Saturday 8 September 2012

Century old awakening centre, Srikrishnadevarayaadhra bhasha nilayam

తెలంగాణ పునర్వికాసోద్యమానికి పునాది భాషానిలయం


    వందకు 90శాతం మంది ప్రజల మాతృభాష తెలుగు అయినప్పటికీ, పాలన భాషగా ఉర్దూ ఉండడం, అచ్చతెనుగు కావ్యానికి జన్మనిచ్చిన ప్రాంతంలోనే తెలుగు సాహిత్యానికి, భాషకు దక్కాల్సిన గౌరవం, కీర్తి దక్కలేదనే కసితో ఏర్పాటు చేసిందే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం. నిజాం ప్రాంతంలో ఎక్కడ తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేసినా ప్రభుత్వం నుండి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్‌ రాజ్యంలో బ్రిటీష్‌ వారి ద్వీపంగా వెలిగిన ‘రెసిడెన్సీ బజార్‌’ (ఇప్పటి కోఠీ, సుల్తాన్‌ బజార్‌ ప్రాంతం)లో ఈ గ్రంథాలయాన్ని నెలకొలిపారు.
    మునగాల జమీందారు రాజా నాయని వెంకటరంగారావు, ఆయన మిత్రుడు, మంత్రి కూడా అయిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మైలవరపు నరసింహశాస్త్రిల పూనిక మేరకు ఈ గ్రంథాలయం స్థాపించబడిరది. వీరికి అండగా ముత్యాల గోవిందరాజులు నాయుడు (సరోజినిదేవి నాయుడు భర్త), ఆదిపూడి సోమనాథరావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు నిలిచిండ్రు. 1901 సెప్టెంబర్‌ ఒకటిన రెసిడెన్సీ బజార్‌లోని రావిచెట్టు రంగారావు బంగళాలో పాల్వంచ సంస్థానాధీశుడు రాజా పార్థసారథి అప్పారావు బహదూర్‌ అధ్యక్షతన ఏర్పాటయిన సభతో భాషానిలయం ఉనికిలోకి వచ్చింది. పరిశోధకుడు, రచయిత ఆదిరాజు వీరభద్రరావు చిన్నవాడైనప్పటికీ ఈ నిలయం స్థాపన నాటి నుంచీ బాధ్యతలు పంచుకున్నాడు.
    మొత్తం తెలుగుసీమలోనే ఈ నిలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. తెలుగు పుస్తకాలు విశేషంగా ఉన్న గ్రంథాలయాల్లో ఇదే మొదటిది. దీని స్థాపనతో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి తెర లేచిందంటే ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టుగా ఈ నిలయం స్థాపన తెలంగాణలో మరిన్ని విజ్ఞాన జ్యోతులు వెలగడానికి, వెలిగించడానికి ఇది స్ఫూర్తిగా నిలిచింది. 1927లో నిలయం రజతోత్సవాలు జరిగే నాటికి తెలంగాణలో 100కు పైగా గ్రంథాలయాలు స్థాపించబడ్డాయంటే దీని ప్రభావం అర్థమవుతుంది. అలాగే ఈ గ్రంథాలయాల స్థాపన పుస్తకాలు, పత్రికల ప్రచురణకు దారులు వేసింది. ముద్రణా యంత్రాల స్థాపనకు దారి తీసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రంథాలయాలే తర్వాతి కాలంలో ప్రజల రాజకీయ కూడలి ప్రదేశాలుగా మారాయి. ఈ రాజకీయ చైతన్యమే 1926లో గోలకొండ పత్రిక స్థాపనకు కారణమయ్యింది. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయానికి అనుబంధంగా ‘‘ఆంధ్ర భాషోజ్జీవని నాటక సంఘం’ ఏర్పాటయింది. అలాగే తెలుగులో శాస్త్ర గ్రంథాలను ప్రచురించే పనిని కూడా ఈ గ్రంథాలయ నిర్వాహకులు స్థాపించిన ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమాల’ తరపున 1906లో ప్రారంభమయింది. తెలుగులో శాస్త్ర గ్రంథాలు మొట్టమొదటి సారిగా ఈ గ్రంథమాల తరపునే వెలువడ్డాయి. దీని తరపున మొదట హైదరాబాద్‌నుంచి, ఆతర్వాత మద్రాసు నుంచి పదుల సంఖ్యలో పుస్తకాలు అచ్చయ్యాయి. రావిచెట్టు రంగారావు, కొమర్రాజు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి తదితరులు గ్రంథమాల నిర్వహణలో పాలు పంచుకున్నారు.  అలాగే భాగ్యరెడ్డి వర్మ లాంటి దళితులకు రావిచెట్టు రంగారావు ఆశ్రయం కల్పించి నిలయం నిర్వహణలో భాగస్వామిని చేసిండు. 1925 నాటికే మహిళల కోసం గ్రంథాలయంలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి వారిలో పఠనాసక్తిని పెంచారు. ఇవన్నీ తెలంగాణ సమాజం చైతన్యం చెందడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడ్డాయి.
    ఈ గ్రంథాలయం ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ`సీమాంధ్ర ప్రాంతానికి వారధిగా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రంథాలయంలో ఉపన్యాసం ఇవ్వని తెలుగు సాహితీవేత్త, సన్మానం పొందని కవి, పండితుడు, ప్రసిద్ధుడు తెలుగునేలలో 1990లకు ముందు లేడు. చిలకమర్తి, జాషువా, శ్రీపాద, కావ్యకంఠ గణపతి ముని, కట్టమంచి, దువ్వూరి, కోడి రామ్మూర్తి నాయుడు ఇలా ఒక్కరేమి లబ్ధప్రతిష్టులయిన ప్రతి ఒక్కరూ ఈ నిలయంలో ఏదో ఒక సమయంలో సన్మానం పొందినవారే!
    సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, వడ్లకొండ నరసింహారావు, వేలూరి రంగధామనాయుడు,  ఆదిరాజు వీరభద్రరావు, రావిచెట్టు లక్ష్మీనరసమ్మ ఇలా ఎందరో ఈ నిలయ అభివృద్ధికి కృషి చేసిండ్రు. అలాంటి భాషానిలయం నేడొక పురాస్మృతిగా మిగిలింది.
    ఇరవై యేళ్ల క్రితం వరకూ హైదరాబాద్‌లో ఏ సాహిత్య సభ జరిగినా, సమావేశం జరిగినా అది కచ్చితంగా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలోనే జరిగేది. ఇప్పుడు ఆ శోభ పోయింది. పాత భవనం స్థానంలో జీవంలేని నూతన భవనం నిర్మాణమయింది. ఇందులో ఇప్పటికీ వేలాది ‘రేర్‌’ పుస్తకాలు అల్మారాల్లోనే ఉండిపోయాయి. ఇవన్నీ పరిశోధకులకు అందుబాటులోకి రావాల్సిన అవసరముంది. ఈ భవనంలో సాహిత్య సభలు, సమావేశాలు, పుస్తకావిష్కరణలు చేసుకోవడానికి తక్కువ ధరకు హాల్‌ కేటాయించి రచయితలను ప్రోత్సహించాలి. రేర్‌ పుస్తకాలన్నింటిని డిజిటైజ్‌ చేయించి నిలయం తరపున వెబ్‌సైట్‌లో ఉంచి అందరికీ అందుబాటులోకి తేవాలి. ఈ చర్యల ద్వారా 110 యేండ్ల ఈ గ్రంథాలయానికి పూర్వశోభ సంతరించుకుంటుంది. అలాగే ఈ నిలయంతో సంబంధం ఉన్న వారి లిస్ట్‌ తయారు చేసినట్లయితే చాలు అలనాటి తెలంగాణ సాహిత్యకారుల పట్టిక తయారవుతుంది. వారి ఫోటోలన్నింటిని ఎగ్జిబిట్‌ చేయడమే గాకుండా వాటిని నిలయం వార్షికోత్సవాల్లో ప్రదర్శనకు పెట్టాలి. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు ఇది దోహదపడుతుంది. 

                                                                                                      -సంగిశెట్టి శ్రీనివాస్‌

No comments: