Thursday, 18 October 2012

DECCAN SARDAR : JAMALAPURAM KESHAVARAO

దక్కన్‌ సర్దార్‌ కేశవరావు

 అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ హైదరాబాద్‌ రాజ్యంలో కాంగ్రెస్‌  పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిగర్వి సర్దార్‌ జమలాపురం కేశవరావు. సత్యాగ్రహిగా, క్విట్‌ ఇండియా ఉద్యమ కార్యకర్తగా, ఆంధ్రమహాసభ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, ఆదివాసీ, దళిత జనోద్ధారకుడిగా, పత్రిక స్థాపకుడిగా ఇలా కొన్ని ఎన్నో కార్యకలాపాలు చేపట్టి హైదరాబాద్‌ రాజ్య ప్రజల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపిన కేశవరావు శత జయంతి సంవత్సరమిది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సభలు, సమావేశాలు జరిగినపుడు ఒక సామాన్య కార్యకర్త మాదిరిగా పందిళ్ళు వేయడానికి గుంజలు కూడా నాటే వాడంటే ఆయన నిరాడంబరత, శ్రమైక జీవనం తెలుస్తుంది. కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల మూలంగా ఆయనకు రావాల్సినంత పేరు రాలేదుగానీ, ఆయన మరే ఇతర పార్టీలో ఉండి ఉన్నా జాతీయ స్థాయి నాయకుడయ్యేవాడంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తన రాజకీయాల మూలంగా రెండు సార్లు జైలుకెళ్లి శిక్షను, హింసను ఎదుర్కొన్నాడు. తన కంచు కంఠంతో, ఆజానుబాహు రూపంతో తాను చేపట్టిన ప్రతి ఉద్యమంలోనూ విజయాల్ని సాధించాడు. అయితే స్వాతంత్య్రానంతర పరిణామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు ద్రోహం చేసి ఓడిరచింది. రాజకీయాల నుంచి, ఈ లోకం నుంచి ఆయన్ని శాశ్వతంగా పైకి పంపించింది. తెలంగాణ కేసరిగా, ‘దక్కన్‌ సర్దార్‌’గా బిరుదులందుకున్న జమలాపురం కేశవరావు తనదైన శైలిలో ఉద్యమాలు నడిపి కాంగ్రెస్‌కు, తెలుగువారి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఊపిరి పోశారు.
 గాంధీజి బోధనలు, ఉపన్యాసాల ప్రభావంతో కాంగ్రెస్‌ వాదిగా మారిన సర్దార్‌ విద్యార్థి నాయకుడిగా ఉంటూ 1929లో గాంధీ హైదరాబాద్‌ పర్యటించినపుడు ఆయన్ని కలుసుకున్నాడు. తర్వాతి కాలంలో గాంధీ విజయవాడ వచ్చినపుడు కూడా అక్కడికి వెళ్లి ఆ సభల నిర్వహణల్లో కూడా పాల్గొన్నాడు. విద్యార్థి నాయకుడిగా నిజాం కళాశాలలో నిషేధించిన వందేమాతరగీతాన్ని పాడి తోటివారిలో ఉత్తేజాన్ని నింపాడు. గోడలపై నినాదాలు, రోజూ వందేమాతర గీతాలాపన చేస్తుండటంతో కళాశాల యాజమాన్యం అతన్ని బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయినా కూడా గీతాలాపన ఆగక పోవడంతో కళాశాల పాలకమండలి నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అది కేశవరావు తొలి విజయం. ఆనాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. తండ్రి వత్తిడి మేరకు రెవిన్యూ, హెల్త్‌ శాఖల్లో కొన్ని రోజులు ఉద్యోగం చేసినప్పటికీ అవి తన ప్రజాహిత కార్యక్రమాలకు, ఉద్యమాలకు ఆటంకంగా నిలుస్తున్నాయని నమ్మి  ఉద్యోగానికి రాజీనామ ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు.
 1938లో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ స్థాపనలో తన వంతు పాత్రను పోషించాడు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన నాడే దానిపై నిషేధం విధించింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్‌ సత్యాగ్రహోద్యమాన్ని చేపట్టింది. మొదటి జట్టులో గోవిందరావు నానల్‌, జనార్ధనరావు దేశాయి, రావి నారాయణరెడ్డి, రామకృష్ణదూత్‌లు పాల్గొన్నారు. వీరందరిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. వెంటనే స్వామి రామనందతీర్థ నేతృత్వంలో రెండో జట్టు సత్యాగ్రహాన్ని చేపట్టింది. దీంట్లో కేశవరావు కూడా ఉన్నాడు.  ప్రభుత్వాజ్ఞలు ధిక్కరించినందుకు గాను కఠిన కారాగార శిక్షను వరంగల్లు జైలులో అనుభవించాడు. విడుదల అనంతరం 1940లో రామ్‌గఢ్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాల్లో పాల్గొన్నాడు. కాంగ్రెస్‌ ప్లీనరీలకు, మహాసభలకు తప్పనిసరిగా హాజరయ్యేవాడు. ఆర్యసమాజంతో కూడా సర్దార్‌కు సన్నిహిత సంబంధాలుండేవి. ఆర్యసమాజం వారు నిర్వహించే సభల్లో క్రమం తప్పకుండా పాల్గొనేవారు. ఖమ్మంలో నరసింగ్‌ ప్రసాద్‌ మోరియా ఆధ్వర్యంలో జరిగే సభల్లో విద్యార్థి దశనుంచే పాల్గొనేవారు. ఈ ప్రభావంతో దళితుల అభ్యున్నతికై కృషి చేసిండు. వారిలో విద్యావ్యాప్తికై చైతన్య కార్యకలాపాలు చేపట్టాడు. అస్పృశ్యతా నివారణకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు. అలాగే ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమాలు చేపట్టిండు. పాల్వంచ ప్రాంతంలో పానుగంటి పిచ్చయ్య, వనం నర్సింహారావు, ఊటుకూరు నారాయణరావు తదితరులతో కలిసి పర్యటించి అక్కడి ఆదివాసీల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార కోసం ప్రయత్నించాడు. ప్రభుత్వం ఇచ్చే సహాయం వారికి సక్రమంగా అందడం లేదని తెలుసుకొని అక్కడే ఒక ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు. దీంట్లో వేలాదిగా ఆదివాసీలు పాల్గొన్నారు. వడ్డీవ్యాపారులు, షాహుకార్లు చేస్తున్న దోపిడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. గ్రంథాలయోద్యమ కార్యకర్తగా ఊరూరా గ్రంథాలయాల స్థాపనకు ప్రోత్సహించాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో మూడవ రాష్ట్రస్థాయి గ్రంథాలయ మహాసభలు నిర్వహించి అందరి మన్ననలందుకున్నారు. కేశవరావు మిత్రుల సహాయ సహకారాలతో ఎఱ్ఱుపాలెంలో మహబూబియా ఆంధ్రభాషానిలయం, రేమిడిచర్లలో ‘సిద్ధిమల్లేశ్వర స్వామి గ్రంథాలయం’’ స్థాపించి వాటిద్వారా అంతర్లీనంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాడు. 1945`47 మధ్యకాలంలో కాంగ్రెస్‌ భావాలు ప్రచారం చేసేందుకు గాను విజయవాడ నుంచి మిత్రులు తాళ్లూరి రామానుజస్వామి, దాశరథి కృష్ణమాచార్యల సహాయ సహకారాలతో ‘సారథి’ అనే రాజకీయ, సాహిత్య పత్రికను నిర్వహించాడు. ఈ పత్రికను రహస్యంగా వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చేరవేసి ప్రచారం కల్పించేవారు.
 1942లో క్విట్‌ఇండియా ఉద్యమంలో కూడా కేశవరావు చురుగ్గా పాల్గొన్నాడు. దేశమంతటా క్విట్‌ఇండియా ఉద్యమం హోరెత్తుతుండగా, హైదరాబాద్‌ రాజ్యంలో కేశవరావు తన సహచరులతో రహస్యసమావేశాలు ఏర్పాటు చేస్తూ  కాలినడకన వరంగల్‌, ఖమ్మం (ఈ జిల్లా 1953లో ఏర్పడిరది ), నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాలు పర్యటిస్తూ క్విట్‌ ఇండియా ఉద్యమానికి తోడుగా ‘నిజాంని గద్దెదించండి’ అనే నినాదాన్ని కూడా జోడిరచాడు. ఈ కాలంలో నాగపూర్‌ విప్లవకారులతో కలిసి కొన్నాళ్లు పనిచేశాడు.
 కేశవరావు ప్రధానంగా ప్రజానాయకుడు. కాంగ్రెస్‌ పార్టీపై నిషేధం ఉండడంతో ఆయన ఆంధ్రమహాసభ ద్వారా అంతర్లీనంగా రాజకీయ కార్యకలాపాలు చేపట్టేవాడు. ఆంధ్రమహాసభలో చీలిక తర్వాత మడికొండలో మందుముల నరసింగరావు అధ్యక్షతన జరిగిన సభల్లో కేశవరావు వందలాది మంది తన అనుచరులతో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆంధ్రమహాసభను కూడా ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆ సమావేశాలను 1946లో మెదక్‌ జిల్లా కందిలో, అనంతరం జడ్బర్లలో కూడా నిర్వహించాడు. అంటే ఆంధ్రమహాసభలు 1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మెదక్‌ జిల్లా జోగిపేటలో ఆరంభంకాగా 1947లో కేశవరావు అధ్యక్షతన మహబూబునగర్‌ జిల్లా జడ్చర్ల సభతో ముగిశాయని చెప్పవచ్చు. నిజాం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శిస్తూ వీధుల్లో ప్రదర్శనలు జరిపి నిలదీసినందుకు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపినందుకు గాను కేశవరావు 1947లో అరెస్టయ్యారు. జైలులో మహారాష్ట్ర, కర్నాటక నుంచి వచ్చిన ఖైదీలందరూ కలిసి వందేమాతర గీతం ఆలపిస్తుండగా జైలర్‌ గీతాలాపన ఆపేయాలని, లేదంటే కాల్చేస్తామని బెదిరించాడు. దీంతో కేశవరావు అందరికన్నా ముందుండి దమ్ముంటే కాల్చమని తుపాకికి ఎదురు నిలిచాడు. వరంగల్‌ జైలులో ఆనాడు కేశవరావు సహచరులుగా ఉన్నవారిలో ఎమ్మెస్‌ రాజలింగం, కాళోజి నారాయణరావు, బి.చంద్రమౌళీశ్వరరావు, కొలిపాక కిషన్‌రావు, అయితరాజు రామారావు, హీరాలాల్‌ మోరియా ముఖ్యులు.
 హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను తీవ్రంగా నిరసించిన మొట్టమొదటి కాంగ్రెస్‌ వ్యక్తి కేశవరావు. అప్పటి మిలిటరీ అధికారి నంజప్పను నిలదీసిన నిజమైన ప్రజానాయకుడు సర్దార్‌. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి జాగీర్దార్లను, జమిందార్లను విమర్శించమంటే ఆనాడు నిజంగా సాహసమే. అయితే ఆ పనిని సమర్ధవంతంగా, ప్రజారంజకంగా నిర్వహించిన నేత ఈయన. నంజప్ప నేతృత్వంలో మిలిటరీ వారు కమ్యూనిస్టుల ఏరివేత పేరిట జరిగిన హింసాకాండను, ముస్లిముల ఊచకోతను కేశవరావు ఖండిరచి ప్రజల పక్షాన నిలిచాడు. ‘‘మనం ఏ ప్రభుత్వాన్ని అయినా సరే అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, జాతీయ ప్రభుత్వం అయినా, కాంగ్రెసు ప్రభుత్వం అయినా, కాంగ్రెసు కాని ప్రభుత్వం అయినా అమాయక ప్రజలపై అత్యాచారాలు జరపడాన్ని సహించబోము. నంజప్ప మన ప్రభుత్వంలో ఒక అధికారి మాత్రమే. యింకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన మన ప్రజలకు సేవకుడు. ఆయన యధేచ్ఛగా ప్రవర్తించడానికి, మేము అనుమతించడానికి సిద్ధముగా లేము. ఈయన చేస్తున్న అకృత్యాలు నిజాం తొత్తులైన జాగీర్దార్లను, నాజీ హిట్లరును తలదన్నిన నిజాంను మరిపిస్తున్నది. నంజప్ప తెలంగాణ రక్షకుడిగా కాక, భక్షకుడిగా వచ్చినట్లు అనిపిస్తున్నది.’’ అని డోర్నకల్లులో జరిగిన ఒక సభలో కేశవరావు ప్రకటించాడు.
 సర్దార్‌ జమలాపురం కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నాడు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో మిళితమైన హైదరాబాద్‌ రాష్ట్రం అలాగే ఉండాలని కోరుకున్నాడు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కివక్కాణించాడు. విద్యాపరంగా, సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయకుండా విశాలాంధ్ర ఏర్పాటు వల్ల స్థానికులపై స్థానికేతరుల అజమాయిషీ ఆరంభమవుతుందని కరెక్టుగానే అంచనా వేసిండు.
 రాష్ట్ర కాంగ్రెస్‌ స్థాపన నాటి నుంచి దాని అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన కేశవరావు చివరికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. అహోరాత్రాలు ఎండనకా, వాననకా ప్రజల కష్టాల్లో తానున్నానంటూ ఆదుకున్న సర్దార్‌ని తర్వాతి కాలంలో కాంగ్రెస్‌లో చేరిన రాజకీయ నాయకులు ధనిక, భూస్వామ్య, ప్రజాకంటకులకు చోటు కల్పించి స్వీయ ప్రయోజనాలకు పార్టీని పణంగా పెట్టారు. 1952 సాధారణ ఎన్నికల్లో కేశవరావు గెలిచినట్లయితే సి.ఎం. పదవికి పోటీదారుడవుతాడనే భావనతో ఆయనకు తన సొంత నియోజకవర్గం మధిరను కేటాయించకుండా నర్సంపేట తాలూకాలోని పాఖాల్‌ని ఇచ్చారు. ఇక్కడి నుంచి పోటీచేస్తే ఓడిపోతానని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు నుంచే కాంగ్రెస్‌ పార్టీకి ప్రక్షాళన అవసరమనీ, స్థాపించిన కాలం నాటి త్యాగనిరతి కొరవడిరదనీ, సోషలిస్టు పంథా అవలంభించాలని ఆయన పిలుపునిచ్చారు. తాను నమ్మిన వారే నిండా ముంచడం, ఉద్యమ సమయంలో సరైన సమయానికి సరైన భోజనం లేకుండా తిరగడం, జైలు జీవితం అన్ని కలగలిపి 45 యేండ్లకే ఆయనకు ఆయుష్షు తీరేలా చేశాయి.
 1908 సెప్టెంబర్‌ మూడో తేదిన ఖమ్మం జిల్లా (అప్పటి వరంగల్‌ జిల్లా) మధిర తాలూకా ఎఱ్ఱుపాలెం గ్రామంలో  వెంకటనరసమ్మ, వెంకటరామారావు దంపతులకు జన్మించాడు. తండ్రి పట్వారీ హోదాలో ఉండి కొడుకుని హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదివించాలని ఆశించినప్పటికీ కేశవరావుకు ప్రజాసేవలో అనురక్తి ఉండడంతో అది సాగలేదు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, ఫారసీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యుడైన కేశవరావు ‘‘ నామాతృభాష తెలుగు. అయితే నామంచం, నా పక్క, నా కంచం అంతా ఉర్దూ. దానికి కారణం ఈ దేశపు జనానికి నేను సన్నిహితుడు కావడానికి ప్రయత్నం మాత్రమే.’’ అని ఉర్దూని ఒక మతానికి అంటగట్టే ప్రయత్నాన్ని ఎండగట్టాడు. తెలంగాణ నినాదాన్ని కాంగ్రెస్‌ తరపున బలహీనంగానైనా బహిరంగంగా వినిపించిన తొలి నేత కేశవరావు. ఈయన 1953 మార్చి, 29న మరణించాడు.                                                             
- సంగిశెట్టి శ్రీనివాస్‌

No comments: