Monday 14 July 2014

భిన్న సంస్కృతికి అద్దం మఖ్దుమ్‌

భిన్న సంస్కృతికి అద్దం మఖ్దుమ్‌


    హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన భిన్న సంస్కృతుల మేలుకలయిక మఖ్దుమ్‌ మొహియిద్దీన్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మఖ్దుమ్‌ అభిమానులు ఆయన శతజయంతిని ఈ యేడు (2008) ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 61 యేండ్ల  జీవితంలో నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు అంకితమిచ్చాడు. మొక్కవోని ధైర్యంతో కులమతాలకతీతంగా పేదల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైంది. మఖ్దుమ్‌ రాజకీయ రంగంలోనూ, సాహిత్య, కళా రంగాల్లోనూ విశేషమైన కృషి చేశాడు. అయితే మఖ్దుమ్‌ రాజకీయ జీవితం కన్నా సాహిత్య జీవితమే ఎక్కువ విస్తృతమైనది, విలువైనది. ఆయన్ని ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గుర్తుంచుకొని పండుగలు చేసుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన సృజించిన సాహిత్యమే.
ఎం.ఎఫ్‌. హుసేన్‌, లక్ష్మాగౌడ్‌, సూర్యప్రకాశ్‌ లాంటి ప్రపంచ స్థాయి పెయింటర్లకు మఖ్దుమ్‌ మిత్రుడు, సన్నిహితుడు. వారి కళాత్మక చర్చల్లో పాల్గొంటూ వ్యక్తులుగా, పెయింటర్లుగా వారి ఆలోచనలకు పదును పెట్టే సలహాలిచ్చేవాడు మఖ్దుమ్‌. తన కళాత్మక దృష్టితో పెయింటింగ్స్‌ల్లోని దోషాల్ని ఇట్టే కనిపెడుతూ వాటిని సరిదిద్దుకోడానికి ఆర్టిస్టులకు సలహాలిచ్చేవాడు. 1940, 1950వ దశకంలో హైదరాబాద్‌ లోని యువ కళాకారులకు, సాహితీవేత్తలకు మఖ్దుమ్‌ ఒక కూడలి. ఆయన చుట్టూతా ఉన్న సమాజం, ప్రజా ఉద్యమాలతో అల్లుకున్న ఆయన జీవితం, సృజనశీలత మఖ్దుమ్‌ని ఒక తాత్వికుడిగా, మార్గదర్శకుడిగా, అభ్యుదయవాదిగా  తీర్చి దిద్దాయి. అది ఎందరో కళాకారులు, కవులకు స్ఫూర్తిగా నిలిచింది. హైదరాబాద్‌కే చెందిన ప్రపంచ ప్రసిద్ధ పెయింటర్‌ ఎం.ఎఫ్‌. హుసేన్‌పై మఖ్దుమ్‌ ప్రభావం చాలా ఉంది. యువకుడిగా హుసేన్‌ పెయింటింగ్స్‌ల్లోని మంచి చెడులు విశ్లేషించి సూచనలు, సలహాలు ఇచ్చేవాడు. ఓరియంట్‌ కేఫ్‌లో గంటల తరబడి చర్చలు చేస్తూ కాలం గడిపేవారు. అందుకే ఈ శత జయంతి సంవత్సరంలో హుసేన్‌ తన హైదరాబాద్‌లోని సినిమాఘర్‌లో మఖ్దుమ్‌ శత జయంతి ఉత్సవాల్ని (జనవరి, 26, 2008న) ఘనంగా నిర్వహించాడు. తనకు మఖ్దుమ్‌తో గల సాన్నిహిత్యాన్ని ఆహ్వానితులతో పంచుకుండు. కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, గాయకులు వయసుతో తేడా లేకుండా ఎంతో మంది హాజరైన ఈ సమావేశంలో హుసేన్‌ స్వయంగా షేర్‌ షాయరీలో పాలు పంచుకుండు.  ‘‘హయాత్‌ లేకే చలో, ఖయామత్‌ లేకే చలో, చలొ తో సారె జమానే కొ సాత్‌ లేకే చలో’’ అంటూ మఖ్దుమ్‌ స్వప్నాన్ని షాయరీలో చెప్పిండు. మఖ్దుమ్‌తో కలిసి రష్యా, చైనా లాంటి దేశాల్లో పర్యటించిన అనుభవాల్ని కూడా హుసేన్‌ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నాడంటే వారిద్దరికి గల గాఢమైన మైత్రి తెలుస్తుంది. ‘‘కాంటెంపరరీ ఆర్ట్‌ గురించి తెలిసిన కవులు ఆ కాలంలో హైదరాబాద్‌లో చాలా తక్కువ. అయితే మఖ్దుమ్‌కు ఇవన్నీ బాగా తెలుసు. మా ఇద్దరికీ ఉర్దూ కవిత్వమంటే ప్రేమ అధికం’’ ఇవి మేమిద్దరం తరచుగా కలుసుకోవడానికి కారణమయ్యేవని హుసేన్‌ అభిప్రాయం. ‘‘తాను నారాయణగూడా ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ప్రాంతంలో చిన్న రూమ్‌లో పెయింటింగ్‌ వేస్తున్నప్పుడు మఖ్దుమ్‌ వచ్చి తన పెయింటింగ్స్‌ని చూసి మెచ్చుకోవడం, నగరాన్ని  ఓ పక్షి విహంగ వీక్షణం చేస్తుందంటూ ఇచ్చిన కితాబు’’ని శతజయంతి సందర్భంగా లక్ష్మాగౌడ్‌  గుర్తు చేసుకుండు. అంటే యువతరంపై మఖ్దుమ్‌ చూపించిన ప్రేమ, దాని ప్రభావం, స్ఫూర్తి అర్థమవుతుంది.  ప్రగతిశీల రచయితల ఉద్యమాన్ని భారతదేశంలో నిర్మించిన సయ్యద్‌ సజ్జాద్‌ కూతురు నాదిరా బబ్బర్‌ కూడా ఈ శత జయంతి ఉత్సవంలో పాల్గొంది.ఇదే సమావేశంలో మఖ్దుమ్‌ మిత్రుడు, కవి, ఫోటోగ్రాఫర్‌ కూడా అయిన షా అలీ తన వద్దున్న అత్యంత అరుదైన మఖ్దుమ్‌ ఫోటోలను ప్రదర్శించిండు. ఈ అరుదైన ఛాయా చిత్రాలన్నింటిని సేకరించి మఖ్దుమ్‌ అల్బమ్‌ వేసినట్లయితే ఒక ప్రపంచ స్థాయి కవికి, దార్శనికునికి కొంతమేరకైన సరైన నివాళి అర్పించిన వారమవుతాము. ఈ శత జయంతి సంవత్సరములోనైనా ఈ పని పూనికతో చేయాల్సిన అవసరముంది.
    భారతదేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. సినిమా రంగంలో కూడా మఖ్దుమ్‌ మొహియుద్దీన్‌ రాసిన పాటలకు మంచి గుర్తింపు ఉండేది.మఖ్దుమ్‌ రాసిన పాటలు ఆయన పేరిట చలామణి అయ్యేవి తక్కువే అయినప్పటికీ వేరే రచయితలు తమవిగా చెప్పుకొని మఖ్దుమ్‌ పాటలు వాడుకుండ్రు. దీనిపై మఖ్దుమ్‌ కుమారుడు కోర్టుకుపోయి విజయం సాధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌, కె.ఎ. అబ్బాస్‌ లాంటి మిత్రులతో మఖ్దుమ్‌కు గల సాన్నిహిత్యం ఆయన్ని సినిమా పాటలు రాసేలా ప్రేరింపిచాయి. సినిమా పాటలు కూడా ఆయన కవిత్వం లాగే ప్రజాజీవితం నుంచి స్ఫూర్తి పొందినవే. సమాజంపై గల ఆర్తిని ప్రతిబింబించేవే. అలవోకగా మిత్రుల మధ్య మాటల సందర్భంగా వచ్చే పదాలే మఖ్దుమ్‌ పాటలుగా రూపొందేవి. 1963లో మిత్రుడు, కవి షాహిద్‌ సిద్దిఖీ, గాయకురాలు షకీలా బానో భూపాలీల మధ్యన మాటల సందర్భంగా వచ్చిన విషయాలే  ‘‘ఫిర్‌ చిడి రాత్‌ ఫూలోకి’’ పాటగా మారింది. ఈ పాటను 1980వ దశకంలో నవాబీ జీవితం పోయి బతకడం కనాకష్టంగా మారిన ముస్లిం జీవితాల్ని ప్రతిబింబిస్తూ తీసిన ‘బజార్‌’ సినిమాలో ఉపయోగించుకోవడం జరిగింది. విజయ్‌ తల్వార్‌ నిర్మాతగా ఖయ్యామ్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్మితాపాటిల్‌, నసీరుద్దీన్‌ షా, ఫరూక్‌షేక్‌, సుప్రియా పాథక్‌లు ఇందులో నటించారు. ఈ పాటను ఫరూక్‌షేక్‌, సుప్రియా పాథక్‌లపై చిత్రీకరించారు. లతా మంగేష్కర్‌, తలత్‌ అజీజ్‌లు గానంతో పాటకు జీవమిచ్చిండ్రు. అలాగే ‘గమన్‌’ సినిమాలో ‘‘ఆప్‌కి యాద్‌ ఆతీ హై రాత్‌ బర్‌’’ అనే పాట కూడా మఖ్దుమ్‌ రాసిందే. ‘ఛ ఛ చ’ó సినిమాలో ఎక్‌ చమేలికి మండ్వే తలే పాటను రఫీ, ఆశాభోంస్లేలు గానం చేసిండ్రు. ఇలా ఎన్నో పాటలు ఆయనకి కీర్తిని తెచ్చిపెట్టాయి. అయితే దురదృష్టవశాత్తు వివిధ సంస్థలు ఆయన రాజకీయ జీవితంపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాయి. అలాగాకుండా ఆయన సాహితీ సృజనకు కూడా సమాన ప్రాతినిధ్యమిచ్చినట్లయితే ‘‘భారతీయ సాహిత్య నిర్మాతలు’’ శీర్షికన మఖ్దుమ్‌ సాహిత్య జీవితాన్ని సాహిత్య అకాడెమీ ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో అచ్చేసినప్పటికీ తెలుగులోకి తర్జుమా కాకపోవడం మన దౌర్భాగ్యం. ఇప్పటికైనా అందుకోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ శత జయంతి సందర్భంగానైనా ఆ పుస్తకాన్ని తీసుకు రావాలి. అలాగే ఆయన కవిత్వ పుస్తకాలు ‘‘సుర్క్‌ సవేరా, గులోతారొ’ కూడా అన్ని భాషలవారికి అందుబాటులోకి రావాల్సిన అవసరముంది.
    మొన్న మే నాలుగో తేదిన (2008) కెనడాలోని మాంట్రియల్‌లో సౌత్‌ ఏషియా రీసెర్చ్‌ అండ్‌ రీసోర్స్‌ సెంటర్‌, పాకిస్తానీ`కెనడియన్‌ సొసైటీ ఆఫ్‌ క్యుబెక్‌, అల్టర్నేటివ్స్‌ (మాంట్రియాల్‌) సంస్థలతోపాటుగా, దయారామ్‌ వర్మ, హిత రఘునాథన్‌, ఫిరోజ్‌ మెహ్దీలు విజయవంతంగా మఖ్దుమ్‌ శతజయంతిని నిర్వహించి డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మఖ్దుమ్‌పై గల అభిమానానికి ఇది  ఒక్క చిన్న ఉదహరణ మాత్రమే.  
    - సంగిశెట్టి శ్రీనివాస్‌

No comments: