Thursday 30 August 2012

ADIVI BAPIRAJU : THE BRIDGE BETWEEN ANDHRA AND TELANGANA

ఆంధ్ర-తెలంగాణల సాహిత్య వారధి అడివి బాపిరాజు

    రచయితగా తెలుగు సాహిత్యానికి, సంపాదకుడిగా తెలంగాణ పత్రికా రంగానికి తద్వారా మొత్తం తెలుగు సమాజానికి అడివి బాపిరాజు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిజాం జమానాలో హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు పత్రికా రంగానికి బలమైన పునాదులు వేసిన అగ్రగణ్యులైన సాహితీ వేత్తల్లో, సంపాదకుల్లో ఆయనొకరు. హైదరాబాద్‌లో 1943లో స్థాపించబడ్డ ‘మీజాన్‌’ దిన పత్రిక సంపాదకుడిగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ తెలంగాణ ప్రజలకు ఆప్తుడయ్యాడు. పత్రికా యాజమాన్యం ప్రధానోద్దేశ్యం ‘మీజాన్‌’ ద్వారా ‘నిజాం కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడిరప జేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం.’’ అయితే అడివి బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు జరిపిన ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటా’నికి, కాంగ్రెస్‌ వారు నిర్వహించిన ‘ఆంధ్రమహాసభ’, ‘భారతదేశంలో హైదరాబాద్‌ విలీనోద్యమాల’కు మద్ధతుగా వార్తలు ప్రకటించేవాడు. అసిధారావ్రతం లాంటి తన  సంపాదకీయ బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించిన ఆయన ప్రతిభ అద్వితీయం. అన్ని పార్టీల్లోనూ మిత్రులుండడం, అభ్యుదయ రచయితల సంఘం హైదరాబాద్‌ స్థాపక అధ్యక్షుడిగా, చారిత్రక నవలా చక్రవర్తిగా, తెలంగాణ చరిత్రను నవలా రూపంలో అక్షరీకరించి గోనగన్నారెడ్డి లాంటి వ్యక్తులకు జీవం పోసిన బాపిరాజు తెలంగాణకు ఆత్మీయుడు.
    హైదరాబాద్‌ రాజ్య ప్రజలతో మమేకమవడమే గాకుండా ఇక్కడి చారిత్రక స్థలాలకు సంబంధించిన విశేషాలెన్నింటినో పత్రికలో వ్యాసాలుగా ప్రకటించాడు. తెలుగు తల్లి పత్రికను అభ్యుదయ రచయితల సంఘ పత్రికగా మల్చడంలోనూ, ఎందరో కొత్త కథకులకు మీజాన్‌లో అవకాశమిచ్చి మలితరం తెలంగాణ కథకు జీవం పోసిండు. సాయుధ పోరాట సాహిత్యానికి అండగా నిలిచిన ఏకైక హైదరాబాద్‌ రాజ్య పత్రిక మీజాన్‌ అంటే అతిశయోక్తి కాదు.
    రచయిత అయినందుకే బాపిరాజుకు ‘మీజాన్‌’ పత్రిక సంపాదకపదవి దక్కింది. అయితే పత్రిక సంపాదకత్వం చేపట్టిన తర్వాతే ఆయన రచనలు అధికంగా అచ్చుకు నోచుకున్నాయి. అందరికీ అందుబాటులోకొచ్చాయి. తెలుగు నవలాకాశంలో ఆయన్ని ధృవతారగా నిలబెట్టిన ‘హిమబిందు’, ‘గోనగన్నారెడ్డి’, ‘కోనంగి’, ‘తుపాను’ మొదలైన నవలలన్నీ బాపిరాజు సంపాదకునిగా ఉన్న సమయంలోనే మీజాన్‌ పత్రికలో సీరియల్‌గా వెలువడ్డాయి. బాపిరాజు తన రచనల్ని ఏరోజు కారోజు దగ్గర నిలబడి చెబుతూ పోతుంటే పత్రికా కార్యాలయంలో కంపోజ్‌ చేసేవారట. అలాగే నిన్నటి కథ ఎంతవరకైందో కూడా చూడకుండా కథను డిక్టేట్‌ చేసేవాడంటే సాహితీవేత్తగా, సంపాదకుడిగా ఆయన ప్రతిభ తెలుస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ఆంధ్రమహాసభల సందర్భంగా మీజాన్‌ పత్రిక ప్రత్యేక సంచికలు వెలువరించేదంటే ఆయన సాహసం తెలుస్తుంది.  పత్రిక యాజమాన్యం పాలసీ భిన్నంగా ఉన్నప్పటికీ బాపిరాజు చాలా నేర్పుగా ‘తెలంగాణ సాయుధ పోరాట’ వార్తలను అధిక ప్రాధాన్యత నిచ్చి ప్రచురించేవాడు. ఆళ్వారుస్వామి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మాడపాటి హనుమంతరావులతో సాన్నిహిత్యం ఉండటంతో వారు నిర్వహించే వివిధ ప్రజా ఉద్యమాలకు పత్రిక ద్వారా దన్నుగా ఉండేవాడు. మీజాన్‌ పత్రికలో బాపిరాజు వెలువరించిన వందల కొద్ది రచనలు ఇప్పటికీ పుస్తక రూపంలో అందుబాటులోకి రాలేదు. మందుమల నరసింగరావు, రామచంద్రరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, రాజబహదూర్‌ గౌర్‌ లాంటి ఆనాటి రాజకీయ ఉద్యమకారుల జీవితాల్ని ‘ప్రతిరూపములు’ శీర్షికన శశికాంతుడు పేరిట అడివి బాపిరాజు వెలువరించారు. ఈ వ్యాసాలు ఆనాటి ఉద్యమరూపానికి ప్రత్యక్ష ప్రతిరూపాలు. అయితే దురదృష్ట వశాత్తు ఈ వ్యాసాలేవి ఇంతవరకూ పుస్తక రూపంలో ముద్రణకు నోచుకోలేదు. దీనికంతటికీ ప్రధాన కారణం మీజాన్‌ పత్రిక ప్రతులు చాలా అరుదుగా లభించడం, అవికూడా అందరికీ అందుబాటులో లేకపోవడమే. తెలంగాణ`ఆంధ్ర అన్న తేడా లేకుండా ఇరు ప్రాంతాల అభిమానులు బాపిరాజు అముద్రిత రచనల ప్రచురణకు ఉమ్మడిగా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాల్సిన అవసరముంది. దీనితో అడివి బాపిరాజుని భిన్న పార్శ్వాల్లో బయటి ప్రపంచానికి చూపెట్టడానికి వీలవుతుంది. తెలంగాణ` ఆంధ్ర ప్రజల ఉమ్మడి వారసత్వమైన ఆయన రచనలు వెలుగు చూసినట్లయితే మరుగునపడ్డ సాహిత్యమెంతో వెలుగు చూస్తుంది. ఎన్నో కొత్త కోణాల్ని ఆవిష్కరించుకోడానికి అవకాశమిస్తుంది.
    అడివి బాపిరాజుని ఆంధ్ర` తెలంగాణ ప్రజల మధ్య వారధిగా చెప్పొచ్చు. హైదరబాద్‌లో మొట్టమొదటి సారిగా అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో ఆయన విశేషమైన కృషి చేసిండు. తమ పత్రికా కార్యాలయంలోనే ఆ సంఘం సమావేశాలు నిర్వహించేవారు. అక్టోబరు ఆరు 1944లో హైదరాబాద్‌లోని థియోసాఫికల్‌ సొసైటీలో  జంటనగరాల అరసం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వట్టికోట ఆళ్వారుస్వామి, బిదురు వెంకటశేషయ్య, వెల్దుర్తి మాణిక్యరావు, మానేపల్లి తాతాచార్య, ఎల్లాప్రగడ సీతాకుమారి, భాస్కరభట్ల కృష్ణారావు, జమ్మలమడక పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇందులోనే జంటనగరాల అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాపిరాజు, కార్యదర్శిగా ఆళ్వారుస్వామి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌తో బాపిరాజుకు గల సాన్నిహిత్యంలో ఇదొక చిన్న ఉదహరణ. నిజాం ప్రభుత్వ కోరికమేరకు అజంతా, ఎల్లోరా ప్రదేశాల్ని సందర్శించి వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తూ నివేదిక సమర్పించాడు. చిత్రకారుడు కూడా అయిన బాపిరాజు అజంతా, ఎల్లోరా శిల్ప సౌందర్యాన్ని హృదయానికి అత్తుకునేలా రాసి చిన్న పుస్తకంగా అచ్చువేయించాడు. బాపిరాజు స్థానికేతరుడే అయినప్పటికీ ఆయనకు తెలంగాణ అంటే మక్కువ ఎక్కువ. ఇక్కడి ప్రజలపై అభిమానం చూపించేవాడు. ఇక్కడి ప్రజలు చేస్తున్న వీరోచిత పోరాటల పట్ల సానుభూతితో ఉండేవారు. సంఫీుభావం చూపేవారు. అందుకే బాపిరాజు బంధువు, మీజాన్‌ పత్రికలో పనిచేసిన వెటరన్‌ జర్నలిస్టు బుద్ధవరపు కామరాజు ఇలా అన్నారు. ‘‘మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా పనిచేసి తెలంగాణ ఆంధ్రులలో ఐక్యమై, తెలంగాణ సాహితీ పరులకు సన్నిహిత బంధువైనాడు. తెలంగాణ చారిత్రక శిల్ప సంప్రదాయాన్ని శోధించి, ఆకళించుకొని తెలంగాణయే సిసలైన తెలుగు గడ్డ అని చాటి చెప్పాడు.’’
    నిజాం ప్రభుత్వాధికారులు, పాలకుడు ఉస్మాన్‌ అలీఖాన్‌లు ప్రజలపై తమ పట్టు సడలుతున్నట్లు భావించి, వారికి తాము చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాలను వారి భాషలోనే తెలిపితే బాగుటుందన్న ఆలోచనతో ‘మీజాన్‌’ పత్రిక స్థాపించబడిరది. 1943లో మీజాన్‌ అనే అరబిక్‌ పేరుతో ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు దిన పత్రికలను గులామ్‌ అహమద్‌ కలకత్తావాలా అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్త వీటి యజమాని. ఈయన ఖాన్‌ బహదూర్‌ అహమద్‌ నవాజ్‌ జంగ్‌ అనే నిజాం సన్నిహితుడి అల్లుడు. దేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు భాషల్లో ప్రచురించబడ్డ ఈ పత్రికలు మూడు వేర్వేరు పాలసీలు అవలంభించాయి. ఇంగ్లీషు పత్రిక నిజామ్‌కు, ప్రభుత్వ పాలసీలకు మద్ధతుగా నిలిచేది. ఉర్దూ పత్రిక ముస్లిం లీగ్‌ని, మజ్లిస్‌ని, దాని నాయకుడు బహదూర్‌ యార్‌ జంగ్‌ని, ఆ తర్వాతి కాలంలో రజాకార్లకు అండగా ఉండేది. తెలుగు పత్రిక మాత్రం నిజాం వ్యతిరేక శక్తులకు, ముఖ్యంగా కమ్యూనిస్టులకు ఊతమిచ్చేది. ఆంధ్ర మహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సర్వదేవభట్ల రామనాథం, వట్టికోట ఆళ్వారుస్వామి పంథాలను సమర్థిస్తూ వారికి అండగా ఉండేది. వారికి విశేష ప్రచారం కల్పించేది. ఈ పత్రిక స్థాపనలో డబ్బు సంపాదించడం కూడా ఒక ప్రధానోద్దేశ్యం. మీజాన్‌ (అరబిక్‌లో తరాజు (త్రాసు) అని అర్థం) పత్రికలో  తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి, శ్రీనివాస చక్రవర్తి, బుద్ధవరపు కామరాజు, విద్వాన్‌ విశ్వం లాంటి వారెందరో పనిచేసిండ్రు. మీజాన్‌ పత్రిక కార్యాలయంలో బాపిరాజు నిర్వహించే దర్బార్‌లో కురుగంటి, రాయప్రోలు, శ్రీశ్రీ, శివశంకరస్వామి తదితరులు క్రమం తప్పకుండా పాల్గొనేవారు.  హైదరాబాద్‌ వచ్చిన ఆంధ్రప్రాంత సాహితీకారుడు ఆనాడు మీజాన్‌ సందర్శించుకోవడం, పత్రిక కార్యాలయంలో నిర్వహించే దర్బార్‌లో పాల్గొనడం ఆనవాయితిగా ఉండేది. ‘స్వాతంత్య్రము, సమత్వము, సౌభ్రాతృత్వము’ అని పత్రిక ముఖపత్రంపై ఒక నినాదంగా ప్రకటించి పత్రిక ఉద్దేశ్యాన్ని వెల్లడిరచేవారు. 
    మొదట మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా కాకినాడకు చెందిన హైదరాబాద్‌ ప్రభుత్వోద్యోగి, సాహితీవేత్త ఖాసింఖాన్‌ని సంపాదకునిగా ఎంపిక చేద్దామని అనుకున్నారు. అయితే ముస్లిమ్‌ల పత్రిక అని ముద్రపడితే తెలుగు వారు చదవబోరు అనే ఆలోచనతో రాయప్రోలు, కురుగంటి, ఖాసింఖాన్‌ల సలహాతో అడివి బాపిరాజుని మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా ఎంపిక చేశారు. అప్పటికే బాపిరాజు కృష్ణా పత్రిక దర్బార్‌లో రెగ్యులర్‌గా పాల్గొనడం, ముట్నూరి కృష్ణారావు దగ్గర జర్నలిజంలో ఓనమాలు దిద్దుకోవడం ఆయన ఎంపికకు దారి తీసింది. పత్రిక సంపాదకునిగా స్థానికున్ని నియమించినట్లయితే అతను నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసి రహస్యంగా ఆంధ్రమహాసభకు మధ్దతిస్తాడనే ఆలోచనతో తెలంగాణ వాళ్ళకు అవకాశమివ్వలేదు. ఎందుకంటే అప్పటికి ప్రచారంలో ఉన్న గోలకొండ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక వార్తలతో ప్రభుత్వానికి తలనొప్పిగా ఉండేది. ఆ ఉద్దేశ్యంతోనే స్థానికున్ని గాకుండా గైర్‌ ముల్కీని నియమించాలనుకున్నారు. ఈ కారణాలు బాపిరాజు ఎంపికకు దోహదం చేశాయి. అయితే బాపిరాజు ఎంపిక మొత్తం తెలంగాణకు, ఆనాటి తెలంగాణ ఉద్యమాలకు, సాహిత్యానికి, పౌరహక్కులకు చేసిన మేలు ఎంతో గొప్పది.
     ధూపదీపాలు పేరిట ప్రతి ఉగాదికి తెలుగు వ్యక్తులకు వ్యంగ్యంగా బిరుదులు తగిలించి వారికి మొత్తం తెలుగువారిలో బాపిరాజు ప్రచారం కల్పించేవారు. 1945 ఉగాది సందర్భంగా ఆయన కొంతమంది తెలుగువారికిచ్చిన బిరుదులు గమనిస్తే అందులోని వ్యగ్యం అర్థమవుతుంది. 1. మాడపాటి హనుమంతరావు ` ఆంధ్రపార్టీ ఎస్కేపిస్టు బహదూర్‌, 2. మందుముల నరసింగరావు `సర్‌ ఆంధ్రాం థ్రాం థ్రాం, 3. రావి నారాయణరెడ్డి ` సౌమ్య సౌమ్యాంధ్రా జి.సి.హెచ్‌.ఎస్‌. 4. సురవరం ప్రతాపరెడ్డి `ముల్కేతర ముల్కీ ఆంధ్రాదివాన్‌, 5. రాయప్రోలు సుబ్బారావు `దండకారణ్య వాల్మీక, 6. కాళోజి నారాయణరావు `ఆంధ్ర సభాఅభినవ గోపరాజగీతామృతకలశా. ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బిరుదు తగిలించి బాపిరాజు ఆట పట్టించేవాడు.
    తెలంగాణ అభ్యుదయం కోసం తమ కలాన్ని కత్తిలా వాడి తనకు ఉపాధి కల్పించిన వారిపైనే సమరం చేసిన యోధుడు అడివి బాపిరాజు. బాపిరాజుకు హైదరాబాద్‌తో గల సాన్నిహిత్యం, ఆయన సాహిత్యం, ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఆయనపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగి పిహెచ్‌డీలు అవార్డయినప్పటికీ మీజాన్‌ పత్రికల సమాచారం ఉపయోగించుకుంది చాలా తక్కువ. దాదాపు శూన్యం. అందుబాటులో ఉన్న అరకొర మీజాన్‌ సంచికల్ని ప్రెస్‌ అకాడెమీ వారు ఒక ప్రాజెక్టుగా చేపట్టి గతించిన  తరం సాహిత్యాన్ని, సమాజాన్ని రికార్డు చేయాల్సిన అవసరముంది. ఈ పని ఆంధ్ర`తెలంగాణల ఉమ్మడి వారసత్వంగా బయటికి రావాల్సిన అవసరముంది. 

                                                                                                                                      -సంగిశెట్టి శ్రీనివాస్‌

No comments: