Friday 24 August 2012

JYOTHIBA PHULE AND TELANGANA

ఫూలేతో కలిసి నడిసిన తెలంగాణ


    నేటి భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సామాజిక విప్లవకారుడు జ్యోతిరావ్‌ ఫూలె. స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం నిత్యం నినదిస్తున్న తెలంగాణ బిడ్డలు ఇయ్యాళ ఆయన్ని అడుగడుగున యాద్జేసుకుంటున్నరు. ఆయన వర్ధంతిని (నవంబర్‌, 28) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘ఆత్మగౌరవ సభ’ నిర్వహించి బహుజనులు జరుపుకుంటున్నారు. అణచబడ్డ వారి హక్కుల కోసం, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బ్రాహ్మణ, అగ్రకుల దాష్టీకానికి వ్యతిరేకంగా ఫూలె చేసిన పోరాటంలో అందరికన్నా ఎక్కువగా ఆయన వెన్నంటి నిలిచింది తెలంగాణ బిడ్డలంటే ఆశ్చర్యం కలుగక మానదు. కాని ఇది నిఖార్సయిన నిజం. ఫూలె ఉద్యమాలకు అండగా నిలిచి, వాటికి జీవం పోసింది తెలంగాణ నుంచి వలసబోయిన తెలుగువారు, బహుజనులు. ఫూలె స్థాపించిన సంస్థలన్నింటిలోకి తలమానికమైనది ‘సత్యశోధక సమాజ్‌’. ఈ సమాజ్‌ స్థాపన నాటి నుండి, ఫూలె మరణానంతరం కూడా దాని కార్యకలాపాల్లో పాల్గొన్నది, ఉద్యమాన్ని నడిపింది తెలంగాణ బహుజనులు. పద్మశాలి, మున్నూరుకాపు, వంజరి తదితర కులాలకు చెందిన నాయకులు ఈ సమాజాన్ని బొంబాయిలో అనేక అడ్డంకుల్ని అధిగమించి నడిపించారు. ముంబయిలో ఫూలే కార్యకలాపాలకు ప్రాణం పోసిందీ, ప్రచారం చేసిందీ ‘మనోళ్లే’.
    భారతదేశంలో బ్రిటీష్‌ వారిపట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో లార్డ్‌ డల్‌హౌసీ తమ పాలనలో కొన్ని మార్పులు తీసుకువచ్చాడు. దీని వల్ల వ్యాపార, వాణిజ్య, రవాణ, ప్రసార వ్యవస్థల్లో మౌళికమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబయి నుంచి థానే వరకు రైలుమార్గ నిర్మాణం ప్రారంభమైంది. అలాగే బట్టల మిల్లుల స్థాపన కూడా ఈ కాలంలోనే జరిగింది. మొదట 1853లో ముంబయి`థానేల మధ్యన రైలు ప్రారంభం అయింది. ఆ మరుసటి సంవత్సరం మొట్టమొదటి బట్టల మిల్లు కూడా ముంబయిలోనే స్థాపితమయింది.  1865 నాటికి ఈ మిల్లుల సంఖ్య 10కి పెరిగింది. ఇందులో పనిచేసే వారి సంఖ్య 6600లకు పెరిగింది. వీరిలో అధిక భాగం తెలంగాణ నుంచి వలసబోయిన పద్మశాలీలే! వీరి కన్నా ముందు ముంబాయికి భవన నిర్మాణ కార్మికులుగా వలస వచ్చిన వంజరి, మున్నూరు కాపు కులస్థులు మొదట కామాఠిపురాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కాంట్రాక్టర్లుగా ఎదిగారు. ఇప్పుడు ముంబయిలో వందేళ్ళ పైబడిన దాదాపు ప్రతి కట్టడాన్ని తెలంగాణ బిడ్డలే కట్టారంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎదిగి వచ్చిన వారే జ్యోతిరావ్‌ ఫూలెతో కలిసి నడిచారు. సమాజంలో అణచివేతకు గురైన అట్టడుగు వర్గాలకు అండగా నిలిచారు.
    బ్రాహ్మణ వర్గాల ఆధిపత్య ధోరణి వల్ల సమాజంలోని శూద్రులు, అతిశూద్రులకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించడానికి, వారిని సంఘటితం చేసి, చైతన్య పరిచే ఉద్దేశ్యంతో ‘సత్యశోధక్‌ సమాజ్‌’ని పూణెలో సెప్టెంబర్‌, 24, 1873నాడు స్థాపించారు. ఈ ప్రారంభ సమావేశానికి పూణె, ముంబయిల నుంచి దాదాపు యాభైమంది హాజరయ్యారు. ఈ సమావేశంలోనే ఫూలే ‘సత్య శోధక్‌ సమాజ్‌’ అధ్యక్షుడిగా, కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఫూలే కోశాధికారిగా ఎన్నికయినప్పటికీ దానికి ఆర్థికంగా ఆదుకున్నది, అండగా నిలిచింది మాత్రమే తెలుగువారే. ఈ ప్రారంభ సమావేశానికి ముంబయిలో భవన నిర్మాణ కాంట్రాక్టర్లుగా ప్రసిద్ధులయిన రామయ్య వెంకయ్య అయ్యవారూ, నర్సింగరావు సాహెబ్‌ వడ్నాల, జాయా ఎల్లప్పా లింగూ, వెంకూ బాలాజీ కాలేవార్‌లు తదితర తెలుగువారు హాజరయ్యారు. వీరందరూ తమ లేదా, తాత ముత్తాతల మూలాలు తెలంగాణలోనే ఉన్నాయని గర్వంగా చెప్పుకున్నారు.
    సమాజ స్థాపనకు పూర్వం నుంచే ఫూలేకు ముంబయి తెలుగువారితో మధ్య సంబంధాలున్నాయి. ఫూలే ఎప్పుడు ముంబయి వచ్చినా తాడ్‌దేవ్‌లోని తెలుగువాడు ‘నాగూ సయాజీ’ భవనంలోనే మకాం చేసేవాడు. ఇక్కడే రామయ్య అయ్యవారు, ఇతర సభ్యులు తరచూ కలుసుకునేవారు. నిజానికి ముంబయిలో ఫూలే తరపున ఉద్యమాన్ని నిర్వహించింది వలసబోయిన తెలంగాణ బహుజనులు. ‘కన్నీరు’ (రైతుల కన్నీరు) పేరుతో ఒక కరపత్రాన్ని తయారుచేసిన ఫూలే 1873లో ముంబయి వచ్చినప్పుడు సభ్యులకు వినిపించాడు. ఇందులో గ్రామాల్లోని కులకర్ణిలు, వకీళ్లు, ఉపాధ్యాయ జోషీలు రైతులను ఎన్ని రకాలుగా పీడిస్తున్నారో రుద్ధమైన కంఠంతో వినిపించారు. దీనికి  వెంటనే స్పందించిన నాగూరావ్‌ సయాజీ దాని ముద్రణకోసం డబ్బిచ్చారు. ఈ కరపత్రం ఆనాటి రైతుల దీనావస్థని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకి కట్టింది.
    తెలుగు వారు సత్యశోధక్‌ సమాజ్‌లో నిర్వహించిన కీలక భూమికను దాని కార్యదర్శి నారాయణ్‌ తుకారాం నగర్‌కర్‌ తన ద్వైవార్షిక రిపోర్టులో క్షుణ్ణంగా వివరించాడు. నిజానికి ముంబయిలో సమాజ్‌ శాఖను స్థాపించి, నడిపించాల్సిందిగా ఫూలే స్వయంగా రామయ్య అయ్యవారుకు లేఖ రాసిండు. ఆ పిలుపు మేరకు కామాటిపుర (కామ్‌Gమట్టిR మట్టి పనివారల పురం)లోని 18మంది తెలుగువారు సమాజ్‌ సభ్యత్వాన్ని స్వీకరించారు. అంతేగాకుండా సమాజ్‌ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ మరింతమందిని సభ్యులుగా చేర్పించారు. ఈ సమాజ్‌లో మొదట రామయ్య అయ్యవారూ, జాయా కారడిలింగూ, వెంకూ బాలాజీ కాలేవార్‌, జాయా నాగూ పర్‌బాజీ, నర్సింగరావు సాహెబ్‌ వడ్నాల, బాపూజీ ఈరప్ప కోర్బా, రాజూ బాబాజీ వంజరి, పోచెట్టి పోచయ్య నింగాల, ఈరప్ప మస్తాజీ పత్తీ, నరసూ నర్సప్ప నెల్ల, నాగూ సాయాజీ కాంట్రాక్టార్‌, ధర్మాజీ సరసూ, రాజన్నా సులూ, రాజన్నా సాయబు, డాక్టర్‌ గంగాజీ నర్సూ, మెనాజీ నర్సూ, వెంకూ నర్సూ, నాగూ నర్సూ, జిల్‌కర్‌ రాజన్నా మొదలైన వారు సత్యశోధక్‌ సమాజ్‌ ఉద్దేశ్యాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చిన తీరుని 1877 మార్చి 20 నాటి సమాజ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే బాలాజీ కాలేవార్‌, రామయ్య అయ్యవారు తదితరులు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం భట్‌ భిక్షుక్‌, సర్కారీ బ్రాహ్మణ ఉద్యోగస్థుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వానికి షికాయతులు, అర్జీలు చేస్తూ వచ్చిన తెలుగువారి పేర్లు మహారాష్ట్రలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నందున అక్కడి వారి ఉచ్ఛారణకు అనుగుణంగా అనేక మార్పులకు గురయ్యాయి. అందుకే తెలుగువారయినప్పటికీ వారి పేర్లలో భిన్నత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ఒకరు వెంకూ బాలాజీ. 
    వెంకూ బాలాజీ సమాజ్‌ సభ్యుడిగా చేరక పూర్వం గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా వేలాది బ్రాహ్మణులకు పక్వాన్న భోజనాలు పెట్టించి భారీగా దక్షిణాలు సమర్పించుకునేవారు. అయన సత్యశోధక సమాజ్‌ సభ్యుడిగా చేరిన తర్వాత వాటన్నింటిని రద్దు చేసి వాటి స్థానంలో సమస్త కులాల వికలాంగులకి, అంధులు, చెవిటి వారిని ఆర్థికంగా ఆదుకునేవాడు. స్త్రీల కోసం ప్రత్యేకంగా చీరెలు, దుస్తులు, పురుషులకు ధోవతులు కొత్తగా పెళ్ళయిన జంటలకు వంటసామాగ్రి, వృత్తి పనివస్తువులను ఉదారంగా దానం చేసేవాడు. కాలేవార్‌ (1820`1898) పేద వంజరి కుటుంబంలో జన్మించాడు. స్వయం కృషితో తట్టలు మోసే వాడి నుంచి కాంట్రాక్టర్‌గా ఎదిగి ముంబయిలోని అనేక చారిత్రక కట్టడాలను నిర్మించిన కాంట్రాక్టర్‌గా ప్రసిద్ధి చెందాడు. ముంబాయి నగరపాలిక భవనం, బరోడా మహారాజు ‘లక్ష్మీవిలాస్‌’ భవనం మొదలు అనేక బట్టల మిల్లులను ఈయనే నిర్మించాడు. 1880లోనే 60 లక్షల రూపాయల వ్యయంతో లక్ష్మీవిలాస్‌ భవనం నిర్మితమయింది. అంటే ఆయన ఎంత పెద్ద కాంట్రాక్టరో అర్థమవుతుంది.
    అలాగే ప్రతి దీపావళికి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి దక్షిణ చెల్లించుకునే మరో వ్యక్తి జాయ ఎల్లప్ప లింగూ. ఈయన సమాజ్‌ సభ్యత్వం తీసుకున్న తర్వాత ‘సమాజ మండలి’లోని ఎ అబ్బాయి/అమ్మాయి మెట్రిక్యులేషన్‌ పాసవుతారో వారికి బంగారు పతకంతో పాటుగా 25 రూపాయల నగదు బహుమతి ఇచ్చే ఏర్పాటు కూడా చేసిండు. ఈయన తండ్రి హైదరాబాద్‌ సంస్థానం నుంచి ముంబయికి వలస వచ్చాడు. లింగూ ముంబయిలోని పుట్టి అక్కడే ఉన్నత విద్యనభ్యసించాడు. హైదరాబాద్‌ సంస్థానంలో మెజిస్ట్రేట్‌ ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. కాని రెండేండ్ల కన్నా ఎక్కువగా అక్కడ పనిచేయలేదు. తన కిష్టమైన భవన నిర్మాణ రంగాన్ని ఏరి కోరి ఎన్నుకొని గొప్ప కాంట్రాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబాయిలోని ‘రాయల్‌ యాట్‌ బాంబే క్లబ్‌’, పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా నివసించే ‘టాటా మిషన్‌’ భవనం, ‘హోటెల్‌ వాట్సన్‌ అనెక్స్‌’ భవనాన్ని కూడా ఈయనే నిర్మించాడు. ఇప్పటికీ ఈ భవనాలు చెక్కు చెదరక డిజైన్‌కు, నిర్మాణ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.
    1874లో ‘ముంబయి నివాస మండలి’ ఆహ్వానం మేరకు ఫూలే ముంబయిలో పర్యటించారు. ఈ పర్యటనలో ఫూలే ‘సత్యశోధక సమాజ్‌’ కార్యక్రమాల్ని మరింత బలంగా ముందుకు తీసుకు పోవాల్సిన బాధ్యతను బాలూజీ కాలేవార్‌, కారాడీ లింగూలపై పెట్టారు. దాదాపు ఇదే సమయంలో వెంకయ్య అయ్యవారు కొద్ది కాలం సమాజ్‌ అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఈయన హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ముంబయికి చేరుకొని మొదట వెంకూజీ దగ్గర పనిచేసిండు. ఆ తర్వాత అన్నీ తానే అయి ముంబయిలో ప్రసిద్ధిగాంచిన గార్డెన్‌ మిల్స్‌, జనరల్‌ పోస్టాఫీసుల్ని కట్టించిండు. ఈయన సత్యశోధక్‌ సమాజ్‌ అభివృద్ధిలోనూ, ముంబయిలోని తెలుగువారి అభ్యున్నతికీ చేసిన కృషి చిరస్మరణీయమైంది.
    సత్యశోధక సమాజ్‌ స్థాపన సమయంలో పత్రికలన్నీ బ్రాహ్మణులే నడిపేవారు. శూద్రులకు, అతి శూద్రులకు తమ భావ వ్యాప్తికోసం పత్రిక అవసరమని వెంకయ్య అయ్యవారూ, కాలేవార్‌ తదితరులు కలిసి 1200 రూపాయలు వెచ్చించి ఒక ముద్రణా యంత్రాన్ని కొని ‘సత్యశోధక సమాజ్‌’ కోసం బహూకరించారు. 1874 నవంబర్‌లో ఇది జరిగింది. ‘సర్కారు శాఖలోని వ్రాహ్మణుల నుంచి శుద్రాతిశూద్రులకు ఎన్ని కష్టాలు ఎదురవుచున్నావో బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియజేయాలి’ అన్న ఆలోచనతో పత్రిక నడపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ పత్రిక నడిపే శక్తి, ఆర్థిక వనరులు సరిపోవని భావించి పత్రిక స్థాపనను ఫూలే వ్యతిరేకించాడు. అయితే కృష్ణారావు బాలేకర్‌ పట్టుదలతో పత్రికను ‘దీనబంధు’ పేరిట నడిపించారు. అయితే చివరికి ఫూలే ఊహించినట్లుగానే అది ఎక్కువకాలం మనగలగ లేదు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే పత్రికకోసం ముద్రణాయంత్రాన్ని విరాళంగా ఇవ్వగలిగారంటే వారి ఆలోచన సరళి, సత్యశోధక సమాజ్‌ ఉద్యమం పట్ల వారి అనురక్తి అర్థమవుతుంది.
    సత్యశోధక సమాజ్‌ కార్యకలాపాలతో  పాటుగా ఫూలే నడిపిన ‘పూణె సుశిక్షణ గృహం’పేరిట ఒక విద్యార్థి హాస్టల్‌ని కూడా నిర్వహించారు. దీని నిర్వహణలో కీలక భూమిక పోషించింది ఫూలే సహచరుడు కృష్ణారావు బాలేకర్‌. విద్యార్థులను కేవలం చదువులో మేటిగా తీర్చిదిద్దడమే గాకుండా సమాజం పట్ల నైతికతతో, బాధ్యతతో మెదిలే వారిగా మలచడమనేది ఈ హాస్టల్‌లో జరిగేది. హాస్టల్‌కుండే ఆర్థిక ఇబ్బందుల మూలంగా విద్యార్థుల సంఖ్య తరచూ మారుతూ ఉండేది. పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపడానికి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే ఇందుకు భిన్నంగా ముంబయిలోని కామాటిపురాలోని సంపన్న కుటుంబాల వారు తమ పిల్లల్ని పూణెలో బాలేకర్‌ హాస్టల్‌కు పంపించి విద్యాబుద్ధులు చెప్పించారు. ఇలా తెలుగువారు హాస్టల్‌ని ఆదుకున్నారు. ఆర్థికంగా కూడా అండగా నిలిచారు. అండగా నిలిచిన వారిలో కారాడి లింగూ జాయా, సేఠ్‌ రాజూ బాబాజీ తదితరులు ముఖ్యులు. ఫూలే చొరవతో ఆయన ఇంట్లోనే ఏర్పాటయిన ఈ పాఠశాలను తర్వాతి కాలంలో సావిత్రిబాయి ఫూలే నిర్వహించారు.దీని చొరవతో కామాటిపురాలో వసతిగృహం, స్కూల్‌ ప్రారంభించారు.
    కారాడి లింగూ జాయా కొడుకు ఎల్లప్ప లింగూ జాయ 1864లో మొట్టమొదటి సారిగా ‘సెకండ్‌ గ్రేడ్‌ ఆంగ్లో వర్నాక్యులర్‌ పాఠశాల’ పేరిట ఒక స్కూల్‌ని ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత విద్యాశాఖతో మాట్లాడి తెలుగు`మరాఠీ బోధనకు అవకాశం కల్పించాడు. ‘తెలుగు జ్ఞానోత్తేజక పుస్తకాలయము’, తెలుగు మహిళా మండలి అనే సంస్థల్ని కూడా స్థాపించి తెలుగువారు సమాజాభివృద్ధికి కృషి చేసిండ్రు. కేవలం తాము నివసిస్తున్న మహారాష్ట్రలోనే గాకుండా హైదరాబాద్‌లో ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు ముందున్నది తెలుగువారు.
    1908లో మూసీనదికి వరదలు వచ్చి హైదరాబాద్‌ నగరం సగం వరకూ కొట్టుకుపోయింది. ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డుమీదికి రావడంతో వారికి అండగా నిలిచింది మహారాష్ట్ర తెలుగువారు. రావుబహద్దూర్‌ ఎల్లప్ప బలరాం అధ్యక్షతన ఒక బహిరంగ సభ జరిపి అందులో వరద పీడితుల సహాయార్థం విరాళాల్ని సేకరించారు. వీటితో వంటపాత్రలు, బట్టలు, ధాన్యాన్ని సంభాజీ, డాక్టర్‌ నర్లు అనే నాయకులు ఖరీదు చేసి స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి అందజేసిండ్రు.
    ఇలా ఒక వైపు జ్యోతిరావ్‌ ఫూలేతో కలిసి పనిచేస్తూనే తమ తోటి తెలుగువారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన తెలుగువారు స్మరణకు నోచుకోలేదు. పరాయి రాష్ట్రంలో ఉన్నందున వారి సేవలకు సంబంధించిన వివరాలు అందరికీ అందుబాటులోకి రాలేదు. ఈ విషయాలపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరముంది. కానరాకుండా పోయిన మన కండ్లముందరి చరిత్రను రికార్డు చేసుకోవాల్సిన అవసరముంది. తెలుగు మహారాష్ట్రీయన్లు చేసిన ఉద్యమాలు, పోరాటాల తీరు తెన్నులు చరిత్రకెక్కాల్సిన సమయమిది.
    వీరు నిర్వహించిన ఉద్యమాల ప్రభావం తెలంగాణపై కూడా ఉండిరది. సికింద్రాబాద్‌నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన దళిత నాయకులు రాజారామ్‌భోలే, బి.ఎస్‌. వెంకట్రావులపై ఫూలే, అంబేద్కర్‌ ఉద్యమాల ప్రభావం ఉంది. అలాగే 1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి ఆ కూటమి తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలువడానికి కూడా స్ఫూర్తి ఫూలే`అంబేద్కర్‌ భావజాలం నుంచే వచ్చింది.  ఇదే స్ఫూర్తిని స్వీకరిస్తూ నేడు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతుండ్రు. దీనికి మహారాష్ట్రలో కూడా అక్కడి తెలుగువారు ధూమ్‌`ధామ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మమేకమయిండ్రు. 
                                                                                                                                        -సంగిశెట్టి శ్రీనివాస్‌
                                                                                                                        (ఫోరమ్‌ ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌)

Hyderabad sirf hamara

బండీకే నీఛే కుత్తా .....

   
    ఇయ్యాల పది జిల్లల తెలంగాణ పిల్లలు ఒక్కతాటిపై నిలిచి మిన్నంటేలా ప్రత్యేక తెలంగాణ నినాదాలిస్తుండ్రు. ‘నూతిల గుండేసి తూటేది’  అనే రాజకీయ నాయకులతోటి తెలంగాణ వచ్చుడు కాదని ఇప్పుడు రోడ్ల మీద రోజూ ధర్నాలు, దీక్షలు, చేస్తున్న ప్రజలందికీ తెలిసిందే! తెలంగాణ బిడ్డలు ఆంధ్రోళ్ళ పాలనలో సచ్చినా బతికినా ఒక్కటేనని పాణం తీసుకుంటుండ్రు. బిడ్డల్ని కోల్పోయిన తల్లితండ్రులు తెలంగాణలోని 119 నియోజక వర్గాల్లో గోడుగోడున ఏడుస్తుండ్రు. 53 ఏండ్ల సంది ‘తెలంగాణ తల్లి’ తన బిడ్డల బతుకులు చూసి శోకం పెట్టని రోజు లేదు. తెలంగాణ తల్లి గుండెకాయ ‘హైదరాబాద్‌’ని సీమాంధ్రులు తూట్లు పొడిసి గాట్లు పెడుతుండ్రు. ఈ మానని గాయం నిత్యం సలుపుతనే ఉంది. బిడ్డల్ని కోల్పోతున్న తెలంగాణ తల్లి దుఖం ఆగకుండున్నది. నోటికాడి బుక్క ఎత్తగొట్టినోళ్లు పూటకో మాట మాట్లాడుతు ఇజ్జత్‌ పుచ్చుకుంటుండ్రు. తెలంగాణ బిడ్డల బలిదానాలను కూడా పజీత చేస్తుండ్రు. వీరభూమి మరు భూమిగా మారుతుంటే తల్లి తెలంగాణ కుముల్తుంది.
    హైదరాబాద్‌ యోధులు ఎనుకటి సంది ఉద్యమంలో ముందే ఉన్నరు. 1952లో ముల్కీ ఉద్యమంలో నలుగురు బిడ్డలు పోలిసుల కాల్పులకు బలయ్యిండ్రు. అప్పుడు షురువైన బలిదానాలు ఇంకా కొనసాగుతున్నయి. 1969లో 369, ఇవ్వాల్టి పోరాటంలో 300కు పైగా సోర సోర పొలగాండ్ల రక్తం తాగినా సీమాంధ్ర పాలకుల నెత్తుటి దాహం తీరలేదు. ఇత్తెయ్యకుండనే పొత్తుగూడి 1956 నుంచి లూటిపోయిన చేనుని దోసుకున్నట్లు తెలంగాణను కొల్లగొడుతున్న సీమాంధ్ర పాలకవర్గాలు, వారి పోషకులు చరిత్రను, సంస్క ృతిని కించపరుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండ్రు. సాంస్క ృతిక దాడిని వివిధ రూపాల్లో తీవ్రతరం చేసిండ్రు. ఆంధ్రోళ్ళు సమస్యగా చెబుతున్న ప్రత్యేక తెలంగాణే పరిష్కారంగా హైదరాబాద్‌ వాసులు నమ్ముతుండ్రు. తెలంగాణ ఏర్పాటో, సమైక్యాంధ్ర కొనసాగింపో అనేది ‘హైద్రాబాద్‌’పై ఆధారపడి ఉంది. ‘హైద్రాబాద్‌’ పంచాయితి తష్వ అయితే గానీ తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు. కబ్జా పెట్టిన రాజధాని హైద్రాబాద్‌ని సాకుగా చూపించి సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తుండ్రు.
    హైద్రాబాద్‌ని అమాంతం మింగి మంచినీళ్లు తాగెతందుకు శాన ఇకమతులు జేస్తుండ్రు. తిమ్మిని బమ్మి చేస్తూ తీరొక్క ఏషం కట్టి మనల్ని తిప్పలు పెడ్తుండ్రు. కన్నమ్మ గోస పెడ్తుండ్రు. హైద్రాబాద్‌ నీ అబ్బ సొమ్మా? అని ఒగడు శిగమూగితే, ఇంకోడు తొండలు గుడ్లు పెట్టని భూమిని సవరించినమని కావురంతోటి వదురుతుండు. బాసినలుగ ఉన్న మిమ్మల్ని విముక్తి చేసినమని ఇంకొకయాన ఫోజులు కొడుతుండు. మీకు భాష నేర్పినమని బరితెగిస్తుండ్రు. తురుకోళ్లు తెలంగాణ కోరుతలేరని ఒక దగ్గర, తెలంగాణ వస్తే బిజెపి రాజ్యమొస్తదని, నక్సలైట్ల రాజ్యమొస్తదని అంతు పొంతు లేని , అడ్డూ అదుపు లేని కువ్వారపు మాటలు మాట్లాడుతుండ్రు. తినె తలెల ఊంచినట్టు రాజశేఖరరెడ్డి 2009లో తెలంగాణలో ఎలక్షన్లు అయ్యెదాకా ఓడ మల్లయ్య అంటూ వోట్లు ఇంక వొడువక ముందే నాలుగ్గంటలకే నంద్యాలల హైదరాబాద్‌పై యిసం గక్కిండు. ఇద్దరం కలిసుందమని చెప్తూ కావిలించుకొని ‘కుడి’ చెయ్యితోటి కడుపుల, ‘ఎడమ’ ‘చెయ్యి’తోటి ఈపుల కత్తి పోట్లు పొడుస్తుండ్రు. గద్దెనెక్కినోళ్ల మోసాలు ఇంకానా ఇక సాగవని తెలంగాణ గొంతెత్తి నినదిస్తోంది. ఈ నగరం మాది అని సవాల్‌ జేస్తుంది. దేశంలోనే భిన్నమైన హైదరాబాద్‌ భాషా, సంస్క ృతి, అవ్వల్‌ దర్జా అని తెలియజెప్పుతుంది.
    ఒక్కొక్కటి తఫ్సీలుగా చూస్తె హైదరాబాద్‌ ఎవ్వల్ది? దాని తహెజీబ్‌ ఏంది? అనేది సమజైతది. మేం డెవలప్‌ జేసినం అని విర్రవీగేటోళ్లు కండ్లు తెరిసి సూత్తే సత్తెము తెలుస్తది. అభివృద్ధి పేర్మీద ఆళ్లు ఏంజేసిండ్రో, ఎంత దోసుకుండ్రో లెక్క గట్టొచ్చు. ఎవ్వడు భూముల్ని అమ్ముకుండు, ఎవ్వలు కొనుక్కుండ్రు? ఎంత కబ్జ చేసిండ్రు, ఎవ్వల్ని ముంచి ఎవ్వల్ని తేల్చిండ్రో తెలుస్తది. హైదరాబాద్‌ల పబ్లిక్కు తాగేతందుకు కూడా నీళ్లియ్యలేని ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడ్డం మంచిగలేదు. భోలక్‌పూర్‌`ముషిరాబాద్‌ల గలీజు నీళ్లు తాగి సచ్చుడేరుగుడయిన సంగతి అందరికి మతిల ఉంది. నిజాం జమానాల సర్కార్‌ నల్ల చౌబీస్‌ గంట కుల్ల ఉండే సౌలత్‌ ఉండేది. ఇప్పుడు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ చుట్టూత ఇకమతులతోటి అనుతులు తెచ్చుకోని బిల్డింగ్‌లు కట్టి నీళ్ళన్నింటిని విషం చేసిండ్రు. ఈడ పుట్టి ఈడ పెరిగినోంది హైద్రబాదు కాకుంటే బతుకొచ్చి కిరాయింట్లో ఉన్నోడు మకాన్‌దార్‌ అయితడా? గుజరాతోల్లు బొంబాయి నుంచి అలగ్‌ అయినప్పుడు తట్టబుట్ట సదురుకొని ఖాళి చేసిండ్రు తప్ప పేచి పెట్టుకోలేదు. మా తాతల తాతలు, అమ్మమ్మలు, నాయినమ్మలు రాళ్లుమోసి కట్టిన హైద్రాబాద్‌ మాది గాకుంటే అన్ని తయారైనంక మెరిగెల గురిగోలె అమరించుకున్నోందయితదా? ఢంక బజాయించి చెబుతం హైద్రాబాద్‌ మా అబ్బదే. అవును హైద్రాబాద్‌ మా భాగమతి ప్రేమ నిషాన్‌. తుర్రెబాజ్‌ఖాన్‌ తుపాకి మోత, మా మహబూబ్‌ అలీఖాన్‌ మట్టి వాసన. బండ్లోల్ల కురుమన్న, జంపన్నల సాహస గీతం. కన్నతల్లిగ సూసుకునే హైద్రాబాద్‌ మాదిగాకుంటే బజారుల హర్రాజ్‌ చేసే నీదెట్లయితది?.
    తొండలు గుడ్లు పెట్టని భూముల్ని సవరించినమని అనేటోళ్లు ఆ భూమిని సీమాంధ్ర నుంచి కోసుకోని తీసుక రాలేదని గుర్తు పెట్టుకోవాలె. మా నిజాం రాజు సొంత ఆస్తి సర్ఫెఖాస్‌ భూముల్ని, భూదానోద్యమంలో భాగంగా మా తాతలు దానం చేసిన జాగను, కబ్జచేసి అప్పనంగా దక్కించుకుండ్రు. అసెంబ్లీలనే అవును అక్రమాలు జరిగినయని ధర్మాన ఒక్కసారన్న ధర్మంగా మాట్లాడిరడు. ఆకుల రాజయ్య లాంటోళ్లను ఆంధ్రోళ్ళు బంట్లుగా మార్సుకొని అత్రఫ్‌ బల్దా మొత్తం అమ్ముకుండ్రు. అయిన కాడికి కబ్జ పెట్టిండ్రు. ఏ రాష్ట్రానికైనా దాని రాజధాని సుట్టూతా ఇంత పెద్దమొత్తంలో గవుర్నమెంటు జాగా లింకెక్కడ్లేవు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు 1953 అక్టోబరు ఒకటి తర్వాత ఎన్ని రోజులు మద్రాసు నుంచి ఆఫీసులు ఖాళి చెయ్యకుంటే అన్ని రోజుల కిరాయి కట్టిండ్రు. కర్నూలుకు షిఫ్ట్‌ అయిన ఆంధ్ర ప్రభుత్వము హైదరాబాద్‌ మీద కన్నేసి దాన్ని కలుపుకుంటే తాము గుడారాల్లో ఆఫీసులు నడిపే బాధ తప్పుతదని మనమిద్దరమొక్కటే అని మెత్తటి కత్తితోటి తెలంగాణ కుత్తుక తప్పతీసిండ్రు. మాది తొండలు గుడ్లు పెట్టని భూమైతె ఎగేసుకొని ఈడికెందుకొచ్చిండ్రు. మాధాపూర్‌ల భూములమ్ముకున్న మావోళ్లు చాలమంది గుండెపగిలి సచ్చిండ్రు. మిగిలినోళ్లు మీ హై‘టెక్కు’ సిటీల వాచ్‌మెన్లుగా సస్తూ బతుకుతుండ్రు. ఇదే ఆంధ్రోళ్ళు చెప్పే అభివృద్ధి. హైటెక్కు సిటీ కట్టినంక హైదరాబాద్‌ అంటే ఆంధ్రోళ్ళదే అన్నట్టుగ చార్మినార్‌కు బదులుగ దాన్నే సూపించి పాత హైదరాబాద్‌ని పాతరపెట్టిండ్రు. మా భూములన్నింటిని సెజ్‌ల పేర్మీద, రింగురోడుల పొంటి, గురుకుల్‌ భూములు, భూదాన భూముల్ని ఆడిరది ఆటగా, పాడిరది పాటగా పట్ట చేసుకుండ్రు. 1948ల్నే దేశంల హైదరాబాద్‌ బలవంతపు విలీనం సందర్భంగా మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన ఆంధ్ర`ఆఫీసర్లు మంచి మంచి బిల్డింగుల్ని సొంతం జేసుకుండ్రు. విలీనం సందర్భంగా పైసలున్న ముస్లిములు లండన్‌లో సెటిలయ్యెతందుకు ఇక్కడి ఆస్తులమ్మడానికి ప్రయత్నిస్తే వాటిని అమ్మనివ్వకుండా ఎవాక్యూ ప్రాపర్టీ కింద స్వాహా చేసిండ్రు. ఇప్పటికీ జూబ్లిహిల్స్‌లో చేతులు మారిన పాత భవంతుల చూస్తే అవ్వెవ్వరియొ తెలుస్తది. ఈ తొండలు గుడ్లు పెట్టని భూములన్నింటిని వామనుడోతిగ దిగ మింగిండ్రు. భూములు, ఆకాశ హర్మ్యాలు ఆళ్ళవే. ఇగిప్పుడు తెలంగాణ బిడ్డల నెత్తిల పెట్టి అడుక్కు తొక్కుతుండ్రు.
    బానిసలుగ బతుకుతున్న మమ్మల్ని విముక్తి చేసింది ఆళ్ళేనట. అవును మరి తుపాకి ఎట్లపట్టుకోవాలో తెలువని పుచ్చలపల్లి సుందరయ్య మీకు హీరో లాగ కనబడుతడు. అసలు తూపాకి పట్టి జంగ్‌ చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సుద్దాల హనుమంతు, దొడ్డి కొమురయ్య, బండి యాదగిరి లాంటి వందల వేల యోధులు మీ కంటికి ఆనరు. మా బతుకులు బాగు చేసుకునేందుకు తుపాకి పడితే నిజాం సైన్యం మూడొందల మందిని పొట్టన పెట్టుకుంటే నెహ్రూ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం`పటేల్‌ సైన్యం 1948`51 మధ్యల నాలుగు వేల మందిని సంపి  మా నెత్తురు తాగింది. అయినా కూడా మీవాళ్ళు రాసిన చరిత్ర పుణ్యాన ఇయ్యాల్టికి కూడా నిజాంనే నిందిస్తున్నాం తప్ప నెహ్రూని, కాంగ్రెస్‌ని పళ్లెత్తు మాట అనలేక పోతున్నం. అవును గాని ఆంధ్రోళ్లు ఈడ ఒక్క మాటకు జవాబు ఇచ్చి తీరాలి. ఈడ పుట్టి ఈడ పెరిగినోని పాలనల మేం బతికితే అది బానిస బతుకెట్ల అయితది. పరాయి దేశం నుంచి వచ్చి వనరుల్ని, నిధుల్ని తరలించుకోని పొయిన బ్రిటిషోని పాలనలో ఉన్న మీరు స్వతంత్రులెట్లయితరు? మీ చీరాల పేరాల రెండూర్ల కొట్లాట పెద్ద ఉద్యమమై చరిత్రకెక్కుతది. మా సాయుధ పోరాటం గురించి పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా ఒక్క ముక్కెందుకుండది?
    మాకు భాష నేర్పిన మని కూడా సీమాంధ్రులు కోతల కూతలు కూస్తుండ్రు. మా హైదరాబాద్‌ల ఎనుకట ప్రతి ఒక్కనికి ఐదు భాషలొచ్చేటియి. మాది పంచ భాషా సంస్క ృతి. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, ఇంగ్లీషు ఈ ఐదు భాషల్లో హైదరాబాద్‌ వ్యవహారాలు నడిచేటివి. కాళోజి అన్నట్టు రెండున్నర జిల్లాల వాళ్ళ భాషే ప్రామాణికమయింది. ఈ రెండున్నర జిల్లాల వాండ్లే హైదరబాద్‌ రాష్ట్రంలో దొంగ ముల్కీ సర్టిఫికెట్టు సంపాదించి ఉద్యోగాలు సంపాదించిండ్రు. పాఠశాలల్లో పంతుల్లై తమ భాషే గొప్పదని ఆ భాషలోనే సదువులు నేర్పి తెలంగాణ భాషకు గోరికట్టిండ్రు. మా తెలంగాణ భాషను మాగ్గాకుండా చేసి భాష నేర్పినమనే బైరూపులేషమేస్తుండ్రు.
    ఒకదానికొకటి పొంతన లేకుండ తెలంగాణొస్తె బిజేపి అధికారం లోకి వస్తదని, నక్సలైట్లు రాజ్యమేలుతరని బట్టకాల్సి మీదేసె మాటలు మాట్లాడుతుండ్రు. బిజేపి అధికారంలోకి వచ్చే అవకాశం వాళ్లే చేజేతుల కాకినాడ తీర్మానాన్ని వెనక్కు నెట్టి, రాజీనామాల్లో చీలిక తెచ్చి కాలరాసుకుండ్రు. ఇగ నక్సలైట్లు దేశమంతటున్నరు. అది కేంద్రం చేతిలోని ముచ్చట. ముస్లిముల తెలంగాణ కోరుకుంటలేరని మరొక దుర్మార్గమైన ముచ్చట ముందుకు తీసుకొచ్చిండ్రు. తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో, ముస్లిములున్న దాదాపు ప్రతి ఊర్ల ధర్నాకు దిగి ఎక్కడికక్కడ సంఘాల్ని స్థాపించుకొని ఉద్యమాల్జేస్తుండ్రు. జమాతె`హింద్‌ సంస్థ తరపున లక్షలాది ముస్లిం ప్రజానీకంతో ‘‘జస్టిస్‌ ఫర్‌ తెలంగాణ, తెలంగాణ ఫర్‌ జస్టిస్‌’ అనే నినాదమిచ్చి హైదరాబాద్‌లో భారీ గర్జన నిర్వహించి ముక్తకంఠంతో వారి వాణిని వినిపించిండ్రు. మా హైద్రబాద్‌ల ఎనుకటి సంది హిందూ`ముస్లిములం అన్నదమ్ముల్లాగున్నం. ఒకర్నొకరం ఆదుకున్నం. కాని మీరు ఫ్యాక్షన్‌ బుద్ధితోటి అధికారం కోసం హైదరబాద్‌ల మతకలహాలు సృష్టించి మా శవాల మీద్కెళ్లి మీరు గద్దెనెక్కిండ్రు. ఈ యాభై ఏండ్లల్ల మావోల్లు ఒక్కలు కూడా ఐదేండ్లు ముఖ్యమంత్రిగ లేడంటె మతలబేంది. 53 ఏండ్లల్ల మావాల్లు ఆరేండ్లు కూడా సక్కగా సిఎంగ లేరు.
    రాజశేఖరరెడ్డి తాను సిఎంగ కొనసాగెతందుకు తాను తింటున్న తలెల్నే ఊంచిండు. 2009 అసెంబ్లీ ఎన్నికలు  ఎప్పటి మాదిరిగానే తెలంగాణలోనే మొదట జరిగినయి. దీన్ని మొఖగ తీసుకున్న రాజశేఖరరెడ్డి తెలంగాణల ఎన్నికలు జరిగిన రోజే నాలుగ్గంటలకు ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టుగ ‘మీరు కాంగ్రెస్‌కు ఓటెయ్యనట్లయితె హైదరాబాద్‌లో విదేశీయుల్లాగ బతకాల్సి వస్తది. వ్యాపారాలు చేసుకోలేం. సదువులు సదువుకోలేం’ అని ప్రజల్ని రెచ్చగొట్టిండు. ఓట్ల పంట పండిరచుకుండు. రాజశేఖరరెడ్డి 32 యేండ్ల నుంచి హైదరాబాద్‌ గండిపేట నీళ్లు తాగిండు. కనీసం ఆ విశ్వాసమన్నా లేకుండా అన్నం బెట్టిన తల్లిలాంటి హైదరాబాద్‌ మీద యిషం గక్కిండు. హైదరాబాద్‌లనే కాదు, అదిలాబాదుల ఉన్న సింగరేణిల గూడా నీ కాంట్రాక్టర్లే, నీ మనుషులే దోసుకుంటున్నా నిన్నొక్క మాట అనలేక పోతిమి. ఓట్ల కోసం హైదరబాద్‌ తెహజీబ్‌ని అమ్మకానికి పెట్టిండు. ఇన్ని రోజులు ఆదుకొని ఆశ్రయమిచ్చిన హైదరాబాద్‌ని బెమ్మ రాక్షసిలా చిత్రీకరించిన రాజశేఖరరెడ్డి నియ్యత్‌ అందరికి తెలిషిపాయె.
    హైదరాబాద్‌ సంస్క ృతి ఆంధ్రోళ్ళకు ఎన్నడర్థం కాదు. ఏండ్ల సందున్నా ఒక్క ముక్క ఉర్దూ ఉచ్చరిచలేరు.  హైదరబాద్‌ల సిర్ఫ్‌ తెలంగాణ వాళ్లే కాదు అఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌, అరేబియా, ఆఫ్రికా, ఇంగ్లండ్‌ నుంచి వాళ్ళుకూడా అన్యోన్యంగా ఉండి ఇక్కడి భూమిని కండ్లకద్దుకున్నరు. అంతెందుకు పాకిస్తాన్‌ నుంచి వచ్చి కరాచీ బేకరి నడిపిస్తున్న వాళ్లు హైదరాబాద్‌తో మమేకమయిండ్రు. ఇరానీ చాయ్‌ జిందగీలో భాగమయింది. ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన కిర్క్‌ పాట్రిక్‌`ఖైరున్నీసా ప్రేమించి పెళ్ళాడి హైదరాబాద్‌ ప్యార్‌ని విశ్వవ్యాప్తం జేసిండు. గుజరాత్‌ నుంచి వచ్చిన మార్వాడీలయితే 1969 ఉద్యమానికి అండదండగా నిలిచిండ్రు. బెంగాళీలు, కేరళీయులు, తమిళులు, సిక్కులు, మహారాష్ట్రియన్లు, కన్నడిగులు అందరూ హైదరాబాద్‌ని ఓన్‌ చేసుకుండ్రు. ఇక్కడి చరిత్ర, సంస్క ృతి, చారిత్రక వారసత్వంతో మమేకమయ్యిండ్రు. హైద్రాబాద్‌ మాది, మాది హైద్రాబాద్‌ అని ఒక్క సుతితోటి చెప్పుతుండ్రు. ఒక్క ఆంధ్రోళ్ళు మాత్రమే ఎక్కడపోతే అక్కడ ద్వీపకల్పాల్ని సృష్టిస్తుండ్రు. తేడాలు పాటిస్తుండ్రు. ఒకవైపు హైదరాబాద్‌ కాస్మోపాలిటన్‌ కల్చర్‌ని, హైదరాబాద్‌ సమశీతోష్ణ స్థితిని ఎంజాయ్‌ చేస్తూ మరోవైపు తల్లిపాలు పిండుకొని అమ్ముకుందామనుకుంటుండ్రు. తమకు వర్తించిన నిబంధనలే ఇతరులకు కూడా వర్తించాలి, వర్తిస్తాయనే సోయి లేకుండా సీమాంధ్రులు చిందులేస్తుండ్రు. ఆంధ్రోళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు అందుకు వాళ్ళు చూపిన ప్రధాన కారణం రాజధాని తెలుగు ప్రాంతాలకు దూరంగా ఉందని చెప్పిండ్రు. అవును నిజమే శ్రీకాకుళం వాండ్లకు చెన్నయ్‌ ఎట్లాగు దూరమే. మరి అదే సూత్రం హైదరాబాద్‌ల ఎందుకు వర్తించదు. హైదరాబాద్‌ రావాలంటే ఎట్నుంచైనా కనీసం రెండువందల కిలోమీటర్లు దాటి వస్తెగానీ హైదరాబాద్‌ శివారు తగలదు. ఎట్ల చూసినా హైదరాబాద్‌ సీమాంధ్రులకు దోపిడి చేసుకునేందుకు ఒక  స్థావరం మాత్రమే. ఎవరైనా తమకేం కావాలో కోరుకోవడం న్యాయం. కాని నీది నాక్కావాలె అనడం అన్యాయం. ఈ అన్యాయపు పునాదులపైనే ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ నిలబడ్డది.
    మొత్తం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా రాష్ట్ర రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోసం, అదే తెలంగాణ కోసం కొట్లాడుతుంది. 53 యేండ్ల సంది తెలంగాణ సంపదను కొల్లగొడుతూ, అదే డబ్బుతో తీసిన సినిమాల్లో బరితెగించి తెలంగాణోళ్లను తెలివిలేనోళ్లుగా చిత్రీకరించి పైసలు సంపాదించుకుంటుండ్రు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన నిజామ్‌ హైదరాబాద్‌ రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌గా ఉండి తన సర్ఫేఖాస్‌ ఆస్తినంతా ప్రభుత్వానికి అప్పగిస్తే దాన్ని ఆంధ్రోళ్లు సెక్రటేరియట్‌లో చక్రం తిప్పి, వక్ఫ్‌బోర్డులో రికార్డులు మాయం జేసి సొంతం జేసుకుండ్రు. ఇంతా జేసి దానికి అభివృద్ధి అనే ముసుగేస్తే హైదరాబాద్‌ ఎందుకు భరిస్తది. ఇంక సయించదు. అందుకే హైదరాబాద్‌ ప్రత్యేక తెలంగాణ జంగ్‌కు సైరనూదింది. తన అస్తిత్వం, ఆస్తి అన్ని కొల్లకొట్టబడిన హైదరాబాద్‌కు తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఆంధ్రులు తమ దోపిడి, దగా, మోసపు కార్యాల ద్వారా కల్పించిండ్రు.
    హైదరాబాద్‌ ఎన్నటికీ హైదరాబాదీయులదే. ప్రేమతో అమ్మా అని పిలిస్తే దాసుకున్నదంతా దోసిళ్లతో దానం చేసే గుణం హైదరాబాద్‌కుంది. హైదరాబాద్‌ నిజాం జమానాలో మొత్తం దేశంలోని నగరాల్లో నాలుగో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది. అంటే అభివృద్ధి చెందినట్టా? హైదరాబాద్‌ని డెవలప్‌ చేసినమన్నోళ్లు కళ్లుండి చూడలేని గుడ్లోళ్లు. బండీకే నిఛే కుత్తాలు. నిజమే నడుస్తున్న ఎడ్ల బండి కింద చల్లటి నీడలో అడుగులేసే కుక్క బండిలోని లోడ్‌నంతా తానే భరిస్తున్నట్టుగ అపసోపలు పడి పోయిందట. ప్రస్తుతం ఆంధ్రోళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉంది. కడుపుల సల్ల కదులకుండ అన్ని అమర్చి పెడితే, అజాంజాహిమిల్లు, ఆల్విన్‌ ఫ్యాక్టరీలను అమ్ముకోని మింగి అంతా అభివృద్ధి చేసినమని ఆంధ్రోళ్ళు అపసోపాలు పడి పోతుండ్రు.   
    హైదరబాద్‌కిది చాలా పరీక్షా సమయం. వందల యేండ్ల తమ చరిత్ర, సంస్క ృతి, వారసత్వ సంపద నాశనం గాకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత హైదరబాదీయులందరిపై ఉంది. అఘోరనాథ్‌ చటోపాధ్యాయ, ఆయన కూతురు సరోజిని నాయుడు, ఆమె కూతురు పద్మజా, లీలామణి నాయుడు, కొడుకు జయసూర్య నాయుడు, ఇంగ్లీషు రచయిత టి.ఎస్‌. ఇలియట్‌, ఎవరెస్టును అధిరోహించిన ఎడ్మండ్‌ హిల్లరీ, నోబెల్‌ గ్రహీత రోనాల్డ్‌రాస్‌,  ప్రపంచమంతా ఇస్లాం ఫిలాసఫీని ప్రచారం చేసిన జమాలుద్దిన్‌ అఫ్ఘానీ, క్రికెటర్‌ జయసింహ, అజరుద్దీన్‌, అమెరికాలో భారత అంబాసిడర్‌ అబిద్‌ అలీఖాన్‌, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, భారత్‌ ఏక్‌ కోజ్‌ శ్యామ్‌ బెనగల్‌, మాభూమి బి.నరసింగరావు ఇలా వందల వేల హైదరాబాదీయులతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌ తెలంగాణ వాళ్లు కాకపోయినా, హేగ్‌లోని ఇంటర్నేషనల్‌ కోర్టులో జడ్జ్‌గా పనిచేసిన జస్టిస్‌ కొమురయ్య ఇంకా ఇలాంటి ఎందరినో హైదరాబాద్‌ ఆదరించింది హక్కున చేర్చుకుంది. తమ బిడ్డలుగా చూసుకుంది. హైదరాబాద్‌ బచావో పేరిట ఏర్పాటయిన బినామీ సంస్థలు ఆంధ్రుల కొమ్ముకాస్తూ తెలంగాణను వంచిస్తున్నాయి. ఈ వంచనను పసిగట్టి ఎండగట్టాలి.  

-సంగిశెట్టి శ్రీనివాస్‌

KALOJI NARAYANA RAO AND HIS ACTIVITIES

వైతాళిక సమితి- KALOJI

కాళోజి    తెలంగాణ దృక్కోణంతో చరిత్రను, సాహిత్యాన్ని మూలాల్లోకి వెళ్లి పునర్మూల్యాంకనం చేస్తూ ఉంటే ప్రతి సారి మణి మాణిక్యాలు దొరుకుతూనే ఉన్నాయి. అయితే విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయాల్సిన పనిని ఆసక్తిగల కొంత మంది పరిశోధకులు మాత్రమే చేస్తూ ఉండడంతో ఫలితాలు ఆశించిన స్థాయిలో/సంతృప్తికరంగా లేవు. పునాది పరిశోధన లేకపోవడంతో పైపై మాటలకు ప్రాధాన్యం పెరిగిపోయి, అసలు విషయానికి ఎసరు వస్తోంది. ఎవరైనా రికార్డయిన విషయాలపై వ్యాఖ్యానం చేయడం సులభం. అయితే ఈ రికార్డులే అరకొరగా దొరుకుతున్నప్పుడు సాధికారిక వ్యాఖ్యనం చేయడం దుర్లభం. తెలంగాణలో ప్రస్తుతం ఈ పరిస్థితే కొనసాగుతోంది. తెలంగాణలోని వైతాళికులందరి సాహిత్యానికి, సృజనకు, ఉద్యమ కార్యాచరణకు, సమాజ చైతన్యానికి వివిధ రూపాల్లో చేసిన కృషికి చరిత్రలో స్థానం దక్కలేదు. అంతెందుకు ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రాసి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్న తొలి తెలుగు వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన కవిత్వం నేటికీ సంపుటిగా రాలేదంటే బాధేస్తుంది. వెంటనే బాధ్యతను గుర్తు చేస్తుంది. వట్టికోట ఆళ్వారుస్వామి సమగ్ర కథలు ఇప్పటికీ సంకలనంగా రాలేదు. భాగ్యరెడ్డి వర్మ ఉపన్యాసాలు, వ్యాసాలు ఇప్పటి తరానికి అందుబాటులోకి రాలేదు. ఇలా చాలామంది తెలంగాణ వైతాళికుల పుస్తకాలు/రచనలు అచ్చుకు నోచుకోలేదు. అలాంటి వారిలో కాళోజి నారాయణరావు కూడా ఉన్నాడు. కాళోజి నారాయణరావు కూడా అని ఎందుకనాల్సి వస్తుందంటే 1934 నుంచీ ఆయన రాసిన ప్రతి అక్షరం అచ్చు రూపంలో శాశ్వతత్వాన్ని సంపాదించుకుంది. అటు అణా గ్రంథమాల ప్రచురించిన కాళోజి కథలు, దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించిన ‘నా భారతదేశ యాత్ర’ మొదలు 1953 నాటి ‘నాగొడవ’, చివరికి ఇదీ నాగొడవ ఇలా అనేక రచనలు అచ్చురూపంలో వచ్చాయి. అలాగే షష్టిపూర్తి సమయంలో వెలువరించిన సంచిక, నాట్యకళ ప్రభాకర్‌ ప్రచురించిన సమగ్ర సాహిత్యం కూడా కాళోజి రచనలను రికార్డు చేసింది. కాళోజి కథలు, శాసనమండలిలో కాళోజి ప్రసంగాలు కూడా అచ్చయ్యాయి. ఇవన్నీ ఆయన గురించి, రచనల గురించీ విశ్లేషణకు, విమర్శకు ఉపయోగ పడ్డాయి. అయితే కాళోజి కీలక పాత్ర పోషించి  తెలంగాణలో చైతన్యానికి, కళా, సాహిత్య వికాసానికి విశేషంగా కృషి చేసిన ‘వైతాళిక సమితి’ గురించి తెలిసింది మాత్రం చాలా తక్కువ. గతంలో కాళోజి గురించి పరిశోధన చేసిన వారు (ఒక్క  కే.శ్రీనివాస్‌ తప్ప) గానీ, స్వయంగా కాళోజి ‘ఇదీ నాగొడవ’లోగానీ లోతుగా రికార్డు చేయని అంశాలు ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. దీని ద్వారా కాళోజి కార్యాచరణ, సమిష్టి కృషి, ఆలోచనా సరళిని మరింత లోతుగా అర్థంచేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ వ్యాసంలో కాళోజి`వైతాళిక సమితి`దాని కార్యక్రమాలు గురించి వివరంగా చర్చించడమైంది. ప్రతి చిన్న అంశంపై ప్రత్యేక శ్రద్దతో అభిప్రాయాలను వ్యక్తం చేసి తద్వారా కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అప్పటి వారి ఆలోచనా ధోరణి దానిలోని ప్రజాస్వామ్య విలువల్ని అర్థం చేసుకోవడానికి ఈ ‘వైతాళిక సమితి’ కార్యాచరణ ఒక పనిముట్టుగా ఉపయోగపడుతుంది.

    ఈ ‘వైతాళిక సమితి’ మొదట 1935 ఆ ప్రాంతంలో ప్రారంభమయింది. (1938 ఆ ప్రాంతం అని కాళోజిపై పరిశోధన చేసిన తూర్పు మల్లారెడ్డి పేర్కొన్నాడు. కాని దానికి ఆధారాలు ఇవ్వలేదు. అలాగే కాళోజి, దేవులపల్లి రామానుజరావు ఇద్దరూ 1935అని పేర్కొన్నారు) ప్రారంభ దినాల్లో కథలు, కవిత్వం ద్వారా సాహిత్య వ్యవసాయం చేసి కొంతకాలం స్థబ్దుగా ఉన్నారు. మళ్ళీ 1945 ఉగాది (పార్థివ) నాడు తమ పున: ప్రస్థానాన్ని ప్రారంభించింది. సమాజ సేవే ధ్యేయంగా, సాహిత్యం, కళలే మార్గంగా పనిచేసిన సంస్థ ఇది.
     కాళోజి నారాయణరావు హైదరాబాద్‌లో వకాలత్‌ విద్య చదువుతున్న కాలంలో ఈ వైతాళిక సమితిని ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా రికార్డు చేసిండు. జూలై ఏడు, 1966నాడు రచయిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్యకు రాసిన లేఖలో చెప్పిండు. ‘‘1935 ఆ ప్రాంతంలో హైద్రాబాద్‌లో ఓ నలుగురు పిచ్చివాళ్లు ఒకచో చేరివుండిరి. వారు ఆనాటికి తమ్ము తాము వైతాళికులుగా ప్రకటించుకొని ప్రతి పదిహేను రోజుల కొకసారి సమావేశమై, నలుగురు మిత్రులను కూడ వేసుకొని కథలు, గేయాలు వ్రాసి చదివి వినిపించేవారు. అడపాదడపా హైద్రాబాదుకు వచ్చిన మహారాష్ట్ర, హిందీ, ఆంధ్ర కవి మిత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి రచనలు వినిపించీ, ఉపన్యాసం చేసే ఏర్పాటు చేసేవారు. వారిలో కాళోజితో బాటు తక్కిన ముగ్గురు (1) వెల్దుర్తి మాణిక్యరావు (2) వెంకటరాజన్న అవధాని, (3) గంటి లక్ష్మినారాయణ (గలన)’’. అని రాసిండు. ఈ విషయాన్ని గొర్రెపటి ‘మిత్రులూ`నేనూ’ అనే తన పుస్తకంలో రికార్డు చేసిండు. ఇందులో వెంకట రాజన్న అవధాని ఆరుభాషల్లో పండితుడు. వకీలు, వైద్యుడు. కాళోజి అభిప్రాయం ప్రకారం బహుకుటుంబి, దరిద్రుడు. ఈయన 1909లో మంథెన (కరీంనగర్‌ జిల్లా)లో జన్మించిండు. ఆర్యసమాజం చేత ప్రభావితుడైన అవధాని అంధ, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమాల్ని చేపట్టిండు. దళితుల్ని దేవాలయ ప్రవేశాల్ని చేయించడమే గాకుండా, స్త్రీ విద్య కోసం కృషి చేసిండు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చిండు. ఈయన కథలు, నవలలు కూడా రాసిండు. 1995లో చనిపోయిండు.  ఇక వెల్దుర్తి మాణిక్యరావుకిది శతజయంతి సంవత్సరం. ఆయన 1912 డిసెంబర్‌ 12న మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో జన్మించిండు. కథలు, కవిత్వం రాయడమే గాకుండా చాలా కాలం మద్యపాన వ్యతిరేకంగా ప్రజా చైతన్యానికి పునాదులు వేసిండు. పత్రికా విలేఖరిగా, కాలమిస్టుగా, జర్నలిస్టుగా, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ చరిత్ర రచయితగా చిరపరిచితులు. ఇక నాలుగో వ్యక్తి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులు గంటి లక్ష్మినారాయణ. 1904లో జన్మించిండు. 1920 నుంచే కాంగ్రెస్‌లో చేరి దాని అభివృద్ధికి కృషి చేసిండు. వల్లూరి బసవరాజుకు అండగా నిలబడి ఆయన్ని పైకితెచ్చిన నిరాడంబరుడు. మంచి వ్యవహర్త అని కాళోజి రాసిండు.
    ఈ సంఘం తరపున కేవలం కవి, పండిత సమ్మేళనాల్ని ఏర్పాటు చేయడమే గాకుండా ముగ్గురు కలిసి, కథలు, కవిత్వం రాయడం అనే నూతన ప్రక్రియకు నాంది పలికిండ్రు. (ఇటీవలి కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ఆవాహన చేసుకున్న శ్రీశిరసులు పేరిట నలుగురు కవులు కలిసి నల్ల వలస కవిత్వాన్ని అక్షరీకరించిండ్రు) వీరు రాసిన ‘తిరుగుబాటు’, విభూతి లేక ఫేస్‌ పౌడర్‌ లాంటి కథలు అప్పటి పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి.  వీరి రచనలకు ప్రోత్సాహకంగా నిలిచింది గోలకొండ పత్రిక. అయితే 1938 తర్వాత ఆంధ్రకేసరి మాస పత్రిక ప్రారంభం కావడం ఒకవైపు, మరోవైపు వందేమాతర ఉద్యమం మరోవైపు వీరి సాహిత్య కార్యకలాపాలకు తాత్కాలిక విరామాన్నిచ్చాయి. అణా, దేశోద్ధారక గ్రంథమాల ప్రారంభం కావడంతో వీరి కార్యకలాపాలకు కాసింత బ్రేక్‌ పడిరదని చెప్పవచ్చు. వైతాళిక సమితిలో ఉన్న వారే ఈ పత్రిక, గ్రంథమాలల నిర్వహణలో నిమగ్నం కావడంతో కార్యక్రమాలు తగ్గాయి. 1945 నాటికి ఒకవైపు నిజాంరాష్ట్రాంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతికి రావడం, 1943లో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు ప్రారంభం కావడం కూడా వీరు తిరిగి చురుగ్గా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి దోహదం చేసిన అంశాలుగా చెప్పవచ్చు.
    ఈ ‘వైతాళిక సమితి’ 1945 ఉగాది (పార్థివ సంవత్సరం) నాడు పున:ప్రారంభమైంది. ఇందులో ఐదుగురు సభ్యులున్నారు. వారి అసలు పేర్లని ఎక్కడా రికార్డు చేయలేదు. ఏప్రిల్‌ రెండు నాటి గోలకొండ పత్రికలో ‘వైతాళికుడు’ పేరిట కాళోజి నారాయణరావు రాసిన వ్యాసంలో ఈ సంఘం ఉద్దేశ్యాలు వివరంగా పేర్కొన్నాడు. మేము చేసే పనితోనే సంబంధమున్నందున మా చిరునామాలు, పేర్లు కూడా అంతం ముఖ్యం కావని అందులో రాసిండు. మేము చేసే పని వల్ల ‘‘మాకు లాభం లేకున్నను ఇతరులు (అంటే తెలంగాణలోని ఆంధ్రులకు) లాభం పొందిన చాలు’’ అని తమ ఆశయాన్ని ప్రకటించారు. ఇందుకు మమ్మల్ని అవమానింతురో, బహుమానింతురో అనే సంశయాన్ని కూడా వ్యక్తం చేసిండు.
    తమ గురించి ఇలా రాసిండు. ‘‘మేము మే’’ మనగా మాలో అయిదుగురమున్నాము. అడవిలోని ఉసిరిలవలె అక్కడక్కడి వాండ్ల మైనను అందరము నీనాడు ఒక్క చోటికి చేరినాము. మా కాపురపు స్థలము హైదరాబాదు. మీతో మాకు ఉత్తర ప్రత్యుత్తరములుండవు కనుక మే ముండెడి బజారు, గల్లీ, యింటి సంఖ్య యివన్నియు మీ కనవసరమని తెలుపుట మాని వైచుచున్నాను. అని చెబుతూ తమలోని అయిదుగురి గురించి వివరంగానే రాసిండు. అందులో మొదట తన పేరు ‘వైతాళికుడు’ గురించి ఇలా చెప్పుకుండు. ‘‘సోదరులారా! నన్ను ‘‘వైతాళికు’డందురు. ఆది మా తల్లిదండ్రులు బొడ్డుగోసి పెట్టిన పేరు గాకున్నను, ఇప్పటికి నాకాపేరే రూఢjైు పోయినది. అందుచే నా అసలుపేరు మీకు చెప్పకున్నను అపచారము కాదు గదా. చిన్నప్పుడు ‘నాకు మాతాత యనగా ఎక్కువ మాలిమి యుండెడిది. ఆయన యెప్పుడును నామీద ఈగ వ్రాలనిచ్చెడివాడు గాదు. ఆయన యనగా మా యింటిలో సింహస్వప్నము. అందుచే నేనాయన యొద్ద ఉన్నంత సేపు, నా వైపు తేఱిపాఱి చూచుటకు గూడ ఎవ్వరికిని గుండె అనెడిదికాదు. (ధైర్యముండెడిది కాదు!) నాకు మొదటి నుండియు నిద్రమెలకువ యెక్కువ. కోడి కూతతోనే లేచి తాత ప్రక్కలోనికి చేరి ‘‘తాతా తెల్లవార వచ్చినది. లే నాకు పద్యాలు చెప్పు’’మని వేధించెడి వాడను. కాసంత ప్రొద్దెక్కగనే ‘‘తాతా? భోజనానికి వేళjైునదిలే యని యిట్లు ఆయన వెంబడి బడుచుండెడివాడను. ఒకప్పుడాయన ‘‘ఏమిటిరా? వైతాళికుని లాగున నా వెంటబడినా!’’వని వేళాకోళము చేయగా అదిమొదలు ఆ పేరే పట్టుకొని అందఱు నన్ను పిలువసాగినారు.’’ అని తన పేరు వెనుక ఉన్న వృత్తాంతాన్ని వెలువరించాడు. ఈ వైతాళిక సమితిలోని మరో సభ్యుడి పేరు    ‘మేధావి శాస్త్రి’. ఈయన గురించి చెబుతూ. పేరుకు తగిన ప్రతిష్ట కలవాడు. ఎట్టి వారితోను చేయి కలుపుకొను సామరధ్యము కలవాడు. ఇంగ్లీషు, ఆంధ్రము, సంస్కృతము ఈ మూడు భాషలలోను కొంత ప్రజ్ఞ కలవాడు. అని పేర్కొన్నడు. ఇగ మూడో వ్యక్తి ‘ఇతిహాసరావు’. ‘‘ఈతడు చరిత్ర యనిన ప్రాణములు విడుచువాడు. చారిత్రిక దృష్టి ప్రమాణములను నిలువని యెడల ఎట్టి యుత్కృష్ట గ్రంథములను గూడ తృణీకరించి వైచుటలో ఇతనిని మించిన వారుండరు. ఇతని ఉచ్వాస నిశ్వాసములు గూడ చరిత్ర గ్రంథమునే వివుచుననిన మీ రాశ్చర్యపడగూడదు.’’ అని అభిప్రాయ పడిరడు. వైతాళిక సమితలోని నాలుగో వ్యక్తి ‘విజ్ఞాన శర్మ’. ‘‘ఇతడు యూనివర్సిటీలో ఎం.ఎ. పట్టము పొందినవాడు. మంచివాడు. దేశసేవపరాయణుడు. ఆధునిక విజ్ఞానమున ఆఱితేఱిన ప్రజ్ఞాధురీణుడు. విజ్ఞానమని పెరుచెప్పగనే ఇతని దృష్టియంతయు పాశ్యాత్య దేశములవైపు ఒగ్గి చూచు స్వభావము గలవాడు. స్నేహపాత్రుడు.
    ఇగ చివరగా ఐదో వ్యక్తి పేరు ‘చిత్రగుప్తుడు.’’ చిన్నప్పటి నుండి తెనుగు వ్రాత ముత్యాలకోవవలె ముద్దులు మూటగట్టునట్లు వ్రాయు చుండుట వల్లను, ఎవ్వరెంత వేగముగా మాట్లాడినను ఉత్త లేఖనము చెప్పినను, కలమెత్తకుండ నిలువకుండ తీగెతీసినట్లు వ్రాయు అలవాటు గలిగి యుండుటచేతను’’ అతనికి చిత్రగుప్తుడు అనే పేరొచ్చిందని చెప్పిండు.
    ఈ అయిదుగురు కూడా విద్యావంతులు కావడమే గాకుండా సమాజం పట్ల బాధ్యతతో మెలగాలనే భావనతో ఉన్న వారు కావడంతో పార్థివ ఉగాది నాడు ‘వైతాళికు’డి ఇంట్లో సమావేశమై ‘తెలంగాణలో విద్యావ్యాప్తి’కి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది తమ వంతు దేశోపకార సేవ అని వీరు భావించారు. ఈ దేశోపకారం కోసం కొత్త సంస్థను ఏర్పాటు చేయాల్నా? లేదా ఇది వరకే నడుస్తున్న ఏదైనా సంస్థ ద్వారా ఆ పని చేయాల్నా? అని తర్జన భర్జన పడ్డారు. కొత్త సంస్థ అంటే కొత్త గొడవలు మీదికి తెచ్చి పెట్టుకోవడమే అని భావించి. ఈ ఐదుగురు సభ్యులు ఒక కూటమిగా ఏర్పడి ‘‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’’ ద్వారా విద్యావ్యాప్తికి కృషి చేసిండ్రు. అంతకు ముందు పరిషత్తు ద్వారా పనిచేయాలనే తమ వాంఛను దాని అధ్యక్షుడికి (మాడపాటి హనుమంతరావు?)  తెలియజేసిండ్రు. జీతంలేకుండా ప్రచారకులు దొరికినందుకు ఆయన సంతోషించి వారిని ప్రోత్సహించిండు. వివిధ ప్రదేశాల్లో ‘వైతాళిక సమితి’ నిర్వహించే సభలు, సమావేశాలకు, వారి వ్యాసాలకు గోలకొండ పత్రికలో ప్రముఖంగా వచ్చేలా ప్రయత్నం చేస్తామని కూడా అధ్యక్షుడు హామి ఇచ్చాడు. బహుశా దాన్ని ఆయన నేరవేర్చాడు కూడా.
    వైతాళిక సమితి ఏర్పాటు విషయం పత్రికలో ప్రముఖంగా రావడంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సమావేశాల్లో పాల్గొనవలసిందిగా అనేక ఆహ్వానాలు అందాయి. ఎక్కడి మీటింగ్‌కు పోయినా అందరూ కలిసేపోయేవారు. మాట్లాడేవారు. ఈ వైతాళిక సమితి పాల్గొనే సమావేశాలకు ‘అధ్యక్షుడు’ ఉండేవారు కాదు. ఎందుకంటే అధ్యక్షుల స్థానంలో ఉన్న వారు నిరంకుశంగా వ్యవహరించినట్లయితే వక్తలకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో ‘అధ్యక్షుడి’ పదవిని రద్దుచేసిండ్రు. మొదటి సమావేశాన్ని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో ఏర్పాటు చేసిండ్రు. అయితే కరపత్రాలు పంచకున్నా కేవలం భాషా నిలయం బోర్డుపై ప్రకటన ద్వారా, మౌఖికంగా జరిగిన ప్రచారంతో మీటింగ్‌కు అనేకమంది హాజరయ్యిండ్రు. స్త్రీలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యిండ్రు అని   19, ఏప్రిల్‌ నాటి ‘గోలకొండ’ సంచికలో మరోసారి వైతాళికుడు రాసిండు.
    పరిషత్‌ ప్రార్థన గీతం ఆలాపతో సమావేశం ప్రారంభమైతుంది. ఈ గీతం అందరి ప్రశంసలందుకుంది. ఈ పరిషత్‌ ప్రార్థన గీతం గురించి కూడా ఇంతవరకు ఎక్కడా రికార్డు కాలేదు.
ఆ గీతమిది.
    ఆంధ్ర సారస్వతపరిష`న్మాతడు,
            ధీరోదాత్తకు. జై
    1.    సాహీత్య`చరిత`విజ్ఞాన`కళలు
        చతుర్ముఖములై సౌరు గులుకంగా?
        ‘‘సత్యమ్‌`శివమ్‌ సుందర’మను మంత్రము
        చక్కని మకుటముగాగల, ఆంధ్ర॥సా॥

    2.    ఆఱువిధములగు సారస్వత పరీ
        క్షారంభములే మణిహారములుగ
        బాల`ప్రజా`పండిత సారస్వత
        పాయిన పాత్రలు చేగల ఆంధ్ర।సా॥
   
    3.    ఎనుబది లక్షలు మించిన ఆంధ్రుల
        హృదయరత్న సింహాసన మందున
        మన ప్రభువు కృప ఛత్రముగాÑ
        వినుతొగొన్న జగదీశ్వరి ఆంధ్ర॥సా॥   అని పాడి సభను దిగ్విజయంగా నిర్వహించారు.
    పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాల మాదిరిగా రచనలున్నప్పటికీ ఇది నిజంగా నిర్వహించబడిన సంస్థ. ఈ సంస్థలో కాళోజి నారాయణరావుతో పాటుగా వెల్దుర్తి మాణిక్యరావు, వెంకటరాజన్న అవధాని, గంటి లక్ష్మినారాయణ, సురవరం ప్రతాపరెడ్డి (వట్టికోట ఆళ్వారుస్వామి?)లు సభ్యులుగా ఉండేవారు.
    ఈ ఐదుగురు తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో పర్యటనలు చేస్తూ అక్కడ సారస్వత, సాహిత్య పరిషత్‌ సభలు నిర్వహిస్తూ అక్షరాస్యతను పెంచడమే గాకుండా సాహిత్యవాతావరణాన్ని సృష్టించారు. ఇందులో వెల్దుర్తి మాణిక్యరావు అణాగ్రంథమాల స్థాపకుల్లో ఒకరు. అలాగే పరిషత్‌ సాహిత్య కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడమే గాకుండా మొత్తం తెలంగాణ భాషలో మొట్టమొదటి నాటకం ‘దయ్యాల పన్గడ’ రచయితగా కూడా ఆయన ప్రసిద్ధుడు. కథలు కూడా రాసిండు. వేంకట రాజన్న అవధాని 1926 నాటికే మంథనిలో ‘ప్రబోధ చంద్రోదయం’ అనే లిఖిత పత్రికను నిర్వహించడమే గాకుండా గోలకొండ పత్రికలో పనిచేసిండు. వీరంతా అడ్వకేట్‌ విద్యను అభ్యసించి దానిని ప్రాక్టీస్‌గా మార్చకుండా సాహిత్య రంగంలోకి దిగిండ్రు. తెలంగాణ ప్రజలకు అత్యావశ్యకమైనది విద్య. ఆ విద్య ద్వారానే సమాజాన్ని మార్చొచ్చు అని నమ్మి అందుకు నడుంబిగించిన ‘ద్రౌపది లేని పంచపాండవులు’ అని తమని తాము వర్ణించుకున్నారు.
    ఈ వైతాళిక సమితి తెలంగాణలో సాహిత్య, సాంస్కృతిక పునర్వికాసానికి దారులు వేసిందంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడే గ్రంథాలయం, పత్రికోద్యమం ఊపందుకొని మారుమూల గ్రామాల్లో సైతం చదువుకున్న విద్యార్థులు జట్లుగా ఏర్పడి తమ గ్రామానికి ఏదైనా మంచి చేయాలనే కుతూహలంతో ఒకవైపు చరిత్రను తవ్వి తమ మూలాల్ని వెతికి పట్టుకున్నారు. అలా వచ్చినవే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని విరాట్రాయాంధ్ర భాషా నిలయం. ఇలా ప్రతి పట్టణంలో ఆంధ్రమహాసభ తరపున కార్యకలాపాలు చేపట్టి సమాజ శ్రేయస్సుకు తమదైన శైలిలో కృసి చేసిండ్రు. ‘‘హైద్రాబాద్‌లో సారస్వత ప్రియులైన యువకులు వైతాళిక సమితిని యనునొక సంస్థను స్థాపించిరి. సాహిత్యము , కళలు వీరి ప్రచారము యీ సంస్థ ముఖ్యోద్దేశ్యము’’ అని ఈ సంస్థ గురించి ఆంధ్రసారస్వత పరిషత్తుని తీర్చి దిద్దిన దేవులపల్లి రామానుజరావు తన ‘‘తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం’’ అనే పుస్తకంలో రాసిండు. తెలంగాణ పునర్వికాసంపై సమగ్ర పరిశోధన చేసిన పత్రికా సంపాదకులు కె.శ్రీనివాస్‌ మొదట ఈ ‘వైతాళిక సమితి’ గురించి తన పరిశోధన గ్రంథంలో రాసిండు. వైతాళిక సమితి సభ్యుడైన వెల్దుర్తి మాణిక్యరావు ఇలా రాసిండు. ‘‘1934`36లో కాలోజీ ‘వకాలత్‌’ చదవటానికి హైదరాబాద్‌ వచ్చినాడు. వెంకటరాజన్న అవధాని కూడా అందుకే వచ్చినాడు. నాకూ బుద్దిపుట్టింది. గంటి లక్ష్మీనారాయణ గంటు పడ్డాడు. నలుగురం రోజూ కలిసేది. చేతుల్లో ‘ఖానూన్‌’ పుస్తకాలున్నా, మాట్లాడేది లోకాభి రామాయణం. ‘వైతాళిక సంఘం’ అని ఓదాన్ని సృష్టించినాము. కాళోజి, వెల్దుర్తి, అవధాని’ అని ముగ్గురం కలిసి కథలు రాసేది. ఈ పద్దతి నాటికి నేటికి సరికొత్తదనే చెప్పాలి. అప్పటి నుంచి రచనా వ్యాసాంగంలో కాళోజీకి అభిరుచి కలిగిందంటే అతిశయోక్తి కాదనుకొంటాను.’’ అని రాసిండు. అంటే వైతాళిక సమితి కాళోజి మీద వేసిన ప్రభావం అర్థమవుతుంది.
    ఈ వైతాళిక సమితి తెలంగాణ సాహిత్య చరిత్రలో ఓ చిరస్మరణీయమైన ఘట్టం. సాహిత్యం ఓ సాహస కార్యంగా మారిన కాలంలో దానికి పూనుకొని ప్రచారం చేసిన వారిలో కాళోజి ముందంజలో ఉన్నాడు. ఈ సందర్భంగా కాళోజి తెలంగాణ చరిత్రతో నడిచిన తీరుని రికార్డు చేసుకోవాల్సిన అవసరముంది. ఆ చరిత్రను రికార్డు చేసుకోవడానికి ఇది ఏమాత్రం ఉపయోగపడిన అది తెలంగాణ సాహిత్యానికి మేలిమి చేర్పే అవుతుంది. 

-సంగిశెట్టి శ్రీనివాస్‌

THIS ARTICLE IS SUBMITTED FOR THE SEMINAR CONDUCTED BY A.V. COLLEGE ON KALOJI NARAYANARAO AND HIS CONTRIBUTION


BARMAR/ The EXPLOSIVE BOOK PUBLISHED IN SUPPORT OF REMOVAL OF STATUES AT TANKBUND BY SINGIDI

   

    సోకం     

   అణచివేత, ఆధిపత్యం, దోపిడీ మొదలు పెట్టాలన్నా, కొనసాగించాలన్నా ముందుగా ఆ ప్రాంతాన్ని, ప్రజల్ని ఆత్మన్యూనతా భావనలోకి నెట్టివేయాలనేది అంతర్జాతీయ సిద్ధాంతం. రంగు, రూపం, ప్రాంతం, భాష, పుట్టుక ఆధారంగా ఈ అణచివేత కొనసాగుతోంది. మీ భాష సరిగ్గా లేదు, మీ యాస బాగా లేదు. మీ కట్టూ బొట్టూ ఎబ్బెట్టుగా ఉంది. మీకు చరిత్ర లేదు, మీకు వైతాళికులు లేరు. అసలు మీరు ఏ విషయంలోనూ మాకు సమఉజ్జీలు కారు అంటూ సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు తెలంగాణపై సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా దోపిడీని, అణచివేతను, వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు.
    సాంస్కృతిక ఆధిపత్యం, అజమాయిషీ, అణచివేతలపై తిరుగుబాటే ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ ఘటన. ప్రపంచంలో ఎక్కడైనా మొదట తిరుగుబాటు సాంస్కృతిక రంగంలోనే వ్యక్తమవుతుంది. ట్యాంక్‌బండ్‌పై మార్చి 10, 2011 నాడు కూడా అదే జరిగింది. ఆరు దశాబ్దాలుగా తమ మాటకు, ఉనికికి గుర్తింపు లేకపోవడాన్ని జీర్ణించుకోలేక తెలంగాణ బిడ్డలు విచక్షణ, విజ్ఞతతో విగ్రహాలను తొలగించారు. ఈ తొలగింపు విచక్షణ, విజ్ఞతతో జరిగిందని చెప్పడానికి ఆనాటి ఘటనలే ఆధారం. ట్యాంక్‌బండ్‌ చుట్టూ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను నిలిపిండ్రు. తెలంగాణలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న తెలంగాణ వాదులతో నిండిపోయాయి. ఇలాంటి సమయంలో వేలమంది తెలంగాణవాదులు తమ ప్రాణాలకు రక్షణ లేదని తెలిసి కూడా సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించేందుకు ట్యాంక్‌బండ్‌ ఎక్కిండ్రు. కుమ్మరి మొల్ల, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, గుర్రం జాషువా, శ్రీశ్రీల విగ్రహాలకు ఎలాంటి హాని తలపెట్టలేదు. దీని ద్వారా తాము ఆధిపత్య వర్గాలకు, దోపిడి దారులకు మాత్రమే వ్యతిరేకమనే సంకేతాన్ని తెలంగాణ వాదులిచ్చినట్లయింది. ఇది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది. ఈ పునాదుల్లోంచే సామాజిక చైతన్యం విస్తృతమవుతోంది. తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది అనే పూర్తి అవగాహనతో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలోని దళిత, బహుజన, ముస్లిం మైనారిటీ, అభ్యుదయ శక్తులు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే సీమాంద్ర నుంచి ‘కావడి కుండలు’ సంకలనం వచ్చిందని గ్రహించాలి. దాని కొనసాగింపే ఈ ‘బర్మార్‌’. సామాజిక చైతన్యం కచ్చితంగా ఆర్థిక తిరుగుబాటుకు బాటలు వేస్తుంది. ఆ రహదారుల నిర్మాణంలో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిమగ్నమై ఉంది. ఒక్క సారి సీమాంధ్ర ఆర్థికాధిపత్యంపై తిరుగుబాటు షురువయ్యిందంటే దాని పరిణామాలు ఊహించడం కష్టం. తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నీ దోసుకుంటున్న వర్గాల్ని ప్రజలు అంతా తేలిగ్గా వదిలిపెట్టబోరని గతానుభవం చెబుతూనే ఉంది.
    సంస్కరణలు, అభివృద్ధి పేరిట సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు చేస్తున్న వాదనల్ని కూడా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు.  ఎవరికెంత ఏ రూపంలో ముట్టాలో ఆ రూపంలో చెల్లించేందుకు తెలంగాణ సమాజం సిద్ధమయింది. ఎందుకంటే గ్లోబలైజేషన్‌ అనంతరం పదాలకు అర్థాలు మారాయి. హైటెక్కు పాలన అసలు రంగు అర్థమయింది. గతంలో ‘సంస్కరణ’ అంటే పాజిటివ్‌ అంశం. ఇవ్వాళ ‘సంస్కరణ’ అంటే పేదల దోపిడి. అడవుల్లోని వనరుల, సంపద దోపిడి. ఒకప్పుడు అభివృద్ధి అంటే సమాజ ప్రగతి. చంద్రబాబు పాలన నాటినుంచే ‘అభివృద్ధి’ అంటే వినాశనం, ‘విధ్వంసం’ అనేవి పర్యాయ పదాలుగా మారాయి. అభివృద్ధి అంటే తమ భూములు ఎపిఐఐసీకి ఇచ్చి అక్కడ సీమాంధ్రులు కట్టిన భవంతుల్లో వాచ్‌మెన్‌ ఉద్యోగం చేయడమనే విషయం తెలంగాణ బిడ్డలకు అనుభవంలోకి వచ్చింది. అవును భవంతులు కట్టి బాగా బలిసిన వాళ్లు దోసుకోవడమే అభివృద్ధి అయితే అది తెలంగాణ వారికి ‘దోపిడి’ గానే అర్థమవుతుంది. అట్లానే చూస్తారు.
    ఆధిపత్య సీమాంధ్రులు ‘తెలంగాణ’ను చూసే దృక్కోణాన్ని మార్చుకోవాలని అందుకే చెబుతున్నాం. విగ్రహాల తొలగింపు సంఘటన ఆరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా జరిగి వుండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా జరిగి వుండేది. అప్పుడయితే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేబట్టేది కాబట్టి ‘తొలగింపు’ అనే వాళ్ళు. ఇప్పుడు అమానవీయమైన దౌర్జన్యం రాజ్యమేలుతుంది కాబట్టి ‘కూల్చివేత’ అంటున్నారు.
    ఆధిపత్యానికి, అణచివేతకూ ప్రజలు ఎప్పుడూ తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. అవి కొన్ని సార్లు ఆశ్చర్యం గొలిపేవిగా కూడా ఉండొచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటరీ అకృత్యాలకు వ్యతిరేకంగా అయిదుగురు మహిళలు చేసిన నగ్న ప్రదర్శన దేశాన్ని కుదిపేసింది. అమెరికా(మాజీ)అధ్యక్షుడు జార్జిబుష్‌ మొదలు చిరంజీవి వరకు ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి చెప్పులు విసిరిండ్రు. అంటే అది హత్యాప్రయత్నం కాదు. తమ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న నిరసనను తెలియజేయడమే. మిలియన్‌ మార్చ్‌ సంఘటన కూడా ఒక నిరసన రూపమే. తైనాన్‌మెన్‌ స్క్వేర్‌  నుంచి తెహరీర్‌ స్క్వేర్‌ వరకు అది కొనసాగుతూనే ఉంది. విగ్రహాల నిమజ్జనం అనేది సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించి, దోపిడి, వివక్ష, సీమాంధ్ర పెత్తనం అంతమవ్వాలని కోరుకున్న వేలాది మంది సమక్షంలో జరిగిన సంఘటన. ఉద్యమ చైతన్యంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయడంతో తమ నోళ్ళకు తాళాలు వేసుకున్న సీమాంధ్ర కుహనా మేధావులు ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని మళ్ళీ విజృంభించారు. తమ ‘మేతావిత్వ’ నగ్న స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. ఈ సాకుతోనైనా తెలంగాణ ప్రజల వాదనల్ని తప్పుడు వ్యాఖ్యానాలు, వాదనల ద్వారా పక్కదోవ పట్టించాలని ప్రయత్నించారు. కాని సఫలీకృతులు కాలేక పోయారు. అంబేద్కర్‌ విగ్రహాల ‘విధ్వంసం’ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మరొక్కసారి తెలంగాణ వాదులపై దాడికి దిగాలని విఫల ప్రయోగాన్నే మళ్ళీ చేస్తున్నారు.
    ఇవ్వాళ అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసాన్ని మిలియన్‌ మార్చ్‌ ఘటనలతో కొంతమంది కుహనా మేధావులు పోలుస్తున్నారు. రూపంలో రెండూ విగ్రహాల కూల్చివేతగా కనబడినా, సారంలో మాత్రం రెండూ వేర్వేరు. ఈ దేశంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ మీద కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు, కొన్ని సంఘ విద్రోహ శక్తులు తమ రాజకీయాల కోసం చేసిన దాడులివి. మిలియన్‌ మార్చ్‌ ఘటన సామూహిక ఉద్విగ్నత, 60 యేండ్ల ఆకాంక్షలోంచి వచ్చిన అద్వితీయమైన నిరసన రూపం. గంప గుత్త పెత్తనానికి చెప్పుదెబ్బ.
    సీమాంధ్ర మీడియా, ఆధిపత్య వర్గాలు ఈ సంఘటనను ‘విధ్వంసం’ అని నెత్తినోరు కొట్టుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. ఒక మీడియా చానల్‌ అయితే తెలంగాణ వాదుల్ని కోతులు కొండముచ్చులు, తాగుబోతులు అంటూ తూలనాడుతూ కథనాలను ప్రసారం చేసింది. 600 మంది బలిదానాలను ఏనాడు పట్టించుకోని వీళ్లు ‘నీతులు’ వల్లె వేయడం తెలంగాణపై వారి వివక్ష, కక్షపూరిత వైఖరికి అద్దం. ఎవరెంత రాద్ధాంత చేసినా ఇది విచక్షణ, విజ్ఞతతో చేసిన ‘తొలగింపు’ మాత్రమే. ‘విధ్వంసా’న్ని సమర్ధిస్తారా అని అమాయకంగా ప్రశ్నించేవారికి ఇది వినిర్మాణ ప్రక్రియలో భాగమని అర్థచేసుకోవాలని చెబుతున్నాం. ఉన్నవాటిని బద్దలు కొట్టకుండా కొత్తవాటిని మేలైన పద్ధతిలో నిర్మించుకోలేమనే అవగాహనతో చెబుతున్నాం. ఇది ఇక్కడితో ఆగిపోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ‘సామాజిక తెలంగాణ’ కోసం జరగాల్సిన ప్రక్రియగా భావిస్తున్నాం.

GGGGG

    కరువుతో తల్లడిల్లుతున్న భారతదేశాన్ని ఆదుకునే ఉద్దేశ్యంతో పి.ఎల్‌.480 అనే పథకం ద్వారా అమెరికా కొన్ని వేల క్వింటాళ్ల గోధుమల్ని 1954లో ఉచితంగా సరఫరా చేసింది. అమెరికా అధ్యక్షుడు ఐషనోవర్‌ ఆదేశంలోని ప్రభుత్వ`ప్రయివేటు( స్వచ్ఛంద) సంస్థల భాగస్వామ్యంతో వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తిండిగింజలు అందజేసేందుకు గాను అమెరికా పబ్లిక్‌ లా( పి.ఎల్‌) 480 అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ననుసరించి అమెరికా మొదటి సాయం భారతదేశానికే అందించింది. అయితే ఈ గోధుమలతో పాటుగా విత్తనాల రూపంలో ప్రవేశించిన మొక్క ‘పార్థీనియం హిస్టిరొఫరస్‌’. తెలుగులో దీన్ని ముద్దుగా ‘వయ్యారి భామ’ అని పిలుస్తాం. చూడ్డానికి ముచ్చటగా నక్షత్రాల్లాంటి తెల్లటి పూలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దేశమంతటా విస్తృతంగా పరుచుకుపోయింది. దీన్ని భారతదేశమంతటా ‘కాంగ్రెస్‌ ఘాస్‌’ అని పిలుస్తారు.
    ఈ ‘వయ్యారిభామ’ ఒక ‘రోగాల మహమ్మారి’. దీనివల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్త్మా, జ్వరం రావడం, చర్మం చిట్లిపోవడం, ముక్కు వాచిపోవడం, తమ్ములు, దగ్గులు, ఒక్కటేమిటి సర్వరోగాలు దీని మూలంగా వస్తాయి. దీన్ని నాశనం చెయ్యాలని దేశంలోని చాలా ప్రయోగశాలలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నా అది దిన దినం వృద్ధి చెందుతూందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. వ్యవసాయ రంగంలో పంటలు తక్కువ దిగుబడి కావడానికి, పండిన కూరగాయలు విషపూరితం కావడానికి ఇది కారకం. అంతేగాకుండా దీనిపై నుంచి వచ్చిన గాలి పీల్చి రోగగ్రస్తులైన వారు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు మందుల కోసం ఖర్చు పెడుతున్నారు. కొసమెరుపేందంటే ఈ మందులు ఎక్కువగా తయారయ్యేది అమెరికాలోనే. అంటే కుట్రపూరితంగా గోధుమలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి భారతదేశాన్ని రోగాలపుట్టగా తయారుచేసింది అమెరికా.
    సరిగ్గా భారతదేశం పట్ల అమెరికా ఏ విధంగా వ్యవహరించిందో, తెలంగాణ పట్ల గూడా సీమాంధ్ర నేతలు అలానే వ్యవహరించారు. ‘వయ్యారిభామ’ లా వచ్చి తెలంగాణను మొత్తం గుళ్ల చేసిండ్రు. చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి ఇక్కడి ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన వాటా ఎందులోనూ దక్కకుండా చేసిండ్రు. పైకి చూడ్డానికి, చెప్పడానికి ‘వయ్యారిభామ’లాగా ముచ్చట ముద్దుగానే ఉంటది. కాని ఆచరణలోకి వచ్చేసరికి తెలంగాణ మొత్తాన్ని విషతుల్యం చేసిండ్రు. ఇక్కడి వారికి చరిత్ర లేదు. ఇక్కడ వైతాళికులు లేరు. ఇక్కడి సంస్కృతి మోటు అని తీర్పులిచ్చిండ్రు. తమ ఆధిపత్యాన్ని చాటుకుండ్రు.
    ఈ అహంకార పూరిత ఆధిపత్యాన్ని కూలగొట్టడానికే తెలంగాణ బిడ్డలు మార్చి 10, 2011నాడు ట్యాంక్‌బండ్‌పై తమవి కాని విగ్రహాలను తొలగించిండ్రు. న్యాయంగా, హక్కుగా తమ వైతాళికులకు దక్కాల్సిన స్థానాన్ని గత 25 ఏండ్లుగా సీమాంధ్ర ప్రాంతం వాళ్ళే కబ్జాచేసిండ్రు. అందుకే ఈ తొలగింపు అని తేల్చి చెప్పిండ్రు. 25 ఏండ్లుగా ఈ విగ్రహాలు తెలంగాణలో వైతాళికులు లేరు, కేవలం తాము మాత్రమే మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ‘వెలుగులం’ అనే సంకేతాలిచ్చాయి. ఇక్కడి మట్టిమనుషుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపించాయి. విగ్రహాల తప్పేమి లేకున్నా వాటి ప్రతిష్టాపకుల వివక్ష ముప్పు తెచ్చింది. కొంతమంది అమాయకంగా అయ్యో ఆ ప్రాణం లేని విగ్రహాలు ఏంజేసినవి అని అంగలారుస్తున్నరు. ప్రాణంలేని విగ్రహాల పట్ల అంత ప్రేమ నటించే వీళ్లు తెలంగాణ కోసం తమను తగలబెట్టుకున్న శ్రీకాంతచారి, యాదయ్య, వేణుగోపాలరెడ్డి లాంటి బిడ్డలు ఎన్నడు కండ్లకు కనబడరు. వాళ్ల బలిదానానికి అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రతిపక్ష నాయకులు గానీ కనీస సంతాపం కూడా వ్యక్తం జేయరు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే సిపిఎం పార్టీ ఒకటి ఈ మధ్యన కోట్లకు కోట్లు చందాలు వసూలు చేసి భారీగా రాష్ట్ర మహాసభలు నిర్వహించింది. తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదుల్ని వేధిస్తున్న ప్రశ్నేందంటే ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ప్రజోపయోగ పనైనా వీళ్లు జేసిండ్రా అంటే సమాధానం పెద్ద గుండు సున్న. అదే చత్తీస్‌ఘడ్‌లో షాహిద్‌ హాస్పిటల్‌ కట్టించి ఉద్యమకారులు ప్రజలకు సేవ జేసిండ్రు.  వీరు మాత్రం హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున భవంతులు నిర్మించుకొని వాటికి తమ ప్రాంతానికి చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరి ఉదయల పేర్లు పెట్టుకుండ్రు. నిత్యం పొద్దున లేస్తే సాలు తమది తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం అని చెప్పుకునే పార్టీ ఏనాడు ఇక్కడి వారిని గౌరవించిన పాపాన పోలేదు. సాయుధ పోరాటానికి పునాది వేసిన దొడ్డి కొమురయ్య పేరుగాని, చాకలి ఐలమ్మ పేరుగాని వీరికెప్పుడూ అంటరానిదే. వీళ్లు ప్రజాస్వామ్యంగా ఎన్నడూ వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజల న్యాయమైన  డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్న ఈ పార్టీ కనీసం తెలంగాణ సాయుధ పోరాట ప్రతీకల్ని సీమాంధ్రల్లో ప్రతిష్టించే పనికూడా చేయలేదు. ఇది వీరి జ్ఞానంలోని డొల్లతనాన్ని తెలియజేస్తోంది. మరోవైపు తెలంగాణకు ఏ మాత్రం సబంధంలేని విగ్రహాలు పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, సుందరయ్యల విగ్రహాలు తెలంగాణ అంతటా పరుచుకున్నాయి. కానీ సమ్మక్క, సారలమ్మ, సర్వాయి పాపన్న, కొమురంభీమ్‌, వట్టికోట ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, షోయెబుల్లాఖాన్‌, బందగీ, తుర్రెబాజ్‌ఖాన్‌, సుద్దాల హనుమంతు, కాళోజీల్లాంటి వందలమంది వైతాళికుల్లో ఒక్కరి విగ్రహం కూడా సీమాంధ్రల్లో ప్రతిష్టకు నోచుకోలేదంటేనే ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్న వాదనలోని బలాన్ని తెలియకనే తెలియ చెబుతుంది. ఇంత ప్రస్ఫుటంగా వివక్ష కనబడుతున్నా, తాము ఉద్ధరించేవాళ్లము అనే ‘సంస్కర్త’ రూపాల్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
    ఈ వివక్ష ఇవ్వాళిటిది కాదు. 1948 నుంచే ఈ వివక్ష షురువయ్యింది. కలో, గంజో తాగుతూ గుట్టు చప్పుడు గాకుండా ఉన్న తెలంగాణను, హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించడంతోనే అహంకార పూరిత ఆధిపత్యానికి తెరలేసింది.
    1948లోనే ఇక్కడి వారికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు కాబట్టి తాము మెజారిటీ ప్రజలకు అర్థమయ్యే భాషలో వ్యవహారాలు జరిపేందుకు ఇంగ్లీషు తెలిసిన తెలుగువారిని నియమిస్తున్నామని అప్పటి హైదరాబాద్‌ మిలిటరీ ముఖ్యమంత్రి ఎం.కె.వెల్లోడి వెల్లడిరచాడు. ఇగో అప్పటినుంచి ఆరంభమైన సీమాంధ్ర వలస, ఆధిపత్యం ఎవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. హక్కుగా దక్కాల్సినవి కూడా అడుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది.
    ఈ దుస్థితి నుంచి బైటపడి ఆత్మగౌరవంతో, వెన్నెమక ఉన్న మనిషిగా నిలబడ్డానికి తెలంగాణ తల్లి బిడ్డలు నేడు ఒక్క సుతితోటి కొట్లాడుతున్నరు. లేకుంటే తెలంగాణ వ్యతిరేకులు మింగి మంచినీళ్లు తాగేటోళ్లు. 1948 నుంచి తెలంగాణకు ఈ దుస్థితి దాపురించినాదాదిగా భారతదేశ, సీమాంధ్ర నాయకులు అనేక విధాలుగా తెలంగాణను వంచించారు. మోసం చేశారు. చివరకు ఇక్కడి వారిని చరిత్ర హీనులుగా చిత్రించారు. తెలంగాణ వారికి నలుగురైదుగురికి మించి వైతాళికులు లేరు అని ట్యాంక్‌బండ్‌ ద్వారా సందేశమిచ్చారు.
    ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల్ని నిమజ్జనం చేసిన వాళ్లు ఒక డజన్‌కు మించి ఉండరు. ఆ పని చేయడానికి వాళ్లకు ఆయుధాలు అవసరం రాలేదు. తెలంగాణలోని నాలుగుకోట్ల ప్రజల ఇమ్మతి, సమ్మతే వారికి బలంగా ఉపయోగపడిరది. సీమాంధ్ర పెత్తనంపై ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతే ఈ కూల్చివేతకు ఊతమిచ్చింది. ఈ వివక్ష, తెలంగాణపై పెత్తనం ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని ఆధిపత్య ప్రతీకలు ధ్వంసం అవుతాయని తెలంగాణ బిడ్డలు హెచ్చరించిండ్రు. బుద్దిగా మసులుకోవాలని ప్రభుత్వానికి సవాలు విసిరిండ్రు. దీని నుంచి తెలంగాణవాదులతో సహా వ్యతిరేకులూ కూడా గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది.
****
 అందరి కన్నా ముందుగా ట్యాంక్‌బండ్‌పై ఆధిపత్య ప్రతీకల్ని నిమజ్జనం చేసిన ఉద్యమకారుల కాళ్లకు మొక్కుతున్నం. అట్లాగే ఈ పుస్తకం ఇంత అందంగా రూపుదిద్దుకోవడంలో మాకు హమేషా అండగా నిలబడే ఆర్టిస్టు అక్బర్‌ గారికి, ఆర్థికంగా ఆదుకున్న ఆదిలాబాద్‌ మిత్రుడు మోహన్‌, హైదరబాద్‌లో జర్నలిస్టు దోస్త్‌ పి.వేణుగోపాల స్వామి, కేంద్ర సాహిత్య అకాడెమి గ్రహీత భూపాల్‌ గార్లకు వెనుకమాట రాసిచ్చిన సుంకిరెడ్డి నారాయణరెడ్డిలకు శణార్థులు. మేము అడిగిన వెంటనే ఎంతో శ్రమకోర్చి వ్యాసాలు రాసిచ్చిన రచయితలందరికీ, ఈ పుస్తకం ఈ మాదిరిగా రావడానికి తమ వంతు బాధ్యతలు నిర్వహించిన ‘సింగిడి’ మిత్రులకు కృతజ్ఞతలు.
    ఈ పుస్తకంలోని బాగోగులు పట్టించుకొని మరిన్ని మంచి పుస్తకాలు రావడానికి మా లోటుపాట్లను సరిదిద్దవలసిందిగా పాఠకులకు, విజ్ఞులైన మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
-సంగిశెట్టి శ్రీనివాస్‌
-ఏశాల శ్రీనివాస్‌

   
   

ఆధిపత్య సంస్కృతిపై ‘దిమ్మిస’


    తెలుగు నిఘంటువుల్లో అర్థాలు మారుతున్నాయి. ధ్వంసం, విధ్వంసం అనేవి సీమాంధ్రుల పదాలుగా, కూల్చివేత, తొలగింపు పదాలు తెలంగాణవిగా స్థిరపడ్డాయి. కూల్చివేత అనేది పోరాట రూపంగా మారింది. తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవం, అస్తిత్వానికి, చరిత్ర వినిర్మాణానికి పునాదిగా మారింది. మార్చి పది నాటి మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై చోటు చేసుకున్న సంఘటనల్ని చూసే ధృక్కోణమూ మారింది. సీమాంధ్ర ‘మేధావులు’ విగ్రహాలను తొలగించిన వారిని ‘తాలిబన్లు’, ‘మర్కటాలు’, ‘కోదండలు’, ‘బాల్‌ ఠాక్రేలు’, ‘కర సేవకులు’ అని సంబోధించారు. అదే సమయంలో తెలంగాణ డిక్షనరీల్లో ‘విద్రోహ ఫలితం’, ‘విముక్తి పోరు’, ‘ధర్మాగ్రహం’, ‘కల నెరవేరింది’, ‘బద్లా’ ‘సాంస్కృతిక ఆధిపత్యంపై దాడి’ అనే పదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రజల ధర్మాగ్రహాన్ని, భాషను, భావాన్ని తెలుగు సాహిత్యంలో నిలిచి పోయే విధంగా ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఒక ప్రయత్నం చేసిది.  సీమాంధ్రుల సాంస్కృతిక ఆధిపత్యంపై తిరుగుబాటు బావుటాను ఎగరవేస్తూ ‘దిమ్మిస’ పేరిట 50 మంది కవుల సంకలనాన్ని తీసుకొచ్చింది. అలాగే అంతకు ముందు తెలంగాణ రచయితల వేదిక కలగాపులగమైన అభిప్రాయాలతో ‘విరుగుడు’ వ్యాస సంకలనాన్ని తీసుకొచ్చింది. మరోవైపు నెట్‌లో ‘మిషన్‌ తెలంగాణ’ వారు విగ్రహాల్లో ఎన్టీఆర్‌ పోలిక, స్థానం గురించి విరివిగా చర్చలోకి తీసుకొచ్చారు. ‘తెలుగు వారి ఆత్మగౌరవం’ పేరిట ‘తెలంగాణ అస్తిత్వానికి గోరీ’ కట్టిన ఎన్టీఆర్‌ని, తెలంగాణ తల్లి గుండెకాయ ‘హైదరాబాద్‌ నగరం’ నడిబొడ్లో గడ్డపారల్లాగా నిలబడ్డ ‘తెలుగు వెలుగు’లపై తెలంగాణ ప్రజల పక్షాన కవులు స్పందించారు. ఈ స్పందన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లోంచి వచ్చిందే. అస్తిత్వవాద వేదనలోంచి వచ్చిందే.
    ‘‘చారిత్రక సంఘటనకు కారణమైన చరిత్ర గురించి కాకుండా పైపైనే నిందలు వేసే వారికి ‘దిమ్మిస’ కవితా సంకలనం ఒక చెంపపెట్టు’’ అని మే పదిన ట్యాంక్‌బండ్‌పై మగ్దూం మొహియుద్దీన్‌ విగ్రహం ముందు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ప్రముఖ సినీ దర్శకుడు, కవి బి.నర్సింగరావు ఒక చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించిండు.  ‘భాష పేరుతో ఇంకా మోసం చేయాలని చూసే వారికి ఇదొక గుణపాఠం’ అని కూడా ఆయన అన్నారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని చెక్కిన ఎక్కా యాదగిరి రావు, కవులు అమ్మంగి వేణుగోపాల్‌, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, జిలుకర శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌, స్కైబాబ, శ్రీధర్‌ దేశ్‌పాండేలతో పాటు నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను. మొత్తం రెండు గంటలపాటు 70 మందికి పైగా సాహిత్యకారులు నల్లగొండ, మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి ఇందులో పాల్గొన్నారు. ఈ సంకలనం ఒక చారిత్రక సందర్బంలో వచ్చింది. సీమాంధ్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న కసికి అక్షర రూపమిచ్చారు. బలమైన కవిత్వాన్ని బరిసెలుగా విసిరారు. సీమాంధ్రుల విగ్రహాలతో, వగల ఏడుపుల ర్యాలీలతో పొక్కిలైన టాంక్‌బండ్‌ని ‘దిమ్మిస’తో చదును చేసిండ్రు.
    దళిత, బహుజన కవులు, కళాకారులు ముక్తకంఠంతో విగ్రహాల తొలగింపును స్వాగతించారు. కీర్తించారు. అయితే కూలిన విగ్రహాల్లో తమ కులం వారిని చూసుకున్న ఒకరిద్దరు తెలంగాణ వాళ్లు కూడా అయ్యో అని అంగలార్చిండ్రు. వీర తెలంగాణ వాదులుగా ముద్రపడ్డ కొందరు ముసుగులో గుద్దులాట లాగా విగ్రహాల కూల్చివేతకు మద్ధతుగా బహిరంగంగా ఎక్కడ రాయకుండా జాగ్రత్త పడ్డారు. మరి కొందరు తెలంగాణ ‘మర్యాదస్తులు’ నర్మగర్భంగా విగ్రహాల ‘విధ్వంసాన్ని’ తప్పుపట్టారు. కాని దళిత, బహుజనులు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా విగ్రహాల కూల్చివేతను ‘తెలంగాణ ప్రజా విజయం’గా ప్రకటించారు. ‘దిమ్మిస’ సంకలనంతో ఈ విషయం ప్రస్ఫుటం చేసిండ్రు. ‘‘ధ్వంసం నిర్మూలనకు సంకేతం. విధ్వంసం వినిర్మాణానికి సంకేతం. సకల విలువలను ధ్వసం చేస్తేనే కొత్త విలువల స్థాపన సాధ్యం. కాంక్రీట్‌ స్తంభాల్లా పాతుకుపోయిన విలువల మీద ఉలులెత్తిన కోస్తాంధ్ర విప్లవవాదులు, స్త్రీవాదులు, ముస్లిం వాదులూ` విలపించడం విచిత్రం’’ అని ‘సింగిడి’ అస్తిత్వ సోయితోటి నిగ్గదీసింది. అంతేగాదు ట్యాంక్‌బండ్‌పై ఉండాల్సిన వీరులు, వీర వనితలెవ్వరో లెక్కగట్టి మరీ చెప్పింది. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణానికి, వినిర్మాణ మార్గాన్ని ఎంచుకున్న కవులు తమ కలాల్ని, గడ్డపారలు జేసిండ్రు. ఆధిపత్య సంస్కృతిపై తిరుగుబాటు ప్రకటించిండ్రు. ‘దిమ్మిస’ దెబ్బేసిండ్రు.
    ‘‘నెత్తురు కనిపించని హత్యలు చేసిన జంధ్యాలు
    చుండూరు సమాధుల సృష్టికర్తలు
    కారంచేడు కడుపుకోతలు మిగిల్చిన లబ్ధప్రతిష్టులు
    చరిత్రను మాయం చేసిన వెలుగులు
    మా గుండెల మీదెందుకు మీ బండలు??? అని పసునూరి రవీందర్‌ నిలదీసిండు.
   
    ‘‘చరిత్ర పునర్‌ నిర్మాణంలో
    పూడిక తీతలు తప్పవు
    మన చరిత్ర రాసుకొనేందుకు
    చెత్త నిర్మూలన తప్పదు’’  అంటూ సింగిడి కన్వీనర్‌ జిలుకర శ్రీనివాస్‌ టాంక్‌బండ్‌పై తొలగించిన విగ్రహాల గురించి చెప్పిండు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన కవిత్వంలో ‘‘ మేం గర్విస్తున్నదీ, మీరు దు:ఖిస్తున్నదీ, ఆధిపత్యం కూలుతున్నందుకే’’ అని తేల్చి చెప్పిండు. మరో కవితలో ‘యూసుఫ్‌’ ఇలా చెప్పిండు.
    ‘‘వినిర్మాణానికి
    ఏదో ఒక మూల నుంచి కూల్చడం మొదలవ్వాల్సిందే
    గడ్డపార వెయ్యకుండా
    మొక్కెలా నాటగలం?
    పునాది తియ్యకుండా దేన్నైనా ఎలా కడతాం?
    ఎవరినీ నొప్పించకుండా
    సత్యమెలా చెబుతాం?
    అవును
    ఇవాళ కూల్చింది
    రేపటి రూపును ఆవిష్కరించడానికే
    జీవాలు కూలుతున్న ఆక్రందనే
    విగ్రహాలు కూల్చింది
    ఇంకొకటి చెప్పనా!
    మా మధ్య
    కొన్ని దుష్ట విగ్రహాలు తిరుగుతున్నాయ్‌
    వాటిని కూడా కూల్చేదాకా చూడొద్దు!’’
    ‘‘విగ్రహాల తొలగింపు అనేది ఒక చారిత్రక సంఘటన. అవసరమైన ఘటన. దీనిపై స్పందించేందుకు చాలామందికి మొహమాటం అడ్డొచ్చింది. మౌనం వహించారు. డిఫెన్స్‌ ద్వారా కాదు ఆఫెన్స్‌కు దిగాలని భావించి ‘సింగిడి’ తరపున కవితా సంకలనం తీసుకొచ్చాము. దీనికి కవుల స్పందన చాలా బాగుంది. కవిత్వం కూడా చిక్కగా, బలంగా ఉంది’’ అని సంకలనం తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన స్కైబాబ అభిప్రాయ పడ్డాడు.
    మార్చి పది, 2011 నాడు టాంక్‌బండ్‌ మీదుండడం జీవితకాలానికి సరిపడే ఒక మధురానుభూతి. అదే టాంక్‌బండ్‌పై 60 రోజులు తిరక్కుండానే విగ్రహాల కూల్చివేతకు మద్ధతుగా కవితా సంకలన ఆవిష్కరణ సభలో కూడా పాల్గొనడం ఇంకో సంతోషకరమైన విషయం. ఎంతో శ్రమ కోర్చి, ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి, విలువైన సమయాన్ని వెచ్చించి ఈ సంకలనాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన వారికి అభినందనలు. ఇదే సమయంలో ఒక విషయం చెప్పుకోవాలి. గత నెలలో మిత్రులు జూలూరి గౌరీశంకర్‌, తెలంగాణ రచయితల వేదిక తరపున ‘విగ్రహాల విధ్వంసం’పై వ్యాస సంకలనాన్ని తీసుకొచ్చాడు. అందుకు ‘థింక్‌బండ్‌’ పేరిట మంచి ముందుమాట రాసిండు. అందుకు ఆయన్ని అభినందించాల్సిందే!. అయితే ఈ వ్యాస సంకలనంలో ‘తెలుగు తాలిబన్లు’ అని తెలంగాణ ఉద్యమకారుల్ని హేళన చేసే వ్యాసాలు కూడా చోటు చేసుకోవడం విషాదం. ఇలాంటి వ్యాసాలు ఇంకా చాలా ఉన్నాయి. ‘తెలంగాణ రచయితల వేదిక’ తరపున సీమాంధ్రుల ఆధిపత్య వాయిస్‌ని ఈ పుస్తకం వినిపించింది. పెండా, బెల్లం ఒక్క దగ్గర కలిపినట్టు విగ్రహాల కూల్చివేతను సమర్ధించే, వ్యతిరేకించే వ్యాసాలన్నింటిని ఒక్కదగ్గర వేయలనుకోవడమే మూర్ఖత్వం. అదీ తెలంగాణ కోసం పనిచేస్తున్న ఒక సాహితీ సంస్థ తరపున వేయడం కచ్చితంగా తప్పే. ఈ సంస్థ ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తుందనే అనుమానమూ కలుగుతోంది.
    ఇక పోతే విగ్రహాలపై కొణతం దిలీప్‌ లాంటి మిత్రులు నడుపుతున్న ‘మిషన్‌ తెలంగాణ’ వెబ్‌ సైట్‌లో అసలు శ్రీకృష్ణదేవరాయలకు, సినిమా ఎన్టీఆర్‌ ప్రతిరూపమైన శ్రీకృష్ణదేవరాయలకు గల తేడాని ఎత్తి చూపించారు. తిమ్మిని బమ్మి చేస్తూ ఆగమేఘాల మీద ప్రతిష్టించిన విగ్రహాలు వ్యక్తిగత ఇష్టాఇష్టాలను మాత్రమే ప్రతిబింబించాయి. అంతేగానీ తెలుగు జాతి కోరికను కాదు. ఇప్పుడు ప్రభుత్వం పంతానికి పోయి మళ్లీ కూలిన విగ్రహాల స్థానంలో కొత్తవి పెట్టాలని బడ్జెట్‌ రిలీజ్‌ చేసింది. పని ప్రారంభించింది. ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించడమే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కావాలని రెచ్చగొడుతోంది. విద్యార్థి సంఘాలు ‘విగ్రహాల్ని మళ్లీ కూలగొడతాం’ అని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పంతానికి పోతోంది. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిందే!

-సంగిశెట్టి శ్రీనివాస్‌

Thursday 23 August 2012

Suravaram Prathapareddy The icon of Telanganess

సామాజికోద్యమాలకు ఊపిరులూదిన సురవరం


        తెలుగు సమాజాన్ని చైతన్య పరచడంలో సురవరం ప్రతాపరెడ్డి (1896`1953) చేసిన కృషి అపూర్వమైనది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు ఆయన అనేక మార్గాలు ఎంచుకున్నాడు. ఉద్యమకారుడిగా, సాహితీవేత్తగా, సంపాదకుడిగా, రాజనీతిజ్ఞుడిగా తనకు వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే  కొన్ని సార్లు లేని అవకాశాలు కల్పించుకుంటూ ప్రజల పక్షాన నిలిచాడు. సమాజోద్ధరణకు నడుం బిగించాడు. అన్ని వర్గాల సమూహాలతో, నాయకులతో కలిసి ఉద్యమాల్ని నిర్మించాడు. కొన్ని సార్లు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనగా మరికొన్ని సార్లు పరోక్షంగా అండదండలందించాడు. ఎటు తిరిగీ తాను చేసే ప్రతిపనీ సమాజానికి ఉపయోగపడాలనీ, తాను నేర్చుకున్నది నలుగురికి తెలియజెయ్యాలనే తపన ఆయనలో నిరంతరం ఉండేది. వివిధ ఉద్యమాల్లో మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, మాదిరాజు రామకోటేశ్వరరావు, భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, కె.రాములు, కృష్ణస్వామి ముదిరాజ్‌, యదటి సత్యనారాయణ, శ్యామరావు, జనపాల రఘురామ్‌, చెలమచర్ల రంగాచార్యులు, గుంటుక నరసయ్య పంతులు, యల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లిందల సరస్వతీదేవి, నందగిరి ఇందిరాదేవి, రంగమ్మ ఓబుళరెడ్డి మొదలైన వారి తోడ్పాటు సురవరం ప్రతాపరెడ్డికి ఉండేది. అలాగే వారు వ్యక్తులుగా సంస్థలుగా చేపట్టే కార్యక్రమాలకు ప్రతాపరెడ్డి చేదోడు వాదోడుగా నిలిచేవాడు. 
     ఆంధ్రమహాసభ, గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, బ్రహ్మసమాజం, దివ్యజ్ఞాన సమాజం కులసంఘాల స్థాపన వాటికి అనుబంధంగా హాస్టల్స్‌ ఏర్పాటు, స్త్రీ విద్య, విద్యాలయాల స్థాపన, అఖాడాల (జిమ్‌) ఏర్పాటు, అంటరానితనం నిర్మూలనం, మధ్యపాన నిషేధము, బాల్య వివాహ నిరసనము, వితంతు వివాహాలకు అనుకూలంగా, ఘోషా పద్ధతికి వ్యతిరేకంగా  మొదలైనవన్నీ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి మార్గాలుగా ఆయన ఎంచుకున్నాడు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో తన రచనల ద్వారా సాన్నిహిత్యాన్ని ఏర్పర్చుకొని వారి జీవన విధానంలో మెరుగైన మార్పులు తీసుకురావడానికి సురవరం ప్రయత్నించాడు. సురవరం ప్రతాపరెడ్డి సహవాసం చిన్ననాటి నుండి వివిధ సామాజిక వర్గాలవారితో ఉండడం దానికి తోడుగా ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే కర్నూలు ఆతర్వాత, హైదరాబాద్‌, మద్రాసుల్లో విద్యాభ్యాసం చేయడం ఆయన్ని తోటి వారి సమస్యలి సానుభూతితో అర్థంచేసుకునేవాడిగా, పూర్ణమానవుడిగా తీర్చిదిద్దిందని చెప్పొచ్చు. ఊర్లో ఉన్నప్పుడు ముస్లిములు, మద్రాసులో బ్రాహ్మణ పండితులు, హైదరాబాద్‌లో అన్ని వర్గాల వారి ఆసరా ఆయన విశాల ప్రపంచాన్ని తనదైన కోణంలో చూడ్డానికి తోడ్పడ్డాయి. 
    యాభయ్యేడేండ్ల జీవితంలో సగానికిపైగా కాలాన్ని సమాజోద్ధరణకే ఆయన కేటాయించాడంటే అతిశయోక్తి కాదు. 1924లో రెడ్డిహాస్టల్‌ నిర్వాహకుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదలు చనిపోయే ముందు రోజు ఆత్మకూరు సంస్థానంలో ప్రజల స్థితిగతుల్ని తెలుసుకునేందుకు వెళ్ళిన నాటి వరకు ఆయన విరామం లేకుండా ఉద్యమకారుడిగా జీవించాడు. 1920వ దశకంలో తెలంగాణలో తెలుగు చదువ నేర్చిన వారి శాతం మూడ్నాలుగుకు మించి లేదు. ప్రతాపరెడ్డికి మద్రాసులో చదువుకునే కాలంలో గురువు వేదం వేంకటరాయ శాస్త్రి, వారి మిత్రులు కొమర్రాజు లక్ష్మణరావుల ప్రభావంతో   గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. దీంతో తెలంగాణలో ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలంటే విద్య ఒక్కటే పరిష్కారమార్గమని ప్రతాపరెడ్డి ప్రగాఢంగా విశ్వసించారు. అందుకు తగ్గట్టుగానే విద్యాలయాలు స్థాపించాలని ప్రయత్నాలు చేసిండు. సఫలీకృతుడయ్యిండు. హైదరాబాద్‌లోని ఎ.వి. కాలేజి అట్లా ఏర్పడిరదే. ఇలాంటి చాలా సంస్థలకు ఆయన చేదోడు వాదోడుగా నిలిచాడు. విద్యాభ్యాసం కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చేవారు. అయితే వారికి సరైన భోజన వసతి సదుపాయాలు లేకపోవడంతో విద్యాభ్యాసం సజావుగా కొనసాగేది కాదు. ఈ ఇబ్బందిని దూరంచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో అప్పటి నగర కోత్వాల్‌ వెంకటరామారెడ్డి పూనిక మేరకు ‘రెడ్డిహాస్టల్‌’ ప్రారంభమైంది. దీని నిర్వాహకుడిగా ప్రారంభం నుంచి పదేళ్ళవరకు పనిచేసిన సురవరం ఒక నూతన ఒరవడిని సృష్టించి హాస్టల్‌ నిర్వహించడమేగాకుండా, దాంట్లో ఉత్తమమైన గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసిండు. చదువుతో పాటు విద్యార్థులు శారీరకంగా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో హాస్టల్‌కు అనుబంధంగా వ్యాయామశాల కూడా ఏర్పాటు చేసిండు. ఈ హాస్టల్‌ ద్వారా గుర్తింపు పొందినవారిలో కమ్యూనిస్టు యోధుడు రావినారాయణరెడిడ ప్రముఖుడు. రెడ్డి హాస్టల్‌ ఆరంభించినది మొదలు హైదరాబాద్‌ కేంద్రంగా చాలా కులసంఘాలు తమ కులం విద్యార్థుల కోసం హాస్టల్స్‌ని ప్రారంభించాయి. పద్మశాలి, మున్నూరుకాపు, వైశ్య, గౌడ, వెలమ, పెఱిక, వీరశైవ హాస్టల్స్‌ సురవరం స్ఫూర్తితో ప్రారంభింపబడ్డవే.    
     1925 మే 10న గోలకొండ పత్రిక తన పరోక్ష సంపాదకత్వంలో ఆరంభయినది మొదలు 1948 వరకు నిరంతరాయంగా తెలుగు సమాజాన్ని చైతన్య పరిచేందుకు ఆయన వెలువరించిన రచనల్లో పది శాతం కూడా ఇప్పటికీ పుస్తక రూపంలో రాలేదు. సంపాదకుడిగా తన రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఆ క్రమంలో వచ్చిన సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపించాడు. అలాంటిదే మాల`మాదిగల సమస్య. 70ఏండ్ల క్రితమే ఆదిహిందువుల పేరిట కేవలం మాలలే అధికారం పెత్తనం చెలాయిస్తూ మాదిగల్ని అణగదొక్కడాన్ని ప్రతాపరెడ్డి తన వ్యాసాల ద్వారా నిలదీశాడు. మాదిగల హక్కుల సాధనకోసం వారికి అండగా నిలిచిండు. ఇందుకు గాను మాదిగలు తమ సంఘానికి సురవరం ప్రతాపరెడ్డిని గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నారంటే ఆయన కృషిని, సేవను మనం అంచనా వేయవచ్చు. అలాగని మాలలంటే అకారణ ద్వేషం ఉండేది కాదు. ఇక్కడొక విషయాన్ని గమనించాలి.  నిష్పాక్షికత, ప్రతిభకు ప్రోత్సాహం, గుర్తింపు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. 1934 చివర్లో 354 మంది కవుల కవిత్వంతో వెలువడ్డ ‘గోలకొండ కవుల సంచిక’లో దళితుడైన అరిగె రామస్వామితో పాటుగా  మొత్తం 66 మంది బి.సి.లు, ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలున్నారు. మరో ఎనిమిది మంది మహిళలున్నారు. అలాగే మరో 15మంది పేరు తెలియని కులాల వారు కూడా ఉన్నారు. దాదాపు వీరందర్నీ అగ్రకులజేతరులుగానే పరిగణించాలి. అంటే 354 మందిలో 81 మంది ‘దళిత, బహుజన, ముస్లిం మైనారిటీ’ కవులున్నారంటే ఆనాడు ఆయన ఎంత ప్రజాస్వామికంగా కవుల్ని ఎంపిక చేసి ప్రోత్సహించిండో అర్థమైతుంది. అయితే గోలకొండ కవుల సంచిక వెలువడ్డ కొద్ది రోజులకే  ఆంధ్రప్రాంతం నుంచి ముద్దుకృష్ణ సంపాదకత్వంలో వెలువడ్డ ‘వైతాళికులు’ కవితా సంకలనంలో అప్పటికే తెలుగు సాహిత్యంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన గుర్రం జాషువాను తప్పించిండ్రు. అంటే ప్రతాపరెడ్డి ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాడో అర్థమైతుంది. తనకు మాలలంటే గౌరవమనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా చెప్పడం జరిగింది.
    1930లో మెదక్‌ జిల్లా జోగిపేటలో సురవరం అధ్యక్షతన జరిగిన ప్రథమాంధ్ర మహాసభల్లో పాల్గొనేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాడపాటి హనుమంతరావు ద్వారా ఆదిహిందూ నాయకుడు, అంబేద్కర్‌ కన్నా ముందే భారత దేశంలో దళితోద్యమ స్ఫూర్తిని ప్రోది చేసిన భాగ్యరెడ్డి వర్మకు ఆహ్వానం అందింది. బాల్య వివాహాలకు, అంటరానితనానికి, మద్యపాన సేవనానికి వ్యతిరేకంగా భాగ్యరెడ్డి వర్మ సారథ్యంలో వివిధ బృందాలు బుర్రకథలు, పాటల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేవి. ఈ సభలో కూడా పాల్గొని చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రచారం చేసే ఉద్దేశ్యంతో భాగ్యరెడ్డి వర్మ జోగిపేటకు చేరుకున్నాడు. అయితే అంటరానివాడైన భాగ్యరెడ్డి వర్మ సభకు రావడం, వేదిక మీద ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వడం సనాతనులైన కొంతమందికి నచ్చలేదు. దీనికి సదాశివపేటకు చెందిన బచ్చు రామన్న నాయకత్వం వహించి రభస సృష్టించాడు. అయితే సభకు అధ్యక్షత వహించిన సురవరం ప్రతాపరెడ్డి ఒకవైపు, మరోవైపు సంఘ సంస్కర్త వామననాయకు సభికులను శాంతపరచి సభ మధ్యనుంచి భాగ్యరెడ్డి వర్మ వచ్చేందుకు వీలుకల్పించాడు. ఇదే భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ‘ఆదిహిందూ సేవా సమితి’ దళితుల్లో భాగమైన మాదిగల పట్ల సవతి తల్లి ప్రేమ చూపించడాన్ని సురవరం ప్రతాపరెడ్డి పూర్తిగా వ్యతిరేకించాడు. ఇందుకు మాదిగలను చైతన్యవంతుల్ని చేయడంలో ఆయన చేసిన కృషి విస్మరింపడానికి వీలులేనిది. మాలలు`మాదిగల పట్ల చూపే బేధభావాన్ని ఖండిరచడమే గాకుండా వాటిపై తీవ్రంగా స్పందించేవారు. అన్యాయం ఎవరు చేసిన నిరసించేవారు. మాల జాతివారు అరుంధతీయులతో చూపు బేధభావము పేరిట 13`1`32 గోలకొండ పత్రికలో ప్రతాపరెడ్డి ఒకవార్తను ప్రచురించాడు. ఈ వార్త ఆనాడు గొప్ప కలకలము సృష్టించింది. ఆ వార్తను చదివినట్లయితే ప్రతాపరెడ్డి న్యాయదక్షత మనకర్థమవుతుంది. ‘‘ కట్టెలమండి గ్రామములో కోండ్ర బాగన్న గృహములో 23`12`31 బుధవారము రజస్వల కార్య సందర్భమున మద్యమాంసాదుల నిషేధించి సాత్విక పదార్థములచే క్యామునకు వచ్చిన వారినందరిని సన్మానించబడెను. కార్యములో మాలవారు కూడా సమ్మితులుగా నుండి సుమారు 20 మంది మాలవారు తేనీరు త్రాగిరి. అరుంధతీయుల కార్యములో మన మాలవారు తేనీరు త్రాగినారని యిరవై మందిలో నుండి 1.జీడి రామయ్య, 2. యెఱ్ఱ పోచయ్య, 3. గొట్టిముక్కల నాగయ్య ` యీ ముగ్గురిని కుల బహిష్కారము చేసి మనిషి ఒక్కటికి 6 రూపాయల వంతున మొత్తము 18 రూపాయిల సారాయితో యీ ముగ్గురిని శుద్ధి చేసి కులములో చేర్చుకొనిరి. యిది హిందూ మహానాటి వారి కుల నిర్ణయము. మరి యీ ముగ్గురికి యింత శిక్ష యెందుకై నివ్వబడినది. యని మాల కుల నాయకుని విచారించగా కుల నాయకుని జవాబు ‘‘ అయ్యా! మీ అరుంధతీయులతో కలిసి కల్లు సారాయి త్రాగితే తప్పులేదు గాని తేనీరు త్రాగితే మా కులము పోవును` అందుకే పై ముగ్గురిని కల్లు సారాయి మాంసాదులచే శుద్ధి చేసితిమి’’ అని అనిరి. 25 సంవత్సరముల నుండి ఆదది హిందూ మహానాటి నాయకులు పనిచేయు చున్నామని పొగుడుకొనుచున్న సంగతి అందరికి తెలిసిందే. తమ జాతిలో నున్న మద్యపాన పాపపు పాకురునే దిద్దుకొనలేకా మా అరుంధతీయుల యెడ పనిచేసితిమి వారు ముందుకు రారు. అనుటకు యెట్లు సాహసించి పత్రికలలో వ్రాయుచున్నారో పాఠకులే గ్రహింప గలరు. `` ఇట్లు కట్టెలమండి అరుంధతీయులు.’’
    అరుంధతీయులిచ్చిన ఈ ప్రకటనను ప్రతాపరెడ్డి అత్యంత ప్రాధాన్యత నిచ్చి ప్రచురించడమే గాకుండా మాదిగల అభ్యున్నతి కోసం జాంబవర్ణ సేవాసమితి, అరుంధతీయ సంఘాల్ని స్థాపింప చేశాడు. అరుంధతీయ సంఘాన్ని తానే ముందుండి ఎస్‌.ఆర్‌.బాబయ్య అధ్యక్షతన రెడ్డి హాస్టల్‌ ఆవరణలో 1932లో సభను ఏర్పాటు చేసిండు. ఈ సభ హైదరాబాద్‌లోని మాదిగలందరినీ కదిలించిందంటే అతిశయోక్తి కాదు. తమ అభ్యున్నతికై తోటి దళితులైన మాలలు ఏమాత్రం సహకరించని పరిస్థితుల్లో అగ్రవర్ణాల వారి సహకారంతో అరుంధతీయులు (మాదిగలు) పోరాటం చేసిండ్రు. అరుంధతీయ సంఘానికి సురవరం ప్రతాపరెడ్డిని గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రతాపరెడ్డి గౌరవాధ్యక్ష బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వారి బాగోగులకోసం కృషి చేసిండు. హైదరాబాద్‌ అరుంధతీయ మహాసభ వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలకు విశేషమైన ప్రాచుర్యం కల్పించి ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికలో ప్రచురించేవాడు. అలాగే వారి కార్యక్రమాల రూపకల్పనలో కూడా ఆయన పాలుపంచుకునే వాడంటే అరుంధతీయుల పట్ల సురవరంకున్న ఆర్తి అర్థమవుతుంది. 22`4`1937 నాటి గోలకొండ పత్రికలో ‘‘మాల మాదుగులపై గ్రామాధికారుల నిర్దయ’’ పేరిట అరుంధతీయ మహాసభ అధ్యక్షుడు యస్‌.ఆర్‌.బాబయ్య బాధిత గ్రామాల పర్యటన వివరాల్ని ప్రచురించింది. సంఘ అధ్యక్షుడైన బాబయ్యకు తెలుగులో వ్రాయడం తెలియకపోవడంతో ఆయన ఉర్దూలో ఇచ్చే ప్రకటనలను ప్రతాపరెడ్డిగారే తర్జుమా చేసుకునేవారు.
     బాబయ్య పర్యటన వివరాలను, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ప్రతాపరెడ్డి అరుంధతీయ సంఘానికి కొండంత అండగా నిలిచాడు.       ‘హజ్‌’కు వెళ్లే ముస్లిమ్‌ యాత్రికుల ఖర్చులను నిజామ్‌ ప్రభుత్వమే భరించేది. ఈ అవకాశాలను వినియోగించుకోదలచిన కొంతమంది దళితులు హిందువుల పుణ్యక్షేత్రమైన ‘కాశీ’కి వెళ్లడానికి మాకు కూడా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ముందు డిమాండ్‌ నుంచారు. దీనికంతటికి తెరవెనుక సూత్రధారి ప్రతాపరెడ్డి. 16`4`32 నాటి గోలకొండ పత్రికలో ప్రచురించబడ్డ వార్తాంశాన్ని బట్టి చూస్తే ఆదిహిందువులు కాశీకి వెళ్ళడానికి, వారివెంట ఒక బ్రాహ్మణున్ని తీసుకెళ్ళడానికి, ప్రయాణపు ఖర్చులు, కాశీలో బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణ మొదలు మొత్తం మీద మనిషి ఒక్కరికి 75 రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకొన్నారు. ఈ కాశీయాత్రకు నేతృత్వం వహించింది సుతారపు బాబయ్య. బాబయ్యతో పాటుగా దేవనపల్లి రామచంద్రయ్య, దేవనపల్లి రాజయ్య, బందల లక్ష్మయ్య, సాగల బాలయ్య, చేగూరు లక్ష్మణదాసు, ఎర్ర బాబయ్య మొదలు 15మంది దళితులు కాశీ యాత్ర చేసొచ్చారు. అదీ ప్రభుత్వ ఖర్చుతో.
       అంతకు ముందు భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన కార్యక్రమాలకు పూర్తి అండగా నిలిచింది సురవరం. భాగ్యరెడ్డి నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు ప్రతాపరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటనలున్నాయి. భాగ్యరెడ్డి వర్మ రాసిన వ్యాసాలను గోలకొండలో ప్రాచుర్యమిచ్చి ప్రచురించారు. అలాగే గాంధీని సహితం ధిక్కరించిన దళిత నాయకుడు పీసరి వీరన్న వరంగల్‌లో చేపట్టిన సేవా కార్యకలాపాలను తన పత్రిక ద్వారా ప్రయత్న పూర్వకంగా ప్రతాపరెడ్డి వెలుగులోకి తీసుకొచ్చాడు.
   ఒకవైపు దళితోద్యమాలతో సహవాసం కొనసాగిస్తూనే మరోవైపు వివిధ కులసంఘాల వారు ఏర్పాటు చేసే సభల్లో గానీ, కార్యకలాపాల్లోగానీ ప్రతాపరెడ్డి చురుగ్గా పాలుపంచుకునేవాడు. రెడ్డి హాస్టల్‌ స్థాపించిన స్ఫూర్తితో గౌడ, మున్నూరుకాపు, వైశ్య, పద్మశాలి, వెలమ హాస్టల్లు ఆరంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన చిరాగు వీరన్న తన సొంత ఖర్చుతో గౌడ హాస్టల్‌ని ఏర్పాటు చేసిండు. చిరాగు వీరన్న గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రతాపరెడ్డి వివిధ పత్రికల్లో వ్యాసాలు కూడా వెలువరించాడు. ప్రతాపరెడ్డి సూచన మేరకు ఆంధ్రపత్రిక వారు చిరాగు వీరన్న ఫోటోను తమ ఉగాది సంచికలో ప్రముఖంగా ప్రకటించారు. గౌడ్‌లలో అవిద్యను పోగొట్టడానికి చాలా కృషి చేసిండు.
    సురవరం ప్రతాపరెడ్డి మిత్రుడు గోలకొండ పత్రిక మేనేజర్‌ అయిన బొజ్జం నర్సింలు హైదరాబాద్‌లో మున్నూరుకాపుల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు. అయితే దీని వెనుక సలహాలు, సహాయ సహకారాలు సురవరం ప్రతాపరెడ్డివి. ముదిరాజ్‌లకోసం పనిచేసిన కృష్ణస్వామి, నాయిబ్రాహ్మణుల మెరుగైన జీవనం కోసం ఉద్యమాలు చేసిన జనపాల రఘురామ్‌, పద్మశాలీయుల కోసం హాస్టల్‌ ఏర్పాటు చేసిన గుంటక నరసయ్య పంతులు, బూర్గుల రామకృష్ణయ్యలు ఇలా ప్రతి కులానికి చెందిన పెద్దలు ప్రతాపరెడ్డి అండదండలతో తమ కార్యాకలాపాలు చేపట్టేవారు.
    సికింద్రాబాద్‌ కేంద్రంగా కళావంతుల సంస్కరణ కోసం, దక్కన్‌ మానవసేవా సమితి పేరిట మహాంకాళి గుడిలో జంతుబలికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన గొప్ప సంఘసంస్కర్త సిద్ధాబత్తుని శ్యామ్‌సుందర్‌. శ్యామ్‌సుందర్‌ చేపట్టే కార్యకలాపాలకు పరోక్షంగా సురవరం మద్దతుండేది. సగర వంశస్థులు 1931లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్న ‘సగర మహాసభ’ ప్రతాపరెడ్డి కనుసన్నల్లో జరిగింది. దీనికి అవుసెట్టి మంగయ్య, యదటి పుల్లయ్య, వెన్నెల బాలయ్య, యదటి సత్యనారాయణ తదితరులు అండగా నిలిచిండ్రు.
-sangishetty srinivas

kondapalli sehagiri rao, the great painter of Telangana


Fighter to the core" Chakali Ilamma

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ   

    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిట్టాడుగా నిలిచి, ఉద్యమ స్ఫూర్తిని ఊరూరా పంచింది, భూమి కోసం, భుక్తి కోసం, భూస్వాముల, దొరల పీడన నుంచి విముక్తి కోసం అవిశ్రాంత పోరు చేసింది అణగారిన వర్గాలే. ప్రాణాలు పణంగా పెట్టి దొరల మీద యుద్ధాన్ని ప్రకటించిందీ వీరే! దొడ్డి కొమురయ్య, బండి యాదగిరి లాంటి యోధులు ప్రాణాలర్పించారు. చాకలి ఐలమ్మ, ఆమె కుటుంబం మొత్తం తమ భూమి తమకే దక్కాలని, పంట తమకే దక్కాలని విసునూర్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. జైలుకు పోయిండ్రు. రక్తాలు కారేలా దెబ్బలు తిన్నారు. ఇంతజేసినా ఈ మట్టి మనుషుల గురించి, వీరి త్యాగాల గురించి కమ్యూనిస్టులు ఎన్నడూ సరైన రీతిలో రికార్డు చెయ్యలేదు. ఐలమ్మ పోరాటం గురించి గానీ, ఆమెపై దొరలు చేసిన పాశవిక దాడుల గురించి గానీ నేటి యువతరానికి అంతగా తెలియనివ్వలేదు. ఆమె గురించి పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావన ఉండదు. నిస్వార్థ త్యాగానికి ప్రతీక అయిన ఆమె ప్రతిమకు టాంక్‌బండ్‌పై స్థానం దక్కలేదు. ఇన్నాళ్లు, ఇన్నేండ్లు తెలంగాణ తమ చరిత్ర తాము రికార్డు చేసుకోనందునే ప్రాంతేతరులు రాసిన రాతలే ప్రామాణికమయ్యాయి. సోయి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఒక్కొక్కటి లెక్కగట్టి మరీ రికార్డు చేస్తోంది.
    1944లో ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రజాచైతన్యానికి పునాదులు పడ్డ నాటి నుంచి 1946 జూలై నాలుగున దొడ్డికొమురయ్య అమరత్వం వరకు అప్పటి నల్లగొండ జిల్లా లోని జనగామ తాలూకాలో అన్ని గ్రామాలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. పాలకుర్తి, విసునూరు, కడవెండి ఉద్యమ కేంద్రాలుగా విలసిల్లాయి. పాలకుర్తిలో చాకలి (చిట్యాల) ఐలమ్మ, ఆమె భర్త నర్సింహ్మ, కొడుకులు, సోమయ్య, లచ్చయ్యలు అందరూ ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఆంధ్రమహాసభ నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం చిన్న సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, పాటలు పాడడం, బుర్రకథలు, ఒగ్గుకథలు చెప్పడం పరిపాటి. పాలకుర్తిలో ఆంధ్రమహాసభ బృందం సభ ఏర్పాటు చేసి, బుర్రకథ చెబుతుండగా విసునూరు దేశ్‌ముఖ్‌ గుండాలు మిస్కీన్‌ అలీ, గుమాస్త, అబ్బాస్‌ అలీ, వుత్తాలం రామిరెడ్డి, ఒనమాల వెంకడు తదితరులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తప్పతాగిఉన్న గుండాలకు తగిన శాస్తి చేసి పంపిండ్రు. దీంతో విసునూరు దేశ్‌ముఖ్‌ ప్రేరణతో పోలీసులు ఒనమాల వెంకడిపై హత్యాయత్నం చేసిండ్రనే నేరం ఆరోపిస్తూ చిట్యాల ఐలమ్మ భర్త నర్సింహ్మను ఆయన ఇద్దరి కొడుకుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిండ్రు. జనగామ మున్సిఫ్‌ కోర్టు, మెదక్‌ సెషన్స్‌ కోర్టుల్లో విచారణ జరిగింది. విచారణ ఏడాది కాలంపాటూ సాగింది. నర్సింహ్మతో పాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న  12మందీ ఆ కాలమంతా జైళ్లలోనే మగ్గిపోయారు. బెయిలుకు కూడా నోచుకోలేదు.
    ఇదే అదనుగా గ్రహించి విసునూరు దేశ్‌ముఖ్‌ ఐలమ్మ పంటని స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేసిండు. అయితే ఈ పంటకు నిర్మాల, కడవెండి, సీతారాంపురానికి చెందిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు కాపలాగా నిలిచారు. మూడ్నాలుగు నెలలపాటు కాపలా ఉన్న వీరందరికి ఊరోళ్లందరి నుంచి బువ్వడొక్కొచ్చి పెట్టింది. అయితే వీళ్లు కాపాల మానుకున్న వెంటనే దొర గుండాలొచ్చిండ్రు. ‘‘..యింటికి నిప్పువెట్టిండ్రు. యేదుం సద్దలు వోస్కపోయిండ్రు. యెనుమందుం పెసర్లు వోస్క పోయిండ్రు. నువ్వులు గానుగ్గట్టించుకుంటమని తెచ్చి పోసుకున్న నువ్వులు వోస్క పోయిండ్రు. యిట్లనే మెరుక... నువ్వులు వోసుక పోయిండ్రు. యిగ నేతి పట్వలైతె, వాల్లక్కన్నే పోయిండ్రు గద పటువలు యింతింత పటువలు పక్కున పల్లగొట్టిండ్రు. గిట్లనే మెరుక. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. తినుకుంట తీస్కపోయిండ్రు. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. బండ్లుగట్టించి అవి. వోస్క పోయిండ్రు. వూల్లె యింటికి నిప్పువెట్టిండ్రు’’. అని తన బాధంతా ‘స్త్రీ శక్తి సంఘటన’ కార్యకర్తలతో చెప్పుకుంది. ఈ విషయాలన్నీ మనకు తెలియన మనచరిత్ర పుస్తకంలో రికార్డయ్యాయి.  
    తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతిరూపంగా నిలిచిన మట్టిమనిషి, మొక్కవోని ధైర్యంతో నిర్బంధాన్ని ఎదుర్కొన్న సాహసి చిట్యాల ఐలమ్మ. భూమికోసం, భుక్తి కోసం, భూస్వాముల, దొరల పీడనల నుంచి విముక్తి కోసం ఐలమ్మ కుటుంబం మొత్తం రక్తం ధారవోసింది. తాను, తన భర్త, కొడుకులు కష్టపడి పండిరచిన పంటను విసునూరు దేశ్‌మఖ్‌ తరలించుకు పోదామని ప్రయత్నిస్తే ‘సంగం’ అండతో అడ్డుకుంది. తరతరాలుగా తమ కుటుంబం సాగు చేసుకుంటున్న నాలుగెకరాల భూమి ఐలమ్మ కుటుంబం ఆస్తి. (మల్లంపల్లి దేశ్‌ముఖ్‌ (కరణం) నుంచి కౌలుకు తీసుకున్నది) వెట్టిచాకిరి వ్యతిరేకంగా సంగం నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆ బాధను అనుభవిస్తున్న ఐలమ్మ కుటుంబం కూడా సంగంలో చేరి వాటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఇది గిట్టని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ ఐలమ్మ భూమిపై కన్నేసి వాటిని కాజేయాలని ప్రయత్నించిండు. విసునూరు పోలీసులు ఐలమ్మ ఇంటిమీద దాడి చేసి కొడుకుని అరెస్టు చేసి చిత్రవధ  చేయడమే గాకుండా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటిని పలగొట్టి మొత్తం ఇంటికే నిప్పుపెట్టిండ్రు. న్యాయం కోసం ఆమె హైదరాబాద్‌లో ఉన్న అధికారుల్ని కలిసి విన్నపాలు జేసుకుంది. ఎక్కడికైనా మొక్కవోని ధైర్యంతో వొక్కతే పోయి వచ్చేది. ఆమె ప్రాణానికి హాని ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ న్యాయం కోసం జనగాం నుంచి హైదరాబాద్‌ వరకు అధికారులను కలిసింది.
    పోలీసు దెబ్బలకు భర్త కాల్జేయ్యి పనిజెయ్యకుంటయ్యి తర్వాత చనిపోయిండు. ఐలమ్మకు మొత్తం అయిదుగురు కొడుకులు ఒక బిడ్డ. పచ్చి బాలింతగా ఉన్న బిడ్డపై దొరల తాబేదార్లు అత్యాచారానికి ఒడిగట్టిండ్రు. అలాగే ఉద్యమంలో పాల్గొన్న ఒక కొడుకు అమరుడయ్యిండు. అయినా ధైర్యం కూడగట్టుకొని సంఘానికి అండగా నిలిచింది. ఈమెకు అండగా ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి నిలిచిండ్రు. కమలాదేవిపై కూడా ఇదే విషయంలో కోర్టులో కేసు దాఖలు కావడంతో ఇద్దరు కలిసే పేషీలకు హాజరయ్యేది.
    1900 ఆ ప్రాంతంలో పుట్టిన చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరుమీద సంగం వాళ్లు పాటలు రాసిండ్రు. పాడిరడ్రు. ఉయ్యాల పదం పాడిరడ్రు. ఆమెను బాలనాగమ్మ అని వర్ణించిండ్రు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం, పంట కోసం, పదుగురి బాగు కోసం, సంగం రాజ్జెం కోసం తమ సమస్తాన్ని ధారవోసిన ఐలమ్మ త్యాగం అనితర సాధ్యం. ఆమె సాహసం నేటి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. నాటి  మహిళల ‘సంగం’ ఉద్యమానికి ఊపిరులూదిన ఐలమ్మ పోరాట పటిమ నిరంతరం తెలంగాణ ఉద్యమానికి దారి చూపుతూనే ఉంది. జీవిత కాలంలోనే భర్తను ముగ్గురు కొడుకుల్ని పోగొట్టుకున్న ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ పదిన తనువు చాలించింది.
    ఇన్ని త్యాగాలు చేసిన వీరనారి ఐలమ్మ విగ్రహం టాంక్‌బండ్‌పై స్థానం సంపాదించుకోలేదు. పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకోలేదు. తెలంగాణ వచ్చేవరకు తెగించి కొట్లాడి ఆమెకు చరిత్రలో తగిన స్థానం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాల్సిన తరుణమిది.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

KAPU RAJAIAH (1925-2012) PAINTINGS