బండీకే నీఛే కుత్తా .....
ఇయ్యాల పది జిల్లల తెలంగాణ పిల్లలు ఒక్కతాటిపై నిలిచి మిన్నంటేలా ప్రత్యేక తెలంగాణ నినాదాలిస్తుండ్రు. ‘నూతిల గుండేసి తూటేది’ అనే రాజకీయ నాయకులతోటి తెలంగాణ వచ్చుడు కాదని ఇప్పుడు రోడ్ల మీద రోజూ ధర్నాలు, దీక్షలు, చేస్తున్న ప్రజలందికీ తెలిసిందే! తెలంగాణ బిడ్డలు ఆంధ్రోళ్ళ పాలనలో సచ్చినా బతికినా ఒక్కటేనని పాణం తీసుకుంటుండ్రు. బిడ్డల్ని కోల్పోయిన తల్లితండ్రులు తెలంగాణలోని 119 నియోజక వర్గాల్లో గోడుగోడున ఏడుస్తుండ్రు. 53 ఏండ్ల సంది ‘తెలంగాణ తల్లి’ తన బిడ్డల బతుకులు చూసి శోకం పెట్టని రోజు లేదు. తెలంగాణ తల్లి గుండెకాయ ‘హైదరాబాద్’ని సీమాంధ్రులు తూట్లు పొడిసి గాట్లు పెడుతుండ్రు. ఈ మానని గాయం నిత్యం సలుపుతనే ఉంది. బిడ్డల్ని కోల్పోతున్న తెలంగాణ తల్లి దుఖం ఆగకుండున్నది. నోటికాడి బుక్క ఎత్తగొట్టినోళ్లు పూటకో మాట మాట్లాడుతు ఇజ్జత్ పుచ్చుకుంటుండ్రు. తెలంగాణ బిడ్డల బలిదానాలను కూడా పజీత చేస్తుండ్రు. వీరభూమి మరు భూమిగా మారుతుంటే తల్లి తెలంగాణ కుముల్తుంది.
హైదరాబాద్ యోధులు ఎనుకటి సంది ఉద్యమంలో ముందే ఉన్నరు. 1952లో ముల్కీ ఉద్యమంలో నలుగురు బిడ్డలు పోలిసుల కాల్పులకు బలయ్యిండ్రు. అప్పుడు షురువైన బలిదానాలు ఇంకా కొనసాగుతున్నయి. 1969లో 369, ఇవ్వాల్టి పోరాటంలో 300కు పైగా సోర సోర పొలగాండ్ల రక్తం తాగినా సీమాంధ్ర పాలకుల నెత్తుటి దాహం తీరలేదు. ఇత్తెయ్యకుండనే పొత్తుగూడి 1956 నుంచి లూటిపోయిన చేనుని దోసుకున్నట్లు తెలంగాణను కొల్లగొడుతున్న సీమాంధ్ర పాలకవర్గాలు, వారి పోషకులు చరిత్రను, సంస్క ృతిని కించపరుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండ్రు. సాంస్క ృతిక దాడిని వివిధ రూపాల్లో తీవ్రతరం చేసిండ్రు. ఆంధ్రోళ్ళు సమస్యగా చెబుతున్న ప్రత్యేక తెలంగాణే పరిష్కారంగా హైదరాబాద్ వాసులు నమ్ముతుండ్రు. తెలంగాణ ఏర్పాటో, సమైక్యాంధ్ర కొనసాగింపో అనేది ‘హైద్రాబాద్’పై ఆధారపడి ఉంది. ‘హైద్రాబాద్’ పంచాయితి తష్వ అయితే గానీ తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు. కబ్జా పెట్టిన రాజధాని హైద్రాబాద్‌ని సాకుగా చూపించి సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తుండ్రు.
హైద్రాబాద్‌ని అమాంతం మింగి మంచినీళ్లు తాగెతందుకు శాన ఇకమతులు జేస్తుండ్రు. తిమ్మిని బమ్మి చేస్తూ తీరొక్క ఏషం కట్టి మనల్ని తిప్పలు పెడ్తుండ్రు. కన్నమ్మ గోస పెడ్తుండ్రు. హైద్రాబాద్ నీ అబ్బ సొమ్మా? అని ఒగడు శిగమూగితే, ఇంకోడు తొండలు గుడ్లు పెట్టని భూమిని సవరించినమని కావురంతోటి వదురుతుండు. బాసినలుగ ఉన్న మిమ్మల్ని విముక్తి చేసినమని ఇంకొకయాన ఫోజులు కొడుతుండు. మీకు భాష నేర్పినమని బరితెగిస్తుండ్రు. తురుకోళ్లు తెలంగాణ కోరుతలేరని ఒక దగ్గర, తెలంగాణ వస్తే బిజెపి రాజ్యమొస్తదని, నక్సలైట్ల రాజ్యమొస్తదని అంతు పొంతు లేని , అడ్డూ అదుపు లేని కువ్వారపు మాటలు మాట్లాడుతుండ్రు. తినె తలెల ఊంచినట్టు రాజశేఖరరెడ్డి 2009లో తెలంగాణలో ఎలక్షన్లు అయ్యెదాకా ఓడ మల్లయ్య అంటూ వోట్లు ఇంక వొడువక ముందే నాలుగ్గంటలకే నంద్యాలల హైదరాబాద్‌పై యిసం గక్కిండు. ఇద్దరం కలిసుందమని చెప్తూ కావిలించుకొని ‘కుడి’ చెయ్యితోటి కడుపుల, ‘ఎడమ’ ‘చెయ్యి’తోటి ఈపుల కత్తి పోట్లు పొడుస్తుండ్రు. గద్దెనెక్కినోళ్ల మోసాలు ఇంకానా ఇక సాగవని తెలంగాణ గొంతెత్తి నినదిస్తోంది. ఈ నగరం మాది అని సవాల్ జేస్తుంది. దేశంలోనే భిన్నమైన హైదరాబాద్ భాషా, సంస్క ృతి, అవ్వల్ దర్జా అని తెలియజెప్పుతుంది.
ఒక్కొక్కటి తఫ్సీలుగా చూస్తె హైదరాబాద్ ఎవ్వల్ది? దాని తహెజీబ్ ఏంది? అనేది సమజైతది. మేం డెవలప్ జేసినం అని విర్రవీగేటోళ్లు కండ్లు తెరిసి సూత్తే సత్తెము తెలుస్తది. అభివృద్ధి పేర్మీద ఆళ్లు ఏంజేసిండ్రో, ఎంత దోసుకుండ్రో లెక్క గట్టొచ్చు. ఎవ్వడు భూముల్ని అమ్ముకుండు, ఎవ్వలు కొనుక్కుండ్రు? ఎంత కబ్జ చేసిండ్రు, ఎవ్వల్ని ముంచి ఎవ్వల్ని తేల్చిండ్రో తెలుస్తది. హైదరాబాద్‌ల పబ్లిక్కు తాగేతందుకు కూడా నీళ్లియ్యలేని ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడ్డం మంచిగలేదు. భోలక్‌పూర్`ముషిరాబాద్‌ల గలీజు నీళ్లు తాగి సచ్చుడేరుగుడయిన సంగతి అందరికి మతిల ఉంది. నిజాం జమానాల సర్కార్ నల్ల చౌబీస్ గంట కుల్ల ఉండే సౌలత్ ఉండేది. ఇప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూత ఇకమతులతోటి అనుతులు తెచ్చుకోని బిల్డింగ్‌లు కట్టి నీళ్ళన్నింటిని విషం చేసిండ్రు. ఈడ పుట్టి ఈడ పెరిగినోంది హైద్రబాదు కాకుంటే బతుకొచ్చి కిరాయింట్లో ఉన్నోడు మకాన్‌దార్ అయితడా? గుజరాతోల్లు బొంబాయి నుంచి అలగ్ అయినప్పుడు తట్టబుట్ట సదురుకొని ఖాళి చేసిండ్రు తప్ప పేచి పెట్టుకోలేదు. మా తాతల తాతలు, అమ్మమ్మలు, నాయినమ్మలు రాళ్లుమోసి కట్టిన హైద్రాబాద్ మాది గాకుంటే అన్ని తయారైనంక మెరిగెల గురిగోలె అమరించుకున్నోందయితదా? ఢంక బజాయించి చెబుతం హైద్రాబాద్ మా అబ్బదే. అవును హైద్రాబాద్ మా భాగమతి ప్రేమ నిషాన్. తుర్రెబాజ్‌ఖాన్ తుపాకి మోత, మా మహబూబ్ అలీఖాన్ మట్టి వాసన. బండ్లోల్ల కురుమన్న, జంపన్నల సాహస గీతం. కన్నతల్లిగ సూసుకునే హైద్రాబాద్ మాదిగాకుంటే బజారుల హర్రాజ్ చేసే నీదెట్లయితది?.
తొండలు గుడ్లు పెట్టని భూముల్ని సవరించినమని అనేటోళ్లు ఆ భూమిని సీమాంధ్ర నుంచి కోసుకోని తీసుక రాలేదని గుర్తు పెట్టుకోవాలె. మా నిజాం రాజు సొంత ఆస్తి సర్ఫెఖాస్ భూముల్ని, భూదానోద్యమంలో భాగంగా మా తాతలు దానం చేసిన జాగను, కబ్జచేసి అప్పనంగా దక్కించుకుండ్రు. అసెంబ్లీలనే అవును అక్రమాలు జరిగినయని ధర్మాన ఒక్కసారన్న ధర్మంగా మాట్లాడిరడు. ఆకుల రాజయ్య లాంటోళ్లను ఆంధ్రోళ్ళు బంట్లుగా మార్సుకొని అత్రఫ్ బల్దా మొత్తం అమ్ముకుండ్రు. అయిన కాడికి కబ్జ పెట్టిండ్రు. ఏ రాష్ట్రానికైనా దాని రాజధాని సుట్టూతా ఇంత పెద్దమొత్తంలో గవుర్నమెంటు జాగా లింకెక్కడ్లేవు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు 1953 అక్టోబరు ఒకటి తర్వాత ఎన్ని రోజులు మద్రాసు నుంచి ఆఫీసులు ఖాళి చెయ్యకుంటే అన్ని రోజుల కిరాయి కట్టిండ్రు. కర్నూలుకు షిఫ్ట్ అయిన ఆంధ్ర ప్రభుత్వము హైదరాబాద్ మీద కన్నేసి దాన్ని కలుపుకుంటే తాము గుడారాల్లో ఆఫీసులు నడిపే బాధ తప్పుతదని మనమిద్దరమొక్కటే అని మెత్తటి కత్తితోటి తెలంగాణ కుత్తుక తప్పతీసిండ్రు. మాది తొండలు గుడ్లు పెట్టని భూమైతె ఎగేసుకొని ఈడికెందుకొచ్చిండ్రు. మాధాపూర్‌ల భూములమ్ముకున్న మావోళ్లు చాలమంది గుండెపగిలి సచ్చిండ్రు. మిగిలినోళ్లు మీ హై‘టెక్కు’ సిటీల వాచ్‌మెన్లుగా సస్తూ బతుకుతుండ్రు. ఇదే ఆంధ్రోళ్ళు చెప్పే అభివృద్ధి. హైటెక్కు సిటీ కట్టినంక హైదరాబాద్ అంటే ఆంధ్రోళ్ళదే అన్నట్టుగ చార్మినార్‌కు బదులుగ దాన్నే సూపించి పాత హైదరాబాద్‌ని పాతరపెట్టిండ్రు. మా భూములన్నింటిని సెజ్‌ల పేర్మీద, రింగురోడుల పొంటి, గురుకుల్ భూములు, భూదాన భూముల్ని ఆడిరది ఆటగా, పాడిరది పాటగా పట్ట చేసుకుండ్రు. 1948ల్నే దేశంల హైదరాబాద్ బలవంతపు విలీనం సందర్భంగా మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన ఆంధ్ర`ఆఫీసర్లు మంచి మంచి బిల్డింగుల్ని సొంతం జేసుకుండ్రు. విలీనం సందర్భంగా పైసలున్న ముస్లిములు లండన్‌లో సెటిలయ్యెతందుకు ఇక్కడి ఆస్తులమ్మడానికి ప్రయత్నిస్తే వాటిని అమ్మనివ్వకుండా ఎవాక్యూ ప్రాపర్టీ కింద స్వాహా చేసిండ్రు. ఇప్పటికీ జూబ్లిహిల్స్‌లో చేతులు మారిన పాత భవంతుల చూస్తే అవ్వెవ్వరియొ తెలుస్తది. ఈ తొండలు గుడ్లు పెట్టని భూములన్నింటిని వామనుడోతిగ దిగ మింగిండ్రు. భూములు, ఆకాశ హర్మ్యాలు ఆళ్ళవే. ఇగిప్పుడు తెలంగాణ బిడ్డల నెత్తిల పెట్టి అడుక్కు తొక్కుతుండ్రు.
బానిసలుగ బతుకుతున్న మమ్మల్ని విముక్తి చేసింది ఆళ్ళేనట. అవును మరి తుపాకి ఎట్లపట్టుకోవాలో తెలువని పుచ్చలపల్లి సుందరయ్య మీకు హీరో లాగ కనబడుతడు. అసలు తూపాకి పట్టి జంగ్ చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సుద్దాల హనుమంతు, దొడ్డి కొమురయ్య, బండి యాదగిరి లాంటి వందల వేల యోధులు మీ కంటికి ఆనరు. మా బతుకులు బాగు చేసుకునేందుకు తుపాకి పడితే నిజాం సైన్యం మూడొందల మందిని పొట్టన పెట్టుకుంటే నెహ్రూ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం`పటేల్ సైన్యం 1948`51 మధ్యల నాలుగు వేల మందిని సంపి మా నెత్తురు తాగింది. అయినా కూడా మీవాళ్ళు రాసిన చరిత్ర పుణ్యాన ఇయ్యాల్టికి కూడా నిజాంనే నిందిస్తున్నాం తప్ప నెహ్రూని, కాంగ్రెస్‌ని పళ్లెత్తు మాట అనలేక పోతున్నం. అవును గాని ఆంధ్రోళ్లు ఈడ ఒక్క మాటకు జవాబు ఇచ్చి తీరాలి. ఈడ పుట్టి ఈడ పెరిగినోని పాలనల మేం బతికితే అది బానిస బతుకెట్ల అయితది. పరాయి దేశం నుంచి వచ్చి వనరుల్ని, నిధుల్ని తరలించుకోని పొయిన బ్రిటిషోని పాలనలో ఉన్న మీరు స్వతంత్రులెట్లయితరు? మీ చీరాల పేరాల రెండూర్ల కొట్లాట పెద్ద ఉద్యమమై చరిత్రకెక్కుతది. మా సాయుధ పోరాటం గురించి పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా ఒక్క ముక్కెందుకుండది?
మాకు భాష నేర్పిన మని కూడా సీమాంధ్రులు కోతల కూతలు కూస్తుండ్రు. మా హైదరాబాద్‌ల ఎనుకట ప్రతి ఒక్కనికి ఐదు భాషలొచ్చేటియి. మాది పంచ భాషా సంస్క ృతి. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, ఇంగ్లీషు ఈ ఐదు భాషల్లో హైదరాబాద్ వ్యవహారాలు నడిచేటివి. కాళోజి అన్నట్టు రెండున్నర జిల్లాల వాళ్ళ భాషే ప్రామాణికమయింది. ఈ రెండున్నర జిల్లాల వాండ్లే హైదరబాద్ రాష్ట్రంలో దొంగ ముల్కీ సర్టిఫికెట్టు సంపాదించి ఉద్యోగాలు సంపాదించిండ్రు. పాఠశాలల్లో పంతుల్లై తమ భాషే గొప్పదని ఆ భాషలోనే సదువులు నేర్పి తెలంగాణ భాషకు గోరికట్టిండ్రు. మా తెలంగాణ భాషను మాగ్గాకుండా చేసి భాష నేర్పినమనే బైరూపులేషమేస్తుండ్రు.
ఒకదానికొకటి పొంతన లేకుండ తెలంగాణొస్తె బిజేపి అధికారం లోకి వస్తదని, నక్సలైట్లు రాజ్యమేలుతరని బట్టకాల్సి మీదేసె మాటలు మాట్లాడుతుండ్రు. బిజేపి అధికారంలోకి వచ్చే అవకాశం వాళ్లే చేజేతుల కాకినాడ తీర్మానాన్ని వెనక్కు నెట్టి, రాజీనామాల్లో చీలిక తెచ్చి కాలరాసుకుండ్రు. ఇగ నక్సలైట్లు దేశమంతటున్నరు. అది కేంద్రం చేతిలోని ముచ్చట. ముస్లిముల తెలంగాణ కోరుకుంటలేరని మరొక దుర్మార్గమైన ముచ్చట ముందుకు తీసుకొచ్చిండ్రు. తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో, ముస్లిములున్న దాదాపు ప్రతి ఊర్ల ధర్నాకు దిగి ఎక్కడికక్కడ సంఘాల్ని స్థాపించుకొని ఉద్యమాల్జేస్తుండ్రు. జమాతె`హింద్ సంస్థ తరపున లక్షలాది ముస్లిం ప్రజానీకంతో ‘‘జస్టిస్ ఫర్ తెలంగాణ, తెలంగాణ ఫర్ జస్టిస్’ అనే నినాదమిచ్చి హైదరాబాద్‌లో భారీ గర్జన నిర్వహించి ముక్తకంఠంతో వారి వాణిని వినిపించిండ్రు. మా హైద్రబాద్‌ల ఎనుకటి సంది హిందూ`ముస్లిములం అన్నదమ్ముల్లాగున్నం. ఒకర్నొకరం ఆదుకున్నం. కాని మీరు ఫ్యాక్షన్ బుద్ధితోటి అధికారం కోసం హైదరబాద్‌ల మతకలహాలు సృష్టించి మా శవాల మీద్కెళ్లి మీరు గద్దెనెక్కిండ్రు. ఈ యాభై ఏండ్లల్ల మావోల్లు ఒక్కలు కూడా ఐదేండ్లు ముఖ్యమంత్రిగ లేడంటె మతలబేంది. 53 ఏండ్లల్ల మావాల్లు ఆరేండ్లు కూడా సక్కగా సిఎంగ లేరు.
రాజశేఖరరెడ్డి తాను సిఎంగ కొనసాగెతందుకు తాను తింటున్న తలెల్నే ఊంచిండు. 2009 అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటి మాదిరిగానే తెలంగాణలోనే మొదట జరిగినయి. దీన్ని మొఖగ తీసుకున్న రాజశేఖరరెడ్డి తెలంగాణల ఎన్నికలు జరిగిన రోజే నాలుగ్గంటలకు ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టుగ ‘మీరు కాంగ్రెస్‌కు ఓటెయ్యనట్లయితె హైదరాబాద్‌లో విదేశీయుల్లాగ బతకాల్సి వస్తది. వ్యాపారాలు చేసుకోలేం. సదువులు సదువుకోలేం’ అని ప్రజల్ని రెచ్చగొట్టిండు. ఓట్ల పంట పండిరచుకుండు. రాజశేఖరరెడ్డి 32 యేండ్ల నుంచి హైదరాబాద్ గండిపేట నీళ్లు తాగిండు. కనీసం ఆ విశ్వాసమన్నా లేకుండా అన్నం బెట్టిన తల్లిలాంటి హైదరాబాద్ మీద యిషం గక్కిండు. హైదరాబాద్‌లనే కాదు, అదిలాబాదుల ఉన్న సింగరేణిల గూడా నీ కాంట్రాక్టర్లే, నీ మనుషులే దోసుకుంటున్నా నిన్నొక్క మాట అనలేక పోతిమి. ఓట్ల కోసం హైదరబాద్ తెహజీబ్‌ని అమ్మకానికి పెట్టిండు. ఇన్ని రోజులు ఆదుకొని ఆశ్రయమిచ్చిన హైదరాబాద్‌ని బెమ్మ రాక్షసిలా చిత్రీకరించిన రాజశేఖరరెడ్డి నియ్యత్ అందరికి తెలిషిపాయె.
హైదరాబాద్ సంస్క ృతి ఆంధ్రోళ్ళకు ఎన్నడర్థం కాదు. ఏండ్ల సందున్నా ఒక్క ముక్క ఉర్దూ ఉచ్చరిచలేరు. హైదరబాద్‌ల సిర్ఫ్ తెలంగాణ వాళ్లే కాదు అఫ్ఘనిస్తాన్, ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, ఇంగ్లండ్ నుంచి వాళ్ళుకూడా అన్యోన్యంగా ఉండి ఇక్కడి భూమిని కండ్లకద్దుకున్నరు. అంతెందుకు పాకిస్తాన్ నుంచి వచ్చి కరాచీ బేకరి నడిపిస్తున్న వాళ్లు హైదరాబాద్‌తో మమేకమయిండ్రు. ఇరానీ చాయ్ జిందగీలో భాగమయింది. ఇంగ్లండ్ నుంచి వచ్చిన కిర్క్ పాట్రిక్`ఖైరున్నీసా ప్రేమించి పెళ్ళాడి హైదరాబాద్ ప్యార్‌ని విశ్వవ్యాప్తం జేసిండు. గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలయితే 1969 ఉద్యమానికి అండదండగా నిలిచిండ్రు. బెంగాళీలు, కేరళీయులు, తమిళులు, సిక్కులు, మహారాష్ట్రియన్లు, కన్నడిగులు అందరూ హైదరాబాద్‌ని ఓన్ చేసుకుండ్రు. ఇక్కడి చరిత్ర, సంస్క ృతి, చారిత్రక వారసత్వంతో మమేకమయ్యిండ్రు. హైద్రాబాద్ మాది, మాది హైద్రాబాద్ అని ఒక్క సుతితోటి చెప్పుతుండ్రు. ఒక్క ఆంధ్రోళ్ళు మాత్రమే ఎక్కడపోతే అక్కడ ద్వీపకల్పాల్ని సృష్టిస్తుండ్రు. తేడాలు పాటిస్తుండ్రు. ఒకవైపు హైదరాబాద్ కాస్మోపాలిటన్ కల్చర్‌ని, హైదరాబాద్ సమశీతోష్ణ స్థితిని ఎంజాయ్ చేస్తూ మరోవైపు తల్లిపాలు పిండుకొని అమ్ముకుందామనుకుంటుండ్రు. తమకు వర్తించిన నిబంధనలే ఇతరులకు కూడా వర్తించాలి, వర్తిస్తాయనే సోయి లేకుండా సీమాంధ్రులు చిందులేస్తుండ్రు. ఆంధ్రోళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు అందుకు వాళ్ళు చూపిన ప్రధాన కారణం రాజధాని తెలుగు ప్రాంతాలకు దూరంగా ఉందని చెప్పిండ్రు. అవును నిజమే శ్రీకాకుళం వాండ్లకు చెన్నయ్ ఎట్లాగు దూరమే. మరి అదే సూత్రం హైదరాబాద్‌ల ఎందుకు వర్తించదు. హైదరాబాద్ రావాలంటే ఎట్నుంచైనా కనీసం రెండువందల కిలోమీటర్లు దాటి వస్తెగానీ హైదరాబాద్ శివారు తగలదు. ఎట్ల చూసినా హైదరాబాద్ సీమాంధ్రులకు దోపిడి చేసుకునేందుకు ఒక స్థావరం మాత్రమే. ఎవరైనా తమకేం కావాలో కోరుకోవడం న్యాయం. కాని నీది నాక్కావాలె అనడం అన్యాయం. ఈ అన్యాయపు పునాదులపైనే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ నిలబడ్డది.
మొత్తం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా రాష్ట్ర రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోసం, అదే తెలంగాణ కోసం కొట్లాడుతుంది. 53 యేండ్ల సంది తెలంగాణ సంపదను కొల్లగొడుతూ, అదే డబ్బుతో తీసిన సినిమాల్లో బరితెగించి తెలంగాణోళ్లను తెలివిలేనోళ్లుగా చిత్రీకరించి పైసలు సంపాదించుకుంటుండ్రు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన నిజామ్ హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా ఉండి తన సర్ఫేఖాస్ ఆస్తినంతా ప్రభుత్వానికి అప్పగిస్తే దాన్ని ఆంధ్రోళ్లు సెక్రటేరియట్‌లో చక్రం తిప్పి, వక్ఫ్‌బోర్డులో రికార్డులు మాయం జేసి సొంతం జేసుకుండ్రు. ఇంతా జేసి దానికి అభివృద్ధి అనే ముసుగేస్తే హైదరాబాద్ ఎందుకు భరిస్తది. ఇంక సయించదు. అందుకే హైదరాబాద్ ప్రత్యేక తెలంగాణ జంగ్‌కు సైరనూదింది. తన అస్తిత్వం, ఆస్తి అన్ని కొల్లకొట్టబడిన హైదరాబాద్‌కు తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఆంధ్రులు తమ దోపిడి, దగా, మోసపు కార్యాల ద్వారా కల్పించిండ్రు.
హైదరాబాద్ ఎన్నటికీ హైదరాబాదీయులదే. ప్రేమతో అమ్మా అని పిలిస్తే దాసుకున్నదంతా దోసిళ్లతో దానం చేసే గుణం హైదరాబాద్‌కుంది. హైదరాబాద్ నిజాం జమానాలో మొత్తం దేశంలోని నగరాల్లో నాలుగో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది. అంటే అభివృద్ధి చెందినట్టా? హైదరాబాద్‌ని డెవలప్ చేసినమన్నోళ్లు కళ్లుండి చూడలేని గుడ్లోళ్లు. బండీకే నిఛే కుత్తాలు. నిజమే నడుస్తున్న ఎడ్ల బండి కింద చల్లటి నీడలో అడుగులేసే కుక్క బండిలోని లోడ్‌నంతా తానే భరిస్తున్నట్టుగ అపసోపలు పడి పోయిందట. ప్రస్తుతం ఆంధ్రోళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉంది. కడుపుల సల్ల కదులకుండ అన్ని అమర్చి పెడితే, అజాంజాహిమిల్లు, ఆల్విన్ ఫ్యాక్టరీలను అమ్ముకోని మింగి అంతా అభివృద్ధి చేసినమని ఆంధ్రోళ్ళు అపసోపాలు పడి పోతుండ్రు.
హైదరబాద్‌కిది చాలా పరీక్షా సమయం. వందల యేండ్ల తమ చరిత్ర, సంస్క ృతి, వారసత్వ సంపద నాశనం గాకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత హైదరబాదీయులందరిపై ఉంది. అఘోరనాథ్ చటోపాధ్యాయ, ఆయన కూతురు సరోజిని నాయుడు, ఆమె కూతురు పద్మజా, లీలామణి నాయుడు, కొడుకు జయసూర్య నాయుడు, ఇంగ్లీషు రచయిత టి.ఎస్. ఇలియట్, ఎవరెస్టును అధిరోహించిన ఎడ్మండ్ హిల్లరీ, నోబెల్ గ్రహీత రోనాల్డ్‌రాస్, ప్రపంచమంతా ఇస్లాం ఫిలాసఫీని ప్రచారం చేసిన జమాలుద్దిన్ అఫ్ఘానీ, క్రికెటర్ జయసింహ, అజరుద్దీన్, అమెరికాలో భారత అంబాసిడర్ అబిద్ అలీఖాన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత్ ఏక్ కోజ్ శ్యామ్ బెనగల్, మాభూమి బి.నరసింగరావు ఇలా వందల వేల హైదరాబాదీయులతో పాటు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ తెలంగాణ వాళ్లు కాకపోయినా, హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్టులో జడ్జ్‌గా పనిచేసిన జస్టిస్ కొమురయ్య ఇంకా ఇలాంటి ఎందరినో హైదరాబాద్ ఆదరించింది హక్కున చేర్చుకుంది. తమ బిడ్డలుగా చూసుకుంది. హైదరాబాద్ బచావో పేరిట ఏర్పాటయిన బినామీ సంస్థలు ఆంధ్రుల కొమ్ముకాస్తూ తెలంగాణను వంచిస్తున్నాయి. ఈ వంచనను పసిగట్టి ఎండగట్టాలి.
No comments:
Post a Comment