Saturday 8 September 2012

Telangana son of the soil:Guduri

మట్టి మనిషి గూడూరి


    ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కారణంగా తెలంగాణ భాషకు, యాసకు సీమాంధ్ర పాలకులు, వారికి వత్తాసు పలికే పత్రికలు, పాఠ్యపుస్తకాలు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. అసలు తెలంగాణలో మాట్లాడే భాష తెలుగే కాదని, ఇక్కడ ఉర్దూ మిశ్రమ, తౌరక్యాంధ్రము (తురకముGఆంధ్రము) మాట్లాడుతారని ఎద్దేవా చేసిండ్రు. మీకు భాష రాదు,  కాబట్టే మేం నేర్పించడానికే వచ్చాం అనే ఆధిపత్య, అహంభావాన్ని సీమాంధ్ర పంతుళ్లు, అధికారులు, ఆఖరికి వలస జీవులు కూడా ప్రదర్శించారు. ఎవ్వరెన్ని రకాలుగా తెలంగాణ భాషను ఎక్కిరించినా అదే భాషను, మట్టి పరిమళాన్ని తన రచనల ద్వారా బతికించిన గొప్ప కథకుడు గూడూరి సీతారాం.
    మొన్న ఆదివారం (25, సెప్టెంబర్‌, 2011) హైదరాబాద్‌లో క్యాన్సర్‌తో కన్నుమూసిన గూడూరి సీతారాం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కాలంలో ఒక దశాబ్ద కాలం పాటు రాసిన కథలు తెలంగాణ నుడికారాలతో, మూలవాగు వాసనలతో, ఇక్కడి మట్టి పరిమళాన్ని, వెట్టి బతుకుల్ని, వ్యథల్ని రికార్డు చేసినవి. తెలంగాణ మీది ప్రేమతో, సోయితో ప్రత్యేక తెలంగాణవాదులు చేసిన పరిశోధన, కృషి వల్ల ఆయన కథలు సంకలన రూపం తీసుకున్నాయి. ఇది విస్మృత తొలితరం తెలంగాణ కథకుణ్ణి తెలుగు కథానిక రంగంపై చిరస్థాయిగా నిలిపింది. అప్పటి వరకూ విస్మరించిన సీమాంధ్ర సంకలనకర్తలు సిగ్గుతో తలదించుకునేలా జేసింది. నిజానికి తొలితరం తెలంగాణ రచయితలకు తమ స్వీయ రచనల మీద ప్రత్యేక అభిమానం ఏనాడూ లేదు. తాము రాసింది ప్రజలకు చేరేంత వరకే తమ పని అని భావించారు. అందుకే ఆనాటి రచయితలు తమ రచనల్ని సంపుటాలుగా తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించలేదు. సురవరం ప్రతాపరెడ్డి మొదలు గూడూరి సీతారాం వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. 354మంది కవుల కవిత్వాని ‘గోలకొండ కవుల సంచిక’ పేరిట 1934లోనే వెలువరించిన సురవరం ప్రతాపరెడ్డి తాను రాసిన కవిత్వాన్ని అచ్చేసుకోలేక పోయాడు. అలాగే గూడూరి సీతారాం కూడా దాదాపు 80 కథలు కేవలం ఒక (1954`1964) దశాబ్దకాలంలో రాసినప్పటికీ వాటిని ఏనాడు పుస్తకంగా తీసుకురాలేదు. అయితే కొంతమంది మిత్రులం వత్తిడి తీసుకొచ్చి మీ కథలు వెలుగులోకి రావాలని చెవినిల్లుకట్టుకొని పోరితే గాని ఆయన కథలు పుస్తకంగా వెలువడలేదు. కథలు రాసిన ఐదుదశాబ్దాల తర్వాత వాటిని వెతికి పట్టుకోవడం చాలా కష్టమయ్యింది. అందుకే సీతారాం 80 కథలు రాసినా కేవలం 14 కథలే అందుబాటులో ఉండడంతో వాటినే పుస్తకంగా మానేరు రచయితల సంఘం ప్రచురించింది. ఇందుకు క్రెడిట్‌ పత్తిపాక మోహన్‌కు దక్కుతుంది. 
    అందుబాటులో ఉన్న 14 కథలూ ఆణిముత్యాలే. తెలంగాణ సామాజిక చరిత్రకు చిత్రిక గట్టాయి. తెలంగాణ జీవితంలోని ఒడిదొడుకుల్ని, గ్రామీణ స్త్రీలు, రైతులు, పేదలు, విద్యార్థులు,ప్రేమలు, పెండ్లిళ్లు, కులవృత్తులు, వలసలు, అన్నీ ఆయన కథల్లో ప్రాణం పోసుకున్నాయి. తెలంగాణ జీవద్భాషలో తనదైన కథనంతో మట్టిమనుషుల్ని అత్యంత సహజంగా గుండెలకత్తుకునే విధంగా మలిచిండు. తాను పుట్టిన కులమైన పద్మశాలీయుల జీవితాలనే గాకుండా పిచ్చుకుంట్ల, గౌడుల దయనీయ స్థితుల్ని, లచ్చి లాంటి కథలో ఫెమినిజాన్ని కూడా మానవీయ కోణంలో ఆవిష్కరించిండు.
    కథా రచయితగా ప్రసిద్ధుడైన సీతారాం నాటకాలు, కవిత్వం, నవలలు కూడా రాసిండు. ఆయన సేకరించిన పల్లె పదాలు ఎన్నో బిరుదురాజు రామరాజు పరిశోధనకు ఉపయోగపడ్డాయి. రామరాజు తన సాంపాదకత్వలో వెలువరించిన ‘త్రివేణి’ సంకలనంలో ఇవి చోటు చేసుకున్నాయి. తెలంగాణ మట్టిపరిమళాలను జానపదాలు, గేయాల రూపంలో ఆనాడు సేకరించి రికార్డు చేయడంతో మన మూలాల్ని మనం ఈనాడు  తెలుసుకోవడానికి వీలవుతోంది. సీమాంధ్రులు కప్పెట్టిన ఖజానా ఇప్పుడిప్పుడే సోయితో చేస్తున్న పరిశోధనల వల్ల వెలుగులోకి వస్తూంది. ఈ ఖజానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరెవరి ప్రతిభ ఏంటిదో విడమర్చి చెప్పెటోడు సీతారాం. పరిశోధకులకు ప్రాథమిక సోర్స్‌గా ఉండిన సీతారాం ఎన్నో సభలు సమావేశాల్లో ఎన్కటి తెలంగాణ కథగురించి వివరంగా చెప్పెటోడు. అందరికీ అర్థమయ్యే రీతిలో ముచ్చట పెట్టినట్టు గిది గిట్ల గదిగట్ల అని తెలుగు కథకుల గురించి, తెలంగాణ సాహితీవేత్తల గురించి వందల కొద్ది ‘అనెక్‌డోట్స్‌’ చెప్పెటోడు.
    గూడూరి సీతారాం సాహితీవేత్తగానే కాకుండా మానేరు రచయితల సంఘ స్థాపకుడిగా, నిర్వాహకుడిగా, విశాల సాహిత్య అకాడెమీ కార్యక్రమాల్లో ఎడతెరిపి లేకుండా పనిచేసిండు. మరుగున పడ్డ తెలంగాణ కథానికా సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలని నిరంతరం పరితపించిండు. ఆ తపనలోంచే జి.రాములు కథలు ‘పెరటి చెట్టు’ వెలువరింప జేసిండు. మరో కథకుడు సురమౌళి కథలు కూడా వేయాలని ప్రయత్నం చేసిండు.
    1953లో తెలంగాణ రచయితల సంఘం స్థాపన నాటి నుంచే వట్టికోట ఆళ్వారుస్వామి, బిరుదురాజు రామరాజు, దాశరథి కృష్ణమాచార్య, వానమామలై వరదాచార్యులు, పల్లా దుర్గయ్య, కాళోజి నారాయణరావు లాంటి వారితో కలిసి పనిచేసిండు. సిరిసిల్లలో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి దాని తరపున అనేక పుస్తకాలు ఆ కాలంలోనే తెలంగాణ వాళ్ల పుస్తకాలు అచ్చేసిండు. తన చిన్ననాటి మిత్రుడు కవి సి.నారాయణరెడ్డి ప్రోత్సాహంతో నిజాం కాలేజిలో చదువుకునే రోజుల్నుంచే సాహిత్య రంగంలోకి అడుగిడిన సీతారాం చివరి వరకూ ఆ దోస్తానీని విడువలేదు.
    75 ఏళ్ళ సీతారాం మృతితో తెలంగాణ ఒక కథా శిఖరాన్ని కోల్పోయింది. ఆయన మృతి మొత్తం తెలుగు కథానికా సాహిత్యానికి కూడా లోటే. ఈ లోటుని పూడ్చే పనిని ‘గూడూరి సీతారాం కథలు’ పేరిట వై.సత్యనారాయణ కొంత చేసిండు. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సబ్మిట్‌ చేసిన ఎం.ఫిల్‌ సిద్ధాంత గ్రంథం. అలాగే సీతారాం గురించిన విశేషాలు, వివరాలతో ‘కానుగ చెట్టు’ (స్వర్ణోత్సవ సంచిక) 2005లో వెలువడిరది. ఇటువంటి పరిశోధనలు మరిన్ని జరిగినట్లయితే సీతారాం కథల్లోని భిన్న పార్శ్యాలు వెలుగులోకి వస్తాయి. గూడూరి సీతారాం స్మృతిలో తెలుగు అకాడెమీ గానీ, తెలుగు యూనివర్సిటీ గానీ ఆయన పేరిట ‘తెలుగు కథా అకాడెమీ’ని ఏర్పాటు చేసి కథా సాహిత్యంలో పరిశోధనలకు వీలు కల్పించాలి. అలాగే జాతీయ సాహిత్య అకాడెమీ వారు గూడూరి సీతారాం జీవితాన్ని పుస్తకంగా వెలువరించి అన్ని భాషల్లోకి తర్జుమా చేసినట్లయితే తెలంగాణ వాడి ప్రతిభ భారతదేశ వాసులందరికీ తెలుస్తుంది. సీతారాం కథల్ని ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో పాఠ్యాంశాలుగా నిర్ణయించాలి. ఇదే మనం ఆ మట్టిమనిషికి అందించే నివాళి.
    ఎప్పుడూ చిర్నవ్వు చెరగకుండా, చెలిమిని చాటి చూపులతో, తెల్లటి పంచెకట్టుతో, నుదుట బొట్టుతో తెలంగాణ సాహితీ లోకానికి పరిచయమైన గూడూరి సీతారాం ‘కాక’ లేని లోటు పూడ్చలేనిది. నాకు వ్యక్తిగతంగా తీర్చలేనిది. మాట్లాడితే సాలు కొత్త ముచ్చట్లు సాక వోసే గొంతు శాశ్వతంగా మూగ వోయింది. గొంతు మూగబోయినా ఎట్లనన్న జేసి తెలంగాణ తెచ్చుకోవాలె! అని ఆయన జెప్పిన మాటలు దిశా నిర్దేశం చేస్తున్నయి. -సంగిశెట్టి శ్రీనివాస్‌

No comments: