Friday, 24 August 2012

KALOJI NARAYANA RAO AND HIS ACTIVITIES

వైతాళిక సమితి- KALOJI

కాళోజి    తెలంగాణ దృక్కోణంతో చరిత్రను, సాహిత్యాన్ని మూలాల్లోకి వెళ్లి పునర్మూల్యాంకనం చేస్తూ ఉంటే ప్రతి సారి మణి మాణిక్యాలు దొరుకుతూనే ఉన్నాయి. అయితే విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయాల్సిన పనిని ఆసక్తిగల కొంత మంది పరిశోధకులు మాత్రమే చేస్తూ ఉండడంతో ఫలితాలు ఆశించిన స్థాయిలో/సంతృప్తికరంగా లేవు. పునాది పరిశోధన లేకపోవడంతో పైపై మాటలకు ప్రాధాన్యం పెరిగిపోయి, అసలు విషయానికి ఎసరు వస్తోంది. ఎవరైనా రికార్డయిన విషయాలపై వ్యాఖ్యానం చేయడం సులభం. అయితే ఈ రికార్డులే అరకొరగా దొరుకుతున్నప్పుడు సాధికారిక వ్యాఖ్యనం చేయడం దుర్లభం. తెలంగాణలో ప్రస్తుతం ఈ పరిస్థితే కొనసాగుతోంది. తెలంగాణలోని వైతాళికులందరి సాహిత్యానికి, సృజనకు, ఉద్యమ కార్యాచరణకు, సమాజ చైతన్యానికి వివిధ రూపాల్లో చేసిన కృషికి చరిత్రలో స్థానం దక్కలేదు. అంతెందుకు ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రాసి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్న తొలి తెలుగు వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన కవిత్వం నేటికీ సంపుటిగా రాలేదంటే బాధేస్తుంది. వెంటనే బాధ్యతను గుర్తు చేస్తుంది. వట్టికోట ఆళ్వారుస్వామి సమగ్ర కథలు ఇప్పటికీ సంకలనంగా రాలేదు. భాగ్యరెడ్డి వర్మ ఉపన్యాసాలు, వ్యాసాలు ఇప్పటి తరానికి అందుబాటులోకి రాలేదు. ఇలా చాలామంది తెలంగాణ వైతాళికుల పుస్తకాలు/రచనలు అచ్చుకు నోచుకోలేదు. అలాంటి వారిలో కాళోజి నారాయణరావు కూడా ఉన్నాడు. కాళోజి నారాయణరావు కూడా అని ఎందుకనాల్సి వస్తుందంటే 1934 నుంచీ ఆయన రాసిన ప్రతి అక్షరం అచ్చు రూపంలో శాశ్వతత్వాన్ని సంపాదించుకుంది. అటు అణా గ్రంథమాల ప్రచురించిన కాళోజి కథలు, దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించిన ‘నా భారతదేశ యాత్ర’ మొదలు 1953 నాటి ‘నాగొడవ’, చివరికి ఇదీ నాగొడవ ఇలా అనేక రచనలు అచ్చురూపంలో వచ్చాయి. అలాగే షష్టిపూర్తి సమయంలో వెలువరించిన సంచిక, నాట్యకళ ప్రభాకర్‌ ప్రచురించిన సమగ్ర సాహిత్యం కూడా కాళోజి రచనలను రికార్డు చేసింది. కాళోజి కథలు, శాసనమండలిలో కాళోజి ప్రసంగాలు కూడా అచ్చయ్యాయి. ఇవన్నీ ఆయన గురించి, రచనల గురించీ విశ్లేషణకు, విమర్శకు ఉపయోగ పడ్డాయి. అయితే కాళోజి కీలక పాత్ర పోషించి  తెలంగాణలో చైతన్యానికి, కళా, సాహిత్య వికాసానికి విశేషంగా కృషి చేసిన ‘వైతాళిక సమితి’ గురించి తెలిసింది మాత్రం చాలా తక్కువ. గతంలో కాళోజి గురించి పరిశోధన చేసిన వారు (ఒక్క  కే.శ్రీనివాస్‌ తప్ప) గానీ, స్వయంగా కాళోజి ‘ఇదీ నాగొడవ’లోగానీ లోతుగా రికార్డు చేయని అంశాలు ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. దీని ద్వారా కాళోజి కార్యాచరణ, సమిష్టి కృషి, ఆలోచనా సరళిని మరింత లోతుగా అర్థంచేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ వ్యాసంలో కాళోజి`వైతాళిక సమితి`దాని కార్యక్రమాలు గురించి వివరంగా చర్చించడమైంది. ప్రతి చిన్న అంశంపై ప్రత్యేక శ్రద్దతో అభిప్రాయాలను వ్యక్తం చేసి తద్వారా కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అప్పటి వారి ఆలోచనా ధోరణి దానిలోని ప్రజాస్వామ్య విలువల్ని అర్థం చేసుకోవడానికి ఈ ‘వైతాళిక సమితి’ కార్యాచరణ ఒక పనిముట్టుగా ఉపయోగపడుతుంది.

    ఈ ‘వైతాళిక సమితి’ మొదట 1935 ఆ ప్రాంతంలో ప్రారంభమయింది. (1938 ఆ ప్రాంతం అని కాళోజిపై పరిశోధన చేసిన తూర్పు మల్లారెడ్డి పేర్కొన్నాడు. కాని దానికి ఆధారాలు ఇవ్వలేదు. అలాగే కాళోజి, దేవులపల్లి రామానుజరావు ఇద్దరూ 1935అని పేర్కొన్నారు) ప్రారంభ దినాల్లో కథలు, కవిత్వం ద్వారా సాహిత్య వ్యవసాయం చేసి కొంతకాలం స్థబ్దుగా ఉన్నారు. మళ్ళీ 1945 ఉగాది (పార్థివ) నాడు తమ పున: ప్రస్థానాన్ని ప్రారంభించింది. సమాజ సేవే ధ్యేయంగా, సాహిత్యం, కళలే మార్గంగా పనిచేసిన సంస్థ ఇది.
     కాళోజి నారాయణరావు హైదరాబాద్‌లో వకాలత్‌ విద్య చదువుతున్న కాలంలో ఈ వైతాళిక సమితిని ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా రికార్డు చేసిండు. జూలై ఏడు, 1966నాడు రచయిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్యకు రాసిన లేఖలో చెప్పిండు. ‘‘1935 ఆ ప్రాంతంలో హైద్రాబాద్‌లో ఓ నలుగురు పిచ్చివాళ్లు ఒకచో చేరివుండిరి. వారు ఆనాటికి తమ్ము తాము వైతాళికులుగా ప్రకటించుకొని ప్రతి పదిహేను రోజుల కొకసారి సమావేశమై, నలుగురు మిత్రులను కూడ వేసుకొని కథలు, గేయాలు వ్రాసి చదివి వినిపించేవారు. అడపాదడపా హైద్రాబాదుకు వచ్చిన మహారాష్ట్ర, హిందీ, ఆంధ్ర కవి మిత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి రచనలు వినిపించీ, ఉపన్యాసం చేసే ఏర్పాటు చేసేవారు. వారిలో కాళోజితో బాటు తక్కిన ముగ్గురు (1) వెల్దుర్తి మాణిక్యరావు (2) వెంకటరాజన్న అవధాని, (3) గంటి లక్ష్మినారాయణ (గలన)’’. అని రాసిండు. ఈ విషయాన్ని గొర్రెపటి ‘మిత్రులూ`నేనూ’ అనే తన పుస్తకంలో రికార్డు చేసిండు. ఇందులో వెంకట రాజన్న అవధాని ఆరుభాషల్లో పండితుడు. వకీలు, వైద్యుడు. కాళోజి అభిప్రాయం ప్రకారం బహుకుటుంబి, దరిద్రుడు. ఈయన 1909లో మంథెన (కరీంనగర్‌ జిల్లా)లో జన్మించిండు. ఆర్యసమాజం చేత ప్రభావితుడైన అవధాని అంధ, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమాల్ని చేపట్టిండు. దళితుల్ని దేవాలయ ప్రవేశాల్ని చేయించడమే గాకుండా, స్త్రీ విద్య కోసం కృషి చేసిండు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చిండు. ఈయన కథలు, నవలలు కూడా రాసిండు. 1995లో చనిపోయిండు.  ఇక వెల్దుర్తి మాణిక్యరావుకిది శతజయంతి సంవత్సరం. ఆయన 1912 డిసెంబర్‌ 12న మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో జన్మించిండు. కథలు, కవిత్వం రాయడమే గాకుండా చాలా కాలం మద్యపాన వ్యతిరేకంగా ప్రజా చైతన్యానికి పునాదులు వేసిండు. పత్రికా విలేఖరిగా, కాలమిస్టుగా, జర్నలిస్టుగా, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ చరిత్ర రచయితగా చిరపరిచితులు. ఇక నాలుగో వ్యక్తి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులు గంటి లక్ష్మినారాయణ. 1904లో జన్మించిండు. 1920 నుంచే కాంగ్రెస్‌లో చేరి దాని అభివృద్ధికి కృషి చేసిండు. వల్లూరి బసవరాజుకు అండగా నిలబడి ఆయన్ని పైకితెచ్చిన నిరాడంబరుడు. మంచి వ్యవహర్త అని కాళోజి రాసిండు.
    ఈ సంఘం తరపున కేవలం కవి, పండిత సమ్మేళనాల్ని ఏర్పాటు చేయడమే గాకుండా ముగ్గురు కలిసి, కథలు, కవిత్వం రాయడం అనే నూతన ప్రక్రియకు నాంది పలికిండ్రు. (ఇటీవలి కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ఆవాహన చేసుకున్న శ్రీశిరసులు పేరిట నలుగురు కవులు కలిసి నల్ల వలస కవిత్వాన్ని అక్షరీకరించిండ్రు) వీరు రాసిన ‘తిరుగుబాటు’, విభూతి లేక ఫేస్‌ పౌడర్‌ లాంటి కథలు అప్పటి పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి.  వీరి రచనలకు ప్రోత్సాహకంగా నిలిచింది గోలకొండ పత్రిక. అయితే 1938 తర్వాత ఆంధ్రకేసరి మాస పత్రిక ప్రారంభం కావడం ఒకవైపు, మరోవైపు వందేమాతర ఉద్యమం మరోవైపు వీరి సాహిత్య కార్యకలాపాలకు తాత్కాలిక విరామాన్నిచ్చాయి. అణా, దేశోద్ధారక గ్రంథమాల ప్రారంభం కావడంతో వీరి కార్యకలాపాలకు కాసింత బ్రేక్‌ పడిరదని చెప్పవచ్చు. వైతాళిక సమితిలో ఉన్న వారే ఈ పత్రిక, గ్రంథమాలల నిర్వహణలో నిమగ్నం కావడంతో కార్యక్రమాలు తగ్గాయి. 1945 నాటికి ఒకవైపు నిజాంరాష్ట్రాంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతికి రావడం, 1943లో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు ప్రారంభం కావడం కూడా వీరు తిరిగి చురుగ్గా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి దోహదం చేసిన అంశాలుగా చెప్పవచ్చు.
    ఈ ‘వైతాళిక సమితి’ 1945 ఉగాది (పార్థివ సంవత్సరం) నాడు పున:ప్రారంభమైంది. ఇందులో ఐదుగురు సభ్యులున్నారు. వారి అసలు పేర్లని ఎక్కడా రికార్డు చేయలేదు. ఏప్రిల్‌ రెండు నాటి గోలకొండ పత్రికలో ‘వైతాళికుడు’ పేరిట కాళోజి నారాయణరావు రాసిన వ్యాసంలో ఈ సంఘం ఉద్దేశ్యాలు వివరంగా పేర్కొన్నాడు. మేము చేసే పనితోనే సంబంధమున్నందున మా చిరునామాలు, పేర్లు కూడా అంతం ముఖ్యం కావని అందులో రాసిండు. మేము చేసే పని వల్ల ‘‘మాకు లాభం లేకున్నను ఇతరులు (అంటే తెలంగాణలోని ఆంధ్రులకు) లాభం పొందిన చాలు’’ అని తమ ఆశయాన్ని ప్రకటించారు. ఇందుకు మమ్మల్ని అవమానింతురో, బహుమానింతురో అనే సంశయాన్ని కూడా వ్యక్తం చేసిండు.
    తమ గురించి ఇలా రాసిండు. ‘‘మేము మే’’ మనగా మాలో అయిదుగురమున్నాము. అడవిలోని ఉసిరిలవలె అక్కడక్కడి వాండ్ల మైనను అందరము నీనాడు ఒక్క చోటికి చేరినాము. మా కాపురపు స్థలము హైదరాబాదు. మీతో మాకు ఉత్తర ప్రత్యుత్తరములుండవు కనుక మే ముండెడి బజారు, గల్లీ, యింటి సంఖ్య యివన్నియు మీ కనవసరమని తెలుపుట మాని వైచుచున్నాను. అని చెబుతూ తమలోని అయిదుగురి గురించి వివరంగానే రాసిండు. అందులో మొదట తన పేరు ‘వైతాళికుడు’ గురించి ఇలా చెప్పుకుండు. ‘‘సోదరులారా! నన్ను ‘‘వైతాళికు’డందురు. ఆది మా తల్లిదండ్రులు బొడ్డుగోసి పెట్టిన పేరు గాకున్నను, ఇప్పటికి నాకాపేరే రూఢjైు పోయినది. అందుచే నా అసలుపేరు మీకు చెప్పకున్నను అపచారము కాదు గదా. చిన్నప్పుడు ‘నాకు మాతాత యనగా ఎక్కువ మాలిమి యుండెడిది. ఆయన యెప్పుడును నామీద ఈగ వ్రాలనిచ్చెడివాడు గాదు. ఆయన యనగా మా యింటిలో సింహస్వప్నము. అందుచే నేనాయన యొద్ద ఉన్నంత సేపు, నా వైపు తేఱిపాఱి చూచుటకు గూడ ఎవ్వరికిని గుండె అనెడిదికాదు. (ధైర్యముండెడిది కాదు!) నాకు మొదటి నుండియు నిద్రమెలకువ యెక్కువ. కోడి కూతతోనే లేచి తాత ప్రక్కలోనికి చేరి ‘‘తాతా తెల్లవార వచ్చినది. లే నాకు పద్యాలు చెప్పు’’మని వేధించెడి వాడను. కాసంత ప్రొద్దెక్కగనే ‘‘తాతా? భోజనానికి వేళjైునదిలే యని యిట్లు ఆయన వెంబడి బడుచుండెడివాడను. ఒకప్పుడాయన ‘‘ఏమిటిరా? వైతాళికుని లాగున నా వెంటబడినా!’’వని వేళాకోళము చేయగా అదిమొదలు ఆ పేరే పట్టుకొని అందఱు నన్ను పిలువసాగినారు.’’ అని తన పేరు వెనుక ఉన్న వృత్తాంతాన్ని వెలువరించాడు. ఈ వైతాళిక సమితిలోని మరో సభ్యుడి పేరు    ‘మేధావి శాస్త్రి’. ఈయన గురించి చెబుతూ. పేరుకు తగిన ప్రతిష్ట కలవాడు. ఎట్టి వారితోను చేయి కలుపుకొను సామరధ్యము కలవాడు. ఇంగ్లీషు, ఆంధ్రము, సంస్కృతము ఈ మూడు భాషలలోను కొంత ప్రజ్ఞ కలవాడు. అని పేర్కొన్నడు. ఇగ మూడో వ్యక్తి ‘ఇతిహాసరావు’. ‘‘ఈతడు చరిత్ర యనిన ప్రాణములు విడుచువాడు. చారిత్రిక దృష్టి ప్రమాణములను నిలువని యెడల ఎట్టి యుత్కృష్ట గ్రంథములను గూడ తృణీకరించి వైచుటలో ఇతనిని మించిన వారుండరు. ఇతని ఉచ్వాస నిశ్వాసములు గూడ చరిత్ర గ్రంథమునే వివుచుననిన మీ రాశ్చర్యపడగూడదు.’’ అని అభిప్రాయ పడిరడు. వైతాళిక సమితలోని నాలుగో వ్యక్తి ‘విజ్ఞాన శర్మ’. ‘‘ఇతడు యూనివర్సిటీలో ఎం.ఎ. పట్టము పొందినవాడు. మంచివాడు. దేశసేవపరాయణుడు. ఆధునిక విజ్ఞానమున ఆఱితేఱిన ప్రజ్ఞాధురీణుడు. విజ్ఞానమని పెరుచెప్పగనే ఇతని దృష్టియంతయు పాశ్యాత్య దేశములవైపు ఒగ్గి చూచు స్వభావము గలవాడు. స్నేహపాత్రుడు.
    ఇగ చివరగా ఐదో వ్యక్తి పేరు ‘చిత్రగుప్తుడు.’’ చిన్నప్పటి నుండి తెనుగు వ్రాత ముత్యాలకోవవలె ముద్దులు మూటగట్టునట్లు వ్రాయు చుండుట వల్లను, ఎవ్వరెంత వేగముగా మాట్లాడినను ఉత్త లేఖనము చెప్పినను, కలమెత్తకుండ నిలువకుండ తీగెతీసినట్లు వ్రాయు అలవాటు గలిగి యుండుటచేతను’’ అతనికి చిత్రగుప్తుడు అనే పేరొచ్చిందని చెప్పిండు.
    ఈ అయిదుగురు కూడా విద్యావంతులు కావడమే గాకుండా సమాజం పట్ల బాధ్యతతో మెలగాలనే భావనతో ఉన్న వారు కావడంతో పార్థివ ఉగాది నాడు ‘వైతాళికు’డి ఇంట్లో సమావేశమై ‘తెలంగాణలో విద్యావ్యాప్తి’కి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది తమ వంతు దేశోపకార సేవ అని వీరు భావించారు. ఈ దేశోపకారం కోసం కొత్త సంస్థను ఏర్పాటు చేయాల్నా? లేదా ఇది వరకే నడుస్తున్న ఏదైనా సంస్థ ద్వారా ఆ పని చేయాల్నా? అని తర్జన భర్జన పడ్డారు. కొత్త సంస్థ అంటే కొత్త గొడవలు మీదికి తెచ్చి పెట్టుకోవడమే అని భావించి. ఈ ఐదుగురు సభ్యులు ఒక కూటమిగా ఏర్పడి ‘‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’’ ద్వారా విద్యావ్యాప్తికి కృషి చేసిండ్రు. అంతకు ముందు పరిషత్తు ద్వారా పనిచేయాలనే తమ వాంఛను దాని అధ్యక్షుడికి (మాడపాటి హనుమంతరావు?)  తెలియజేసిండ్రు. జీతంలేకుండా ప్రచారకులు దొరికినందుకు ఆయన సంతోషించి వారిని ప్రోత్సహించిండు. వివిధ ప్రదేశాల్లో ‘వైతాళిక సమితి’ నిర్వహించే సభలు, సమావేశాలకు, వారి వ్యాసాలకు గోలకొండ పత్రికలో ప్రముఖంగా వచ్చేలా ప్రయత్నం చేస్తామని కూడా అధ్యక్షుడు హామి ఇచ్చాడు. బహుశా దాన్ని ఆయన నేరవేర్చాడు కూడా.
    వైతాళిక సమితి ఏర్పాటు విషయం పత్రికలో ప్రముఖంగా రావడంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సమావేశాల్లో పాల్గొనవలసిందిగా అనేక ఆహ్వానాలు అందాయి. ఎక్కడి మీటింగ్‌కు పోయినా అందరూ కలిసేపోయేవారు. మాట్లాడేవారు. ఈ వైతాళిక సమితి పాల్గొనే సమావేశాలకు ‘అధ్యక్షుడు’ ఉండేవారు కాదు. ఎందుకంటే అధ్యక్షుల స్థానంలో ఉన్న వారు నిరంకుశంగా వ్యవహరించినట్లయితే వక్తలకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో ‘అధ్యక్షుడి’ పదవిని రద్దుచేసిండ్రు. మొదటి సమావేశాన్ని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో ఏర్పాటు చేసిండ్రు. అయితే కరపత్రాలు పంచకున్నా కేవలం భాషా నిలయం బోర్డుపై ప్రకటన ద్వారా, మౌఖికంగా జరిగిన ప్రచారంతో మీటింగ్‌కు అనేకమంది హాజరయ్యిండ్రు. స్త్రీలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యిండ్రు అని   19, ఏప్రిల్‌ నాటి ‘గోలకొండ’ సంచికలో మరోసారి వైతాళికుడు రాసిండు.
    పరిషత్‌ ప్రార్థన గీతం ఆలాపతో సమావేశం ప్రారంభమైతుంది. ఈ గీతం అందరి ప్రశంసలందుకుంది. ఈ పరిషత్‌ ప్రార్థన గీతం గురించి కూడా ఇంతవరకు ఎక్కడా రికార్డు కాలేదు.
ఆ గీతమిది.
    ఆంధ్ర సారస్వతపరిష`న్మాతడు,
            ధీరోదాత్తకు. జై
    1.    సాహీత్య`చరిత`విజ్ఞాన`కళలు
        చతుర్ముఖములై సౌరు గులుకంగా?
        ‘‘సత్యమ్‌`శివమ్‌ సుందర’మను మంత్రము
        చక్కని మకుటముగాగల, ఆంధ్ర॥సా॥

    2.    ఆఱువిధములగు సారస్వత పరీ
        క్షారంభములే మణిహారములుగ
        బాల`ప్రజా`పండిత సారస్వత
        పాయిన పాత్రలు చేగల ఆంధ్ర।సా॥
   
    3.    ఎనుబది లక్షలు మించిన ఆంధ్రుల
        హృదయరత్న సింహాసన మందున
        మన ప్రభువు కృప ఛత్రముగాÑ
        వినుతొగొన్న జగదీశ్వరి ఆంధ్ర॥సా॥   అని పాడి సభను దిగ్విజయంగా నిర్వహించారు.
    పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాల మాదిరిగా రచనలున్నప్పటికీ ఇది నిజంగా నిర్వహించబడిన సంస్థ. ఈ సంస్థలో కాళోజి నారాయణరావుతో పాటుగా వెల్దుర్తి మాణిక్యరావు, వెంకటరాజన్న అవధాని, గంటి లక్ష్మినారాయణ, సురవరం ప్రతాపరెడ్డి (వట్టికోట ఆళ్వారుస్వామి?)లు సభ్యులుగా ఉండేవారు.
    ఈ ఐదుగురు తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో పర్యటనలు చేస్తూ అక్కడ సారస్వత, సాహిత్య పరిషత్‌ సభలు నిర్వహిస్తూ అక్షరాస్యతను పెంచడమే గాకుండా సాహిత్యవాతావరణాన్ని సృష్టించారు. ఇందులో వెల్దుర్తి మాణిక్యరావు అణాగ్రంథమాల స్థాపకుల్లో ఒకరు. అలాగే పరిషత్‌ సాహిత్య కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడమే గాకుండా మొత్తం తెలంగాణ భాషలో మొట్టమొదటి నాటకం ‘దయ్యాల పన్గడ’ రచయితగా కూడా ఆయన ప్రసిద్ధుడు. కథలు కూడా రాసిండు. వేంకట రాజన్న అవధాని 1926 నాటికే మంథనిలో ‘ప్రబోధ చంద్రోదయం’ అనే లిఖిత పత్రికను నిర్వహించడమే గాకుండా గోలకొండ పత్రికలో పనిచేసిండు. వీరంతా అడ్వకేట్‌ విద్యను అభ్యసించి దానిని ప్రాక్టీస్‌గా మార్చకుండా సాహిత్య రంగంలోకి దిగిండ్రు. తెలంగాణ ప్రజలకు అత్యావశ్యకమైనది విద్య. ఆ విద్య ద్వారానే సమాజాన్ని మార్చొచ్చు అని నమ్మి అందుకు నడుంబిగించిన ‘ద్రౌపది లేని పంచపాండవులు’ అని తమని తాము వర్ణించుకున్నారు.
    ఈ వైతాళిక సమితి తెలంగాణలో సాహిత్య, సాంస్కృతిక పునర్వికాసానికి దారులు వేసిందంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడే గ్రంథాలయం, పత్రికోద్యమం ఊపందుకొని మారుమూల గ్రామాల్లో సైతం చదువుకున్న విద్యార్థులు జట్లుగా ఏర్పడి తమ గ్రామానికి ఏదైనా మంచి చేయాలనే కుతూహలంతో ఒకవైపు చరిత్రను తవ్వి తమ మూలాల్ని వెతికి పట్టుకున్నారు. అలా వచ్చినవే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని విరాట్రాయాంధ్ర భాషా నిలయం. ఇలా ప్రతి పట్టణంలో ఆంధ్రమహాసభ తరపున కార్యకలాపాలు చేపట్టి సమాజ శ్రేయస్సుకు తమదైన శైలిలో కృసి చేసిండ్రు. ‘‘హైద్రాబాద్‌లో సారస్వత ప్రియులైన యువకులు వైతాళిక సమితిని యనునొక సంస్థను స్థాపించిరి. సాహిత్యము , కళలు వీరి ప్రచారము యీ సంస్థ ముఖ్యోద్దేశ్యము’’ అని ఈ సంస్థ గురించి ఆంధ్రసారస్వత పరిషత్తుని తీర్చి దిద్దిన దేవులపల్లి రామానుజరావు తన ‘‘తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం’’ అనే పుస్తకంలో రాసిండు. తెలంగాణ పునర్వికాసంపై సమగ్ర పరిశోధన చేసిన పత్రికా సంపాదకులు కె.శ్రీనివాస్‌ మొదట ఈ ‘వైతాళిక సమితి’ గురించి తన పరిశోధన గ్రంథంలో రాసిండు. వైతాళిక సమితి సభ్యుడైన వెల్దుర్తి మాణిక్యరావు ఇలా రాసిండు. ‘‘1934`36లో కాలోజీ ‘వకాలత్‌’ చదవటానికి హైదరాబాద్‌ వచ్చినాడు. వెంకటరాజన్న అవధాని కూడా అందుకే వచ్చినాడు. నాకూ బుద్దిపుట్టింది. గంటి లక్ష్మీనారాయణ గంటు పడ్డాడు. నలుగురం రోజూ కలిసేది. చేతుల్లో ‘ఖానూన్‌’ పుస్తకాలున్నా, మాట్లాడేది లోకాభి రామాయణం. ‘వైతాళిక సంఘం’ అని ఓదాన్ని సృష్టించినాము. కాళోజి, వెల్దుర్తి, అవధాని’ అని ముగ్గురం కలిసి కథలు రాసేది. ఈ పద్దతి నాటికి నేటికి సరికొత్తదనే చెప్పాలి. అప్పటి నుంచి రచనా వ్యాసాంగంలో కాళోజీకి అభిరుచి కలిగిందంటే అతిశయోక్తి కాదనుకొంటాను.’’ అని రాసిండు. అంటే వైతాళిక సమితి కాళోజి మీద వేసిన ప్రభావం అర్థమవుతుంది.
    ఈ వైతాళిక సమితి తెలంగాణ సాహిత్య చరిత్రలో ఓ చిరస్మరణీయమైన ఘట్టం. సాహిత్యం ఓ సాహస కార్యంగా మారిన కాలంలో దానికి పూనుకొని ప్రచారం చేసిన వారిలో కాళోజి ముందంజలో ఉన్నాడు. ఈ సందర్భంగా కాళోజి తెలంగాణ చరిత్రతో నడిచిన తీరుని రికార్డు చేసుకోవాల్సిన అవసరముంది. ఆ చరిత్రను రికార్డు చేసుకోవడానికి ఇది ఏమాత్రం ఉపయోగపడిన అది తెలంగాణ సాహిత్యానికి మేలిమి చేర్పే అవుతుంది. 

-సంగిశెట్టి శ్రీనివాస్‌

THIS ARTICLE IS SUBMITTED FOR THE SEMINAR CONDUCTED BY A.V. COLLEGE ON KALOJI NARAYANARAO AND HIS CONTRIBUTION


No comments: