Friday 8 August 2014

Gadiyaram: never stopped tickling




చరిత్రను చిత్రికగట్టిన గడియారం

    తెలంగాణ పునర్వికాసోద్యమానికి ఊపిరులూది, చైతన్యాన్ని ప్రోది చేసిన పండిత పరిశోధకుడు, సంపాదకుడు, గతానికి-వర్తమానానికి వారధి గడియారం రామకృష్ణశర్మ. హైదరాబాద్‌ రాష్ట్రంలో తెలుగు సాహిత్యానికి ప్రాణంపోసిన ‘సుజాత’ పత్రిక సంపాదకులుగా, శాసనాల పరిష్కర్తగా, సంస్కర్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, సారస్వసత పరిషత్తు నిర్వాహకుడిగా, సభలు, సమావేశాల నిర్వాహకుడిగా, రేడియో ప్రయోక్తగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా తెలుగు జాతికి ముఖ్యంగా తెలంగాణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను రికార్డు చేసే విధంగా కొమర్రాజు లక్ష్మణరావు స్ఫూర్తి, ప్రోత్సాహంతో ‘తెలంగాణ శాసనాలు’ మొదట 1935లో ‘లక్ష్మణరాయ పరిశోధక మండలి’ పక్షాన ఆదిరాజు వీరభద్రరావు ప్రచురించారు. దూపాటి వెంకటరమణాచార్యులు, ఆదిరాజు వీరభద్రరావుల పరంపరను కొనసాగిస్తూ అనంతర కాలంలో ‘తెలంగాణ శాసనాలు’ రెండో భాగాన్ని గడియారం రామకృష్ణశర్మ సంపాదకత్వంలో ప్రచురించారు. ‘‘..83 శాసనములకు పండిత గడియారం రామకృష్ణశ్మ గారు నకళ్ళు వ్రాసి యున్నారు. శ్రీ రామకృష్ణశర్మ గారి చరిత్రాభిమానమును, చారిత్రక కోవిదత్వమును, ఉత్సాహశీలమును, రచనా నైపుణ్యమును ఈ గ్రంథము వేయినోళ్ళ జాటు చున్నది. శ్రీ రామకృష్ణశర్మగారు ఈ గ్రంథ సంపాదకీయ భారము వహించి మమ్ముల కృతకృత్యుల జేసియున్నారు. సంస్కృతాంధ్ర కర్ణాటకాంగ్లేయ భాషలయందు పండితులును, విశేషించి శాసనములను వ్యాఖ్యాన సహితముగా ఇంగ్లీషునందును, తెలుగునందును ప్రకటించి, చరిత్ర పరిశోధన పండిత ప్రకాండుల మెప్పును గడిచినవారు శ్రీ రామకృష్ణశర్మగారు’’ అని ఆయన ప్రతిభను పరిశోధక మండలి గౌరవ కార్యదర్శి ఆదిరాజు వీరభద్రరావు తమ ‘పీఠిక’లో పేర్కొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఆలంపూరు శిల్పసంపద గురించి 1946లోనే పుస్తకాన్ని వెలువరించడమే గాకుండా, శిథిలావస్థలో ఉన్న వాటిని, ముంపుకు గురైన గుడులను యథావిధిగా ఒడ్డుకు తరలించడంలో ఈయన కీలక భూమిక పోషించారు. కేవలం శాసనాలే గాకుండా తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. మిత్రులు, ఆప్తులు సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో 1950లో ‘సుజాత’ సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు. ఇందులో ఆదిరాజు వీరుభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణరావు, సామల సదాశివ (కథలు), మల్లంపల్లి సోమశేఖరశర్మ, తదితర పండితుల రచనలతో పాటుగా, యువ కవులు, కథకులు ఇది వేదికగా ఉండిరది. దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ కవిత మొదటిసారిగా ఈ పత్రికలోనే ప్రచురితమైంది. 
    ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో ప్రత్యేకంగా స్మరించుకోవాల్సిన సంచిక ‘సుజాత`తెలంగాణ సంచిక’ ఇందులో తెలంగాణకు సంబంధించిన చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, పత్రికా రంగాలపై ఆయా విషయాల్లో ప్రసిద్ధులైన వ్యక్తులచే విలువైన వ్యాసాలు రాయించి వెలువరించారు. ఈ సంచికను పునర్ముద్రించినట్లయితే తెలంగాణ వైభవము, ప్రతిభ అందరికీ తెలిసి వస్తుంది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి 1953లో ఆలంపురంలో ‘ఆంధ్రసారస్వత సభలు’ నిర్వహించారు. ఈ సభల్లో శ్రీశ్రీ మొదలు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వరకు తెలుగునాట పేరున్న సాహితీవేత్తలందరూ పాల్గొన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైలుని నడిపించారంటే ఆ సభలు ఎంత ఘనంగా నిర్వహించారో తెలుసుకోవచ్చు. ఈ సభల్లో సురవరం ప్రతాపరెడ్డికి జరిగిన అన్యాయం చర్చనీయాంశమైంది. రాజకీయ రంగంలో ఆయనకు అన్యాయం జరిగినా సాహిత్య రంగంలో ఈ సభ నిర్వహణ ఆ ప్రాంతానికి చెందిన సురవరంపై గౌరవాన్ని పెంపొందించింది. ఈ సమావేశాల్లో చేసిన చర్చలు తర్వాతి కాలంలో కేంద్రం ఏర్పాటు చేసిన ‘సాహిత్య అకాడెమీ అవార్డు’ ప్రతాపరెడ్డికి దక్కేలా చేశాయి. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ఈ పురస్కారం లభించింది. ఈ సభల్లోనే కాళోజి ‘నా గొడవ’ మొదటి సారిగా ఆవిష్కృతమైంది. ఆళ్వారుస్వామి తమ దేశోద్ధారక గ్రంథమాల తరపున దీన్ని ప్రచురించారు.


    మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన స్వాతంత్య్రోద్యమంలో గడియారం రామకృష్ణశర్మ పోషించిన పాత్ర సాహసోపేతమైనది. మహబూబ్‌నగర్‌ సరిహద్దు జిల్లా కర్నూలు నుంచి రేడియో కేంద్రాన్ని నిర్వహించాడు. అరుణా అసఫలీ లాంటి వారి ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ రేడియోలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొంటున్న వీరుల త్యాగాలు, పోరాట పటిమ గురించి వార్తలు ప్రసారం చేసేవారు. ఈ వార్తల సేకరణకు స్వయంగా రామకృష్ణశర్మ రహస్యంగా జిల్లాలో పర్యటించే వారు. పోలీసుల నిఘా తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయన ఉద్యమకారుల కోసం రేడియోను ధైర్యంగా నడిపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసింది కూడా గడియారమే. ఆలంపూరు తాలూకాలోని చెన్నిపాడు గ్రంథాలయం, ఉండవెల్లిలోని శ్రీ సరస్వతీ విలాస పుస్తక భాంఢాగారాలను రూపుదిద్దింది ఈయనే. అలాగే 1946లో సిర్పూర్‌లో నిర్వహించిన గ్రంథాలయ మహాసభల్లో సురవరంతో పాటుగా ఈయన కూడా చురుగ్గా పాల్గొన్నాడు. 
    తనకు అత్యంత సన్నిహితుడైన సురవరం ప్రతాపరెడ్డికి దక్కినట్లుగానే రామకృష్ణశర్మకు స్వీయ చరిత్ర ‘శతప్రతం’కు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కింది. ఈ పుస్తకం అలనాటి తెలంగాణకు దర్పణం. స్వీయ చరిత్రతో పాటుగా దశరూపసారం, భారతదేశచరిత్రం, ఆలంపుర క్షేత్ర చరిత్ర, ఆలంపురం శిథిలములు, తెలుగుసిరి, బీచుపల్లి క్షేత్ర మహాత్మ్యం, ఉమామహేశ్వర చరిత్రం, భారతీయ వాస్తు విద్య తదితర గ్రంథాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.
    1919లో అనంతపురం జిల్లా కదిరిలో జన్మించిన శర్మగారు చిన్నప్పుడే ఆలంపూరులో స్థిరపడ్డారు. తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి, సంస్కృతికి చిరస్మరణీయమైన సేవలందించారు. మూఢాచారాల్ని చీల్చి చెండాడం గురువు, శతావధాని వేలూరి శివరామశాస్త్రి నేర్చుకున్న శర్మ ప్రతిభకు గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ని  ప్రకటించింది. ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ, రాష్ట్ర గ్రంథాలయోద్యమానికి, శాసన పరిశోధన రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆయన నిర్వహించిన సుజాత పత్రిక అన్ని సంచికలను పునర్ముద్రించినట్లయితే నేటి తరం పరిశోధకులకు, పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణను కార్యరంగంగా ఎంచుకొని ఆరు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా వివిధ రంగాల్లో బహుముఖీన ప్రతిభతో పనిచేసిన గడియారం స్ఫూర్తి నేటి తరానికి అవసరం. శర్మ గారు గతించి అప్పుడే ఎనిమిదేళ్ళు గడిచాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భంగా ఆయన చేసిన కృషిని ప్రభుత్వం కొనసాగించాలి. అదే ఆయనకు సరైన నివాళి. ఆయన వర్ధంతి జూలై 27 (తిథి ప్రకారం) సందర్భంగా నివాళి. 
                                                                                                                             
-సంగిశెట్టి శ్రీనివాస్‌

No comments: