
షరతులు, మినహాయింపులు, ఆంక్షలతోనైతేనేమి ఎట్టకేలకు ప్రత్యేక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఇవ్వాళ భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం
ఏర్పడిరది. తెలంగాణ ప్రజలు కోరుకుంది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు
‘బంగారు తెలంగాణ’ కావాలని కోరుకుండ్రు. ఈ బంగారు తెలంగాణ కేవలం ‘బహుజన
తెలంగాణ’ ఇంకా చెప్పాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమౌతుంది. సామాజిక
న్యాయం అంటే సమాజంలోని అట్టడుగు వర్గానికి సైతం వారి జనాభా దామాషాలో
చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం. ఒక్క ప్రాతినిధ్యమే కాదు అభివృద్ధిలో
భాగస్వామ్యమూ కూడా కావాలి. 60 యేండ్ల తెలంగాణ పోరాటానికి నిజమైన
గుర్తింపు, గౌరవం, న్యాయం ‘బహుజన తెలంగాణ’తోనే సాధ్యమౌతుంది.
ప్రత్యేక తెలంగాణ న్యాయమైన డిమాండ్ అని చెబుతూ ఏ విధమైన
సిద్ధాంతాలు, వాదనలు, ప్రాతిపదికలు, పోరాట ప్రతీకల్ని ముందుకు తీసుకొచ్చి,
చారిత్రిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు,
కవులు, రచయితలు, పరిశోధకులు, బుద్ధిజీవులు చైతన్యాన్ని కలిగించారో ఈనాడు
‘బహుజన తెలంగాణ’ కోసం కూడా అదే విధమైన ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరముంది.
ఒక ప్రాంతంగా తెలంగాణ అస్తిత్వం ఖాయమైంది. ఇప్పుడు అస్తిత్వానంతర దశలో
90శాతంగా ఉన్న బహుజనులకు రాజ్యాధికారం ఎలా దక్కాలనే అంశంపై దృష్టి
సారించాలి. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటాని యాచించకుండా శాసించే
స్థాయికి సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు ఎదగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం
పరిఢవిల్లుతుంది. పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణకు సార్ధకతా
వస్తూంది.
ఇప్పటికే తెలంగాణ పౌరుషం, పోరాట పటిమ, త్యాగాల చరిత్ర అంటే చాలు సమ్మక్క
సారలమ్మ మొదలు, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, మియాసాహెబ్, జంబన్న,
తుర్రెబాజ్‌ఖాన్, బందగీ, కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, షోయెబుల్లాఖాన్,
చాకలి ఐలమ్మలు, సదాలక్ష్మి, సంగెం లక్ష్మిబాయి తదితరులు రికార్డయ్యారు.
వీరికి సరిసమానులైన బహుజన వీరులు, వీర వనితలు వందలు వేల సంఖ్యలో ఉన్నారు.
వీరెవ్వరూ ఇంతవరకూ చరిత్ర పుటల్లో కెక్కలేదు. పాఠ్యపుస్తకాల్లో అసలే లేరు.
వీరిని వెలుగులోకి తీసుకొచ్చి కొత్త చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాయాలి.
కొత్త రాష్ట్రంలో విద్యార్థులందరూ వీరి ఘనతను తెలుసుకోవాలి. ఈ పని ఇప్పుడు
చేయనట్లయితే భవిష్యత్తులో మరింత కష్టతరమైతుంది. భౌగోళిక తెలంగాణ కోసం
అగ్రవర్ణాలతో కలిసి బహుజనులు కొట్లాడిరడ్రు. ఇప్పుడు ‘సామాజిక తెలంగాణ’
కోసం అవసరమైతే అగ్రవర్ణాల వారితో సైతం తలపడాలి. ఇందుకోసం బహుజన సమాజాన్ని
మరింతగా చైతన్య పర్చాల్సిన అవసరముంది.
ఈ బాధ్యత బుద్ధిజీవులు, ఉద్యమకారులపై మరింత ఎక్కువగా ఉంది. సమాజంలో
అణచివేతకు గురైన అట్టడుగు వర్గాల వారి చరిత్రను, ఘనతను ఎలా వెలుగులోకి
తేవాలో, తద్వారా ప్రజల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందో
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి అమల్లో చేసి చూపెట్టింది. తెలంగాణలో న్యాయంగానైతే
పీడిత ప్రజల పక్షాన నిలబడుతామని చెబుతున్న ప్రభుత్వం విస్మరణకు గురైన
బహుజన వీరుల్ని వెలుగులోకి తేవాలి. ఒక వేళ ప్రభుత్వం ఆ పని చేపట్టనట్లయితే
బుద్ధిజీవులు అందుకోసం ముందుకు రావాలి. కేంద్ర, రాష్ట్ర పరిశోధక సంస్థలు ఈ
విషయమై దృష్టి సారించాలి. పరిశోధన చేయించాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందుకు
తోడ్పడాలి. మాయావతి అధికారంలో ఉన్న కాలంలో 1857 ప్రథమ స్వాతంత్య్ర
సంగ్రామంలో పాల్గొన్న దళితుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి చరిత్రలో
చిరస్మరణీయమైన స్థానాన్ని కల్పించింది.
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలో బహుజనసమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన
తర్వాత బహుజన చరిత్రకు గౌరవం దక్కింది. అప్పటి వరకు మరుగునపడ్డ మహనీయుల
చరిత్రను వెలుగులోకి తేవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించి మరీ పరిశోధన
చేయించింది. వాటిని అందరికీి అందుబాటులోకి తెచ్చింది. వివక్షకు, విస్మరణకు
గురైన వీరులను జ్ఞాపకం చేసుకునేలా ‘సామాజిక్ పరివర్తన్ కే లియే సంఘర్ష్
కర్నేవాలే మహాపురుషోంకా సమ్మాన్’ పేరిట మాయావతి ప్రభుత్వం పుస్తకం
ప్రచురించింది. విస్తృత ప్రచారం కల్పించింది. జిల్లాలకు బహుజన యోధుల పేర్లు
పెట్టడం తద్వారా ఆ వర్గాల వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడిరప జేసింది. అప్పటి
వరకూ ఆదరణ లేకుండా పోయిన మహాత్మ బుద్ధ, మహర్షి వాల్మీకీ, ఏకలవ్య,
కబీర్‌దాస్, అహల్యాబాయి హోల్కర్, ఛత్రపతి సాహూ మహరాజ్, జ్యోతి బాఫూలే,
నారాయణగురు, పెరియార్ రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్‌ల గురించి
విరివిగా ప్రచారం జరిగింది. వారి రచనలన్నింటిని పునః ప్రచురించడమైంది.

1857 పోరాటంలో వీరాంగనలు పోషించిన పాత్రను కూడా ఈ సందర్భంగా వెలుగులోకి
వచ్చింది. బుందేల్‌ఖండ్‌లో రాణీ లక్ష్మీబాయికి మారుగా యుద్ధం చేసిన బహుజన
వనిత రaల్కారీ బాయితో పాటుగా స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న బహుజన పులి
బిడ్డలు ఉదాదేవి, మహవీరి దేవి, అవంతీబాయి లోధీ, పన్నాధాయిల చరిత్ర బిఎస్పీ
అధికారంలో ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చాయి. బిఎస్పీ మొదట 1995 జూన్‌లో
అధికారంలోకి వచ్చింది. అప్పటికే మండల్ కమీషన్ అమలుకు వ్యతిరేకంగా
అగ్రవర్ణాలు చేసిన అలజడిని నిరసిస్తూ దళిత, బహుజనులు ఒక్కటై ఉద్యమం
చేసిండ్రు. ఈ చైతన్యం తర్వాతి కాలంలో మాయావతి అధికారంలోకి రావడానికి
తోడ్పడిరది. 1984 నుంచి బిఎస్పీ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా
పాల్గొన్నప్పటికీ అధికారం దక్కించుకోవడానికి ఒక దశాబ్దం వేచి ఉండాల్సి
వచ్చింది. ఈ మధ్య కాలంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కవులు,
రచయితలూ పాటలు, కవిత్వం, వ్యాసాలు, రచనల ద్వారా తామూ చరిత్రకెక్కదగిన వారమే
అని నిరూపించుకున్నారు. ప్రతి తాలూకా కేంద్రం నుంచి ఉత్తరప్రదేశ్‌లో
దళితులకు సంబంధించిన చిన్న చిన్న పత్రికలు ప్రచురితమయ్యాయి. ఇవన్నీ దళిత
అస్తిత్వ ఉద్యమానికి ఊతమిచ్చాయి. ఇదే తర్వాతి కాలంలో అధికారం అందుకోవడానికి
సోపానమయ్యాయి. దాదాపు ఇవే పరిస్థితులు తెలంగాణలో ‘టీఆర్‌ఎస్’ అధికారంలోకి
రావడానికి తోడ్పడ్డాయి. వందలమంది బహుజన కవి, గాయకులు వేల పాటల్ని కైగట్టి
పాడిరడ్రు. విస్మరణకు గురైన వీరుల్ని/వీర వనితల్ని వెలుగులోకి తెచ్చిండ్రు.
సమాధి చేయబడ్డ ప్రతిభకు పట్టం కట్టిండ్రు.
1995 నుంచీ మరీ ముఖ్యంగా 2005 నుంచీ దళిత చైతన్యం`స్ఫూర్తి, చరిత్రకు
సంబంధించిన సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వెలుగులోకి వస్తోంది. పెద్ద ఎత్తున
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల గురించి రచనలు
వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న
రాణీ లక్ష్మీబాయికి తోడ్పడిరది రaల్కారీబాయి. ఈమె బహుజన వనిత. ఇప్పటికీ
తెలంగాణ మాదిరిగానే ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తున్న
బుందేల్‌ఖండ్‌లో జానపద గాయకులు ఆమె యశస్సును గానం చేస్తారు. మోహన్‌దాస
నైమిశ్రాయ్ ఆమెపై హిందీలో పుస్తకం అచ్చేశాడు. తెలుగులో కూడా ఆమె జీవిత
చరిత్రను హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ఇటీవల ప్రచురించింది. ఉత్తరప్రదేశ్‌కు
చెందిన బద్రినారాయణ దళితుల ఔన్నత్యం, చరిత్రకు సంబంధించిన అనేక వ్యాసాలు,
సోషల్‌సైంటిస్ట్, ఇపిడబ్ల్యూ లాంటి ప్రసిద్ధిగాంచిన పత్రికల్లో
వెలువరించాడు. ఇటీవలే దళితోద్యమ చరిత్రను వెలువరించాడు.‘విమెన్ హీరోస్
అండ్ దళిత్ అస్సర్షన్ ఇన్ నార్త్ ఇండియా ` కల్చర్, ఐడెంటిటీ అండ్
పొలిటిక్స్’ పేరిట బద్రినారాయణ పుస్తకాన్ని 2006లో వెలువరించాడు.
సరిగ్గా ఇదే పద్దతిలో తెలంగాణలోని బహుజనుల జీవిత చరిత్రలు వెలుగులోకి
రావాల్సిన అవసరముంది. కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న వీర వనితలు
సమ్మక్క, సారలమ్మలు, గోల్కొండ కోట మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన పోరాట
యోధుడు సర్వాయి పాపన్న, పరాయి వారి పాలన పోవాలంటూ బ్రిటీష్‌వారికి
వ్యతిరేకంగా పోరాడిన వీరుడు తుర్రెబాజ్‌ఖాన్‌ల గురించి ‘ఈటన్’లాంటి
విదేశీయులు పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన విషయాల్నయినా తెలంగాణ
పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. చెరువులు తవ్వించి పేద ప్రజలకు పట్టెడన్నం
పెట్టిన రాబిన్‌హుడ్‌లు పండుగ సాయన్న, మియా సాహెబ్‌ల గురించి ఇప్పటికీ
పాలమూరు జిల్లాలో క్యాసెట్ల రూపంలో కథలు ప్రచారంలో ఉన్నాయి. అధికారులు
వీరిని గజదొంగలు అని ముద్ర వేసినప్పటికీ వీరు ప్రజోపయోగమైన పనులు చేసి
ప్రజల మన్ననలకు పాత్రులయ్యారు. చార్మినార్ కొమ్ములకు తాడేసి ఉయ్యాల
ఊగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రజా వీరుడు బండ్లోల్ల కురుమన్న ఈ
గడ్డ బిడ్డలే అన్న సోయితో మెలగాలి.
నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకర దాసమయ్య, వీర సంగమయ్య దేవ చరిత్ర,
శిష్యప్రబోధము అనే ద్విపద కావ్యాలను రాసిన కుమ్మరి కులానికి చెందిన
పోశెట్టి లింగకవి, నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, జనార్ధనాష్టకము తదితర
గ్రంథాలను రచించిన నల్లగొండ జిల్లావాడు కందుకూరు రుద్రకవి, 1417లోనే
‘తెలంగాణ పురము’ అనే పదాన్ని మొదట శాసనాల్లో వేయించిన తెల్లాపూర్ (మెదక్
జిల్లా) పంచాణం వారి గురించి గానీ, ‘సీమంతిని విలాసం’ కావ్యాన్ని రాసిన
‘గాండ్ల’ తెలిక కులానికి చెందిన వరంగల్ జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన
సుంకరనేని ఫణికుండలుడు, ఈతని తమ్ముడు ‘విజయ విలాసం’ అనే కావ్యాన్ని,
సుభద్రా పరిణయమనే యక్షగానాన్ని రాసిన సుంకరనేని రాజమౌళి, ఇబ్బడి ముబ్బడిగా
తత్వాలు, కీర్తనలు రాసి, పాడి వందలాది మంది భక్తులకు మార్గదర్శనం చేసిన
మాదిగాయిన దున్న ఇద్దాసులకు చరిత్రలో న్యాయమైన స్థానము దక్కలేదు. వీరే కాదు
ఇంకా వేపూరి హనుమద్దాసు, గుజ్జరి యెల్లాదాసు, ఏలె ఎల్లయ్య, కైరం భూమాదాసు,
మఠం మహంతయ్య, ఆయన భార్య మఠం మహంతమ్మ, గడ్డం రామదాసు, గవండ్ల రాజలింగకవి,
కంసాలి సుబ్బకవి లాంటి అనేకమంది కవులకు తెలుగు సాహిత్య చరిత్రలో అనామకులుగా
మిగిలారు. గోలకొండ కవుల సంచికలో ప్రతి కవీ ఏ కులానికి చెందిన వాడో విడిగా
వివరంగా పేర్కొన్నారు. వారి గురించి లోతైన పరిశోధనలు జరిపినట్లయితే ఎన్నో
కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
తెలంగాణ బహుజనుల్లో చైతన్యం తీసుకురావడానికి తమ జీవిత కాలం కృషి చేసిన
ఎందరో మహానుభావుల గురించి తెలుసుకోవాల్సిన తరుణమిది. కల్లు డిపోల్లో మహిళల
పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మొదలు,
గౌడ విద్యార్థులు చదువుకునేందుకు 1925 ఆ ప్రాంతంలోనే లక్షల రూపాయలు
వెచ్చించిన చైతన్య స్ఫూర్తి చిరాగు వీరన్న గౌడ్, ఆంధ్రమహాసభ మూడ్రోజుల
పాటు నిజామాబాద్‌లో 1937లో సమావేశాలు నిర్వహించింది. ఇందులో దాదాపు
వెయ్యిమంది వివిధ ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆంధ్రమహాసభ
కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే గాకుండా వచ్చిన వారందరికి ఆ మూడ్రోజులు
ఎలాంటి లోటు రాకుండా భోజన వసతి కల్పించిన వారు నర్సాగౌడ్, దేశంలోనే
మొట్టమొదటి సారిగా డిచ్‌పల్లిలో కుష్టువ్యాధి చికిత్సా కేంద్రం ఏర్పాటుకు
కారణం కూడా ఈయనే. నర్సాగౌడ్ వందేళ్లకు పూర్వమే 100ల ఎకరాల స్థలాన్ని
అందుకోసం ఉచితంగా ఇచ్చిన వితరణశీలి. ఆంధ్రప్రాంతం నుంచి ఏ పండితుడు వచ్చినా
తన ఇంట్లో అతిథి మర్యాదలు చేసిన దర్జీ నాంపల్లి గౌరీశంకరవర్మ.
భారతదేశానికి ‘సింగర్’ కుట్టు మిషన్‌ని పరిచయం చేయడమే గాకుండా, తాను బాగా
డబ్బు సంపాదించడమే గాకుండా, ధనాన్నంతా సాహిత్య, సాంస్కృతిక రంగానికి
వెచ్చించాడు.
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి ఎంతో సేవచేసిండు. హైదరాబాద్ నగరంలో
వందేండ్లకు పూర్వమే పాఠశాలను స్థాపించి బహుజనుల కోసం కృషి చేసిన యదటి
సత్యనారాయణ సాగర్, ఆవుశెట్టి మంగయ్య, యాదటి పుల్లయ్యలుకూడా సగర వంశస్థుల
అభివృద్ధికి పాల్పడ్డారు. పిక్టోరియల్ హైదరాబాద్ రెండు సంపుటాలుగా
వెలువరించి హైదరాబాద్ ఘనతను ప్రపంచానికి చాటిన మాజీ హైదరాబాద్ మేయర్
కృష్ణస్వామి ముదిరాజ్, ఇదే కులానికి చెందిన కేశవులు, బి.వెంకట్రావ్,
బి.వెంకటస్వామి, బి. రంగయ్య, చింతల వెంకటనర్సయ్య, నవాడ ముత్తయ్య,
కేవల్‌కిషన్ తదితరుల గురించి అందరికీ తెలియాలి. శ్యామరాజు, కామరాజు లాంటి
భట్రాజు సోదరుల ప్రతిభ అందరికీ తెలియదు. 1920 నాటికే యాదవ సంఘాన్ని ఏర్పాటు
చేసిన సంగెం సీతారామయ్య యాదవ్, ఆంధ్రమహాసభలు ఎక్కడ జరిగినా ఆర్థికంగా
ఆదుకున్న వారిలో ముందువరుసలో నిలిచేది పద్మశాలి వితరణశీలురు హకీం
నారాయణదాస్, హకీం జనార్ధన్ దాస్. వీరిద్దరూ నిజాంకు రాజవైద్యులుగా
పనిచేశారు. అలాగే గుంటుక నరసయ్య పంతులు, మాటేటి పాపయ్య ఆయన తనయుడు
సికింద్రాబాద్ తొలి కమీషనర్ మాటేటి రామప్పలు కూడా తెలంగాణలో ప్రజా
చైతన్యానికి దారులు వేసిండ్రు. నిజాం రాష్ట్రాంధ్ర ‘మున్నూరు కాపు
మహాసభ’ను స్థాపించిన బొజ్జం నర్సింలు, సింగంశెట్టి బాబయ్య, శ్రీపతి రంగయ్య,
గిరి పెంటయ్య తదితరులు సంఘాల్ని పెట్టడమే గాకుండా హాస్టల్స్ స్థాపించారు.
పేద విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు. గ్రంథాలయాల్ని కూడా
స్థాపించిండ్రు.
1932లోనే విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించిన చింతపల్లి రాఘవాచార్యులు,
కొల్లాపురం లక్ష్మినరసింహాచారి, ముమ్మడి లక్ష్మణాచారిల గురించి కనీస
సమాచారం కూడా అందుబాటులో లేదు. సమాజంలో అణచివేతకు గురైన ఆడబాపల గురించి
పట్టించుకోవడమే గాకుండా సంఘసంస్కరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహామనీషి
సిద్దాబత్తుని శ్యామ్‌సుందర్. సికింద్రాబాద్‌లో పాఠశాలలు స్థాపించడమే
గాకుండా, కళావంతుల సభలు పేరిట ఆడబాపల ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసిన
ఉదాత్తుడు. దక్కన్ మానవసేవా సమితిని ఏర్పాటు చేసి జంతుబలికి వ్యతిరేకంగా
కార్యక్రమాలు చేపట్టాడు. గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.
హైదరాబాద్‌లో ‘నాయి సభ’ను ఏర్పాటు చేసి తమ వర్గం వారి అభ్యున్నతికి
ఆంధ్రమహాసభల్లో సైతం పాల్గొని గొంతుని వినిపించిన ‘జనపాల రఘురాం’ ఇంకా
అనేకమంది బహుజనుల అభ్యున్నతికి అలనాటి తెలంగాణలో పోరాటాలు చేసిండ్రు.
తెలంగాణలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా
హైదరాబాద్ అంబేద్కర్‌గా పేరు పొందిన బి.ఎస్. వెంకటరావు, గోలకొండ కవుల
సంచికలో కవిత్వాన్ని వెలయించిన అరిగె రామస్వామి, (ఈయన బూర్గుల
రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేశారు), 1957లోనే అంబేద్కర్ విగ్రహాల
ఏర్పాటుని ఉద్యమంగా చేపట్టిన శ్యామ్‌సుందర్, సుతారి బాబయ్య, సుబేదార్
సాయన్న, గుంటిమల్ల రామప్ప, బందెల చిత్తారయ్య, జె.ఎస్. ముత్తయ్య తదితరులు
దళిత చైతన్యానికి ప్రతీకలు. వీరికన్నా ముందు వల్తాటి శేషయ్య, ఎం.ఎల్
ఆదయ్య, రాజారామ్ భోలే తదితరులు హైదరాబాద్‌లో పేద, దళిత విద్యార్థుల కోసం
పాఠశాలల్ని ఏర్పాటు చేసిండ్రు. సభలు, సమావేశాలు, గ్రంథాలయోద్యమం, రాత్రి
పాఠశాలల ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిండ్రు.
1952లో హైదరాబాద్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో పోటీ చేసిన దళిత నాయకులందరికీ ఫైనాన్స్ చేసిన వితరణశీలి
ముదిగొండ లక్ష్మయ్య. ఈయన కంపెనీలో తయారైన 555 బ్రాండ్ పాదరక్షల్ని
దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడు పోయేవి. టి.వి. నారాయణ,
టి.ఎన్.సదాలక్ష్మి, సుమిత్రాదేవి, ఈశ్వరీభాయి తదితరులు తర్వాతి కాలంలో
దళితోద్యమానికి బాసటగా నిలిచారు. ఉర్దూలో మొదటి సారిగా రచనలు చేసిన
నాట్యగత్తె, విదుషీమణి మహలఖాభాయి చాందా గురించి అమెరికా వారు పరిశోధన కోసం
డబ్బులు వెచ్చించిండ్రు. ఎఫ్లూలో ఆమె తవ్వించిన బాయిని కాపాడ్డానికి ఆర్థిక
సహాయం అందజేసిండ్రు. ఈమె ఉర్దూలో రాసిన కవిత్వాన్ని వెలుగులోకి
తీసుకురావడమే గాకుండా ఆమె విశేషమైన నాట్య ప్రతిభను, నేటి ఉస్మానియా
విశ్వవిద్యాలయం ఏర్పడ్డ ఆమె జాగీరు గురించీ, మౌలాలిలోని ఆమె సమాధి గురించీ
అందరికీ తెలియజెప్పాలి.
వహబీ ఉద్యమాన్ని దక్షిణాదికి తీసుకొచ్చిన మౌల్వీ విలాయత్ అలీ సలీం, దీనికి
అండగా నిలిచిన స్వయాన నిజాం రాజు నాసిరుద్దౌలా తమ్ముడు ముబారిజ్‌ద్దౌలా,
ముస్లిం మహిళల కోసం ( ఆమాట కొస్తే మొత్తం స్త్రీల కోసం) దేశంలోనే
మొట్టమొదటి పాఠశాల స్థాపించిన షమ్సుల్ ఉమ్రా, బ్రిటీష్ వారికి తొత్తుగా
వ్యవహరిస్తున్నాడని సాలార్జంగ్‌పై హత్యా ప్రయత్నం చేసిన సైనికుడు
జహంగీర్‌ఖాన్, హైదరాబాద్ జర్నలిజానికి పితామహుడి లాంటి వారు మౌల్వీ
మొహిబ్ హుసేన్, నిర్బంధ విద్యను, స్కాలర్‌షిప్‌లను ప్రతిపాదించిన
సంస్కర్త ముల్లా అబ్దుల్ ఖయూం, ఆజాద్ హింద్ ఫౌజ్‌లో కీలక బాధ్యతలు
నిర్వహించిన అబిద్ హుసేని, సఫ్రాని, ముల్కీ ఉద్యమాన్ని 1919లోనే చేపట్టిన
మౌల్వీ అబుల్ హసన్, సయ్యద్ అలీ, సయ్యద్ అబిద్ హుసేన్ తదితర ముస్లిం
చైతన్య మూర్తుల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి చాలా ఉంది. ఎన్నో
నిర్బంధాలను ఎదుర్కొంటూనే ప్రజల కోసం పాటు పడ్డ వారి స్ఫూర్తి నేటి తరానికి
మార్గదర్శకం కావాలి. పఠాన్ యోధుడు తుర్రెబాజ్‌ఖాన్ గురించీ, ఆయనకు
తోడ్పడ్డ మౌల్వీ అల్లాఉద్దీన్ గురించీ, బందగీ, షోయెబుల్లాఖాన్, మగ్దూం
మొహియుద్దీన్‌లతో పాటు వందలాదిగా ఉన్న స్థానిక ఉర్దూ సాహిత్యకారుల ప్రతిభనూ
అందరికీ తెలియజేయాలి.
కళా రంగాల్లో ఆర్టిస్టులు కాపు రాజయ్య మొదలు కంభాలపల్లి శేఖర్ వరకూ, చిందు
ఎల్లమ్మ, ఒగ్గు కళాకారులు మిద్దెరాములు, కవి గాయకులు సుద్దాల హనుమంతు,
రాజారామ్, బండి యాదగిరి, పెయింటర్, కవి, రచయిత మడిపడగ బలరామాచార్య,
సాహితీవ్తే సామల సదాశివ, జానపద సాహిత్యానికి గౌరవం, గుర్తింపు కలిగించిన
జాతీయ ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు తదితరులు తెలంగాణకు చేసిన కృషి
చిరస్మరణీయమైనది. రాజకీయ రంగంలో 1952లో రాజకీయ దిగ్గజం మాడపాటి
హనుమంతరావుని ఓడిరచిన పెండెం వాసుదేవ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, బొమ్మగాని
ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డితో పాటుగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో
గెలిచిన ఆనాటి నల్లగొండ పార్లమెంటు సభ్యుడు సుంకం అచ్చాలు, ఎం.ఆర్.కృష్ణ,
ఎమ్మెల్యేగా ఎన్నికైన బుట్టి రాజారాం, భాగ్యరెడ్డి వర్మ తనయుడు హైదరాబాద్
అసెంబ్లీ సభ్యుడు ఎం.బి. గౌతమ్‌లు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ సత్తా చాటిన
నల్లా నర్సింలు, ఉప్పల మల్సూర్, చీమ గురువయ్య, బిజ్జ వెంకన్న, అనుముల
లింగయ్య, మధిర తిరపన్న, వడిశాల పిచ్చయ్య, ఆవుల పిచ్చయ్య తదితరులందరూ
తెలంగాణ వికాసోద్యమానికి దారులు వేసిండ్రు. వీరితో పాటుగా దళితోద్యమ
చరిత్రను రాయడమే గాకుండా స్వయంగా ఉద్యమాల్లో పాల్గొన్న పి.ఆర్.
వెంకటస్వామి, రజాకార్ల చేతిలో హతుడైన బత్తిని మొగిలయ్య, వైద్య రంగంలో
హైదరాబాద్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన డాక్టర్ మల్లన్న,
డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడు, న్యాయ రంగ నిపుణుడు జస్టిస్
కొమ్రన్న, స్వాతంత్య్ర సమరయోదులు కోత్మీర్ ప్రేమ్‌రాజ్ యాదవ్, కాటం
లక్ష్మినారాయణ ఇంకా కొన్ని వేల మంది గురించి విపులంగా చర్చించుకోవాలి.
చరిత్రకెక్కించాలి.
గోండ్వానా రాష్ట్రపు అంకమ రాజులు మొదలు రాంజీ గోండు వరకూ చరిత్రలో
స్థానంలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న బహుజన, ఆదివాసీ,
గిరిజన వీరుల సాహస చర్యల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనికి పాక్షిక
మినహాయింపు ‘మనకు తెలియని మన చరిత్ర’. బహుజనులు కాపాడిన కళలు పెంబర్తి
ఇత్తడి పనులు, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చీరలు, ఆదిలాబాదు రంజన్లు,
నిర్మల్ బొమ్మలు, చేర్యాల నకాషీ పెయింటింగ్‌లు, జోగిపేట గొంగళ్లు ఇలా
తెలంగాణలోని ప్రతి ఊరికీ చరిత్ర ఉంది. అది చారిత్రక కట్టడాలు కావొచ్చు,
ఆలయాలు కావొచ్చు, వీరగల్లులు కావొచ్చు. ఈ చరిత్రను వెలుగులోకి తేవాలి.
తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించింది సబ్బండ వర్గాల వారు. సకల జనులు.
జయశంకర్ సార్ మార్గదర్శనం, కొండాలక్ష్మణ్ బాపూజీ పోరాట స్ఫూర్తి,
శ్రీకాంతాచారి, యాదయ్యల ఆత్మ బలిదానం ఇవన్నీ చరిత్రలో రికార్డు చేయాల్సిన
సందర్భమిది. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రూపొందించిన
ఎక్కాయాదగిరి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన అందెశ్రీ, తెలంగాణ లోగోని
తీర్చి దిద్దిన ఏలె లక్ష్మణ్‌లు బహుజన ఆలోచనల నుంచి వచ్చిన వారే!
ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది. ఇవ్వాళ మళ్ళీ ఆదివాసీలను ఆగం
చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మరో వైపు
స్వయం పాలన కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డల ఆశలకు గండి వేస్తూ హైదరబాద్‌లో
గవర్నర్ పాలన పేరిట ‘కేంద్ర పాలిత ప్రాంతం’ తద్వారా సీమాంధ్ర కబ్జాదారుల
కొనసాగించేందుకు, పెట్టుబడిదారులకు పట్టం కట్టేందుకు మోడీ సర్కార్
యోచిస్తోంది. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ
చూపిస్తూ మన ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో
గతంలో కన్నా ఎక్కువ సోయితో వ్యవహరించాల్సిన అవసరముంది. ఇన్నాళ్ళు
ఇన్నేండ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తీరుని, గతకాలపు వీరుల్ని కూడా
స్మరించుకోవాలి. ఈ పనిని బహుజనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టనట్లయితే
ఉద్యమానికి దూరంగా ఉండి, రాళ్లేసిన వారు రాసే చరిత్రగా మారే ప్రమాదముంది. ఆ
ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే గాకుండా ‘మనము కూడా చరిత్రకెక్క దగిన
వారమే’ అనే స్పృహతో తెలంగాణ చరిత్రను రికార్డు చేయాలి. అధికారికంగా తెలంగాణ
ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ మాదిరిగా పరిశోధనలు జరిపించి పోరాట వీరుల్ని
వెలుగులోకి తీసుకు రావాలి. వెలుగులోకి తీసుకువచ్చిన వారి
ప్రతిభ/చైతన్యాన్ని పదుగురికి తెలిసే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ
పని ఎంత ఆలస్యమైతే తెలంగాణ బహుజనులకు అంత నష్టం జరుగుతుంది. తెలంగాణ
చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాద్దాం.
– సంగిశెట్టి శ్రీనివాస్