Saturday 8 September 2012

తెలంగాణ ‘పగడం’ సుబ్బారావు

    తమను గురించి తాము చెప్పుకునే, ప్రచారం చేసుకునే అలవాటు, కీర్తి కాంక్ష తెలంగాణ కవులకు లేకపోవడంతో అది అంతిమంగా ఈ ప్రాంతంలో కవులు లేరు అని ఆంధ్రులు గుడ్డి నిర్ధారణ చేయడానికి దారి తీసింది. పూర్వ నిర్ధారణకు వచ్చి తెలంగాణ కవులు, రచయితలు, వైతాళికులకు చరిత్రలో తగిన స్థానం దక్కకుండా చేయడంలో ఆంధ్రుల ఆధిపత్య, అహంకార పూరిత రచనలు, ప్రచారాలే ప్రధాన కారణం. ఈ తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ సురవరం ప్రతాపరెడ్డి 354 మంది తెలంగాణ కవుల కవిత్వాన్ని సంకలనం చేసి వారికి ప్రాణం పోసిండు. అట్లా ప్రాణం పోసుకున్న వాళ్లలో ఒకరు పైడిమర్రి వెంకట సుబ్బారావు(1916`1998).
    కవిత్వం, కథలు, నాటకాలు, నవలలు, పద్యకావ్యాలు, వ్యాసాలు, అనువాదాలు వందలాదిగా రాసిన పైడిమర్రి వెంకటసుబ్బారావు నేటి తరం పాఠకులకు అంతగా పరిచయం లేరు. ‘ప్రతిజ్ఞ’ను అక్షరబద్ధం చేసి ప్రతిరోజూ బడిపిల్లల నోళ్లలో నానుతున్న ఈయన పుట్టింది నల్లగొండ పక్కనున్న అన్నేపర్తిలో. విస్మృత సాహితీవేత్త పైడిమర్రి గురించి తెలిసింది తక్కువ. తెలియాల్సింది, పరిశోధన జరగాల్సింది చాలా ఉంది. ఉద్యోగ రీత్యా ఖమ్మం నుంచి విశాఖపట్నం వరకు వివిధ ప్రాంతాలు తిరిగిన సుబ్బారావు సృజించని సాహిత్యం లేదంటే అతిశయోక్తి కాదు. తల్లి వేర్లను కత్తిరించి భాషా పరంగా, సాహిత్య పరంగా తెలంగాణను గత 60 యేండ్లుగా ఈ మట్టి పరిమళానికి దూరంగా ఉంచింది సీమాంధ్ర సాహిత్య కారులు, వారి తాబేదార్లుగా ఉన్న పాఠ్యపుస్తక నిర్ణేతలు, అధికారులు. సుబ్బారావు పేరు, ఆయన పని చేసిన ప్రాంతం రెండూ ఆంధ్రతో ముడిపడి ఉండడంతో తెలంగాణ పరిశోధకులు గానీ, సాహిత్యవేత్తలు గానీ ఈ విషయమై లోతుగా పరిశీలించలేదు. ఈ విషయాన్ని మొదటిసారిగా నేను 2004లో ప్రచురించిన ‘దస్త్రమ్‌’ తెలంగాణ తొలితరం కథల సూచిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన కథల జాబితా కూడా ఆ పుస్తకంలో ఇచ్చాను. ‘‘పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవితం`సాహిత్యం’’ అనే అంశంపై పిహెచ్‌డీ పరిశోధనకు తగినంత సమాచారముంది. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన ప్రస్తుత తరుణంలో ఈ పనిని మరింత బాధ్యతతో చేయాల్సిన అవసరముంది. తన మూలాల్ని తాను మళ్లీ వెతికి పట్టుకుంటున్న తెలంగాణ నేడు స్మరణకు నోచుకోకుండా పోయిన దీపధారుల్ని వెతికి వెలుగులోకి తెస్తోంది. అందులో భాగంగా  వెలుగు చూసిన పగడం ఈ పైడిమర్రి.
    నౌకరి, పిల్లిపోడు, రాజులు, బడిగంటలు కథలు ఈయన కలం నుంచి వెలువడ్డాయి. అయితే ఇవి గాకుండా ఉషస్సు సంకలనంలో ఈయన కథ చోటు చేసుకుంది. నౌకరి కథలో 1952 నాటి ముల్కి ఉద్యమాన్ని ఉర్దూ`తెలుగు మిశ్రమ భాషలో చిత్రించిండు. ఈ ఉద్యమంలో ఏడుగురు మంది సిటీకాలేజి విద్యార్థులు అమరులయ్యిండ్రు. ఉద్యమం చేసిన వారికి ఉద్యోగాలు రాకపోవడం, ఆంధ్ర అధికారుల ఛీత్కారాన్ని పైడిమర్రి రికార్డు చేసిండు. రాజులు అనే కథలో పుట్టుపూర్వోత్తరాలు ఏవీ తెలియని ఒక వ్యక్తి ఊళ్లో వాళ్లందరికి తలలో నాలుకలా ఉంటూ, అందరికీ పనుల్లో ఆసరా అవుతూ ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం గురించిన కథ ఇది. ఇందులో బియ్యం పోటేయ్యడం దగ్గరి నుంచి పేడకళ్లు ఎత్తే వరకు అన్ని పనులు చేసే రాజులు ఆకస్మాత్తుగా అనారోగ్యం పాలయి చనిపోవడంతో ‘‘ వాడికి యిల్లు లేదు. డబ్బు లేదు. బిడ్డలు లేరు. చుట్టాలు లేరు. వాడెవరో? ఏ గ్రామమో తెలియని పిచ్చివాడు రాజులు. నల్లా తెల్లా తెలియకుండా సేవచేశాడు. వాడి సేవకు ఋణపడ్డ ఆ అగ్రహారమే వాడి సర్వస్వము. పెండ్లి పల్లకీలాగా జనమంత వెళ్లి వాడి భౌతిక దేహానికి సంస్కారం చేశారు’’ అని అంతిమ ఘట్టాన్ని వెంకటసుబ్బారావు వర్ణించాడు. కథలో భాగంగా చిన్న చిన్న పాటలు రాయడం సుబ్బారావుకు అలవాటు ఈ రాజులు కథలోనే ఇలా రాసిండు.
    పాడి పంటలు మాకు భగవంతుడిస్తాడు
    వాని దయ ఉంటేను లోప మేమీ లేదు,
    బీద సాద మాకు సోదరీసోదరులు.
    పెట్టిపోతలు మాకు విడిపోని ధర్మాలు
    లేదు లేదను మాట లేదు మామాటల్లో..’’ అంటూ తెలంగాణ ఆత్మీయతను ఆయన పాటల్లో వ్యక్తీకరించాడు.
   
    1956 నాటికే బ్రహ్మచర్యము, గృహస్థ జీవితము, స్త్రీ ధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాల్ని రచించిన సుబ్బారావు వాటిని ప్రదర్శన యోగ్యంగా కూడా తీర్చి దిద్దాడు. 1951 నాటి సుజాత పత్రికలో శ్రీమతి అనే నాటకాన్ని వెలువరించాడు. ఇందులో బింబిసారుని అనంతరం రాజ్యాధికారంలోకి వచ్చిన ఆయన కొడుకు అజాత శత్రువు కాలంలో బౌద్ధమతం విద్రోహద్యమంగా నిర్ణయించబడడం, బౌద్ధ స్థూపాలను పూజించేవారిని నిర్దాక్షిణ్యంగా వధింపబడే సంఘటనలను తీసుకొని నాటకాన్ని రాసిండు. ఆనాటి కాలాన్ని బౌద్ధం బోధించిన ప్రదేశంలోనే హింస చోటు చేసుకోవడాన్ని ఆయన రికార్డు చేసిండు. నాటకాలతో పాటుగా కాలభైరవుడు అనే చిన్న నవలను 1934 నాటికే సుబ్బారావు వెలువరించిండు. అంటే 18 యేండ్లు కూడా నిండకముందే ఈయన నవల వెలువడిరది.    
    నవలతో బాటుగా ప్రతికృతి, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకృతులు కూడా సుబ్బారావు కలం నుండి వెలువడ్డాయి. వీటితో పాటుగా సింగపురీ నృకేసరీ శతకము, బాలరామయణము, వెంకటేశ్వరస్తుతి భక్తి రచనలు కూడా ఆయన రచించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల ప్రతిభను, కీర్తిని పొగడ్తూ ‘‘శ్రీకృష్ణదేవరాయల’’ పేరిట 11 పద్యాలను వెలువరించాడు. అందులో అల్లసాని పెద్దన గూర్చి ఇలా రాసిండు.

    మా కవితా పితామహుడు మంజుల భాషలతో వరూధినీ
    వ్యాకుల మోహరక్తి బ్రవరాఖ్యు పరాజ్ముఖ ధీరవృత్తి నీ
    లోకములో జిరమ్ము రసలుబ్ధుల చిత్తము లుల్లసిల్లగా
    నీకతనన్‌ రచించె నొక నిస్తుల చిత్రము లీలదీర్చునన్‌.
దీనితో పాటుగా పల్లెటూరు పత్రికలో 1952లో పద్యాలు వెలువరించాడు. కవీ పేరిట వెలువరించిన ఈ పద్యాల్లో కవియొక్క గొప్పతనాన్ని, ఆయన సృజనాత్మకతను అక్షరీకరించాడు. పద్యాలతో పాటుగా అనేక భాషల నుంచి  ముఖ్యంగా, హిందీ, ఉర్దూ భాషలనుంచి అనువాదం చేసిండు. హిందీ నుంచి గీతామీమాంస (1938), దైవభక్తి (1938), మీమాంస త్రయము (1936) అనువాదం చేసిండు. ఆధ్యాత్మిక రచనలతో పాటుగా ‘‘మనిషికెంత భూమి కావాలి’’ అనే విప్లవాత్మక రచనలు కూడా సుబ్బారావు అనువాదం చేసిండు.
    సుబ్బారావు రచనలు తెలంగాణ నుంచి వెలువడ్డ గోలకొండ, సుజాత, పల్లెటూరు పత్రికలతో పాటుగా ఆంధ్రప్రాంతంలోని ఆంధ్రపత్రిక, భారతి, నవజీవన్‌, ఆనందవాణి పత్రికల్లో అచ్చయ్యాయి.
    ఎప్పటికైనా సుబ్బారావు సమగ్ర రచనలు ఒక్కదగ్గర వెలువడినట్లయితే అటు ఆయన ప్రతిభకు నిదర్శనమేర్పడుతుంది. అలాగే పరిశోధకులకు, విమర్శకులకు మరింత లోతుగా సుబ్బారావుని అంచనా వేయడానికి వీలవుతుంది. అందుకు ఈ వ్యాసం ఒక ప్రేరణగా నిలవాలని ఈ రేఖామాత్ర పరిచయం. 

                                                                                                                                -సంగిశెట్టి శ్రీనివాస్‌  

No comments: