Sunday, 4 August 2013
పంపకాల యాళ్ళ విజిలెంట్‌గుండాలి!
60యేండ్లు గోస పెట్టైనా కాంగ్రెస్ పార్టీ ఆఖరికి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించడం సంతోషం. కానీ ఇల్లలుకగానే పండుగకాదు. పార్లమెంటులో 29వ రాష్ట్రంగా తెలంగాణ బిల్లు పాసయితేనే అసలైన పండుగ. ఆ బిల్లు పాసయ్యే వరకు తెలంగాణవాదులంతా జాగరూకతతో ఉండాలి. యూపీఎ ప్రభుత్వంపై వత్తిడి పెంచాలి. ఎందుకంటే 2009 డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణవాదులు నిష్క్రియాపరంగా ఉండడంతోనే వచ్చిన తెలంగాణ వెనక్కి బోయింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీల ఎమ్మెల్యేలు మళ్ళీ రాజీనామా డ్రామాలాడుతున్నారు. అయితే ఏది ఏమైనా ఈ చివరాఖరి దశలో కాంగ్రెస్ వెనక్కిబోదనే విశ్వశిద్దాం. వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేలా వత్తిడి తెద్దాం.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎప్పటి మాదిరిగానే తన చేతలు ఒకటి మాటలు ఒకటి అని మళ్ళొక్కసారి నిరూపించుకున్నాడు. ఇగ తెలంగాణపై ప్రకటన వస్తుందనగానే ఢల్లీిలో ఆజాద్, దిగ్విజయ్‌సింగ్‌లని ప్రభావితం చేసి రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని రాకుండా చేయాలని మంతనాలు చేసిండు. కనీసం నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరిండు. అలాగే కిరణ్ చాలా బాగా పనిచేస్తుండు, తెలంగాణ వాదాన్ని అణచేస్తాడు, ఆయన ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడాం, ఇకముందు కాపాడుతాం అని కూడా ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. ఆఖరి నిమిషం వరకూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాల్చేయ్యాలని జూసిండు. ఇదంతా ‘హిందూస్తాన్ టైమ్స్’ పత్రిక బట్టబయలు జేసింది. గతంలో ఆయన సింగపూర్ ఆస్తులతో సహా అక్రమాస్తుల్ని లెక్కగట్టింది కూడా ఈ పత్రకే! అదే మనిషి తెలంగాణ ప్రకటన వచ్చిన తెల్లారి సుద్దపూస లెక్క మాట్లాడుతూ విడిపోయి కలిసుందాం అని పైకి పలికిండు. కడుపులో ఇంత విషంబెట్టుకున్నడు కాబట్టే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి సీమాంధ్రల్లో రాజీనామాలను చేసిన వారిని సస్పెండ్ చేయలేదు. పళ్లెత్తు మాట అంటలేడు. బహుశా గతంలో మాదిరిగా ఈసారి కూడా ఈ రాజీనామాల వెనుక ఆయనే ఉన్నాడనేది తెలంగాణవాదుల నమ్మకం. చంద్రబాబు, లగడపాటి, కావూరి, రాయపాటి, కిరణ్‌రెడ్డి, బొత్స ఎవరెన్ని తప్పుడు కూతలు కూసినా, ఎన్ని డ్రామాబాజీలు చేసినా కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. కానీ దీంతోపాటు కేవలం పోలవరానికి జాతీయ హోదా కల్పించి, చేవేళ్ళ`ప్రాణహితను విస్మరించడం దుర్మార్గం. అలాగే హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని అనడం కూడా అవాంఛనీయం.
ఉద్యమకారులు భయపడ్డట్టుగా రాయల తెలంగాణ కాకుండా పదిజిల్లాల రాష్ట్రం ప్రకటించడం ముదావహమే గానీ దానికి హైదరాబాద్‌ని సమిష్టి రాజధానిగా పదేళ్ళుంటుందని ప్రకటించడం పూర్తిగా అన్యాయం. సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి కేవలం రెండు మూడేళ్ళు సరిపోతుంది. అలాంటిది పదేళ్ళపాటు అనడంలోనే దుర్మార్గమైన ఆలోచన ఉంది. ఈ ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్‌పై పాలనాధికారం ఎవరికుంటుంది? రెవిన్యూ, ఆదాయం ఎవరికి దక్కుతుంది? పన్నులు వేసే ఆధికారం, వసూలు చేసుకునే అవకాశం ఎవరికి దక్కుతుంది? వనరుల్ని ఏ నిష్పత్తిలో వాడుకోవాలి? ఇలాంటి ఇంకా అనేక ప్రశ్నలకు ఇప్పుడు జవాబుల్లేవు.
‘ఇసుంత రమ్మంటె ఇల్లంత నాదే’ అనే ఆధిపత్యాంధ్రులతో రెండు మూడేళ్ళు రాజధానిని పంచుకోవడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఈ రెండేళ్ళ కటాఫ్ డేట్ తరువాత ఆంధ్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటాయో ఆ కాలానికి మార్కెట్ రేటు ప్రకారం కిరాయి చెల్లించేలా చట్టాల్ని తీసుకురావాలి. దాన్ని కూడా మూడేళ్ళకు మించకుండా చూసుకోవాలి. గతంలో మద్రాసు నుంచి కార్యాలయాలు కర్నూలుకు తరలించక బోవడంతో రాజాజీ ఆంధ్రుల దగ్గరి నుంచి కార్యాలయాల కిరాయి వసూలు జేసిండు కూడా!
సమిష్టి రాజధాని విషయంలో ఏ మాత్రం రాజీపడ్డా ఆంధ్ర నాయకులు హైదరాబాద్‌లో శాశ్వతంగా తిష్టవేసేందుకు కుట్రలు పన్నే అవకాశముంది. ఇప్పటికే హైదరాబాద్‌ని ఆవాసంగా చేసుకొని, ఇక్కడి సంస్కృతి పట్ల గౌరవంతో ఉన్న వారితో ఏ తెలంగాణవాదికి ద్వేషభావం లేదు. అయితే ఆధిపత్యం చలాయించి, దబాయించాలనుకుంటే, రుబాబు చేయాలనుకుంటే చెల్లదు. హైదరాబాద్‌ని అంగడి సరుకుగా మార్చి నిత్యం వేలం వేసిన సీమాంధ్ర నాయకులు తామున్న పదేళ్ళ కాలంలో నగరాన్ని ‘లూటి పోయిన చేను’ని చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ దశలో తెలంగాణ సమాజం అత్యంత జాగరూకతతో ఉండాలి.
ఈ పంచాయితి ఎట్లున్నా తెలంగాణ కల సాకారం కాబోతున్న తరుణంలో ఉద్యమకారులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మరింత జాగరూకతతో ఉండాలి. విభజన సమయంలో విజిలెంట్‌గా లేనట్లయితే మోసాకారి విద్యలు బాగా తెలిసిన వలసాంధ్రుల చేతిలో మరోసారి భంగ పడే అవకాశముంది. ఆస్తులు, అప్పులు పంచుకునే విషయంలో తెలివిగా లేనట్లయితే అప్పులన్నీ మన నెత్తిన బెట్టి ఆస్తులు వాళ్లు కాజెయ్యగలరు. ఇప్పటికే సెక్రెటేరియట్‌లోని కీలక శాఖల్లో ఫైళ్ళను తగలబెడుతూ తమ అవినీతి, దోపిడీకి, కబ్జాలకు సాక్ష్యాలు మాయం జేస్తున్నారు.
తెలంగాణ వచ్చిందనే సంబూరంలో ఆంధ్రులు పెట్టే అన్ని డిమాండ్లకు, షరతులకు ఇక్కడి నాయకులు గుడ్డిగా ఆమోదం తెలిపే అవకాశముంది. అందుకే ఈ నాయకులను కూడా చైతన్యవంతుల్ని చేసే విధంగా వివిధ రంగాల్లోని నిష్ణాతులు గ్రూప్‌లుగా ఏర్పడి విభజన రూట్‌మ్యాప్‌ని నిర్దేశించాల్సిన అవసరముంది. పంపకాలు ఎట్లా జేసుకోవాలి అనే మార్గదర్శకాలని తయారు చేసి అన్యాయం జరగకుండా చూడాలి. విద్యుత్, విద్య, నీటిపారుదల ఇలా సకల రంగాల్లో లెక్కలు తీసి భవిష్యత్తరాల వారు నష్టపోకుండా పంపకాలు న్యాయంగా జరిగేందుకు ఇరు ప్రాంతాల వారికి ఆమోదమైన పెద్దమనుషులతో కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు ట్రాన్స్‌పరెంట్‌గా ఎక్కడ అవినీతికి, ద్వంద్వనీతికి తావివ్వకుండా ఈ కమిటీలు పనిచేయాలి. ఇక్కడ ఏమాత్రం ఆలసత్వం వహించినా మన 60 యేండ్ల పోరాటం సున్నా చుడుతుంది. భవిష్యత్తరాల వారికి తీరని అన్యాయం జరుగుతుంది. ఒక్క తప్పుడు నిర్ణయం మనది మనకు కాకుండా జేస్తుంది. ‘నాది నాకే, నీదీ నాకే’ అనే దోపిడీ మనస్తత్వంతో ఉండే వలసాంధ్రుల ప్రతిపాదనలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి.
-సంగిశెట్టి శ్రీనివాస్
KCR interview with ABN - sangishetty
http://www.youtube.com/watch?v=b3S_jMTJcVA
watch this video i was mentioned in the ending in this interview
watch this video i was mentioned in the ending in this interview
Subscribe to:
Posts (Atom)