భవిష్యత్‌లో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ పేరు కూడా ‘ఎవరెస్టు’లా నిలిచేందుకు ఆ యా రంగాల్లో ప్రవేశం, తెలంగాణపై అమితమైన ప్రేమ ఉన్న కె.చంద్రశేఖరరావు పై కూడా ఇక్కడి ప్రజలకు అపరిమితమైన ఆకాంక్షలున్నాయి. వీటన్నింటిని కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుస్తాడనే విశ్వాసం కూడా ఉంది. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా, కేసీఆర్‌పై ఉన్న నమ్మకం ఇనుమడిరచేలా కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో
ముందడుగేయాలి.
- సంగిశెట్టి శ్రీనివాస్‌

HYDERABAD KE TEHZEEB / హిందూ-ముస్లిం ఉమ్మడి వారసత్వ సంపద ఉర్దూ

హిందూ-ముస్లిం ఉమ్మడి వారసత్వ సంపద ఉర్దూ

సంగిశెట్టి శ్రీనివాస్‌
సంగిశెట్టి శ్రీనివాస్‌
 సీమాంధ్ర ఆధిపత్యవాదులు, వారి తాబేదార్లు కొందరు తమ రచనల్లో కొత్తగా ఇటీవల ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ తెహజీబ్‌కు వ్యతిరేకమైన పదం. తెలంగాణ ప్రాంతాన్ని సంబోధించడానికి ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని వాడినట్లయితే ఉర్దూ మాతృభాషగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న 60లక్షల మందికి పైగా ముస్లింలను అవమానించడమే! వారిని తెలంగాణ నుంచి వేరు చేసి చూడడమే!
కాస్మోపాలిటన్‌ కల్చర్‌తో పారిస్‌, లండన్‌, ఇస్తాంబుల్‌లతో సమానస్థాయిలో విలసిల్లిన హైదరాబాద్‌ ఆత్మను అగౌరవ పరచడమే! నిజానికి హైదరాబాద్‌ సంస్కృతిలో ఎన్నడూ పరాయివారిని, పరాయివారి భాషను కించపరచాలనే భావన ఏ కోశానా ఉండదు. మంచి ఎవరు చెప్పినా ఆచరించడం, అభినందించడం ఆనవాయితీ. కాని ఇప్పటి టీవీల్లో, పత్రికల్లో, సినిమాల్లో వాడే ‘తెలుగు’ భాష కచ్చితంగా తెలంగాణ తనాన్ని కించపరిచేదే! ఛానళ్లలో అలవోకగా ఆరి ‘భడవా’ మాదిరిగా వందలాది పదాలు ఎలాంటి జంకు గొంకు లేకుండా వాడుతున్నారు. ‘భడవా’ అంటే తెలుగులో ‘తార్పుడుగాడు’ అని అర్థం. ఇలా భాష తెలియకుండానే దాని అర్థం తెలియకుండానే సీమాంధ్ర ‘మేధావులు’ వాడేస్తున్నారు.

హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మింగేయడం మూలంగా తెలంగాణ తెలుగుకు ముఖ్యంగా హిందూ`ముస్లిం ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి ప్రతీక అయిన ఉర్దూకు జరిగిన నష్టం ఎన్నటికీ పూడ్చలేనిది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనీసం కొంతలో కొంతమేరకైనా దీనికి అడ్డుకట్ట పడుతుంది. తెలంగాణ తెలుగు, ఉర్దూ రెండిరటిని సమాధి చేసిన సమైక్య రాష్ట్రంలో ఈనాటికీ అబద్దాలే రాజ్యం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశాడనీ, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టింది ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంకా కచ్చితంగా చెప్పాలంటే మద్రాసు నగరం కోసం. రెండోది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం 1935లో ఏర్పడ్డ ఒరిస్సా. ఇవన్నీ మరిచి అబద్ధాలనే ఆధిపత్యాంధ్రులు ప్రచారంలో పెడుతున్నారు.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో తెలంగాణ ప్రజల బహుభాషా ప్రావీణ్యానికి గండి పడిరది. ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని అదే హైదరాబాదియత్‌ని కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని ముక్కలు చేయడం ద్వారా సమున్నతమైన సహజీవనానికి తెరపడిరది. భాషోన్మాదం మూలంగా హైదరాబాద్‌ రాజ్యంలోని తెలుగు ప్రజలు కేవలం తెలుగు భాషకు అదీ తమది కాని భాషలో విద్యాభ్యాసం చేయాల్సి వచ్చింది. విద్యార్థులు ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, పాఠశాలల్లో పంతుళ్లు బోధించే భాష మరో యాసలో, చివరికి విద్యార్థి అర్థం చేసుకొని రాసిన భాష, జవాబు పత్రాన్ని దిద్దేవారికి అర్థంగాని గందరగోళ పరిస్థితి. వెరసి తెలంగాణ విద్యార్థికి జీవితకాల నష్టం.
1950కి ముందు హైదరాబాద్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కచ్చితంగా మూడిరటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు. చదువకుకున్న వారయితే వాటికి అదనంగా ఇంగ్లీషు, ఫారసీ, అరబ్బీ కూడా తోడయ్యేది. దైరతుల్‌ మారిఫ్‌ లాంటి హైదరాబాద్‌లోని తర్జుమా సంస్థ మొత్తం ప్రపంచంలోని ఏ భాషలో ప్రచురితమైన సాంకేతిక పరిజ్ఞానం సహా సమాచారమంతా ఉర్దూ మాధ్యమంలోకి అనువదించేది. అయితే హైదరాబాద్‌పై పోలీసు చర్య తర్వాత క్రమంగా మార్పు వచ్చింది. పోలీసు చర్యతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సైనికాధికారులు ఇంగ్లీషు భాషతో మమేకమయ్యారు. వారి అధికారిక భాష కూడా ఆంగ్లమే. వీరికి సహాయకులుగా పనిచేయడానికి మదరాసు రాష్ట్రం నుంచి తెలుగు అధికారులు వచ్చారు.
urdu1

మొదట వచ్చిన వెల్లోడి ప్రజాస్వామిక భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్య తొలి ముఖ్యమంత్రి. ఈయన తన పరిపాలనా సౌలభ్యం కోసం ఇంగ్లీషుని పాలన భాషగా ఏర్పాటు చేసుకొన్నారు. ఇంగ్లీషు భాష తెలిసిన వారు తెలంగాణలో చాలా మంది ఉన్నప్పటికీ వారిని ఉన్నత స్థానల్లో కొనసాగించినట్లయితే హైదరాబాద్‌ రాజ్యంలో వేర్పాటువాదానికి ఊతం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో ఇంగ్లీషు తెలిసిన ప్రాంతేతరులకు ఉద్యోగలిచ్చారు. ఇలా ఉద్యోగం పొందిన వారు ఎక్కువ శాతం మంది ఆంధ్రులే కావడం విశేషం. వీళ్ళు స్థానికభాషలో ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలన పేరిట తెలుగుని పరిపాలనలో అమల్లోకి తెచ్చారు. ఇలా తెలుగుని అధికారిక భాషగా చేయడంతో అప్పటి వరకూ అసఫ్‌జాహీ ప్రభుత్వ బోధనా భాషగా కొనసాగిన ఉర్దూని బలవంతంగా తొలిగించారు. ఇలా ఉర్దూని తొలగిండమంటే ఉర్దూ తెలిసిన ఉద్యోగుల్ని తొలగించడమే! ఇలా తొలగించబడిన వారిలో అత్యధికులు ముస్లింలు ఉన్నప్పటికీ ఉర్దూ మాత్రమే తెలిసిన హిందువులు కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారి స్థానంలో ప్రాంతేతరులైన తెలుగువారికి ఉద్యోగాలు దక్కాయి. స్థానికంగా ఉన్నత ఉద్యోగాల్లో తిష్ట వేసిన ఆంధ్రప్రాంత అధికారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ముల్కీ సర్టిఫికెట్లు జారీ చేసి గైర్‌ముల్కీలకు ఉద్యోగాలిచ్చారు.
1952 నాటికి హైదరాబాద్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఈయన స్వతహాగా సాహిత్య జీవి. ఉర్దూ, పారసీ భాషపై మంచి పట్టున్న వాడు. ఆ భాషా చరిత్రలను తెలుగు పాఠకులకు అందించాడు. అలాంటి వ్యక్తి మాతృభాషలో విద్యా బోధన పేరిట పాఠశాలల్లో తెలుగులో బోధన చేయించాలని ఉత్తర్వులు జారీచేసిండు. అప్పటి వరకూ ఉర్దూ మాధ్యమంలో టీచర్‌ ట్రెయినీలను తయారు చేసిన హైదరాబాద్‌ ఇన్సిట్యూషన్స్‌, సంస్థలు తెలుగు మాధ్యమంలో బోధించే టీచర్లకు శిక్షణా సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. హైదరాబాద్‌ ప్రభుత్వం తెలుగులో బోధన తప్పనిసరి జేయడంతో ఆ మాధ్యమంలో బోధించే టీచర్ల కొరత ఏర్పడిరది. అదే ఆంధ్రప్రాంతంలో చాలామంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆంధ్రాప్రాంతం వారికోసమే ఉద్యోగలన్నట్లుగా తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో లెక్కకు మించి, ముల్కీ నిబంధనలకు తిలోదకాలిచ్చి కొన్ని వేలమంది ఆంధ్రప్రాంత టీచర్లకు తెలంగాణలో ఉద్యోగాలిచ్చారు. ఇలా ఉద్యోగాలు పొందిన వారు మీకు చదువు రాదు కాబట్టి మేం చదువు నేర్పించడానికి వచ్చాం. మీరు నేర్చుకునే వాళ్ళు, మేం చెప్పే వాళ్ళం’ అని అహంభావంతో వ్యవహరించేవారు. ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ 1952 ఆగస్టులో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయమేంటంటే బహుబాషా ప్రవీణులైన హైదరాబాదీయులని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేవలం ఏకభాషీయులుగా కుదించింది. తమది కాని భాషని బలవంతంగా నేర్చుకునేలా తప్పనిసరి స్థితిని కల్పించింది.
నిజానికి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 14 భాషల్లో ప్రజ్ఞకలవాడు. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, బిరుదురాజు రామరాజు ఇలా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు ఈ బహుభాషా సంస్కృతికి అద్దం. హైదరాబాద్‌  రాజ్య ప్రజల ఉమ్మడి భాష అయిన ఉర్దూని క్రమంగా తొలగించడమనేది కేవలం ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే గైర్‌ ముల్కీలకు మేలు చేకూర్చేందుకు చేసిన పనిగానే భావించాలి. అనుసంధాన భాషగా రాజ్యాంగంలో ఎక్కడా జాతీయ భాష హోదాలేని హిందీని అంగీకరించారు. కానీ రోజు స్థానికంగా మాట్లాడ్డమే గాకుండా విశ్వవ్యాప్తమైన స్థానిక భాష ఉర్దూని తెలంగాణ ప్రజలకు దూరం చేసిండ్రు.
నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి హైదరాబాద్‌ వచ్చిన బ్రిటీష్‌ రచయిత విలియమ్‌ పిక్తాల్‌ ముస్లిం ప్రజల పవిత్ర గ్రంథం ఖురాన్‌ని ఇంగ్లీషులోకి అనువదించడమే గాకుండా మతం మార్చుకొని మహమ్మద్‌ పిక్తాల్‌గా మారిండు. బ్రిటీష్‌ రెసిడెంట్‌ కోఠీలో రెసిడెన్సీని కట్టించిన కిర్క్‌పాట్రిక్‌ హైదరాబాద్‌ వనిత ఖైరున్నీసాను ప్రేమించి పెండ్లాడి హైదరాబాదీలకు ప్రేమాస్పదుడయ్యాడు. ఇలా హైదరాబాద్‌ ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన వారిని ఆదరించింది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నది. అంతకన్నా ఎక్కువగా నేర్పించింది.
అయితంరాజు కొండలరావు, బిరుదురాజు రామరాజు, కె.గోపాలకృష్ణారావు తదితరులు తెలుగు`ఉర్దూ నిఘంటువులు తయారు చేసి రెండు భాషల్ని సుసంపన్నం జేసిండ్రు. అలాగే కొన్ని వందల మంది ముస్లిమేతర హైదరాబాదీలు ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడమే గాకుండా ఆ భాషలో రచనలు చేసిండ్రు. రాఘవేంద్రరావు జజ్బ్‌, రాజ నర్సింగరాజ్‌ సక్సేనా, కిషన్‌పర్‌షాద్‌, కాళోజి రామేశ్వరరావు ఇట్లా కొన్ని వందలమంది ఉర్దూలో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్యాన్ని సృజించారు. ఖమ్మం జిల్లా గురించి రాస్తూ ఆకాశం ఆంధ్ర నేల తెలంగాణ అని సెటైర్లు వేస్తుంటారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి నవలాకారుడు కవిరాజమూర్తి, కథలు, కవిత్వం ఇబ్బడి ముబ్బడిగా రాసిన హీరాలాల్‌ మోరియాలు పుట్టుకొచ్చారు. వీరిద్దరూ ఉర్దూలో అత్యున్నత స్థాయి రచనలు చేసిండ్రు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి లాంటి వాండ్లు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. ఇలాంటి వారందరికీ దక్కిన ఉర్దూ నేర్చుకునే భాగ్యం నేటి తరానికి దూరమయింది.
20 మార్కులకే పాస్‌ చేసే హిందీ స్థానంలో ఉర్దూని బోధించనట్లయితే తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగకారిగా ఉండేది. ఉర్దూని పాఠశాల స్థాయి నుంచి బోధించక పోవడం మూలంగా గత 60యేండ్లుగా తెలంగాణ తరాలకు జరిగిన అన్యాయం వెలగట్టలేనిది. ఉర్దూ భాష తెలియడం వల్ల మత సామరస్యం పెరగడమే గాకుండా గంగా`జమునా తెహజీబ్‌ పరిఢవిల్లుతుంది.
sky1 ఈ గంగా జమున తెహజీబ్‌ ఇటీవల హైదరాబాద్‌లో మళ్ళీ మొగ్గ తొడిగింది. గతంలో కొత్త వంతెన పేరిట కొంత కవిత్వాన్ని తెలుగు`ఉర్దూ భాషల్లో ఒకే పుస్తకంగా అచ్చేయడం జరిగింది. అలాంటి ప్రయత్నమే మిత్రుడు స్కైబాబ, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వున్న మరో కవి ఖుతుబ్‌ సర్‌షార్‌తో కలిసి ‘రజ్మియా’ పేరిట తెలంగాణ ముస్లింల కవితా సంకలనాన్ని తెలుగు`ఉర్దూ భాషలో తీసుకొస్తున్నారు. తురుకోళ్లు, తెలుగోళ్లు కలిసి వేదికలు నిర్మించుకునే, కవిత్వం చదువుకునే రోజులు హైదరాబాద్‌ రాష్ట్రం ఉన్నంత వరకూ కొనసాగాయి.
హైదరాబాద్‌ రాష్ట్రం అంటేనే దేశవ్యాప్తంగా ఉర్దూ పోషణకు ప్రసిద్ధి. ఉత్తర భారతం నుంచి అనేక మంది సృజనకారులు మహబూబ్‌ అలీఖాన్‌, ఉస్మానలీఖాన్‌ దగ్గర కొలువులు పొందిండ్రు. తమ ప్రతిభ ద్వారా హైదరాబాద్‌కూ గుర్తింపు తెచ్చిండ్రు. అలాగే తెలంగాణ సంస్థానాల పాలకులు సీమాంధ్ర ప్రాంతంలోని పండితులను పోషించారు. ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభకు పట్టం గట్టిండ్రు. 1952లో దాశరథి కృష్ణమాచార్యులు అధ్యక్షులుగా ఉన్నటువంటి ‘తెలంగాణ రచయితల సంఘం’ హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారు ఝాము నాలుగ్గంటల వరకూ ముషాయిరా, కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇలాంటి ప్రయత్నమే ‘సింగిడి’ తెలంగాణ రచయితల పూనిక మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తు హాలులో ఒక రోజంతా జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ కవి సమ్మేళనాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, తెలంగాణ ఉద్యమానికి తమ వంతు తోడ్పాటు నందించారు. ఈ పరంపర భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ….
-సంగిశెట్టి శ్రీనివాస్‌

SHED THE SEEMANDHRA LUGGAGE / సీమాంధ్ర కత్తికి ఇంకెన్నాళ్లు ధారపడదాం ?

సీమాంధ్ర కత్తికి ఇంకెన్నాళ్లు ధారపడదాం ?

sangisetti- bharath bhushan photo
సీమాంధ్ర కవులు అభ్యుదయం, ప్రగతి, విప్లవం, వామపక్షం, ఇంకా పైకి కనపడని అనేక రూపాల్లో, హిడెన్‌ ఎజెండాలతో తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఇలా చలామణిలో పెట్టిన భావజాలం కారణంగానే నేటికీ తెలంగాణ సాహిత్యకారులు తమకు జరిగిన అన్యాయాన్ని, అభ్యుదయం ముసుగులో నొక్కేసిన/ నొక్కేస్తున్న సొంత గొంతుని పసిగట్టలేక పోతున్నారు. గొంతుని నొక్కుతున్నవారినే ఇంకా ఆరాధిస్తున్నారు. అందలాలెక్కిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని భంగ పరిచిన వారినే బానిస మనస్తత్వంతో భళిరా అని పొగుడుతున్నారు.1956 నుంచీ వారి మెప్పుకోసం, ఆమోద ముద్రకోసం తహతహలాడుతున్న తెలంగాణవాదులు చాలామందే ఉన్నారు. వీరంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. సాయుధ పోరాట కాలంలో ఏమి వ్రాయని శ్రీ.శ్రీ 1969లో మాత్రం ‘విడిపోవడమంటే చెడిపోవడం’ అని శాపనార్థాలు పెట్టిండు. అయినా శ్రీశ్రీని ఆరాధించే వీర తెలంగాణవాదులకు కొదువలేదు. ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పీడితుల పక్షాన గాకుండా దోపిడి పాలక వర్గాల పక్షాన నిలబడ్డ శ్రీశ్రీది ముమ్మాటికీ అభ్యుదయం ముసుగులో ఆధిపత్యమే! ఇట్లాంటి వారు చరిత్రలో ఇంకా చాలా మంది ఉన్నారు.
ఆస్థానాల శృంఖలాలు తెంపుకొని ఆవిర్భవించిన అభ్యుదయ కవిత్వం ఆచరణలో మాత్రం సీమాంధ్ర ఆధిపత్యాన్నే కొనసాగించింది. ఒకవైపు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే తమ దబాయింపుని చలాయిస్తూనే తెలంగాణలో తమకు ఆమోదనీయతను సాధించుకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తూ కూడా జేజేలు అందుకోవడం వీరికి మాత్రమే సాధ్యమయింది. పీడితుల పక్షాన నిలబడాల్సిన వారు అందుకు విరుద్ధంగా గుడ్డిగా పెట్టుబడిదారులు, దోపిడిదార్లతో అంటకాగుతూ అభ్యుదయవాదుల ముసుగులో అభినందనలు అందుకున్నారు. తాము తెలంగాణలో అడుగుపెట్టడానికి అనుకూలంగా ఉన్న సాయుధపోరాటాన్ని సమర్ధిస్తూ కవిత్వమల్లిన కవులు, అదే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద దుమ్మెత్తి పోసిండ్రు. ఇట్లా ద్వంద్వ వైఖరులతో, విరోధబాసతో, పీడితులకు కాకుండా తమకు మాత్రమే మేలు జరిగే విధంగా తెలంగాణ కవులపై ‘థాట్‌పోలిసింగ్‌’కు దిగిండ్రు. ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో గత చరిత్రను పునరావలోకనం చేసుకోవాలి. సీమాంధ్ర అభ్యుదయ వాదులు చారిత్రక క్రమంలో ఎలా వ్యవహరించారు. నిర్ణాయక సమయంలో ఎటువైపు మొగ్గారో నిగ్గు తేల్చాల్సిన సందర్భమిది. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్‌ తెలంగాణ సాధనకు మార్గాలు వేసుకోవాల్సిన చారిత్రక తరుణమిది. ఈ అభ్యుదయవాద కవిత్వం చారిత్రక క్రమంలో నిజంగా అభ్యుదయవాదం పక్షాన్నే నిలబడిరదా? లేదా అభ్యుదయం ముసుగులో వామపక్ష భావజాలం పేరుమీద ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారా? పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలబడి ఉన్నారా? అని నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో జవాబులు దొరికే వరకూ పదే పదే వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎవరెవరు? యే యే ముసుగులేసుకొని తెలంగాణను అడ్డుకున్నారో తెలుసుకున్నట్లయితే ఆ ప్రమాదాల నుంచి బయటపడడానికి మార్గాలేర్పడతాయి. ఆ దారి వెతుక్కునేందుకు ఇదో చిన్న ప్రయత్నం.
1990వ దశకం ఆరంభంలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం నేడు ఉచ్ఛదశలో ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప దేనికీ అంగీకరించేది లేదని తెగేసి తెలంగాణ సమాజం చెబుతుంది. ఇదే విషయాన్ని తెలంగాణ కవులు తమ రచనల ద్వారా తేటతెల్లం జేసిండ్రు. పొక్కిలి, మత్తడి, 1969`73 తెలంగాణ ఉద్యమ కవిత్వం, జాగో జగావో, ఊపిరి, దిమ్మిస, క్విట్‌ తెలంగాణ, మునుం, జిగర్‌ ఇలా వందల సంఖ్యలో వెలువడ్డ తెలంగాణ ఉద్యమ సంకలనాలు, అంతకు పదింతలు ఎక్కువగా ప్రతి జిల్లా నుంచి తెలంగాణ కవితా సంపుటాలు, వేల సంఖ్యలో పాటలు గత దశాబ్ద కాలంగా వెలువడుతూ వచ్చాయి. తెలంగాణ పేరు లేకుండా ఈనాడు ఏ సాహిత్య పత్రిక, సాహిత్యపేజీ అచ్చుకావడానికి వీలులేని పరిస్థితి ఉద్యమం కల్పించింది. వీటికి జోడిరపుగా, ఉద్యమానికి సంఫీుభావంగా సీమాంధ్ర కవులు ‘కావడి కుండలు’ వెలువరించారు. ప్రత్యేక తెలంగాణ న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్‌ కావడంతో న్యాయం పక్షాన నిలబడుతూ, అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరూ ఇందుకు మద్దతుగా నిలిచారు. కవిత్వంలో ప్రజల కష్టసుఖాలు ప్రతిఫలిస్తాయి. కవిత్వం భవిష్యత్తరాలకు చరిత్రను చెబుతాయి.
సమాజపు హృదయ స్పందనను రికార్డు చేస్తాయి. అయితే ఈ రికార్డు చేయడంలో ‘ప్రఖ్యాత’ ఆంధ్ర కవులు 1969 నుంచీ పక్షపాతంతోనే వ్యవహరించారు. ఉద్యమ ఉధృతిని పూర్తిగా విస్మరించారు. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఎంత న్యాయమైన డిమాండో 2009లోనూ ఈనాడు కూడా అంతే న్యాయమైన డిమాండ్‌. సాయుధ పోరాట సమయంలో ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వేచ్ఛకోసం, దోపిడి, పీడనలపై తమ కలాన్ని రaులిపించారు. తర్వాతి కాలములో ఈ కవులే తెలంగాణ వందకు వంద శాతం న్యాయమైన, ప్రజాస్వామిక ఉద్యమం అయినప్పటికీ రెండు చేతులా దుమ్మెత్తి పోసిండ్రు. దునుమాడిరడ్రు. ద్వంద్వ వైఖరి అవలంభించే  ఇలాంటి వారిని ‘స్పేర్‌’ చేసినట్లయితే భవిష్యత్‌ తెలంగాణ నేటి ఉద్యమకారుల్ని ఎంతమాత్రం క్షమించబోదు. అయితే ఈ మలిదశ ఉద్యమంలో సీమాంధ్ర బహుజన కవులు తెలంగాణ ఉద్యమానికి సంఫీుభావంగా ‘కావడి కుండలు’ తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఇప్పటికీ కొంత మంది సీమాంధ్ర కవులు మౌనంగానే ఉన్నరు. మౌనం కోర్టు భాషలో అర్ధాంగీకారం కాగలదేమో కాని సాహిత్య భాషలో వ్యతిరేకమన్నట్లే. బహిరంగంగా వ్యతిరేకించే వారితో ఎలాంటి పేచీలేదు. వారు ప్రజాస్వామిక డిమాండ్‌కు వ్యతిరేకమని తేల్చి చెప్పవచ్చు. అయితే ఎటూ తేల్చి చెప్పకుండా నంగి నంగి మాటలతో నాన్చుడు ధోరణితో సందర్భానుసారంగా వైఖరిని మార్చుకుంటూ ప్రజల ఆకాంక్షలపై పూర్తి గౌరవాన్ని ప్రకటిస్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారితో నేడు తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి.
అభ్యుదయం మాటున ఆంధ్రాధిపత్యం!
1969లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి, కె. శివారెడ్డి, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇంకా అనేక మంది ఆంధ్ర కవులు కవిత్వాన్ని రాసిండ్రు. ఒక వైపు విప్లవ రచయితల సంఘం సూత్రప్రాయంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తే దానికి అధ్యక్షుడిగా ఉన్న శ్రీ.శ్రీ అందుకు వ్యతిరేకిస్తూ ఉద్యమానికి మద్ధతు ఇస్తే తాను రాజీనామాను ప్రకటిస్తానని హెచ్చరించాడు. సంఘాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసిండు. ఇదే శ్రీశ్రీ మరో వైపు అంతకుముందు ఆంధ్రరాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ తెలుగుతల్లి పేరిట కవితలల్లిండు. అంధ్రులు యేయే కారణాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్‌ చేసిండ్రో అవే కారణాలతో 1956 నుంచి ఈనాటి వరకూ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీశ్రీకి ఆంధ్ర రాష్ట్రం న్యాయమైన డిమాండ్‌, తెలంగాణ ‘వేర్పాటువాదం’. ఇక్కడే ఆయన ద్వంద్వ నీతి తెలుస్తుంది. తెలంగాణ డిమాండ్‌ని వ్యతిరేకిస్తూ 1969లో శ్రీ.శ్రీ. ఇలా రాసిండు.
srisri
మర్కటాల కర్కటాల
సర్కస్‌ ఫీట్ల, పందెపు
కుక్కుటాల పోట్లాటలు
…..
విచిత్రమేమంటే మన
విశాలాంధ్ర గృహమందే
వేరు వేరు వంట గదులు
కోరి పోరు ధోరణులు
తిరుగుబాటు పేరిట ది
మ్మరులు చేయు హంగామా
చీలిక వాదుల సంఘపు
సెక్రటరీ చిరునామా
(సామ్యవాది మానిఫెస్టో)
విడిపోవడం అంటే చెడిపోవడం అని
వీళ్ళకెలా నచ్చచెప్పడం
చించడం సులభమే కాని అతికించడమే కష్టం
నిర్మూలనం కంటే నిర్మాణమే నయం
అలనాడు దేశాన్ని మూడుముక్కలు చేస్తూంటే
చూస్తూ ఉరుకున్నాడు గాంధీజీ
కొయ్యనీ, శస్త్ర వైద్యం చెయ్యనీ అని సలహా
యిచ్చాడు వియ్యంకుడు
డబ్బు సంచుల్తో అమ్మని కొనలేరు
అభిమానాన్ని కొనలేరు
ఆత్మల్ని కొనలేరు
పాపం అమాయకుడు తెలుగువాడు
మద్రాసు నుంచి పొమ్మంటే కర్నూలుకి వెళ్ళాడు
కర్నూలు కాదనుకొని హైద్రాబాదు కొచ్చాడు
ఇక్కణ్ణుంచి పొమ్మనడం ఏ భాషలోనూ సాధ్యంకాదు’ అన్నాడు.
నిజానికి పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందేవరకు మద్రాసు నుంచి పొమ్మని ఏ తమిళుడు కోరలేదు. అక్కడ కూడా వీళ్లు అత్యాశకు పోయి మద్రాసు నగరం కావాలని అప్పటి ముఖ్యమంత్రి రాజాజి  చేత ‘క్విట్‌ ద డాగ్స్‌’ అని తిట్టించుకొని కర్నూలు చేరారు. కావాలనే పొట్టి శ్రీరాముల్ని పొట్టన బెట్టుకున్నరు. మరుగు దొడ్లు లేని ప్రాంతానికి గవర్నర్‌ రావటానికి నిరాకరించడంతో తెలంగాణాపై వీళ్ల కళ్లు పడ్డాయి. అప్పటికే అన్ని హంగులతో మిగులు బడ్జెట్‌తో ఉన్న హైదరాబాద్‌లో తిష్ట వేయడం కోసం కుతంత్రాలు చేసారు. ఇది చేసింది ‘ఏదో అమాయకమైన తెలుగువాడు’ కాదు. అప్పటికే బ్రిటిష్‌ పాలనలో ఉన్న వీళ్లు, విభజించు పాలించు పద్ధతినవలంభించారు. రాష్ట్రావతరణ నాడే ఉపముఖ్యమంత్రి ‘ఆరోవేలు’ అంటూ  ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిండ్రు. మోసం, వంచనతో తెలంగాణను నిలువుదోపిడి చేసిండ్రు. ఇప్పడా వంచన పరకాల ప్రభాకర్‌ ‘నూటొక్క అబద్దాల’ ‘టక్కరి’ ఆంధ్రుడిగా రూపాంతరం చెందింది. ప్రత్యేకాంధ్ర మేధావి రూపంలో తెలంగాణపై విషంగక్కే చలసాని శ్రీనివాస్‌ రూపంలో టీవీల్లో చర్చలు చేస్తోంది. ఒక వైపు హైదరాబాద్‌ని దోపిడి చేసి ఉన్నకాడికి స్వాహా చేసి తామేదో త్యాగం చేసినట్టు ఫోజు పెట్టడమంటేనే వలసవాదుల దురహంకారపు ఆధిపత్యం అర్థమవుతుంది. ఉన్న జుట్టంతా ఊడబీకి ఫ్రీగా ‘గుండు చేస్తే’ ఎందుకేడుస్తవ్‌ అన్నట్టుగుంది ఆంధ్రకవుల దబాయింపు.
…..
ఐకమత్యంగా ఉంటే
యావద్భారతంలోనూ రాణించగలం
పిండికేతిగాళ్ళ తోలుబొమ్మలాటలు కట్టించగలం
కామ రాజకీయాలకు విడాకు లిప్పించగలం
    (జన్మ దినోత్సవం)
శ్రీశ్రీ ఉద్యమకారుల్ని పిండికేతిగాళ్ళతోటి పోల్చిండు. ఉద్యమాన్ని కామ రాజకీయాలని తూలనాడిరడు. కర్నూలు కాదనుకొని హైద్రాబాద్‌ కొచ్చినామని అంగలార్చిండు. అసలు వాళ్ళని రమ్మని బతిలాడిరదెవరు? ఆనాడే భార్గవ కమిటీ, లలిత్‌ కమిటీలు లెక్కగట్టి మరీ తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కోట్ల రూపాయల సొమ్ముని సీమాంధ్రలో ఖర్చు పెట్టారని తేల్చి చెప్పిండ్రు. తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలని ప్రాంతేతరులు దోచుకు పోయారని లెక్కలేసి మరీ తేల్చిండ్రు. ఇంత అన్యాయం జరిగినా ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షల వైపు గాకుండా దోపిడిదారుల, పీడకుల పక్షాన నిలబడిరడు. శ్రీశ్రీ వేసిన బాటలోనే సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణను అనుబంధాలకు, ఉపశీర్షికలకు పరిమితం చేసిన ఆరుద్ర కూడా దోపిడిదారుల, పీడకుల తరపున వకాల్తా పుచ్చుకుండు.
Arudra
అన్న తమ్ముని యింట పగవాడా?
ఉన్న వూరును విడిచి పోవాలా?
కంట నెత్తుటి కణము కరుణ నోచని జనము
కాందీశీకుల బాట పట్టిందా?
స్వార్థ దేవత కచ్చ కట్టిందా
స్పర్ధానలము మిన్ను ముట్టిందా?
శ్రీలు పొంగిన గడ్డ పాలువారే గడ్డ
సిద్ధాన్నమే కుక్క ముట్టిందా?
రౌడీలకు సజ్జనులు జడవాలా?
రగడ చేస్తే అణిగి నడవాలా?
రక్షణే కరువాయె భక్షణే తిరమాయె
రాచరికమే కంపు గొట్టిందా?
ఒక్కతల్లికి మనము పుట్టాము
ఒక్క రక్తము పంచుకొన్నాము
ఒక్క దేహము నేడు ముక్కలుగునా మూడు
అక్కటా! శని మనకు పట్టిందా?
(అన్న తమ్ముని ఇంట పగవాడా?)
అన్న తమ్ముని ఇంట పగవాడా అని అమాయకంగా అడుగుతున్న ఆరుద్ర నాలుగువేల ఆరువందల మంది నాన్‌ముల్కీలు తెలంగాణలో పనిచేస్తున్నారని, న్యాయంగానైతే ఆ ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు దక్కాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశంలోనే చెప్పిండు. ఈ విషయాల్ని ఎక్కడ లెక్క చెప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టిండు.  ఆరుద్రనే కాదు కె.వి.రమణారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరశిస్తూ కవిత్వాన్ని అల్లిండు. ‘జాతి వైర దుష్టజ్వాల’ అంటూ ఉద్యమాన్ని ఆడిపోసుకుండు. దీనికి మహబూబ్‌నగర్‌కు చెందిన ముకురాల రామారెడ్డి కవిత్వంలోనే అన్నన్నా రవణన్నా నీ ఆటలింక సాగవంటూ కవిత్వంలోనే జవాబిచ్చిండు.
‘‘..కుడిచేతిని ఎడమచేయి
పడగొట్టగ జూచినపుడు
కవి ప్రేక్షకుడై చూచే
కనికట్టు గారడీ గమ్మత్తు కాదిది
ఆ యింటివాని చేతులూ
ఈ యింటివాని చేతులూ
కలియబడుతున్న
‘జాతివైర దుష్టజ్వాల’ ఇది.
అవునా భువనఘోషనా ఇది.
అలనాడు సవరింపబడిన
‘తెలంగాణ కోటి రత్నాల వీణ’
తీగలను తెంపేసి
అతక నేర్చుకుంటున్నదా? నెరజాణ
‘‘వీర తెలంగాణానికి
వైరుల ఏకోదరులా?’’ అంటూ ముకురాల రామారెడ్డి జవాబిచ్చిండు.
ఇక ఫక్తు ఆరెస్సెస్‌ భావజాలం గల జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్లయితే అది దక్షిణ పాకిస్తాన్‌ అవుతుందని రాసిండు. తెలంగాణ ప్రజలు మాట్లాడేది ‘తౌరక్యాంధ్రమని’ ఎగతాళి చేసిండు.ఈ విషయాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారు రికార్డు కూడా చేసిండు. ‘‘ 1968`69లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఒక అనుభవం ఎదురైంది. ఆ రోజుల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక గేయంలో , ఒక వేళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే, అది దక్షిణ పాకిస్తానం అవుతుందని రాశాడు. అది అర్థం కాక నేను ఇంకో మిత్రుడు ఆయన దగ్గరికి వెళ్ళి ‘శాస్త్రి గారూ, మీ బాధేమిటని’ అడిగాము. దానికి ఆయన సమాధానమిస్తూ ప్రత్యేక తెలంగాణలో తెలుగంతా భ్రష్టుపట్టిపోయి, అది పూర్తిగా తౌరక్యాంధ్రం అవుతుందని అన్నాడు.’’ (సింగిడి` తెలంగాణ ముస్లిం ప్రత్యేక సంచిక, ఉర్దూ ఉసురు తీసిన ఆంద్రులు` జయశంకర్‌)
తెలుగుతల్లి, విశాలాంధ్ర పేరిట కవితలల్లిన పాపయ్యశాస్త్రి ఒక్కసారి కూడా న్యాయంగా ఆలోచించలేదు. కనీసం అవతలి పక్షంవారు ఏమడుగుతున్నారు? అని కూడా ప్రశ్నించుకోలేదు. ‘విజయీభవ’ పేరిట
‘పెద్ద తలలు గద్దెలకై
గుద్దులాడు కొంటున్నై
వద్దనవోయ్‌ స్వార్థబుద్ధి
కద్దనవోయ్‌ కార్య సిద్ధి’ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం గుద్దులాటగా వర్ణించిండు. బట్టకాల్చి మీదేసినట్లయితే అది ఆరిపేసుకునే పనిలోనే తెలంగాణ వాడుంటే ఈలోపు తమ దోపిడీని సులువు చేసుకోవచ్చనేది నాటికీ నేటికీ సీమాంధ్ర ఆధిపత్యవాదులు ఆచరిస్తున్న నీతి.
‘ తెలుగుతల్లి కన్నుల్లో
వెలుగుతుంది మన భాగ్యం
భాగ్యనగర వీధుల్లో
పండును మన సౌభాగ్యం’ అంటూ హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంపదను ఆనాడే లెక్కేసిండు. విశాలాంధ్ర పేరిట
‘ఆ సీమని ఈ సీమని
ఆగం చేస్తారెందుకు
అంతా రాయలసీమే
అంతా మన తెలంగాణె’ అంటూ ప్రత్యేక తెలంగాణ వాదుల్ని జోకొట్టే ప్రయత్నం చేసిండు. ఆధిపత్య శక్తుల కొమ్ముకాసే వీరి పక్షపాత వైఖరి కారణంగా ఈనాడు తెలంగాణ ప్రజల్లో, మేధావుల్లో సీమాంధ్ర సాహితీవేత్తలు ఎంతటి ప్రతిభావంతులైనా వారి పట్ల గౌరవభావం ఏర్పడడంలేదు.
అలాగే అప్పటికి అంతగా పేరు పొందని చిన్నా చితక ఆంధ్ర కవులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై దుమ్మెత్తి పోసిండ్రు. ఇందులో వక్కలంక లక్ష్మీపతిరావు ఇలా రాసిండు.
అన్నాదమ్ములు కలబడి దేశం
ఛిన్నా భిన్నం చేస్తారా?
పచ్చని యింటికి చిచ్చులు రగిల్చి
పరమానందము చూస్తారా?
అంటే అన్న ఎంత దోసుకుంటున్నా తమ్ముడు మాత్రం సడి సప్పుడు చెయ్యకుండా ఉంటే అది ఐకమత్యము. అన్యాయాన్ని నిలదిస్తే అది చిచ్చులాగా వారికి కనబడిరది. మరో కవి ఎం.కె. సుగమ్‌బాబు తెలంగాణ ఉద్యమాన్ని సంకుచితమని తేల్చిసిండు.
ఆంధ్ర యేమిటి?
తెలంగాణా యేమిటి?
కులమేమిటి?
మతమేమిటి?
భాషేమిటి?
మనిషి యింతగా యెదిగినా
సంకుచితంగా ప్రాంతమ్మేమిటి?
ఇది నాచేయి
ఇది నాకాలు అని
కన్నతల్లిని కోతపాలు చేసే మూర్ఖతేమిటి
కసాయితన మేమిటి?
ఇంకెలా నిలుస్తుంది దేశం
ఏమైపోతుంది మృతవీరుల త్యాగం, సందేశం’
న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటా అడగడం ఆంద్రోళ్ళకు మూర్ఖత్వంగా, కసాయితనంగా కనిపించింది. ఇదే అంశాన్ని కొంచెం సున్నితంగా సంగిరెడ్డి వెంకటరంగారెడ్డి అనే కవి ఇలా చెప్పిండు.
ఒకే ఇంటివాళ్ళు
అన్నదమ్ములు
అన్నా తమ్ముడి పైసలు వాడుకున్నాడు
అన్న తమ్ముడికి అన్యాయం చేశాడు
తమ్ముడు కోపంతో కల్లెర్ర చేశాడు
తమ్ముడు అన్న చేసిన తప్పులను చూపాడు
తప్పులను సరిదిద్దుకొందాం అన్నాడు అన్నయ్య
తమ్ముడు సంతోషంతో ‘సరే’ అన్నాడు
అన్యాయం చేసినంతమాత్రాన విడిపోతామా అన్నాడు తమ్ముడు
కలతలున్నంత మాత్రాన బంధాన్ని తెంపుతామా అన్నాడు అన్నయ్య”తప్పులను సరిదిద్దుకోవాలని వెంకటరెడ్డి చెప్పిండ్రు.
ఈ తప్పులు సరిదిద్దుకోక పోగా అంతకు వేల రెట్లు అధికంగా చేసి వాటినే ఒప్పుల కుప్పలుగా చూపెట్టే ప్రయత్నం జేసిండ్రు సీమాంధ్ర పక్షపాత అధికారులు, వారికి వత్తాసుగా వలసాధిపత్య ప్రభుత్వం నిలిచింది. గిర్‌గ్లానీ కమిటీ ఎన్ని సార్లు నిబంధనలు ఉల్లంఘించారో తనకు ఇచ్చిన అరకొర సమాచారంతోనే లెక్కగట్టిండు. 1984 డిసెంబర్‌లో ఇచ్చిన 610 జీవో 29 యేండ్లయినా ఇంకా అమలుకు నోచుకోలేదంటే ఇంకెంత సహనం కావాలి. తరాలకు తరాలు ఓపిక పట్టాలంటే అయ్యే ముచ్చటేనా?
యూ టూ శివారెడ్డి!
హైదరాబాద్‌ని అమితంగా ప్రేమిస్తానంటూనే దానిపై అభ్యంతరకరమైన కవిత్వమల్లి తెలంగాణవాదుల మనోభావాల్ని గాయపరిచిన కవి శివారెడ్డి. తాను ఏ శిబిరంలో ఉన్నా అభ్యుదయవాదిగా ఆమోదముంటుంది. వీర తెలంగాణ వాదులకు సైతం ఆయన ఆరాధ్యనీయుడవుతాడు. ప్రస్తుత సందర్భంలో నర్మగర్భంగా తెలంగాణకు వ్యతిరేకంగా కవిత్వమల్లే ఈయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు వ్యతిరేకేసిస్తూ ఏకంగా ‘తెలుగు బావుటా’ (సమైక్యతా సూచికా గేయకావ్యం) పుస్తకాన్ని ప్రచురించాడు.
కుడి చేయి ఎడమ కంట్లో
వేలుబెట్టి పొడిచింది
ఎడమ చేయి కుడికంట్లో
జిల్లేడు పాలు కొట్టింది-
రెండు కళ్ళు
భోరున ఏడుస్తున్నాయి
ఈ దేహం ఒకటే
ఆ కళ్ళు, చేతులు
ఈ దేహానికి చెందినవే
సరిగ్గా ఇలానే వుంది
తెలుగు గడ్డ పరిస్థితి
….
మనుషుల మనసుల్లో
కీనీడల జాడల హెచ్చింది
మమత పెల్లుబికిన ఇంట్లో
మచ్చరం పెను త్రాచులా
బుసలు కొడుతుంది
నిన్నటి మిత్రులు
నేడు శత్రువులు
అన్నదమ్ములిరువురు
పందెంలో కోడి పుంజుల తీరు
ఈ స్వార్థం తిని బలిసిన
రాకాసి పురికొల్పిందిలా?
అర్థమేమున్నది ` ఆ వేటలో
నీది ఆంధ్ర, నాది తెలంగాణా
తెలంగాణాణా`ఆంద్ర
పర్యాయ పదాలు కావా!
నిన్న మొన్న పురుడు బోసుకున్న
తెలుగు తల్లి గుండెల్లో బల్లెపు పోటా!
సిగ్గు విడచి చెప్పులు జత పట్టుకున్నాయి కదూ’
. అంటూ ఆనాడు అందరం ఒక్కటిగా ఉండాలని పిలుపు నిచ్చాడు.
అయితే అప్పటికే హైదరాబాద్‌లో శివారెడ్డి ఉద్యోగం చేయడమంటేనే ఒక స్థానికుడి అవకాశం గల్లంతు కావడం. తెలంగాణ ఫ్యామిలీకి దక్కాల్సిన చదువులూ, స్థానిక రిజర్వేషన్లు ఇట్లా వచ్చిన అనేకమంది తెలంగాణ బిడ్డలకు దక్కకుండా చేసిండ్రు. అట్లా ఒక్క శివారెడ్డే కాదు అంతకు ముందు 1944 నుంచీ తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకున్నాక ఆంధ్ర ప్రాంతం వారి రాక పెరిగి పోయింది. అడివి బాపిరాజు, విద్వాన్‌ విశ్వం, కొడవటిగంటి కుటుంబరావు, తల్లావరa్జల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, కురుగంటి సీతారామభట్టాచార్య, పిల్లలమర్రి వేంకట హనుమంతరావు ఇలా అనేక మంది తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్‌ని కేంద్రంగా చేసుకొని ఉద్యోగాలు చేసుకున్నారు.  ఇదే విషయాన్ని”నల్లవలుస”లో “శిరసులు ఇలా చెప్పిండ్రు.
‘‘గురజాడ ‘ఒఖడే’
అడుగు జాడల్లో వలసవచ్చినవారు
వేయిన్నొఖడు
నయాదళారుల వలసే
మహా ప్రస్థానం
త్వమేవాహమ్‌
త్వమ్‌ శూన్యమ్‌ అహమ్‌ సర్వమ్‌
ఆర్యా` స్వాహా సర్వమ్‌
దళ నిర్మూళనమే
మరో` మహాప్రస్థానం?
ఉద్యమం మీద
తేలుతూ వచ్చావ్‌
ఆంధ్రప్రస్థ నిర్మాణంలో
మయుడివి కావు
మనిషిని వస్తువుగా,
మా భూమిని
ముక్కలుగా విక్రయించావ్‌
నీ గణాంకాల
గారడీలో
నేనొక్క
గుండుసున్నానిమ మాత్రమే!
ముల్కీ పత్రం
ఒక మురికి పత్రమే
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దాదాపు అందరు సీమాంధ్ర కవులు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ వారిని అందలం ఎక్కించే ఉద్దేశ్యంతో సాయుధ పోరాట సాహిత్యాన్ని దానికి వారు అందించిన తోడ్పాటును అటు అభ్యుదయవాదులు, విప్లవవాదులు ప్రచారంలో పెడుతుంటారు. నిజానికి 1946`51 నాటి ‘సాయుధ పోరాటం’ గురించి చాలామంది రచనలు చేసిండ్రు.
అయితే శ్రీ.శ్రీ ఒక్క కవిత కూడా రాయక పోవడానికి కూడా కారణముంది. ఆరుద్ర ‘త్వమేవాహా’నికి ఆపేరు సూచించిన శ్రీ.శ్రీ స్వయంగా నిజాం ప్రభుత్వం కొలువులో ఉన్నాడు. ప్రభుత్వ కొలువులో ఉంటూ దానికి వ్యతిరేకంగా రాస్తే ఉద్యోగం ఊడుతుందనే ఉద్దేశ్యంతో ఒక్క కవిత కూడా రాయలేదు. అలాగే తిన్న ఉప్పుకు ద్రోహం తలపెట్టొద్దు అనే ఉద్దేశ్యంతోనో ఏమో ఆ తర్వాత కూడా ఏమీ రాయలేదు. ఒక వైపు తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన పేద రైతులు, ఉద్యమకారులు సాయుధ పోరాటం చేస్తూ ఉన్నారు. రోజూ  పోలీసుల చేతిలో కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు చనిపోయారు. చనిపోయిన వారిలో రజాకార్లు కూడా ఉన్నారు. బండి యాదగిరి లాంటి పాటగాడు, రేణికుంట రామిరెడ్డి లాంటి యోధుడు, అనభేరి ప్రభాకర్‌ లాంటి పోరాట నాయకులు అనేక వందల మంది 1946`48 మధ్య కాలంలో ఉద్యమంలో తమ ప్రాణాలర్పించారు. అయితే శ్రీ.శ్రీ నిజాం ప్రభుత్వ పోలీసు శాఖలో పౌరసంబంధాల విభాగంలో ఉంటూ ప్రభుత్వ ఎన్‌కౌంటర్ల గురించి, ఉద్యమ కారుల మరణాల గురించీ ఆంగ్లంలో ఇచ్చే వివరణలను తెలుగులో తర్జుమా చేసేవాడు. ఎంత మనసు చంపుకున్నా బూటకపు ఎన్‌కౌంటర్లనీ తెలుస్తూనే ఉన్నా శ్రీ.శ్రీ వాటిని ఎదురుకాల్పులుగా మార్చి రాసే పనిలో ఉన్నాడనే విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఒక్క శ్రీ.శ్రీయే కాదు పైన పేర్కొన్న ఏ ఒక్క ఆంధ్రప్రాంత సాహితీ వేత్త ఆనాడు ప్రభుత్వ దమన కాండను నిలదీయలేదు.
 సాయుధ పోరాటంపై రాయకపోయినప్పటికీ ‘మహాప్రస్థానం’ పాడెను ఇప్పటికీ తెలంగాణ వాదులుమోస్తున్నారు. ఆరుద్ర తెలంగాణను చూడకుండానే ‘త్వమేవాహా’న్ని రాసిండు. కె.వి.ఆర్‌. భువనఘోష వినిపించిండు. అట్లాగే విరసం తరపున సాయుధపోరాట సాహిత్య చరిత్రను రికార్డు చేసిండు. తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉన్న వీళ్ళు ప్రత్యేక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి నిర్ద్వందంగా వ్యతిరేకించిండ్రు. తమ ఆంధ్రాధిపత్యాన్ని ప్రదర్శించారు. తాము చెప్పిందే న్యాయం, తాము రాసిందే వేదం అన్నట్టుగా వ్యవహరించిండ్రు.
1969లో ప్రత్యేక తెలంగాణ నినాదం ఉధృతంగా రావడంతో దాన్ని అధిగమించడానికి కమ్యూనిస్టు పార్టీలు, ఆ భావజాలం ఉన్న రచయితలు తిరిగి సాయుధ పోరాటాన్నే తెలంగాణపై ఆయుధంగా మలిచారు. సాయుధ పోరాటాన్ని తామే నడిపించామన్న తీరుతో ‘చరిత్ర’ రచనలు చేసిండ్రు. 1972 నాటికి ‘సాయుద పోరాట’ ఉద్యమానికి రజతోత్సవాలు జరిపి తమ అనుభవాల్ని అక్షరీకరించి ‘విశాలాంధ్ర’ కోసమే సాయుధ పోరాటం జరిగిందని తీర్పులిచ్చారు. సాయుధ ఉద్యమానికి 60 యేండ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పనిని ఇప్పటికీ సిపిఎం పార్టీ బాహాటంగా చేస్తూనే ఉంది. అందుకే ఆంధ్రప్రాంతం వారి రచనల్లో స్వప్రయోజనాలున్నాయి. హిడెన్‌ ఎజెండాలున్నాయి.
సీమాంద్ర ఆధిపత్య శక్తుల రహస్య ఎజెండాలను పసిగట్టి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతూ దోపిడిదార్లను నిలదీయడమే నేటి తెలంగాణ కవుల కర్తవ్యం. ఎవరు ఏ రూపంలో వచ్చినా ఎన్ని మోసపు మాటలు చెప్పినా కరిగి పోవొద్దు. ఎబికె ప్రసాద్‌ లాంటి వాళ్ళు తెలంగాణమే ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతూ ఎన్ని దోబుచులాటలాడిన మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవాలి. కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా బెట్టి స్వీయప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని నరికే “గొడ్డలి కామాలు కావొద్దని కోరుకుంటున్నా!
జర్నలిస్టులుగా, సాహిత్యకారులుగా, మేధావులుగా, విశ్లేషకులుగా, ప్రొఫెసర్‌లుగా, విద్యార్థి నాయకులుగా, రాజకీయ దళారులుగా, దోపిడీదార్లుగా, కబ్జాదార్లుగా, పెట్టుబడిదార్లుగా ఇలా అనేక రూపాల్లో తెలంగాణ ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తున్న వారిని ఎదుర్కోవాలి.
అనేక రూపాల్లో, వివిధ మార్గాల్లో తాము తెలంగాణ శ్రేయోభిలాషులం అని చెబుతూనే ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాహిత్యకారుల గొంతును నొక్కేస్తూ కూడా వీళ్ళు గౌరవింపబడుతున్నారు. మీ కవిత్వంలో ఇమేజ్‌లు లేవు, మీ కథల్లో శిల్పం, శైలి లేదు, భాష ఇబ్బంది కరంగా ఉంది అంటూ తెలంగాణవాళ్ళను తొక్కేస్తున్నారు. ఈ ఆధిపత్యవాదులు వామపక్ష భావజాలం ముసుగులో ఎన్ని అడ్డంకులు కలిగించినా నిలదీయడానికి తెలంగాణ సాహిత్యసమాజం సిద్ధంగా లేదు. ఈ ఆధిపత్యాన్ని మౌనంగా అయినా సరే ఇంకా భరించినట్లయితే భవిష్యత్తెలంగాణ సమాజం క్షమించదు. అందుకే నిజంగా తెలంగాణకు మద్ధతిచ్చే వారెవరో, మద్ధతు ముసుగులో మనల్ని మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నదెవరో తెలుసుకొని మసులుకోవాలి. ప్రజాస్వామిక, న్యాయమైన ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసే కవులను మొహమాటాలు, భేషజాలను పక్కన బెట్టి సాహిత్య సమాజంలో దోషులుగా నిలబెట్టాలి. ఈ పని ఎంత తొందరగా చేస్తే తెలంగాణకు అంత మేలు జరుగుతుంది. వీరు గుర్తించ నిరాకరించిన, నిరాదరణ చేసిన తెలంగాణ సాహితీ ప్రతిభ గుర్తింపుకు ఇది పునాది అవుతుంది.
–సంగిశెట్టి శ్రీనివాస్

VATTIKOTA ALWAR SWAMY THE VISIONARY WRITER

పోలీస్‌ యాక్షన్‌ ముందూ వెనకా…ఆళ్వార్ స్వామి

sangisetti- bharath bhushan photo
సంగిశెట్టి శ్రీనివాస్
సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ఖ్యాతిని, శక్తిని, ఔన్నత్యాన్ని, దశదిశలా వ్యాపింప జేసింది. తప్పనిసరిగా ఈ పోరాటం చరిత్రలో కీలకఘట్టం. ‘సాయుధ పోరాటం’ ప్రారంభించిన మంచికీ, ఆపేసిన చెడుకూ రెండిరటికీ, అనంతర కాలంలో పటేల్‌ సైన్యం చేతిలో ప్రాణాలర్పించిన త్యాగానికీ ఈ ఉద్యమం మైలురాయి. అయితే చాలా మంది కమ్యూనిస్టులు తమ ప్రయాణాన్ని ఈ మైలురాయి నుంచే ప్రారంభించి, గిరికీలు కొడుతూ మళ్ళీ అక్కడికే వచ్చి ఆగి పోతుండ్రు. ‘సాయుధ పోరాటమే’ అన్నింటికి మూలం, అభ్యుదయ చరిత్రంతా దీనితోనే ఆరంభం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను కూడా ఇక్కడి నుంచే లెక్కగడుతుండ్రు. ఇప్పటికీ బిజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ‘సాయుధ పోరాటం’ నిజాం రాజు, ముస్లింల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిందనే భావనను తమ చేతలు, ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, దోపిడీ దారులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, పీడన నుంచి విముక్తి కోసం చేసిన సాయుధ పోరాటాన్ని నేడు ఆయా పార్టీలు తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా వక్రీకరిస్తున్నారు. సిపిఎం పార్టీ, ప్రజాశక్తి ప్రచురణ సంస్థలు తెలంగాణ సాయుధ పోరాటం విశాలాంధ్ర కోసం జరిగిందని ఏటేటా పుస్తకాలు అచ్చువేస్తూ, అందులో పాల్గొన్న వ్యక్తుల చేత చెప్పిస్తున్నారు. అదే చరిత్రగా ప్రచారం చేస్తున్నారు. సాయుధ పోరాటంతో ఏమాత్రం సంబంధంలేని బీజేపి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు చేసిన పోరాటంగా ప్రచారం చేస్తున్నారు. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ పోలీస్‌ యాక్షన్‌ని హైదరాబాద్‌ స్వాతంత్య్ర దినంగ పరిగణిస్తూ పండుగలు నిర్వహిస్తోంది. నిజానికి ఈ పోలీస్‌ యాక్షన్‌ వల్ల వేలాది ముస్లిం ప్రాణాలను, వందలాది హిందువులైన రజాకార్లను, అంతకుమించి సాయుధ పోరాట యోధుల్ని బలిగొన్నది. ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువలేకుండా అమానవీయంగా వ్యవహరించిన ఈ చర్యను పండుగలా జేసుకోవడమంటే వారి జెండా రంగులకు అనుకూలంగా చరిత్రను వక్రీకరించడమే!
కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, రజాకార్లు, ఆర్యసమాజ్‌, ఇత్తెహాదుల్‌, ఆంధ్రమహాసభ, సోషలిస్టులు, షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ ఇలా తెలంగాణ రాజకీయ కార్యచరణను నడిపించిన అన్ని సంస్థల ఉద్యమాలు, వాటి నాయకత్వం, అవి పోషించిన పాత్రల గురించి కథల్లో విశ్లేషణ, విమర్శనాత్మక ధోరణిలో ఆళ్వారుస్వామి దర్శించిండు.
‘పరిగె’ కథలో తల్లిని కోల్పోయి, చెల్లెలు, వ్యాదిగ్రస్తుడైన తండ్రిని సాకే బాధ్యతలు చేపట్టిన వంతు మాదిగ మల్లయ్య పరిగె ఏరుకున్నందుకు అన్యాయంగా మూడ్నెల్ల శిక్ష పడ్డ విషయాన్ని రాసిండు. నిజానికి మల్లయ్య దొరలకు బానిసగా ఉండాల్సిన పరిస్థితిని ‘వంతు మాదిగ’ ‘హోదా’ కల్పించింది. ఈ వంతుమాదిగ పనిచేయడం వల్ల కనీసం ఒక్క పూట కూడా గడవని పరిస్థితి ఉండడంతో ఆఖరికి తనకు లేకున్నా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని రక్షించుకోవడానికైనా ఇంత గంజి కావాలని, దాని వెతుకులాటలో భాగంగా కళ్ళం ఊడ్చిన ఊరవతలి పొలాల్లో ‘పరిగె’ ఏరుకొని తీసుకుపోతుండగా ఒక దొర అడ్డుబడి అది తన పొలం నుంచి దొంగతనం చేసినావని నిందమోపుతూ మొదట ఊరి భూస్వామి దగ్గర, మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పడం జరుగుతుంది. మల్లయ్యను తమ అధీనంలోకి తీసుకొని చావదెబ్బలు కొట్టడమే గాకుండా ఆయనకు బదులుగా చెల్లెలుని ‘వంతు’ పనిమీద పక్కూరికి పంపిస్తారు. తండ్రి చావుబతుకుల మధ్య ఉన్నడని చెబుతున్నా దొర వినకుండా ఆయన అనుచరుల తోటి ‘ముసలి తొక్కు’ ఇయ్యాళ కాకున్నా రేపు సచ్చేటోడే కదా అని అవమానిస్తారు. ఇవన్నీ సాయుధ పోరాటం ఆరంభంలో బలవంతంగా ‘వెట్టి’ చేపించుకుంటున్న దొరల, భూస్వాముల, దేశ్‌ముఖ్‌ల నిత్య కృత్యాలు. చివరికి తండ్రి చనిపోయి, చెల్లి ఎక్కడికి పోయిందో తెలియక మూన్నెళ్ళ శిక్షకు గురై మానసిక చిత్రవధ అనుభవించిన మాదిగ మల్లయ్య క్షోభను ఇందులో అక్షరీకరించాడు.
‘మెదడుకు మేత’ కథలో రజాకార్లు, ఆర్యసమాజ్‌, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వారు ఎవరికి వారు హైదరాబాద్‌ రాజ్యంలో చేస్తున్న, చేపడుతున్న భావజాల ప్రచారం, కార్యకలాపాల్ని లెక్కగట్టిండు. ఆర్యసమాజ్‌, ఇత్తెహాదుల్‌ వారు ఎట్లా మతకలహాలు పెంచి పోషిస్తారో కూడా చెప్పిండు. ఆర్యసమాజం, హిందూ మహాసభ సమావేశాలు, ‘ఓం’ రaండాకు దండాలు, కాంగ్రెసు సత్యాగ్రహాలు, ఇంగ్లీషు మిలిటరీ, సుభాష్‌ చంద్రబోస్‌ పిలుపు, పాకిస్తాన్‌కు తురకలను పంపించాలంటూ ‘‘ఉఠావో బోర్యా బిస్తర్‌` ఏ రోనా పీట్నా క్యాహై’ అంటూ ఆర్యసమాజ్‌ ఆవాజ్‌’ పాటల్ని, మత గ్రంథాల గురించీ ఈ కథలో చర్చించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దోపిడి, దౌర్జన్యం, కుల, మత, వర్గ, వర్ణ రహిత సమాజం స్థాపించబడుతుందని ఆశించాడు. అట్లా కాకుంటే ‘‘ఇంగ్లీషు వాండ్ల పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు భేదమేముంటుంది?’’ అని కూడా తేల్చిసిండు.
‘మాకంటే మీరేం తక్కువ’ కథలో సాయుధ రైతాంగ పోరాట కాలంలో ముందున్న వారు తర్వాతి కాలంలో పదవులు అలంకరించి అప్పుడూ, ఇప్పుడూ రెండుసార్లూ దోసుకున్నారు అనే భావన వచ్చే విధంగా వ్యాఖ్యానించాడు. ఇల్లనక, ముంగిలనక, పెండ్లాం, పిల్లలనక పోరాట కాలంలో ముందున్న వారు పోరు ముగిసిన తర్వాత తమ స్వీయ ప్రయోజనాలకు, పదవులకు ప్రాధాన్యత నిచ్చారని వాపోయాడు.
jailu-lopala
‘కాఫిర్లు’ కథలో ఇత్తెహాదుల్‌ముసల్మీన్‌ భావజాలంతో ఉన్నవారు, అధికారులతో సత్సంబంధాలున్నవారు సైతం భూస్వాములు, దొరలు, దేశ్‌ముఖ్‌లు ఆధిపత్యాన్ని అనివార్యంగా శిరసావహించాల్సి రావడాన్ని గురించి రాసిండు. లెవీలు, పన్నుల పేరిట ప్రభుత్వాధికారులు ఒక వైపు దొరలను మినహాయించి సామాన్య రైతులపై బలవంతంగా వసూలు చేసే విధానాన్ని గురించి కూడా చెప్పిండు. అంతా ‘పైస’కు లొంగేవారే తప్ప ఎవ్వరిలోనూ నీతి, న్యాయం లేకపోవడాన్ని కూడా రికార్డు చేసిండు. అంటే ఆనాటి సమాజంలో నిజాం హైదరాబాద్‌లో ఉండి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా ఎదిగితే గ్రామాల్లో భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, దేశ్‌పాండ్యాలు పేద ప్రజలు, రైతుల పొట్టలు గొట్టి, వాళ్ళ సంపదను కొళ్ళగొట్టేవారు. మరో వైపు అధికారగణం దండుగలు, లంచాలు, లెవీలు, పన్నులు, పట్టీల పేరిట వివిధ సుంకాలు వసూలు చేస్తూ పేద రైతాంగాన్ని పీడిరచేవారు. అది హిందువుల ఇళ్లైనా, మహమ్మదీయుల ఇళ్లైనా అర్ధరాత్రి పూట సోదాలకొచ్చి దొరికింది దోసుకుపొయ్యే తీరుని, వారికి దొరల గడీల్లో ‘ఇంతెజాము’లు జరిగే తీరుని కూడా ఇందులో ఆళ్వారుస్వామి రాసిండు. దీన్ని బట్టి ఆనాటి రాజకీయ స్థితిగతులను అంచనావేయవచ్చు.
‘అంతా ఏకమైతే’ కథలో సమాజంలోని అన్ని వర్గాలు కలిసి దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిండు. ‘అంతా ఏకమై అన్యాయాల నెదుర్కోవాలి. కష్టాలను బాపుకోవాలె. సంఘ బలం వృద్ధి చేసుకోవాలె’’ వైష్ణవులు సైతం దొరల దమనకాండను అనుభవించారు. అన్నడు. ప్రజల మేలు కోసం ఉద్యమాలు చేసినందుకు చాలా సార్లు ‘రమాణరెడ్డి’ అనే మంచి వక్త, నాయకుడిపై జరిగిన దాడిని కూడా ఇందులో ప్రస్తావించాడు. అంటే దొరలు హత్యలకు కూడా వెనుకాడే వారు కాదు అని తెలుసుకోవచ్చు. ఈ దొరల దౌర్జన్యానికి సమాజంలోని అన్ని వర్గాలు బలయ్యాయని చెప్పిండు. ‘‘వారి దౌర్జన్యాల నుండి తప్పించుకున్నదెవరు? బ్రాహ్మణుల హాహాకారాలు యిప్పుడే మీరు విన్నారు. వైశ్యుల స్థితి వేరే చెప్పనవసరం లేదు. రైతులగతి శ్రీ సుబ్రహ్మణ్యం గారు తెల్పారు. గ్రామ పెత్తందార్ల వల్ల లంచాలు తినేవారితో, తప్ప తాగి అమాయక ప్రజలను, న్యాయాన్ని కోరే ప్రజలను లాఠీలతోటి బాది, యిండ్లు పైర్లూ దోసుకునే వారితో మనం పోరాడవలసి ఉన్నది’’ అంటూ ఎవరి మీద ఎందుకు ప్రజా పోరాటం చేయాలో రమణారెడ్డి పాత్ర ద్వారా చెప్పిస్తాడు.
‘ఆలుాకూలి’ కథలో పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొన్న కార్మికుడు గ్రామంలో జరిగే అన్యాయాల్ని ఎదిరించడానికి చేసిన ప్రయత్నాలను రికార్డు చేసిండు. దీని ద్వారా గ్రామాల్లోకి వస్తున్న చైతన్యం కూడా తెలియవచ్చింది. ఆనాటి పట్టణాల్లోని కార్మికుల ఉద్యమాల గురించి ఇలా రాసిండు. ‘‘వేలమంది కూలీల్లో నిటారుగా నిలబడి జయ నినాదాలు కొట్టడం, జెండా పట్టుకొని ఊరేగింపులో ముందు నడవడం, జెండా లాగుకొనవచ్చిన పోలీసువాడిని అదిలిస్తే అంతదూరాన పడివోపడం, అంతా హేళనగా నవ్వుతుంటే గర్వంతో ముందుకు నడవడం’’ అంటూ ఉద్యమ తీరుని, పోరాట యోధుల గురించీ రాసిండు.
నవలిక లాంటి పెద్ద కథ ‘గిర్దావరు’ కథలో సాయుధ పోరాటం ముగిసిన తర్వాత కాంగ్రెస్‌టోపీ పెట్టుకొని గ్రామాల్లోకి పున: ప్రవేశం చేసిన దొరలు భూములపై, రైతాంగంపై అజమాయిషీని చలాయించే రీతిని చెప్పిండు. కమ్యూనిస్టులు పంపిణీ చేసిన భూమిని రజాకార్ల అంతం తర్వాత దొరలు గుంజుకొని అమ్ముకున్న సంగతులను, యూనియన్‌ మిలిటరీ చంపేసిన సాయుధ వీరుల గురించీ, నిజాయితీ పరుడైన గిర్దావరు దొరల ఆగడాలను అడ్డుకున్న తీరునీ ఈ కథలో చెప్పిండు.
‘చిన్నప్పుడే’ కథలో సంగం పంతులు బడి పెట్టడం, ఆంధ్రమహాసభ కార్యకర్త ‘వెంకటయ్య’ గ్రామాల్లో పర్యటనలు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిన తీరు, ఆయన తీసుకొచ్చిన చైతన్యంతో అప్పటి వరకు పెత్తందార్లు నిందలు, నేరాలు మోపి లాగే దండుగలు, లంచాలకు అడ్డుకట్ట పడిరది. చిన్న పెద్ద మర్యాద లేకుండా ప్రతి వారినీ, ప్రతి స్త్రీని దుర్భాషలాడే తీరుకు ఉద్వాసన జరిగింది. కూలీ పనివారికి రెండు పూటలా తిండి దొరికేలా చేసిన కార్యకలాపాలు ఈ కథలో రికార్డయ్యాయి. దున్నపోతు బుస్సుమన్నదని ఒకరి దగ్గర, కోడెదూడ చేలో బడ్డదని మరొకరి దగ్గర, ఇంకొకరి బెర్రెను బందెల దొడ్లో పెట్టించి దండుగలు, దోసాలు వసూలు చేసే ఊరి పటేలు సంగతీ, సర్కారీ రకం కట్ట లేదని బండలెత్తించడం, కట్టెపుల్లలు ఏరుకుందని చెప్పి సిగపట్టుకొని స్త్రీని కొట్టిన దొర సంగతీ, అందుకు అడ్డం వచ్చిన భర్తని బాదిన విషయాన్ని ఈ కథలో చిన్నపిల్లల ముచ్చట్లతోటి చెప్పిస్తాడు.
‘ఆక్షేపణ లేదు’ అనే మరో కథలో మాదిగ్గూడేనికి చెందిన దొర జీతగాడు శాయన్న గురించి చెప్పిండు. దొర దగ్గర అప్పు తీసుకున్నందుకు తిట్టడం, వడ్డీతో సహా డబ్బులు కట్టమని వత్తిడి చేయడం, చివరికి శాయన్న హైదరాబాద్‌ పోయి అంటరాని తనంలేని జీవితం గడపి ఊరికొచ్చినప్పుడు దొర మనుషులు పట్టుకొని చంపిన తీరుని కథలో చెప్పిండు. ‘‘వచ్చినాడని చెబుతున్నావు బద్మాష్‌, రెక్కలు విరిచి పట్టుకురా లం….’’. వెంటనే బడే సాహెబు మాదిగ గూడెం పోయిన శాయన్నను పట్టుకొని కొండల్‌రెడ్డి వద్దకు తెచ్చి నిలబెట్టాడు. సాయన్న, కొండల్‌రెడ్డి పిలిపించాడని తెలుపగానే మాదిగగూడెంలో భయం మొదలైంది. బండలెత్తి రూపాయిలు వసూలు చేస్తాడని అంతా జ్యోతిషం చెప్పారు. శాయన్నను చూడగానే కొండల్‌రెడ్డి ‘‘ఓహో! మొగోడి రంగే మారిందోయ్‌ ఏమిరా నీ అప్పు ఎవడు చెల్లిస్తాడురా? లం.. కొడుకును రూపాయిలు ఇచ్చేదాకా కదలనీయకు’’ అని బడాసాహెబును చూస్తూ’’ దొర చెప్పిన సంగతినీ చివరికి దొర సాయన్నను చంపి పోలీసోళ్ళతో కుమ్మక్కయి కేసు మాఫీ చేయించుకున్న తీరుని, దొర వెటకారాన్ని తన బాధను కలిపి రచయిత చిత్రించాడు.
మరో కథ ‘పరిసరాలు’లో మిలిటరీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు భాషను అధికార భాషగా చేసే ప్రయత్నంలో అందరూ తెలుగు నేర్చుకోవాలనే నియమాన్ని తీసుకొచ్చారు. ఇట్లా తెలుగు నేర్చుకోలేక ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్న ఊరికి దూరమై, ఇన్నాళ్ళు పాటించిన నీతికి దూరమైన ముస్లిం యువకుని గాధను చెప్పిండు. అవినీతి, అన్యాయం, రైతులపై దమనకాండ, కార్కికుల ఉద్యమాలు, దొరల రాజకీయాలు, అధికార దాహం, సమాజంలోని ప్రతి ఒక్కరినీ ప్రభుత్వానికి, దోపిడిదారులకు వ్యతిరేకంగా ఏకం చేసిన రైతాంగ పోరాటం, మత విద్వేషాన్ని రగిలించే ఇత్తెహాదుల్ముసల్మీన్‌, ఆర్యసమాజ్‌, మిలిటరీ పాలన, కాంగ్రెస్‌పాలన, కమ్యూనిస్టుల పోరాట విరమణ, వెట్టి చాకిరీ, మత మార్పిడులు, మహిళలకు సమాన హక్కు, ఉరిశిక్షకు వ్యతిరేకంగా పౌరహక్కుల ఉద్యమకారుల సన్నద్ధం, దాసి కొడుకుల సామాజిక స్థితి, వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న చదువుకున్న యువతరం అన్నీ కలగలిపి ఆళ్వారుస్వామి కథలు తయారయ్యాయి. జీవితం, సంఘర్షణ, ఆర్తి, బాధ, మానవీయత, ప్రజలపట్ల, ఖైదీల పట్ల సానుభూతి, సాయుధ రైతాంగ పోరాటం, గాంధీ ఫిలాసఫీ, కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రమహాసభ కార్యకలాపాలపై పూర్తి అవగాహనతో చేసిన విమర్శ ఈ కథల్లో అంశాలయ్యాయి. భాష, నుడికారం, సామెతలు తెలంగాణ జనసామాన్యానికి అర్థమయ్యే విధంగా తీర్చి దిద్దాడు. ‘మొగోనికి ఏం బిర్రొచ్చిద్ది’, అనే పదాల ద్వారా ఆనాటి కుల సమాజాల వాడుక భాషను అక్షరీకరించాడు.
ఇట్లాంటి సందర్భంలో ఆళ్వారుస్వామి తన కథల ద్వారా వ్యక్తం జేసిన అంశాల్ని ఒక్కదగ్గర పోగేసుకున్నట్లయితే ఆనాటి తెలంగాణ సమాజం నడిచిన దారి తెలుస్తుంది. ఇప్పుడు నడవాల్సిన తొవ్వా దొరుకుతుంది. ఉరిశక్షలకు వ్యతిరేకంగా, హిందూ, ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పేద, కార్మిక, కర్షక వర్గాలు చేసిన పోరాటాలను, దళిత, బహుజన ప్రజల త్యాగాలు, అణచబడ్డ ప్రజల జైలు జీవితాలు, మహిళల వెతల్ని చిత్రిక గట్టిండు. వారి సాహస పోరాట పటిమను ఈటెలుగా మార్చి గురి చూసి విసిరిండు.
జైలు ఉరిశిక్షలు
ఆళ్వారుస్వామి తన కథల్లో అన్నిటికన్నా ఎక్కువ ఆర్తితో, కండ్లల్లో చెమ్మతో, గుండెల్లో తడితో రాసిన కథలు నేరము`శిక్షకు సంబంధించినవి. జైలు జీవితం స్వయంగా గడిపినవాడు కావడం, సమాజంలోని అట్టడుగు వర్గాలతో కూడా కలిసి ఉద్యమాలు చేసిన అనుభవం, పౌరహక్కుల కోసం తెలంగాణలో ఉద్యమస్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితులు, ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచి ‘సాయుధ’ పోరాటం చేస్తున్న రైతాంగం, రెండో ప్రపంచ యుద్ధం నిత్యావసరాలపై, ప్రజల జీవితాలపై చూపించిన ప్రభావం అన్నీ కలగలిసి ఆయన్ని ‘నేరము`శిక్ష’కు సంబంధించిన కథలు రాసేలా చేశాయి. అఖాడా స్థాపించినందుకు ద్వీపాంతరవాస శిక్ష, పరిగె ఏరుకున్నందుకు వంతుమాదిగ మల్లయ్యకు మూన్నెళ్ళ శిక్ష, మిలిటరీలో ఉంటూ ఆర్యసమాజ్‌ కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తి, ఉరిశిక్షకు గురైన వాడి గురించీ తన కథల్లో ఆర్తిగా చిత్రించిండు. ముఖ్యంగా ఉరిశిక్ష గురించి 1950ల్లోనే వ్యతిరేకంగా మాట్లాడి, కథలో చర్చ చేసి తన పౌరహక్కుల దృక్పథాన్ని స్పష్టం చేసిండు. నిజానికి హైదరాబాద్‌ రాజ్యంలో ఉరిశిక్ష అమల్లో లేదు అనే విషయాన్ని కూడా మరో సందర్భంలో చెప్పిండు. ఆఖరికి నిజాంపై బాంబులు వేసిన వారికి కూడా ఉరిశిక్ష పడలేదని గుర్తుంచుకోవాలి.
‘స్వాతంత్య్రం’ వచ్చి 65 యేండ్లయిన తర్వాత కూడా ‘ఉరిశిక్ష’ను పూర్తిగా రద్దు కాలేదు. ఆ శిక్షే ఒక నేరమని ఇప్పుడు హక్కుల సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉరిశిక్ష రద్దుకు ఉద్యమస్థాయిలో పనిచేయడానికి ఏ సంఘం కూడా నడుం బిగించడానికి నేడు సిద్ధంగా లేదు. అట్లాంటిది ఆళ్వారుస్వామి స్వాతంత్య్రం పూర్వమే ఉరికి వ్యతిరేకంగా ‘పతితుని హృదయం’ ‘అవకాశమిస్తే’ పేరిట కథలు రాసిండు. నిజానికి హైదరాబాద్‌ రాజ్యంలో ఉరి అమల్లో లేదు. ఉరిశిక్ష నిషేధింపబడాలని ఆళ్వారుస్వామి కోరుకున్నాడు. అమానవీయమైన శిక్షగా దాన్ని వర్ణించాడు. హత్యలు చేసి జైలుకొచ్చిన ఖైదీ చేత ఉరిని నిరసిస్తూ మాట్లాడిస్తాడు. ఉరి ప్రభుత్వం చేసే హత్యలే అని తేల్చేస్తాడు. గండయ్య అనే ఖైదీ తాను అంతకుముందు రెండుమూడుసార్లు మాత్రమే చూసిన ఒక ఖైదీకి ఉరిశిక్ష పడ్డప్పుడు చాలా దుఖిస్తాడు. ‘ఓ మనిషిని ఇంకో మనిషి చేతులు కట్టి, ఉరి పెట్టి వ్రేలాడతీస్తే చచ్చిందాక గుడ్లు మిటకరిస్లూ చూడటానికి అక్కడ నిలుచున్న వాండ్ల కెట్లా మనసొప్పిందో? నాకైతే అతని పీనిగెను చూడటానికి కూడా మనసొప్పలేదురా’’ అంటూ తన బాధను ఖైదీ ద్వారా వ్యక్త పరుస్తాడు.
నాజీ, నియంత, కర్కోటకుడు, డిక్షనరీల్లో ఉన్న అన్ని పదాలతో ఏడో నిజాం మీర్‌ ఉస్మానలీఖాన్‌ని నిందిస్తున్న వాళ్ళు ఆయన హయాంలో హైదరాబాద్‌ రాజ్యంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉరికి బదులు 50, 60 ఏండ్లు శిక్ష వేసినా నష్టం లేదు గానీ ఆ శిక్షను రద్దు చేయాలని ‘పతితుని హృదయం’ కథలో ఖైదీ గండయ్య పాత్ర ద్వారా చెప్పిస్తాడు. ‘‘…25 ఏండ్ల వయసు కుర్రోడ్ని పెండ్లికొడుకోలే పట్టుకెళ్ళి స్థంభానికేలాడ దీయడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీకు కోపమోస్తె మానెగాని నీవు మనిషివి కావయ్యా!’’ అంటూ ఉరిని అమలు చేసిన జైలు ఉద్యోగినుద్దేశించి గండయ్య అన్నాడు. హత్యలు, దొమ్మీలు, దోపిడీలు, పెండ్లిళ్ళు ఎత్తగొట్టి, కొంపలు కూల్చిన వాడివని గండయ్యను నిందిస్తూ, రెండ్రోజులు చూసినవో లేదో ఆ ఖైదీని ఉరితీస్తే ఏడుస్తావెందుకు? అని పోలీసాయన నిలదీస్తే దానికి జవాబుగా ‘‘మాటి మాటికి మాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది. తప్ప త్రాగి, ఉడికీ ఉడకని మాంసము తిని, బజారు మండలతో కాలము గడిపే మేము ఒళ్ళు మరచి ప్రాణాలు తీశాం. దార్లు కొట్టి పెండ్లి పిల్లలపై నగలు అపహరించాం. ఇండ్లల్లో జొరబడి దోచుకున్నాం. మత్తు దిగింతర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాపపడ్తాం. మేము చదువు రాని మొద్దులం. మాలో చదివినోడు గాని, మంచి చెడ్డ తెలిసినోడు గాని ఒక్కడుండడు. చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం. వాండ్లతో తిరిగాం. అవే బుద్దులు, అదే బతుకు’ అంటూ‘‘మరి నీ సంగతేమంటావు? ఏదో ఖానూను ప్రకారమని అన్నావే. చదువుకున్న పెద్దలు, మావంటి వాండ్లను జేల్లో పెట్టి బాగుచేయ తలచుకున్న పెద్దలు, మనిషిని చంపేదానికి ఖానూను వ్రాస్తే వాండ్ల నుండి మావంటి వాండ్లు ఏం నేర్చుకోవాలె? ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరి తీసి చంపమని ఎట్లా అంటుంది? మాట్లాడవేం’’ నిలదీసిండు. ఇదీ ఉరిశిక్ష పట్ల ఆళ్వారుస్వామికున్న అభిప్రాయాలు. క్షమించమంటే ఉరిశిక్షలు రద్దు చేసినవారున్నారు. జుర్మానాలు కొట్టివేసిన వారున్నారు అని పరోక్షంగా నిజాంని గురించి కూడా తన కథల్లో ఆళ్వారుస్వామి రాసిండు.
గాంధీని బ్రిటీష్‌ ప్రభుత్వం వారు ఉరితీద్దామని ప్రయత్నిస్తే దాన్ని నిజాం వద్దాన్నాడని ఒక పాత్ర ద్వారా ‘ఆక్షేపణ లేదు’ అనే కథలో చెప్పిస్తాడు. ‘‘గ్రాంధీ అంటే ప్రేమ గాదోయ్‌. మన రాజ్యంలో ఉరిదీయవద్దని ఖానూనులా ఉంది. అట్లాగే కుంఫిణీ సర్కారును గూగా ఉరిదీయవద్దంటే సరే అని ఊరుకున్నది’’అని చెప్తిస్తాడు. ఈ సమయంలోనే సాయుధ పోరాట కాలంలో చెలరేగినందుకు ‘తెలంగాణ 12’ పేరిట కేసు నమోదయింది. ఈ కేసులో 12 మంది ఉరిశిక్షను రద్దు చేసిన సంఘటన ఈ కాలంలోనే చోటు చేసుకుంది. దీని పూర్వపరాలన్నీ ఆళ్వారుస్వామికి విదితమే!
నెహ్రూ అన్న మాటలు ‘‘నిజానికి మనదేశంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నూటికి 85 మంది నేరప్రవృత్తి గలవారు కాదు. తక్కిన 15 మంది కూడా స్వభావత్ణ నేరకాండ్రు కారు. పరిస్థితులే వారి నావిధంగా చేశాయి’’ పుస్తకం ఆరంభంలో ఇచ్చాడు. ఇవే మాటలు ‘అవకాశమిస్తే। కథలో చెప్పిండు. దానికి జోడిరపుగా పది ఏండ్లు శిక్ష అనుభవిస్తున్న మామూలు నేరగాడు, జేలు వెలుపల ఉన్న పెక్కుమంది కంటే ఉత్తముడే’’ అని చెప్పిండు.
మతకలహాలు హైదరాబాద్‌లో మిగతా భారతదేశం మాదిరిగా భయానకంగా లేకపోయినప్పటికీ చెదురు ముదురు సంఘటనలు అప్పుడప్పుడు జరిగేవి. ‘మెదడుకు మేత’ కథలో హిందూాముస్లింల మధ్య కొట్లాటలు చెలరేగడానికి, అనైక్యతకు కారణాలను విశ్లేషించాడు. ఇరు మతాల్లోని విభిన్న మతాచారాలు, దాన్ని అడ్డంగా పెట్టుకొని చాంధసులు ఉద్రేకతలను రెచ్చగొట్టడాన్ని రికార్డు చేసిండు.
మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ఊరేగింపులో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, హత్య చేసి జైలుకొచ్చిన ఖైదీల మధ్య చెలరేగే ఘర్షణలకు మతం రంగు పులుమడం, దాన్ని ఆధునిక భావాలు గల మోహన్‌రావు అనే రాజకీయ ఖైదీ తీర్చే విధానాన్ని ‘మెదడుకు మేత’ కథలో ఆళ్వారుస్వామి రాసిండు. ఆర్యసమాజం భావాలతో ఉన్న హుకుంసింగ్‌ రేపు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తురకల్నందరినీ ఇండియానుంచి వెళ్ళగొట్టాలే అనే అభిప్రాయంతో ఉండేవాడు. ‘‘ఉఠావో బోర్యా బిస్తర్‌, ఏ రోనా పీఠ్నా క్యాహై’’ అని ముస్లింలందరూ ఇక తమ పెట్టేబేడా సర్దుకొని ఈ దేశం విడిచి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని పాటల రూపంలో వ్యక్తం జేసేవాడు. ఆయన హైదరాబాదీ కాదు. మధ్యప్రదేశ్‌ ప్రాంతం నుంచి వచ్చిన వాడు. పేరు ఆర్యసమాజ్‌ అయినా బయటి ఆచరణ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ పంథాయే. ఎందుకంటే ఈ కథలో మోహన్‌బాబు నేర్పిన ‘‘రామ్‌ కే సంఘ్ మే  లక్ష్మణ్‌ థే, గాంధీకే సంఘమే  నెహ్రూ హై’’ అని హకుం సింగ్‌ తరచుగా పాట పాడుతూ ఉండేవాడు. అంటే బయటికి కనిపించేది కాంగ్రెస్‌ లోపల మాత్రం ఆచరణ అంతా ఆర్యసమాజ్‌ది. ఈ ద్వైవిధీభావం తెలంగాణలో కూడా అదే విధంగా ప్రతిఫలించేది.
ఆర్యసమాజ్‌ పేరిట ఒక వైపు శుద్ధి కార్యకలాపాలు, మరో వైపు అఖాడాల ఏర్పాటు, అలాగే మతం మార్చుకున్న దళితుల్ని వ్యవసాయ పనులకు పిలువక పోవడం, వారిని తూష్ణీకారంతో చూడడం, చివరికి దళితులు విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ శుద్ధి ద్వారా హిందువులుగా మారేందుకు తోడ్పడడం ఆర్యసమాజ్‌ చేసిన పని. దీనికి కాళోజి నారాయణరావు లాంటి వారు కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే రజాకార్ల దురాగతాలను ఎదుర్కొనే దశలో కొంత మేరకు ఆర్యసమాజ్‌ భావాల్ని పుణికి పుచ్చుకొని మిలిటెంట్‌గా తయారయ్యిండ్రు అప్పటి లౌకికవాదులు కూడా. అయితే ఈ దోషం ఆళ్వారుస్వామికి అంటలేదు. ఈయన తన రచనలతో పాటుగా ఆచరణలో కూడా లౌకికంగానే ఉన్నాడు.
ఆర్యసమాజ్‌ వాండ్లు కేవలం ‘అఖాడా’లు స్థాపించి ఉద్యమాన్ని చేపట్టగా ముస్లిములు ‘కాక్సార్‌’ ఉద్యమాన్ని లేవదీశారు. కాక్సార్‌ అంటే సాయుధ శిక్షణ. ఈ ఉద్యమాన్ని మొదట ఇనాయతుల్లా మష్రీకి అనే ముస్లిం నాయకుడు చేపట్టాడు. అయితే మజ్లిస్‌ పార్టీకి చెందిన బహదూర్‌యార్జంగ్‌ ఆయన్ని తోసిరాజని నాయకత్వాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో సిద్దిఖ్‌ దీన్‌దార్‌ అనే అతను తాను చెన్నబసవేశ్వరుని అవతారమని చెప్పుకున్నాడు. అదే విధంగా రాముడు, కృష్ణుడులను తూలనాడాడు. దీంతో ఆర్యసమాజ్‌కు చెందిన మంగళదేవ్‌, పండిత రామచంద్ర దహెల్వీ తదితరులు అందుకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
                                            ఆళ్వారు జెండర్‌ స్పృహ
ఇప్పటికి కూడా చర్చలోకి రాకుండా ఉన్న స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం, స్త్రీ చేసిన ఇంటి పనిని ఆర్థిక కోణంలో చూసే దృక్కోణం అలవడలేదు. ఆ రోజుల్లోనే స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని, స్త్రీలు కుటుంబంలో చేసే పనికి విలువను లెక్కగట్టాలని తన కథల్లోని పాత్రల ద్వారా చెప్పించిన గొప్ప ‘జెండర్‌ స్పృహ’ ఉన్న రచయిత ఆళ్వారు. ఇంటిపనుల విషయంలోనే కాదు బయటి పనుల్లో కూడా స్త్రీలకు సమానమైన వాటా, గౌరవం దక్కాలనే భావనను 60 యేండ్ల కిందనే ప్రచారంలోకి తీసుకొచ్చిన వాడు ఆళ్వారుస్వామి. మగవాండ్లే తియతియ్యని మాటలు చెబుతూ ఆడవాళ్ళకు అడ్డుకట్ట వేస్తున్నారని ‘అవకాశమిస్తే’ కథలో సరోజిని పాత్ర ద్వారా చెప్పించాడు. మగవాళ్ళు స్వార్థులు అని చెబుతూ స్త్రీ స్వేచ్ఛకు పురుషుల ఆధిపత్య మనస్తత్వం, సంస్కారరాహిత్యం, సాంప్రదాయాలు పేరిట కలిగించే అడ్డంకులే ప్రధాన కారణమని చెబుతుంది. పురుషుల కన్నా స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ కారని చెబుతూ తమకు ‘అవకాశ మిస్తే’ తమ శక్తిని, సామర్ధ్యాన్ని నిరూపించుకుంటామని మహిళా దృక్కోణంలో సమాజాన్ని చిత్రించాడు.
‘అవకాశమిస్తే’ కథను పురుషాధిపత్యంలో బందీ అయిన ‘మహిళ’ను, జైలులో బందీ అయి విషాదంగా మరణించిన ‘ఖైదీ’ పాత్రను పోలుస్తూ సంభాషణ రూపంలో కథను నడిపించిన తీరు బాగుంది. స్త్రీకి ఇల్లు, పిల్లలు, భర్త, ఇంటి పనులు ఇవన్నీ కలగలిసి ‘జైలు’లో లాగా జీవితం గడిచిపోతుందనే భావనను ‘సరోజిని’ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. అలాగే పొద్దస్తమానం విరామం లేకుండా చేసే చాకిరికి భర్తలు జీతం చెల్లించాలనే ఆలోచన కూడా వ్యక్తం జేస్తుంది. దీనికి భర్త జవాబిస్తూ ‘భార్యాభర్తల సంబంధం, కుటుంబ జీవనం జీతానికంటె, విధకంటె అతీతమైంది. వర్ణించవీలుగాని ఆత్మీయత అది. దానికి వెలలేదు. వర్ణనాలేదు’’ అంటాడు.
‘‘అట్లాగా? ప్రపంచమంతా ఒక కుటుంబమని, ప్రపంచ ప్రజలంతా ఒక కుటుంబీకులని అప్పుడప్పుడు మీరు చెప్పే ధర్మసూత్రాల ప్రకారము, ఈ విశాల కుటుంబమునకు చెందిన మీరు మీ కుటుంబములో నేను నిష్కామకర్మ చేస్తున్నట్టే. ఆ 1500 (రూ.లు) రాళ్ళు తీసుకోకుండా ఎందుకు మీరు ఉద్యోగం చేయకూడదు?’’ అని కూడా భర్తకు ఎదురు ప్రశ్నవేసి నిరుత్తరుణ్ని చేస్తుంది సరోజిని. అలాగే ‘‘అన్నిటిని అరికట్టేవారు పురుషులు. స్త్రీలు ఎల్లప్పుడూ పురోగాములే ఎప్పుడూ ముందడుగే’’ అని స్త్రీలను అడ్డుకునేది పురుషులే అని వాళ్ళే ప్రగతి నిరోధకులని చెప్పింది. ఇట్లాంటి పాత్రల ద్వారా ఆళ్వారుస్వామి తాను స్వయంగా ఏదైతే పాటించాడో దాన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. హైదరాబాద్‌లోనే కాదు విజయవాడలాంటి దూర ప్రదేశాల్లో కూడా సమావేశాలు జరిగితే అక్కడికి సతీసమేతంగా హాజరయ్యేవాడు. అప్పటికి ఇప్పటికీ ఎంతో ప్రగతిశీలురు అనుకునే వారు సైతం తమ తమ భార్యలను సమావేశాలకు తీసుకురాకుండా పోయేది.
‘విధిలేక’ కథలో తనని పోషించలేక పోతున్న భర్త నర్సయ్యను వదలి మంచిగా చూసుకుంటున్న మరోవ్యక్తితో వివాహం చేసుకున్న భార్య పెంటమ్మకథను చిత్రీకరిస్తాడు. నిస్సహాయ స్థితిలో పోషించేవాడిని వివాహమాడటాన్ని ఈ కథ ద్వారా ఆళ్వారుస్వామి ఆమోదించారు. పొట్టకు లేక చావడమా? వేరే అతన్ని పెళ్ళి చేసుకొని బతకడమా? అనే సంశయం వచ్చినప్పుడు వేరే పెళ్ళి చేసుకొని బతకడమే న్యాయం అని ఈ కథ ద్వారా ఆళ్వారు తీర్పిచ్చాడు.
‘భర్త కోసం’ కథలో అఖాడా స్థాపించిన ‘నేరానికి’ అరెస్టయిన భర్త రామదాసుని రక్షించుకోడానికి భార్య లక్ష్మి తల్లడిల్లిన తీరుని, పడ్డ వేదనను రికార్డు చేసిండు. చివరికి ద్వీపాంతర వాస శిక్ష విధించబడ్డ భర్త కోసం విధిలేక ప్రాణార్పణ చేసిన తీరులో ప్రేమమయి ‘స్త్రీ’ హృదయాన్ని పూసగుచ్చినట్టు చెప్పిండు. మరో గొప్ప కథ ‘రాజకీయ బాధితులు’. ఇందులో సాయుధపోరాటంలో పాల్గొన్న భర్త గురించి గర్వంగా చెప్పుకునే పెంటమ్మ, చివరికి విరమణానంతరం కూడా ఆయుధాన్ని సాయుధంగా చేసిన భర్త చనిపోయిండో, బతికుండో తెలువక పోవడం, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా యుద్ధం కొనసాగించినందుకు అటువైపు నుంచి ఏమాత్రం సహాయం అందని స్థితిలో భర్తను వెతుక్కుంటూ హైదరాబాద్‌ వచ్చి స్వీపర్‌గా స్థిరపడ్డ పెంటమ్మ జీవితాన్ని ఇందులో చిత్రించాడు. ఆత్మగౌరవంతో బతికే దళిత మహిళ, మతం మార్చుకున్న దస్తగీర్‌కు దగ్గరై ఆయన్ని వివాహం చేసుకోవడాన్ని కూడా ఇందులో రాసిండు. అటు తన జీవితాన్ని పోరాటానికి అర్పితం చేసిన భర్త కనబడక పోవడం ఒకవైపు, మరోవైపు పటేల్‌ మిలిటరీ సైన్యం గ్రామాల్లో ఉద్యమకారులని ఏరి ఏరి చంపుతున్న కాలంలో భర్త ఏమైండో తెలియక పెంటమ్మ పడే వేదనను మానసిక సంఘర్షణను పోరు వాతావరణాన్ని స్వయంగా చూసినవాడు కావడంతో ఆళ్వారుస్వామి బాగా చిత్రించగలిగాడు.
పెంటమ్మ భర్త కోటయ్య అన్యాయాలకు ఒడిగట్టే వారిని అణచి వేసేవాడని చెబుతుంది. అంతే కాదు ఆనాడు కూడా దళాల్లో పనిచేసే వారి పట్ల దుర్బుద్ధితో వ్యవహరించిన వారికి తగిన శాస్తి చేసినట్టు కూడా చెబుతుంది. దీనివల్ల ఆనాటి సంగతులు మనకు అవగతమవుతాయి. ‘‘ఒకసారి ఊళ్ళోకి వచ్చిన బీటు జవాను పశువుగా వ్యవహరించబోతే పెంటమ్మ చేసిన ఆర్భాటం మొత్తం హరిజనవాడతో పాటు గ్రామమంతా పెంటమ్మ శీలాన్ని హర్షించింది. పోరాట కాలంలో కోటయ్య దళానికి చెందిన ఒకడు ఒక స్త్రీ విషయంలో దుష్టబుద్ధి కలిగి ఉన్నాడని తెలిసి కోటయ్య అతనికి చేసిన ప్రాయశ్చిత్తానికి పెంటమ్మ ముగ్ధురాలై తన భర్తను గా భావించింది’’. అట్లాంటి భర్త సాయుధ పోరాటం చేస్తూ బతికుండో, లేడో కూడా తెలియక పోవడంతో ఆఖరికి ఆర్యసమాజ్‌/మిలిటరీ వాండ్ల చేతిలో భార్యను పిల్లలను కోల్పోయిన దస్తగీర్‌ని వివాహమాడిన విషయాన్ని, అందుకు కల్పించిన సన్నివేశాన్ని, వాటి నిర్వహణలో ఆళ్వారుస్వామి చూపిన ప్రతిభ అద్వితీయం.
‘ఆలుాకూలి’ కథలో భార్యను అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవాలని చూసే పల్లెటూరి అనుమానపు భర్తకు, పట్నవాసపు భార్య పార్వతమ్మ చెప్పిన గుణపాఠాన్ని కథగా మలిచిండు. అధికారమున్నోడికి ఆలన్నా, కూలన్నా ఒక్కటే అని తీర్పిచ్చిండు. ‘‘అమ్మగారు! తెలియకడుగుత మేమంటే కూలి చేస్కోని బతికేటోల్లం. మాకు యాజమాన్లకు పనిచేసేంత సేపే సంబంధం. మేమేది కావాలన్నా, వాండ్ల లాభాలు తగ్గుతయని భయమనుకుందాం. మాదేందిగాని, ఒక సంగతి అడుగుత, మీరు తెలిసినోరు, చేసుకున్న పెళ్ళామైనా, తోబుట్టు ఆడదైనా, కనిపెంచిన తల్లైనా మొగోడికింద పనికిరాదు. ఎంత పక్కల్లో రెక్కల్లో కాళ్ళల్లో, వేళ్లల్లో మెలిగినా జిట్టెడు మొగోడు గుట్టంత ఆడదాన్ని గోటికింద కట్టేస్తాడు. దీన్నేమనాలే’’ అని రంగడి తోటి ప్రశ్నింపజేస్తాడు. అంటే ఆ పద్ధతి మారాలని ఆళ్వారు తపించాడు.
నిజానికి ఆళ్వారుస్వామి స్త్రీ స్వేచ్ఛ ధృక్కోణంలో కథలు రాసే సమయానికే తెలంగాణలో కొంత మహిళా చైతన్య వాతావరణం ఏర్పడిరది. ఆంధ్రమహాసభల ద్వారా ప్రతి సమావేశంలో మహిళా మీటింగ్స్‌ని విధిగా నిర్వహించేవారు. పరదాల మాటున చర్చలు జరిగినా వాటిని పుస్తకంగా తీసుకొచ్చి చర్చలన్నిటినీ రికార్డు చేసేవారు. దాదాపు ఇదే సమయంలో ఎల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, టి.వరలక్షమ్మ తదితర మహిళా రచయితలు స్వయంగా మహిళా సమావేశాలకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించి తమ చైతన్యాన్ని విస్తృతం చేసుకున్నారు. ఆంధ్ర యువతీ మండలి, కుట్టి వెల్లోడి సంక్షేమ కార్యక్రమాలు, దుర్రెషెవార్‌, నీలోఫర్‌ల ప్రజాహిత కార్యక్రమాలు అన్నీ కలగలిపి మహిళా ధృక్కోణం నుంచి కూడా ఆలోచించే చైతన్యాన్ని ఆళ్వారుస్వామికి అందించింది.
కాంగ్రెస్‌ కమ్యూనిస్ట్‌ దొందూ దొందే!
స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్‌ పార్టీ, కొన్ని చోట్ల కమ్యూనిస్టులు కూడా దోపిడీకి పాల్పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్రీ బ్యాంక్‌ని దోపిడీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ‘జాయిన్‌ ఇండియా’ ఉద్యమం, ‘బాధ్యతయుత ప్రభుత్వం’ ఏర్పాటు, ‘దున్నేవాడికే భూమి’ పేరిట జరిగిన పోరాటాల్లో దొమ్మీలు, దోపీడీలు కూడా నిత్య కృత్యమయ్యాయి. పోలీసు చర్య ద్వారా బలవంతంగా భారత యూనియన్‌లో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వాత పాత హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వం కనుమరుగయింది. ఈ కాలంలో దొంగలకు, కాంగ్రెస్‌ పార్టీ వారికీ తేడా లేదు అనే విధంగా ఆళ్వారుస్వామి ‘‘మాకంటే మీరేం తక్కువ’’ కథలో చెప్పిండు. దొంగతనమే వృత్తిగా చేసుకొని బతుకుతున్న రంగడు, వెంకడు ‘పోరాట’ కాలంలో చేసిన ఉద్యమకారులతో కలిసి ‘జై’ అంటూ దొంగతనానికి పాల్పడితే పార్టీ వాళ్ళు పట్టుకొని చావదెబ్బలు కొట్టిన తీరుని గుర్తు చేసుకుంటూ, అక్కడ పార్టీని నడిపించిన దొర వేరెవ్వరినీ ఆ ఇలాకాలో అడుగు పెట్టనివ్వలేదని, కనీసం నీడ కూడా పడనీయలేదని ఈ కథలో దొరల తీరుని అక్షరబద్ధం చేసిండు. అయితే ఇక్కడ చెప్పింది కాంగ్రెస్‌ వారిని గురించి కాకుండా కమ్యూనిస్టుల గురించి చెప్పిండని అర్థం చేసుకోవాలె.
‘‘మారాజులు కష్టపడ్డందుకు గట్టెకిన్రు. మేము ఉన్నచోటనే ఉన్నాం. పాపం పుటుకలు’’ రంగడు గోళ్ళు గిల్లు కుంటు అన్నాడు.
‘‘వాండ్లంటే ఇల్లనక, ముంగిలనక, పిల్లనక, మేకనక చెట్టు గుట్టలుపట్టి ఎంత చెఱపడ్డారు పాపం’’ అంటూ ఇంద్రసేనా రెడ్డి అనే తొంటదొర చేసిన కార్యకలాపాలను లెక్కగట్టిండు. ఈ దొరని జైలు పరిశీలకునిగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆయన జైలు పరిశీలనలో భాగంగా వీరున్న రంగడు, వెంకడు ఉన్న బ్యారక్‌కు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న సన్నివేశాన్ని అర్ధవంతంగా ఆళ్వారుస్వామి చిత్రీకరించాడు.  ‘‘దొరా! మీకు కోపం రాకపోతే ఒకటి అడుగుత. మీరు సర్కారు మీద కత్తికట్టిన ఆరోజుల్లో మానోట్లో మాత్రం మట్టికొట్టిన్రు. ఎక్కడపోయినా మీదే గోల, ఏది దొరికినా మీకేనాయె. ఆ రోజుల్లో మేము పడ్డ కష్టాలు చెప్పితె తీరవు’’ అంటూ ఆనాడు సర్కారు మీద పోరాటం పేరిట దొరలు దోసుకున్న సంగతిని చెప్పిండు. ఈ దొంగలు, దొరలతో పాటు చేరి ‘జై’ కొట్టి తాము కూడా దోసుకోవడంతో దెబ్బలు తిన్నరు. దొరలు కూడా దోసుకున్నారు అని రంగడి పాత్ర ద్వారా ఇలా చెప్పిస్తాడు. ‘‘మీ దగ్గర మేము నేర్చుకునేదేముంది దొరా దీంట్ల. మీరే కొన్నాళ్ళు మా పనులకు ఎగబడ్డారని మావోడు అంటున్నాడు. అవునులేరి. ఎవరికి నచ్చింది వాండ్లు చేస్తుంటారు’’ అంటూ మేము జైళ్లలో ఉన్నాము మీరు అధికారం చలాయిస్తున్నారంటూ ‘మాకంటే మీరేం తక్కువ’’ అని నిలదీస్తాడు. ఈ కథ మొదట ‘ఆనాటి రోజులు’ శీర్షికన 1952 జూన్‌ నాటి ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో అచ్చయింది. దీన్ని 1955లో జైలులోపల కథల సంపుటి వెలువరించే సమయంలో ‘మాకంటే మీరెం తక్కువ’ అని దొరల్ని నిలదీసే విధంగా శీర్షిక పెట్టాడు. పాత కథలోని కొన్ని సంభాషణలు మార్చి, పెంచి పుస్తకంలో జోడిరచాడు.
నిజాం ప్రభుత్వంలో పాఠశాలలు పెట్టుకోవడం, సభలు నిర్వహించుకోవడం, వ్యాయామశాలలు ఏర్పాటు చేసుకోవడం, గ్రంథాలయాలు, పత్రికలు స్థాపించడంలోనూ అనేక ఆంక్షలుండేవి. హిందూ`ముస్లిం ఇద్దరికీ ఈ ఆంక్షలు ఒకేతీరుగా అమలయ్యేవి. మదరసాలు పెట్టాలన్నా, కానిగి బడులు తెరవాలన్నా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించాలనేది నిబంధన. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టకుండా ఉండే విధంగా ఆ యా సభల నిర్వాహకుల నుంచి ముందుగానే హామీ పత్రాన్ని ప్రభుత్వం డిమాండ్‌ చేసేది. అట్లా హామీ పత్రం ఇవ్వని సభలకు అనుమతి లేకుండేది. అలాగే ఈ సభల నిర్వహణల వల్ల స్థానికంగా విద్వేషాలు చెలరేగుతాయని ప్రభుత్వం భావించినా అలాంటి వాటికి అనుమతి నిరాకరించబడేది. అయితే వీటన్నింటిలోకి వ్యాయమాశాల (అఖాడా) ఏర్పాటు చేస్తే నిజాం ప్రభుత్వం ద్వీపాంతరవాస శిక్ష విదించేది. ఇట్లా అఖాడాల ఏర్పాటు, వాటి నిర్వహణ, అందులో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగట్టడానికి ఈ అఖాడాలు ప్రధాన భూమిక నిర్వహిస్తోందని, వీటికి ఆర్యసమాజ్‌ భావజాలం గల వాళ్ళు ఇతోధికంగా తోడ్పడుతున్నారని ప్రభుత్వం వీటి ఏర్పాటుపై ఆంక్షలు విధించింది. ఈ అఖాడాల గురించి వాటికి సంబంధించిన భిన్న పార్శ్వాలను ఆళ్వారుస్వామి తన కథల్లో చిత్రీకరించాడు. ‘భర్త కోసం’ కథలో పోస్టల్‌ ఉద్యోగి, రామదాసు అనే తెనిగాయన ఊర్లో ‘అఖాడా’ ఏర్పాటు చేసినందుకు ద్వీపాంతరవాస శిక్షకు గురవుతాడు. అవి రెండో ప్రపంచ యుద్ధపు రోజులు కావడంతో ‘ఏ సందులో చూసినా గూఢాచారులు ఈగలవలె నున్నారు’. ప్రతిరోజూ అరెస్టులు, శిక్షలు, ప్రవాస శిక్షలు విధించేవారు. ఇక్కడ రక్షణశాఖ వారు అత్యూత్సాహం ప్రదర్శించి ‘‘రామదాసుకు సామాన్య కారాగార శిక్ష విధించినచో యిట్టి రాజద్రోహుల సంఖ్య మితిమీరిపోవుననియు, యితనికి వేయబడు శిక్ష ఇతరులకు గుణపాఠముగా ఉండవలెననియు, ద్వీపాంతరవాస శిక్ష విధిగా విధింపవలయుననియు రక్షణ శాఖవారును, ప్రభుత్వ న్యాయవాదియు గట్టిగా వాదించిరి’’ అంటూ ప్రభుత్వం వారి అసహనాన్ని గురించి చెప్పిండు. అలాగే ‘విధిలేక’ కథలో అఖాడాలు ఎలా సంఘవిద్రోహ శక్తుల అడ్డాగా మారినాయో  పూసగుచ్చినట్టు చెప్పిండు. ‘‘వ్యాయామశాల ఒక క్రొత్త ప్రపంచమనవచ్చు. వివిధ ప్రవృత్తులు, వివిధ అలవాట్లు గల వ్యక్తులతో నిండియుండేది. జేబుదొంగలు, జూదగాండ్రు, కొద్ది కొద్ది దొంగతనాలతో జేలు యాత్రలు చేసినవారు, అరాజక ప్రియులు, వ్యభిచారులు, త్రాగుబోతులు` అన్ని రకాలవారు అక్కడ సమావేశమై తన జీవితమందలి సంఘటనకు గర్వించుకుంటూ, ఒకరికొకరు చెప్పుకుంటా’’రని అఖాడాల లోపలి విషయాలను వెల్లడిరచిండు. అఖాడాలో ‘విందులు, భోగముసానుల ఆటలు, పాటలు, త్రాగుడు తందనాలు’ కూడా విరివిగా జరిగేవి అని ఇదే కథలో మరో చోట చెప్పిండు.
తమ భావజాలంతోనే చివరి వరకూ అంటకాగలేదనో, కింది కులాల గురించి మాట్లాడిరడు అనో తెలియదు గాని సాహితీ ప్రపంచంలో ఆళ్వారుస్వామికి న్యాయంగా, కచ్చితంగా దక్కాల్సిన స్థానాన్ని దక్కనీయలేదు. ఇప్పటి తెలంగాణ ఉద్యమకారులు, సృజనకారులు ఆళ్వారుని జాతీయ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలి. పాఠ్యాంశాల్లో చేర్చే ప్రక్రియను ఆచార్యలోకం ఇప్పటటికైనా గుర్తించి ఈయన మీద విస్తృతమైన పరిశోధనలు చేయించాలి. ఆళ్వారుని జాతీయస్థాయిలో సగౌరవంగా నిలబెట్టేందుకు అన్ని భారతీయ భాషల్లోకి ఆయన సాహిత్యాన్ని, ఆయన జీవిత చరిత్రను తర్జుమా చేయాల్సిన అవసరముంది. కనీసం ఆయన శతజయంతి నాటికైనా ఆయన పేరిట పోస్టల్‌ స్టాంప్‌ని ప్రభుత్వం విడుదల చేసేలా తెలంగాణాభిమానులు, ఆళ్వారుస్వామి అభిమానులు, ప్రజాస్వామిక వాదులు బాధ్యతగా ప్రాధాన్యత క్రమంలో ప్రథమస్థానంలో ఈ పనిని చేపట్టాలి.
గతానికి వర్తమానానికి జరిగే సంభాషణ, సంఘర్షణే చరిత్ర. ఈ చరిత్ర సాక్ష్యాలు, ఆధారాలు, ఫుట్‌నోట్స్‌, బిబ్లియోగ్రఫీలతో రాస్తే అకడమిక్‌ చరిత్ర అవుతుంది. దీన్ని రాసే, ప్రచురించే వారి భావజాలం, లక్ష్యంగా చేసుకున్న పాఠకులను బట్టి కూడా చరిత్ర రచనలో మార్పులు ఉంటాయి. చరిత్రరచయిత కులం, మతం, ప్రాంతం కూడా ఈ రచనలో చొరబడి ‘ప్రామాణికత’కు విఘ్నాలు కలిగిస్తాయి. కొత్త చేర్పులు, మార్పులు, నూతన పరిశోధనలు వాటికి ఆధిపత్య వర్గం, వర్ణం, వారి అధీనంలోని మీడియా, పత్రికలు, విశ్వవిద్యాలయాల పాలక మండళ్ళు, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ అన్నీ కలగలిపి ఎవరికి అనుకూలంగా ఉన్న అంశాలతో మాత్రమే వారు చరిత్రను ప్రచారంలోకి తెస్తున్నారు. ఇదే చరిత్ర ప్రత్యామ్నాయ రూపంలో బహుళ ప్రచారంలో ఉంది. కుర్రారం రామిరెడ్డి, రేణికుంట రామిరెడ్డి, షోయెబుల్లాఖాన్‌, బందగీ, దొడ్డికొమురయ్య తదితర తెలంగాణ యోధుల గురించి తెలుసుకోవడానికి మౌఖిక గాధల ఆధారంగా రాసిన బుర్రకథలు, వారి అనుచరులు, అంతేవాసుల సమాచారంతో రాసిన రచనలే ఎక్కువ. ఇందులో పత్రికలు, ప్రభుత్వ డాక్యుమెంట్స్‌ ఆధారంగా రాసినవి చాలా తక్కువ. ప్రభుత్వ డాక్యుమెంట్స్‌ కూడా పూర్తి వాస్తవాన్ని చెబుతాయని విశ్వసించలేము. అయినప్పటికీ అకడమిక్‌ రంగంలో వాటికే ప్రాధాన్యముంటుంది. బుర్రకథలకన్నా ఎక్కువ జీవితాన్ని, సమాజాన్ని చిత్రీకరించిన నవలలు, కథలు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడానికి మంచి రెఫరెన్స్‌ సోర్సెస్‌. వీటికి ‘ఆచార్య’లోకంలో తగినంత గుర్తింపు లేకపోయినప్పటికీ సాహిత్యం చదువుకున్న వారు చాలామంది దాన్ని ‘చారిత్రక’ అంశంగానే చూస్తారు. కల్పన ఉన్నప్పటికీ వాస్తవ సంఘటనల జోడిరచడానికే వాటిని వాడుకుంటారు. తెలంగాణ విషయంలో సాహిత్యమే చరిత్రకు ప్రధాన వనరు. ఇందుకు ‘సాయుధ పోరాటం’ మినహాయింపు కాదు.
వట్టికోట ఆళ్వారుస్వామి బ్రాహ్మణకులంలో నల్లగొండ జిల్లా చెరువు మాధవరంలో పుట్టిండు. కానీ ఎన్నడు కూడా బ్రాహ్మణ ఆధిపత్య భావజాలాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. డికాస్టిఫై, డిక్లాసిఫై కావడమే గాకుండా అహర్నిషలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిండు. తాను స్వయంగా హోటల్లో పనిచేయడం, వంటజేసి పెట్టడం, గురువుకు సేవచేసి అందుకు ప్రతిఫలంగా రెండు పూటలా భోజనం చేయడం, చివరికి వారాలు చేసుకొని తినాల్సి రావడం చూస్తే ఆయన పేదరికం తెలుస్తుంది. తాను పేదరికాన్ని అణువణువూ అనుభవించిన వాడు కావడమే ఆయన్ని పేదల పక్షపాతిగా తీర్చిదిద్దింది. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి అన్నివేళలా అండగా ఉండడం, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తాను నమ్మిన దానిపట్ల కచ్చితంగా ఉండడం, ఆచరణలో దార్శనికత అన్నీ కలగలిసి ఆయన్ని సంపూర్ణ వ్యక్తిగా నిలబెట్టాయి. అవును కచ్చితంగా సంపూర్ణ వ్యక్తే. దీనిపట్ల కొందరికి అభ్యంతరం ఉండొచ్చు. 46యేండ్ల తన జీవితంలో అన్ని భావజాలాల్ని అతి దగ్గరగా చూసిండు.
ఆంధ్రమహాసభ, సత్యాగ్రహం, గాంధీ ఫిలాసఫీ ఆచరణ, వందేమాతర ఉద్యమం, అభ్యుదయ రచయితల సంఘం, క్విట్‌ ఇండియా, సాయుధ పోరాటం, జైలుశిక్ష, దేశోద్ధారక గ్రంథమాల, సూచీ గ్రంథాలయం, భుజానికి జోళె తగిలించుకొని పుస్తకాలు అమ్మడం, పుస్తకాల ప్రచురణకు పేరున్న వారి పెండ్లిళ్ళ సమయంలో కట్నాలు సేకరించి వినియోగించడం, పగలు, రాత్రి అనే తేడాలకుండా పనులు చేయడం, రాయడం, అధ్యయనం చేయడం, వ్యక్తుల్ని కలవడం, వానమామలై లాంటి వారి ఆరోగ్యం బాగాలేకుంటే ముందుండి వైద్యం చేయించడం, అందుకయ్యే ఖర్చులకు విరాళాలు సేకరించడం, దొడ్డి కొమురయ్య చనిపోతే జయసూర్య నాయుడుతో కలిసి నిజనిర్ధారణకు కడవెండి వెళ్ళడం, గద్వాల రాణి అన్యాయాలకు ఒడిగడుతుందని తెలుసుకొని ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి బద్దం ఎల్లారెడ్డితో కలిసి రాణి మహలక్ష్మమ్మకు వ్యతిరేకంగా నివేదిక తయారు చేయడం, అభ్యుదయ రచయితల సంఘాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమే గాకుండా దాని తరపున తెలుగుతల్లి పత్రిక ప్రచురణ బాధ్యత నెత్తికెత్తుకోవడం, గుమాస్తాల హక్కుల కోసం కొట్లాడటమే గాదు కంకర్ల పెంటయ్య అనే గుమాస్తా నాయకునితో అదే పేరుతో పత్రికను స్థాపింపజేసి తాను వెన్నెముఖై నిలబెట్టడం, ప్రజలమనిషిని భాష విషయంలో భయంభయంగానే బయటికి తేవడం, గంగుని కండ్లసూడక
ముందే కన్ను మూయడం అన్నీ ఆళ్వారుస్వామి కార్యాచరణ, ఆయన సాహిత్య విశిష్టతకు కొంత/కొన్ని పునాది, మరికొంత ఉపరితలమయ్యాయి.
ఆళ్వారుస్వామి ఆచరణ, నిత్య సృజన, విరామమెరుగని కృషి, అలుపెరుగని ప్రయాణం వర్తమాన కాలంలో హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్‌లో కొంతమేరకు దర్శించవచ్చు. అంతేగానీ ఆయనతో పోల్చగలిగిన వ్యక్తి తెలుగునేలలో మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. 2015 ఆయన శతజయంతి సంవత్సరం. ఆప్పటి వరకు ఆళ్వారుస్వామి రచనలన్నీ పుస్తక రూపంలో రావాల్సిన అవసరముంది. నవలలు, కథలు, ఆత్మకథాత్మక రచన, నాటికలు, పద్యాలు, వ్యాసాలు, సమీక్షలు, పత్రికా చర్చలు, అభిప్రాయాలు, డైరీలు, ఆయన రాసిన నివేదికలు, ముందుమాటలు, ప్రచురణ కర్తగా మాటలు, ఉత్తరప్రత్యుత్తరాలు అన్నీ తెలుగు పాఠకులందరికీ అందుబాటులోకి రావాలి. ఈ పని 2014 ఫిబ్రవరి ఐదునాడు ఆయన కొత్త పుస్తకం ఏదో ఒకటి ఆవిష్కరింపజేసుకోవడం ద్వారా ప్రారంభించుకోవాలి.
(గమనిక: ఈ వ్యాసం కోసం ప్రచురితమైన ఆళ్వారుస్వామి కథలు జైలులోపలతో బాటుగా ఇంకా అముద్రితంగా ఉన్న మరో 20 కథల్ని కూడా పరిశీలించడమైంది)