Thursday 23 August 2012

17th september what way it concerns to the hyderabadis?

17 సెప్టెంబర్‌ ఎవరి కోసం? ఎందుకోసం?

    ‘‘ ‘హైదరాబాద్‌ విమోచన’ దినమైన 17వ సెప్టెంబర్‌ని ఈ సారి ఘనంగా సెలబ్రేట్‌ చేస్తామని’’ ప్రకటించి తెలుగుదేశం పార్టీ పాత గాయం మీద మరోసారి కొత్తగా ఉప్పుచల్లింది. దీంతో చరిత్ర అవసరం లేదని చెప్పిన చంద్రబాబు నాయుడికి 17 సెప్టెంబర్‌ గురించి వాస్తవాలు తెలుసా? అనే సందేహం కలుగుతోంది. ఒక్క తెలుగుదేశం పార్టీయే కాదు. తెలంగాణలోని అన్ని పార్టీలు, జేఏసిలు ఈ విషయమై తమ వైఖరిని బహిరంగంగా ప్రకటించాలి. ప్రజల పక్షం నిలబడదలచిన ప్రతివారు దీన్ని ఒక పీడ దినంగా గుర్తించాలి. ఎందుకంటే ఈ రోజున్నే ‘హైదరాబాద్‌ రాజ్య’ ప్రజలకు స్వయం పాలన పోయి ‘పరాయి’ పాలన ప్రారంభమైంది. ఈ పరాయి పాలన చివరికి ‘సీమాంధ్ర’ పాలనకు పునాదులేసింది. అంతేగాదు 17 సెప్టెంబర్‌ అంటేనే ‘ముస్లింల ఊచకోత’ గుర్తుకు వస్తది. సాయుదపోరాట యోధుల్ని చంపేందుకు ‘సైన్యం’ తరలి వచ్చిన రోజుగా కూడా గుర్తు చేసుకోవాలి.ఈ మట్టిలో పుట్టి హైదరాబాద్‌ రాజ్యంలో ఉద్యోగాల్లో ఉన్న స్థానికులకు ‘ఉద్వాసన’ పలికిన రోజుగా కూడా 17 సెప్టెంబర్‌ని గుర్తు పెట్టుకోవాలి. 17 సెప్టెంబర్‌ పూర్వ పరాల్ని నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ‘నీర క్షీర వివేకం’తో అంచనా వేయాల్సిన అవసరముంది. జ్ఞానంతో అడుగు ముందుకు వేయాలి. 17 సెప్టెంబర్‌ గురించి ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంతగా వాస్తవాలు బయటికి వస్తాయి. ఈ పని గత పదేళ్లుగా జరుగుతూనే ఉంది. ప్రతిసారీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా కొత్త పుస్తకాలు ప్రచురితమయ్యాయి. అందులో ముఖ్యమైనది ానవసవతీaపaస షశీబజ్ణూ  అనే పుస్తకం. మొహమ్మద్‌ హైదర్‌ అనే అతని జ్ఞాపకాలే ఈ పుస్తకం. ఈయన ఆనాడు హైదరాబాద్‌ రాజ్యంలో ఉస్మానాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఉండేవాడు. 17 సెప్టెంబర్‌కు ముందు, తర్వాత ఏమి జరిగింది, భారత సైన్యం వ్యవహరించిన తీరుని భావోద్వేగాలకు అతీతంగా, నిర్భయంగా వెలువరించాడు. అందుకే చర్చ జరిగిన కొద్దీ ఇన్నాళ్లు తెలియకుండా పోయిన వాస్తవాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని అర్థం చేసుకోవాలి.
    17 సెప్టెంబర్‌ కు చరిత్రలో ఏమైనా ప్రాధాన్యత ఉందా? ఉంటే దాని విశిష్టత ఏంటి? అది విమోచనమా? విలీనమా? విద్రోహమా? లేదా వీటన్నింటి కలయికనా? దీంట్లో ఏవరి పాత్ర ఏంటి? కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఆర్యసమాజ్‌, కాంగ్రెస్‌, రజాకార్లు, నెహ్రూ, పటేల్‌, నిజాం, మౌంట్‌బాటన్‌, వాల్టర్‌ మాంక్‌టన్‌,ఎల్‌ ఎద్రూస్‌, దుర్రెషెవార్‌, చర్చిల్‌, రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ఎవరు ఏం మాట్లాడారు? 1948లో ఏమన్నారు? ఆ తర్వాత ఏమన్నారు? ఇప్పుడు ఎవరు ఏమంటున్నారు? ఎందుకంటున్నారు? అనే విషయాల్ని వివరంగా తెలుసుకుంటే గానీ 17 సెప్టెంబర్‌ను ప్రజలు ముఖ్యంగా తెలంగాణ వాసులు ఎలా చూడాలో తేలుతుంది. ప్రజల జ్ఞాపకశక్తి చాలా తక్కువ అని అంచనా వేసే రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం చరిత్రను వక్రీకరించి అర్ధసత్యాలను, అసత్యాలను ప్రచారంలో పెట్టి నాణానికి ఒకవైపు మాత్రమే చూపించి అదే సర్వస్వం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులూ జరిగింది అదే!
    బ్రిటీష్‌ ప్రభుత్వం అక్కడి పార్లమెంటులో జూన్‌ 3, 1947నాడు ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌’ చట్టాన్ని ఆమోదిస్తూ అక్కడి సంస్థానాలు భారత్‌లో గానీ, పాకిస్తాన్‌లోగానీ లేదా స్వతంత్రంగా గానీ ఉండవచ్చని తీర్మానం చేసింది. ఈ మేరకు నిజాం హైదరాబాద్‌ రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా 27 ఆగస్టు 1947నాడు ప్రకటించాడు. హైదరాబాద్‌ స్వతంత్ర దేశం కాబట్టే భారత ప్రభుత్వం యథాతథ ఒడంబడిక చేసుకుంది.  నవంబర్‌ 29, 1947 నాడు కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం విదేశీ సంబంధాలు, రక్షణ, కమ్యూనికేషన్‌ రంగాలు భారత ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయి. మిగతా వ్యవహారాలు నిజాం ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. ఈ ఒప్పందాన్ని కచ్చితంగా అమలు పరుస్తాం అనే నమ్మకాన్ని కలిగించేందుకు నిజాం ప్రభుత్వం హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో నవంబర్‌ 30, 1947 నాడు హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకుడు రామనందతీర్థ జైలు నుంచి విడుదలయ్యాడు.
        భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై దాడికి ప్రధాన కారణం శాంతిభద్రతల క్షీణత అని ప్రకటించింది. పేరు రజాకార్లు సృష్టిస్తున్న మారణహోమం అని బయటికి చెప్పినప్పటికీ రహస్య ఎజెండా మాత్రం ‘సాయుధ రైతాంగ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టుల నిర్మూలన’. ఈ రెండిరటిని పకడ్బందీగా అమలుపరిచింది ఇండియన్‌ ప్రభుత్వం.
    హైదరాబాద్‌ రాజ్యంలో పెట్రేగిపోతున్న రజాకార్లను అణచివేసేందుకు ‘పోలీసు చర్య’ పేరిట భారత సైన్యాల దాడి జరిగింది. ఇది అధికారిక వాదన. అయితే ఈ పోలీసు చర్యకు కారకుడైన భారత ఉపప్రధాని సర్దార్‌ వల్లభబాయి పటేల్‌ ఫిబ్రవరి 27, 1949నాడు హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కమ్యూనిస్టుల మూలంగా చైనా, బర్మా తగలబడుతున్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి దాపురించే అవకాశముంది. ‘‘కమ్యూనిస్టులంతా ప్రాంతేతరులే (హైదరాబాద్‌ రాజ్యానికి) వారు సమస్యను ఇంకా జఠిలం చేయాలని జూస్తున్నారు. పట్టుబడ్డ కమ్యూనిస్టుల్లో చాలామంది బయటి వారే. నేనొక్కటి చెప్పదలుచుకున్నాను. వారు ఎక్కడికైనా వెళ్లవచ్చు. అలా కాకుండా ఇక్కడే ఉండదలుచుకుంటే ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలేది లేదు. ఎందుకంటే అది ఒక్క హైదరాబాద్‌ రాష్ట్రాన్నే కాదు మొత్తం దేశాన్నే విష పూరితం చేస్తుంది’’. (సెడ్‌ ద సర్దార్‌, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ప్రచురణ, 1950) దీన్ని బట్టి భారత సేనలు హైదరాబాద్‌ రాజ్యంపై ఏ లక్ష్యంతో దండయాత్రకు దిగాయో చూచాయగా అర్థమవుతుంది.  మరోవైపు నిజాంకు తాబేదార్లుగా ఉండి, ఊర్లల్లో ప్రజల్ని పీడిస్తున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండ్యాలు, జమిందార్లు, జాగీర్దార్లు, నగరంలోని నవాబులు, పాయెగాలు, సంస్థానాధీశులు ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ధనవంతులైన పారిశ్రామిక వేత్తలు కూడా నిజాంవైపే ఉన్నారు. చదువుకున్న మధ్యతరగతి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పోలీసు చర్యకు పెద్దగా స్పందించలేదు. చిన్న గ్రూపుగా ఉన్న సోషలిస్టులు అరుణా అసఫలీ, జయప్రకాశ్‌ నారాయణలను హైదరాబాద్‌కు పిలిపించి మహదేవ్‌ సింగ్‌ నేతృత్వాన బాధ్యతాయుత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలు చేసిండ్రు. ఇదే విషయాన్ని 1948 సెప్టెంబర్‌ 11న ‘హైదరాబాద్‌ భావి కర్తవ్యం’ అనే పుస్తకానికి రాసిన ముందుమాటలో జయప్రకాశ్‌ నారాయణ వెల్లడిరచారు. అలాగే మాల మాదిగలు తదితర నిమ్న కులాల వాళ్లు పోలీస్‌ యాక్షన్‌ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి వరకు తాము ప్రభుత్వంలో భాగస్వాములుగా, మంత్రులుగా ఉండి తమ వర్గం వారికోసం సాధించిన ప్రయోజనాలు చిన్నవే అయినప్పటికీ అవి కూడా అందకుండా పోతాయని మిలిటరీని వ్యతిరేకించారు. అయితే మజ్లిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బహద్దుర్‌యార్జంగ్‌(1905`1944) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన అనంతరం పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. రజాకార్లు రెచ్చిపోయారు. ఆర్యసమాజ్‌ ప్రతి దాడులకు దిగింది. తబ్లీగ్‌ పేరిట మత మార్పిడులు ఊపందుకున్నాయి.     బహద్దూర్‌ యార్జంగ్‌ ప్రచారంలో పెట్టిన ‘అనల్‌ మాలిక్‌’ (ముస్లింలందరూ రాజులే) అనే నినాదానికి మరింత పదును పెట్టారు. హైదరాబాద్‌ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఎల్‌ ఎద్రూస్‌ హైదరాబాద్‌ ప్రధాని లాయక్‌ అలీ, ఉస్మానలీఖాన్‌ ఇద్దరికీ యుద్ధం మంచిది కాదు. యుద్ధం వస్తే నాలుగు రోజులకన్నా ఎక్కువగా ఫైట్‌ చేయలేమని కూడా చెప్పాడు. యుద్ధానికి సరిపడే ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఎద్రూస్‌ లండన్‌ కూడా వెళ్లాడు. అయితే ఆ ఆయుధాల్ని భారత భూభాగం గుండా భారత్‌ కళ్లుగప్పి తీసుకెళ్లడం అంత సులభమైన పని కాదని, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దేశస్థాయి దక్కని దేశానికి ఆయుధాలు బహిరంగంగా అమ్మడానికి సుముఖత లేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. అయితే ఈ ఆయుధాలను హైదరాబాద్‌ ప్రభుత్వం సిడ్నీకాటన్‌ (1894`1969) ద్వారా దొంగచాటుగా దిగుమతి చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన కాటన్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు నమ్మిన బంటుగా ఉంటూ పాకిస్తాన్‌ మందుల్ని (మెడిసిన్స్‌ని), మందుగుండు సామాగ్రిని హైదరాబాద్‌కు తరలించాడు. గూఢచర్యంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన వ్యక్తి. ఈయన జెకోస్లావేకియా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను హైదరాబాద్‌కు తరలించాడు.
      ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే తాము ఎవరినైతే ప్రస్తుతం నాజీ, నియంత, నిరంకుశుడు, రాక్షసుడు అని నిందిస్తున్నారో ఆ ఏడో నిజాం మీర్‌ ఉస్మానలీఖాన్‌తో కమ్యూనిస్టులు మిలాఖత్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఢల్లీిలో ఏర్పడ్డ కేంద్ర (నెహ్రూ) ప్రభుత్వం బూర్జువా, పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాస్తుందని దాన్ని కూలయదోయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌, రావి నారాయణరెడ్డిలు మే నాలుగు, 1948 నాడు నిజాం ప్రధాని లాయక్‌ అలీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడమే గాకుండా మఖ్దూమ్‌ మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తి వేసింది. అప్పటి వరకు శత్రువులుగా ఉన్న వారు మిత్రులయ్యారు. దీంతో కమ్యూనిస్టులు రజాకార్లను ప్రజాసైన్యంగా వర్ణించారు. కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్‌ శాఖ ఈ సమయంలో ఒక తీర్మానం చేసి ఎనిమిది పేజీల కరపత్రాన్ని ప్రచురించింది. దీంట్లో కాంగ్రెస్‌పై దాడి చేసింది. అలాగే నిజాం రాజ్యం భారత యూనియన్‌లో చేరకూడదు. నెహ్రూ ప్రభుత్వం ధనిక వర్గ ప్రభుత్వం. పెట్టుబడిదారీ దోపిడిని బలవంతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో సంస్థానాలను బలవంతంగా విలీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలి అని పేర్కొంది. అంత వరకు అజ్ఞాతంలో ఉన్న రాజ్‌బహదూర్‌ గౌర్‌ హష్మత్‌ గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్‌ రాష్ట్రం (రాజ్యం) స్వతంత్రంగా ఉండాలి. అది కమ్యూనిస్టు పార్టీ విధానమని ప్రకటించాడు.
    మరోవైపు పాకిస్తాన్‌ గవర్నర్‌ జనరల్‌ మహ్మద్‌ అలీ జిన్నా సెప్టెంబర్‌ 11న చనిపోవడంతో అదే రోజు హైదరబాద్‌ను స్వాధీనం చేసుకునేందుకు  భారత ప్రభుత్వం యత్నాలు ప్రారంభించింది. సెప్టెంబర్‌ 12న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పటేల్‌కు మద్ధతుగా అప్పటి ఆయన క్యాబినెట్‌ సహచరుడు, ఆ తర్వాత జనసంఫ్‌ుని స్థాపించిన శ్యామాప్రసాద్‌ ముఖర్జీ నిలిచాడు. హైదరాబాద్‌పై దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పసిగట్టిన నిజాం అప్పటి గవర్నర్‌ జనరల్‌ రాజగోపాలాచారితో సంప్రదించి దాడిని ఆపవలసిందిగా కోరాడు. ఇదే విషయాన్ని ఆయన నెహ్రుతో ప్రస్తావించి సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. అయితే గతంలో రెండు సార్లు హైదరాబాద్‌పై దాడికి సమాయత్తమై నెహ్రూ సూచన మేరకు వెనక్కి తగ్గిన పటేల్‌ ఈ సారి మాత్రం ఎవ్వరి మాటా వినకుండా సైన్యాలు బయలుదేరినాయని సమాధానమిచ్చాడు. అంతకు ముందు జరిగిన అంతర్గత సమావేశంలో హైదరాబాద్‌పై దాడికి దిగినట్లయితే ఇటు అరబ్‌ నుంచి విమానాలు బొంబాయిపై అటు కలకత్తాపై ఈస్ట్‌ పాకిస్తాన్‌ నుంచి సైన్యాలు బాంబుల దాడులు జరిపే అవకాశముందనే భయాన్ని మంత్రివర్గ సహచరులు వ్యక్తం చేయగా శ్యామప్రసాద్‌ ముఖర్జీ జవాబిస్తూ ‘భారత దేశాన్ని క్యాన్సర్‌’లా పీడిస్తున్న హైదరాబాద్‌ని దారికి తెచ్చుకోవాల్సిందే! కలకత్తా మీద దాడి జరిగితే బెంగాల్‌ ప్రజలు త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక బెంగాళీ నేతృత్వంలో (జయంత్‌ నాథ్‌ చౌదరి` హైదరాబాద్‌పై దాడికి దిగిన భారత సైనికాధికారి) విజయం సాధించామనే తృప్తి మిగులుతుందని చెప్పాడు. దీనికి తోడు హైదరాబాద్‌లో పటేల్‌ నియమించిన భారత గవర్నర్‌ జనరల్‌ కె.ఎం.మున్షీ హిందూభావజాలం ఉన్నవాడు, హైదరాబాద్‌ ‘లొంగి పోవడం’లో కీలక పాత్ర పోషించాడు కాబట్టి బిజెపి వాళ్లు హైదరాబాద్‌ని ‘ముస్లిం పాలకుల నుంచి హిందువులకు’ విముక్తిగా ప్రచారం చేస్తూ 17 సెప్టెంబర్‌ని పండుగలాగా చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.
    1998లో బిజెపి తాము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ‘విమోచన’ అనే పదం మొదటి సారిగా తెరమీదికి తెచ్చింది. ఈ విమోచన ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలనే డిమాండ్‌ ముందుకు తీసుకు వచ్చారు. నిజానికి 17 సెప్టెంబర్‌, 1948 నాడు ‘ముస్లిం పాలకుని నుంచి విముక్తి’ దొరికితే ఆ తర్వాత కూడా సర్వాధికారిగా నిజాం ఎలా కొనసాగాడు. దేశ విభజన సమయంలో మతకలహాలు జరిగి వేలాది మంది మృత్యువాత పడితే ఆశ్చర్యకరంగా ‘హైదరాబాద్‌పై పోలీసు చర్య’ సందర్భంగా హైదరాబాద్‌ రాజ్యంలో ఒక్క మతకలహాల సంఘటన జరగలేదనే అంశానికి ఎందుకు ప్రాధాన్యత నివ్వరు. ఏప్రిల్‌ 1, 1950నాడు నిజాంకు, భారత ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం మేరకు ప్రైవీ పర్స్‌ కింద ఏడాదికి ఎలాంటి పన్ను లేకుండా 50 లక్షల రూపాయల భరణం (నిజాంకు) చెల్లించడానికి, దేశంలో, విదేశాల్లో నిజాం ఎక్కడ పర్యటించినా ఆయనకు హైదరాబాద్‌ రాజుగా ‘హెచ్‌ ఇ హెచ్‌’ (హిజ్‌ ఎగ్జాల్టెడ్‌ హైనెస్‌) గానే, అన్ని బిరుదులు యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయం జరిగింది. అన్నీ యథావిధిగా కొనసాగి, 1950 జనవరి 25 వరకు ప్రభుత్వాధినేతగా, 26 జనవరి 1950 నుంచి అక్టోబరు 31, 1956 వరకు రాజ్‌ ప్రముఖ్‌గా కొనసాగాడు. ఈ గౌరవం కాశ్మీర్‌ని ఇండియన్‌ యూనియన్‌లో కలిపిన హరిసింగ్‌కు దక్కలేదనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.
    ‘విమోచన’ అంటే స్వేచ్ఛ లభించడం. కాని హైదరాబాద్‌ రాజ్య ప్రజలకు విమోచన ద్వారా స్వేచ్ఛ లభించక పోగా ‘పెనం నుంచి పొయ్యి’లో పడ్డట్టయ్యింది. గొర్రెలు తినేవాడు పోయి మిలిట్రీ రూపంలో బర్రెలు తినేవాడు వచ్చినట్టయ్యింది. మరఠ్వాడా, కర్నాటక ప్రాంతాల్లో భారత సైన్యం వేలాది మంది నిరాయుధులైన ముస్లింలను ఊచకోత కోసింది. ఈ విషయాన్ని నెహ్రూ నియమించిన సుందర్‌లాల్‌ కమిటీ తేల్చి చెప్పింది. కమిటీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ వాది అనే విషయాన్ని గ్రహించాలి. కొంతమంది మేధావులు యుద్ధం జరిగితే మరి ప్రాణనష్టం ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు. యుద్ధంలో మరణాలు ఏకపక్షంగా ఉండవనేది తెలిసిందే. ఈ యుద్ధానికి భారత ప్రభుత్వం సైనిక పరంగా ఎన్నో రహస్య పేర్లు (ఆపరేషన్‌ కాటర్‌పిల్లర్‌ అందులో ఒకటి) పెట్టినప్పటికీ బహిరంగంగా సైనిక పరిభాషలో ‘ఆపరేషన్‌ పోలో’, సామాన్య జనం భాషలో ‘పోలీస్‌ యాక్షన్‌’ అని ప్రచారంలో ఉండిరది. భారత ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ఆమోదించింది.
    అంతర్జాతీయ సమాజం నుంచి జరిగే దాడిని తప్పించుకునేందుకే హైదరాబాద్‌పై మిలిటరీ ద్వారా దాడి చేసినప్పటికీ దాన్ని పోలీస్‌ యాక్షన్‌గా పిలిచారు. భారత ప్రభుత్వ దాడిని ఖండిస్తూ నిజాం ప్రభుత్వం భద్రతా సమితికి ఫిర్యాదు చేసింది. భద్రతా సమితిలో కేసు విచారణకు వచ్చి భారత్‌పై చర్య తీసుకోవడం ఖాయం అనిపిస్తున్న దశలో నిజాంని ఒప్పించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో ‘విమోచన’ జరుపుతున్నారు కాబట్టి తెలంగాణలో కూడా ‘విమోచన’ పండుగ జరిపి తీరాలని బిజెపి డిమాండ్‌ చేస్తుంది. నిజానికి బిజెపి భాగస్వామ్య ప్రభుత్వాలున్న కాలంలోనే ఆ రాష్ట్రాల్లో ‘విమోచన’ ‘పండుగ’ జరపడం ఆరంభమయింది. అంతేగాకుండా మరఠ్వాడా, కర్నాటక ప్రాంతాలు భాషా పరంగా ఆయా రాష్ట్రాలతో మమేకమయ్యారు. నిజంగానే నిజాం పాలన నుంచి విముక్తి లభించిందని భావించారు. తెలంగాణలో పరిస్థితి అలా లేదు. ఇక్కడి ఆంధ్రప్రాంతం వారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాడు మమేకం కాలేక పోయారు. అందుకే ఇక్కడ ‘విమోచన’కు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
    ‘పోలిస్‌ చర్య’ను విలీనం అనడానికి కూడా వీల్లేదు. ఇరు వర్గాల సమ్మతి మేరకు కలిసి పోతే విలీనం జరిగినట్టు లెక్క. అలా కాకుండా భారత సైన్యం చర్యను ఆనాటి అంతర్జాతీయ పత్రికలన్నీ దురాక్రమణగా, దాడిగా, దండయాత్రగా, యుద్ధం, అణచివేతగానే రిపోర్ట్‌ చేశాయి. 17 సెప్టెంబర్‌ తర్వాత కూడా నిజాం పేరిటనే ఫర్మానాలు విడుదలయ్యాయి. కరెన్సీ కూడా నిజాం ప్రభుత్వమే 1953 వరకు ముద్రించింది. భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పునిస్తూ హైదరబాద్‌ స్వతంత్ర దేశం దానికి సంబంధించిన విషయాలు తమ పరిధిలోకి రావని స్పష్టంగా తీర్పునిచ్చింది. నిజానికి విలీనమంటే దాని వల్ల ఇక్కడి ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలి. కాని దురదృష్టవశాత్తు విలీనం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఇక్కడి ఉద్యోగాలు పోయాయి. పరాయి పాలనకు తెర లేచింది. ప్రజలు పోరాడి సాధించుకున్న భూమి భూస్వాముల పాలయింది. అన్ని అనర్థాలకు మూల కారణమైన విలీనాన్ని పండుగలాగా ఎలా చేసుకోగలం?
    1948 పోలీస్‌ యాక్షన్‌ తర్వాత పాలనలో తమదైన ముద్రను వేసేందుకు భారత ప్రభుత్వం మద్రాసు రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ రాజ్యానికి ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగులను దిగుమతి చేసుకుంది. వీరందరూ అప్పటి వరకు హైదరాబాద్‌ రాజ్యంలో ఉన్నతోదోగ్యాల్లో ఉన్న ముస్లింలు ఇంగ్లాండ్‌, అమెరికా, పాకిస్తాన్‌ లాంటి దేశాలకు వలసపోగా వారి స్థానాల్లో వచ్చినవారే! ఇలా వచ్చిన వారు హైదరాబాద్‌ రాజ్య (రాష్ట్ర) ప్రజలకు భాష రాదు, తెలివిలేదు. తాము అవి నేర్పడానికి వచ్చిన వారిగా భావించి తమ అహంభావాన్ని ప్రదర్శించారు. 60 ఏండ్ల నుంచి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మద్రాసు ప్రావిన్స్‌ నుంచి వచ్చిన ఉద్యోగులు ఉన్నత స్థాయిల్లో ఉద్యోగాలు సంపాదించారు. దాంతో కింది స్థాయి ఉద్యోగాలు కూడా తమ ప్రాంతం వారికే కట్టబెట్టేవారు. దీనికి నిరసనగానే 1952 సెప్టెంబర్‌లో ముల్కీ ఉద్యమం ఉధృతంగా ముందుకు వచ్చింది. డజన్‌కు పైగా విద్యార్థులు పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఇందుకు కారణమైన సెప్టెంబర్‌ 17ని పండుగలాగా చేసుకుందామా?
    ఒకవైపు హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు రామానంద తీర్థ, దిగంబరరావు బిందు, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి రామచంద్రరావుల నాయకత్వంలో నిజాం ‘బాధ్యతాయుత ప్రభుత్వం’ని ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేశారు. నిజాం నేతృత్వంలోనే ప్రజలకు తగిన ప్రాతినిధ్యం కలిగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ద్వారానే ప్రజలకు విముక్తి దొరుకుతుందని పోరాటాలు చేశారు. దొడ్డి కొమురయ్య మరణం నుంచి సెప్టెంబర్‌ 17 వరకు జరిగిన తొలి దశ పోరాటంలో ఒకవైపు నిజాం సైన్యాన్ని మరోవైపు కిరాయి మూక ‘రజాకార్ల’ను సాయుధంగా, సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ కాలంలోనే ‘నైజాం సర్కరోడా నాజిల మించినవురో!’ అనే పాటలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే 1948 లో కలకత్తాలో జరిగిన ప్లీనరీలో కమ్యూనిస్టుల స్వరం మారింది. నెహ్రూ ప్రభుత్వం బూర్జువా ప్రభుత్వం విస్తరణ కాంక్షతో ఉంది. అందుకు నెహ్రూ సైన్యాన్ని ఎదుర్కోవాలని తీర్మానించి 1951 అక్టోబరు వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ‘రంగు రంగుల మారి నెహ్రయ్య నీ రంగు బహిరంగమాయె’ లాంటి పాటలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే సాయుధ పోరాటం ద్వారా ప్రజలు సాధించుకున్న నాలుగువేలకు పైగా గ్రామాల విముక్తి, పేద రైతులు కబ్జాలోకి తెచ్చుకున్న పది లక్షల ఎకరాలు ఈ విలీనం కారణంగానే మళ్లీ భూస్వాములు కాంగ్రెస్‌ నాయకుల అవతారమెత్తి గుంజుకోవడం సాధ్యమయింది. కమ్యూనిస్టులు ‘ఆజాద్‌ హైదరాబాద్‌’ అనే నినాదమిచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కూడా 17ని పండుగలాగా చేసుకోవాలంటే ఆశ్చర్యంగా ఉంది. భారత సైన్యం హైదరాబాద్‌ రావడానికి ప్రధాన కారణం కమ్యూనిస్టులను అణచివేయడమే. తమని అంతమొందించడానికి పునాది పడ్డ ఆ రోజుని పండుగ ఎలా చేసుకుంటారో అర్థం కావడం లేదు.
    ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ నాయకత్వంలోని ‘రజాకార్ల’ను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా సహకరించాడు. రజాకార్లు తీవ్రంగా వ్యతిరేకించినా హైదరాబాద్‌ రాజ్య న్యాయ సలహాదారుగా సర్‌ వాల్టర్‌ మాంక్‌టన్‌ని కొనసాగించడం ఇందుకు నిదర్శనం. రజాకార్లంటే కేవలం ముస్లింలనే భావన ఉంది. ముస్లింలతో బాటుగా శ్యామ్‌ సుందర్‌, బి.ఎస్‌.వెంకటరావు, పీసరి వీరన్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో మతం మార్చుకున్న దళితులు, దొరలు, భూస్వాములతో పాటుగా వారి అనుచరగణం కూడా రజాకార్లలో ఉన్నారు. భైరాన్‌పల్లి మొదలు అప్పంపల్లి వరకు రజాకార్లు చేసిన అకృత్యాలను ఎండగట్టాల్సిందే. అందుకు తగ్గట్టుగానే కాసిం రజ్వీకి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాతనే రజ్వీ తన నేతృత్వంలోని ఎంఐఎం పార్టీని ఇప్పటి హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ తాత వాహిదుద్దీన్‌కు అప్పజెప్పిండు. రజ్వీకి ఉరిశిక్ష వెయ్యాల్సుండే అనే వారు ఆనాడు హైదరాబాద్‌ రాజ్యంలో ఉరిశిక్ష అమలులో లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉరిశిక్ష నిజంగానే అమలులో ఉండి ఉంటే నిజాంపై బాంబుదాడి చేసిన నారాయణ పవార్‌, గండయ్య, కొండాలక్ష్మణ్‌ బాపూజీలు బతికుండేవారు కాదు. హిందూ భావజాలం ఉన్నవాళ్ళకు 17 సెప్టెంబర్‌ ‘విమోచన’గా కన్పించవచ్చు. భారత, ఆంధ్ర పెట్టుబడిదార్లకు విలీనంగా కన్పిస్తూ ఉండవచ్చు. కానీ ‘పోలిస్‌ చర్య’ అనంతర పరిణామాల దృష్ట్యా తెలంగాణ ప్రజలవైపు నుంచి చూస్తే అది సర్వ అనర్థాలకు నాంది.
    ప్రజలకు ఏమాత్రం మేలు చేకూర్చని, పెనంలోంచి పొయ్యిలోకి నెట్టేసిన స్థితిని ఇప్పటికీ నిత్యం తిట్టుకుంటూ ప్రత్యేక తెలంగాణ ద్వారానే తమ బతుకులు బాగుపడుతయని బిడ్డలు ఉద్యమాలు చేస్తున్నారు. బూర్గుల రామకృష్ణారావు రూపంలో ఇక్కడి ప్రజలకు స్వయం పాలన వచ్చినట్టే వచ్చి ఆంధ్రా లాబీయింగ్‌ వల్ల మూన్నాళ్ల ముచ్చటే అయింది. చరిత్రలో తెలంగాణకు ఏమి ఇవ్వని 17 సెప్టెంబర్‌ కన్నా రాబోయే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజునే పెద్ద పండుగలాగా జరుపుకుందాం. అందుకోసం మనందరం మతాలకతీతంగా కొట్లాడుదాం.
`సంగిశెట్టి శ్రీనివాస్‌

      

No comments: