పోలీస్ యాక్షన్ ముందూ వెనకా…ఆళ్వార్ స్వామి
సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ఖ్యాతిని, శక్తిని, ఔన్నత్యాన్ని, దశదిశలా వ్యాపింప జేసింది. తప్పనిసరిగా ఈ పోరాటం చరిత్రలో కీలకఘట్టం. ‘సాయుధ పోరాటం’ ప్రారంభించిన మంచికీ, ఆపేసిన చెడుకూ రెండిరటికీ, అనంతర కాలంలో పటేల్ సైన్యం చేతిలో ప్రాణాలర్పించిన త్యాగానికీ ఈ ఉద్యమం మైలురాయి. అయితే చాలా మంది కమ్యూనిస్టులు తమ ప్రయాణాన్ని ఈ మైలురాయి నుంచే ప్రారంభించి, గిరికీలు కొడుతూ మళ్ళీ అక్కడికే వచ్చి ఆగి పోతుండ్రు. ‘సాయుధ పోరాటమే’ అన్నింటికి మూలం, అభ్యుదయ చరిత్రంతా దీనితోనే ఆరంభం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను కూడా ఇక్కడి నుంచే లెక్కగడుతుండ్రు. ఇప్పటికీ బిజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ‘సాయుధ పోరాటం’ నిజాం రాజు, ముస్లింల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిందనే భావనను తమ చేతలు, ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తున్నారు.దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, దోపిడీ దారులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, పీడన నుంచి విముక్తి కోసం చేసిన సాయుధ పోరాటాన్ని నేడు ఆయా పార్టీలు తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా వక్రీకరిస్తున్నారు. సిపిఎం పార్టీ, ప్రజాశక్తి ప్రచురణ సంస్థలు తెలంగాణ సాయుధ పోరాటం విశాలాంధ్ర కోసం జరిగిందని ఏటేటా పుస్తకాలు అచ్చువేస్తూ, అందులో పాల్గొన్న వ్యక్తుల చేత చెప్పిస్తున్నారు. అదే చరిత్రగా ప్రచారం చేస్తున్నారు. సాయుధ పోరాటంతో ఏమాత్రం సంబంధంలేని బీజేపి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు చేసిన పోరాటంగా ప్రచారం చేస్తున్నారు. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ పోలీస్ యాక్షన్‌ని హైదరాబాద్ స్వాతంత్య్ర దినంగ పరిగణిస్తూ పండుగలు నిర్వహిస్తోంది. నిజానికి ఈ పోలీస్ యాక్షన్ వల్ల వేలాది ముస్లిం ప్రాణాలను, వందలాది హిందువులైన రజాకార్లను, అంతకుమించి సాయుధ పోరాట యోధుల్ని బలిగొన్నది. ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువలేకుండా అమానవీయంగా వ్యవహరించిన ఈ చర్యను పండుగలా జేసుకోవడమంటే వారి జెండా రంగులకు అనుకూలంగా చరిత్రను వక్రీకరించడమే!
కమ్యూనిస్టులు, కాంగ్రెస్, రజాకార్లు, ఆర్యసమాజ్, ఇత్తెహాదుల్, ఆంధ్రమహాసభ, సోషలిస్టులు, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఇలా తెలంగాణ రాజకీయ కార్యచరణను నడిపించిన అన్ని సంస్థల ఉద్యమాలు, వాటి నాయకత్వం, అవి పోషించిన పాత్రల గురించి కథల్లో విశ్లేషణ, విమర్శనాత్మక ధోరణిలో ఆళ్వారుస్వామి దర్శించిండు.
‘పరిగె’ కథలో తల్లిని కోల్పోయి, చెల్లెలు, వ్యాదిగ్రస్తుడైన తండ్రిని సాకే బాధ్యతలు చేపట్టిన వంతు మాదిగ మల్లయ్య పరిగె ఏరుకున్నందుకు అన్యాయంగా మూడ్నెల్ల శిక్ష పడ్డ విషయాన్ని రాసిండు. నిజానికి మల్లయ్య దొరలకు బానిసగా ఉండాల్సిన పరిస్థితిని ‘వంతు మాదిగ’ ‘హోదా’ కల్పించింది. ఈ వంతుమాదిగ పనిచేయడం వల్ల కనీసం ఒక్క పూట కూడా గడవని పరిస్థితి ఉండడంతో ఆఖరికి తనకు లేకున్నా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని రక్షించుకోవడానికైనా ఇంత గంజి కావాలని, దాని వెతుకులాటలో భాగంగా కళ్ళం ఊడ్చిన ఊరవతలి పొలాల్లో ‘పరిగె’ ఏరుకొని తీసుకుపోతుండగా ఒక దొర అడ్డుబడి అది తన పొలం నుంచి దొంగతనం చేసినావని నిందమోపుతూ మొదట ఊరి భూస్వామి దగ్గర, మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పడం జరుగుతుంది. మల్లయ్యను తమ అధీనంలోకి తీసుకొని చావదెబ్బలు కొట్టడమే గాకుండా ఆయనకు బదులుగా చెల్లెలుని ‘వంతు’ పనిమీద పక్కూరికి పంపిస్తారు. తండ్రి చావుబతుకుల మధ్య ఉన్నడని చెబుతున్నా దొర వినకుండా ఆయన అనుచరుల తోటి ‘ముసలి తొక్కు’ ఇయ్యాళ కాకున్నా రేపు సచ్చేటోడే కదా అని అవమానిస్తారు. ఇవన్నీ సాయుధ పోరాటం ఆరంభంలో బలవంతంగా ‘వెట్టి’ చేపించుకుంటున్న దొరల, భూస్వాముల, దేశ్‌ముఖ్‌ల నిత్య కృత్యాలు. చివరికి తండ్రి చనిపోయి, చెల్లి ఎక్కడికి పోయిందో తెలియక మూన్నెళ్ళ శిక్షకు గురై మానసిక చిత్రవధ అనుభవించిన మాదిగ మల్లయ్య క్షోభను ఇందులో అక్షరీకరించాడు.
‘మెదడుకు మేత’ కథలో రజాకార్లు, ఆర్యసమాజ్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు ఎవరికి వారు హైదరాబాద్ రాజ్యంలో చేస్తున్న, చేపడుతున్న భావజాల ప్రచారం, కార్యకలాపాల్ని లెక్కగట్టిండు. ఆర్యసమాజ్, ఇత్తెహాదుల్ వారు ఎట్లా మతకలహాలు పెంచి పోషిస్తారో కూడా చెప్పిండు. ఆర్యసమాజం, హిందూ మహాసభ సమావేశాలు, ‘ఓం’ రaండాకు దండాలు, కాంగ్రెసు సత్యాగ్రహాలు, ఇంగ్లీషు మిలిటరీ, సుభాష్ చంద్రబోస్ పిలుపు, పాకిస్తాన్‌కు తురకలను పంపించాలంటూ ‘‘ఉఠావో బోర్యా బిస్తర్` ఏ రోనా పీట్నా క్యాహై’ అంటూ ఆర్యసమాజ్ ఆవాజ్’ పాటల్ని, మత గ్రంథాల గురించీ ఈ కథలో చర్చించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దోపిడి, దౌర్జన్యం, కుల, మత, వర్గ, వర్ణ రహిత సమాజం స్థాపించబడుతుందని ఆశించాడు. అట్లా కాకుంటే ‘‘ఇంగ్లీషు వాండ్ల పాలనకు, కాంగ్రెస్ పాలనకు భేదమేముంటుంది?’’ అని కూడా తేల్చిసిండు.
‘మాకంటే మీరేం తక్కువ’ కథలో సాయుధ రైతాంగ పోరాట కాలంలో ముందున్న వారు తర్వాతి కాలంలో పదవులు అలంకరించి అప్పుడూ, ఇప్పుడూ రెండుసార్లూ దోసుకున్నారు అనే భావన వచ్చే విధంగా వ్యాఖ్యానించాడు. ఇల్లనక, ముంగిలనక, పెండ్లాం, పిల్లలనక పోరాట కాలంలో ముందున్న వారు పోరు ముగిసిన తర్వాత తమ స్వీయ ప్రయోజనాలకు, పదవులకు ప్రాధాన్యత నిచ్చారని వాపోయాడు.
‘కాఫిర్లు’ కథలో ఇత్తెహాదుల్‌ముసల్మీన్ భావజాలంతో ఉన్నవారు, అధికారులతో సత్సంబంధాలున్నవారు సైతం భూస్వాములు, దొరలు, దేశ్‌ముఖ్‌లు ఆధిపత్యాన్ని అనివార్యంగా శిరసావహించాల్సి రావడాన్ని గురించి రాసిండు. లెవీలు, పన్నుల పేరిట ప్రభుత్వాధికారులు ఒక వైపు దొరలను మినహాయించి సామాన్య రైతులపై బలవంతంగా వసూలు చేసే విధానాన్ని గురించి కూడా చెప్పిండు. అంతా ‘పైస’కు లొంగేవారే తప్ప ఎవ్వరిలోనూ నీతి, న్యాయం లేకపోవడాన్ని కూడా రికార్డు చేసిండు. అంటే ఆనాటి సమాజంలో నిజాం హైదరాబాద్‌లో ఉండి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా ఎదిగితే గ్రామాల్లో భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, దేశ్‌పాండ్యాలు పేద ప్రజలు, రైతుల పొట్టలు గొట్టి, వాళ్ళ సంపదను కొళ్ళగొట్టేవారు. మరో వైపు అధికారగణం దండుగలు, లంచాలు, లెవీలు, పన్నులు, పట్టీల పేరిట వివిధ సుంకాలు వసూలు చేస్తూ పేద రైతాంగాన్ని పీడిరచేవారు. అది హిందువుల ఇళ్లైనా, మహమ్మదీయుల ఇళ్లైనా అర్ధరాత్రి పూట సోదాలకొచ్చి దొరికింది దోసుకుపొయ్యే తీరుని, వారికి దొరల గడీల్లో ‘ఇంతెజాము’లు జరిగే తీరుని కూడా ఇందులో ఆళ్వారుస్వామి రాసిండు. దీన్ని బట్టి ఆనాటి రాజకీయ స్థితిగతులను అంచనావేయవచ్చు.
‘అంతా ఏకమైతే’ కథలో సమాజంలోని అన్ని వర్గాలు కలిసి దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిండు. ‘అంతా ఏకమై అన్యాయాల నెదుర్కోవాలి. కష్టాలను బాపుకోవాలె. సంఘ బలం వృద్ధి చేసుకోవాలె’’ వైష్ణవులు సైతం దొరల దమనకాండను అనుభవించారు. అన్నడు. ప్రజల మేలు కోసం ఉద్యమాలు చేసినందుకు చాలా సార్లు ‘రమాణరెడ్డి’ అనే మంచి వక్త, నాయకుడిపై జరిగిన దాడిని కూడా ఇందులో ప్రస్తావించాడు. అంటే దొరలు హత్యలకు కూడా వెనుకాడే వారు కాదు అని తెలుసుకోవచ్చు. ఈ దొరల దౌర్జన్యానికి సమాజంలోని అన్ని వర్గాలు బలయ్యాయని చెప్పిండు. ‘‘వారి దౌర్జన్యాల నుండి తప్పించుకున్నదెవరు? బ్రాహ్మణుల హాహాకారాలు యిప్పుడే మీరు విన్నారు. వైశ్యుల స్థితి వేరే చెప్పనవసరం లేదు. రైతులగతి శ్రీ సుబ్రహ్మణ్యం గారు తెల్పారు. గ్రామ పెత్తందార్ల వల్ల లంచాలు తినేవారితో, తప్ప తాగి అమాయక ప్రజలను, న్యాయాన్ని కోరే ప్రజలను లాఠీలతోటి బాది, యిండ్లు పైర్లూ దోసుకునే వారితో మనం పోరాడవలసి ఉన్నది’’ అంటూ ఎవరి మీద ఎందుకు ప్రజా పోరాటం చేయాలో రమణారెడ్డి పాత్ర ద్వారా చెప్పిస్తాడు.
‘ఆలుాకూలి’ కథలో పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొన్న కార్మికుడు గ్రామంలో జరిగే అన్యాయాల్ని ఎదిరించడానికి చేసిన ప్రయత్నాలను రికార్డు చేసిండు. దీని ద్వారా గ్రామాల్లోకి వస్తున్న చైతన్యం కూడా తెలియవచ్చింది. ఆనాటి పట్టణాల్లోని కార్మికుల ఉద్యమాల గురించి ఇలా రాసిండు. ‘‘వేలమంది కూలీల్లో నిటారుగా నిలబడి జయ నినాదాలు కొట్టడం, జెండా పట్టుకొని ఊరేగింపులో ముందు నడవడం, జెండా లాగుకొనవచ్చిన పోలీసువాడిని అదిలిస్తే అంతదూరాన పడివోపడం, అంతా హేళనగా నవ్వుతుంటే గర్వంతో ముందుకు నడవడం’’ అంటూ ఉద్యమ తీరుని, పోరాట యోధుల గురించీ రాసిండు.
నవలిక లాంటి పెద్ద కథ ‘గిర్దావరు’ కథలో సాయుధ పోరాటం ముగిసిన తర్వాత కాంగ్రెస్‌టోపీ పెట్టుకొని గ్రామాల్లోకి పున: ప్రవేశం చేసిన దొరలు భూములపై, రైతాంగంపై అజమాయిషీని చలాయించే రీతిని చెప్పిండు. కమ్యూనిస్టులు పంపిణీ చేసిన భూమిని రజాకార్ల అంతం తర్వాత దొరలు గుంజుకొని అమ్ముకున్న సంగతులను, యూనియన్ మిలిటరీ చంపేసిన సాయుధ వీరుల గురించీ, నిజాయితీ పరుడైన గిర్దావరు దొరల ఆగడాలను అడ్డుకున్న తీరునీ ఈ కథలో చెప్పిండు.
‘చిన్నప్పుడే’ కథలో సంగం పంతులు బడి పెట్టడం, ఆంధ్రమహాసభ కార్యకర్త ‘వెంకటయ్య’ గ్రామాల్లో పర్యటనలు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిన తీరు, ఆయన తీసుకొచ్చిన చైతన్యంతో అప్పటి వరకు పెత్తందార్లు నిందలు, నేరాలు మోపి లాగే దండుగలు, లంచాలకు అడ్డుకట్ట పడిరది. చిన్న పెద్ద మర్యాద లేకుండా ప్రతి వారినీ, ప్రతి స్త్రీని దుర్భాషలాడే తీరుకు ఉద్వాసన జరిగింది. కూలీ పనివారికి రెండు పూటలా తిండి దొరికేలా చేసిన కార్యకలాపాలు ఈ కథలో రికార్డయ్యాయి. దున్నపోతు బుస్సుమన్నదని ఒకరి దగ్గర, కోడెదూడ చేలో బడ్డదని మరొకరి దగ్గర, ఇంకొకరి బెర్రెను బందెల దొడ్లో పెట్టించి దండుగలు, దోసాలు వసూలు చేసే ఊరి పటేలు సంగతీ, సర్కారీ రకం కట్ట లేదని బండలెత్తించడం, కట్టెపుల్లలు ఏరుకుందని చెప్పి సిగపట్టుకొని స్త్రీని కొట్టిన దొర సంగతీ, అందుకు అడ్డం వచ్చిన భర్తని బాదిన విషయాన్ని ఈ కథలో చిన్నపిల్లల ముచ్చట్లతోటి చెప్పిస్తాడు.
‘ఆక్షేపణ లేదు’ అనే మరో కథలో మాదిగ్గూడేనికి చెందిన దొర జీతగాడు శాయన్న గురించి చెప్పిండు. దొర దగ్గర అప్పు తీసుకున్నందుకు తిట్టడం, వడ్డీతో సహా డబ్బులు కట్టమని వత్తిడి చేయడం, చివరికి శాయన్న హైదరాబాద్ పోయి అంటరాని తనంలేని జీవితం గడపి ఊరికొచ్చినప్పుడు దొర మనుషులు పట్టుకొని చంపిన తీరుని కథలో చెప్పిండు. ‘‘వచ్చినాడని చెబుతున్నావు బద్మాష్, రెక్కలు విరిచి పట్టుకురా లం….’’. వెంటనే బడే సాహెబు మాదిగ గూడెం పోయిన శాయన్నను పట్టుకొని కొండల్‌రెడ్డి వద్దకు తెచ్చి నిలబెట్టాడు. సాయన్న, కొండల్‌రెడ్డి పిలిపించాడని తెలుపగానే మాదిగగూడెంలో భయం మొదలైంది. బండలెత్తి రూపాయిలు వసూలు చేస్తాడని అంతా జ్యోతిషం చెప్పారు. శాయన్నను చూడగానే కొండల్‌రెడ్డి ‘‘ఓహో! మొగోడి రంగే మారిందోయ్ ఏమిరా నీ అప్పు ఎవడు చెల్లిస్తాడురా? లం.. కొడుకును రూపాయిలు ఇచ్చేదాకా కదలనీయకు’’ అని బడాసాహెబును చూస్తూ’’ దొర చెప్పిన సంగతినీ చివరికి దొర సాయన్నను చంపి పోలీసోళ్ళతో కుమ్మక్కయి కేసు మాఫీ చేయించుకున్న తీరుని, దొర వెటకారాన్ని తన బాధను కలిపి రచయిత చిత్రించాడు.
మరో కథ ‘పరిసరాలు’లో మిలిటరీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు భాషను అధికార భాషగా చేసే ప్రయత్నంలో అందరూ తెలుగు నేర్చుకోవాలనే నియమాన్ని తీసుకొచ్చారు. ఇట్లా తెలుగు నేర్చుకోలేక ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్న ఊరికి దూరమై, ఇన్నాళ్ళు పాటించిన నీతికి దూరమైన ముస్లిం యువకుని గాధను చెప్పిండు. అవినీతి, అన్యాయం, రైతులపై దమనకాండ, కార్కికుల ఉద్యమాలు, దొరల రాజకీయాలు, అధికార దాహం, సమాజంలోని ప్రతి ఒక్కరినీ ప్రభుత్వానికి, దోపిడిదారులకు వ్యతిరేకంగా ఏకం చేసిన రైతాంగ పోరాటం, మత విద్వేషాన్ని రగిలించే ఇత్తెహాదుల్ముసల్మీన్, ఆర్యసమాజ్, మిలిటరీ పాలన, కాంగ్రెస్‌పాలన, కమ్యూనిస్టుల పోరాట విరమణ, వెట్టి చాకిరీ, మత మార్పిడులు, మహిళలకు సమాన హక్కు, ఉరిశిక్షకు వ్యతిరేకంగా పౌరహక్కుల ఉద్యమకారుల సన్నద్ధం, దాసి కొడుకుల సామాజిక స్థితి, వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న చదువుకున్న యువతరం అన్నీ కలగలిపి ఆళ్వారుస్వామి కథలు తయారయ్యాయి. జీవితం, సంఘర్షణ, ఆర్తి, బాధ, మానవీయత, ప్రజలపట్ల, ఖైదీల పట్ల సానుభూతి, సాయుధ రైతాంగ పోరాటం, గాంధీ ఫిలాసఫీ, కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రమహాసభ కార్యకలాపాలపై పూర్తి అవగాహనతో చేసిన విమర్శ ఈ కథల్లో అంశాలయ్యాయి. భాష, నుడికారం, సామెతలు తెలంగాణ జనసామాన్యానికి అర్థమయ్యే విధంగా తీర్చి దిద్దాడు. ‘మొగోనికి ఏం బిర్రొచ్చిద్ది’, అనే పదాల ద్వారా ఆనాటి కుల సమాజాల వాడుక భాషను అక్షరీకరించాడు.
ఇట్లాంటి సందర్భంలో ఆళ్వారుస్వామి తన కథల ద్వారా వ్యక్తం జేసిన అంశాల్ని ఒక్కదగ్గర పోగేసుకున్నట్లయితే ఆనాటి తెలంగాణ సమాజం నడిచిన దారి తెలుస్తుంది. ఇప్పుడు నడవాల్సిన తొవ్వా దొరుకుతుంది. ఉరిశక్షలకు వ్యతిరేకంగా, హిందూ, ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పేద, కార్మిక, కర్షక వర్గాలు చేసిన పోరాటాలను, దళిత, బహుజన ప్రజల త్యాగాలు, అణచబడ్డ ప్రజల జైలు జీవితాలు, మహిళల వెతల్ని చిత్రిక గట్టిండు. వారి సాహస పోరాట పటిమను ఈటెలుగా మార్చి గురి చూసి విసిరిండు.
జైలు ఉరిశిక్షలు
ఆళ్వారుస్వామి తన కథల్లో అన్నిటికన్నా ఎక్కువ ఆర్తితో, కండ్లల్లో
చెమ్మతో, గుండెల్లో తడితో రాసిన కథలు నేరము`శిక్షకు సంబంధించినవి. జైలు
జీవితం స్వయంగా గడిపినవాడు కావడం, సమాజంలోని అట్టడుగు వర్గాలతో కూడా కలిసి
ఉద్యమాలు చేసిన అనుభవం, పౌరహక్కుల కోసం తెలంగాణలో ఉద్యమస్థాయిలో
పనిచేయాల్సిన పరిస్థితులు, ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచి ‘సాయుధ’ పోరాటం
చేస్తున్న రైతాంగం, రెండో ప్రపంచ యుద్ధం నిత్యావసరాలపై, ప్రజల జీవితాలపై
చూపించిన ప్రభావం అన్నీ కలగలిసి ఆయన్ని ‘నేరము`శిక్ష’కు సంబంధించిన కథలు
రాసేలా చేశాయి. అఖాడా స్థాపించినందుకు ద్వీపాంతరవాస శిక్ష, పరిగె
ఏరుకున్నందుకు వంతుమాదిగ మల్లయ్యకు మూన్నెళ్ళ శిక్ష, మిలిటరీలో ఉంటూ
ఆర్యసమాజ్ కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తి, ఉరిశిక్షకు గురైన వాడి
గురించీ తన కథల్లో ఆర్తిగా చిత్రించిండు. ముఖ్యంగా ఉరిశిక్ష గురించి
1950ల్లోనే వ్యతిరేకంగా మాట్లాడి, కథలో చర్చ చేసి తన పౌరహక్కుల దృక్పథాన్ని
స్పష్టం చేసిండు. నిజానికి హైదరాబాద్ రాజ్యంలో ఉరిశిక్ష అమల్లో లేదు అనే
విషయాన్ని కూడా మరో సందర్భంలో చెప్పిండు. ఆఖరికి నిజాంపై బాంబులు వేసిన
వారికి కూడా ఉరిశిక్ష పడలేదని గుర్తుంచుకోవాలి.‘స్వాతంత్య్రం’ వచ్చి 65 యేండ్లయిన తర్వాత కూడా ‘ఉరిశిక్ష’ను పూర్తిగా రద్దు కాలేదు. ఆ శిక్షే ఒక నేరమని ఇప్పుడు హక్కుల సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉరిశిక్ష రద్దుకు ఉద్యమస్థాయిలో పనిచేయడానికి ఏ సంఘం కూడా నడుం బిగించడానికి నేడు సిద్ధంగా లేదు. అట్లాంటిది ఆళ్వారుస్వామి స్వాతంత్య్రం పూర్వమే ఉరికి వ్యతిరేకంగా ‘పతితుని హృదయం’ ‘అవకాశమిస్తే’ పేరిట కథలు రాసిండు. నిజానికి హైదరాబాద్ రాజ్యంలో ఉరి అమల్లో లేదు. ఉరిశిక్ష నిషేధింపబడాలని ఆళ్వారుస్వామి కోరుకున్నాడు. అమానవీయమైన శిక్షగా దాన్ని వర్ణించాడు. హత్యలు చేసి జైలుకొచ్చిన ఖైదీ చేత ఉరిని నిరసిస్తూ మాట్లాడిస్తాడు. ఉరి ప్రభుత్వం చేసే హత్యలే అని తేల్చేస్తాడు. గండయ్య అనే ఖైదీ తాను అంతకుముందు రెండుమూడుసార్లు మాత్రమే చూసిన ఒక ఖైదీకి ఉరిశిక్ష పడ్డప్పుడు చాలా దుఖిస్తాడు. ‘ఓ మనిషిని ఇంకో మనిషి చేతులు కట్టి, ఉరి పెట్టి వ్రేలాడతీస్తే చచ్చిందాక గుడ్లు మిటకరిస్లూ చూడటానికి అక్కడ నిలుచున్న వాండ్ల కెట్లా మనసొప్పిందో? నాకైతే అతని పీనిగెను చూడటానికి కూడా మనసొప్పలేదురా’’ అంటూ తన బాధను ఖైదీ ద్వారా వ్యక్త పరుస్తాడు.
నాజీ, నియంత, కర్కోటకుడు, డిక్షనరీల్లో ఉన్న అన్ని పదాలతో ఏడో నిజాం మీర్ ఉస్మానలీఖాన్‌ని నిందిస్తున్న వాళ్ళు ఆయన హయాంలో హైదరాబాద్ రాజ్యంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉరికి బదులు 50, 60 ఏండ్లు శిక్ష వేసినా నష్టం లేదు గానీ ఆ శిక్షను రద్దు చేయాలని ‘పతితుని హృదయం’ కథలో ఖైదీ గండయ్య పాత్ర ద్వారా చెప్పిస్తాడు. ‘‘…25 ఏండ్ల వయసు కుర్రోడ్ని పెండ్లికొడుకోలే పట్టుకెళ్ళి స్థంభానికేలాడ దీయడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీకు కోపమోస్తె మానెగాని నీవు మనిషివి కావయ్యా!’’ అంటూ ఉరిని అమలు చేసిన జైలు ఉద్యోగినుద్దేశించి గండయ్య అన్నాడు. హత్యలు, దొమ్మీలు, దోపిడీలు, పెండ్లిళ్ళు ఎత్తగొట్టి, కొంపలు కూల్చిన వాడివని గండయ్యను నిందిస్తూ, రెండ్రోజులు చూసినవో లేదో ఆ ఖైదీని ఉరితీస్తే ఏడుస్తావెందుకు? అని పోలీసాయన నిలదీస్తే దానికి జవాబుగా ‘‘మాటి మాటికి మాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది. తప్ప త్రాగి, ఉడికీ ఉడకని మాంసము తిని, బజారు మండలతో కాలము గడిపే మేము ఒళ్ళు మరచి ప్రాణాలు తీశాం. దార్లు కొట్టి పెండ్లి పిల్లలపై నగలు అపహరించాం. ఇండ్లల్లో జొరబడి దోచుకున్నాం. మత్తు దిగింతర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాపపడ్తాం. మేము చదువు రాని మొద్దులం. మాలో చదివినోడు గాని, మంచి చెడ్డ తెలిసినోడు గాని ఒక్కడుండడు. చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం. వాండ్లతో తిరిగాం. అవే బుద్దులు, అదే బతుకు’ అంటూ‘‘మరి నీ సంగతేమంటావు? ఏదో ఖానూను ప్రకారమని అన్నావే. చదువుకున్న పెద్దలు, మావంటి వాండ్లను జేల్లో పెట్టి బాగుచేయ తలచుకున్న పెద్దలు, మనిషిని చంపేదానికి ఖానూను వ్రాస్తే వాండ్ల నుండి మావంటి వాండ్లు ఏం నేర్చుకోవాలె? ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరి తీసి చంపమని ఎట్లా అంటుంది? మాట్లాడవేం’’ నిలదీసిండు. ఇదీ ఉరిశిక్ష పట్ల ఆళ్వారుస్వామికున్న అభిప్రాయాలు. క్షమించమంటే ఉరిశిక్షలు రద్దు చేసినవారున్నారు. జుర్మానాలు కొట్టివేసిన వారున్నారు అని పరోక్షంగా నిజాంని గురించి కూడా తన కథల్లో ఆళ్వారుస్వామి రాసిండు.
గాంధీని బ్రిటీష్ ప్రభుత్వం వారు ఉరితీద్దామని ప్రయత్నిస్తే దాన్ని నిజాం వద్దాన్నాడని ఒక పాత్ర ద్వారా ‘ఆక్షేపణ లేదు’ అనే కథలో చెప్పిస్తాడు. ‘‘గ్రాంధీ అంటే ప్రేమ గాదోయ్. మన రాజ్యంలో ఉరిదీయవద్దని ఖానూనులా ఉంది. అట్లాగే కుంఫిణీ సర్కారును గూగా ఉరిదీయవద్దంటే సరే అని ఊరుకున్నది’’అని చెప్తిస్తాడు. ఈ సమయంలోనే సాయుధ పోరాట కాలంలో చెలరేగినందుకు ‘తెలంగాణ 12’ పేరిట కేసు నమోదయింది. ఈ కేసులో 12 మంది ఉరిశిక్షను రద్దు చేసిన సంఘటన ఈ కాలంలోనే చోటు చేసుకుంది. దీని పూర్వపరాలన్నీ ఆళ్వారుస్వామికి విదితమే!
నెహ్రూ అన్న మాటలు ‘‘నిజానికి మనదేశంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నూటికి 85 మంది నేరప్రవృత్తి గలవారు కాదు. తక్కిన 15 మంది కూడా స్వభావత్ణ నేరకాండ్రు కారు. పరిస్థితులే వారి నావిధంగా చేశాయి’’ పుస్తకం ఆరంభంలో ఇచ్చాడు. ఇవే మాటలు ‘అవకాశమిస్తే। కథలో చెప్పిండు. దానికి జోడిరపుగా పది ఏండ్లు శిక్ష అనుభవిస్తున్న మామూలు నేరగాడు, జేలు వెలుపల ఉన్న పెక్కుమంది కంటే ఉత్తముడే’’ అని చెప్పిండు.
మతకలహాలు హైదరాబాద్‌లో మిగతా భారతదేశం మాదిరిగా భయానకంగా లేకపోయినప్పటికీ చెదురు ముదురు సంఘటనలు అప్పుడప్పుడు జరిగేవి. ‘మెదడుకు మేత’ కథలో హిందూాముస్లింల మధ్య కొట్లాటలు చెలరేగడానికి, అనైక్యతకు కారణాలను విశ్లేషించాడు. ఇరు మతాల్లోని విభిన్న మతాచారాలు, దాన్ని అడ్డంగా పెట్టుకొని చాంధసులు ఉద్రేకతలను రెచ్చగొట్టడాన్ని రికార్డు చేసిండు.
మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ఊరేగింపులో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, హత్య చేసి జైలుకొచ్చిన ఖైదీల మధ్య చెలరేగే ఘర్షణలకు మతం రంగు పులుమడం, దాన్ని ఆధునిక భావాలు గల మోహన్‌రావు అనే రాజకీయ ఖైదీ తీర్చే విధానాన్ని ‘మెదడుకు మేత’ కథలో ఆళ్వారుస్వామి రాసిండు. ఆర్యసమాజం భావాలతో ఉన్న హుకుంసింగ్ రేపు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తురకల్నందరినీ ఇండియానుంచి వెళ్ళగొట్టాలే అనే అభిప్రాయంతో ఉండేవాడు. ‘‘ఉఠావో బోర్యా బిస్తర్, ఏ రోనా పీఠ్నా క్యాహై’’ అని ముస్లింలందరూ ఇక తమ పెట్టేబేడా సర్దుకొని ఈ దేశం విడిచి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని పాటల రూపంలో వ్యక్తం జేసేవాడు. ఆయన హైదరాబాదీ కాదు. మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చిన వాడు. పేరు ఆర్యసమాజ్ అయినా బయటి ఆచరణ మాత్రం కాంగ్రెస్ పార్టీ పంథాయే. ఎందుకంటే ఈ కథలో మోహన్‌బాబు నేర్పిన ‘‘రామ్ కే సంఘ్ మే లక్ష్మణ్ థే, గాంధీకే సంఘమే నెహ్రూ హై’’ అని హకుం సింగ్ తరచుగా పాట పాడుతూ ఉండేవాడు. అంటే బయటికి కనిపించేది కాంగ్రెస్ లోపల మాత్రం ఆచరణ అంతా ఆర్యసమాజ్‌ది. ఈ ద్వైవిధీభావం తెలంగాణలో కూడా అదే విధంగా ప్రతిఫలించేది.
ఆర్యసమాజ్ పేరిట ఒక వైపు శుద్ధి కార్యకలాపాలు, మరో వైపు అఖాడాల ఏర్పాటు, అలాగే మతం మార్చుకున్న దళితుల్ని వ్యవసాయ పనులకు పిలువక పోవడం, వారిని తూష్ణీకారంతో చూడడం, చివరికి దళితులు విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ శుద్ధి ద్వారా హిందువులుగా మారేందుకు తోడ్పడడం ఆర్యసమాజ్ చేసిన పని. దీనికి కాళోజి నారాయణరావు లాంటి వారు కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే రజాకార్ల దురాగతాలను ఎదుర్కొనే దశలో కొంత మేరకు ఆర్యసమాజ్ భావాల్ని పుణికి పుచ్చుకొని మిలిటెంట్‌గా తయారయ్యిండ్రు అప్పటి లౌకికవాదులు కూడా. అయితే ఈ దోషం ఆళ్వారుస్వామికి అంటలేదు. ఈయన తన రచనలతో పాటుగా ఆచరణలో కూడా లౌకికంగానే ఉన్నాడు.
ఆర్యసమాజ్ వాండ్లు కేవలం ‘అఖాడా’లు స్థాపించి ఉద్యమాన్ని చేపట్టగా ముస్లిములు ‘కాక్సార్’ ఉద్యమాన్ని లేవదీశారు. కాక్సార్ అంటే సాయుధ శిక్షణ. ఈ ఉద్యమాన్ని మొదట ఇనాయతుల్లా మష్రీకి అనే ముస్లిం నాయకుడు చేపట్టాడు. అయితే మజ్లిస్ పార్టీకి చెందిన బహదూర్‌యార్జంగ్ ఆయన్ని తోసిరాజని నాయకత్వాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో సిద్దిఖ్ దీన్‌దార్ అనే అతను తాను చెన్నబసవేశ్వరుని అవతారమని చెప్పుకున్నాడు. అదే విధంగా రాముడు, కృష్ణుడులను తూలనాడాడు. దీంతో ఆర్యసమాజ్‌కు చెందిన మంగళదేవ్, పండిత రామచంద్ర దహెల్వీ తదితరులు అందుకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆళ్వారు జెండర్ స్పృహ
ఇప్పటికి కూడా చర్చలోకి రాకుండా ఉన్న స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం,
స్త్రీ చేసిన ఇంటి పనిని ఆర్థిక కోణంలో చూసే దృక్కోణం అలవడలేదు. ఆ
రోజుల్లోనే స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని, స్త్రీలు కుటుంబంలో చేసే పనికి
విలువను లెక్కగట్టాలని తన కథల్లోని పాత్రల ద్వారా చెప్పించిన గొప్ప
‘జెండర్ స్పృహ’ ఉన్న రచయిత ఆళ్వారు. ఇంటిపనుల విషయంలోనే కాదు బయటి పనుల్లో
కూడా స్త్రీలకు సమానమైన వాటా, గౌరవం దక్కాలనే భావనను 60 యేండ్ల కిందనే
ప్రచారంలోకి తీసుకొచ్చిన వాడు ఆళ్వారుస్వామి. మగవాండ్లే తియతియ్యని మాటలు
చెబుతూ ఆడవాళ్ళకు అడ్డుకట్ట వేస్తున్నారని ‘అవకాశమిస్తే’ కథలో సరోజిని
పాత్ర ద్వారా చెప్పించాడు. మగవాళ్ళు స్వార్థులు అని చెబుతూ స్త్రీ
స్వేచ్ఛకు పురుషుల ఆధిపత్య మనస్తత్వం, సంస్కారరాహిత్యం, సాంప్రదాయాలు పేరిట
కలిగించే అడ్డంకులే ప్రధాన కారణమని చెబుతుంది. పురుషుల కన్నా స్త్రీలు ఏ
విషయంలోనూ తక్కువ కారని చెబుతూ తమకు ‘అవకాశ మిస్తే’ తమ శక్తిని,
సామర్ధ్యాన్ని నిరూపించుకుంటామని మహిళా దృక్కోణంలో సమాజాన్ని చిత్రించాడు.‘అవకాశమిస్తే’ కథను పురుషాధిపత్యంలో బందీ అయిన ‘మహిళ’ను, జైలులో బందీ అయి విషాదంగా మరణించిన ‘ఖైదీ’ పాత్రను పోలుస్తూ సంభాషణ రూపంలో కథను నడిపించిన తీరు బాగుంది. స్త్రీకి ఇల్లు, పిల్లలు, భర్త, ఇంటి పనులు ఇవన్నీ కలగలిసి ‘జైలు’లో లాగా జీవితం గడిచిపోతుందనే భావనను ‘సరోజిని’ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. అలాగే పొద్దస్తమానం విరామం లేకుండా చేసే చాకిరికి భర్తలు జీతం చెల్లించాలనే ఆలోచన కూడా వ్యక్తం జేస్తుంది. దీనికి భర్త జవాబిస్తూ ‘భార్యాభర్తల సంబంధం, కుటుంబ జీవనం జీతానికంటె, విధకంటె అతీతమైంది. వర్ణించవీలుగాని ఆత్మీయత అది. దానికి వెలలేదు. వర్ణనాలేదు’’ అంటాడు.
‘‘అట్లాగా? ప్రపంచమంతా ఒక కుటుంబమని, ప్రపంచ ప్రజలంతా ఒక కుటుంబీకులని అప్పుడప్పుడు మీరు చెప్పే ధర్మసూత్రాల ప్రకారము, ఈ విశాల కుటుంబమునకు చెందిన మీరు మీ కుటుంబములో నేను నిష్కామకర్మ చేస్తున్నట్టే. ఆ 1500 (రూ.లు) రాళ్ళు తీసుకోకుండా ఎందుకు మీరు ఉద్యోగం చేయకూడదు?’’ అని కూడా భర్తకు ఎదురు ప్రశ్నవేసి నిరుత్తరుణ్ని చేస్తుంది సరోజిని. అలాగే ‘‘అన్నిటిని అరికట్టేవారు పురుషులు. స్త్రీలు ఎల్లప్పుడూ పురోగాములే ఎప్పుడూ ముందడుగే’’ అని స్త్రీలను అడ్డుకునేది పురుషులే అని వాళ్ళే ప్రగతి నిరోధకులని చెప్పింది. ఇట్లాంటి పాత్రల ద్వారా ఆళ్వారుస్వామి తాను స్వయంగా ఏదైతే పాటించాడో దాన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. హైదరాబాద్‌లోనే కాదు విజయవాడలాంటి దూర ప్రదేశాల్లో కూడా సమావేశాలు జరిగితే అక్కడికి సతీసమేతంగా హాజరయ్యేవాడు. అప్పటికి ఇప్పటికీ ఎంతో ప్రగతిశీలురు అనుకునే వారు సైతం తమ తమ భార్యలను సమావేశాలకు తీసుకురాకుండా పోయేది.
‘విధిలేక’ కథలో తనని పోషించలేక పోతున్న భర్త నర్సయ్యను వదలి మంచిగా చూసుకుంటున్న మరోవ్యక్తితో వివాహం చేసుకున్న భార్య పెంటమ్మకథను చిత్రీకరిస్తాడు. నిస్సహాయ స్థితిలో పోషించేవాడిని వివాహమాడటాన్ని ఈ కథ ద్వారా ఆళ్వారుస్వామి ఆమోదించారు. పొట్టకు లేక చావడమా? వేరే అతన్ని పెళ్ళి చేసుకొని బతకడమా? అనే సంశయం వచ్చినప్పుడు వేరే పెళ్ళి చేసుకొని బతకడమే న్యాయం అని ఈ కథ ద్వారా ఆళ్వారు తీర్పిచ్చాడు.
‘భర్త కోసం’ కథలో అఖాడా స్థాపించిన ‘నేరానికి’ అరెస్టయిన భర్త రామదాసుని రక్షించుకోడానికి భార్య లక్ష్మి తల్లడిల్లిన తీరుని, పడ్డ వేదనను రికార్డు చేసిండు. చివరికి ద్వీపాంతర వాస శిక్ష విధించబడ్డ భర్త కోసం విధిలేక ప్రాణార్పణ చేసిన తీరులో ప్రేమమయి ‘స్త్రీ’ హృదయాన్ని పూసగుచ్చినట్టు చెప్పిండు. మరో గొప్ప కథ ‘రాజకీయ బాధితులు’. ఇందులో సాయుధపోరాటంలో పాల్గొన్న భర్త గురించి గర్వంగా చెప్పుకునే పెంటమ్మ, చివరికి విరమణానంతరం కూడా ఆయుధాన్ని సాయుధంగా చేసిన భర్త చనిపోయిండో, బతికుండో తెలువక పోవడం, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా యుద్ధం కొనసాగించినందుకు అటువైపు నుంచి ఏమాత్రం సహాయం అందని స్థితిలో భర్తను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి స్వీపర్‌గా స్థిరపడ్డ పెంటమ్మ జీవితాన్ని ఇందులో చిత్రించాడు. ఆత్మగౌరవంతో బతికే దళిత మహిళ, మతం మార్చుకున్న దస్తగీర్‌కు దగ్గరై ఆయన్ని వివాహం చేసుకోవడాన్ని కూడా ఇందులో రాసిండు. అటు తన జీవితాన్ని పోరాటానికి అర్పితం చేసిన భర్త కనబడక పోవడం ఒకవైపు, మరోవైపు పటేల్ మిలిటరీ సైన్యం గ్రామాల్లో ఉద్యమకారులని ఏరి ఏరి చంపుతున్న కాలంలో భర్త ఏమైండో తెలియక పెంటమ్మ పడే వేదనను మానసిక సంఘర్షణను పోరు వాతావరణాన్ని స్వయంగా చూసినవాడు కావడంతో ఆళ్వారుస్వామి బాగా చిత్రించగలిగాడు.
పెంటమ్మ భర్త కోటయ్య అన్యాయాలకు ఒడిగట్టే వారిని అణచి వేసేవాడని చెబుతుంది. అంతే కాదు ఆనాడు కూడా దళాల్లో పనిచేసే వారి పట్ల దుర్బుద్ధితో వ్యవహరించిన వారికి తగిన శాస్తి చేసినట్టు కూడా చెబుతుంది. దీనివల్ల ఆనాటి సంగతులు మనకు అవగతమవుతాయి. ‘‘ఒకసారి ఊళ్ళోకి వచ్చిన బీటు జవాను పశువుగా వ్యవహరించబోతే పెంటమ్మ చేసిన ఆర్భాటం మొత్తం హరిజనవాడతో పాటు గ్రామమంతా పెంటమ్మ శీలాన్ని హర్షించింది. పోరాట కాలంలో కోటయ్య దళానికి చెందిన ఒకడు ఒక స్త్రీ విషయంలో దుష్టబుద్ధి కలిగి ఉన్నాడని తెలిసి కోటయ్య అతనికి చేసిన ప్రాయశ్చిత్తానికి పెంటమ్మ ముగ్ధురాలై తన భర్తను గా భావించింది’’. అట్లాంటి భర్త సాయుధ పోరాటం చేస్తూ బతికుండో, లేడో కూడా తెలియక పోవడంతో ఆఖరికి ఆర్యసమాజ్/మిలిటరీ వాండ్ల చేతిలో భార్యను పిల్లలను కోల్పోయిన దస్తగీర్‌ని వివాహమాడిన విషయాన్ని, అందుకు కల్పించిన సన్నివేశాన్ని, వాటి నిర్వహణలో ఆళ్వారుస్వామి చూపిన ప్రతిభ అద్వితీయం.
‘ఆలుాకూలి’ కథలో భార్యను అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవాలని చూసే పల్లెటూరి అనుమానపు భర్తకు, పట్నవాసపు భార్య పార్వతమ్మ చెప్పిన గుణపాఠాన్ని కథగా మలిచిండు. అధికారమున్నోడికి ఆలన్నా, కూలన్నా ఒక్కటే అని తీర్పిచ్చిండు. ‘‘అమ్మగారు! తెలియకడుగుత మేమంటే కూలి చేస్కోని బతికేటోల్లం. మాకు యాజమాన్లకు పనిచేసేంత సేపే సంబంధం. మేమేది కావాలన్నా, వాండ్ల లాభాలు తగ్గుతయని భయమనుకుందాం. మాదేందిగాని, ఒక సంగతి అడుగుత, మీరు తెలిసినోరు, చేసుకున్న పెళ్ళామైనా, తోబుట్టు ఆడదైనా, కనిపెంచిన తల్లైనా మొగోడికింద పనికిరాదు. ఎంత పక్కల్లో రెక్కల్లో కాళ్ళల్లో, వేళ్లల్లో మెలిగినా జిట్టెడు మొగోడు గుట్టంత ఆడదాన్ని గోటికింద కట్టేస్తాడు. దీన్నేమనాలే’’ అని రంగడి తోటి ప్రశ్నింపజేస్తాడు. అంటే ఆ పద్ధతి మారాలని ఆళ్వారు తపించాడు.
నిజానికి ఆళ్వారుస్వామి స్త్రీ స్వేచ్ఛ ధృక్కోణంలో కథలు రాసే సమయానికే తెలంగాణలో కొంత మహిళా చైతన్య వాతావరణం ఏర్పడిరది. ఆంధ్రమహాసభల ద్వారా ప్రతి సమావేశంలో మహిళా మీటింగ్స్‌ని విధిగా నిర్వహించేవారు. పరదాల మాటున చర్చలు జరిగినా వాటిని పుస్తకంగా తీసుకొచ్చి చర్చలన్నిటినీ రికార్డు చేసేవారు. దాదాపు ఇదే సమయంలో ఎల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, టి.వరలక్షమ్మ తదితర మహిళా రచయితలు స్వయంగా మహిళా సమావేశాలకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించి తమ చైతన్యాన్ని విస్తృతం చేసుకున్నారు. ఆంధ్ర యువతీ మండలి, కుట్టి వెల్లోడి సంక్షేమ కార్యక్రమాలు, దుర్రెషెవార్, నీలోఫర్‌ల ప్రజాహిత కార్యక్రమాలు అన్నీ కలగలిపి మహిళా ధృక్కోణం నుంచి కూడా ఆలోచించే చైతన్యాన్ని ఆళ్వారుస్వామికి అందించింది.
కాంగ్రెస్ కమ్యూనిస్ట్ దొందూ దొందే!
స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ, కొన్ని చోట్ల కమ్యూనిస్టులు
కూడా దోపిడీకి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్రీ బ్యాంక్‌ని దోపిడీ
చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ‘జాయిన్ ఇండియా’ ఉద్యమం, ‘బాధ్యతయుత
ప్రభుత్వం’ ఏర్పాటు, ‘దున్నేవాడికే భూమి’ పేరిట జరిగిన పోరాటాల్లో
దొమ్మీలు, దోపీడీలు కూడా నిత్య కృత్యమయ్యాయి. పోలీసు చర్య ద్వారా బలవంతంగా
భారత యూనియన్‌లో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వాత పాత హైదరాబాద్
రాజ్య అస్తిత్వం కనుమరుగయింది. ఈ కాలంలో దొంగలకు, కాంగ్రెస్ పార్టీ వారికీ
తేడా లేదు అనే విధంగా ఆళ్వారుస్వామి ‘‘మాకంటే మీరేం తక్కువ’’ కథలో
చెప్పిండు. దొంగతనమే వృత్తిగా చేసుకొని బతుకుతున్న రంగడు, వెంకడు ‘పోరాట’
కాలంలో చేసిన ఉద్యమకారులతో కలిసి ‘జై’ అంటూ దొంగతనానికి పాల్పడితే పార్టీ
వాళ్ళు పట్టుకొని చావదెబ్బలు కొట్టిన తీరుని గుర్తు చేసుకుంటూ, అక్కడ
పార్టీని నడిపించిన దొర వేరెవ్వరినీ ఆ ఇలాకాలో అడుగు పెట్టనివ్వలేదని,
కనీసం నీడ కూడా పడనీయలేదని ఈ కథలో దొరల తీరుని అక్షరబద్ధం చేసిండు. అయితే
ఇక్కడ చెప్పింది కాంగ్రెస్ వారిని గురించి కాకుండా కమ్యూనిస్టుల గురించి
చెప్పిండని అర్థం చేసుకోవాలె.‘‘మారాజులు కష్టపడ్డందుకు గట్టెకిన్రు. మేము ఉన్నచోటనే ఉన్నాం. పాపం పుటుకలు’’ రంగడు గోళ్ళు గిల్లు కుంటు అన్నాడు.
‘‘వాండ్లంటే ఇల్లనక, ముంగిలనక, పిల్లనక, మేకనక చెట్టు గుట్టలుపట్టి ఎంత చెఱపడ్డారు పాపం’’ అంటూ ఇంద్రసేనా రెడ్డి అనే తొంటదొర చేసిన కార్యకలాపాలను లెక్కగట్టిండు. ఈ దొరని జైలు పరిశీలకునిగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆయన జైలు పరిశీలనలో భాగంగా వీరున్న రంగడు, వెంకడు ఉన్న బ్యారక్‌కు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న సన్నివేశాన్ని అర్ధవంతంగా ఆళ్వారుస్వామి చిత్రీకరించాడు. ‘‘దొరా! మీకు కోపం రాకపోతే ఒకటి అడుగుత. మీరు సర్కారు మీద కత్తికట్టిన ఆరోజుల్లో మానోట్లో మాత్రం మట్టికొట్టిన్రు. ఎక్కడపోయినా మీదే గోల, ఏది దొరికినా మీకేనాయె. ఆ రోజుల్లో మేము పడ్డ కష్టాలు చెప్పితె తీరవు’’ అంటూ ఆనాడు సర్కారు మీద పోరాటం పేరిట దొరలు దోసుకున్న సంగతిని చెప్పిండు. ఈ దొంగలు, దొరలతో పాటు చేరి ‘జై’ కొట్టి తాము కూడా దోసుకోవడంతో దెబ్బలు తిన్నరు. దొరలు కూడా దోసుకున్నారు అని రంగడి పాత్ర ద్వారా ఇలా చెప్పిస్తాడు. ‘‘మీ దగ్గర మేము నేర్చుకునేదేముంది దొరా దీంట్ల. మీరే కొన్నాళ్ళు మా పనులకు ఎగబడ్డారని మావోడు అంటున్నాడు. అవునులేరి. ఎవరికి నచ్చింది వాండ్లు చేస్తుంటారు’’ అంటూ మేము జైళ్లలో ఉన్నాము మీరు అధికారం చలాయిస్తున్నారంటూ ‘మాకంటే మీరేం తక్కువ’’ అని నిలదీస్తాడు. ఈ కథ మొదట ‘ఆనాటి రోజులు’ శీర్షికన 1952 జూన్ నాటి ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో అచ్చయింది. దీన్ని 1955లో జైలులోపల కథల సంపుటి వెలువరించే సమయంలో ‘మాకంటే మీరెం తక్కువ’ అని దొరల్ని నిలదీసే విధంగా శీర్షిక పెట్టాడు. పాత కథలోని కొన్ని సంభాషణలు మార్చి, పెంచి పుస్తకంలో జోడిరచాడు.
నిజాం ప్రభుత్వంలో పాఠశాలలు పెట్టుకోవడం, సభలు నిర్వహించుకోవడం, వ్యాయామశాలలు ఏర్పాటు చేసుకోవడం, గ్రంథాలయాలు, పత్రికలు స్థాపించడంలోనూ అనేక ఆంక్షలుండేవి. హిందూ`ముస్లిం ఇద్దరికీ ఈ ఆంక్షలు ఒకేతీరుగా అమలయ్యేవి. మదరసాలు పెట్టాలన్నా, కానిగి బడులు తెరవాలన్నా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించాలనేది నిబంధన. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టకుండా ఉండే విధంగా ఆ యా సభల నిర్వాహకుల నుంచి ముందుగానే హామీ పత్రాన్ని ప్రభుత్వం డిమాండ్ చేసేది. అట్లా హామీ పత్రం ఇవ్వని సభలకు అనుమతి లేకుండేది. అలాగే ఈ సభల నిర్వహణల వల్ల స్థానికంగా విద్వేషాలు చెలరేగుతాయని ప్రభుత్వం భావించినా అలాంటి వాటికి అనుమతి నిరాకరించబడేది. అయితే వీటన్నింటిలోకి వ్యాయమాశాల (అఖాడా) ఏర్పాటు చేస్తే నిజాం ప్రభుత్వం ద్వీపాంతరవాస శిక్ష విదించేది. ఇట్లా అఖాడాల ఏర్పాటు, వాటి నిర్వహణ, అందులో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగట్టడానికి ఈ అఖాడాలు ప్రధాన భూమిక నిర్వహిస్తోందని, వీటికి ఆర్యసమాజ్ భావజాలం గల వాళ్ళు ఇతోధికంగా తోడ్పడుతున్నారని ప్రభుత్వం వీటి ఏర్పాటుపై ఆంక్షలు విధించింది. ఈ అఖాడాల గురించి వాటికి సంబంధించిన భిన్న పార్శ్వాలను ఆళ్వారుస్వామి తన కథల్లో చిత్రీకరించాడు. ‘భర్త కోసం’ కథలో పోస్టల్ ఉద్యోగి, రామదాసు అనే తెనిగాయన ఊర్లో ‘అఖాడా’ ఏర్పాటు చేసినందుకు ద్వీపాంతరవాస శిక్షకు గురవుతాడు. అవి రెండో ప్రపంచ యుద్ధపు రోజులు కావడంతో ‘ఏ సందులో చూసినా గూఢాచారులు ఈగలవలె నున్నారు’. ప్రతిరోజూ అరెస్టులు, శిక్షలు, ప్రవాస శిక్షలు విధించేవారు. ఇక్కడ రక్షణశాఖ వారు అత్యూత్సాహం ప్రదర్శించి ‘‘రామదాసుకు సామాన్య కారాగార శిక్ష విధించినచో యిట్టి రాజద్రోహుల సంఖ్య మితిమీరిపోవుననియు, యితనికి వేయబడు శిక్ష ఇతరులకు గుణపాఠముగా ఉండవలెననియు, ద్వీపాంతరవాస శిక్ష విధిగా విధింపవలయుననియు రక్షణ శాఖవారును, ప్రభుత్వ న్యాయవాదియు గట్టిగా వాదించిరి’’ అంటూ ప్రభుత్వం వారి అసహనాన్ని గురించి చెప్పిండు. అలాగే ‘విధిలేక’ కథలో అఖాడాలు ఎలా సంఘవిద్రోహ శక్తుల అడ్డాగా మారినాయో పూసగుచ్చినట్టు చెప్పిండు. ‘‘వ్యాయామశాల ఒక క్రొత్త ప్రపంచమనవచ్చు. వివిధ ప్రవృత్తులు, వివిధ అలవాట్లు గల వ్యక్తులతో నిండియుండేది. జేబుదొంగలు, జూదగాండ్రు, కొద్ది కొద్ది దొంగతనాలతో జేలు యాత్రలు చేసినవారు, అరాజక ప్రియులు, వ్యభిచారులు, త్రాగుబోతులు` అన్ని రకాలవారు అక్కడ సమావేశమై తన జీవితమందలి సంఘటనకు గర్వించుకుంటూ, ఒకరికొకరు చెప్పుకుంటా’’రని అఖాడాల లోపలి విషయాలను వెల్లడిరచిండు. అఖాడాలో ‘విందులు, భోగముసానుల ఆటలు, పాటలు, త్రాగుడు తందనాలు’ కూడా విరివిగా జరిగేవి అని ఇదే కథలో మరో చోట చెప్పిండు.
తమ భావజాలంతోనే చివరి వరకూ అంటకాగలేదనో, కింది కులాల గురించి మాట్లాడిరడు అనో తెలియదు గాని సాహితీ ప్రపంచంలో ఆళ్వారుస్వామికి న్యాయంగా, కచ్చితంగా దక్కాల్సిన స్థానాన్ని దక్కనీయలేదు. ఇప్పటి తెలంగాణ ఉద్యమకారులు, సృజనకారులు ఆళ్వారుని జాతీయ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలి. పాఠ్యాంశాల్లో చేర్చే ప్రక్రియను ఆచార్యలోకం ఇప్పటటికైనా గుర్తించి ఈయన మీద విస్తృతమైన పరిశోధనలు చేయించాలి. ఆళ్వారుని జాతీయస్థాయిలో సగౌరవంగా నిలబెట్టేందుకు అన్ని భారతీయ భాషల్లోకి ఆయన సాహిత్యాన్ని, ఆయన జీవిత చరిత్రను తర్జుమా చేయాల్సిన అవసరముంది. కనీసం ఆయన శతజయంతి నాటికైనా ఆయన పేరిట పోస్టల్ స్టాంప్‌ని ప్రభుత్వం విడుదల చేసేలా తెలంగాణాభిమానులు, ఆళ్వారుస్వామి అభిమానులు, ప్రజాస్వామిక వాదులు బాధ్యతగా ప్రాధాన్యత క్రమంలో ప్రథమస్థానంలో ఈ పనిని చేపట్టాలి.
గతానికి వర్తమానానికి జరిగే సంభాషణ, సంఘర్షణే చరిత్ర. ఈ చరిత్ర సాక్ష్యాలు, ఆధారాలు, ఫుట్‌నోట్స్, బిబ్లియోగ్రఫీలతో రాస్తే అకడమిక్ చరిత్ర అవుతుంది. దీన్ని రాసే, ప్రచురించే వారి భావజాలం, లక్ష్యంగా చేసుకున్న పాఠకులను బట్టి కూడా చరిత్ర రచనలో మార్పులు ఉంటాయి. చరిత్రరచయిత కులం, మతం, ప్రాంతం కూడా ఈ రచనలో చొరబడి ‘ప్రామాణికత’కు విఘ్నాలు కలిగిస్తాయి. కొత్త చేర్పులు, మార్పులు, నూతన పరిశోధనలు వాటికి ఆధిపత్య వర్గం, వర్ణం, వారి అధీనంలోని మీడియా, పత్రికలు, విశ్వవిద్యాలయాల పాలక మండళ్ళు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ అన్నీ కలగలిపి ఎవరికి అనుకూలంగా ఉన్న అంశాలతో మాత్రమే వారు చరిత్రను ప్రచారంలోకి తెస్తున్నారు. ఇదే చరిత్ర ప్రత్యామ్నాయ రూపంలో బహుళ ప్రచారంలో ఉంది. కుర్రారం రామిరెడ్డి, రేణికుంట రామిరెడ్డి, షోయెబుల్లాఖాన్, బందగీ, దొడ్డికొమురయ్య తదితర తెలంగాణ యోధుల గురించి తెలుసుకోవడానికి మౌఖిక గాధల ఆధారంగా రాసిన బుర్రకథలు, వారి అనుచరులు, అంతేవాసుల సమాచారంతో రాసిన రచనలే ఎక్కువ. ఇందులో పత్రికలు, ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఆధారంగా రాసినవి చాలా తక్కువ. ప్రభుత్వ డాక్యుమెంట్స్ కూడా పూర్తి వాస్తవాన్ని చెబుతాయని విశ్వసించలేము. అయినప్పటికీ అకడమిక్ రంగంలో వాటికే ప్రాధాన్యముంటుంది. బుర్రకథలకన్నా ఎక్కువ జీవితాన్ని, సమాజాన్ని చిత్రీకరించిన నవలలు, కథలు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడానికి మంచి రెఫరెన్స్ సోర్సెస్. వీటికి ‘ఆచార్య’లోకంలో తగినంత గుర్తింపు లేకపోయినప్పటికీ సాహిత్యం చదువుకున్న వారు చాలామంది దాన్ని ‘చారిత్రక’ అంశంగానే చూస్తారు. కల్పన ఉన్నప్పటికీ వాస్తవ సంఘటనల జోడిరచడానికే వాటిని వాడుకుంటారు. తెలంగాణ విషయంలో సాహిత్యమే చరిత్రకు ప్రధాన వనరు. ఇందుకు ‘సాయుధ పోరాటం’ మినహాయింపు కాదు.
వట్టికోట ఆళ్వారుస్వామి బ్రాహ్మణకులంలో నల్లగొండ జిల్లా చెరువు మాధవరంలో పుట్టిండు. కానీ ఎన్నడు కూడా బ్రాహ్మణ ఆధిపత్య భావజాలాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. డికాస్టిఫై, డిక్లాసిఫై కావడమే గాకుండా అహర్నిషలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిండు. తాను స్వయంగా హోటల్లో పనిచేయడం, వంటజేసి పెట్టడం, గురువుకు సేవచేసి అందుకు ప్రతిఫలంగా రెండు పూటలా భోజనం చేయడం, చివరికి వారాలు చేసుకొని తినాల్సి రావడం చూస్తే ఆయన పేదరికం తెలుస్తుంది. తాను పేదరికాన్ని అణువణువూ అనుభవించిన వాడు కావడమే ఆయన్ని పేదల పక్షపాతిగా తీర్చిదిద్దింది. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి అన్నివేళలా అండగా ఉండడం, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తాను నమ్మిన దానిపట్ల కచ్చితంగా ఉండడం, ఆచరణలో దార్శనికత అన్నీ కలగలిసి ఆయన్ని సంపూర్ణ వ్యక్తిగా నిలబెట్టాయి. అవును కచ్చితంగా సంపూర్ణ వ్యక్తే. దీనిపట్ల కొందరికి అభ్యంతరం ఉండొచ్చు. 46యేండ్ల తన జీవితంలో అన్ని భావజాలాల్ని అతి దగ్గరగా చూసిండు.
ఆంధ్రమహాసభ, సత్యాగ్రహం, గాంధీ ఫిలాసఫీ ఆచరణ, వందేమాతర ఉద్యమం, అభ్యుదయ రచయితల సంఘం, క్విట్ ఇండియా, సాయుధ పోరాటం, జైలుశిక్ష, దేశోద్ధారక గ్రంథమాల, సూచీ గ్రంథాలయం, భుజానికి జోళె తగిలించుకొని పుస్తకాలు అమ్మడం, పుస్తకాల ప్రచురణకు పేరున్న వారి పెండ్లిళ్ళ సమయంలో కట్నాలు సేకరించి వినియోగించడం, పగలు, రాత్రి అనే తేడాలకుండా పనులు చేయడం, రాయడం, అధ్యయనం చేయడం, వ్యక్తుల్ని కలవడం, వానమామలై లాంటి వారి ఆరోగ్యం బాగాలేకుంటే ముందుండి వైద్యం చేయించడం, అందుకయ్యే ఖర్చులకు విరాళాలు సేకరించడం, దొడ్డి కొమురయ్య చనిపోతే జయసూర్య నాయుడుతో కలిసి నిజనిర్ధారణకు కడవెండి వెళ్ళడం, గద్వాల రాణి అన్యాయాలకు ఒడిగడుతుందని తెలుసుకొని ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి బద్దం ఎల్లారెడ్డితో కలిసి రాణి మహలక్ష్మమ్మకు వ్యతిరేకంగా నివేదిక తయారు చేయడం, అభ్యుదయ రచయితల సంఘాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమే గాకుండా దాని తరపున తెలుగుతల్లి పత్రిక ప్రచురణ బాధ్యత నెత్తికెత్తుకోవడం, గుమాస్తాల హక్కుల కోసం కొట్లాడటమే గాదు కంకర్ల పెంటయ్య అనే గుమాస్తా నాయకునితో అదే పేరుతో పత్రికను స్థాపింపజేసి తాను వెన్నెముఖై నిలబెట్టడం, ప్రజలమనిషిని భాష విషయంలో భయంభయంగానే బయటికి తేవడం, గంగుని కండ్లసూడక
ముందే కన్ను మూయడం అన్నీ ఆళ్వారుస్వామి కార్యాచరణ, ఆయన సాహిత్య విశిష్టతకు కొంత/కొన్ని పునాది, మరికొంత ఉపరితలమయ్యాయి.
ఆళ్వారుస్వామి ఆచరణ, నిత్య సృజన, విరామమెరుగని కృషి, అలుపెరుగని ప్రయాణం వర్తమాన కాలంలో హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్‌లో కొంతమేరకు దర్శించవచ్చు. అంతేగానీ ఆయనతో పోల్చగలిగిన వ్యక్తి తెలుగునేలలో మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. 2015 ఆయన శతజయంతి సంవత్సరం. ఆప్పటి వరకు ఆళ్వారుస్వామి రచనలన్నీ పుస్తక రూపంలో రావాల్సిన అవసరముంది. నవలలు, కథలు, ఆత్మకథాత్మక రచన, నాటికలు, పద్యాలు, వ్యాసాలు, సమీక్షలు, పత్రికా చర్చలు, అభిప్రాయాలు, డైరీలు, ఆయన రాసిన నివేదికలు, ముందుమాటలు, ప్రచురణ కర్తగా మాటలు, ఉత్తరప్రత్యుత్తరాలు అన్నీ తెలుగు పాఠకులందరికీ అందుబాటులోకి రావాలి. ఈ పని 2014 ఫిబ్రవరి ఐదునాడు ఆయన కొత్త పుస్తకం ఏదో ఒకటి ఆవిష్కరింపజేసుకోవడం ద్వారా ప్రారంభించుకోవాలి.
(గమనిక: ఈ వ్యాసం కోసం ప్రచురితమైన
ఆళ్వారుస్వామి కథలు జైలులోపలతో బాటుగా ఇంకా అముద్రితంగా ఉన్న మరో 20
కథల్ని కూడా పరిశీలించడమైంది)