Friday 24 August 2012

BARMAR/ The EXPLOSIVE BOOK PUBLISHED IN SUPPORT OF REMOVAL OF STATUES AT TANKBUND BY SINGIDI

   

    సోకం     

   అణచివేత, ఆధిపత్యం, దోపిడీ మొదలు పెట్టాలన్నా, కొనసాగించాలన్నా ముందుగా ఆ ప్రాంతాన్ని, ప్రజల్ని ఆత్మన్యూనతా భావనలోకి నెట్టివేయాలనేది అంతర్జాతీయ సిద్ధాంతం. రంగు, రూపం, ప్రాంతం, భాష, పుట్టుక ఆధారంగా ఈ అణచివేత కొనసాగుతోంది. మీ భాష సరిగ్గా లేదు, మీ యాస బాగా లేదు. మీ కట్టూ బొట్టూ ఎబ్బెట్టుగా ఉంది. మీకు చరిత్ర లేదు, మీకు వైతాళికులు లేరు. అసలు మీరు ఏ విషయంలోనూ మాకు సమఉజ్జీలు కారు అంటూ సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు తెలంగాణపై సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా దోపిడీని, అణచివేతను, వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు.
    సాంస్కృతిక ఆధిపత్యం, అజమాయిషీ, అణచివేతలపై తిరుగుబాటే ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ ఘటన. ప్రపంచంలో ఎక్కడైనా మొదట తిరుగుబాటు సాంస్కృతిక రంగంలోనే వ్యక్తమవుతుంది. ట్యాంక్‌బండ్‌పై మార్చి 10, 2011 నాడు కూడా అదే జరిగింది. ఆరు దశాబ్దాలుగా తమ మాటకు, ఉనికికి గుర్తింపు లేకపోవడాన్ని జీర్ణించుకోలేక తెలంగాణ బిడ్డలు విచక్షణ, విజ్ఞతతో విగ్రహాలను తొలగించారు. ఈ తొలగింపు విచక్షణ, విజ్ఞతతో జరిగిందని చెప్పడానికి ఆనాటి ఘటనలే ఆధారం. ట్యాంక్‌బండ్‌ చుట్టూ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను నిలిపిండ్రు. తెలంగాణలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న తెలంగాణ వాదులతో నిండిపోయాయి. ఇలాంటి సమయంలో వేలమంది తెలంగాణవాదులు తమ ప్రాణాలకు రక్షణ లేదని తెలిసి కూడా సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించేందుకు ట్యాంక్‌బండ్‌ ఎక్కిండ్రు. కుమ్మరి మొల్ల, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, గుర్రం జాషువా, శ్రీశ్రీల విగ్రహాలకు ఎలాంటి హాని తలపెట్టలేదు. దీని ద్వారా తాము ఆధిపత్య వర్గాలకు, దోపిడి దారులకు మాత్రమే వ్యతిరేకమనే సంకేతాన్ని తెలంగాణ వాదులిచ్చినట్లయింది. ఇది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది. ఈ పునాదుల్లోంచే సామాజిక చైతన్యం విస్తృతమవుతోంది. తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది అనే పూర్తి అవగాహనతో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలోని దళిత, బహుజన, ముస్లిం మైనారిటీ, అభ్యుదయ శక్తులు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే సీమాంద్ర నుంచి ‘కావడి కుండలు’ సంకలనం వచ్చిందని గ్రహించాలి. దాని కొనసాగింపే ఈ ‘బర్మార్‌’. సామాజిక చైతన్యం కచ్చితంగా ఆర్థిక తిరుగుబాటుకు బాటలు వేస్తుంది. ఆ రహదారుల నిర్మాణంలో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిమగ్నమై ఉంది. ఒక్క సారి సీమాంధ్ర ఆర్థికాధిపత్యంపై తిరుగుబాటు షురువయ్యిందంటే దాని పరిణామాలు ఊహించడం కష్టం. తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నీ దోసుకుంటున్న వర్గాల్ని ప్రజలు అంతా తేలిగ్గా వదిలిపెట్టబోరని గతానుభవం చెబుతూనే ఉంది.
    సంస్కరణలు, అభివృద్ధి పేరిట సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు చేస్తున్న వాదనల్ని కూడా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు.  ఎవరికెంత ఏ రూపంలో ముట్టాలో ఆ రూపంలో చెల్లించేందుకు తెలంగాణ సమాజం సిద్ధమయింది. ఎందుకంటే గ్లోబలైజేషన్‌ అనంతరం పదాలకు అర్థాలు మారాయి. హైటెక్కు పాలన అసలు రంగు అర్థమయింది. గతంలో ‘సంస్కరణ’ అంటే పాజిటివ్‌ అంశం. ఇవ్వాళ ‘సంస్కరణ’ అంటే పేదల దోపిడి. అడవుల్లోని వనరుల, సంపద దోపిడి. ఒకప్పుడు అభివృద్ధి అంటే సమాజ ప్రగతి. చంద్రబాబు పాలన నాటినుంచే ‘అభివృద్ధి’ అంటే వినాశనం, ‘విధ్వంసం’ అనేవి పర్యాయ పదాలుగా మారాయి. అభివృద్ధి అంటే తమ భూములు ఎపిఐఐసీకి ఇచ్చి అక్కడ సీమాంధ్రులు కట్టిన భవంతుల్లో వాచ్‌మెన్‌ ఉద్యోగం చేయడమనే విషయం తెలంగాణ బిడ్డలకు అనుభవంలోకి వచ్చింది. అవును భవంతులు కట్టి బాగా బలిసిన వాళ్లు దోసుకోవడమే అభివృద్ధి అయితే అది తెలంగాణ వారికి ‘దోపిడి’ గానే అర్థమవుతుంది. అట్లానే చూస్తారు.
    ఆధిపత్య సీమాంధ్రులు ‘తెలంగాణ’ను చూసే దృక్కోణాన్ని మార్చుకోవాలని అందుకే చెబుతున్నాం. విగ్రహాల తొలగింపు సంఘటన ఆరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా జరిగి వుండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా జరిగి వుండేది. అప్పుడయితే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేబట్టేది కాబట్టి ‘తొలగింపు’ అనే వాళ్ళు. ఇప్పుడు అమానవీయమైన దౌర్జన్యం రాజ్యమేలుతుంది కాబట్టి ‘కూల్చివేత’ అంటున్నారు.
    ఆధిపత్యానికి, అణచివేతకూ ప్రజలు ఎప్పుడూ తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. అవి కొన్ని సార్లు ఆశ్చర్యం గొలిపేవిగా కూడా ఉండొచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటరీ అకృత్యాలకు వ్యతిరేకంగా అయిదుగురు మహిళలు చేసిన నగ్న ప్రదర్శన దేశాన్ని కుదిపేసింది. అమెరికా(మాజీ)అధ్యక్షుడు జార్జిబుష్‌ మొదలు చిరంజీవి వరకు ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి చెప్పులు విసిరిండ్రు. అంటే అది హత్యాప్రయత్నం కాదు. తమ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న నిరసనను తెలియజేయడమే. మిలియన్‌ మార్చ్‌ సంఘటన కూడా ఒక నిరసన రూపమే. తైనాన్‌మెన్‌ స్క్వేర్‌  నుంచి తెహరీర్‌ స్క్వేర్‌ వరకు అది కొనసాగుతూనే ఉంది. విగ్రహాల నిమజ్జనం అనేది సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించి, దోపిడి, వివక్ష, సీమాంధ్ర పెత్తనం అంతమవ్వాలని కోరుకున్న వేలాది మంది సమక్షంలో జరిగిన సంఘటన. ఉద్యమ చైతన్యంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయడంతో తమ నోళ్ళకు తాళాలు వేసుకున్న సీమాంధ్ర కుహనా మేధావులు ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని మళ్ళీ విజృంభించారు. తమ ‘మేతావిత్వ’ నగ్న స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. ఈ సాకుతోనైనా తెలంగాణ ప్రజల వాదనల్ని తప్పుడు వ్యాఖ్యానాలు, వాదనల ద్వారా పక్కదోవ పట్టించాలని ప్రయత్నించారు. కాని సఫలీకృతులు కాలేక పోయారు. అంబేద్కర్‌ విగ్రహాల ‘విధ్వంసం’ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మరొక్కసారి తెలంగాణ వాదులపై దాడికి దిగాలని విఫల ప్రయోగాన్నే మళ్ళీ చేస్తున్నారు.
    ఇవ్వాళ అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసాన్ని మిలియన్‌ మార్చ్‌ ఘటనలతో కొంతమంది కుహనా మేధావులు పోలుస్తున్నారు. రూపంలో రెండూ విగ్రహాల కూల్చివేతగా కనబడినా, సారంలో మాత్రం రెండూ వేర్వేరు. ఈ దేశంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ మీద కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు, కొన్ని సంఘ విద్రోహ శక్తులు తమ రాజకీయాల కోసం చేసిన దాడులివి. మిలియన్‌ మార్చ్‌ ఘటన సామూహిక ఉద్విగ్నత, 60 యేండ్ల ఆకాంక్షలోంచి వచ్చిన అద్వితీయమైన నిరసన రూపం. గంప గుత్త పెత్తనానికి చెప్పుదెబ్బ.
    సీమాంధ్ర మీడియా, ఆధిపత్య వర్గాలు ఈ సంఘటనను ‘విధ్వంసం’ అని నెత్తినోరు కొట్టుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. ఒక మీడియా చానల్‌ అయితే తెలంగాణ వాదుల్ని కోతులు కొండముచ్చులు, తాగుబోతులు అంటూ తూలనాడుతూ కథనాలను ప్రసారం చేసింది. 600 మంది బలిదానాలను ఏనాడు పట్టించుకోని వీళ్లు ‘నీతులు’ వల్లె వేయడం తెలంగాణపై వారి వివక్ష, కక్షపూరిత వైఖరికి అద్దం. ఎవరెంత రాద్ధాంత చేసినా ఇది విచక్షణ, విజ్ఞతతో చేసిన ‘తొలగింపు’ మాత్రమే. ‘విధ్వంసా’న్ని సమర్ధిస్తారా అని అమాయకంగా ప్రశ్నించేవారికి ఇది వినిర్మాణ ప్రక్రియలో భాగమని అర్థచేసుకోవాలని చెబుతున్నాం. ఉన్నవాటిని బద్దలు కొట్టకుండా కొత్తవాటిని మేలైన పద్ధతిలో నిర్మించుకోలేమనే అవగాహనతో చెబుతున్నాం. ఇది ఇక్కడితో ఆగిపోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ‘సామాజిక తెలంగాణ’ కోసం జరగాల్సిన ప్రక్రియగా భావిస్తున్నాం.

GGGGG

    కరువుతో తల్లడిల్లుతున్న భారతదేశాన్ని ఆదుకునే ఉద్దేశ్యంతో పి.ఎల్‌.480 అనే పథకం ద్వారా అమెరికా కొన్ని వేల క్వింటాళ్ల గోధుమల్ని 1954లో ఉచితంగా సరఫరా చేసింది. అమెరికా అధ్యక్షుడు ఐషనోవర్‌ ఆదేశంలోని ప్రభుత్వ`ప్రయివేటు( స్వచ్ఛంద) సంస్థల భాగస్వామ్యంతో వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తిండిగింజలు అందజేసేందుకు గాను అమెరికా పబ్లిక్‌ లా( పి.ఎల్‌) 480 అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ననుసరించి అమెరికా మొదటి సాయం భారతదేశానికే అందించింది. అయితే ఈ గోధుమలతో పాటుగా విత్తనాల రూపంలో ప్రవేశించిన మొక్క ‘పార్థీనియం హిస్టిరొఫరస్‌’. తెలుగులో దీన్ని ముద్దుగా ‘వయ్యారి భామ’ అని పిలుస్తాం. చూడ్డానికి ముచ్చటగా నక్షత్రాల్లాంటి తెల్లటి పూలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దేశమంతటా విస్తృతంగా పరుచుకుపోయింది. దీన్ని భారతదేశమంతటా ‘కాంగ్రెస్‌ ఘాస్‌’ అని పిలుస్తారు.
    ఈ ‘వయ్యారిభామ’ ఒక ‘రోగాల మహమ్మారి’. దీనివల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్త్మా, జ్వరం రావడం, చర్మం చిట్లిపోవడం, ముక్కు వాచిపోవడం, తమ్ములు, దగ్గులు, ఒక్కటేమిటి సర్వరోగాలు దీని మూలంగా వస్తాయి. దీన్ని నాశనం చెయ్యాలని దేశంలోని చాలా ప్రయోగశాలలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నా అది దిన దినం వృద్ధి చెందుతూందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. వ్యవసాయ రంగంలో పంటలు తక్కువ దిగుబడి కావడానికి, పండిన కూరగాయలు విషపూరితం కావడానికి ఇది కారకం. అంతేగాకుండా దీనిపై నుంచి వచ్చిన గాలి పీల్చి రోగగ్రస్తులైన వారు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు మందుల కోసం ఖర్చు పెడుతున్నారు. కొసమెరుపేందంటే ఈ మందులు ఎక్కువగా తయారయ్యేది అమెరికాలోనే. అంటే కుట్రపూరితంగా గోధుమలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి భారతదేశాన్ని రోగాలపుట్టగా తయారుచేసింది అమెరికా.
    సరిగ్గా భారతదేశం పట్ల అమెరికా ఏ విధంగా వ్యవహరించిందో, తెలంగాణ పట్ల గూడా సీమాంధ్ర నేతలు అలానే వ్యవహరించారు. ‘వయ్యారిభామ’ లా వచ్చి తెలంగాణను మొత్తం గుళ్ల చేసిండ్రు. చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి ఇక్కడి ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన వాటా ఎందులోనూ దక్కకుండా చేసిండ్రు. పైకి చూడ్డానికి, చెప్పడానికి ‘వయ్యారిభామ’లాగా ముచ్చట ముద్దుగానే ఉంటది. కాని ఆచరణలోకి వచ్చేసరికి తెలంగాణ మొత్తాన్ని విషతుల్యం చేసిండ్రు. ఇక్కడి వారికి చరిత్ర లేదు. ఇక్కడ వైతాళికులు లేరు. ఇక్కడి సంస్కృతి మోటు అని తీర్పులిచ్చిండ్రు. తమ ఆధిపత్యాన్ని చాటుకుండ్రు.
    ఈ అహంకార పూరిత ఆధిపత్యాన్ని కూలగొట్టడానికే తెలంగాణ బిడ్డలు మార్చి 10, 2011నాడు ట్యాంక్‌బండ్‌పై తమవి కాని విగ్రహాలను తొలగించిండ్రు. న్యాయంగా, హక్కుగా తమ వైతాళికులకు దక్కాల్సిన స్థానాన్ని గత 25 ఏండ్లుగా సీమాంధ్ర ప్రాంతం వాళ్ళే కబ్జాచేసిండ్రు. అందుకే ఈ తొలగింపు అని తేల్చి చెప్పిండ్రు. 25 ఏండ్లుగా ఈ విగ్రహాలు తెలంగాణలో వైతాళికులు లేరు, కేవలం తాము మాత్రమే మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ‘వెలుగులం’ అనే సంకేతాలిచ్చాయి. ఇక్కడి మట్టిమనుషుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపించాయి. విగ్రహాల తప్పేమి లేకున్నా వాటి ప్రతిష్టాపకుల వివక్ష ముప్పు తెచ్చింది. కొంతమంది అమాయకంగా అయ్యో ఆ ప్రాణం లేని విగ్రహాలు ఏంజేసినవి అని అంగలారుస్తున్నరు. ప్రాణంలేని విగ్రహాల పట్ల అంత ప్రేమ నటించే వీళ్లు తెలంగాణ కోసం తమను తగలబెట్టుకున్న శ్రీకాంతచారి, యాదయ్య, వేణుగోపాలరెడ్డి లాంటి బిడ్డలు ఎన్నడు కండ్లకు కనబడరు. వాళ్ల బలిదానానికి అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రతిపక్ష నాయకులు గానీ కనీస సంతాపం కూడా వ్యక్తం జేయరు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే సిపిఎం పార్టీ ఒకటి ఈ మధ్యన కోట్లకు కోట్లు చందాలు వసూలు చేసి భారీగా రాష్ట్ర మహాసభలు నిర్వహించింది. తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదుల్ని వేధిస్తున్న ప్రశ్నేందంటే ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ప్రజోపయోగ పనైనా వీళ్లు జేసిండ్రా అంటే సమాధానం పెద్ద గుండు సున్న. అదే చత్తీస్‌ఘడ్‌లో షాహిద్‌ హాస్పిటల్‌ కట్టించి ఉద్యమకారులు ప్రజలకు సేవ జేసిండ్రు.  వీరు మాత్రం హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున భవంతులు నిర్మించుకొని వాటికి తమ ప్రాంతానికి చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరి ఉదయల పేర్లు పెట్టుకుండ్రు. నిత్యం పొద్దున లేస్తే సాలు తమది తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం అని చెప్పుకునే పార్టీ ఏనాడు ఇక్కడి వారిని గౌరవించిన పాపాన పోలేదు. సాయుధ పోరాటానికి పునాది వేసిన దొడ్డి కొమురయ్య పేరుగాని, చాకలి ఐలమ్మ పేరుగాని వీరికెప్పుడూ అంటరానిదే. వీళ్లు ప్రజాస్వామ్యంగా ఎన్నడూ వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజల న్యాయమైన  డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్న ఈ పార్టీ కనీసం తెలంగాణ సాయుధ పోరాట ప్రతీకల్ని సీమాంధ్రల్లో ప్రతిష్టించే పనికూడా చేయలేదు. ఇది వీరి జ్ఞానంలోని డొల్లతనాన్ని తెలియజేస్తోంది. మరోవైపు తెలంగాణకు ఏ మాత్రం సబంధంలేని విగ్రహాలు పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, సుందరయ్యల విగ్రహాలు తెలంగాణ అంతటా పరుచుకున్నాయి. కానీ సమ్మక్క, సారలమ్మ, సర్వాయి పాపన్న, కొమురంభీమ్‌, వట్టికోట ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, షోయెబుల్లాఖాన్‌, బందగీ, తుర్రెబాజ్‌ఖాన్‌, సుద్దాల హనుమంతు, కాళోజీల్లాంటి వందలమంది వైతాళికుల్లో ఒక్కరి విగ్రహం కూడా సీమాంధ్రల్లో ప్రతిష్టకు నోచుకోలేదంటేనే ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్న వాదనలోని బలాన్ని తెలియకనే తెలియ చెబుతుంది. ఇంత ప్రస్ఫుటంగా వివక్ష కనబడుతున్నా, తాము ఉద్ధరించేవాళ్లము అనే ‘సంస్కర్త’ రూపాల్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
    ఈ వివక్ష ఇవ్వాళిటిది కాదు. 1948 నుంచే ఈ వివక్ష షురువయ్యింది. కలో, గంజో తాగుతూ గుట్టు చప్పుడు గాకుండా ఉన్న తెలంగాణను, హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించడంతోనే అహంకార పూరిత ఆధిపత్యానికి తెరలేసింది.
    1948లోనే ఇక్కడి వారికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు కాబట్టి తాము మెజారిటీ ప్రజలకు అర్థమయ్యే భాషలో వ్యవహారాలు జరిపేందుకు ఇంగ్లీషు తెలిసిన తెలుగువారిని నియమిస్తున్నామని అప్పటి హైదరాబాద్‌ మిలిటరీ ముఖ్యమంత్రి ఎం.కె.వెల్లోడి వెల్లడిరచాడు. ఇగో అప్పటినుంచి ఆరంభమైన సీమాంధ్ర వలస, ఆధిపత్యం ఎవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. హక్కుగా దక్కాల్సినవి కూడా అడుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది.
    ఈ దుస్థితి నుంచి బైటపడి ఆత్మగౌరవంతో, వెన్నెమక ఉన్న మనిషిగా నిలబడ్డానికి తెలంగాణ తల్లి బిడ్డలు నేడు ఒక్క సుతితోటి కొట్లాడుతున్నరు. లేకుంటే తెలంగాణ వ్యతిరేకులు మింగి మంచినీళ్లు తాగేటోళ్లు. 1948 నుంచి తెలంగాణకు ఈ దుస్థితి దాపురించినాదాదిగా భారతదేశ, సీమాంధ్ర నాయకులు అనేక విధాలుగా తెలంగాణను వంచించారు. మోసం చేశారు. చివరకు ఇక్కడి వారిని చరిత్ర హీనులుగా చిత్రించారు. తెలంగాణ వారికి నలుగురైదుగురికి మించి వైతాళికులు లేరు అని ట్యాంక్‌బండ్‌ ద్వారా సందేశమిచ్చారు.
    ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల్ని నిమజ్జనం చేసిన వాళ్లు ఒక డజన్‌కు మించి ఉండరు. ఆ పని చేయడానికి వాళ్లకు ఆయుధాలు అవసరం రాలేదు. తెలంగాణలోని నాలుగుకోట్ల ప్రజల ఇమ్మతి, సమ్మతే వారికి బలంగా ఉపయోగపడిరది. సీమాంధ్ర పెత్తనంపై ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతే ఈ కూల్చివేతకు ఊతమిచ్చింది. ఈ వివక్ష, తెలంగాణపై పెత్తనం ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని ఆధిపత్య ప్రతీకలు ధ్వంసం అవుతాయని తెలంగాణ బిడ్డలు హెచ్చరించిండ్రు. బుద్దిగా మసులుకోవాలని ప్రభుత్వానికి సవాలు విసిరిండ్రు. దీని నుంచి తెలంగాణవాదులతో సహా వ్యతిరేకులూ కూడా గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది.
****
 అందరి కన్నా ముందుగా ట్యాంక్‌బండ్‌పై ఆధిపత్య ప్రతీకల్ని నిమజ్జనం చేసిన ఉద్యమకారుల కాళ్లకు మొక్కుతున్నం. అట్లాగే ఈ పుస్తకం ఇంత అందంగా రూపుదిద్దుకోవడంలో మాకు హమేషా అండగా నిలబడే ఆర్టిస్టు అక్బర్‌ గారికి, ఆర్థికంగా ఆదుకున్న ఆదిలాబాద్‌ మిత్రుడు మోహన్‌, హైదరబాద్‌లో జర్నలిస్టు దోస్త్‌ పి.వేణుగోపాల స్వామి, కేంద్ర సాహిత్య అకాడెమి గ్రహీత భూపాల్‌ గార్లకు వెనుకమాట రాసిచ్చిన సుంకిరెడ్డి నారాయణరెడ్డిలకు శణార్థులు. మేము అడిగిన వెంటనే ఎంతో శ్రమకోర్చి వ్యాసాలు రాసిచ్చిన రచయితలందరికీ, ఈ పుస్తకం ఈ మాదిరిగా రావడానికి తమ వంతు బాధ్యతలు నిర్వహించిన ‘సింగిడి’ మిత్రులకు కృతజ్ఞతలు.
    ఈ పుస్తకంలోని బాగోగులు పట్టించుకొని మరిన్ని మంచి పుస్తకాలు రావడానికి మా లోటుపాట్లను సరిదిద్దవలసిందిగా పాఠకులకు, విజ్ఞులైన మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
-సంగిశెట్టి శ్రీనివాస్‌
-ఏశాల శ్రీనివాస్‌

   
   

No comments: