తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ

1944లో ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రజాచైతన్యానికి పునాదులు పడ్డ నాటి నుంచి 1946 జూలై నాలుగున దొడ్డికొమురయ్య అమరత్వం వరకు అప్పటి నల్లగొండ జిల్లా లోని జనగామ తాలూకాలో అన్ని గ్రామాలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. పాలకుర్తి, విసునూరు, కడవెండి ఉద్యమ కేంద్రాలుగా విలసిల్లాయి. పాలకుర్తిలో చాకలి (చిట్యాల) ఐలమ్మ, ఆమె భర్త నర్సింహ్మ, కొడుకులు, సోమయ్య, లచ్చయ్యలు అందరూ ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఆంధ్రమహాసభ నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం చిన్న సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, పాటలు పాడడం, బుర్రకథలు, ఒగ్గుకథలు చెప్పడం పరిపాటి. పాలకుర్తిలో ఆంధ్రమహాసభ బృందం సభ ఏర్పాటు చేసి, బుర్రకథ చెబుతుండగా విసునూరు దేశ్‌ముఖ్ గుండాలు మిస్కీన్ అలీ, గుమాస్త, అబ్బాస్ అలీ, వుత్తాలం రామిరెడ్డి, ఒనమాల వెంకడు తదితరులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తప్పతాగిఉన్న గుండాలకు తగిన శాస్తి చేసి పంపిండ్రు. దీంతో విసునూరు దేశ్‌ముఖ్ ప్రేరణతో పోలీసులు ఒనమాల వెంకడిపై హత్యాయత్నం చేసిండ్రనే నేరం ఆరోపిస్తూ చిట్యాల ఐలమ్మ భర్త నర్సింహ్మను ఆయన ఇద్దరి కొడుకుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిండ్రు. జనగామ మున్సిఫ్ కోర్టు, మెదక్ సెషన్స్ కోర్టుల్లో విచారణ జరిగింది. విచారణ ఏడాది కాలంపాటూ సాగింది. నర్సింహ్మతో పాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న 12మందీ ఆ కాలమంతా జైళ్లలోనే మగ్గిపోయారు. బెయిలుకు కూడా నోచుకోలేదు.
ఇదే అదనుగా గ్రహించి విసునూరు దేశ్‌ముఖ్ ఐలమ్మ పంటని స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేసిండు. అయితే ఈ పంటకు నిర్మాల, కడవెండి, సీతారాంపురానికి చెందిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు కాపలాగా నిలిచారు. మూడ్నాలుగు నెలలపాటు కాపలా ఉన్న వీరందరికి ఊరోళ్లందరి నుంచి బువ్వడొక్కొచ్చి పెట్టింది. అయితే వీళ్లు కాపాల మానుకున్న వెంటనే దొర గుండాలొచ్చిండ్రు. ‘‘..యింటికి నిప్పువెట్టిండ్రు. యేదుం సద్దలు వోస్కపోయిండ్రు. యెనుమందుం పెసర్లు వోస్క పోయిండ్రు. నువ్వులు గానుగ్గట్టించుకుంటమని తెచ్చి పోసుకున్న నువ్వులు వోస్క పోయిండ్రు. యిట్లనే మెరుక... నువ్వులు వోసుక పోయిండ్రు. యిగ నేతి పట్వలైతె, వాల్లక్కన్నే పోయిండ్రు గద పటువలు యింతింత పటువలు పక్కున పల్లగొట్టిండ్రు. గిట్లనే మెరుక. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. తినుకుంట తీస్కపోయిండ్రు. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. బండ్లుగట్టించి అవి. వోస్క పోయిండ్రు. వూల్లె యింటికి నిప్పువెట్టిండ్రు’’. అని తన బాధంతా ‘స్త్రీ శక్తి సంఘటన’ కార్యకర్తలతో చెప్పుకుంది. ఈ విషయాలన్నీ మనకు తెలియన మనచరిత్ర పుస్తకంలో రికార్డయ్యాయి.
తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతిరూపంగా నిలిచిన మట్టిమనిషి, మొక్కవోని ధైర్యంతో నిర్బంధాన్ని ఎదుర్కొన్న సాహసి చిట్యాల ఐలమ్మ. భూమికోసం, భుక్తి కోసం, భూస్వాముల, దొరల పీడనల నుంచి విముక్తి కోసం ఐలమ్మ కుటుంబం మొత్తం రక్తం ధారవోసింది. తాను, తన భర్త, కొడుకులు కష్టపడి పండిరచిన పంటను విసునూరు దేశ్‌మఖ్ తరలించుకు పోదామని ప్రయత్నిస్తే ‘సంగం’ అండతో అడ్డుకుంది. తరతరాలుగా తమ కుటుంబం సాగు చేసుకుంటున్న నాలుగెకరాల భూమి ఐలమ్మ కుటుంబం ఆస్తి. (మల్లంపల్లి దేశ్‌ముఖ్ (కరణం) నుంచి కౌలుకు తీసుకున్నది) వెట్టిచాకిరి వ్యతిరేకంగా సంగం నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆ బాధను అనుభవిస్తున్న ఐలమ్మ కుటుంబం కూడా సంగంలో చేరి వాటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఇది గిట్టని విసునూర్ దేశ్‌ముఖ్ ఐలమ్మ భూమిపై కన్నేసి వాటిని కాజేయాలని ప్రయత్నించిండు. విసునూరు పోలీసులు ఐలమ్మ ఇంటిమీద దాడి చేసి కొడుకుని అరెస్టు చేసి చిత్రవధ చేయడమే గాకుండా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటిని పలగొట్టి మొత్తం ఇంటికే నిప్పుపెట్టిండ్రు. న్యాయం కోసం ఆమె హైదరాబాద్‌లో ఉన్న అధికారుల్ని కలిసి విన్నపాలు జేసుకుంది. ఎక్కడికైనా మొక్కవోని ధైర్యంతో వొక్కతే పోయి వచ్చేది. ఆమె ప్రాణానికి హాని ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ న్యాయం కోసం జనగాం నుంచి హైదరాబాద్ వరకు అధికారులను కలిసింది.
పోలీసు దెబ్బలకు భర్త కాల్జేయ్యి పనిజెయ్యకుంటయ్యి తర్వాత చనిపోయిండు. ఐలమ్మకు మొత్తం అయిదుగురు కొడుకులు ఒక బిడ్డ. పచ్చి బాలింతగా ఉన్న బిడ్డపై దొరల తాబేదార్లు అత్యాచారానికి ఒడిగట్టిండ్రు. అలాగే ఉద్యమంలో పాల్గొన్న ఒక కొడుకు అమరుడయ్యిండు. అయినా ధైర్యం కూడగట్టుకొని సంఘానికి అండగా నిలిచింది. ఈమెకు అండగా ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి నిలిచిండ్రు. కమలాదేవిపై కూడా ఇదే విషయంలో కోర్టులో కేసు దాఖలు కావడంతో ఇద్దరు కలిసే పేషీలకు హాజరయ్యేది.
1900 ఆ ప్రాంతంలో పుట్టిన చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరుమీద సంగం వాళ్లు పాటలు రాసిండ్రు. పాడిరడ్రు. ఉయ్యాల పదం పాడిరడ్రు. ఆమెను బాలనాగమ్మ అని వర్ణించిండ్రు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం, పంట కోసం, పదుగురి బాగు కోసం, సంగం రాజ్జెం కోసం తమ సమస్తాన్ని ధారవోసిన ఐలమ్మ త్యాగం అనితర సాధ్యం. ఆమె సాహసం నేటి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. నాటి మహిళల ‘సంగం’ ఉద్యమానికి ఊపిరులూదిన ఐలమ్మ పోరాట పటిమ నిరంతరం తెలంగాణ ఉద్యమానికి దారి చూపుతూనే ఉంది. జీవిత కాలంలోనే భర్తను ముగ్గురు కొడుకుల్ని పోగొట్టుకున్న ఐలమ్మ 1985 సెప్టెంబర్ పదిన తనువు చాలించింది.
ఇన్ని త్యాగాలు చేసిన వీరనారి ఐలమ్మ విగ్రహం టాంక్‌బండ్‌పై స్థానం సంపాదించుకోలేదు. పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకోలేదు. తెలంగాణ వచ్చేవరకు తెగించి కొట్లాడి ఆమెకు చరిత్రలో తగిన స్థానం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాల్సిన తరుణమిది.
No comments:
Post a Comment