Wednesday 31 October 2012

Vakkikota Alwar swamy telangana pioneer




   
   తెలంగాణ పునర్వికాసోద్యమానికి పునాదులు వేసి విభిన్న జీవనరంగాలలో అపారమైన కృషిచేసి నలభైఆరు సంవత్సరాల జీవిత కాలంలోనే అసాధారణ విజయాలు సాధించిన మేధావి, ప్రజలమనిషి వట్టికోట ఆళ్వారుస్వామి.
    కథ, నవల, విమర్శ, నాటకం, కవిత్వం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలన్నిటిలోనూ ఆళ్వారుస్వామి ప్రవేశించారు. కొన్ని ప్రక్రియలలో చెప్పుకోదగిన ఫలితాలు సాధించారు. స్టేట్‌ కాంగ్రెస్‌, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌, గుమాస్తాల సంఘం, రిక్షాకార్మికుల సంఘం, గ్రంథాలయోద్యమం, పత్రికారచన, పత్రికా నిర్వహణ, సూచీ గ్రంథాలయ నిర్వహణ, తొట్టతొలి పౌరహక్కుల పరిరక్షణ యత్నాలు, పరిశోధన, ప్రచురణలు` తెలంగాణలో ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్ధభాగంలో ఇన్ని రంగాలలోనూ అరుదైన కృషి చేసిన వట్టికోట ఆళ్వారుస్వామిని గుర్తు చేసుకునేందుకు, గౌరవించుకునేందుకు  ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 
    జీవితం మొత్తాన్ని సమాజసేవకు అంకితం చేసి దేశోద్ధారకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పేరిట గ్రంథమాలను నిర్వహించి ఎన్నో ఆణిముత్యాలను ప్రచురించాడు. ‘ఉదయఘంటలు’ పేరిట మొదటిసారిగా ఆంధ్ర`తెలంగాణ ప్రాంత కవుల కవిత్వాన్ని పుస్తకంగా అచ్చేసిండు. పౌరహక్కుల ఉద్యమ నేతగా దొడ్డి కొమురయ్య హత్యోదంతాన్ని సాహసోపేతంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వ దురంతాల్ని ఎండగట్టిండు. 

sangisetti speech @ adhore book relaese


Thursday 18 October 2012

DECCAN SARDAR : JAMALAPURAM KESHAVARAO

దక్కన్‌ సర్దార్‌ కేశవరావు

 అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ హైదరాబాద్‌ రాజ్యంలో కాంగ్రెస్‌  పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిగర్వి సర్దార్‌ జమలాపురం కేశవరావు. సత్యాగ్రహిగా, క్విట్‌ ఇండియా ఉద్యమ కార్యకర్తగా, ఆంధ్రమహాసభ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, ఆదివాసీ, దళిత జనోద్ధారకుడిగా, పత్రిక స్థాపకుడిగా ఇలా కొన్ని ఎన్నో కార్యకలాపాలు చేపట్టి హైదరాబాద్‌ రాజ్య ప్రజల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపిన కేశవరావు శత జయంతి సంవత్సరమిది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సభలు, సమావేశాలు జరిగినపుడు ఒక సామాన్య కార్యకర్త మాదిరిగా పందిళ్ళు వేయడానికి గుంజలు కూడా నాటే వాడంటే ఆయన నిరాడంబరత, శ్రమైక జీవనం తెలుస్తుంది. కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల మూలంగా ఆయనకు రావాల్సినంత పేరు రాలేదుగానీ, ఆయన మరే ఇతర పార్టీలో ఉండి ఉన్నా జాతీయ స్థాయి నాయకుడయ్యేవాడంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తన రాజకీయాల మూలంగా రెండు సార్లు జైలుకెళ్లి శిక్షను, హింసను ఎదుర్కొన్నాడు. తన కంచు కంఠంతో, ఆజానుబాహు రూపంతో తాను చేపట్టిన ప్రతి ఉద్యమంలోనూ విజయాల్ని సాధించాడు. అయితే స్వాతంత్య్రానంతర పరిణామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు ద్రోహం చేసి ఓడిరచింది. రాజకీయాల నుంచి, ఈ లోకం నుంచి ఆయన్ని శాశ్వతంగా పైకి పంపించింది. తెలంగాణ కేసరిగా, ‘దక్కన్‌ సర్దార్‌’గా బిరుదులందుకున్న జమలాపురం కేశవరావు తనదైన శైలిలో ఉద్యమాలు నడిపి కాంగ్రెస్‌కు, తెలుగువారి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఊపిరి పోశారు.
 గాంధీజి బోధనలు, ఉపన్యాసాల ప్రభావంతో కాంగ్రెస్‌ వాదిగా మారిన సర్దార్‌ విద్యార్థి నాయకుడిగా ఉంటూ 1929లో గాంధీ హైదరాబాద్‌ పర్యటించినపుడు ఆయన్ని కలుసుకున్నాడు. తర్వాతి కాలంలో గాంధీ విజయవాడ వచ్చినపుడు కూడా అక్కడికి వెళ్లి ఆ సభల నిర్వహణల్లో కూడా పాల్గొన్నాడు. విద్యార్థి నాయకుడిగా నిజాం కళాశాలలో నిషేధించిన వందేమాతరగీతాన్ని పాడి తోటివారిలో ఉత్తేజాన్ని నింపాడు. గోడలపై నినాదాలు, రోజూ వందేమాతర గీతాలాపన చేస్తుండటంతో కళాశాల యాజమాన్యం అతన్ని బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయినా కూడా గీతాలాపన ఆగక పోవడంతో కళాశాల పాలకమండలి నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అది కేశవరావు తొలి విజయం. ఆనాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. తండ్రి వత్తిడి మేరకు రెవిన్యూ, హెల్త్‌ శాఖల్లో కొన్ని రోజులు ఉద్యోగం చేసినప్పటికీ అవి తన ప్రజాహిత కార్యక్రమాలకు, ఉద్యమాలకు ఆటంకంగా నిలుస్తున్నాయని నమ్మి  ఉద్యోగానికి రాజీనామ ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు.
 1938లో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ స్థాపనలో తన వంతు పాత్రను పోషించాడు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన నాడే దానిపై నిషేధం విధించింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్‌ సత్యాగ్రహోద్యమాన్ని చేపట్టింది. మొదటి జట్టులో గోవిందరావు నానల్‌, జనార్ధనరావు దేశాయి, రావి నారాయణరెడ్డి, రామకృష్ణదూత్‌లు పాల్గొన్నారు. వీరందరిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. వెంటనే స్వామి రామనందతీర్థ నేతృత్వంలో రెండో జట్టు సత్యాగ్రహాన్ని చేపట్టింది. దీంట్లో కేశవరావు కూడా ఉన్నాడు.  ప్రభుత్వాజ్ఞలు ధిక్కరించినందుకు గాను కఠిన కారాగార శిక్షను వరంగల్లు జైలులో అనుభవించాడు. విడుదల అనంతరం 1940లో రామ్‌గఢ్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాల్లో పాల్గొన్నాడు. కాంగ్రెస్‌ ప్లీనరీలకు, మహాసభలకు తప్పనిసరిగా హాజరయ్యేవాడు. ఆర్యసమాజంతో కూడా సర్దార్‌కు సన్నిహిత సంబంధాలుండేవి. ఆర్యసమాజం వారు నిర్వహించే సభల్లో క్రమం తప్పకుండా పాల్గొనేవారు. ఖమ్మంలో నరసింగ్‌ ప్రసాద్‌ మోరియా ఆధ్వర్యంలో జరిగే సభల్లో విద్యార్థి దశనుంచే పాల్గొనేవారు. ఈ ప్రభావంతో దళితుల అభ్యున్నతికై కృషి చేసిండు. వారిలో విద్యావ్యాప్తికై చైతన్య కార్యకలాపాలు చేపట్టాడు. అస్పృశ్యతా నివారణకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు. అలాగే ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమాలు చేపట్టిండు. పాల్వంచ ప్రాంతంలో పానుగంటి పిచ్చయ్య, వనం నర్సింహారావు, ఊటుకూరు నారాయణరావు తదితరులతో కలిసి పర్యటించి అక్కడి ఆదివాసీల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార కోసం ప్రయత్నించాడు. ప్రభుత్వం ఇచ్చే సహాయం వారికి సక్రమంగా అందడం లేదని తెలుసుకొని అక్కడే ఒక ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు. దీంట్లో వేలాదిగా ఆదివాసీలు పాల్గొన్నారు. వడ్డీవ్యాపారులు, షాహుకార్లు చేస్తున్న దోపిడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. గ్రంథాలయోద్యమ కార్యకర్తగా ఊరూరా గ్రంథాలయాల స్థాపనకు ప్రోత్సహించాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో మూడవ రాష్ట్రస్థాయి గ్రంథాలయ మహాసభలు నిర్వహించి అందరి మన్ననలందుకున్నారు. కేశవరావు మిత్రుల సహాయ సహకారాలతో ఎఱ్ఱుపాలెంలో మహబూబియా ఆంధ్రభాషానిలయం, రేమిడిచర్లలో ‘సిద్ధిమల్లేశ్వర స్వామి గ్రంథాలయం’’ స్థాపించి వాటిద్వారా అంతర్లీనంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాడు. 1945`47 మధ్యకాలంలో కాంగ్రెస్‌ భావాలు ప్రచారం చేసేందుకు గాను విజయవాడ నుంచి మిత్రులు తాళ్లూరి రామానుజస్వామి, దాశరథి కృష్ణమాచార్యల సహాయ సహకారాలతో ‘సారథి’ అనే రాజకీయ, సాహిత్య పత్రికను నిర్వహించాడు. ఈ పత్రికను రహస్యంగా వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చేరవేసి ప్రచారం కల్పించేవారు.
 1942లో క్విట్‌ఇండియా ఉద్యమంలో కూడా కేశవరావు చురుగ్గా పాల్గొన్నాడు. దేశమంతటా క్విట్‌ఇండియా ఉద్యమం హోరెత్తుతుండగా, హైదరాబాద్‌ రాజ్యంలో కేశవరావు తన సహచరులతో రహస్యసమావేశాలు ఏర్పాటు చేస్తూ  కాలినడకన వరంగల్‌, ఖమ్మం (ఈ జిల్లా 1953లో ఏర్పడిరది ), నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాలు పర్యటిస్తూ క్విట్‌ ఇండియా ఉద్యమానికి తోడుగా ‘నిజాంని గద్దెదించండి’ అనే నినాదాన్ని కూడా జోడిరచాడు. ఈ కాలంలో నాగపూర్‌ విప్లవకారులతో కలిసి కొన్నాళ్లు పనిచేశాడు.
 కేశవరావు ప్రధానంగా ప్రజానాయకుడు. కాంగ్రెస్‌ పార్టీపై నిషేధం ఉండడంతో ఆయన ఆంధ్రమహాసభ ద్వారా అంతర్లీనంగా రాజకీయ కార్యకలాపాలు చేపట్టేవాడు. ఆంధ్రమహాసభలో చీలిక తర్వాత మడికొండలో మందుముల నరసింగరావు అధ్యక్షతన జరిగిన సభల్లో కేశవరావు వందలాది మంది తన అనుచరులతో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆంధ్రమహాసభను కూడా ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆ సమావేశాలను 1946లో మెదక్‌ జిల్లా కందిలో, అనంతరం జడ్బర్లలో కూడా నిర్వహించాడు. అంటే ఆంధ్రమహాసభలు 1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మెదక్‌ జిల్లా జోగిపేటలో ఆరంభంకాగా 1947లో కేశవరావు అధ్యక్షతన మహబూబునగర్‌ జిల్లా జడ్చర్ల సభతో ముగిశాయని చెప్పవచ్చు. నిజాం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శిస్తూ వీధుల్లో ప్రదర్శనలు జరిపి నిలదీసినందుకు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపినందుకు గాను కేశవరావు 1947లో అరెస్టయ్యారు. జైలులో మహారాష్ట్ర, కర్నాటక నుంచి వచ్చిన ఖైదీలందరూ కలిసి వందేమాతర గీతం ఆలపిస్తుండగా జైలర్‌ గీతాలాపన ఆపేయాలని, లేదంటే కాల్చేస్తామని బెదిరించాడు. దీంతో కేశవరావు అందరికన్నా ముందుండి దమ్ముంటే కాల్చమని తుపాకికి ఎదురు నిలిచాడు. వరంగల్‌ జైలులో ఆనాడు కేశవరావు సహచరులుగా ఉన్నవారిలో ఎమ్మెస్‌ రాజలింగం, కాళోజి నారాయణరావు, బి.చంద్రమౌళీశ్వరరావు, కొలిపాక కిషన్‌రావు, అయితరాజు రామారావు, హీరాలాల్‌ మోరియా ముఖ్యులు.
 హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను తీవ్రంగా నిరసించిన మొట్టమొదటి కాంగ్రెస్‌ వ్యక్తి కేశవరావు. అప్పటి మిలిటరీ అధికారి నంజప్పను నిలదీసిన నిజమైన ప్రజానాయకుడు సర్దార్‌. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి జాగీర్దార్లను, జమిందార్లను విమర్శించమంటే ఆనాడు నిజంగా సాహసమే. అయితే ఆ పనిని సమర్ధవంతంగా, ప్రజారంజకంగా నిర్వహించిన నేత ఈయన. నంజప్ప నేతృత్వంలో మిలిటరీ వారు కమ్యూనిస్టుల ఏరివేత పేరిట జరిగిన హింసాకాండను, ముస్లిముల ఊచకోతను కేశవరావు ఖండిరచి ప్రజల పక్షాన నిలిచాడు. ‘‘మనం ఏ ప్రభుత్వాన్ని అయినా సరే అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, జాతీయ ప్రభుత్వం అయినా, కాంగ్రెసు ప్రభుత్వం అయినా, కాంగ్రెసు కాని ప్రభుత్వం అయినా అమాయక ప్రజలపై అత్యాచారాలు జరపడాన్ని సహించబోము. నంజప్ప మన ప్రభుత్వంలో ఒక అధికారి మాత్రమే. యింకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన మన ప్రజలకు సేవకుడు. ఆయన యధేచ్ఛగా ప్రవర్తించడానికి, మేము అనుమతించడానికి సిద్ధముగా లేము. ఈయన చేస్తున్న అకృత్యాలు నిజాం తొత్తులైన జాగీర్దార్లను, నాజీ హిట్లరును తలదన్నిన నిజాంను మరిపిస్తున్నది. నంజప్ప తెలంగాణ రక్షకుడిగా కాక, భక్షకుడిగా వచ్చినట్లు అనిపిస్తున్నది.’’ అని డోర్నకల్లులో జరిగిన ఒక సభలో కేశవరావు ప్రకటించాడు.
 సర్దార్‌ జమలాపురం కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నాడు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో మిళితమైన హైదరాబాద్‌ రాష్ట్రం అలాగే ఉండాలని కోరుకున్నాడు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కివక్కాణించాడు. విద్యాపరంగా, సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయకుండా విశాలాంధ్ర ఏర్పాటు వల్ల స్థానికులపై స్థానికేతరుల అజమాయిషీ ఆరంభమవుతుందని కరెక్టుగానే అంచనా వేసిండు.
 రాష్ట్ర కాంగ్రెస్‌ స్థాపన నాటి నుంచి దాని అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన కేశవరావు చివరికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. అహోరాత్రాలు ఎండనకా, వాననకా ప్రజల కష్టాల్లో తానున్నానంటూ ఆదుకున్న సర్దార్‌ని తర్వాతి కాలంలో కాంగ్రెస్‌లో చేరిన రాజకీయ నాయకులు ధనిక, భూస్వామ్య, ప్రజాకంటకులకు చోటు కల్పించి స్వీయ ప్రయోజనాలకు పార్టీని పణంగా పెట్టారు. 1952 సాధారణ ఎన్నికల్లో కేశవరావు గెలిచినట్లయితే సి.ఎం. పదవికి పోటీదారుడవుతాడనే భావనతో ఆయనకు తన సొంత నియోజకవర్గం మధిరను కేటాయించకుండా నర్సంపేట తాలూకాలోని పాఖాల్‌ని ఇచ్చారు. ఇక్కడి నుంచి పోటీచేస్తే ఓడిపోతానని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు నుంచే కాంగ్రెస్‌ పార్టీకి ప్రక్షాళన అవసరమనీ, స్థాపించిన కాలం నాటి త్యాగనిరతి కొరవడిరదనీ, సోషలిస్టు పంథా అవలంభించాలని ఆయన పిలుపునిచ్చారు. తాను నమ్మిన వారే నిండా ముంచడం, ఉద్యమ సమయంలో సరైన సమయానికి సరైన భోజనం లేకుండా తిరగడం, జైలు జీవితం అన్ని కలగలిపి 45 యేండ్లకే ఆయనకు ఆయుష్షు తీరేలా చేశాయి.
 1908 సెప్టెంబర్‌ మూడో తేదిన ఖమ్మం జిల్లా (అప్పటి వరంగల్‌ జిల్లా) మధిర తాలూకా ఎఱ్ఱుపాలెం గ్రామంలో  వెంకటనరసమ్మ, వెంకటరామారావు దంపతులకు జన్మించాడు. తండ్రి పట్వారీ హోదాలో ఉండి కొడుకుని హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదివించాలని ఆశించినప్పటికీ కేశవరావుకు ప్రజాసేవలో అనురక్తి ఉండడంతో అది సాగలేదు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, ఫారసీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యుడైన కేశవరావు ‘‘ నామాతృభాష తెలుగు. అయితే నామంచం, నా పక్క, నా కంచం అంతా ఉర్దూ. దానికి కారణం ఈ దేశపు జనానికి నేను సన్నిహితుడు కావడానికి ప్రయత్నం మాత్రమే.’’ అని ఉర్దూని ఒక మతానికి అంటగట్టే ప్రయత్నాన్ని ఎండగట్టాడు. తెలంగాణ నినాదాన్ని కాంగ్రెస్‌ తరపున బలహీనంగానైనా బహిరంగంగా వినిపించిన తొలి నేత కేశవరావు. ఈయన 1953 మార్చి, 29న మరణించాడు.                                                             
- సంగిశెట్టి శ్రీనివాస్‌

Friday 5 October 2012

March @ TANKBUND

 సీమాంధ్ర ఆధిపత్యంపై గెలిచిన మార్చ్‌

    ఘడియ కొక్కరు ఫోన్‌ చేసి ఏడున్నవన్నా, ఎట్లవోతున్నవ్‌, యాడ కలుద్దాం అని ముప్పై తారీఖు నాటి పొద్దుగాలటి సందే దోస్తులందరు పలుకరించుడు షురు జేసిండ్రు. సాగరహారంలో షామిల్‌ అయ్యేందుకు ఇంట్లకేలి బయట్కొచ్చెసరికి మిర్యాలగూడ నుంచి ‘సింగిడి’ కన్వీనర్‌, మిత్రుడు ఏశాల శ్రీనివాస్‌ ఫోన్‌ జేసిండు. అన్న మనోళ్లు లారి మాట్లాడుకొని
హైదరాబాద్‌కొస్తుంటే ‘రామోజి ఫిల్మ్‌సిటీ’కాడ ఆపేసిండ్రట. వాళ్లంత నడుసుకుంట అప్పుడే దిల్‌సుఖ్‌నగర్‌ దాకా వచ్చిండ్రు. ఎట్లయితదో ఏమో? ఏమైనా జరుగొచ్చు మనోళ్లందర్ని జాగ్రత్తగుండుమను. నువ్వు కూడా జాగ్రత్త అని మల్లొక్కసారి జెప్పి ఫోన్‌ పెట్టేసిండు. నాకు టెన్షన్‌ షురువైంది. ఎక్కడికక్కడ ఆపేస్తే ఎట్లవోతం. ఇంత అన్నాలమా? ‘సాగర హారం’ కోసం అనుమతి తీసుకొచ్చినమని సంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్‌ ఎంపీలను కూడా అరెస్టు చేసిండ్రని తెలిసింది. మరి ఈయింత దానికి అనుమతెందుకిచ్చిండ్రని ఎవ్వలి కోపం ఆళ్లు ఎల్లగక్కుతుండ్రు. ఎహె అనుమతియ్యకుంటెనే మంచిగుండేది. ఎక్కడోళ్లని అక్కడ ఆంధ్రోళ్లను యియ్యరమయ్యర జోపడానికి అవకాశముండె అని కూడా దోస్తులన్నరు. అనుమతిచ్చి మనల్ని నమ్మించి మోసం జేసిన వలసాధిపత్య గవుర్నమెంటుపై కోపం అంతకంతకు పెరుగుతోంది.         ఎక్కడెక్కడి నుంచో అన్న మేము గీడున్నమ్‌ నువ్వేడున్నవ్‌ అనే ఫోన్ల మధ్యనే మధ్యలో స్కైని కలుపుకొని ఆటోల ఖైరతబాద్‌ జంక్షన్‌ దగ్గరికి చేరుకున్నం. ఇగ బ్రిడ్జి దిగితె నెక్‌లెస్‌ రోడ్డు వస్తది కదా అని అటుదిక్కు పోవోతుంటె ఇనుప ముండ్ల కంచె కనబడ్డది. అగో ఇట్ల పోనిస్తరని పేపర్ల రాసిండ్రు కదా ఎందుకు పోనిస్తలేరు అని పోలిసోళ్లని అడిగితే ఇట్లకేలి పొయ్యేది లేదు. పేపర్ల తప్పుగ రాసిండ్రు. అని జవాబొచ్చింది. ఇగ ఏంజెయ్యాలె? ఎట్ల పోదామని ఆలోచన చేస్తూ ఖైరతబాద్‌ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కిందొచ్చి స్కైబాబ, నేను నిలబడ్డం. ఇంతల్నే ఖైరతబాద్‌ రైల్వే స్టేషన్‌ డోర్లు మూసేసి ఉన్నయి. అయితే మెల్ల మెల్లగ ఒక్కొక్కళ్లు బ్రిడ్జి వెనకనుంచి చిన్నగ తొవ్వతీసి రైలు పట్టాలు దాటేది కనిపించింది. ఇంకేంది తొవ్వ దొరికిందని సాగర హారం బాట పట్టినం. కొంత దూరం పోయినంక ఎవ్వరికి వాళ్లు ఎట్లకేలి పోవాల అని ప్రశ్నలేసుకునుడు షురు జేసిండ్రు. ఎందుకంటే అక్కడున్న అందరికీ అది కొత్త దారే! మూడ్నాలుగు గల్లీలు తిరిగినంక 15,20 మంది జై తెలంగాణ అంటూ నినాదాలిస్తూ కనబడ్డరు, ఇగ వాళ్లెన్క, వాళ్లతో పాటు నినాదాలిస్తూ మరో నాలుగు గల్లీలు తిరిగే సరికి ఐమాక్స్‌ ఎదురుగ తేలినం. మస్తు సంతోషమైంది. ఇంకేంది ఇగ నెక్లెస్‌ రోడ్డేక్కుడే అనుకుంటే... పోలీసోళ్లు ఇక్కడ కూడ ఇనుప ముండ్ల కంచే ఏసి ఆపేసిండ్రు. అప్పటికే ఓ రెండు మూడొందల మంది ముండ్ల కంచె ముందట కూసొని నినాదాలిస్తుండ్రు. నేను, స్కై మెల్లగా ఆడికి చేరుకునే సరికి అప్పటి దాకా సప్పుడు చేకుండ ఉన్న పోలీసోళ్లు ఒక్కసారిగా లాఠీ చార్జికి దిగిండ్రు. కొత్తగ ఇచ్చిన స్టీల్‌ రాడ్ల లాంటి లాఠీలను వాళ్ళు రెండు చేతుల పట్టుకొని తమ బలమంతా ఉపయోగించి వెనక్కి ఫోర్స్‌గా తీసుకుంటే అంతకంటే ఎక్కువ ఫోర్స్‌తోటి ఉద్యమకారులపై దాడికి దిగిండ్రు. ఎవ్వరైన బక్కపానముంటే ఖచ్చితంగా బొక్కలిరిగేవి. ఏమో ఎవరియన్న యిరిగినయో ఏమో నాకు తెల్వదు. నా మీద దెబ్బ పల్లేదు గానీ ఉద్యమకారులు ఒక్కరి మీద ఒక్కరు తొక్కుకుంట ఉరుక బట్టిండ్రు. ఆగితే ఇంకొక దెబ్బ ఎక్కువ పడుతది కాబట్టి ఎవ్వరికి వాళ్లు ఆ లాఠీ దెబ్బలను తప్పించుకోడానికి ఉరక వట్టిండ్రు. నేను బూట్లేసుకున్న కాబట్టి కొంచెం రక్షింపబడ్డ, అయినా పిక్కల మీద్దాకా  ఒక్కటే తొక్కుడు.  షర్ట్‌ ఎన్కంతా రక్త మరుకలే. ఎట్లనో అట్ల మెల్ల మెల్లగ గోడపొంటి బయటికొచ్చిన. కొంచెం సేపు వెతికితే స్కై కనిపించిండు. మనిషి మూడ్నాలుగు రోజుల సంది జెరంతోటి బాధపడుతూ అయ్యాల్నే కొంచెం కోలుకొని బయటికొచ్చిండు. కాళ్లకు చెప్పులు లేవు. అరచేయి నుంచి రక్త కారుతుంది. బలంగ నిలబడలేకవోతుండు. పోలీసోళ్ల లాఠి దెబ్బలు స్కైమీద బలంగనే పడ్డయి. తొడమీద దద్దులు తేలి రక్తం పేరింది. ఆ నొప్పి సక్కగ నిలువనిస్తలేదని అర్థమయింది. పోలీసోళ్లు ఉర్కించే సరికి మెల్ల మెల్లగ నడుసుకుంట ఖైరతాబాద్‌ వినాయకుణ్ని పెట్టే జాగదన్క వచ్చినం. ఆడ మెడికల్‌ షాపు కనబడితె అండ్ల గ్లూకోన్‌డి అడిగితే లేదన్నడు. ఎలక్ట్రాల్‌ పౌడరుంది కావాల్నా అని అడిగిండు షాపాయన. సరే యియ్యిమని తీసుకొని అప్పటికే స్కై తెచ్చుకున్న నీళ్లల్ల దాన్ని కలిపిన. నేను గూడా ఓ నీళ్ల బాటిల్‌ కొని నడుస్తుంటే గాదె వెంకటేష్‌ ఫోన్‌జేసిండు. ఆయన ఇల్లు కూడా గక్కడ్నే ఉంటది. సెన్సేషన్‌ థియేటర్‌ దిక్కు వస్తున్నం, జెన్‌ కాలేజి దగ్గర కలుద్దామని చెప్పిన, ఇదే విషయం అప్పటికే రిజర్వ్‌బ్యాంక్‌ దగ్గర ఉన్న పసునూరి రవీందర్‌కు కూడా చెప్పిన రమ్మన్న. ఆయనతో పాటు ఉన్న శ్యామల, కొల్లూరి చిరంజీవి, ఉమేర్‌ ఖాన్‌ కూడా ఓ పదినిమిషాల తర్వాత వచ్చిండ్రు. ఆ తర్వాత గాదె వెంకటేష్‌ వచ్చిండు. అప్పటికే నెక్లెస్‌రోడ్డుకి ఖైరతబాద్‌ నుంచి చేరుకున్న ఊడ్గుల వేణు స్కైకి ఫోన్‌ జేసి అన్న మేము జేరుకున్నం, తొవ్వ ఖుల్లా అయింది ఇగరా అని చెప్పిండు. జెన్‌ కాలేజి దగ్గర చాయ్‌ తాగి నేను, స్కై, పసునూరి, గాదె వెంకటేశ్‌, పసూనూరి రాజేష్‌, తదితరులం మెల్లగ మళ్ల వచ్చిన దారిల్నే నడువబట్టినం. ఈసారి రోడ్డు ఖుల్లా అయింది. ఖైరతాబాద్‌ వినాయకుడ్ని పెట్టిన రోడ్ల నుంచి ఐమాక్స్‌కు, ఆ తర్వాత నెక్లెస్‌ రోడ్డుకు చేరుకున్నం.
    రోడ్డుల నడుసుకుంట పోతున్న దశలో పోలీసోళ్లను, ఆంధ్రోళ్లను అందరు ఒక్కటే తిట్టుడు. మంచి మంచి తెలంగాణ పదాలల్ల తిట్లు సాగినయి. తొవ్వల శాన మంది కలిసిండ్రు. తెలంగాణ టీచర్స్‌ ఫోరమ్‌ రాములు, శ్రీధర్‌ (టీచర్‌), నీలిజెండా పత్రిక బాధ్యుడు మిత్రుడు జి.జ్ఞానేశ్వర్‌, తాండూర్‌ టిఆర్‌ఎస్‌ మిత్రులు విజయ్‌ ఇట్లా కొన్ని వందలమంది కలిసిండ్రు. జలవిహార్‌కాడ కొంచెం సేపు కూలబడ్డం. నెక్లెస్‌ రోడ్డుకి అటువైపు పీవీఘాట్‌ దగ్గర చీమల దండులాగా ఉస్కెపోస్తే రాలనంద జనం కనబడుతుండ్రు. ఎటు జూసినా జనం జాతర సాగుతోంది.
    ఈ జాతర మధ్యలోనే గాలి నల్లటి పొగలు పైకి లేస్తున్నయి. పోలీసోళ్ల వ్యాన్లు లాఠీ దెబ్బలు తిన్నోళ్ల చేతిలో అహుతయ్యాయని చెప్పిండ్రు. ఆ యెంటనే పోలీసోళ్ల భాష్పవాయువు గోళాల సప్పుడు టప్ప టప్ప ఒక్కటే పేలుతున్నయి. కండ్లు మండపట్టినయి. వశంగాకుంటయ్యింది. మూతికి బట్టకట్టుకొని జెర్ర పక్కకు నిలబడ్డ. ఇంతల్నే జై తెలంగాణ అంటూ అప్పుడే మా ముందటికేళి ఫిరంగుల్లా దూసుకెళ్లిన ఆడపిల్లలు అంతే స్పీడుగా వాపస్‌ రావట్టిండ్రు. పోలీసోళ్లు వాల్ల కొత్త లాఠీలకు మల్ల పన్జెప్పిండ్రు. ఆడపిల్లలు అనిసూడకుండా ఆళ్ల మీద పడ్డరు. కొంచెం దూరం ఉర్కించి కొద్దిగంత సేపు పోలిసోళ్లు రెస్ట్‌ తీసుకుంటుండ్రు. మళ్ల జెర్రసేపాగి మళ్ల లాఠీలు పట్టుకొని పబ్లిక్‌ ఎన్క పడ్డరు.
    రెండు మూడు సార్లు అటురికి ఇటురికి. చిన్న సందుల కేలి రైలుపట్టాలు దాటినం. వెంటనే అన్న నా పుస్తకం అని గాదె వెంకటేశ్‌ అన్నడు. అప్పుడు గుర్తుకొచ్చింది. గాదె వెంకటేశ్‌కు ఫోన్జేసినప్పుడు అన్న నేను ఇంటికాడున్న నా కవిత్వం ‘పొలి’ని ఆవిష్కరించుకుందాం అని జెప్పిండు. అప్పటికే ఎన్క టప్ప టప్ప గోళాల సప్పుడెక్కువైంది. ఎట్లయితె అట్లాయె పుస్తకాన్ని ఆవిష్కరించాలని మళ్లీ పట్టాలు దాటొచ్చి ఎన్క భాష్పవాయుగోళాల మధ్యన నెక్లెస్‌ రోడ్డు నడి మధ్యల ఎనకాల పబ్లిక్‌ ముక్కులకు బట్టలుగట్టుకొని ఉరుకొస్తుంటే ‘పొలి’ని నేను అవిష్కరించిన. పసునూరి రవీందర్‌, గాదె వెంకటేశ్‌ కూడ ఉన్నరు. జైతెలంగాణ అంటూ నినదిస్తూ ఒక చారిత్రక సంఘటనకు ప్రాణం పోసినం. బహుశా భాష్పవాయువు గోళాల మధ్యన, లక్షలాది తెలంగాణ ప్రజల మధ్యన ఆవిష్కరణ జరుపుకున్న ఏకైక పుస్తకం ‘పొలి’. ఈ యాది, పుస్తక ఆవిష్కరణ తెలంగాణ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయే అరుదైన, అపురూపమైన అవకాశాన్ని అందించింది. అందుకు అవకాశమిచ్చిన గాదె వెంకటేశ్‌కు షుక్రియా.
    మా ముందు నుంచే 20 లారీలల్ల పోలీసోళ్లు అంతకుముందే ఉన్న వాళ్లకు తోడుగా చేరుకున్నరు. ప్రజల్ని అటిటు ఎటూ పోనియకుండా జేసి తొక్కిసలాటలో వాళ్లే చనిపోయేలా చెయ్యాలనే ప్లాన్‌ వేసినట్లు కూడా అనుమానమొచ్చింది. యుద్ధాక్షేత్రాన్ని ముద్దాడాలని చేసిన ప్రయత్నం సఫలమయ్యింది. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడేందుకు ఈ మార్చ్‌ మంచి టానిక్‌లాగా పనిచేస్తదని నమ్ముతున్న.
                                                                                                                                         -సంగిశెట్టి శ్రీనివాస్‌