Thursday 23 August 2012

Attack on Swamy goud

కాలంబు రాగానే కాటేసి తీరాలె!
    ప్రభుత్వ దమననీతి, అణచివేత, వివక్ష, దౌర్జన్యం, పాశవిక దాడి కలగలిపి సకలజనుల సమ్మెను వమ్ము చేయాలని సీమాంధ్ర ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డి ప్రయత్నం చేసింది. ఆఖరికి ఉద్యోగుల సంఘం నాయకుడు స్వామిగౌడ్‌ని సంపాలని జూసింది. అంటే ప్రభుత్వం ఉద్యోగులను, తద్వారా ఉద్యమాన్ని అణచాలని అనుకున్నది. అందుకే శ్రీకృష్ణకమిటీ రహస్య నివేదికను తూ.చ. తప్పకుండా అమలు చేసింది. న్యాయం అడిగిన ప్రతి తెలంగాణ వాదిని ఇబ్బందులకు గురి చేసింది. రోడ్లమీదికి వచ్చి ధర్నాలు చేసిన ప్రజల్ని లాఠీలతో కుల్లబొడిచింది. పనులన్నింటిని పక్కనబెట్టి ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ చౌరాస్తాలో నిలబడ్డ ప్రతి ఒక్కరిపై ఈ ప్రభుత్వం కేసులు బనాయించి అరెస్టు చేసింది. సమ్మెజేస్తున్న ఉద్యోగులకు అండగా ఉండి ఆదుకుంటారని భావించిన నాయకులు వెన్ను చూపిండ్రు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన ప్రతిసారీ ప్రతీఘాత శక్తులుగా మారే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం ఈసారి కూడా ఆ పనిని నిర్విఘ్నంగా నిర్వహించింది. ఇంత జరిగినా ప్రజలు మాత్రం ఎక్కడా తొట్రుపడకుండా ఉద్యోగులకు బాసటగా నిలిచిండ్రు.
    జీతం మీదనే ఆధారపడి నెల తిరిగే సరికి ఇంటి అద్దెకు, పాలకు, మెడిసిన్‌, రేషన్‌కు ఇబ్బంది పడే వేతన జీవులు 42 రోజులు తమ సర్వ శక్తుల్ని ఒడ్డి కొట్లాడిన తీరు అమోఘం. ఆడిబిడ్డలు బతుకమ్మ పండుగకు కొత్త బట్టలు కొనుక్కోకున్నా పండుగను మాత్రం ఊళ్లె నుండి అమెరిక దాకా జోరుగ జరుపుకుండ్రు. బొడ్డెమ్మ పండుగ నుంచి సద్దుల వరకు రోజూ రోడ్ల మీద జైతెలంగాణ అంటూ బతుకమ్మలాడిరడ్రు. గౌరమ్మను మొక్కిండ్రు. పుట్టి బుద్దెరిగిన సంది దసర పండుగకు కొత్త బట్టలు కొనుక్కొని, కాయిబువ్వ తిన్న వాళ్లు కూడా ఈ సారి పాత బట్టలతోనే సరిపెట్టుకున్నరు. జమ్మిచెట్టు కాడ సుత జైతెలంగాణ నినాదాలే మార్మోగినయి. సమ్మె జరిగిన 42 రోజులూ పబ్లిక్‌కు శాన పరేషానయ్యింది. అయినా కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సమ్మెకు సహకరించిండ్రు. ఎన్ని ఇబ్బందులెదురైనా సమ్మెజేసెటోళ్లమీద ఎగిరి పడలేదు. ఇదివరకు సమ్మెతోటి జెర్రంత తక్లీఫ్‌ అయినా ఓర్సుకోనోళ్లు సమ్మెలో షరీక్‌ కావడం తమ కర్తవ్యంగా భావించిండ్రు. ఏ రోజుకారోజు అడ్డమీద కూలీ, ఫ్యాక్టరీలల్ల పనిచేసే కార్మికులు, ఆఖరికి చెత్త ఏరుకునే వారు సైతం సమ్మెలో షరీక్‌ అయ్యిండ్రు. అటెండర్‌ నుంచి అడీషనల్‌ డైరెక్టర్ల వరకూ సకల ఉద్యోగులు కేసులు, లాఠీచార్జీలకు వెరవకుండా ఉద్యమాన్ని చేయడం, కొత్త కొత్త రూపాల్లో నిరసన వ్యక్తం చేయడం ఉద్యోగులందరిలో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
    ఆర్టీసీ బస్సులు బందయినయి. కొన్ని రోజులు ఆటోలు కూడా తిరుగలేదు. కొందరు లగ్గాలు కూడా వాయిదా వేసుకుండ్రు. ఆటోలు నడిచిన రోజులల్ల కూడా పబ్లిక్‌ డబుల్‌ కిరాయిపెట్టుకొని తిరిగిండ్రు. కాని ఎవ్వలు గూడ సమ్మెజేసెటోళ్లని తప్పుపట్టలే. ఆర్టీసోల్లని తిట్టలే. ఆడి పోసుకోలే. శాపనార్థాలు పెట్టలేదు. పబ్లిక్‌ తమ వంతు కృషిగా చౌరస్తాలల్ల అసోయ్‌ ధూలా ఆడిరడ్రు. ర్యాలీలు తీసిండ్రు. రాస్తారోకోలు జేసిండ్రు. వేల ఎడ్లబండ్లతోటి ఊరేగింపు తీసిండ్రు. సింగరేణి నల్ల సూర్యులు సమ్మెకు దిగడంతోటి ప్రభుత్వం నక్కజిత్తులతోటి కరెంటు కోత పెట్టింది. దీంతో ఏడుగంట్లకు నిద్ర లేసెటోళ్లు కూడా ఐదుగంటలకే లేసిండ్రు. వేడినీళ్లు లేకున్నా సల్ల నీళ్ల తోటి తానం జేసిండ్రు. ప్రయివేటు, గవర్నమెంటు అని తేడా లేకుండా స్కూల్‌, కాలేజ్‌ పిల్లలందరూ బడి బంద్‌పెట్టి ర్యాలీలు తీసిండ్రు. దినాం ధర్నాకు దిగిండ్రు. ఎటు జూసినా జైతెలంగాణ నినాదమే మార్మోగింది. పండుగ అడ్వాన్స్‌ యివ్వడానికి యాజమాన్యం నిరాకరించినా ఆర్టీసీ, సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని చాటిండ్రు. విద్యుత్‌ ఉద్యోగులు, ప్రయివేట్‌ సెక్టార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులు సైతం ఉద్యమ వ్యాప్తికి తమవంతు కృషి చేసిండ్రు. అంగన్‌వాడి, ఎల్‌ఐసీ ఉద్యోగులు సుత రోడ్లమీది కొచ్చిండ్రు. తెలంగాణ అంతటా రోడ్లన్నీ అటు వంటా వార్పులతో, ఇటు ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలతో అట్టుడికి పోయింది.  
    అన్ని వృత్తుల వాళ్లు, అన్ని కులాల వాండ్లు, అన్ని మతాల వాళ్లు సమ్మెలో పాల్గొన్నరు. ప్రజల పక్షాన గాకుండా ప్రభుత్వం కాళ్లకు మడుగులొత్తుతున్న తెలంగాణ నుంచి గెలిచిన మంత్రుల దిష్టిబొమ్మలు తగులబెట్టిండ్రు. మంత్రులు దొరికితె ఆళ్లనే కాలబెట్టాలన్నంత కోపం ప్రజల కండ్లల్ల కనబడ్డది. తెలంగాణ కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎమ్మెల్యేల పిండప్రదానం చేసి కసి తీర్చుకుండ్రు. ఇగ ఆళ్లు సచ్చినట్టే అని తీర్మానించిండ్రు. ఇన్ని జేసిన వీళ్లందరు షరం తప్పి అధికార పక్షానికి, ప్రభుత్వానికి అండగా నిలిచి ప్రజలను వంచించిండ్రు. ప్రజల యాదాయిష్‌ చాలా తక్కువ అనుకునే నాయకులకు ఆల్రెడీ ఉప ఎన్నికలల్ల ముక్కుగుద్ది బుద్ది చెప్పిండ్రు.  అయినా వీళ్లకి సోయి రాలేదు.
    రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులను, యువకులను బలియిస్తూ తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి స్వీయ ప్రయోజనాల రక్షణే పరమావధిగా పనిచేసిండ్రు. టీఆరెస్‌, సిపిఐ, బీజేపి మినహా ఇక్కడి నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే తెలంగాణతల్లి గుండెల్లో తలా ఒక బాకు దించిండు. కూసున్న కాడ గుర్రాలు మలుపుతూ ఉద్యమం చేసెటోళ్లమీద బట్టకాల్చేసిండ్రు. బద్నాం చేసిండ్రు.
    సీమాంధ్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఎస్మా, గిస్మా అంటూ సమ్మెను ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వాన్ని కతం చెయ్యాలని సూశింది. ఉద్యమాన్ని హింసాయుతం జేసి 1969 మాదిరిగా సప్పున సల్లార్పాలని పకడ్బందీ ప్రణాళికలేసుకుంది. ఆడొల్లు మగోల్లు అని సూడకుండ ర్యాపిడ్‌ పోలీసుల్ని దింపి లాఠీచార్జ్‌ చేయించింది. అన్ని జాగాలల్ల ఏర్పాటు చేసిన సిసిటీవిలతోటి పోలీసుల పనితీరుని బాస్‌లు సమీక్షించి ‘లా అండ్‌ ఆర్డర్‌’ రక్షణ పేరిట మరింత దమనకాండకు దిగిండ్రు. ఈ దమనకాండకు పరాకాష్ట స్వామి గౌడ్‌పై హత్యాయత్నం.
    42 రోజుల సమ్మెలో 16వ (29`9`2011) రోజు లగడపాటి రాజగోపాల్‌, ఆయన అనుచరులు ఆర్టీవో ఉద్యోగుల్ని బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారం రావడంతో వారికి ధైర్యం చెప్పేందుకు  స్వామిగౌడ్‌ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి అక్కడికి చేరుకుండు. మొదట కార్యాలయం లోపలికి వెళ్లేందుకు స్వామిగౌడ్‌కు అనుమతించలేదు. ఎంట్రెన్స్‌లోనే పోలీసులు అడ్డుకుండ్రు. అయితే తామేమి దొమ్మీకి, దోపిడికి రాలేదని రాజకీయ నాయకుల బెదిరింపులతో భయపడుతున్న ఉద్యోగులకి ధైర్యం చెప్పడానికి మాత్రమే వచ్చామని సమ్జాయించడంతో పోలీసులు స్వామిగౌడ్‌ని లోపలికి వెళ్లేందుకు అనుమతించిండ్రు. లోపల మాట్లాడి బయటికి రాగానే మఫ్టీలో ఉన్న పోలీసులు పోలోమని స్వామిగౌడ్‌ మీదపడి ఛాతీ, కడుపు మీద పిడిగుద్దులు గుద్దుతూ, వట్టలు పిసికి సంపాలని ప్రయత్నం చేసిండ్రు. ఇదంతా డీసీపి స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలోనే జరిగింది. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు బృందానికి కూడా ఆయనే నాయకుడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న స్వామిగౌడ్‌ని చంపేస్తే, కనీసం అటిటు కదలకుండ హాస్పిటలైజ్‌ చేసినట్లయితే ఉద్యోగులు వెనక్కి తగ్గుతారని ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచించింది. అయితే అందుకు భిన్నంగా ఉద్యోగులందరూ ఏకమై స్వామిగౌడ్‌కు బాసటగా నిలుస్తామని ర్యాలీలు నిర్వహించి ప్రకటించిండ్రు. రాష్ట్ర మానవహక్కుల సంఘం దృష్టికి ప్రభుత్వ దమనకాండను తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్వామిగౌడ్‌ స్టేట్‌మెంట్‌ తీసుకొని విచారణ సైతం చేపట్టింది.
    42 రోజుల సకలజనుల సమ్మె నేర్పిన గుణపాఠాలు భావి ఉద్యమాలకు దిక్సూచిగా భావించాల్సి ఉంటది. ఉద్యోగులందరూ ఏకమైనా నాయకులు కలిసి రాకపోవడంతోటి సానుకూల ఫలితం రాలేదు. యూనివర్సిటీల్లోని విద్యార్థులు కూడా సమ్మెకు అంతగా సహకరించలేదు. వాళ్లని కలుపుకు పోయే మెకానిజమ్‌ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. రోజువారీ యాక్టివిటీస్‌ని మానిటర్‌ చేసి కొత్త ఉద్యమ రూపాల్ని ప్రజలకందించే పాత్రను ఉద్యోగ సంఘాల వాళ్లు సమర్ధవంతంగా నిర్వహించలేక పోయారు. వ్యూహకర్తలు, కార్యకర్తలు, నాయకులు అన్నీ వాళ్లే కావడంతోటి ఈ సమస్య వచ్చింది. దీన్ని విభజించుకొని తమలో తాము, పబ్లిక్‌తో తాము సహకరించుకుంటూ పనిచేసి ఉన్నట్లయితే అటు ప్రభుత్వం మీద, ఇటు ప్రజా కంటకులైన నాయకులమీద వత్తిడి మరింతగా పెరిగేది. ఈ లోపాల్ని సవరించుకొని భవిష్యత్‌ కార్యాచారణను రూపొందించుకోవాల్సి ఉంటది.
    కన్స్యూమరిజమ్‌ రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో చిన్న చిన్న ప్రలోభాలకే మనుషులు లొంగిపోతున్నారు. అయితే ఈ పోరాటంలో ఉద్యమ దివిటీలై వెలిగిన ప్రతి ఉద్యోగీ ప్రలోభాలకు లొంగకుండా, రాష్ట్రం సాధించే వరకు ఆరునూరైనా కొట్లాడి తీరాలని తీర్మానించుకున్నరు. అయితే దున్నపోతు మీద వాన పడ్డట్టుగ కేంద్రంలో, రాష్ట్రంలో ఎక్కడా కనీస చలనం కూడా లేకపోవడంతోటి పోరాటం మరో రూపంలో కొనసాగించడానికి సమ్మెను వాయిదా వేయడం జరిగింది. ఈ సమ్మె ద్వారా ఉద్యోగులకు తమ బలమూ, బలహీనతా రెండూ తెలిసొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక డిమాండ్‌తో సమ్మెకు దిగిన నాయకగణం తర్వాత తర్వాత తమ గళాన్ని మార్చింది. ప్రత్యేక తెలంగాణ రాజకీయ నాయకుల ద్వార మాత్రమే సాధ్యమనే విషయాన్ని ఈ 42 రోజుల సమ్మె ద్వారా ప్రస్ఫుటంగా తెలిసొచ్చింది. ఇక ముందు ఉద్యోగులు ముందు వరుసలో గాకుండా నాయకుల్ని ముందు వరుసలో నిలబెట్టి వారి వెనుక ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ర్యాలీ అయ్యేలా చూడాల్సిన అవసరముంది. ముందు వరుసలో రాజకీయ నాయకులున్నట్లయితే ప్రభుత్వం తన మనుగడకోసమన్నా స్పందించాల్సి ఉంటది. ఇప్పటి మాదిరిగా స్పందనా రహితంగా ఉండడానికి వీలుగాదు.
    ప్రమోషన్లు, పెన్షన్లు రాక, ఆదివారాలు, సెలవు రోజుల్లోకూడా సమ్మె కాలపు పనిచేస్తూ ఉద్యోగులందరూ  కాళోజి చెప్పినట్టుగ ‘కాలంబు రాగానే కాటేసి తీరాలె’ అని నిర్ణయించుకున్నరు. ఈ కాలం ఎంత తొందరగా వస్తె అంత బాగుండు అని ఆత్రుతతోటి ఎదురు సూస్తుండ్రు.
`సంగిశెట్టి శ్రీనివాస్‌
    

No comments: