Friday, 8 August 2014

Gadiyaram: never stopped tickling




చరిత్రను చిత్రికగట్టిన గడియారం

    తెలంగాణ పునర్వికాసోద్యమానికి ఊపిరులూది, చైతన్యాన్ని ప్రోది చేసిన పండిత పరిశోధకుడు, సంపాదకుడు, గతానికి-వర్తమానానికి వారధి గడియారం రామకృష్ణశర్మ. హైదరాబాద్‌ రాష్ట్రంలో తెలుగు సాహిత్యానికి ప్రాణంపోసిన ‘సుజాత’ పత్రిక సంపాదకులుగా, శాసనాల పరిష్కర్తగా, సంస్కర్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, సారస్వసత పరిషత్తు నిర్వాహకుడిగా, సభలు, సమావేశాల నిర్వాహకుడిగా, రేడియో ప్రయోక్తగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా తెలుగు జాతికి ముఖ్యంగా తెలంగాణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను రికార్డు చేసే విధంగా కొమర్రాజు లక్ష్మణరావు స్ఫూర్తి, ప్రోత్సాహంతో ‘తెలంగాణ శాసనాలు’ మొదట 1935లో ‘లక్ష్మణరాయ పరిశోధక మండలి’ పక్షాన ఆదిరాజు వీరభద్రరావు ప్రచురించారు. దూపాటి వెంకటరమణాచార్యులు, ఆదిరాజు వీరభద్రరావుల పరంపరను కొనసాగిస్తూ అనంతర కాలంలో ‘తెలంగాణ శాసనాలు’ రెండో భాగాన్ని గడియారం రామకృష్ణశర్మ సంపాదకత్వంలో ప్రచురించారు. ‘‘..83 శాసనములకు పండిత గడియారం రామకృష్ణశ్మ గారు నకళ్ళు వ్రాసి యున్నారు. శ్రీ రామకృష్ణశర్మ గారి చరిత్రాభిమానమును, చారిత్రక కోవిదత్వమును, ఉత్సాహశీలమును, రచనా నైపుణ్యమును ఈ గ్రంథము వేయినోళ్ళ జాటు చున్నది. శ్రీ రామకృష్ణశర్మగారు ఈ గ్రంథ సంపాదకీయ భారము వహించి మమ్ముల కృతకృత్యుల జేసియున్నారు. సంస్కృతాంధ్ర కర్ణాటకాంగ్లేయ భాషలయందు పండితులును, విశేషించి శాసనములను వ్యాఖ్యాన సహితముగా ఇంగ్లీషునందును, తెలుగునందును ప్రకటించి, చరిత్ర పరిశోధన పండిత ప్రకాండుల మెప్పును గడిచినవారు శ్రీ రామకృష్ణశర్మగారు’’ అని ఆయన ప్రతిభను పరిశోధక మండలి గౌరవ కార్యదర్శి ఆదిరాజు వీరభద్రరావు తమ ‘పీఠిక’లో పేర్కొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఆలంపూరు శిల్పసంపద గురించి 1946లోనే పుస్తకాన్ని వెలువరించడమే గాకుండా, శిథిలావస్థలో ఉన్న వాటిని, ముంపుకు గురైన గుడులను యథావిధిగా ఒడ్డుకు తరలించడంలో ఈయన కీలక భూమిక పోషించారు. కేవలం శాసనాలే గాకుండా తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. మిత్రులు, ఆప్తులు సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో 1950లో ‘సుజాత’ సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు. ఇందులో ఆదిరాజు వీరుభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణరావు, సామల సదాశివ (కథలు), మల్లంపల్లి సోమశేఖరశర్మ, తదితర పండితుల రచనలతో పాటుగా, యువ కవులు, కథకులు ఇది వేదికగా ఉండిరది. దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ కవిత మొదటిసారిగా ఈ పత్రికలోనే ప్రచురితమైంది. 
    ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో ప్రత్యేకంగా స్మరించుకోవాల్సిన సంచిక ‘సుజాత`తెలంగాణ సంచిక’ ఇందులో తెలంగాణకు సంబంధించిన చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, పత్రికా రంగాలపై ఆయా విషయాల్లో ప్రసిద్ధులైన వ్యక్తులచే విలువైన వ్యాసాలు రాయించి వెలువరించారు. ఈ సంచికను పునర్ముద్రించినట్లయితే తెలంగాణ వైభవము, ప్రతిభ అందరికీ తెలిసి వస్తుంది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి 1953లో ఆలంపురంలో ‘ఆంధ్రసారస్వత సభలు’ నిర్వహించారు. ఈ సభల్లో శ్రీశ్రీ మొదలు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వరకు తెలుగునాట పేరున్న సాహితీవేత్తలందరూ పాల్గొన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైలుని నడిపించారంటే ఆ సభలు ఎంత ఘనంగా నిర్వహించారో తెలుసుకోవచ్చు. ఈ సభల్లో సురవరం ప్రతాపరెడ్డికి జరిగిన అన్యాయం చర్చనీయాంశమైంది. రాజకీయ రంగంలో ఆయనకు అన్యాయం జరిగినా సాహిత్య రంగంలో ఈ సభ నిర్వహణ ఆ ప్రాంతానికి చెందిన సురవరంపై గౌరవాన్ని పెంపొందించింది. ఈ సమావేశాల్లో చేసిన చర్చలు తర్వాతి కాలంలో కేంద్రం ఏర్పాటు చేసిన ‘సాహిత్య అకాడెమీ అవార్డు’ ప్రతాపరెడ్డికి దక్కేలా చేశాయి. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ఈ పురస్కారం లభించింది. ఈ సభల్లోనే కాళోజి ‘నా గొడవ’ మొదటి సారిగా ఆవిష్కృతమైంది. ఆళ్వారుస్వామి తమ దేశోద్ధారక గ్రంథమాల తరపున దీన్ని ప్రచురించారు.


    మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన స్వాతంత్య్రోద్యమంలో గడియారం రామకృష్ణశర్మ పోషించిన పాత్ర సాహసోపేతమైనది. మహబూబ్‌నగర్‌ సరిహద్దు జిల్లా కర్నూలు నుంచి రేడియో కేంద్రాన్ని నిర్వహించాడు. అరుణా అసఫలీ లాంటి వారి ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ రేడియోలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొంటున్న వీరుల త్యాగాలు, పోరాట పటిమ గురించి వార్తలు ప్రసారం చేసేవారు. ఈ వార్తల సేకరణకు స్వయంగా రామకృష్ణశర్మ రహస్యంగా జిల్లాలో పర్యటించే వారు. పోలీసుల నిఘా తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయన ఉద్యమకారుల కోసం రేడియోను ధైర్యంగా నడిపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసింది కూడా గడియారమే. ఆలంపూరు తాలూకాలోని చెన్నిపాడు గ్రంథాలయం, ఉండవెల్లిలోని శ్రీ సరస్వతీ విలాస పుస్తక భాంఢాగారాలను రూపుదిద్దింది ఈయనే. అలాగే 1946లో సిర్పూర్‌లో నిర్వహించిన గ్రంథాలయ మహాసభల్లో సురవరంతో పాటుగా ఈయన కూడా చురుగ్గా పాల్గొన్నాడు. 
    తనకు అత్యంత సన్నిహితుడైన సురవరం ప్రతాపరెడ్డికి దక్కినట్లుగానే రామకృష్ణశర్మకు స్వీయ చరిత్ర ‘శతప్రతం’కు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కింది. ఈ పుస్తకం అలనాటి తెలంగాణకు దర్పణం. స్వీయ చరిత్రతో పాటుగా దశరూపసారం, భారతదేశచరిత్రం, ఆలంపుర క్షేత్ర చరిత్ర, ఆలంపురం శిథిలములు, తెలుగుసిరి, బీచుపల్లి క్షేత్ర మహాత్మ్యం, ఉమామహేశ్వర చరిత్రం, భారతీయ వాస్తు విద్య తదితర గ్రంథాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.
    1919లో అనంతపురం జిల్లా కదిరిలో జన్మించిన శర్మగారు చిన్నప్పుడే ఆలంపూరులో స్థిరపడ్డారు. తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి, సంస్కృతికి చిరస్మరణీయమైన సేవలందించారు. మూఢాచారాల్ని చీల్చి చెండాడం గురువు, శతావధాని వేలూరి శివరామశాస్త్రి నేర్చుకున్న శర్మ ప్రతిభకు గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ని  ప్రకటించింది. ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ, రాష్ట్ర గ్రంథాలయోద్యమానికి, శాసన పరిశోధన రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆయన నిర్వహించిన సుజాత పత్రిక అన్ని సంచికలను పునర్ముద్రించినట్లయితే నేటి తరం పరిశోధకులకు, పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణను కార్యరంగంగా ఎంచుకొని ఆరు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా వివిధ రంగాల్లో బహుముఖీన ప్రతిభతో పనిచేసిన గడియారం స్ఫూర్తి నేటి తరానికి అవసరం. శర్మ గారు గతించి అప్పుడే ఎనిమిదేళ్ళు గడిచాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భంగా ఆయన చేసిన కృషిని ప్రభుత్వం కొనసాగించాలి. అదే ఆయనకు సరైన నివాళి. ఆయన వర్ధంతి జూలై 27 (తిథి ప్రకారం) సందర్భంగా నివాళి. 
                                                                                                                             
-సంగిశెట్టి శ్రీనివాస్‌

Telangana mashaal Jayashankar saar


యుగకవి పాల్కురికి సోమనాథుడు



యుగకవి 

పాల్కురికి సోమనాథుడు 

     ప్రథమాంధ్ర ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. ఇదే విషయాన్ని ప్రథమాంధ్ర కవి పాల్కురికి సోమనాథుడు అని డాక్టర్సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్నదశలో 2012లో ఆంధ్రజ్యోతిలో చర్చకు పెట్టారు. దీనికి ప్రతిస్పందిస్తూ ముత్తేవి రవీంద్రనాథ్‌, రామినేని భాస్కరేంద్రరావులు అసలు పాల్కురికి తెలంగాణ వాడే కాదు, మరొకరు తొలికవి ఎందుకు గారు? అంటూ తెలంగాణ ఉద్యమం మీద అక్కసుతో బురద పూసే పనిచేసిండ్రు. చర్చలో నేనూ పాల్గొన్నాను. వారు చేసిన తప్పుడు వాదనలు సాక్ష్యాధారలతో తిప్పి కొట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. ఆంధ్రప్రదేశ్లోని తెలుగువారితో సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి, అక్కడి పండితులు ఇప్పటి వరకూ ప్రచారంలో పెట్టిన అసత్యాలు, అర్ధసత్యాలపై వెలుగుని ప్రసరించి వాస్తవాలను  అందరికీ తెలియజెప్పాలి. ఇప్పటి వరకూ పాల్కురికి సోమనాథుడి రచనలు, రచనలపై విశ్లేషణ, పరిశోధన దాదాపు పదివేల పేజీలకు పైగా అచ్చు రూపంలో వచ్చాయి. అయితే ఇవన్నీ అందరికీ అందుబాటులో లేవు. ప్రత్యక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత సందర్భంలో సోమనాథుడి మూర్తిమత్వాన్ని తెలంగాణ సోయితో మరొక్కసారి స్మరించుకునేందుకు సదస్సు కచ్చితంగా ఒక మైలురాయిగా నిలబడుతుంది.
                యుగకవిపాల్కురికి సోమనాథుడి గురించి బండారు తమ్మయ్య మొదలు వేన రెడ్డి వరకూ, ఇప్పటికీ ఏదో ఒక విశ్వవిద్యాలయంలో ఆయన రచనలపై పరిశోధన జరుగుతూనే ఉన్నది. ప్రతి పరిశోధనలోనూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు సాహితీ చరిత్రకారులు సోమనాథుడికియుగకవిహోదా ఇవ్వలేదు.  ఇందుకు ప్రధానంగా ఆయన బ్రాహ్మణాధిపత్యాన్ని, బ్రహ్మణత్వాన్ని, జపతపాలను త్యజించి సామాన్యుడికి గౌరవమివ్వడమే కారణం. తెలుగు సాహిత్యంలో భాష, విషయము, ఛందస్సు మూడిరటిలోనూ నూతన పంథాలో రచనలు చేసి ప్రజా క్షేత్రంలో తిరుగుబాటు జెండా ఎగురేసిండు. ఆయన సృష్టించిన నూతన ప్రజా ఒరవడి ఆయన తర్వాతి తరం కూడా కొనసాగించింది. పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది.
                తెలుగు సాహిత్యంలో ఎన్నోమొదళ్ళకు ఆయనే పునాది. దేశీ చంధస్సులో తొలి తెలుగు కావ్యంగా  ద్విపదగా బసవపురాణాన్ని రచించిండు. రాజులు, రారాజుల చరిత్రగాదు, మడివాలు మాచయ్యలు, బొంతల శంకరదాసుల జీవిత చరిత్రలే ఆయన కథా వస్తువులు. జాను తెనుగు, దేశీ చంధస్సులోనే గాదు తీసుకున్న వస్తువులోనూ నూతన ఒరవడి సృష్టించిన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ప్రగతిశీలి. అభ్యుదయవాది. శతక సాహిత్యానికి బ్రతుకుగా, ఉదాహరణ వాఙ్మయానికి దిక్సూచిగా, గద్యలకు కొలబద్దలుగా, వచనాలను అనిర్వచనీయాలుగా, జీవిత చరిత్రలను సామాజిక చరిత్రలుగా తీర్చిదిద్దిన అసలైన ఆధునికుడు. సామాన్యుడు కేంద్రంగా చరిత్రను తిరగరాసిన సంస్కరణాభిలాషి.
                నన్నయాదుల కాలం నుండి బాగా వేళ్ళూనుకొని పోయిన వైదిక మతాన్ని తిరస్కరించిండు. అరూడ గద్యాది  రచనలు సంస్క ృత భాషా భూయిష్టమై కేవలం పండిత లోకంలో ఆదరణ పొందిన సాహిత్యాన్ని సామాన్యుడే మాన్యుడని తలంచి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వాడు పాల్కురికి. సంస్క ృత వృత్తాలను వదిలిద్విపదలో బసవ పురాణాన్ని రచించిండు. ద్విపదలో రచనలు చేసిన మొట్టమొదటి సాహితీవేత్త. ఛందస్సుకుద్విపదఅని నామకరణం చేసింది కూడా పాల్కుర్కియే! ‘‘ఆంధ్రావళి నాలుకపై నాట్యమాడుతున్న ఛందస్సు వేదంలోని ‘‘ద్విపద’’వలె పవిత్రమైనది. ప్రాచీనమైనది సుమా అన్నట్టుద్విపదుఅని విలక్షణమైన పేరు పెట్టినవాడు సోమన. కొందరపోహ పడుతున్నట్టు ద్విపదకు ప్రాకృతంలోని ద్విపదితోను, హిందీలోని దోహాతోను పొత్తు లేదు. ఇదిక స్వతంత్రమైన తెలుగు దేశీ ఛంధస్సు’’ అని నిడుదవోలు వెంకటరావుసోమన సృష్టించిన ఛందస్సుఅనే వ్యాసంలో నిరూపించిండు.  ప్రాచీన పురాణాలను వదిలి గురువు కేంద్రంగా రచనలు చేసిండు. సోమనాథుడి భాషతో పాటు, రచనా ప్రక్రియలు కూడా సామాన్య ప్రజలకు సులభంగా గ్రాహ్యమయ్యేటివే! ఈయన రచనలు తెలుగు జాతి తొలి విజ్ఞానసర్వస్వాలుగా చెప్పుకోవచ్చు. ఈయన తర్వాతి తరం వారయిన తిక్కన మొదలు అన్నమాచార్యతో పాటుగా 20 శతాబ్దం వరకు కూడా కవులపై సోమనాథుడి ప్రభావముంది.
                ‘‘ఉరుతర గద్య పద్యోక్తులకంటె
                కూర్చెద ద్విపదల కోర్కె దైవార
                అరూఢగద్య పద్యాది ప్రబంధ
                పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
                మానుగా సర్వ సామాన్యంబు గామి..’’ అంటూ జాను తెనుగు విశిష్ఠతను వివరించిండు. నన్నయ తెలుగు కవితలో ప్రవేశపెట్టిన మార్గ పద్దతిని నిరసిస్తూ దేశీ కవితా విధానాన్ని ఒక తిరుగుబాటు సాహిత్యంగా సోమనాథుడు సాహిత్యంలోకి తీసుకు వచ్చాడు. ‘‘అమల సువర్ణ శృంగ యుత కపిల గోశతంబు దానమిచ్చిన ఫలంబు భారత శ్రవణంబున గల్గునని తలంచి భారత శ్రవణాభిరతులైన రాజన్యులను మెప్పించుటకు గాకఅంటూ భారతానికి తాయిలాలు ఇచ్చి ప్రచారంలో పెట్ట చూడడాన్ని పాల్కురికి నిరసించిండు. శైవ మతమును సామాన్యుడు పునాదిగా ప్రచారంలోకి తీసుకొచ్చిండు. అంతే కాదు త్రిపురుషా పూజా విధానాన్ని, జప హోమాదులతో కూడిన వైదిక మతమునుతూలనాడి కులాలకు అతీతమైన వీరశైవ మతాన్ని ఆచరించి ప్రచారం చేసిండు. అనువాదాలైన భారతాన్ని వదిలి, నన్నయ నిరాకరించిన ద్విపదలోనే బసవ, పండితారాధ్యుల జీవితాలను చరిత్రలుగా రచించిండు. అంతే గాకుండా దేశీ రచనా ప్రక్రియలను కూడా చేపట్టిండు. అంతకు ముందు ప్రక్రియలు కేవలం చంధోగ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి. వాటికి కావ్య గౌరవాన్ని ఈయన కల్పించిండు. ఉదాహరణములు, రగడ, సీసములు, శతకము, గద్యము, అష్టకములు మొదలైన వాటిలో రచనలు చేసిండు. దేశీయ రచనా రీతులకు ఒక అస్తిత్వాన్ని కల్పించిన వాడు పాల్కురికి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దేశీ రచనలను చేయడమే గాకుండా దేశీయ సంప్రదాయాలను, భాషా, సాహిత్య, నాట్య, సంగీత, చారిత్రక, స్థానికాచార వ్యవహారాలు, జీవితాలను, సామాజిక పరిస్థితులను ఈయన రచనల్లో చోటు చేసుకున్నవి. శ్రీశైల వర్ణనలతో పాటుగా దేశీయుల ఆచార వ్యవహారాలు, శివరాత్రి జాగారము, పాటలు, పద్యాలు, గీతాలు, స్తవాలు మొదలగు సాహిత్య సామాగ్రిని, నాట్య భంగిమలను, నాటక ప్రదర్శన పద్ధతులను, భరత నాట్య ప్రయోగాలు, సంగీత శాస్త్రంలోని 108 రాగాలను తాళములు, మూర్ఛనలు, మద్దెళ్ళు గురించి తాను జీవించిన 1160`1240 నాటి తెలుగు/కన్నడ సమాజాన్ని పాఠకుల ముందుంచాడు. ఆయన కాలంనాటి ఆటలు`పాటలు, విద్యలు`వినోదాలు, పత్తిరులు`పండ్లు, కొండలు, నదులు, మకుటములు, వస్త్రములు, వీణలు, రాగములు ఇలా ఒకటేమిటి అనేక విషయాల్ని తన రచనల్లో తెలిపిండు. ముఖ్యంగా పండితారాధ్య చరిత్రలో. సోమనాథుని కాలం నాటి సాంఘిక జీవనాన్ని తెలుసుకోవడానికి పండితారాధ్య చరిత్ర ఒక విజ్ఞానసర్వస్వం లాంటిదని తిమ్మావరa్జల కోదండరామయ్య తనతెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వంఅనే వ్యాసంలో చెప్పిండు. ‘‘తెలుగు కవులలో ఈయన వలె ప్రజలకు యింత సన్నిహితంగా వుండిన కవీ, తెలుగు ప్రజా జీవనమును యింత చక్కగా కావ్యంలో ప్రదర్శించిన కవీయ యీయన ఒక్కడు మాత్రమే’’ అని కూడా తిమ్మావరa్జల అన్నడు. ఆనాటి ఆభరణాలైనకంచు మట్టెలు, ఉంగరములు, వల్దయూరులు, నల్ల గాజులు, తగరపు కడియములు, పచ్చ గాజు పూసలు, సంకు పూసలు, నల్లపూసల బన్నసరముమొదలైన వాటి గురించి ఈయన రచనల ద్వారా తెలుస్తుంది. ‘రాగుంజు పోగుంజులాట, కుందెన గుడిగుడి గుంజంబులాట, అప్పల విందుల యాట, చప్పట్టు, సరిగుంజులాట, పేరబొంతల యాట, సిట్ల పొట్లాట, గోరంటాలాట, దాగుడు మూతలాట, దిగు దిగు దిక్కొనునాటఅనే క్రీడా విశేషాలు ఆనాటి కాలంలో ఉండేవని పాల్కురికి రచనల ద్వారా తెలుస్తుంది. కేవలం ఆటలు తెలుసుకొనుట కాదు. ఇది ఆనాటి తెలుగు సమాజం నడిచి వచ్చిన దారిని పట్టిస్తుంది. చరిత్రను చిత్రిక గడుతుంది. ఈయన రచనలు తరచి తరచి చదివిన కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ స్థానిక శూద్రకులాలకు చెందిన వారైన కుమ్మరి గండయ్య, బెజ్జ మహాదేవి, మడివాళ మాచయ్య, మాదర చెన్నయ్య, తదితర  జీవితాలను కథలుగా బసవపురాణంలో చెప్పిండు. తెలంగాణ ఆచార వ్యవహారాలే గాకుండా ఇప్పటికీ నిఘంటువుల్లోకి ఎక్కని ఎన్నో పదాలు ఈయన రచనల్లో కనిపిస్తాయి. పదాలు, పద బంధాలు, సామెతలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయంటే వాటి ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సోమనాథుడు అవసాన దశలో రాసినపండితారాధ్య చరిత్ర  తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా పండితులు పేర్కొన్నారు. రాజులకు, దేవుళ్ళకు పుస్తకాల్ని అంకితమియ్యడం తెలుగు సాహిత్యంలో కొత్తేమి కాదు. అయితే సోమనాథుడు శివభక్తుడైన గోడగి త్రిపురారికి తన అనఅనుభవసారముగ్రంథాన్ని అంకితమిచ్చాడు. బవవేశ్వరుడు ప్రచారం చేసిన శైవమతములో భక్తియే ప్రధానమైనది. జాతి, మత, లింగ వివక్షలు లేవు. వేదోక్త కర్మల నిరసన, శివోత్కర్ష, భక్తిచే భగవంతుని పలికించుట వీరశైవము లక్షణాలు. గురులింగ, జంగమ, ప్రసాదాదులు, విభూతి, రుద్రాక్షాది చిమ్నాలు మతముతో ముడి పడి ఉన్నాయి.
                సోమనాథుడు ప్రచారం చేసిన వీరశైవము వేదకర్మలను నిరసించినదనేది ఒక పార్శ్వం. దానికి రెండో ముఖం స్త్రీ పురుషుల సమానత్వానికి, సర్వమానవ సౌభ్రాత్రమును కోరుకున్నది. నేటికీ స్త్రీ సమాన హక్కు ఇవ్వ నిరాకరింపబడుతుండగా, 900 యేండ్ల క్రితమే సాహిత్యంలో సమానత్వాన్ని పాటించిన అభ్యుదయ వాది పాల్కుర్కి. పండితారాధ్య చరిత్ర పురాతన ప్రకరణములలోగురుభక్తాండారి కథలో అజ్ఞాని అయిన గురుభక్తాండారికి వేశ్యచే శ్వేతుని కథ, మహహుణుని కథ చెప్పించిహితలగు కాంతల బుద్ధులేవెంట హితము కాకేల యొండగునని నిరూపించినాడు. స్త్రీలకు పురుషులతో సమానంగా దీక్షాధికారములిచ్చి గౌరవించినాడు. నిమ్న జాతి భక్తులకు కావ్య గౌరవం కల్పించిన దార్శనికుడు పాల్కురికి. వీరశైవములో భక్తుల కష్టార్జితాలకు విలువెక్కువ. ప్రతి భక్తుడు ఏదో ఒక శారీరక శ్రమతో కూడిన పనిని చేయాల్సిందిగా సోమనాథుడు నిర్దేశించిండు. శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తించిండు. అందుకే మడివాలు మాచయ్య భక్తుల బట్టలుతకడం వృత్తిగా, శంకరదాసి బొంతలు కుట్టి జీవించే వృత్తిని స్వీకరించిండు.
                ఈయన రచనలన్నీ గురువు కేంద్రంగా రాసినవే! అందుకే పాల్కురికి రచనల్లో బసవేశ్వరుడు, పండితారధ్యుడు ఇద్దరూ ప్రముఖంగా కనిపిస్తారు. వీరిలో ఒకరు వీరశైవాన్ని మరొకరు ఆరాధ్య మతాన్ని ప్రచారం చేసిండ్రు. సోమనాథుడు సంస్కృతాంధ్ర, కర్నాట భాషల్లో అనేక రచనలు చేసిండు. వీటిలోబసవ పురాణం’, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, చతుర్వేద సార సూక్తులు, సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, బసవ రగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బవసాధ్య రగడ, సద్గురు రగడ, చెన్న మల్లు సీసములు, నమస్కార గద్య, వృషాదిపశతకం, అక్షరాంక గద్య పద్యాలు, పంచప్రకార గద్య, అష్టకం, పంచక, బసవోదాహరణం, మల్లమదేవి పురాన: (అలభ్యం), మొదలైన రచనలున్నాయి. తొలి తెలుగు శతకంవృషాధిప శతకమురచయిత కూడా ఈయనే. ‘బసవా, బసవా వృషాధిపా!’ అనే మకుటంతో 108 చంపక, ఉత్పలమాలలతో పుస్తకం రాయబడిరది. ఇందులో బసవుడి జీవితానికి సంబంధించిన ఘటనలు రికార్డయ్యాయి.  బసవన కేవలం మతాచార్యుడు, భక్తుడే కాదు, ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవనాన్ని సంస్కరించిన సంఘ సంస్కర్తగా, భక్త శిఖామణిగా, వృషాధిపుని అవతారంగా పాల్కురికి రచనలు చేసిండు. నిజానికి వీరశైవ మత ప్రచారానికి సోమనాథుడు ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు. పాటల ద్వారా, రచనల ద్వారా, సభల ద్వారా, సంచారల ద్వారా మత ప్రచారం చేసిండు. సర్వస్వాన్ని శివుడికి, శివ భక్తులకు సమర్పించాలని ప్రచారం చేసిండు. నిజానికిది సామాజిక స్పృహకు పునాది.




                ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట ముందు వరుసలో నిలిచింది. అయితే ఇందుకు ఆద్యుడు పాల్కుర్కియే! భక్తి ప్రచారానికి ప్రధాన వాహికగా పాటను/ గేయాన్ని ఎంచుకున్నాడు. ఇవి రగడ రూపంలో ఉన్న వీటికి యతి ప్రాస లక్షణాలున్నాయి. అక్షరాంక గద్యలో మొదలు క్ష వరకు మొత్తం 50 అక్షరాల్లో వనరుసగ నీ గద్యపాద ప్రథమాక్షరములు గూర్చి రచన చేసిండు. వీటిలో కొన్ని ఇప్పటికీ గ్రంథ రూపంలో రాలేదు. మరికొన్ని అలభ్యం.
                యుగకవికి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో తర్వాతి కాలం వారు కూడా అనుసరించగలిగిన మార్గాన్ని ఏర్పాటు చేయడం. పనిని పాల్కురికి సమర్ధవంతంగా నిర్వహించాడు. ఉదాహరణ, ద్విపదలు, వచనములు, వ్యాఖ్యానములు, శతక వాఙ్మయానికి ఆద్యుడైన పాల్కురికి వేసిన దారుల్లో తర్వాతి కవి పండితులు నడిచిండ్రు. భాష, భావన, రచన, విషయం అన్నింటిలోనూ ప్రత్యేకతను చాటుకుండు. పాల్కురికి ప్రభావం తిక్కన, రంగనాథరామాయణము రాసిన గోన బుద్ధారెడ్డి, గౌరన, చిన్నన రచనలపై ద్విపదల ప్రభావం, శ్రీనాథుడు కొంతమేరకు వస్తువులో, చంధస్సులో  పాల్కురికిని అనుసరించాడు. శ్రీనాథుడి హర విలాసానికి మూలం బసవపురాణమే! ధూర్జటి కాళహస్తి మహాత్మ్యము నందలి తిన్నని కథకు మూలం కూడా బసవ పురాణంలోనే ఉన్నది. హంసవింశతి, శుకసప్తతి రచయితలు కూడా పాల్కురికినే అనుసరించారు. ‘‘ఈతని (పాల్కురికి) సీసపద్యమలందుగల సొగసైన తూగు, సమత శ్రీనాథ పోతనల సీసపద్యముల చక్కని నడకకు దారి చూపినట్లు తోచు చున్నది. ‘మందార మకరందయను సుప్రసిద్ధమైన పోతన సీసములో గనుపించు భావము, పోలిక సోమనాథుడివే.’’ అని వేటూరి ఆనందమూర్తితిక్కనాదులపై పాల్కురికి ప్రభావం అనే వ్యాసంలో తేల్చి చెప్పిండు. ప్రబంధకారులైన తెనాలి రామకృష్ణుడు, తాళ్ళపాక వారు, కృష్ణమాచార్యులకు మాతృకలు కూడా పాల్కురికి రచనలో ఉన్నాయనే విషయాన్ని సోదాహరణంగా ఆనందమూర్తిగారు వివరించారు. 
                దేశీ ప్రక్రియను తర్వాతి కాలంలో తాళ్ళపాక కవులు కూడా అనుసరించారు. వీరు మంజరీ ద్విపదలు, శతకములు, సీసములు, ఉదాహరణములు, రగడలు, గద్యలు మొదలైన ప్రక్రియల్లో రచనలు చేసిండ్రు. అంటే సోమనాథుడి రచనా ప్రభావం తర్వాతి తరం వారిపై ఎలా ఉండిరదో అర్థం చేసుకోవచ్చు.
                ఇప్పటి వరకు బ్రౌన్‌, కొమర్రాజు, నిడుదవోలు సుందరం పంతులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, చిలుకూరి నారాయణరావు, బండారు తమ్మయ్య, నిడుదవోలు వెంకటరావు, నేలటూరి వేంకటరమణయ్య, శిష్టా రామకృష్ణశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఎమ్‌.ఆదిలక్ష్మి. వేనరెడ్డి, మహంతయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, తదితరులెందరో పాల్కురికి సోమనాథుడి ప్రతిభా పాఠవాలను పాఠకులకు తెలియజెప్పిండ్రు.
                దక్షిణాదిలో ఒక వైపు రామానుజ మతం, వైష్ణవ మతం విజృంభిస్తున్న తరుణంలో దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నది వీరశైవం. సొంత ఆస్తి లేకుండా, ఉన్నదంతా శివభక్తులకు పంచాలనడమే గాకుండా, ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిండు. అట్టడుగు వర్గాల ప్రజలే ఆయన రచనా వస్తువులు. కులాలకు అతీతంగా అందరిలో చైతన్యాన్ని ప్రోది చేసిన పాల్కురికి సోమనాథుడు తెలుగు సాహిత్యంలో తొలి కవి. ప్రజల పక్షాన నిలబడి అన్ని రకాల వివక్షలపై అక్షరాన్ని కరవాలంగా మలిచిండు. అలాంటి మహనీయుడి గురించి దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరముంది. అందుకుగాను ఆయన జీవిత చరిత్రను సాహిత్య అకాడెమీ/ జాతీయ బుక్ట్రస్ట్ప్రచురించాలి. అలాగే ఆయన సమగ్ర రచనలు కూడా తెలంగాణ కల సాకారమైన సందర్భంగా పునర్ముద్రణ కావాలి. ఇంకా అలభ్యంగా ఉన్న రచనల్ని వెతికి పట్టుకోవాలి. తెలంగాణ జీవద్భాషకు అక్షర రూపమిచ్చిన ఆయన రచనల్లో ఇంకా నిఘంటువుల్లోకెక్కని పదాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని నిఘంటు రూపంలో తీసుకు రావాలి. తెలంగాణ సోయితో పనిచేయాల్సిన అవసరముంది.
                                                                                                                                       -సంగిశెట్టి శ్రీనివాస్
                                                (గ్రంథాలయ, సమాచార శాస్త్రోపన్యాసకులు, ఎన్ఎమ్జీడిసీ కళాశాల, జోగిపేట)